రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

1222 : కోలీవుడ్ కాలింగ్

ది లాక్ డౌన్ సమయం. చెన్నైలో దర్శకుడు  శంకర్ తోటి దర్శకులతో అనేక జూమ్ కాల్ సెషన్స్ ని ప్రారంభించాడు. ఆ దర్శకుల్లో మణిరత్నం, లింగుసామి, కార్తీక్ సుబ్బరాజ్  కూడా వున్నారు. ఆ మాటామంతీ జరుగుతున్నప్పుడు శంకర్ ఒకటి అడిగాడు : తను దర్శకత్వం వహించడానికి తగ్గ కథ ఎవరి దగ్గరైనా వుందాని. వెంటనే కార్తీక్ సుబ్బరాజ్ స్పందించాడు. తను చాలా సంవత్సరాల క్రితం ఒక  రాజకీయ కథ రాసుకున్నాడు. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని చాలా కాలం క్రితం భావించాడు. ఆ కథ శంకర్ కి చెప్పడంతో వెంటనే ఓకే చేశాడు శంకర్. ఆ కథే రాంచరణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో ఆర్సీ 15’ (వర్కింగ్ టైటిల్) గా తెరకెక్కుతోంది.

            2012 లో శంకర్ హిందీ త్రీ ఇడియెట్స్ని రీమేక్ చేశాడు స్నేహితుడుగా. ఇది ఫ్లాపయ్యింది. ఆ తర్వాత తీశాడు. డిఫరెంట్‌గా ట్రై చేసినా ఇది కూడా  డిజాస్టర్‌గా మారింది. ఆ భారీ పరాజయం తర్వాత శంకర్ సీక్వెల్స్ ఆలోచనలో పడ్డాడు. వెంటనే 2018 లో రోబోకి సీక్వెల్‌గా ‘2.0’ తీశాడు. మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఆర్థిక వైఫల్యంగా మిగిలిపోయింది. ఇక 2019 లో కమల్ హాసన్‌తో కలిసి భారతీయుడుసీక్వెల్  ఇండియన్ 2’ ప్రారంభించాడు. ఇది అనేక సమస్యలతో, వివాదాలతో ఇంకా పూర్తి కాలేదు.

            ఇలా వుండగా, ‘అపరిచితుడుని రణవీర్ సింగ్ తో హీందీలో రీమేక్ చేద్దామని ప్రయత్నించాడు. దాని ఒరిజినల్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తో కాపీరైట్ వివాదంతో కోర్టులో పడింది. పైగా ఆస్కార్ రవిచంద్రన్ అపరిచితుడుని శంకర్ కంటే భారీ యెత్తున హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీయబోతున్నట్టు ప్రకటించాడు.

            ఇక రాంచరణ్ తో తీస్తున్న ఆర్సీ 15’ గతంలో తానే తీసిన ఒకే ఒక్కడుతరహా కథ. ముఖ్యమంత్రిపై పోరాడే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ కనిపిస్తాడు. ఈ కథ శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ లు తన కథ నుంచి కాపీ కొట్టేశారని  చిన్నస్వామి అనే నిర్మాత కంప్లెయింట్ చేశాడు.

            పైనుంచీ కిందివరకూ, ఇదంతా చూస్తూంటే శంకర్ పరిస్థితి గందరగోళమని అన్పిస్తోంది కదూ? మామూలు గందరగోళం కాదు. తీసిన సినిమాలకే రీమేకులు, తీసిన సినిమాలకే సీక్వెల్సులు దగ్గర్నుంచీ, ‘నేను దర్శకత్వం వహించడానికి తగిన కథ వుందాఅని అడిగేవరకూ, ఇంకా కథల కాపీ వివాదాలు చుట్టుముట్టడం వరకూ అంతా గందరగోళమే. ఇది చాలనట్టు ఆర్సీ 15’ లో రాంచరణ్ ని ఇంకెలా గ్రాండ్ గా చూపించాలన్న సమస్య ఒకటి. ఎంత గ్రాండ్ గా చూపించాలో అంత గ్రాండ్ గానూ ఆర్ ఆర్ ఆర్లో ఎస్ ఎస్ రాజమౌళి చూపించేశాక, తనకి ఇంకేం మిగిలినట్టు?

            దేశంలో నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ గా వెలిగిపోతున్న శంకర్ కి ఒకేసారి ఇన్ని సమస్యలు, సవాళ్ళు దేనికి? 2012 కి పూర్వం లేవే? అప్పుడంతా పట్టిందల్లా బంగారమే. రోబో, శివాజీ, అపరిచితుడు, బాయ్స్, ఒకే ఒక్కడు, జీన్స్, భారతీయుడు, ప్రేమికుడు, జంటిల్ మన్...అన్నీ అలా అలా బ్రహ్మాండమైన హిట్సే. కథల కొరతలేదు, సమస్యల్లేవు, వివాదాల్లేవు. ఏ కథ పట్టినా హిట్ కొట్టడమే. అలాటిది 2012 నుంచి ఈ దశాబ్దమంతా ఎందుకు కథల సమస్యలో పడ్డాడు?

            తన విజయవంతమైన సినిమాల రహస్యమేమిటి? దీని వెనుక హస్తం ఎవరిది? ఆ హస్తం రచయిత సుజాత లేకపోయేసరికి ఈ పరిస్థితా? 1993 లో  జంటిల్ మన్నుంచీ  రచయిత సుజాతా రంగరాజనే శంకర్ సినిమాలకి క్రియేటివ్ అండ. జంటిల్ మన్ నుంచీ రోబో వరకూ రచయిత సుజాతతో కలిసి జైత్ర యాత్ర. సుజాత రచన శంకర్ సినిమాలకి బలం, బాక్సాఫీసు విజయం. అతను రాసే  డైలాగులు సరళమైనవే  అయినప్పటికీ ప్రభావవంతమైనవి.

            సుజాత తన జీవితకాలంలో పొందిన ప్రజాదరణ తమిళంలో ఆధునిక రచయితలు కొందరే పొందారు. ఇంజనీర్‌గా దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించాడు తను. నవలా రచయితగా ప్రారంభంలో తన ప్రధాన ఇతివృత్తం స్త్రీ-పురుష సంబంధమే. తర్వాత తమిళంలో సైన్స్ ఫిక్షన్ రాసిన తొలి రచయిత తానే అయ్యాడు.

            రజనీకాంత్ నటించిన గాయత్రి’, ‘ప్రియ` వంటి సినిమాలు డెబ్బైల నాటికే సుజాత నవలల ఆధారంగా వచ్చాయి. తర్వాత ఎనభైల మధ్యలో, కమల్ హాసన్ తో సూపర్‌కాప్ థ్రిల్లర్ విక్రమ్‌కథ సుజాతదే. దీనికి సీక్వెల్ గా కమల్ విక్రమ్నిర్మించి ఇటీవల ఆలిండియా హిట్ సాధించారు. సుజాత  ఆ తర్వాత మణి రత్నంతో రోజా`, ‘దొంగా దొంగా’ ‘అమృతసినిమాలకి చాలా ఫలవంతమైన కథా సహకారాన్ని అందించాడు.

            దర్శకుడు శంకర్‌కి వెన్నెముకగా నిలిచిన సుజాత 2010 లో కన్నుమూశాడు. రోబోతను రాసిన చివరి మూవీ. ఆ తర్వాత నుంచి శంకర్ అనాధ అయిపోయాడు. శంకర్ స్వయంగా కథల్ని సృష్టించలేడు. ఐడియాలు మాత్రం చెప్పి సుజాతతో రాయించుకు నేవాడు. సుజాత లేకపోయాక, తన ఐడియాలు కూడా నిండుకున్నట్టున్నాయి- తీసిన తన సినిమాలకి సీక్వెల్సే తీయడం మొదలెట్టాడు. లేదా రీమేక్ చేయడం మొదలెట్టాడు.  సుజాత వంటి రచయిత స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేనప్పటికీ, శంకర్‌తో పాటు ఇతర ప్రతిభావంతులైన రచయితలు సుజాత వదిలిపెట్టిన వారసత్వాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. ఫలితాలు మాత్రం అనుకూలంగా రావడం లేదు.

            ఈ సంక్షోభం శంకర్ కి గొడ్డలి పెట్టు వంటింది. సౌత్ నుంచి పానిండియా సినిమాలు వెళ్ళి నార్త్ లో దండయాత్ర చేస్తూంటే, తను ఈ పదేళ్ళలో మూడు వరస ఫ్లాపులు తీసి, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుని వెనుకబడిపోవడం విచారకరం. ఇప్పుడు ఆర్సీ 15’ లో రాంచరణ్ ఎమోషన్స్ సరిగా ప్రకటించడం లేదని, రాంచరణ్ తో తను ఈ సినిమా తీస్తూ తప్పు చేస్తున్నానా అన్న సందిగ్ధంలో పడడం చూస్తే- శంకర్ పరిస్థితి ఏమిటా అన్పించకమానదు.

        పరిస్థితి ఇలా వుండగా ఇంకో సీను తెరపై కొచ్చింది. ఇక ఇప్పుడు శంకర్ నవలని సినిమాగా తీయాలనుకుంటున్నట్టు డిఫరెంట్ దృశ్యం. సొంత  ఐడియాలు, సీక్వెల్సు, రీమేకులూ ఇక పనికి రావనుకున్నాక నవలా సాహిత్యం మీద కన్నేయడం. అదీ చారిత్రక కథ కావడం. ఒక వైపు మణిరత్నం చారిత్రక నవలతో పొన్నియిన్ సెల్వన్’’ తీస్తూంటే, తను కూడా ఆయన మార్గంలో మసకబారిన తన కెరీర్ కి కొత్త దారి కనుక్కుంటున్నట్టు.

        చరిత్రని సినిమాగా తీస్తే గౌరవం పెరుగుతుంది, తమిళ చరిత్రని తెరకెక్కిస్తే తమిళుల గత వైభవం ప్రపంచానికి తెలుస్తుంది. తమిళ ఆత్మాభిమానాన్ని సంతృప్తి పరుస్తుంది. పైగా గత చరిత్ర తెలుసుకోవడానికి అనేక సమాజాలకి చారిత్రక సినిమా అనేది వొక పాపులర్ జ్ఞాన కేంద్రంగా ఆకర్షిస్తుంది. ఇందువల్ల ఈ సెకెండ్ ఇన్నింగ్స్ ని సద్వినియోగం చేసుకుంటే శంకర్ కి మరికొంత కాలం ఆక్సిజన్ సరఫరా లభిస్తుంది.

   ఇంతకీ ఏమిటా శంకర్ తీసే చారిత్రక సినిమా అంటే, అదొక కళ్ళు తిరిగే వెయ్యికోట్ల మెగా ప్రాజెక్టు. వెయ్యి కోట్లతో సినిమా తీసే అవసరముందా అంటే ప్రకటనలదేముంది ఎంతైనా చెప్పుకోవచ్చని గుసగుసలు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్బడ్జెట్ 500 కోట్లు అవుతున్నప్పుడు దాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇరవై ఏళ్ళ  క్రితం అమీర్ ఖాన్ లగాన్తీసినప్పుడు, ఆ డబ్బుతో పది వూళ్ళకి తాగు నీటి సౌకర్యం కల్పించవచ్చని విమర్శలు వచ్చాయి. అప్పట్లో సినిమా నిర్మాణానికి 20 కోట్లు అంటేనే వింత. అందుకని అలాటి విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఎన్ని వందల కోట్లు వ్యయం చేస్తే  అంత గొప్పగా చూస్తున్నారు. దానికి రెట్టింపు టికెట్ ధర పెట్టినా రొట్టెకి డబ్బుల్లేని వాడు కూడా తెగ ఆనందం అనుభవిస్తున్నాడు.

        వెయ్యి కోట్ల బడ్జెట్ తో సూర్య కథానాయకుడుగా శంకర్ వేల్పారీఅనే చారిత్రాత్మకం  తీస్తున్నట్టు ప్రకటన. వీలైనన్ని ఎక్కువ భాషల్లో దీన్ని విడుదల చేయాలని ప్లాను. క్రీపూ 600-300 నాటి చరిత్ర ఇది. అప్పటి చిన్న రాజ్యమైన పరంబుని ఎంతో గొప్పవాడుగా పేరు తెచ్చుకున్న రాజు పారీపరిపాలించేవాడు. రాజ్యం చుట్టూ వున్న సుమారు 300 గ్రామాల ప్రజలు అతడ్ని ప్రశంసించే వారని చెబుతారు. అతను కళల్ని, సాహిత్యాన్నీ ప్రోత్సహించేవాడు. ఆ కాలాన్ని సంగం శకం అంటారు. సంగం శకం చివరి రాజులలో ఒకడైన పారీ దాతృత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఇలాటి రాజు మీదికి చెర, చోళ, పాండ్యన్ రాజులు యుద్ధాని కెళ్ళారు. ఈ యుద్ధానికి కారకుడు కూడా పారీయేనని చెప్పుకుంటారు.

        ఈ చరిత్రని నవలగా రాసింది ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు, తమిళనాడు అభ్యుదయ రచయితల, కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎస్ వెంకటేశన్. దీనికి ముందు రాసిన కావల్ కొట్టంఅనే చారిత్రక నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వేల్పారీనవల రాయడానికి ఆరేళ్ళు పట్టింది. దీనికోసం పశ్చిమ కనుమల్లోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. తమిళ రాజు పారీ పాలించే చిన్న రాజ్యమైన పరంబు  మీదికి ఏకంగా చేర, చోళ, పాండ్యన్ త్రయం యుద్ధం చేయడానికి కారణమేమిటో ఈ నవలలో చెప్పాడు వెంకటేశన్. శంకర్ కోసం దీన్ని చిత్రానువాదం చేసే పనిని ఇప్పటికే ప్రారంభించాడు వెంకటేశన్.

        ఇప్పుడు శంకర్ దీన్ని సూర్యతో ఎంత గొప్పగా తీస్తాడనేది చూడాల్సి వుంది. తనకి ఎవరితోనూ పోలిక వుండేది కాదు. మణిరత్నంతో కూడా. మణిరత్నం తీసే సినిమాలు వేరు, తన సినిమాలు వేరేగా వుండేవి. అలాంటిది ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్’  చారిత్రాత్మకంతో మణిరత్నం సవాలు విసురుతున్నట్టే. ఇప్పటికే దీని మెగా క్వాలిటీని ట్రైలర్ చూసి అంతర్జాతీయ మీడియా ఆకాశాని కెత్తేస్తోంది. దానిదేముంది, ఇది సెప్టెంబర్ 30 న విడుదలవుతోంది...శంకర్ సినిమా పూర్తవడానికి ఏడాది పైనే పడుతుంది...అప్పటికి మణిరత్నం మూవీ పోటీకి వుండదనుకుంటే, అప్పటికి రెండో భాగం వచ్చి ఎదుట నిలబడ వచ్చు.

        ముందుగా శంకర్ ఇప్పుడు నిర్మాణంలో వున్న రెండు సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. కమల్ హాసన్ తో ఇండియన్2’, రాంచరణ్ తో ఆర్సీ15’. ఇవి పూర్తయ్యాకే వేల్పారీప్రారంభమవుతుంది. దీంతో శంకర్ ఉజ్వల భవిష్యత్తు పొంది తీరాలి తప్పదు.

—సికిందర్

*