రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, సెప్టెంబర్ 2022, గురువారం

1221 : స్పెషల్ రివ్యూ!


  దర్శకత్వం : పృథ్వీ రాజ్ సుకుమారన్
తారాగణం : మోహన్ లాల్, సానియా అయ్యప్పన్, మంజూ వారియర్, వివేక్ ఒబెరాయ్, సచిన్ ఖెడేకర్, టోవినో థామస్, సాయికుమార్, ఇంద్రజిత్ సుకుమారన్, ఫ్రాంక్ ఫ్రీ తదితరులు
రచన : మురళీ గోపి, సంగీతం : దీపక్ దేవ్, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్
బ్యానర్ : ఆశిర్వాద్ సినిమాస్
నిర్మాత : ఆంటోనీ పెరంబవూర్
విడుదల : ఏప్రెల్ 12, 2019
***
        లయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సంచలన హిట్ ‘లూసిఫర్’ తెలుగులో ఇదే టైటిల్ తో 2019 లో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. ఆన్ లైన్లో ఇది అమెజాన్ లో, యూట్యూబ్ లో అందుబాటులో వుంది. వర్తమాన దేశ రాజకీయాలని కేరళ రాష్ట్ర నేపధ్యంలో పరోక్షంగా చిత్రించే ఈ రాజకీయ థ్రిల్లర్ కి దేశ విదేశ కేరళీయులు స్పందించి విశేషంగా కలెక్షన్లు కట్టబెట్టారు. బయోపిక్స్ పేరుతో, పోలిటిక్స్ పేరుతో  2019 నాటి  ఎన్నికల సీజన్లో ఇతర భాషల్లో ప్పటికే అనేక సినిమా లొచ్చాయి. వాటిలాగా పార్టీ ఎన్నికల ప్రచార సాధనంగా గాక, ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నించే కుటిల రాజకీయ శక్తుల ప్రక్షాళనగా ‘లూసిఫర్’  ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవుడి కుడి భుజంగా వెలిగిన దేవదూత లూసిఫర్ ని సాతానుగా ముద్రవేసి స్వర్గం నుంచి బహిష్కరిస్తే  ఏం జరిగిందనే హిబ్రూ పురాణ గాథని,  వర్తమాన పరిస్థితులకి అన్వయించి నిర్మించిన ఈ భారీ ప్రయోగాత్మకం ఎలా వుందో ఒకసారి చూద్దాం...

కథ

ముఖ్యమంత్రి పీకే రాందాస్ (సచిన్ ఖెడేకర్) ఆకస్మిక మృతితో కథ ప్రారంభమవుతుంది. ఇక ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలో పోటాపోటీలు మొదలవుతాయి. రాందాస్ కుమార్తె ప్రియ (మంజూ వారియర్), ఆమె కుమార్తె జాహ్నవి (సానియా అయ్యప్పన్) లతో బాటు కొడుకు జతిన్, అల్లుడు బాబీ అంత్యక్రియలకి వస్తారని ఎదురు చూస్తూంటారు. విదేశీ యాత్రలో వున్న రాందాస్ కుమారుడు జతిన్ రాందాస్ (టోవినో థామస్) ఇప్పట్లో రాలేనని కబురు పంపుతాడు. ముంబాయిలో బిజినెస్ పనుల్లో వున్న రాందాస్ అల్లుడు బాబీ (వివేక్ ఒబెరాయ్) కూడా తాత్సారం చేస్తూంటాడు. ఇక ప్రియ తనే తండ్రి చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేస్తుంది. తర్వాత ఆమె భర్త బాబీ ముంబాయి నుంచి వచ్చి సీఎంగా జతిన్ పేరు ప్రతిపాదిస్తాడు. పార్టీలో నెంబర్ టూ వర్మ (సాయికుమార్) దీన్ని వ్యతిరేకిస్తాడు, ప్రియకి కూడా ఇది మింగుడుపడదు. ప్రతిపక్ష నేత ఇంకో కుట్రతో వుంటాడు. అయినా బాబీ మాట నెగ్గించుకుని, జతిన్ చేత పార్టీ శ్రేణులకి ప్రసంగ మిప్పిస్తాడు. దీంతో ఇతనే మా సీఎం అంటూ హర్షధ్వానాలు చేస్తాయి పార్టీ శ్రేణులు.

ఇదంతా గమనిస్తున్న స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్ లాల్) ఇందులో బాబీ చేస్తున్న భారీ కుట్రని పసిగడతాడు. ఎక్కడో కొండ ప్రాంతంలో దివంగత సీఎం రాందాస్ కి చెందిన అనాధాశ్రామాన్ని చూసుకుంటున్న ఇతను, ఇక దైవ సమానుడైన రాందాస్ కుటుంబాన్నీ, ఆయన రాజకీయ వారసత్వాన్నీ నిలబెట్టేందుకు కదిలి వస్తాడు. ఎవరీ స్టీఫెన్ గట్టు పల్లి? అతను లూసిఫర్ గా ప్రకటించుకుని ఎలా శత్రువినాశం గావించాడు? అతడికి తోడ్పడిన గ్రూపులెవరు?...అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది అంతరార్ధాలతో, సంకేతాలతో చెప్పిన కేరళ రాజకీయ కుట్రల కథ. అపారమైన డబ్బుతో ప్రభుత్వాల్ని మార్చెయ్యగల  రిచ్ రాజకీయ శక్తికి వ్యతిరేకంగా పోరాడే కథ. ఇక్కడ మతాల గొడవేంటని ప్రశ్నించే కథ. ఇందులో ఓపెన్ గానే డైలాగు వుంది - ‘నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వ్యాపించిన మతోన్మాదమనే కార్చిచ్చు, ఇప్పుడు ఈ రాష్ట్రానికి కూడా వ్యాపించి దహించడం మొదలెట్టింది. దీన్నెదుర్కోవడానికి మనక్కావాల్సింది డబ్బు’ అని.  కొన్ని పాత్రలు కూడా గుర్తించదగ్గ రాజకీయ వాసనేస్తూ వుంటాయి. చివరికి అన్నీ చక్కబడి, ప్రశాంతత నెలకొన్న వాతావరణంలో ముగింపు వాయిసోవర్ కూడా ఇలా వుంటుంది – ఈ ప్రాంతాన్ని స్వర్గ భూమి అని ఎందుకన్నారో చెప్పి, ఇంత కాలం ఇక్కడి ప్రజల్ని కాపాడింది దేవుడు కాదనీ చెబుతూ, ‘ఇక ముందూ కాపాడ బోయేది దేవుడు కాదు...ఇది దేవుడి రాజ్యం కాదు...స్వర్గం నుంచి బహిష్కరింపబడిన దేవదూతల రాజ్యం...’ అని సున్నితంగా వ్యాఖ్యానిస్తారు.

స్టీఫెన్ గట్టుపల్లి క్రిస్టియన్, అతడికి తోడ్పడే జయేద్ మసూద్ గ్రూపు (ఈ పాత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు) ముస్లిం, వీళ్ళు కాపాడే రాజకీయ కుటుంబం హిందూ. కేరళ సోషల్ స్ట్రక్చర్ మతసామరస్యంతో కూడి ఎంత బలంగా వుంటుందనడానికి ప్రతీకాలంకారాలుగా ఈ పాత్రలు.

ఇక్కడ ఇంకో ముఖ్యాంశమేమిటంటే, మసూద్ గ్రూపు నాయకుడు మసూద్, ‘ఖురేషీ అబ్రాం’ పేరుతో అంతర్జాతీయ ‘ఇల్యుమినాటిస్ సొసైటీ’ లో సభ్యుడుగా వుంటాడు. శతాబ్దాల చరిత్రగల ‘ఇల్యుమినాటిస్ సొసైటీ’ గురించి తెలిసిందే. ప్రపంచ ధనికుల దగ్గర్నుంచి, మేధావులు, సామాన్యులు కూడా ఈ సొసైటీలో ఎవరైనా చేరవచ్చు. వీళ్ళంతా సామాజిక న్యాయం కోసం, ప్రజానీక సామూహిక అభ్యున్నతి కోసం  కార్యకలాపాలు నిర్వహిస్తూంటారు. ఇక్కడ నీతి ఏమిటంటే, మసూద్ టెర్రరిజం వైపుకెళ్ళకుండా, ఈ సొసైటీలో చేరడం. స్టీఫెన్ గట్టుపల్లి ఈ సొసైటీతోనే సంబంధాలు పెట్టుకోవడం. అధికారం కోసం అల్లుడు బాబీ వేల కోట్లు ఖర్చు పెట్టగల స్థాయిలో వుంటాడు, అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్ వర్క్ తో సంబంధాలు పెట్టుకుని. డ్రగ్ మాఫియాతో సంబంధాలంటే టెర్రరిస్టులతో సంబంధాలే అనుకున్న స్టీఫెన్ గట్టుపల్లి- ముగింపులో రష్యా వెళ్లి - బాబీతో సంబంధాలున్న రష్యన్ అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ఫొయోడర్ ని అంతమొందిస్తాడు.

ఆ తర్వాత ముంబాయిలో ఓ అతి బడా పారిశ్రామిక వేత్తకి ఫోన్ వస్తుంది. క్రోనీ క్యాపటలిజం. ప్రభుత్వానికి ఆర్ధిక దన్ను. ఇతను ‘ఎవడ్రా నువ్వు?’  అని కొందరు మాఫియా డాన్ల పేర్లు, టెర్రరిస్టుల పేర్లు చెప్తాడు. అవతల ఫోన్ చేసిన మసూద్, ఫోన్ ని  స్టీఫెన్ గట్టుపల్లి కిస్తాడు. స్టీఫెన్ గట్టు పల్లి, ‘ఖురేషీ అబ్రాం’ అని చెప్పి కట్ చేస్తాడు. అంటే ఇక స్టీఫెన్ గట్టుపల్లి ఇప్పుడు తను  కూడా ఇల్యుమినాటిస్ లో చేరిపోయాడన్న మాట.

ఇదంతా నటుడు, గాయకుడు,  రచయిత, జర్నలిస్టు మురళీగోపి నీటుగా రాసిన కథా, స్క్రీన్ ప్లేల గొప్పతనం. నడుస్తున్న చరిత్రని పరోక్షంగా చూపిస్తాడు. ఇంకొక మతిపోయే క్రియేషన్ ఏమిటంటే, కేరళ అడవుల్లో బాబీ తాలూకు డ్రగ్ మాఫియా ముఠా మొత్తాన్నీ (పదుల సంఖ్యలో వుంటారు) అంతమొందించి వచ్చేస్తాడు స్టీఫెన్ గట్టుపల్లి.

ఈ సంఘటనలో స్టీఫెన్ గట్టుపల్లిని పట్టుకోవడానికి సాక్ష్యాధారాల కోసం పోలీసులు వచ్చేస్తారు. అక్కడ శవాలు వుండవు, సెల్ ఫోన్లు వుండవు, ఫైరింగ్ జరిగినట్టు ఎక్కడా ఆనవాళ్ళూ వుండవు. అసలు సంఘటనే జరిగినట్టు వుండదు! ఇది బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ ని గుర్తుకు తెస్తుంది...

ఎవరెలా చేశారు

    మోహన్ లాల్ చాలా అండర్ ప్లే చేస్తూ నటిస్తాడు పాత్రని. అతడి చర్యలే  చెప్తూంటాయి పాత్ర మానసిక తీవ్రతని. హిబ్రూ పురాణ పాత్ర లూసిఫర్ ని పోలిన జీవిత చరిత్ర ఈ పాత్ర కుంటుంది. తను స్వర్గం నుంచి పతనమైనా, ప్రాణసమాన మైన స్వర్గవాసులైన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులని కాపాడి, వారి స్వర్గాన్ని పునఃస్థాపించే ఉదాత్త పాత్రగా, లోక రక్షకుడుగా వుంటాడు. డైలాగులు చాలా తక్కువ. ఫైట్లు చాలా ఎక్కువ. లుంగీ కట్టుకునే ఇరగదీస్తూంటాడు ఎక్కడపడితే అక్కడ శత్రువుల్ని. క్లాస్ కథని సామాన్యులు మెచ్చేలా మాస్ పాత్రతో చెప్పడం ఇక్కడ వ్యాపార వ్యూహం. వారం తిరిగేసరికల్లా వసూళ్ళు వందకోట్లు దాటింది. అరవై దాటినా మోహన్ లాల్ ఇంకా బాక్సాఫీసుని కమాండ్ చేస్తున్నాడు.

సీఎం కూతురి పాత్రలో మంజూ వారియర్ ప్రేక్షకుల మీద అత్యంత బలమైన ప్రభావం చూపే మరో పాత్ర. ఈమె కూతురి పాత్రలో సానియా అయ్యప్పన్ బాధిత పాత్ర. సీఎం అల్లుడు బాబీ పాత్రలో ప్రధాన విలన్ గా క్లాస్ నటనతో వివేక్ ఒబెరాయ్. సీఎం హైఫై కొడుకుగా టోవినో థామస్ పాత్ర, నటన చాలా సర్ప్రైజింగ్ గా వుంటాయి. కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించే ఇతడి మీద ఇంటర్వెల్ సీను హైలైట్ గా వుంటుంది. ఎకాఎకీన వూడిపడే రాజకీయ వారసుల మీద సెటైర్ ఈ పాత్ర. మాతృభాష కూడా రాని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని, డబ్బా కొడుకుల రాజకీయ అరంగేట్రాలకి కొరడా దెబ్బ ఈసీను. కానీ ఇదే సీనులో తను ఎలా విదేశాల్లో సంస్కృతి మరవకుండా, రాజకీయ పరిజ్ఞానాన్ని జోడించుకుని పెరిగాడో మాతృభాషలో అనర్గళంగా చెప్పి ముగించే పాజిటివ్ టచ్ – రాజకీయ నాయకుల వారస రత్నాలకి పాఠంలా వుంటుంది.

చివరికేమిటి

    నటుడు, గాయకుడు, నిర్మాత, పంపిణీదారుడు, దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకుడుగా ఈ తొలి ప్రయత్నంతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. అయితే ఒక్కటే లోపం. అతి స్లోగా సినిమా సాగడం. అయినా మలయాళంలో అంత హిట్టయిందంటే ఇది వాళ్ళ సినిమా, వాళ్ళ సూపర్ స్టార్. పరాయి ప్రేక్షకులకి ఇంత స్లో నడక ట్రెండ్ కి దూరంగా ఇబ్బందిగానే వుంటుంది. పైగా మూడు గంటల నిడివి.

ఐతే అవే రెండు మూడు రకాల కథలతో రొటీనై పోయిన రాజకీయ సినిమాలతో పోలిస్తే,  విషయపరంగా చాలా భిన్నమైనది, బలమైనది. ఇంటర్వెల్ వరకూ సీఎం చనిపోయి, వారసుడెవరన్న ప్రశ్నతో, సీఎం పదవి కోసం ఎత్తుగడల మామూలు కథగానే వుంటుంది. ఐతే సీఎం కొడుకునే విలన్ ప్రతిపాదించడంతో కథ ఇక్కడి నుంచి మారిపోతుంది. సీఎం పదవికోసం కుట్రల కథల రొటీన్ ని ఛేదించి, అడ్డదారుల్లో అధికారాన్ని కైవసం చేసుకునే కుట్ర దారుల నిర్మూలనగా, డిఫరెంట్ గా టేకాఫ్ తీసుకుంటుంది. సీఎం చనిపోవడం, పదవి భర్తీ ఇదంతా షుగర్ కోటింగ్ లా పైకి కన్పించే కథ మాత్రమే. అంతర్లీనంగా చెప్పాలనుకున్న పరోక్ష కథ పూర్తిగా వేరు. ఇదేమిటనేది పైనే చెప్పుకున్నాం.

క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలకి హిందీ ఐటెం సాంగ్ బాగా కిక్కు నిస్తుంది. సినిమాలో వున్నది ఒకే పాట. ఇది చివర్లో సినిమానే పైసా వసూల్ చేస్తుంది. వినోదంతో బాటు విజ్ఞానం కోసం ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని చూడొచ్చు.

ఇది మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్గా రీమేక్ అయింది. ఈ రీమేక్ లో మార్పు చేర్పులు జరిగే వుంటాయి. అయితే అంతరార్ధాలతో, సంకేతాలతో, ప్రతీకాలంకారాలతో, బలమైన పాత్రలతో చాలా డెప్త్ తో డిఫరెంట్ ఫీలింగ్ తీసుకొస్తూ రూపొందిన లూసిఫర్స్థాయిలోనే ఇది వుంటుందా? దేవదూత లూసిఫర్ తో హిబ్రూ పురాణ నేపథ్యం వుంటుందా? ఇల్యూమినాటిస్ గోడచేర్పు వుంటుందా? తెలుగు నేటివిటీ కోసం, చిరంజీవి రొటీన్ ఇమేజి కొనసాగింపు కోసం, మరో రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ గా మారిపోయిందా? ఇవి అక్టోబర్ 5న తెలుసుకుందాం...

—సికిందర్

 

28, సెప్టెంబర్ 2022, బుధవారం

1220 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం: ప్రదీప్ వర్మ
తారాగణం : శ్రీ విష్ణు, కాయదు లోహర్, సుమన్, తనికెళ్ళ భరణి, రాజా రవీంద్ర తదితరులు 
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఛాయాగ్రహణం : రాజ్ తోట
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్ 
విడుదల ; సెప్టెంబర్ 23, 2022
***
        త రెండు సంవత్సరాల్లో గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణా  అనే మూడు సినిమాలు నటించిన శ్రీవిష్ణు ఇప్పుడు  అల్లూరి తో వచ్చాడు. ఈ సారి పూర్తిగా తన ఇమేజిని సాఫ్ట్ నుంచి హార్డ్ కోర్ హీరోగా మార్చి వేయదల్చుకున్నాడు. పోలీస్ పాత్ర పోషించాడు. పూర్తి స్థాయి యాక్షన్ మూవీతో ప్రేక్షకులకి కొత్త అనుభవాన్నివ్వ దల్చుకున్నాడు. ఇందులో సఫలమయ్యాడా? కొత్త దర్శకుడు రొటీన్ గా వుండే పోలీసు సినిమాలకి భిన్నంగా కొత్తగా ఏం చెప్పాడు? ఇవి పరిశీలిద్దాం...


కథ

రిటైరైన పోలీసు కానిస్టేబుల్ నసీరుద్దీన్ (తనికెళ్ళ భరణి) కొడుకు ఇక్బాల్, ఎస్సై ట్రైనింగ్ కోసం మూడు సంవత్సరాలు కష్టపడినా ఉద్యోగ నియామకం జరగదు. దాంతో విరక్తి చెంది వేరే చిన్న ఉద్యోగం చేస్తూంటాడు. అప్పుడు నసీరుద్దీన్ అతడ్ని మోటివేట్ చేస్తూ, ఇన్స్ పెక్టర్ అల్లూరి (శ్రీవిష్ణు) గురించి తెలుసుకోమంటాడు. కొత్త వలస పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కానిస్టేబుల్ ని అడిగి తెలుసుకోమంటాడు. ఇక్బాల్ ఆ కానిస్టేబుల్ ని కలుసుకుంటాడు. కానిస్టేబుల్ ఇన్స్ పెక్టర్ అల్లూరి సాహసోపేత జీవితం గురించి చెప్పుకొస్తాడు. ప్రేమ జీవితం కూడా.

అల్లూరి సీతారామరాజు అలియాస్ అల్లూరి (శ్రీవిష్ణు) కొత్తవలస పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా జాయినై, ఖాకీ దుస్తులకి విలువిస్తూ చాలా నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తూంటాడు. ఒక స్థానిక ఎంపీ అనుచరులు చేస్తున్న అరాచకాలని అడ్డుకుంటాడు. దీంతో పై అధికారులు అల్లూరిని బదిలీ చేసేస్తారు. ఎక్కడ పని చేసినా బదిలీలు తప్పవతడికి. అంత విద్రోహక శక్తులకి వ్యతిరేకంగా వుంటాడు. ఇలా వుండగా పోలీస్ మీషనర్ (సుమన్) హైదరాబాద్ రమ్మంటాడు. అల్లూరి హైదారాబాద్ వచ్చాక యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ తో జీవితం మలుపు తిరుగుతుంది. ఈ ఆపరేషన్ ని ఎలా సక్సెస్ చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

రొటీన్ గా వచ్చే పోలీసు మాస్ కథల్లాగే టెంప్లెట్ లో వుంది. రొటీన్ గా వాడే విశేషణంతో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర. ఈ కథ సినిమాకోసం లేదు, శ్రీవిష్ణు టాలెంట్ ని  పోలీస్ క్యారక్టర్ తో కూడా ప్రూవ్ చేయడం కోసం వుంది. అందుకని కథ వైపు చూడకుండా శ్రీష్ణు యాక్టింగ్ స్కిల్స్ ని పరిశీలించడం కోసం చూడాలి. స్థూలంగా ఇది బి, సి సెంటర్ల మాస్ యాక్షన్ సినిమా.

ఈ కథలో రెండే రెండు థ్రిల్లింగ్ సీక్వెన్సులున్నాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్, సినిమా ముగింపు సీక్వెన్స్. ముగింపు చాలా హార్డ్ కోర్ గా వుంటూ షాకిస్తుంది, కదిలిస్తుంది. ఈ రెండూ తప్ప మిగిలినదంతా రొటీన్ పోలీసు- విలన్ కథే. అయితే ఫస్టాఫ్ లో ఒక్కో కేసు తో ఒక్కో విలన్ మారుతూ వుంటారు. సెకెండాఫ్ మాత్రం టెర్రరిజం కథలో  తగిన విషయం, బలం లేక తేలిపోయి సహన పరీక్ష పెట్టి, ముగింపులో ఎలివేటవుతుంది.

టెర్రరిజం సినిమాలు ఔట్ డెటెడ్ అయిపోయాయి. ఈ మధ్య నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ కూడా ఆడలేదు. హిందీలో జాన్ అబ్రహాం నటించిన ఎటాక్ కూడా. కాశ్మీర్ లో తప్ప దేశంలో ఓ పదేళ్ళుగా  టెర్రరిస్టు కార్యకలాపాలు లేకపోవడం కారణం. అల్ ఖాయిదా అంతరించి ఐసిస్ వచ్చాక, తాము కలలుగనే ఇస్లామిక్ సామ్రాజ్యంలో  కాశ్మీర్ ని కలుపుకోవాలని అక్కడికే పరిమితమయ్యారు. తర్వాత ఇది కూడా మూలనబడి, ఆర్టికల్ 370 రద్దు ప్రకంపనలు మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తున్నారు పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు. కాబట్టి ఇక నక్సలిజం సినిమాల్లాగే  టెర్రరిజం సినిమాల్ని బుట్ట దాఖలు చేయడం ఉత్తమం.

నటనలు -సాంకేతికాలు

పైన చెప్పుకున్నట్టు, ఇది యాక్షన్ హీరోగా కూడా పరిచయమవ్వాలని శ్రీవిష్ణు తన మీద చేసుకున్న ప్రయోగం. ఈ ప్రయోగంతో పూర్తిగా సఫలమయ్యాడు. ఇందులో సందేహం లేదు. యాంగ్రీ యంగ్ ఎస్సై! తన సాఫ్ట్ లవర్ బాయ్ ఇమేజినుంచి సీరియస్ పోలీసు క్యారక్టర్ లోకి విజయవంతమైన ప్రవేశం. అంటే ఇక మనకింకో మాస్ యాక్షన్ హీరో లభించాడన్న మాట. నిర్మాతలు ఇది నోటీసులోకి తీసుకోవాలి.  

అస్సామీ హీరోయిన్ కాయదు లోహార్ మాత్రం పాటల కోసం వుంటుంది. తన అద్భుత గ్లామర్ కి తగ్గ పాత్ర లభించలేదు. ఎస్సై అల్లూరి ఈ తన ప్రేయసిని కూడా పట్టించుకుని కాస్త తన ఆపరేషన్స్ లో భాగం చేసి వుండాల్సింది. రైటర్డ్ కానిస్టేబుల్ గా తనికెళ్ళకి మాత్రం మంచి పాత్ర దక్కింది. సుమన్, రాజా రవీంద్ర, పృథ్వీలవి రొటీన్ పాత్రలే.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతంలో పాటలు చెప్పుకోగగ్గవి కాకపోయినా, చిత్రీకరణ బాగా చేశారు. అలాగే రాజ్ తోట ఛాయాగ్రహణం యాక్షన్ మూవీ మూడ్ ని ఎలివేట్ చేసేలా వుంది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బావుంది.

దర్శకుడు ప్రదీప్ వర్మ ఈ పోలీస్ సినిమాని కొత్తగా చూపించడంలో ఎంతవరకూ సఫలమయ్యాడంటే, కథా పరంగా ఇంటర్వెల్, ముగింపు సీక్వెన్సుల వరకూ సఫలమయ్యాడు. మిగిలినదంతా రొటీన్ మాస్ పోలీసు వ్యవహారమే, సీన్లే. సెకండాఫ్ టెర్రరిజం కథని యాక్షన్ తో నడపకుండా ఇన్వెస్టిగేషన్ తో నడపడంతో కుదేలయ్యింది. కిరోసిన్ లో పోలీస్ సినిమాని యాక్షన్ తో నడపకుండా డైలాగ్స్ తో నడిపినట్టు. ఐతే శ్రీవిష్ణు ని సీరియస్ యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే విషయంలో మాత్రం పూర్తిగా సఫలమయ్యాడు దర్శకుడు.
సికిందర్

27, సెప్టెంబర్ 2022, మంగళవారం

1219 : రివ్యూ!



రచన - దర్శకత్వం : ఆర్. బాల్కీ
తారాగణం : దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి, సన్నీ డియోల్, పూజా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులు
కథ : ఆర్. బాల్కీ, స్క్రీన్‌ప్లే :  ఆర్. బాల్కీ, రాజా సేన్, రిషీ వీరమణి
సంగీతం: అమన్ పంత్, ఛాయాగ్రహణం : విశాల్ సిన్హా నిర్మాతలు : రాకేష్ ఝున్‌జున్‌వాలా, జయంతీ లాల్ గడా, అనిల్ నాయుడు, గౌరీ షిండే
బ్యానర్స్ : హోప్ ప్రొడక్షన్, పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల :  సెప్టెంబర్ 23, 2022
***

ర్శకుడు ఆర్ బాల్కీ (బాలకృష్ణన్) గత 15 ఏళ్ళుగా బాలీవుడ్ లో తీసినవి 8 సినిమాలే అయినా అవి ఎవరూ తీయలేని సినిమాలు. చీనీ కమ్’, నుంచీ పాడ్ మాన్ వరకూ చూసుకుంటే అన్నీ అవుటాఫ్ బాక్స్ ప్రయోగాలే. కొన్నిసార్లు ఆ బాక్స్ కూడా కనపడదు. బాక్సే లేని సినిమాలతో బాక్సాఫీసు విజయాలు. రెండుసార్లు ఉత్తమ చలన చిత్రం జాతీయ అవార్డులు, 4 సార్లు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 5 విభాగాల్లో 17 నామినేషన్లు అతడి స్థాయిని తెలుపుతాయి. ఈసారి ప్రపంచ వ్యాప్తంగానే ఎవరి వూహకూ రాని ఐడియాతో సీరియల్ కిల్లర్ సినిమా తీశాడు. ఇందులో మలయాళ స్టార్ సల్మాన్ దుల్కర్ ని, బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ నీ, హైదరాబాద్ తెలుగు అమ్మాయిగా బాలీవుడ్ హీరోయిన్ అయిన శ్రేయా ధన్వంతరినీ ప్రధాన తారాగణంగా తీసుకుని, ఎవరూ వూహించని కొత్త కథ తెరకెక్కించాడు. అదేమిటో చూద్దాం...

కథ

ముంబాయిలో ఒక సీనియర్ సినిమా రివ్యూ రైటర్ (రాజా సేన్) హత్య జరుగుతుంది. ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో అర్ధంగాదు క్రైమ్ బ్రాంచ్ ఐజీ అరవింద్ మాథుర్ (సన్నీ డియోల్) కి. హత్యచేసిన తీరు ఆశ్చర్య పరుస్తుంది. శవం మీద గాయాలు హత్యలా అన్పించవు, ఆర్టిస్టు గీసిన రేఖాచిత్రాల్లా వుంటాయి కత్తితో. నుదుట త్రికోణాకారం చెక్కి వుంటుంది. ఈ త్రికోణాకారం మీద దృష్టి పెడతాడు ఐజీ మాథుర్. దీనికి ఇంకో త్రికోణం కలిపితే నక్షత్రం గుర్తు వస్తుంది. ఒక త్రికోణమే వేశాడంటే సగం నక్షత్రమన్న మాట. అంటే సగం స్టార్. స్టార్స్ సినిమా రివ్యూలకిచ్చే రేటింగ్ గుర్తులు. అంటే హంతకుడు హతుడికి హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడన్న మాట.  

ఆ వారం విడుదలైన సినిమాకి రివ్యూ రైటర్ రివ్యూ రాస్తూ సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఇందుకు ఈ హత్య జరిగినట్టు అర్ధమవుతుంది. మళ్ళీ వారం ఇంకో రివ్యూ రైటర్ హత్య జరుగుతుంది. ఆ వారం విడుదలైన సినిమాకి అతనుకూడా మంచి రేటింగ్ ఇవ్వలేదు. రేఖా చిత్రకారుడుగా హంతకుడు అతడి శవాన్ని ఆర్టులా చెక్కి
, నుదుట సింగిల్ స్టార్ వేశాడు. రివ్యూరైటర్లు సినిమాలకి రేటింగ్ ఇస్తూంటే, హంతకుడు రివ్యూ రైటర్లని చంపి వాళ్ళకి అర్హమైన రేటింగ్ ఇస్తున్నాడన్న మాట.

ఈ పాటికి రివ్యూ రైటర్ల మీద పగబట్టిన సీరియల్ కిల్లర్ రంగంలో వున్నాడని అర్ధమైపోతుంది ఐజీ మాథుర్ కి. ఇక పూర్తి స్థాయిలో యాక్షన్ లోకి దిగిపోతాడు. డానీ (దుల్కర్ సల్మాన్) అని ఒక ఫ్లోరిస్టు వుంటాడు. నీలా (శ్రేయా ధన్వంతరి) అని ఒక సినిమా రిపోర్టర్ వుంటుంది. డానీ సుప్రసిద్ధ దివంగత దర్శకుడు గురుదత్ అభిమాని. గురుదత్ తీసిన కాగజ్ కే ఫూల్’, ప్యాసా క్లాసిక్స్ చూస్తూ ఆ పాటలు వింటూ వుంటాడు. ఇంతే క్లాసిక్ గా నీలాని ప్రేమిస్తూంటాడు. నీలాకో అంధురాలైన తల్లి (శరణ్య) వుంటుంది.

డానీ రెండు గ్లాసుల్లో టీ పోసుకుని తాగుతాడు. సైకిలు మీద తిరుగుతూ కస్టమర్స్ కి ఫ్లవర్స్ అందిస్తాడు. నీలాతో ప్రేమ గురించి తనలో తానే మాట్లాడుకుంటూ వుంటాడు. ఇంతలో ఇంకో హత్య జరుగుతుంది. ఎవరీ సీరియల్ కిల్లర్? వారానికో హత్య చేస్తున్నాడు. ఈ హత్యల్ని ఎలా అరికట్టాలి? సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకోవాలి? ఇవీ ఐజీ మాథుర్ ముందున్న చిక్కు ప్రశ్నలు.

ఎలా వుంది కథ
పైన చెప్పుకున్నట్టు సీరియల్ కిల్లర్ జానర్ లో ఇంతవరకూ ఎక్కడా రాని కొత్త కథ. అల్టిమేట్ ఐడియా- సినిమా రివ్యూ రైటర్లని చంపడం. దర్శకుడు బాల్కి గురుదత్ అభిమాని. గురుదత్ తీసిన ప్యాసా (1957- ఇది తెలుగులో 1978 లో మల్లెపువ్వు గా రీమేక్ అయింది శోభన్ బాబుతో), కాగజ్ కే ఫూల్ (1958) రెండూ బ్యాడ్ రివ్యూల పాలబడి సమాధి అయిపోయాయనీ, ఇవే తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా నిలబడ్డాయనీ, కానీ గురుదత్ కాగజ్ కే ఫూల్ వైఫల్యం తర్వాత విరక్తితో దర్శకత్వం మానుకుని, 10 సినిమాలకి నిర్మాతగానే కొనసాగాడనీ, బ్యాడ్ రివ్యూలు అతడిలోని గొప్ప దర్శకుడ్ని చంపేశాయనీ, ఈ బాధ ఎలా వుంటుందో తెలిపేందుకే చుప్ తీశాననీ వెల్లడించాడు బాల్కీ.

అయితే రివ్యూ రైటర్ల మీద కక్ష గట్టినట్టు ఏమీ సినిమా తీయలేదు. కానీ బ్యాడ్ రివ్యూలు గురుదత్ కెరీర్ ని సమాప్తం చేశాయని అంటున్నప్పుడు
, తను ఈ సినిమా బ్యాడ్ రివ్యూలకి అవకాశం లేకుండా, లోపాలు లేకుండా చూసుకోల్సింది. ఇలా జరగలేదు. కథే తికమకగా మిగిలింది చివరికి. ఏం చెప్పాలని తీశాడో అర్ధం గాదు.

బ్యాడ్ రివ్యూ అనేది వుంటుందా
? సినిమా బ్యాడ్ గా వుంటే దాన్ని బట్టి రివ్యూ వుంటుంది. సినిమాలే బ్యాడ్ గా వుంటాయి, రివ్యూలు కాదు. నిష్పాక్షిక రివ్యూలు, నిర్మాణాత్మక విమర్శ బ్యాడ్ రివ్యూలు కాలేవు. ఉద్దేశపూర్వకంగా  సినిమాని దెబ్బతీసే  ఎజెండా రివ్యూలుంటాయి. డబ్బు తీసుకుని రాసే భజన రివ్యూలూ వుంటాయి. ఈ సినిమాలో బాల్కీ వివిధ పాత్రలద్వారా ఈ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశాడు.

 
విమర్శ సమాజానికి అవసరం. ఏ రంగం అభివృద్ది పథంలో సాగాలన్నా విమర్శ చాలా అవసరం. విమర్శే లోపాల్ని ఎత్తిచూపి ఎడ్యుకేట్ చేస్తుంది’... అబద్ధపు రివ్యూలు ప్రేక్షకుల కళ్ళు తెరిపించ లేవు, వాళ్ళ అభిరుచులు పెరిగేలా చెయ్యలేవు. ఇవి సినిమాలకి హాని కూడా చేస్తాయి’... సోషల్ మేడియాలో అందరూ రివ్యూలు రాస్తున్నప్పుడు ఇంకా వేరే రివ్యూల అవసరమేముంది?’... రివ్యూలు రాసే వాళ్ళందరూ క్రిటిక్స్ కారు. మూవీ ఎక్స్ పర్ట్స్ రాసే రివ్యూలు వేరు. వీళ్ళ రివ్యూల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తారు ... ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు.

కథ కొత్తది. రివ్యూ రైటర్ల హత్యల వల్ల బాలీవుడ్ లో ఏర్పడిన పరిస్థితికూడా చూపించాడు. చంపుతున్న సీరియల్ కిల్లర్ ఎవరో చివరి వరకూ సస్పెన్స్ లో వుంచకుండా ఇంటర్వెల్లో రివీల్ చేసేశాడు. దీని వల్ల ఎండ్ సస్పెన్స్ కథనం బారిన పడి బోరు కొట్టదు సినిమా. చివరి వరకూ నేరస్థుడెవరో సస్పెన్స్ లో వుంచే ఎండ్ సస్పెన్స్ కథలు ప్రింట్ మీడియా అయిన నవలల్లో బావుంటాయి గానీ, విజువల్ మీడియా అయిన సినిమాకి పనికిరావని హాలీవుడ్ ఏనాడో  గుర్తించి, ఎండ్ సస్పెన్స్ సినిమాలకి చెక్ పెట్టేసింది. అయినా ఇంకా ఇప్పటికీ తెలుగులో ఓదెల రైల్వే స్టేషన్’, కిరోసిన్ లాంటి ఎండ్ సస్పెన్సులు తీసి అట్టర్ ఫ్లాప్ చేసుకుంటున్నారు.

హాలీవుడ్ సీన్ టు సీన్ సస్పెన్స్ సినిమాలకి తెరతీసింది. ఇవి సక్సెస్ అవుతున్నాయి. సస్పెన్స్ అనే అంశానికి రెండు పార్శ్వాలుంటాయి- ఎవరు
? ఎందుకు? అనేవి. ఇవి రెండూ మూసి పెట్టి చివరివరకూ కథ నడిపితే అది ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఈ రెండు పార్శ్వాల్లో ఎవరు? అనేది చూపించేసి, ఎందుకు? అనేది చివరి వరకూ సస్పెన్స్ లో పెట్టుకోవచ్చు. ఎవరు? అనేది ఓపెన్ చేశాక, ఇక ఎలా పట్టుబడతాడనే సీన్ టు సీన్  సస్పెన్స్ తో కథనం చేస్తే సక్సెస్ అవుతుంది.

అయితే ఎందుకు
? అనే నేర కారణం చివర్లో ఓపెన్ చేసినప్పుడు బలంగా వుండాలి. లేకపోతే తేలిపోతుంది సినిమా. ఇదే జరిగింది చుప్ లో.  ఇంటర్వెల్లో సీరియల్ కిల్లర్ ఎవరో చూపించేసి, ఇక అతనెలా పట్టుబడతాడనే సీన్ టుసీన్ సస్పెన్స్ కథనం చేసు కొస్తూ, చివర్లో పట్టుబడ్డాక ఓపెన్ చేసిన నేర కారణం కన్ఫ్యూజుడుగా వుంది. ముగింపు పేలవంగా మారింది.

సీరియల్ కిల్లర్ చిన్నప్పుడు కుటుంబంలో జరిగిన ఒక ట్రాజడీని ఇప్పుడు రివ్యూ రైటర్ల హత్యలకి ముడిపెట్టి జస్టిఫై చేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. నడుస్తున్న కథా ప్రపంచానికి లోబడి సజాతి కారణం చూపించకుండా
, సంబంధం లేని చిన్నప్పటి విజాతి కారణం చూపించి మెప్పించాలనుకోవడం విచారకరం. ఒక దర్శకుడే రివ్యూల వల్ల తన కెరీర్ పరిసమాప్తమైందని కక్షగట్టి, రివ్యూ రైటర్లని చంపుతూ వుంటే, అది కథా ప్రపంచంలో ఒదిగే సజాతి కారణమవుతుంది.

నటనలు - సాంకేతికాలు
దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకి బలమే కానీ, సెకండాఫ్ లో సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రేమైనా ఇంకేదైనా నవ్వు మొహంతో సున్నితంగా వ్యవహరించే నటనతో ఓ ముద్రవేస్తాడు. అతడికి కోపం రాదు, ఆవేశపడడు. హాయిగా పూలు అమ్ముకుంటూ, గురుదత్ సినిమాలూ పాటలూ ఎంజాయ్ చేస్తూంటాడు. ఇతడి వల్ల సినిమాకో ఆకర్షణ వచ్చింది. హీరోయిన్ శ్రేయా ధన్వంతరి కూడా సినిమా రిపోర్టర్ గా, దుల్కర్ సల్మాన్ లవర్ గా  సింపుల్ గా వుంది. ఈమె తల్లిగా నటించిన శరణ్య అంధురాలి పాత్ర వల్ల కథకి లభించిన అదనపు ప్రయోజనం లేదు. ఆమెకి సీరియల్ కిల్లర్ ని చూసే అతీతశక్తి ఏదైనా వుంటే అది వేరు. ఆ సీరియల్ కిల్లర్ ఈమెకి కూడా స్పాట్ పెట్టి థ్రిల్ పెంచొచ్చు. ఐజీగా సన్నీడియోల్, క్రిమినల్ సైకాలజిస్టుగా పూజాభట్ ల ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్ టచ్ తో వుంది. పోలీస్ ప్రొసీజురల్ జానర్ మర్యాదలకి తగ్గట్టు.

కెమెరా వర్క్
, విజువల్స్ మిగతా బాల్కీ సినిమాల్లాగే టాప్ క్లాస్. పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వస్తూంటాయి- జానేక్యా తూనే కహీ, వఖ్త్ నే కియా క్యా హసీన్ సితమ్, యే దునియా అగర్ మిల్ భీ జాయే... అన్నీ  ప్యాసా’, కాగజ్ కే ఫూల్  లలోని క్లాసిక్ హిట్సే. చివరి విషాద గీతం చిన్నప్పటి ముగింపు ఫ్యామిలీ దృశ్యాలకి డిస్టర్బింగ్ గా బ్యాక్ గ్రౌండ్ లో వస్తూంటుంది.

మొత్తానికి గురుదత్ కి నివాళిగా బాల్కీ తీసిన ఈ మూవీ రేటింగ్స్ 2/5 నుంచి 3/5 వరకు ఇచ్చారు. సెకండాఫ్ లో హత్యలు లేకుండా సీరియల్ కిల్లర్ ని ట్రాప్ చేయడానికి హీరోయిన్ని రివ్యూ రైటర్ గా ప్లాంట్ చేసే డ్రామా ఒక దశ దాటే టప్పటికి బోరే తప్ప ఏమీ లేదు. ఈ ట్రాప్ క్లయిమాక్స్ లో (ప్లాట్ పాయింట్ 2) ప్రారంభించాల్సింది. మరిన్ని హత్యలతో టెన్షన్  గ్రాఫ్ పెంచకుండా
, మిడిల్ 2 యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే కొనసాగించకూడా, సెకండాఫ్ పూర్తిగా ఇదే డ్రామా నడిపి, ముగింపుకి కూడా న్యాయం చేయని లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ సినిమా రచయితల్లో రివ్యూ రైటర్ రాజా సేన్ కూడా వున్నాడు.

—సికిందర్

 

26, సెప్టెంబర్ 2022, సోమవారం

1218 : రివ్యూ!

 రచన - దర్శకత్వం : సతీష్ త్రిపుర
తారాగణం : సింహా కోడూరి, ప్రీతీ అస్రానీ, సముద్రఖని,
సంగీతం: కాల భైరవ ఛాయాగ్రహణం : యశ్వంత్ సి
నిర్మాతలు: డి సురేష్ బాబు, సునీత తాటి
విడుదల సెప్టెంబర్ 23, 2022
***

        తెలుగు సినిమాల్లో ఇదివరకు సాహసించని ప్రయోగాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రధాన స్రవంతి సినిమాలకి సమాంతరంగా ప్రయోగాత్మక సినిమాల పరంపర కొనసాగుతోంది. చర్చల్లోకే రానివ్వని జానర్స్ ని ఇప్పుడు స్వాగతిస్తున్నారు. ఇదివరకు ప్రయోగాత్మక సినిమాలకి మార్కెట్ లేదనే వెనుకడుగు కాస్తా ఇప్పుడు ఓటీటీలతో ముందడుగుగా మారుతోంది. థియేటర్లో ఆడకపోయినా ఓటీటీల్లో ఆదాయముంటుందన్న నమ్మకం ఈ ముందడుగుకి వూతమిస్తోంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి ఈ సమాంతర సినిమాల్ని ముందుకు తీసికెళ్తున్నాడు. మత్తువదలరా, తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త వంటి సినిమాలతో ఈ సెగ్మెంట్ కి హీరోగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు.

        తాజాగా ఈవారం దొంగలున్నారు జాగ్రత్త ని డి సురేష్ బాబు, తాటి సునీత వంటి ప్రముఖుల నిర్మాణ సారధ్యంలో, కొత్త దర్శకుడు సతీష్ త్రిపురతో కలిసి మరో విభిన్న సినిమాగా అందించాడు. ముట్టుకోవడానికే వెనుకాడే జానర్ ని తొలిసారిగా ప్రేక్షకులకి అందించాడు. ఇదేమిటో, దీని కథా కమామిషేమిటో ఓసారి చూద్దాం...

కథ

రాజు (సింహా) మెకానిక్ గా పనిచేసుకుంటూ భార్య నీరజ (ప్రీతీ అస్రానీ) ని పోషించుకుంటూ వుంటాడు. రాత్రి పూట ఆమెకి తెలియకుండా దొంగతనాలకి పాల్పడుతూంటాడు. త్వరలో తండ్రి కూడా కాబోతున్నాడు. ఆగి వున్న కార్లలో స్టీరియోలు, ఇతర విలువైన పరికరాలు తస్కరించి అమ్ముకోవడం అతడి నేరప్రవృత్తి. ఇలా ఓ రాత్రి ఖరీదైన కారు మీద కన్నేస్తాడు. కారులోకి జొరబడి పని ముగించుకుని బయటపడబోతూంటే, కారు డోర్స్ లాక్ అయిపోతాయి.

ఆ కారు చక్రవర్తి (సముద్రకని) అనే డాక్టరుది. దాన్ని అతను దొంగల్ని ట్రాప్ చేయడానికి అనువుగా కస్టమైజ్ చేయించుకున్నాడు. రిమోట్ లో ఎక్కడో వుండి కారుని కనిపెట్ట గలడు. ఆపరేట్ చేయగలడు. ఇప్పుడు బోనులో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్న రాజు ని చూసి
, ఓ ఆట ఆడుకునేందుకు స్కెచ్ వేస్తాడు. అతను రిమోట్ లో మాట్లాడితే కారులో వాయిస్ విన్పిస్తుంది. రాజుకి కాల్ చేస్తాడు డాక్టర్ చక్రవర్తి. ఆ కాల్ తో షాక్ తింటాడు రాజు. ఏమిటా కాల్? తను ఇలా బందీ అవడం వెనుక డాక్టర్ తో బాటు పోలీస్ కమీషనర్ (శ్రీకాంత్ అయ్యంగార్), ఇంకా తన భార్య సైతం ఎందుకున్నారు? ఏమిటిదంతా? ఈ ట్రాప్ దేనికి? ఇందులోంచి ఎలా బయటపడ్డాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది సర్వైవల్ డ్రామా జానర్ కథ. హాలీవుడ్ లో విరివిగా వస్తూంటాయి. దీవిలో చిక్కుకున్న వొంటరి హీరోతో కాస్ట్ ఎవే’, శవపేటికలో బందీ అయిన హీరోతో 127 అవర్స్’, అడవిలో ఆటవికులతో ప్రమాదంలో పడ్డ హీరోతో అపొకలిప్టో...ఇలా వందల్లో వుంటాయి. ప్రాణ గండంలో పడ్డ పాత్ర చేసే బ్రతుకు పోరాటాలే ఈ జానర్ కథలు. ప్రస్తుత కథని 4x4 అనే  అర్జెంటీనా- స్పానిష్ మూవీ లోంచి తీసుకుని ఫ్రీమేక్ చేశారు. అంటే కాపీకొట్టారు. ఇదింకా హాలీవుడ్ లో రీమేక్ అవుతోంది.

 ఐతే ఈ ఒరిజినల్లో వున్న విషయం గానీ, బలంగానీ ఫ్రీమేక్ లో లేకపోవడం విచారకరం. గంటన్నర సినిమాని కూడా కూర్చోబెట్టేలా తీయకపోతే ఎలా? ఒరిజినల్ దర్శకుడు టీవీలో చూసిన ఒక వార్త ఆధారంగా సినిమా తీశాడు. తీసినప్పుడు చాలా బలమైన ఫ్యామిలీ డ్రామా సృష్టించాడు. దివంగత ప్రఖ్యాత సినీ విమర్శకుడు రోజర్ ఎబర్ట్ అన్నట్టు, అర్జెంటీనా, స్పానిష్ దేశాలు భారీ బడ్జెట్ సినిమాలు తీయలేవు. అందుకని తమ మార్కెట్ ని ముంచెత్తుతున్న హాలీవుడ్ సినిమాలని ఎదుర్కోవాలంటే, తీస్తున్న చిన్న బడ్జెట్ సినిమాలని కథా బలంతోనే తీయాలి. అలా మంచి కథా బలమున్న థ్రిల్లర్స్ తీస్తూ ప్రపంచ దృష్టి నాకర్షిస్తున్నారు.


'దొంగలున్నారు జాగ్రత్త అంటూ దొంగిలించిన కథతో సినిమా తీసినప్పుడు, సగం వరకే అద్భుత చోర కళ కన్పిస్తోంది. మిగిలిన సగం చిల్లర విషయంగా మారిపోయింది. సింహా పాత్రని, జీవితాన్నీ పరిచయం చేస్తూ మందకొడిగా సినిమా సాగినా, కారులో చిక్కున్నాక ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతుంది కథలో. డాక్టర్ కాల్ తో బ్యాగ్ గ్రౌండ్ మిస్టరీ జత కలుస్తుంది. కానీ  ఇంటర్వెల్ కొచ్చేసరికి సంబంధం లేని విషయంతో విశ్రాంతి పడుతుంది.

ఇక సెకండాఫ్ కొచ్చేసరికి ఫస్టాఫ్ లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ గోప్యత లేకుండా తెలిసిపోతూంటాయి. ఎప్పుడైతే తెరవెనుక పాత్రలతో వున్న మిస్టరీ తెలిసిపోయిందో ఇక సినిమా బోరు కొట్టడం మొదలెడుతుంది. ఎలా వుంటుందంటే, ఈ మిస్టరీ ఇంటర్వెల్ దగ్గరే తేల్చేసి సినిమా ముగించేయొచ్చు కదా అన్నట్టు వుంటుంది.

నటనలు- సాంకేతికాలు

సింహా నిజాయితీగా కష్టపడి పాత్రకీ, సినిమాకీ ప్రాణం పోయాలనుకున్నాడు. పాత్రకైతే ప్రాణం పోశాడుగానీ సినిమాకి కుదర్లేదు. పాత్రే కథని పుట్టిస్తుంది. ఒరిజినల్లోని పాత్రని అర్ధం జేసుకుంటే, అలాటి దొంగోడు తనకి తగ్గ శిక్ష కూడా అనుభవించాలన్న నేరము - శిక్ష కాన్సెప్టుతో వుంటుంది. కారులో చిక్కుకుని ఎంత హైన్యం అనుభవిస్తాడంటే, ఆకలికి కాగితాలు తినేస్తాడు, దప్పికకి తన మూత్రమే తాగేస్తాడు. తెలుగులో శిక్ష విషయం మర్చిపోయి, ఎలా బయటపడాలా అనేదే పాత్రగా చేసినప్పుడు, సమగ్ర పాత్ర చిత్రణ కొరవడి కథా బలం కనుమరుగైంది.      

    సముద్రకని, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రీతీ అస్రానీలు ఎంత బాగా నటించినా అవసరం లేని సెకండాఫ్ కథని ఎలా నిలబెట్టగలరు. కాలభైరవ నేపథ్య సంగీతం మాత్రం ఒక ఆకర్షణ. కారులో బందీ అయిన హీరో అనే సింగిల్ లొకేషన్ కథతో కెమెరా వర్క్ కష్టమైనదే. కారులో ఆ స్పేస్ లోపలే స్ట్రగుల్ చూపడం. దీనికి గైడ్ బుక్ లా ఒరిజినల్ మూవీ వున్నా, అలాటి టెక్నికల్ షాట్స్ ని క్రియేట్ చేయలేకపోయారు. ఇక డైలాగులు చూస్తే అవి పైపైన వున్నాయి. ఒరిజినల్ మూవీ స్క్రిప్టు చూసి వుంటే, డైలాగులు ఏ లోతుపాతుల్లోంచి రాశారో అర్ధమయ్యేది. ఇలాటి పరిమిత బడ్జెట్ సినిమాలకి స్క్రిప్టే ప్రాణం. ఇదే అర్జెంటీనా, స్పానిష్ సినిమాల విజయరహస్యం.

    దర్శకుడు సతీష్ త్రిపుర సాహసించి ఈ ప్రయోగం చేయడం మంచిదే. అయితే దర్శకత్వం మీద ఎక్కువ కృషి చేయాల్సివుంటుంది. ఒరిజినల్ మూవీ దర్శకుడి ఇంటర్వ్యూలు కూడా చదివి వుంటే దీనికి దర్శకత్వం వహించేందుకు తగిన విషయ పరిజ్ఞానం సమకూరేది.  

చివరికేమిటి
        సహ నిర్మాత సునీత తాటి ప్రయోగాత్మక సినిమాలు తీస్తున్నారు. ఓహ్ బేబీ, శాకినీ ఢాకినీ, దొంగలున్నారు జాగ్రత్త. మూడూ ఫారిన్ రీ/ఫ్రీ మేకులే. గత వారమే శాకినీ ఢాకినీ విడులైంది. వెంటనే ఈ వారం దొంగలున్నారు జాగ్రత్త. రెండూ బోల్తా కొట్టాయి. సి గ్రేడ్ సినిమాలు ఎవరైనా తీయగలరు. తను చేయాల్సింది ఇలాటి చిన్న సినిమాల డీఎన్ఏ ని పసిగట్టి వాటిని పకడ్బందీగా తీయడమే. చిన్న సినిమాల స్క్రిప్టు అంటే ఏమిటో తెలుసుకోవడమే. లేని పక్షంలో స్క్రిప్టు అవసరం లేని పెద్ద హీరోలతో తీసుకోవచ్చు. విలక్షణ ఫారిన్ కాన్సెప్ట్స్ ని ఇలా అన్ పాపులర్ చేయకుండా.

—సికిందర్