దర్శకత్వం
: మహేష్ మంజ్రేకర్
తారాగణం : సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ, మహిమా మక్వానా, సచిన్ ఖెడేకర్, జీశ్శూ సేన్ గుప్తా, మహేష్ మంజ్రేకర్ తదితరులు
కథ : ప్రవీణ్ టార్డే, స్క్రీన్ ప్లే : మహేష్ మంజ్రేకర్, అభిజిత్ దేశ్ పాండే, సిద్ధార్థ్ సాల్వి సంగీతం :
రవీ బస్రూర్, ఛాయాగ్రహణం : కరణ్ రావత్
బ్యానర్ : సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్
నిర్మాత : సల్మాన్ ఖాన్
విడుదల : నవంబర్ 26, 2021
***
సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ ని,
ఫ్యాన్స్ నీ కాసేపు పక్కన బెట్టి, బావగారు ఆయుష్ శర్మతో
కలిసి ‘అంతిమ్ = ది లాస్ట్ ట్రూత్’ అనే
డార్క్ - రియలిస్టిక్ మూవీలో నటించాడు. పరిమిత బాక్సాఫీసు అప్పీలుండే ఈ సినిమాని పరిమిత బడ్జెట్లోనే తన సంస్థ ద్వారా నిర్మించి
ఫలితాన్ని ప్రేక్షకులకి వదిలేశాడు. 2018 లోనే ఆయుష్ ని వెండితెరకి పరిచయం చేస్తూ ‘లవ్ యాత్రీ’ అనే రోమాంటిక్ డ్రామా నిర్మిస్తే, అది నష్టాలతోనే ముగిసింది. తిరిగి ఇప్పుడు జానర్ ని మార్చి, ఆయుష్ ని పరీక్షకి పెట్టే కరుడుగట్టిన క్రిమినల్ పాత్రలో రీలాంచ్ చేశాడు.
ఇలాటి సినిమాల స్పెషలిస్టు మహేష్ మంజ్రేకర్ దర్శకుడుగా రంగంలోకి దిగాడు. మరి
సల్మాన్, మంజ్రేకర్ ఇద్దరూ కలిసి ఆయుష్ ని లాంచీ ఎక్కించి
తీరం దాటించారా లేదా అనేది చూద్దాం...
రాహుల్యా (ఆయుష్ శర్మ) పుణె సమీపంలోని ఓ గ్రామంలో
తల్లిదండ్రులతో, చెల్లెలితో నివసిస్తూంటాడు. తండ్రి దత్తా (సచిన్ ఖెడేకర్) కూతురి పెళ్ళి కోసం
తక్కువ ధరకి పొలం అమ్మేస్తాడు. పొలం కొన్న షిండే అనే అతను ఫామ్ హౌస్ ఏర్పాటు
చేసుకుంటే, అక్కడ వాచ్ మాన్ గా చేరతాడు దత్తా. ఒక రోజు షిండే
దత్తాతో దురుసుగా ప్రవర్తించి ఉద్యోగంలోంచి తీసేస్తాడు. దత్తా కుటుంబంతో పుణె
వెళ్ళిపోయి కూరగాయల మార్కెట్ లో కూలీగా చేరతాడు. అక్కడ సాల్వీ (విజయ్ నికమ్) అనే
కార్పొరేటర్ అనుచరులు మామూళ్ళ కోసం సత్య (మహేష్ మంజ్రేకర్) అనే కూలీని కొడతారు.
ఇది చూసి రాహుల్యా, అతడి ఫ్రెండ్ గణ్య (రోహిత్ హల్దీకర్), సాల్వీ అనుచరుల్ని కొట్టి అరెస్టవుతారు.
స్థానిక పోలీస్ స్టేషన్ లో రాజ్
వీర్ సింగ్ (సల్మాన్ ఖాన్) స్ట్రిక్టు ఇన్స్ పెక్టర్ గా వుంటాడు. అరెస్టయిన రాహుల్యానీ, గణ్యనీ జైలుకి పంపిస్తాడు. జైల్లోనే వున్న కార్పొరేటర్ సాల్వీ అనుచరులు రాహుల్యా, గణ్యల మీద దాడి చేస్తారు. స్థానిక గ్యాంగ్ స్టర్ నాన్యా భాయ్ (ఉపేంద్ర లిమాయే)
అడ్డుకుంటాడు. రాహుల్యా, గణ్యా తనకి పనికొస్తా రన్పించి
బెయిలు మీద విడిపిస్తాడు.
ఇక కార్పొరేటర్ సాల్వీకి ఎలాగైనా
బుద్ధిచెప్పాలనుకున్న రాహుల్యా, అనుకోకుండా అతణ్ణి
చంపేస్తాడు. దీంతో జైలు కెళ్ళిన రాహుల్యా, గణ్యలని మళ్ళీ
బెయిలు మీద విడిపిస్తాడు నాన్యా భాయ్. ఇక రాహుల్యా కూరగాయల మార్కెట్లో రైతుల
హక్కుల కోసం పోరాడతాడు. ఈ పోరాటంలో నాన్యా భాయ్ కూడా చేతులు కలిపి రాహుల్యాని
మార్చేస్తాడు. రాహుల్యా నుపయోగించుకుని పేద రైతుల భూముల్ని చిల్లర ధరలకి కొనేసుకుంటాడు.
ఇది గమనిస్తున్న సత్య, నీ తండ్రి పొలాన్ని కూడా నాన్యా, షిండేకి తక్కువ ధరకే అమ్మించాడు, అమ్మకపోతే నీ
చెల్లెల్ని చెరుస్తానని బెదిరించాడనీ చెప్పడంతో రాహుల్యాకి కనువిప్పవుతుంది. ఇప్పుడు
నాన్యా ప్రత్యర్ధి అంబీర్ అనే ఎమ్మెల్యే వచ్చి, రాహుల్యాకి
ఒక సూచన చేస్తాడు - నాన్యాని చంపేయమని.
ఇదీ విషయం. ఇప్పుడు రాహుల్యా
గుంటనక్క నాన్యాని చంపేశాడా? ఇన్స్ పెక్టర్ రాజ్ వీర్ ఏం
చేస్తున్నాడు? పుణెకి కొత్త గ్యాంగ్ స్టర్ గా మారబోతున్న
రాహుల్యాని ఆపాడా? పుణెలో గ్యాంగ్ స్టర్స్ అందర్నీ అంతమొందించడానికి
అతను పన్నిన పథకమేమిటి? ఈ పథకంలో రాహుల్యా కూడా
చిక్కుకున్నాడా? ఈ ఇద్దరి మధ్య పోరాటం ఏ ముగింపుకి దారి
తీసింది? ఇదీ మిగతా కథ.
2018 లో విడుదలైన ‘ముల్షీ పాటర్న్’ అనే మరాఠీకి
రీమేక్. మహారాష్ట్రలో పట్టణ, నగర శివారు రైతులు పెట్టుబడి
దార్ల వొత్తిడికి లొంగి పొలాలు అమ్ముకుని కూలీలుగా మారుతున్న పరిణామాలకి, నేర ప్రపంచపు కథ జోడించి మరాఠీ రియలిస్టిక్ గ్యాంగ్ స్టర్ గా తీశారు. దీని
దర్శకుడు ప్రవీణ్ టార్డేకి మంచి పేరొచ్చింది. బాలీవుడ్ సినిమాల ప్రభావానికి దూరంగా, అలాటి వాసనలు లేని పక్కా మరాఠా నేపథ్యంతో తెరకెక్కించాడు. అయితే మేకింగ్ మరాఠా ముద్రే
అయినా, కథాకథనాలు బాలీవుడ్ గ్యాంగ్ స్టర్/మాఫియా కథల
టెంప్లెట్ ని దాటి వెళ్ళక పోవడం లోపం. ఐతే ఇంకేం, ఇది మన
బాలీవుడ్ కథేగా అనుకునేమో, సల్మాన్,
ఆయుష్ తో కలిసి ఈ ప్రాంతీయ సినిమా రీమేక్ లో నటించి,
నిర్మించేందుకు ముందుకొచ్చాడు. ఇది సల్మాన్ లెవెల్ పాత్ర కాదు, సినిమా కూడా కాదు. ఆయుష్ కి చేయూత నివ్వడానికి దీన్ని చేపట్టాడు. సల్మాన్
సోలోగా రియలిస్టిక్ లో నటించాలనుకుంటే ‘జై భీమ్’ లో సూర్య పాత్ర లాగైనా కనీసం వుండాలి.
మరాఠీ నేటివిటీ తప్ప బాలీవుడ్
గ్యాంగ్ స్టర్ టెంప్లెట్ లోనే తీసిన ‘ముల్షీ పాటర్న్’ ని బాలీవుడ్డే రీమేక్ చేయడంతో చూస్తే కొత్తగా ఏమీ వుండదు. అప్పట్లో
రాంగోపాల్ వర్మ తీసిన హిందీ ‘కంపెనీ’ ముగింపు కూడా మరాఠీలో వుంది. అదే మళ్ళీ ఈ
హిందీలో చూపించారు. కాకపోతే ఈ తరహా కథలో
గ్యాంగ్ స్టర్ గా ఒకే ఒక్క సినిమా అనుభవమున్న ఆయుష్ తీరం చేరాడా, మునిగాడా అన్నదే పాయింటు.
ఆయుష్ ది ప్రధాన పాత్ర. పల్లె నుంచి
ఉపాధి వెతుక్కుంటూ పుణె చేరి అక్కడ సంఘ విద్రోహక శక్తులతో తలపడి, తానే సంఘ విద్రోహక శక్తిగా మారే పాత్ర.
రాహుల్యాగా ఈ పాత్రలో నటించడానికి మరాఠీ వొరిజినల్లో నటించిన రెండు సినిమాల
అనుభవమున్న ఓం భూట్కార్ రిఫరెన్స్ ఎలాగూ వుంది, మంజ్రేకర్
గైడెన్స్ కూడా వుంది. ఈ రెండిటినీ పాత్రలో తనని తీర్చిదిద్దుకోవడానికి వినియోగించుకున్నాడు.
కమర్షియల్ నటన కంటే రియలిస్టిక్ నటనకి ఎక్కువ స్కిల్స్ అవసరం. దీనికి ఫిజికల్ గా, ఎమోషనల్ గా పూర్తి మేకోవర్ తో - పది సినిమాల అనుభవమున్న హీరో లాగా
పవర్ఫుల్ గా నటించేశాడు రియలిస్టిక్ పాత్రని. నిస్సహాయుడైన పల్లెటూరి వాసి నుంచి
నగర వాసిగా, గ్యాంగ్ స్టర్ గా,
పోలీసుల్ని ఎదిరించే రెబెల్ గా పాత్ర ఎదుగుదల క్రమంలో భిన్న భావోద్వేగాల ప్రదర్శన ఈజీగా
చేసేశాడు. మధ్యలో హీరోయిన్ మహిమా మక్వానాతో రోమాంటిక్ యాంగిల్ కూడా. ఇలా సల్మాన్, మంజ్రేకర్ లు ఎక్కించిన లాంచీలో తీరం దాటేశాడు. ఇక బాలీవుడ్ యాక్షన్
హీరోగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించుకోవచ్చు. అమీర్ ఖాన్ కూడా 1985 లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ (యుగాంతం నుంచి యుగాంతం దాకా)
అనే సూపర్ హిట్ మ్యూజికల్ రోమాంటిక్ డ్రామాతో ప్రవేశించి,
రెండో సినిమా ‘రాఖ్’ (బూడిద) అనే
రియలిస్టిక్ లో నటించి జాతీయ అవార్డు పొందాడు.
మరాఠీలో ఉపేంద్ర లిమాయే నటించిన ఇన్స్
పెక్టర్ పాత్ర సల్మాన్ నటించాడు. అదే ఉపేంద్ర ఈ హిందీ రీమేక్ లో గ్యాంగ్ స్టర్ నాన్యా
భాయ్ గా నటించాడు. ఇది మరాఠీ పాత్రే. కానీ సల్మాన్ సిక్కు పాత్రగా మార్చాడు. హిందీ
సినిమాల్లో సీరియస్ సిక్కు పాత్రల్ని చూసి చూసి బోరు కొట్టేసే పరిస్థితి వచ్చింది.
సిక్కులు హాస్య ప్రియులు కూడా. ఒకప్పుడు హిందీ సినిమాల్లో హాస్యం గానే సిక్కు
పాత్రలుండేవి. సర్దార్జీ జోకులని పుస్తకాలు కూడా వున్నాయి. ప్రసిద్ధ జర్నలిస్టు
ఖుష్వంత్ సింగ్ శాంటా-బాంటా అనే రెండు తెలివి తక్కువ సిక్కు క్యారక్టర్లని సృష్టించి, అదే పనిగా సెటైర్లు రాసేవాడు. 1980లో ఫిరోజ్ ఖాన్ సూపర్ హిట్ ‘ఖుర్బానీ’ లో ‘గబ్బర్ సింగ్’ అమ్జాద్ ఖాన్, క్యారట్ నమిలే ఇన్స్ పెక్టర్ గా జంటిల్
మాన్ హాస్యంతో లాండ్ మార్క్ పాత్రగా చేసి పెట్టాడు. అదే అమ్జాద్ ఖాన్ 1980 లోనే ‘లవ్ స్టోరీ’ లో మంద బుద్ధి కానిస్టేబుల్ గా చేసిన
కామెడీ మర్చిపోలేరు.
సల్మాన్ సిక్కు ఇన్స్ పెక్టర్ కి ఇలా
కాస్త కామిక్ టచ్ వుండాల్సింది. బావ బావమరుదులిద్దరూ సినిమాని యమ సీరియస్ చేసేస్తే
ఎలా. ఓపెనింగ్స్ 4.5 కోట్లే వచ్చాయి. దీని ముందు జాన్ అబ్రహాం మతిమాలిన మాస్ ‘సత్యమేవ జయతే 2’ కి 3.6 కోట్లు మాత్రమే వచ్చాయిగా అని సంతోషించాలేమో.
‘నేనూ మహారాష్ట్ర
లోనే పుట్టాను. కానీ నీలాగా గూండాని కాలేదు, గూండాలకి బాబు
నయ్యాను -పోలీస్ వాలా’ ...’నువ్వు
పుణెకి కొత్త భాయ్ వి, నేను నీ కంటే ముందే హిందూస్తాన్ కే
భాయ్ ని’ ... ‘ఎక్కడెక్కడ సర్దారో
అక్కడక్కడ గురుద్వారా, లంగర్’… ‘సర్దార్ని
నేను, వాహేగురు ముందే తల వంచుతాను’ లాంటి
ఇమేజి సెట్టింగ్ సీరియస్ మాస్ డైలాగులున్నాయి. మానభంగమైన అమ్మాయి మీద సల్మాన్
తలపాగా తీసి కప్పే మెలోడ్రామా సీనొకటి.
పోటాపోటీగా షర్టులు విప్పి బావ
బావమరుదులు కొట్టుకునే సీను ఆయుష్ సిక్స్ ప్యాక్ చూపించడానికే. ఇంకెన్ని సార్లు ఇలా
సిక్స్ ప్యాక్ చూపిస్తారు? ప్యాంటు విప్పి తొడగొడితే సరైన
వీరత్వమవచ్చు. గ్యాంగ్ స్టర్స్ ని అంత
మొందించడానికి సల్మాన్ పాత్ర పన్నే వ్యూహం హిందీ సినిమాల్లో ఆల్రెడీ వచ్చేసిందే.
ఆయుష్ ని ప్రమోట్ చేయడానికి సల్మాన్ పాత్రని పరిమిత స్కోపుకి తగ్గించుకున్న దృశ్యం
కన్పిస్తోంది.
హీరోయిన్ మహిమా మక్వానా హిందీ
గ్యాంగ్ స్టర్ / మాఫియా సినిమాల్లోని రొటీన్ టెంప్లెట్ పాత్రే. గ్యాంగ్ స్టర్ ని
ప్రేమించి భంగపడే పాత్ర. రాజకీయాల్లో ప్రత్యర్ధుల కుటుంబాల్ని రచ్చకీడ్చే దుర్నీతి
వున్నట్టు మాఫియాల్లో వుండదు. మనం పరస్పరం కుటుంబాల జోలికి పోవద్దని మాట్లాడుకుంటారు.
ఇదే హిందీ సినిమాల్లోనూ చూస్తాం. మాఫియాలు బయట ఎన్ని అన్యాయాలు చేస్తారో, కుటుంబాల్ని అంతగా ప్రేమించే సన్నివేశాలు మాఫియా సినిమాల్లో అందుకే వుంటాయి.
అయితే మాఫియాల రణ నీతితో సురక్షిత కుటుంబ జీవితాల్ని అనుభవించే మాఫియాల ఇంటి
ఆడపడుచులు, తమ భర్తలకి జీవన్మరణ సమస్య ఎదురైనప్పుడు, ఎందుకని పోరాటానికి దిగరన్నది మాఫియా సినిమాల్లో హీరోయిన్ల పాత్రల్ని
చూస్తే ఎదురయ్యే ప్రశ్న. ఆయుష్ కోసం మహిమా పోరాటానికి దిగి,
అతడితో పాటే అంతమై వుంటే, ఆమె హీరోయిన్ పాత్రకి వాస్తవిక
దృక్పథాన్ని కల్పిస్తూ, టెంప్లెట్ చెర నుంచి బైట పడేసి నట్టయ్యేది.
ఒరిజినల్లో ఇన్స్ పెక్టర్ పాత్ర
పోషించిన ఉపేంద్ర లిమాయే, ఈ రీమేక్ లో గ్యాంగ్ స్టర్ నాన్యా
భాయ్ గా కన్పిస్తాడు. ఈ పాత్రని ఒరిజినల్లో దర్శకుడు ప్రవీణ్ టార్డే పోషించిన తీరు
చూస్తే ఉపేంద్ర తేలిపోతాడు. అదే ఒరిజినల్లో ఉపేంద్ర పోషించిన ఇన్స్ పెక్టర్ పాత్ర
చూస్తే సల్మాన్ తేలిపోతాడు. రీమేక్ అన్నాక తేలిపోవడం మామూలే.
సాంకేతికంగా జానర్ డిమాండ్ ని బట్టి
డార్క్ మూడ్ విజువల్స్ తో వుంది. కలర్
థీమ్ మాత్రం అతి డిమ్ గా కన్పిస్తుంది. కెమెరామాన్ కరణ్ రావత్ యాక్షన్
సీన్స్ కి కమర్షియల్ షాట్స్ తీయకుండా, బ్రేక్ లేకుండా తీవ్రత ఫ్లో
అవడానికి నార్మల్ టేకింగ్ తీసుకున్నాడు. క్లయిమాక్స్ లో రన్నింగ్ హీరో ఛేజ్ దృశ్యాలకి
నార్మల్ టేకింగ్ తో మంచి టెన్షన్ బిల్డప్ చేశాడు. అజయ్ దేవగణ్ నటించిన ప్రకాష్ ఝా ‘అపహరణ్’ (2005) లో యాక్షన్ దృశ్యాలు గుర్తొస్తాయి. ‘కేజీఎఫ్ చాప్టర్-1’ సంగీత దర్శకుడు రవీ బస్రూర్
బ్యాక్ గ్రౌండ్ స్కోరు మూవీ జానర్ మూడ్ ని ఎలివేట్ చేస్తూ వుంది. జానర్ ని బట్టి
బ్యాక్ గ్రౌండ్ స్కోరు సృష్టించడం అరుదు. తెలుగులో అన్ని సినిమాలకీ ఒకటే దరువు.
ఇరవై ఏళ్ళుగా దర్శకుడుగా వున్న 30 సినిమాల
మహేష్ మంజ్రేకర్ అవుట్ డేటెడ్ అవకుండా మేకింగ్ చేశాడు. కాకపోతే ఒరిజినల్లో వున్న
అసలు కాన్సెప్ట్ ని మిస్సయ్యాడు.
‘ముల్షీ పాటర్న్’ మరాఠీ
ఒరిజినల్ ని రైతు ఉద్యమం లేని 2018 లో నిర్మించారు. అయినా నేటి రైతు
ఉద్యమం దృష్ట్యా ఇది ఇప్పటికీ సమకాలీనంగా వుంది కాన్సెప్ట్ తో. మంజ్రేకర్ -
సల్మాన్ ద్వయం నేటి సంచలన రైతు ఉద్యమకాల నేపథ్యంలో రీమేక్ విడుదల చేస్తూ
ఒరిజినల్లోని కాన్సెప్ట్ నే మిస్సయ్యారు. లేకపోతే రైతు ఉద్యమం ప్రతిబింబించే బలంతో
సమకాలీనంగా వుండేది. ప్రేక్షక బలాన్నీ పెంచుకునేది.
ఇన్స్
పెక్టర్ రాజ్ వీర్ సింగ్ గా సల్మాన్ వాయిసోవర్ తో ఈ రియలిస్టిక్ ప్రారంభమవుతుంది. పట్టణ, నగర శివార్లలో బలవంతులు బొటాబోటీ ధరలకి రైతుల పొలాలు లాక్కుని
బలపడుతున్నారనీ చెబుతూ, పొలాలు అమ్ముకున్న రైతులు ఆ డబ్బు
నిలుపుకోలేక నగరాలకి వెళ్ళి కూలీలుగా మారుతున్నారనీ, అలాటి
ఒక కుటుంబ కథే ఇదనీ స్టాంపు వేశాక- కథా నాయకుడు రాహుల్యా కథ ప్రారంభమవుతుంది.
ఫస్టాఫ్ లో ఇదంతా బాలీవుడ్ గ్యాంగ్ స్టర్ / మాఫియా రెగ్యులర్ టెంప్లెట్ లోనే
రొటీన్ గా వుంటుంది.
అయితే ఒరిజినల్లో ఇది మల్టీపుల్
ఫ్లాష్ బ్యాకుల్లో వుంటుంది. మంజ్రేకర్ దీన్ని ఎత్తేసి లీనియర్ కథ చేశాడు.
రెండిట్లో విషయం మాత్రం అదే. విషయం లేనప్పుడు కథని నిలబెట్టడానికి మల్టీపుల్
ఫ్లాష్ బ్యాకులతో మభ్య పెట్టకూడ దంటాడు సిడ్ ఫీల్డ్. ఒరిజినల్లో మభ్య పెట్టడమే
వుంది. రీమేక్ లో మంజ్రేకర్ మభ్యపెట్టకుండా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు ఎత్తేసి, సీదా కథగా సాపు చేసి ఇస్త్రీ చేసినా అదే ఫలితం. విషయ లేమితో విలవిల.
ఎన్నిసార్లు ఈ టెంప్లెట్ నే చూడలేదు. మొన్న పూరీ జగన్నాథ్ తనయుడి ‘రోమాంటిక్’ లోనూ మాఫియాగా మారే క్రమం ఈ టెంప్లెట్టే.
టెంప్లెట్ లో వరసగా ఎబిసీడీలు : ఏ -
తండ్రి పొలం అమ్ముకుని దెబ్బతిన్నాక కుటుంబంతో పుణె వెళ్ళి కూరగాయల మార్కెట్లో కూలీగా
తండ్రితో బాటు చేరతాడు రాహుల్యా, బి - అక్కడ కార్పొరేటర్ అనుచరులని
కొట్టి జైలుకి పోతాడు రాహుల్యా, సి- జైల్లో కార్పొరేటర్
అనుచరుల్ని కొట్టి గ్యాంగ్ స్టర్ నాన్యా దృష్టిలో పడతాడు రాహుల్యా, డి- నాన్యా బెయిలు మీద విడిపిస్తే కార్పొరేటర్ ని చంపి మళ్ళీ జైలుకి
పోతాడు రాహుల్యా, ఎఫ్ - మళ్ళీ నాన్యా బెయిలు మీద విడిపిస్తే
నాన్యాని చంపేసి అతడి స్థానంలో గ్యాంగ్ స్టర్ అవుతాడు రాహుల్యా... ఈ టెంప్లెట్ తోనే
ఫస్టాఫ్ లో గ్యాంగ్ స్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యే కథ వుంటుంది. ఇతణ్ణి అదుపు
చేయాలనుకుంటున్న ఇన్స్ పెక్టర్ రాజ్ వీర్ కీ, రాహుల్యాకీ ఫైట్ సీను ఇంటర్వెల్ గా వుంటుంది.
ఇంకో రెండు గ్యాంగ్ స్టర్
గ్రూపులుంటాయి. ఇక ఈ మొత్తం అందర్నీ రూపు మాపడానికి రాజ్ వీర్ వాళ్ళ ఇగోలతో
వాళ్ళల్లో వాళ్ళకే తంపులు పెట్టి ఆడుకునే ఆట సెకండాఫ్. ఇక్కడ కథ ఎటూ వెళ్ళకుండా
అక్కడక్కడే తిరుగుతూంటుంది. ఇంటర్వెల్ ఫైట్ సీను తర్వాత కథ సెకండాఫ్ సిండ్రోమ్ లో
పడి మొరాయిస్తున్నట్టు వుంటుంది. ఇక క్లయిమాక్స్ లోనే శత్రు గ్యాంగ్ తో రాహుల్యా
యాక్షన్ సీనుతో వూపందుకుని ముగుస్తుంది. ఈ ముగింపు వర్మ ‘కంపెనీ’ మార్కు ముగింపు కావడంతో షాకింగ్ గా ఏమీ వుండదు. ఒక పిల్ల వాడు వచ్చేసి
రాహుల్యాని అకస్మాత్తుగా కాల్చి చంపి కథ ముగించడం.
మరాఠీ హిట్ ‘సైరత్’ ముగింపు లాగా - రక్తపు మడుగులో తల్లిదండ్రుల శవాల్ని చూసిన పిల్లవాడు
రక్తపు అడుగుజాడల్ని సృష్టిస్తూ వెళ్ళిపోయే మరపురాని క్లోజింగ్ ఇమేజిలా
వుంటుందనుకుని – ఇలా పిల్లవాడితో చంపించినట్టుంది మరాఠీ ‘ముల్షీ
పాటర్న్’ లో.
మంజ్రేకర్ దాన్నే తీసుకోవడంతో ముగింపు
వర్కౌట్ కాలేదు. ‘కంపెనీ’ లో ఈ క్లాసిక్
ముగింపు చూడని ప్రేక్షకులకి బాగానే వుండొచ్చు. ‘కంపెనీ’ కథా క్రమంలో మనం పూర్తిగా మర్చిపోయే విజయ్ రాజ్,
ముగింపు చివరి క్షణంలో మెరుపులా అనూహ్యంగా ప్రత్యక్షమై, అజయ్
దేవగణ్ ని షూట్ చేసి చంపి- షాకింగ్ ముగింపు నిస్తాడు. కథా క్రమంలో విజయ్ రాజ్ ని
మనం ఎక్కడో పూర్తిగా మర్చిపోయేలా చేసిన వర్మ నేర్పు వల్ల, ఈ
మాస్టర్ స్ట్రోక్ సాధ్య పడింది.
ఇదలా వుంచితే, అసలు మరాఠీ ఒరిజినల్ కాన్సెప్ట్
ఏమిటి? పొలాలు అమ్ముకుని పతనమవుతున్న రైతులకి కనువిప్పు కల్గించడం.
రేపు పార్లమెంటులో రద్దు కాబోతున్న మూడు రైతు చట్టాల్లో వ్యవసాయం కార్పొరేట్ల వశమై
రైతులు వాళ్ళ పొలాల్లో వాళ్ళే కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితి సరే, చట్టాలు రాకముందు రైతులు చేస్తోందేమిటి? పొలాలు అమ్ముకుని
కూలీలుగా వలస వెళ్ళడం. మరాఠీ ఒరిజినల్ ఈ వైఖరిని ఖండిస్తోంది. మంజ్రేకర్ దీన్ని టచ్
చేయకుండా ప్రాణంలేని గ్యాంగ్ స్టర్ కథ చేశాడు.
చివరికి రాహుల్యా చనిపోయాక, తండ్రి పడీ పడీ పిచ్చినవ్వు నవ్వుతాడు. నా కొడుకు చచ్చి పోయాడు కాబట్టి ఇక
గ్యాంగ్ స్టర్ గా వుండడూ - అని. విషాదం. అయితే
క్లోజింగ్ షాట్ టాప్ యాంగిల్లో, వాన జల్లు పడకుండా రాహుల్యా శవానికి
జనం గొడుగులు పడుతున్నట్టు వుంటుంది. ఇలాటి కథ ఇక కోరుకో వద్దని చెప్పకుండా, గ్యాంగ్ స్టర్ ని గ్లోరిఫై చేస్తున్నట్టు వుంది గొడుగులు పట్టడం ...
(మరాఠీ ఒరిజినల్ కూడా చూడాల్సి రావడం వల్ల రివ్యూ ఆలస్యం)
—సికిందర్