రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, జనవరి 2021, శనివారం

1007 : రివ్యూ

ఒరు పక్క కథై (తమిళం) 
రచన - దర్శకత్వం : బాలాజీ తరణీ తరన్ 
తారాగణం : కాళీదాస్ జయరాం, మేఘా ఆకాష్, చంద్రమౌళి, జీవా రవి 
సంగీతం : గోవింద్ వసంత్,  ఛాయాగ్రహణం : సి. ప్రేమ్ కుమార్ 
నిర్మాణం : వాసన్ న విజువల్ వెంచర్స్ 
విడుదల : జీ 5

***
    మిళ దర్శకుడు బాలాజీ తరణీ తరన్ విచిత్ర కథలు తీసుకుంటాడు. 2012 లో విజయ్ సేతుపతి క్రికెట్ బంతి తగిలి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కి లోనయ్యే నడువల కొంజమ్ పక్కత కానోమ్ కథ, 2018 లో విజయ్ సేతుపతి ఆత్మ స్టేజి నటుల్నిఆవహించే సీతకతి కథ, 2020 లో కన్యగానే వుండి మేఘా ఆకాశ్ గర్భవతయ్యే ఒరు పక్క కథై. చివరిది 2014 లో విడుదల కావాల్సింది. బిజినెస్ అవక ఆగిపోయింది. ఇప్పుడు ఓటీటీ పుణ్యమాని జీ5 లో విడుదలయ్యింది. ఆరేళ్ళ తర్వాత కథకి తీసుకున్న పాయింటు, మేకింగ్ అన్నీ తాజాగా వున్నాయి. మరి 2014 లో విడుదల ఎందుకు కాలేదన్నదానికి కారణాలు ఈ కింద వెతుకుదాం...

కథ
శరవణన్ (కాళీదాస్ జయరాం), మీరా (మేఘా ఆకాష్) కాలేజీ స్టూడెంట్స్. సౌమ్యంగా  వుండే మధ్యతరగతి కుటుంబాలు. ఇద్దరి ఇళ్ళల్లో ఇద్దరి ప్రేమకి ఆమోదం వుంటుంది. మీరాకి ఒక సమస్య ఎదురవవుతుంది. నెలసరి అవదు. రెండు రోజులు, నాల్గు రోజులు, ఆరు రోజులు దాటినా అవదు. తల్లికి చెబుతూంటుంది. తల్లికేమీ అర్ధంగాదు. డాక్టర్ దగ్గరికి తీసికెళ్తుంది. డాక్టర్ పరీక్షించి గర్భవతని చెప్తుంది. షాక్ తింటారు తల్లిదండ్రులు. మీరా తండ్రి శరవణన్ ని ఇంటికి పిలిపిస్తాడు. విషయం చెప్పకుండా శరవణన్ ని నమ్మక ద్రోహిలా సీరియస్ గా చూస్తూంటారు మీరా తల్లిదండ్రులు. ఎందుకు సీరియస్ గా చూస్తున్నారో అర్ధంగాదు శరవణన్ కి. అప్పుడు చెప్తాడు తండ్రి. షాక్ తింటాడు శరవణన్. గదిలో కెళ్ళి మీరాని చూస్తాడు. మనం ఏమీ చేయకుండానే ఇదెలా జరిగిందని అడుగుతాడు. అదే నాకూ అర్ధం గావడం లేదంటుంది. ఇక మీరా తల్లిదండ్రులు శరవణన్ తల్లిదండ్రులతో పెళ్లి చేసేద్దామంటారు. కొంత తర్జన భర్జన తర్వాత పెళ్లి ఖాయం చేసుకుంటారు. అసలు జరిగింది నిజమేనా అని శరవణన్, మీరాని ఇద్దరు డాక్టర్లకి చూపించినా గర్భమేనని చెప్తారు. అప్పుడు డాక్టర్ తో తను వర్జిన్ నే నని  మీరా అనేసరికి, డాక్టర్ కంగుతిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపిస్తుంది. అక్కడ డాక్టర్ల బృందం పరీక్షించి, మీరా కన్యగానే గర్భం ధరించిందని తేలుస్తారు. ఇదెలా జరిగిందనే ప్రశ్నకి జవాబు మిగతా ఒరు పక్క కథై -ఒక పేజీ కథలో చూడొచ్చు... 

ఎలా నటించారు

      కాళీదాస్ జయరాం, మేఘా ఆకాష్ ఇద్దరూ ఫ్రెష్ గా కన్పిస్తారు. మంచి ఎక్స్ ప్రెషన్స్ చూపిస్తారు. ఇద్దరి తల్లిదండ్రుల పాత్రల్లో నటీనటులు కూడా నీటుగా వుంటారు. మెలోడ్రామాలు, ఏడ్పులు, దూషణలు లేని సున్నిత పాత్రలు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులున్నారు. వీళ్ళు తప్ప ఇంకెవరూ వినోదాన్ని పంచరు. సీరియస్ పాత్రలు. సీరియస్ మూడ్ లో సన్నివేశాలు. నటనలు బావున్నా పాత్ర చిత్రణలు బలహీనం.

సాంకేతికంగా చిత్రీకరణ బావుంది. చెన్నైలో చిత్రీకరణ. హేండ్ హెల్డ్ సింగిల్ షాట్ సీన్లు, పాత్రల సమన్వయంతో పుల్ బ్యాక్ షాట్లు గమనించ దగ్గవి. ఏ ఇల్లు చూపించినా పింక్ కలర్ వేశారు. కానీ పింక్ బ్యాక్ గ్రౌండ్ చూపించడాని కిది రోమాంటిక్ డ్రామా కాదు, పూర్తిగా రోమాంటిక్ డ్రామా కూడా కాదు. సెకండాఫ్ లో రెండు మాంటేజీ పాటలున్నాయి. మేకింగ్ బావుంది, కథకి మేకప్ బాగాలేదు.

ఎలావుంది కథ
     వర్జిన్ బర్త్ ఐడియా తీసుకున్నాడు దర్శకుడు. కొన్ని రకాల చేపల్లో, ఉభయ చరాల్లో, సరీసృపాల్లో, పక్షుల్లో, క్షీరదాలు కాని అన్ని ప్రధాన సకశేరుకాల్లో ఈ దృష్టాంతం వుంటుందని వివరిస్తాడు. పురుష కణం అవసరం లేకుండానే స్త్రీ అండం దానికదే పొదుగుకుని సంతానోత్పత్తి చేసుకునే ప్రక్రియ. దీనికి కొంత సైన్సుని వివరిస్తాడు డాక్టర్ పాత్రల చేత. పార్థెనో జెనెసిస్ ఈ ప్రక్రియ పేరు. పురుష కణాల్లో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోము లుంటాయి. స్త్రీ కణాల్లో రెండూ ఎక్స్ క్రోమోజోములే వుంటాయి. లైంగిక సంపర్కం ద్వారా పురుష క్రోమోజోముల్లో ఎక్స్ క్రోమోజోము స్త్రీ క్రోమోజోములతో కలిస్తే ఆడ పిల్ల పుడుతుంది, వై క్రోమోజోము కలిస్తే మగ పిల్లాడు పుడతాడు. ఇలాకాక లైంగిక సంపర్కం లేకుండానే స్త్రీ అండం దాని కదే పొదుగుకుని గర్భానికి దారితీయొచ్చు. దీన్నే పార్థెనో జెనెసిస్ అంటారు. మనుషుల విషయాని కొస్తే ఇది కన్యలో జరిగితే, కన్నెగా వుండగానే గర్భవతవుతుంది. ఈ రెండో వూహే కథగా చేశాడు దర్శకుడు.

తర్వాత దీన్ని మతాచార్యుల పాత్రల చేత చెప్పిస్తాడు. ఏసు క్రీస్తుకి జన్మనిచ్చిన కన్నె మేరీ మాత గురించి. కర్ణుడ్నీ, పాండవుల్నీ కన్న కుంతీ దేవి గురించీ. ఇలా తండ్రి లేకుండా పుట్టిన బిడ్డ దేవుడి బిడ్డవుతుందని చెప్తారు. మానవ జాతిలో ఇలాటి ఒక కేసు 1950 లో ఇంగ్లాండులో జరిగిందనీ, ఆడ పిల్ల పుట్టిందనీ డాక్టర్ల చేత చెప్పిస్తాడు దర్శకుడు. ఈ ఉదాహరణే తీసుకుని కథ చేశాడు. 

అయితే పార్థెనో జెనెసిస్ గురించి గూగుల్ చేస్తే, మరికొన్ని విషయాలు తెలుస్తాయి. 1950 లో ఇంగ్లాండు డాక్టర్లు ఈ అనుమానమున్న స్త్రీలు రిపోర్టు చేయాలని ఆహ్వానిస్తే, 19  మంది వివాహితలు ముందు కొచ్చి, తమకి పుట్టిన ఆడపిల్లలు పార్థెనో జెనెసిస్ ద్వారా జన్మించి వుంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే వివాహితల్లో దీన్ని డాక్టర్లు నిర్ధారించడం సాధ్యపడలేదు. భర్తల ద్వారా కూడా ఆడపిల్లలు జన్మించి వుండొచ్చు. కన్యల్లో జరిగితే పార్థెనో జెనెసిస్ ని కచ్చితంగా నిర్ధారించవచ్చు. రిపోర్టు చేసిన వాళ్ళల్లో ఒక్క మిసెస్ ఆల్ఫా అనే వివాహిత విషయంలో సాధ్యమై వుండొచ్చని అభిప్రాయపడ్డారు. స్త్రీలలో స్వయంగా అండ ఫలదీకరణ జరిగి పుట్టే ఆడపిల్లకి తల్లి జీన్స్ తప్ప, తండ్రి జీన్స్ వుండవు. పోలికలు కూడా తల్లితో కలవవు. ఈవిడ కేసునే దర్శకుడు పేరు చెప్పకుండా ఉదాహరణగా చెప్పి వుండొచ్చు. అయితే దర్శకుడి కథలోలాగా కన్యల్లో జరిగిన కేసులు ఇప్పటికీ లేవు. 

కన్యలో పార్థెనో జెనెసిస్ జరిగితే ఆడపిల్లే పుడుతుంది. కారణం పురుష సంపర్కం లేదు కాబట్టి. పురుష సంపర్కముంటేనే, వై క్రోమోజోము కలిస్తేనే మగ పిల్లాడు పుడతాడు. దర్శకుడు చెప్పిన కన్నె మేరీ మాతకీ, కుంతి కీ మగ పిల్లలే పుట్టారు. ఇది పార్థెనో జెనెసిస్సా? కాదు. సైన్సు కంటే ముందు, సైన్సు నోరెత్తకుండా మతాలు ఎంత పకడ్బందీగా లాజిక్ చేసేశాయో గమనించ వచ్చు. మేరీ మాతకీ, కుంతికీ ఆడ సంతానమే కలిగి వుంటే, అది పార్థెనో జెనెసిస్ అని తేల్చేసేది సైన్సు. పార్థెనో జెనెసిస్ అనే అవకాశం లేకుండా, ఇద్దరికీ మగ పిల్లలు జన్మించడంతో అవి దైవ ఘటనలయ్యాయి. 

    దర్శకుడు 1950 కేసు ఉదాహరణ తీసుకుని తయారుచేసుకున్న కన్నె హీరోయిన్ పాత్రకి ఆడపిల్లనే కల్పించాడు. కాబట్టి దీన్ని దైవ ఘటనగా  కాక, పార్థెనో జెనెసిస్ గానే చూడాలి. కానీ తద్విరుద్ధంగా మతాచార్యుల చేత దీన్ని దైవ ఘటనగా చేసి, పుట్టిన ఆడ పిల్లని దేవుడి బిడ్డగా, బాల దేవతగా చేసి, మొత్తం మత భక్తి కథ చేసేశాడు. ఇలా పార్థెనో జెనెసిస్ గురించి ప్రేక్షకులకి తప్పుడు సమాచార మిచ్చినట్టయ్యింది.

***

    పార్థెనో జెనెసిస్ వివాహితల్లో తెలియకుండానే జరగవచ్చు. ఆడపిల్లలే పుడుతూ పోవచ్చు. అయితే పైన పేర్కొన్న 1950 లో జరిగిన కేసు తప్ప ఇంకోటి లేదు. 1995లో  ఇంగ్లాండు లోనే మూడేళ్ళ బాలుడిలో తండ్రి జీన్స్ లేవు. ఇది దైవ ఘటనేనా అనుకుని డాక్టర్లు కంగారు పడి పరీక్షలు జరిపితే, అతడి రక్తంలో వై క్రోముజోము లేదు. ఆడపిల్లలకున్నట్టు రెండూ ఎక్స్ క్రోమోజోములే వున్నాయి. అంటే పార్థెనో జెనెసిస్ ద్వారా జన్మించాడా? ఎలా సాధ్యం? అప్పుడు తెలిసింది : ముందు తల్లి అండం దానికదే పొదుగుకోవడం జరుగుతూంటే, తండ్రి వీర్య కణం వచ్చేసి ఆ ఫలదీకరణ ప్రక్రియని కొనసాగిస్తూ, ఆ క్రోమోజోముల సంక్షోభంలో పాసివ్ పాత్ర వహించడం జరిగిందని. అంటే ఇలా పుడితే ఇది కూడా పురుష సంపర్కం వల్లే జరుగుతుందన్న మాట. కనుక ఆ బాలుడు దేవుడి బిడ్డ అయ్యే అవకాశం లేదు. దేవుడు పంపిన అవతార పురుషుడవడు. ఇలా చూసినా కూడా మేరీ మాత, కుంతీ దేవీల దైవ ఘటనలు సేఫ్ అయిపోతాయి. 

    చివరగా, 1950 లో మిసెస్ ఆల్ఫా కేసులో పుట్టిన కూతురు కూడా తల్లిలాగే పార్థెనో జెనెసిస్ ద్వారా కూతుళ్లని కని వుండొచ్చనీ, ఆధునిక డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చనీ డాక్టర్లు అంటున్నారు. ఇక్కడే సినిమా కథలో హీరోయిన్ పాత్రకి పుట్టిన కూతురి భావి జీవితం ప్రభావితమవొచ్చు. ఆమె పెళ్లి ఒక సమస్యగా మారవచ్చు. ఈ కథలో ఇంత విషయముంది, డ్రామా వుంది. కానీ మతం దగ్గరే కుదించడంతో కథ దాని సహజ వికాసం పొందకుండా పోయింది.

***

    ఈ సరికొత్త సైన్స్ ఫిక్షన్ కాగల కథని, మతాచార్యుల తప్పుడు భాష్యాలతో మత విశ్వాసాల చట్రంలో బిగించేసి, భక్తి సినిమా చూపించాడు దర్శకుడు. కన్నె హీరోయిన్ పాత్రకి పుట్టిన పిల్లని, మతాచార్యులు బాల దేవతగా ప్రకటించి, ఆలయంలో పెట్టేసుకోవడం, ఈ సంచలన వార్తకి-  భక్తజన సందోహం దర్శనాలకి తరలిరావడం, చిన్నారి కూతుర్ని విడిపించు కోవడానికి హీరో హీరోయిన్లూ, వాళ్ళ తల్లిదండ్రులూ కోర్టు కెక్కడం వగైరా. 

కోర్టు కూడా దీన్నొక వైద్య దృష్టాంతంగా చూడదు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా మతాచార్యులు బిడ్డని తీసికెళ్ళడం నేరమని
, మతాచార్యుల మీద విచారణ వేయాలని, బిడ్డ తానేం అవ్వాలో మైనారిటీ తీరాక నిర్ణయించుకుంటుందనీ తీర్పు చెప్తుంది. గాయపడ్డ బిడ్డకి రక్తదానం చేసిన వాళ్ళల్లో అన్నీ మతాల వాళ్ళూ వున్నారనీ, ఇప్పుడు బిడ్డని ఏ మత దైవంగా కొలుస్తారనీ ప్రశ్నిస్తుంది.
    
పార్థెనో జెనెసిస్ కేసే అరుదైన కేసుల్లో కెల్లా అరుదైన కేసవుతుంది. ప్రపంచ శాస్త్ర వేత్తల దృష్టిలో పడితే వాళ్ళకి బోలెడు పని కల్పిస్తుంది. దర్శకుడు ఎస్ శంకర్ కి ఈ కథ ఆలోచన వచ్చివుంటే, దీన్నొక సైన్స్ ఫిక్షన్ హై కాన్సెప్ట్ యాక్షన్ మూవీ చేసేవాడు. ఇలా పుట్టిన కూతుర్నే హీరోయిన్ గా చేసి, ఆమెకి వినూత్న ప్రత్యేకతలు కల్పించి హల్చల్ చేయించే వాడు. 

స్క్రీన్ ప్లే మాట  

   కథనం డాక్యుమెంటరీలా వుంది. ప్రధాన పాత్ర లేదు. రెండు కుటుంబాల్లో అన్ని పాత్రలకీ కలిపి కుటుంబ సమస్య. సమస్యతో ఆందోళనే తప్ప సంఘర్షణ లేదు. చట్టం పూనుకుని పరిష్కరిస్తే సుఖాంతం. సినిమా అన్నాక కథ అయి వుండాలి. ఇది నిర్మాతకి పదహారణాల వైట్ ఎలిఫెంట్ లాంటి గాథయింది. జానర్ ఫస్టాఫ్ రోమాంటిక్ డ్రామాలా వుంటుంది. సెకండాఫ్ స్పిరిచ్యువల్ జానరై పోతుంది. ఇంటర్వెల్ కే కథ అయిపోయి సెకండాఫ్ కి మరో కథ ఎత్తుకుంటుంది. ఇలా సెకండాఫ్ సిండ్రోమ్ ప్రాబ్లం కూడా. దీనికి కమర్షియల్ సినిమా వ్యాపార విలువలు లేవు. చలన చిత్రోత్సవాల్లో పాల్గొని అవార్డులు పొందే సమాంతర సినిమా విలువలు కూడా లేవు. జరిగిన ఒక విచిత్రానికి మత విశ్వాసాల కథ చేసినప్పుడిది మరో భక్తి సినిమా టెంప్లెట్ అయిపోయింది. తమిళనాట మూఢ భక్తిని సొమ్ముచేసుకునే మార్కెట్ యాస్పెక్ట్ కావచ్చు. ఇది కూడా విఫలమైంది. కొత్త హీరో హీరోయిన్ల తొలి సినిమా కలలు ములయార్ నదిలో ఆరేళ్లు మునక లేశాయి. 
    
విచిత్రాలు జరిగినప్పుడు అవి  సైన్సుకి పరిశోధనాంశాలు కాకుండా, మతానికి ఆరాధ్య అంశాలైనప్పుడు సృష్టి రహస్యాలు బయటపడవు, విచిత్ర కథలు కొత్త సంగతులు చెప్పవు. మానవాళి ఎక్కడేసిన గొంగళిలా సోమరిగా పడుంటుంది. ఈ కథలో జడ్జి ఒక మంచి మాట చెప్తాడు : మత విశ్వాసాలు వేరు, మూఢ విశ్వాసాలు వేరు. ఇది దర్శకుడికే చెప్పినట్టుంది. తను మూఢుడు కాదన్పించు కోవడానికి ఒక సబ్ ప్లాట్ వేసి సేఫ్ అయిపోయాడు దర్శకుడు. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులతో మూఢ నమ్మకాల మీద వేసిన సెటైర్లు మాత్రం చాలా ఫన్నీగా వున్నాయి. బాగానే నవ్వు తెప్పిస్తాయి.

                                                                            ***

     దీని సైన్స్ ఫిక్షన్ స్వభావాన్ని కాసేపు పక్కన బెట్టి, ప్రేమ కథ గానే చూద్దాం. శరవణన్, మీరాలు ఆల్రెడీ ప్రేమలో వుండి ఇద్దరి కుటుంబాల్లో ఆమోదం వుంటుంది. ఇలా పాత్రల పరిచయం, నేపథ్యం ఏర్పాటయి పోయింది. ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కావాలి. దీనికి మీరా నెలసరి పాయింటు వుంటుంది. ఇది రెండు రోజులు, నాల్గు రోజులు, ఆరు రోజులకి చేరి, వైద్య పరీక్షకి దారి తీసి, గర్భవతని తేలడంతో సమస్య ఏర్పాటవుతుంది. ఇది సమస్యా అంటే కాదు. సమస్య కన్యాత్వంతో గర్భం ధరించడం గురించి. కథ దీని గురించి. ప్రశ్నలు దీని గురించి. దీన్ని ముందుకు తీసుకు రాక పోవడంతో మొదటి మలుపు అర్ధరహితమై పోయింది. 
   
ఈ మొదటి మలుపుకి రావడానికి నెలసరి సమస్యని పదేపదే ప్రస్తావించడంతో
, మొదటి మలుపు దేనిగురించి రాబోతోందో తెలిసిపోయేలా అయింది. నెలసరి రావడం లేదంటే గర్భం ధరించి వుంటుందని. ఇది నిజమైతే శరవణన్ కారణమై వుంటాడని. నెలసరి రాకపోవడానికి గర్భమే కారణం కాకపోతే, మెనోపాజ్ వచ్చేసి వుంటుందని. విశృంఖల జీవన శైలులతో పాతిక ముప్ఫై ఏళ్లకే ముట్లుడిగి మూలనబడుతున్న అమ్మాయిలున్నారు దేశంలో. మీరాది విశృంఖల జీవితం కాదు. కనుక శరవణన్ మీద ఫోకస్ అవుతోంది. ఇలా తర్వాత కథ కవసర పడని విషయాలతో మన మెదడు నిండిపోతుంది మొదటి ఇరవై ఐదు నిమిషాలూ. పనికిరాని విషయాలతో ప్రేక్షకుల మెదడు నింప నవసరం లేదు.

    ఈ మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ 1) ఇరవై ఐదు నిమిషాల్లోనే వస్తుంది, మంచిదే. అయితే నెలసరి రాని విషయం గురించి అన్నిసార్లు చెప్పకుండా, పది రోజులైనా రావడం లేదని ఒకే సారి రివీల్ చేసి - వెంటనే వైద్య పరీక్షలో గర్భమని చెప్పేస్తే - ఆ వెంటనే వర్జినే అని కూడా తేల్చేస్తే  -ఒక ఫ్లాష్ లో ఇది మొదటి మలుపుకి షాక్ వేల్యూతో వుండేది.

    వర్జిన్ గా గర్భమని అసలు పాయింటు చెప్పకుండా, కేవలం గర్భమని చెప్పడంతో అసలు సమస్య ఏర్పాటు కాలేదు. ఈ సమస్యని కూడా ఎదుర్కొనే ప్రధాన పాత్ర శరవణన్, మీరా ఇద్దరూ కాకుండా, వాళ్ళ తల్లిదండ్రులు కావడంతో, ఇది హీరో హీరోయిన్లు తమ సమస్యని తామెదుర్కో లేని, సంఘర్షించలేని, పరిష్కరించుకో లేని రోమాంటిక్ డ్రామా అయింది. రోమాంటిక్ డ్రామాలు హీరో హీరోయిన్ల స్వశక్తీకరణ చూపని బేలతనపు వ్యక్తీకరణలు. తర్వాత తల్లిదండ్రులు కూడా సమస్యతో సంఘర్షించక బాధలు పడే వరసగా మారడంతో, రోమాంటిక్ డ్రామా కాస్తా సినిమాకి పనికి రాని అగాథపు గాథయి పోయింది. ఈ గాథ కూడా సైన్సు పాఠాలతో డాక్యుమెంటరీలా వుంది.

    ఇక్కడొక ప్రధాన ప్రశ్న వస్తుంది. శరవణన్, మీరాలు శారీరకంగా కలవనప్పుడు, ఈ విషయం చెప్పుకుని ఎందుకు ఆ గర్భాన్ని ప్రశ్నించరు? మొదటి మలుపు సమస్య దీని మీదే వుండాలి. ఇదే కథాంశం కాబట్టి, పరిష్కరించాల్సిన పజిల్ కాబట్టి. నేను వర్జిన్ ని, ఈ ప్రెగ్నెన్సీ నాకార్ధం గావడం లేదని అనదు, నిందని తొలగించుకోవడానికి ఎదురు తిరగదు. తన క్యారక్టర్ ని కాపాడు కోవాలనుకోదు. కాలుజారి తప్పు చేసిన దానల్లే పెళ్ళికి రాజీపడి పోతుంది.

***

    పెళ్లి ఆలోచనకి ముందు అబార్షన్ చేయించాలనుకుంటారు. అప్పుడు అసలే బలహీనంగా వున్న మీరాకి అబార్షన్ వల్ల సమస్యలొస్తాయని డాక్టర్ అంటాడు. కానీ మీరాని చూస్తే బలంగా, గ్లామరస్ గా వుంటుంది. అసలు వర్జిన్ గర్భమని తేల్చేస్తే ఈ అబార్షన్ ప్రశ్న వచ్చేది కాదు. ఇదొక అనవసర ఫీడింగ్ ప్రేక్షకులకి. ఈ సీను కూడా బడ్జెట్ దండగ. తీసుకున్న ఐడియాకి చేసిన కథనమంతా బడ్జెట్ దండగ క్రియేటివ్ యాస్పెక్ట్. ఇందుకే బయ్యర్లు దండించారేమో. 
    
శరవణన్ కూడా తనతో శారీరక సంబంధం లేకుండా గర్భమెలా వచ్చిందని అనుమానించడు. ఆమెని అంత బలంగా నమ్ముతున్నాడనే అనుకున్నా కూడా, ఈ గర్భం ఒక పజిలే. ఆమెని గర్భం నిజమా కాదా నిర్ధారించుకోవడానికి డాక్టర్ల దగ్గర తిప్పుతాడే గానీ, చెప్పాల్సిన మాట చెప్పడు- షీ ఈజ్ వర్జిన్ అని. ఇదంతా కథ లేదనుకుని ఇంటర్వెల్ దాకా సాగదీయడానికి చేసిన ప్రయత్నం. ఇంటర్వెల్ కి ముందు చివరికి చెప్పాల్సిన మాట చెప్తుంది డాక్టర్ కి. మొదటి మలుపులో చెప్పాల్సిన మాట ఇంటర్వెల్ కి చెప్పడంతో ఇంత సేపూ నసతో నత్తనడక. ఈ స్టూడెంట్ పాత్రల క్యారక్టరైజేషన్ ఇలావుంది. 
    
మళ్ళీ నస ఏమిటంటే, వర్జిన్ అంటున్న మీరాని లేడీ డాక్టర్ ఒక నిమిషంలో వర్జినా కాదా తెలుసుకోవచ్చు. దీనికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రమ్మంటుంది. అక్కడ మీరా వున్న గదిలోకి డాక్టర్లు పోతూంటారు. తడవకి ఇద్దరు, ముగ్గురు చొప్పున సీరియస్ గా మొహాలు పెట్టుకుని, ఏదో జరిగి పోతోందన్నట్టు పదిమంది దాకా  పోతారు. వర్జిన్ టెస్టుకి ఇంత మంది డాక్టర్లా? ఆమెని వుంచుతారో, డాక్టర్లు కొట్లాడుకుని చంపేస్తారో?

***

    మొత్తానికి ఆమె వర్జిన్ మదర్ అని తేల్చాక, పార్థెనో జెనిక్ బిడ్డ పుట్టాక, సెకండాఫ్ మతం హైజాక్ చేస్తుంది పైన చెప్పుకున్నట్టుగా. దీంతో ప్రేమ కథ కూడా లేకుండా పోయింది. ప్రేమ కథతో చాలా ప్రశ్నలున్నాయి. వీటిని ఎదుర్కోకుండా ప్రేమికుల జీవితం లేదు. ఐదేళ్ల కథాకాలం గడిచి కూతురు దర్శినికి ఐదేళ్లు వచ్చేటప్పటికి, ఆలయ పూజార్లు తీసికెళ్లి ఆలయంలో దర్శనీయం చేస్తారు. ఈ లోగా శరవణన్, మీరాల చదువులేమయ్యాయో, ఉద్యోగాలేమయ్యాయో తెలీదు. ఎలావున్న క్యారక్టర్లు అలాగే వుంటాయి తల్లిదండ్రుల మీద ఆధారపడి. 
    
ఇదలా వుంచితే, కథ సంధించే ప్రశ్నల జోలికి కూడా పోలేదు. పార్థెనో జెనిక్ కూతురితో శరవణన్, మీరాల జీవితమెలా వుంటుంది? దర్శినికి మీరా తల్లేగానీ, శరవణన్ తండ్రి కాదు. పోనీ రెండో కాన్పుకైనా తండ్రి అన్పించుకుంటాడా అంటే అదీ నమ్మకం లేదు. రెండోసారి గర్భం కూడా పార్థెనో జెనెసిస్ అవదని చెప్పలేరు. ఇలా ఆమెకి పుట్టే ఆమె ఒకత్తి పిల్లలు పుట్టింటికి వంశాంకు రాలవుతారే తప్ప, మెట్టినింటికి కాదు. చాలా విచిత్ర పరిస్థితి. దీన్ని అత్తామామలెలా చూస్తారు? కోడలిగా ఒప్పుకుంటారా? ఎవరికైనా ఆమె కోడలు కాగలదా? తండ్రి కాలేని శరవణన్ ఎంతకాలం వుంటాడు? గిల్టీ ఫీలింగ్ మీరాని కూడా బాధించదా? రేపు పుట్టిన ఆడపిల్లల పరిస్థితి కూడా ఏమిటి? సమాజమెలా చూస్తుంది? గర్భాశయం తొలగించుకుంటే సమస్యలు తీరతాయా? ప్రేమ కోసం ఈ త్యాగాలు చేస్తారా? కలిసి వుంటారా, విడిపోతారా? పార్థెనో జెనెసిస్ వరమా, శిక్షా? పేజీ నిండా ప్రశ్నలు. కథకి చాలా పేజీలు కావాలి.

 సికిందర్   


3, జనవరి 2021, ఆదివారం

1006 : రివ్యూ!

      హేపీ కరోనా సీక్వెల్ న్యూ ఇయర్. 21 వ శతాబ్దపు 21 వ సంవత్సరం ఓటీటీ ఆయు ప్రమాణాన్ని ఇంకింత పెంచుతున్నట్టుంది. రోజుకి 9 వేల చొప్పున కొత్త చందాదార్లు చేరుతున్నారు. హిందీ తర్వాత తెలుగుకే డిమాండ్. డిమాండ్ కి తగ్గ సరఫరా లేదు. డిమాండ్ తగ్గట్టు కంటెంట్ లేదు. హిందీలో కంటెంట్ మారింది, పెరిగింది. మారిన కంటెంట్ తో సినిమాల్ని పునర్నిర్వచిస్తోంది బాలీఫుడ్. నిన్నటి సినిమా ఇవ్వాళ వుండడం లేదు. ఇవాళ్టి సినిమా రేపుండడం లేదు. ట్రెండ్ సెట్టర్స్ లేవు. ట్రెండ్ సెట్టర్స్ ని ఫాలో అయ్యే తామరతంపర మేకింగులు లేవు. దేనికదే యూనిక్ ఐడియా, దేనికదే యూనిక్ మోడల్. మూస చట్రాల్లేవు, రేసు చక్రాలే వున్నాయి. యూనిక్ మేకర్లదే మార్కెట్, యూనిక్ థింకర్లకే డిమాండ్. ప్రేక్షకులు యూనిక్ గా మారుతున్నారు. ఓటీటీ కంపెనీలు సినిమాలెలా వుండాలో నిర్ణయిస్తున్నాయి. క్లాస్ మాస్, ఏబీసీ సెంటర్ తరగతులు ఒకటయ్యాయి. ఒన్ నేషన్, ఒన్ సినిమా. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు వుంటుందో, థియేటర్లకి సాధారణ పరిస్థితులు నెలకొంటే  ఏమౌతుందో మాత్రం తెలీదు.  
    
        'కే వర్సెస్ ఏకే' (అనిల్ కపూర్ వర్సెస్ అనురాగ్ కశ్యప్) ఇలాటి వొక కిల్లర్ ఐడియా. నిజజీవితపు అనిల్ కపూర్, సినిమాలో కూడా నిజజీవితపు అనిల్ కపూరే. నిజజీవితపు దర్శకుడు అనురాగ్ కశ్యప్, సినిమాలోనూ నిజజీవితపు దర్శకుడు అనురాగ్ కశ్యపే. నిజజీవితపు అనిల్ కపూర్ కీ, నిజ జీవితపు అనురాగ్ కశ్యప్ కీ ఒకానొక సందర్భంలో కొట్టుకునే పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? ఇదీ సినిమాకి కల్పించిన కథ. ఈ కథతో ధైర్యం చేసింది దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే. ఇలాటి కథ తెలుగులో ఎవరైనా దర్శకుడు చెబితే ఏమవుతుందో వూహించాల్సిందే. 

     2003 లో అనురాగ్ ప్రారంభించిన ఆల్విన్ కాళీ చరణ్ నుంచి మధ్యలో తప్పుకున్నాడన్న కోపం అనిల్ మీద అనురాగ్ కి. రెండు దశాబ్దాలు కావొస్తున్నా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వలేదని కసి. ఇలాటి ఇద్దరూ ఒక ఈవెంట్ లో ప్రేక్షకులతో ఇంటరాక్షన్ సందర్భంగా భేటీ అయినప్పుడు, అనిల్ ని సూటిపోటి మాటలంటాడు అనురాగ్. ఇంకా నువ్వు హీరోవా, డాన్సు లేస్తావా, నువ్విప్పుడు అనిల్ అంకుల్ వి - అని దెప్పిపొడుస్తాడు. నేను సిగ్గూశరం లేని స్టార్ని అనేస్తాడు అనిల్. స్టార్ గొప్పోడా, డైరెక్టర్ గొప్పోడా ...ఇలా మాటామాటా పెరిగి గ్లాసులో నీళ్ళు అనిల్ మోహన కొట్టి పోతాడు అనురాగ్. ఇది వైరల్ అవుతుంది. బాలీవుడ్ అనురాగ్ ని బ్యాన్ చేస్తుంది. సినిమాలు చేజారిపోతాయి. అప్పుడొక అసిస్టెంట్ యోగితా బీహానీ ఒక ఐడియా వుందని చెప్తుంది. 

        ఐడియా ప్రకారం షూటింగులో వున్న అనిల్ దగ్గరికి ఫిలిమ్ సిటీ వెళ్తాడు అనురాగ్. దగ్గరికి రానివ్వరు. బయట కూర్చోబెడతారు. ఆ రోజు అనిల్ బర్త్ డే. మిగిలి పోయిన బర్త్ డే కేకు ముక్క తెచ్చి అనురాగ్ కి ఇంత పడేస్తారు. ఎలాగో అనిల్ ని పట్టుకుని అనిల్ కి బ్రేక్ నిచ్చే కిడ్నాప్ కథ విన్పించబోతాడు. నీ చెత్త కథ ఎవడ్రా వింటాడూ అని బూతులు తిడతాడు అనిల్ (సినిమా సాంతం అనురాగ్ ని పచ్చి బూతులు తిడుతూనే వుంటాడు). ఈ కథలో కిడ్నాపయ్యింది మీ రియల్ కూతురే, నేను కిడ్నాప్ చేశాను, తెల్లారేలోగా పది గంటల్లో ఎక్కడుందో మీరు తలుసుకుని విడిపించుకోవాలి- ఇదంతా యోగితా కెమెరాతో షూట్ చేస్తూంటుంది, ఈ సినిమా మీకూ నాకూ మంచి పేరు తెస్తుంది - అని స్క్రిప్టు చూపించి వివరిస్తాడు. అనిల్ కి ఇంకోదారి లేకుండా ఇరికించేస్తాడు. ఇక కూతురి కోసం పరుగులు దీస్తాడు అనిల్. వెంట అనురాగ్ వుంటాడు. కెమెరాతో షూట్ చేస్తూ యోగితా వుంటుంది. 
 
    ఇప్పుడు తెల్లారే లోగా అనిల్ కూతురు సోనమ్ కపూర్ ని కనుక్కోగలిగాడా? ఈ పరుగులో పడ్డ కష్టాలేమిటి? అవమానాలేమిటి? తెరమీద స్టార్ గా హీరోయిజంతో వుంటే, తెర వెనుక జీవితంలో ఇలాటి పరిస్థితిలో ఎలా వుంటాడు? ఏం చేస్తాడు? నిజ జీవితంలో సగటు మనిషేనా? జోకరేనా? ఇవన్నీ పరీక్షకి నిలబెడతాయి.

***

        ఇది మాక్యుమెంటరీ జానర్ సినిమా. అంటే నిజ వ్యక్తుల్ని, లేదా నిజ సంఘటనల్ని డాక్యుమెంటరీ చేస్తూ ఎగతాళి చేసే సినిమా. హాలీవుడ్ లో పెద్ద లిస్టే వుంది. ఈ కథ 2013 లో అవినాష్ సంపత్ రాశాడు. రాసిన వెంటనే కథలు సినిమాలైపోవు. కాబట్టి ఇంతకాలం పట్టింది. అనురాగ్ కశ్యప్ మాటలు రాశాడు. పచ్చి బూతుల మాటల రచయితగా ఆల్రెడీ పేరున్న వాడు. అతను తీసిన గ్యాంగ్స్ ఆవ్ వసేపూర్ లోంచి బూతులు తీసేస్తే ఆ సినిమా ఎవ్వరూ చూడరని అనిల్ కపూర్ తిట్టిపోస్తాడు. అనిల్ చేత ఎడాపెడా పచ్చి బూతులు తిట్టించుకుంటాడు అనురాగ్. దీని వల్ల ఈ సినిమా ఇంట్లో అందరూ కలిసి చూసేలా మాత్రం వుండదు. హిందీ ఓటీటీ సినిమాల్లో బూతులు న్యూనార్మల్ అయిపోయింది. ఈ సినిమా ఇంగ్లీషు సబ్ టైటిల్స్ లో ఎఫ్ పదం లెక్కలేని సార్లు వస్తూంటుంది. హాలీవుడ్ సినిమాల్లో కూడా ఎఫ్ పదం ఈ యెత్తున దాడి చేయదు. 

      Axn ఛానెల్లో యాక్షన్ రియాల్టీ షోలు వస్తుంటాయి. ఈ సినిమా కథ అలాటిదే. కిడ్నాప్ తో టాస్క్ ఇచ్చిన వాడు అనురాగ్, దాని టాస్కర్ అనిల్. కూతుర్ని కాపాడుకునే ప్రయత్నాలు. అయితే కథ మధ్యలో మలుపు తిరుగుతుంది. టాస్క్ ఇచ్చిన అనురాగ్ కే టాస్క్ ఎదురు తిరుగుతుంది. ఈ మలుపు తను రాసిన స్క్రిప్టులో వుండదు. తన తల్లిదండ్రులు కిడ్నాపయ్యారు. ఎవరు చేశారు, ఎలా చేశారు? అనిల్ చేసే అవకాశం లేదు. తను అనిల్ తోనే వుంటున్నాడు. అతను చేసే ప్రతీకాల్ స్పీకర్ ఫోన్లో వింటూనే వు న్నాడు.

        ఈ మలుపు మంచిదే. అయితే దీనికి ముగింపులో వివరణనిచ్చిన విధానం మాత్రం మొత్తం కథనే  డీలా చేసేసింది. ముగింపులో ఎండ్ సస్పెన్స్ సినిమాల తరహాలో ఇచ్చిన  వివరణ ముగింపు షాక్ వేల్యూనే దెబ్బ తీసింది. ముగింపు మొత్తం కథ అనురాగ్ కే ఎదురు తిరిగేట్టు అనిల్ క్యారక్టర్ రివీల్ కావడం షాకింగే కానీ, ఇదెలా చేశాడో మొదట్నుంచీ కట్ షాట్స్ వేస్తూ చెప్పుకు రావడంతో, ఎండ్ సస్పెన్స్ సినిమాలతో జరిగే నష్టాన్నే కొని తెచ్చింది. 

        మొదట్నుంచీ అనిల్ మనకి తెలియకుండా ఏమేం చేసుకు వచ్చాడో అతను చెప్పే ఆ షాట్స్ అన్నీ చూస్తూ, వాటిని చూపించిన కథతో  జోడించుకుని అర్ధం జేసుకునే ఆసక్తి ముగింపులో ఎవరికుంటుంది. ప్రతీసారీ ఎండ్ సస్పెన్స్ సినిమాల్లో జరిగే ఇదే విఫల తంతుకి ఇక్కడొక విరుగుడు కన్పిస్తుంది - ఆ చెప్పేదేదో ప్రేక్షకుల భాగస్వామ్యం లేకుండా  ఏకపక్షం గా చెప్పుకుపోకుండా -అనురాగ్ ని కుదేసి కూర్చోబెట్టి- ఒరేయ్, నేను చేసిందిదిరా, అప్పుడు నీ స్క్రిప్టు ప్రకారం నువ్వాలా చేశావే, దానికి నా స్క్రిప్టు ప్రకారం ఇలా చేశానని నాటకీయంగా ఒక్కోటీ చెబుతూ పోతే, ప్రత్యర్ధితో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ప్రేక్షకులకి కిక్ ఇచ్చే అవకాశముంటుందని ఇందులోంచి గ్రహించవచ్చు. 

        అలాగని ఎండ్ సస్పెన్స్ సినిమాలకి ఈ ట్రిక్ వాడొచ్చని కాదు. అసలు ఎండ్ సస్పెన్స్ కథల జోలికే పోకూడదు, దృశ్య మాధ్యమమైన సినిమాలకి. నవలల కైనా ఎండ్ సస్పెన్స్ హాని చేస్తుందని ఏనాడో గ్రహించిన అగథా క్రిస్టీ, ఎండ్ సస్పెన్స్ ని ఎండ్ సస్పెన్స్ అనిపించకూడా చేసిన అద్వితీయ ప్రయోగాలెన్నో వున్నాయి. క్రైమ్ సినిమాలు తీయాలని నిజంగా నిబద్ధత వుంటే ఆమె నవలల్ని, వాటితో వచ్చిన కొన్ని సినిమాల్నీ స్టడీ చేయాలి. లవ్ సినిమాలు తీసినట్టు క్రైమ్ సినిమాలు తీసిపడేస్తే కాదు. బాక్సాఫీసుకి క్రిమినల్స్ గా ప్రూవ్ అవుతారు.

***

     అనిల్, అనురాగ్ ఇద్దరూ పేలడానికి సిద్ధంగా వున్న ఏకే 47 గన్స్ లా నటించారు. పరుగులు తీసే ప్రతీ సీనులో ఇద్దరూ వుంటారు. పరస్పరం మాటల దాడి సైతం నిప్పులు చెరుగుతూంటుంది. బూతులు తీసేస్తే ఈ జానర్ కి అనురాగ్ రాసిన ఎగతాళి డైలాగ్స్ టాలీవుడ్ మూస కృత్రిమ టెంప్లెట్ ఎత్తిపోతల రైటర్స్ కి ఒక పాఠం. అనిల్ లో 64 ఏళ్ల వయస్సు కన్పించదు. నేటి యువ హీరోలకి అతనే మాత్రం తీసిపోడు ఫిట్ నెస్ విషయంలో. 48 ఏళ్ల అనురాగ్ ఒక సీనియర్ స్టార్ తో చేసే వెకిలితనాల్లో యూత్ అప్పీల్, బాక్సాఫీసు అప్పీల్ కూడా చాలా వుంటుంది. 

        ఈ కథ అనిల్ కపూర్ బర్త్ డేకి జరగడం కథకి బలం. అతను బర్త్ డే  జరుపుకొనివ్వకుండా, వేడుకల్లో పాల్గోనివ్వకుండా, కూతుర్ని కిడ్నాప్ చేసి మంచి ఫిట్టింగే పెట్టాడు అనురాగ్. ఇది కథకి డెప్త్ తీసుకొచ్చింది. ఆ కూతురి కోసం ఉరుకు పరుగుల్లోనే అన్న బోనీ  కపూర్ కుటుంబాన్ని కలుస్తాడు అనిల్. అక్కడ కొడుకు అప్ కమింగ్ హీరో హర్షవర్ధన్ కపూర్ వుంటాడు. కానీ బోనీ కపూర్ కొడుకు యువహీరో అర్జున్ కపూర్ కనిపించడు. అతనుంటే కథకి తేడా వస్తుందనేమో. అతను బాబాయ్ అనిల్ కీ, అనురాగ్ కీ ఏదో తేడా వుందని పసిగట్టెసే రకం కావొచ్చు. కిడ్నాప్ విషయం పోలీసులు సహా అనిల్ ఎవరికీ చెప్పవద్దని అనురాగ్ కండిషన్. అనిల్ కూతురు యువ స్టార్ సోనమ్ కపూర్ చిట్ట చివర కిడ్నాప్ నుంచి విడుదలైనప్పుడు కన్పిస్తుంది. 


        ఇదంతా గెరిల్లా షూటింగ్ చేశారు. 21 రోజుల్లో షూటింగ్ ముగించామని చెప్పారు. రాత్రి పూట ముంబాయి కొత్త ప్రాంతాల్ని ఈ సినిమాలో మొదటిసారి చూస్తాం. దర్శకుడు మోత్వానే మాక్యుమెంటరీతో అపూర్వ కమర్షియల్ ప్రయోగమే  చేశాడు.    

సికిందర్   

 

 

 

17, డిసెంబర్ 2020, గురువారం

1005 : రైటర్స్ జోన్


      ది ఇన్పుట్స్ ప్రపంచం.  ఎందుకు ఇన్ పుట్స్ ప్రపంచం? ఇవ్వాళ  ప్రపంచం అందరికీ తెలిసిపోతోంది. ఎలా తెలిసిపోతోంది? అరచేతిలో స్మార్ట్స్ ఫోన్ల ద్వారా కూడా తెలిసిపోతోంది. ఐతే ఏం చేయాలి? సినిమా రచయిత గ్లోబలీకరణ చెందాలి. ఏ సినిమా రచయిత గ్లోబలీకరణ చెందాలి? హాలీవుడ్ నుంచీ టాలీవుడ్ దాకా, ఇంకేమైనా వుంటే మూసీ పక్కన వుండే డెక్కన్ వుడ్ దాకా అందరూ గ్లోబలీకరణ చెందాలి. చెందకపోతే  ఏమవుతుంది? కాలం కంటే,  ప్రేక్షకులకంటే వెనుక బడిపోతాయి స్క్రిప్టులు. తుపాకీ రాముడికైనా ప్రపంచజ్ఞానముంటుంది. వాడి వ్యాఖ్యానాల కంటే అన్యాయంగా కనపడతాయి స్క్రిప్టులు.  అవే మూస కథలు అలాగే రాస్తారు. నాల్గు మూస సినిమాలు చూసి ఒక మూస కథ  అల్లే పాత మేస్త్రీలుగా  మిగిలిపోతారు...
        మూస ఎందుకు పనికిరాదు? ప్రపంచం మూసుకుని వున్న రోజుల్లో అవతలి విషయాలు తెలిసేవి కావు ప్రేక్షకులకి. అప్పుడా వచ్చే ఫార్ములా కథలు, మూస పాత్రలు, కృత్రిమ చిత్రీకరణలూ వాళ్ళ వినోదానికి సరిపోయేవి. ఇప్పుడు ప్రపంచం తెర్చుకున్నాక ఎన్నో కొత్త కొత్త విషయాలు – వాస్తవంగా ప్రపంచం అబ్బురపరుస్తున్న విధమూ  ఎప్పుటికప్పుడు తెలిసిపోతున్నాయి. వీటి ముందు ప్రపంచంలోకి చూడని ఫార్ములా కథలు, మూస  పాత్రలు, కృత్రిమ చిత్రీకరణలూ వెలవెలబోతున్నాయి. ఇప్పటి సినిమా రచయిత / దర్శకుడు ఇది గ్రహించక, సినిమా అంటే ఇంకా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,  వెంకటేష్ సినిమాలే, కథలే, పాత్రలే అనుకుంటూ వాటి వైపే చూస్తూ, వాటిలోంచే తీస్తూ, తరం మారిన ప్రేక్షకులకి దూరంగా, దయనీయంగా మిగిలిపోతున్నారు. 
       
    సొంత వూహలతో, ఆ వూహల్నికూడా పాత సినిమాలతో ధృవీకరించుకుని, ఇవ్వాళ  తోచిందల్లా స్క్రిప్టులు రాసుకునే కాలం కాదు. బయటి ప్రపంచంలోకి చూస్తేనే గానీ  ఇవ్వాళ్టి ప్రపంచంతో సంబంధం ముండే కాలీన స్క్రిప్టులు రాని అగత్యమేర్పడింది. ఒకప్పుడు హాలీవుడ్ లో క్రిమినల్స్ , గ్యాంగ్ స్టర్స్ సినిమాలు రాయాలంటే అలాటి పాత సినిమాలవైపే చూసి రాసేవారు. ఇక ఇలా పాత సినిమాలని చూసి కాదని, ఇవ్వాళ్టి ప్రపంచపు రియలిస్టిక్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ పాత్రలతో రాయాలని వొత్తిడి వచ్చినప్పుడు, ఆ జానర్ సినిమాల్లో కొత్తదనం ప్రారంభమయింది. 
        
    ఐడియాలు కొత్తగా రావడం లేదని కాదు. వాటికి కొత్త కథనాలే  రావడంలేదు. కొత్త ఐడియాలకే కాదు, ఎలాటి ఐడియాల కైనా కొత్త కథనాలు రావాలంటే ఇప్పుడు ఇన్పుట్స్ చాలా అవసరం. ఇన్పుట్స్ కి ముందుగా చూడాల్సింది ఇవ్వాళ్టి మార్కెట్ యాస్పెక్ట్ నే తప్ప, క్రియేటివ్ యాస్పెక్ట్ ని కాదు. ఫలానా ఈ ఐడియాకి నేటి మార్కెట్ కి తగ్గట్టు ఏఏ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలో నిర్ణయించినప్పుడే అలాటి ఇన్పుట్స్ తీసుకోవాలి. సినిమా కథంటే మొదట మార్కెట్టే, ఆ తర్వాతే  క్రియేటివిటీ. 
        
    ఈ ఇన్పుట్స్ తీసుకోవడానికి కమర్షియల్ దృక్పథం వుండాలి. కమర్షియల్ సినిమాలు కాకుండా వాస్తవిక, సమాంతర సినిమాలే రాయాలనుకుంటే కమర్షియల్ ఇన్పుట్స్ తీసుకోకూడదు. ఆ వాస్తవిక దృక్పథంతో అలాటి వార్తల్లోంచో సినిమాల్లోంచో ఇన్పుట్స్  తీసుకోవాలి. ఇవ్వాళ్ళ తెలంగాణాలో  ఔత్సాహిక దర్శకులు విపరీతంగా దూసుకొచ్చేస్తున్నారు.  వీళ్ళు ఒక దగ్గరే ఆగిపోతున్నారు. కానీ అక్కడ ఆగిపోవడానికి తెలంగాణాలో ఇంకా బి.  నరసింగ రావు, గౌతం ఘోష్ సినిమాల కాలం కాదు.  తెలంగాణా ఉద్యమకాలంలోనే ఉద్యమ సినిమా లెవరూ చూడలేదు. తరం మారింది. తెలంగాణాలో కూడా ఈ తరానికి ఎకనమిక్స్, లేదా రోమాంటిక్స్ వుండే ఎంటర్ టైనర్లు కావాలి. 
        
    కానీ తెలంగాణా వైపు నుంచి వచ్చే ఔత్సాహిక దర్శకులు షార్ట్ ఫిలిమ్సో, వరల్డ్ మూవీసో అంటూ మోజు పెంచుకుంటున్నారు. దీనికి కమర్షియల్ సినిమాల ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేదు. ఈ ఇన్పుట్స్ కమర్షియల్ సినిమాలు తీయడానికి ఏమాత్రం పనికి రావు. టాలీవుడ్ వరల్డ్ మూవీస్ ఉత్పత్తి చెయ్యదు. ప్రధాన స్రవంతి కమర్షియల్ సినిమాలే ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణా నుంచి టాప్ డైరెక్టర్లు చాలా మందే వున్నారు. సురేంద్ర రెడ్డి, హరీష్ శంకర్, దశరథ్, వంశీ పైడిపల్లి, సంపత్ నంది, ఎన్. శంకర్, సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, హను రాఘవపూడి...వీళ్ళంతా వరల్డ్ మూవీస్ చూసి కమర్షియల్ డైరెక్టర్లు కాలేదు. ఇద్దరు ముగ్గురు షార్ట్ ఫిలిమ్స్ తీసి వచ్చారు తప్ప, మిగిలిన వాళ్ళందరూ కమర్షియల్ సినిమాలకి పనిచేసి వచ్చిన వాళ్ళే. తెలంగాణా నుంచి ఇంకో రాబోతున్న వేణు ఊడుగుల కూడా కమర్షియల్ దర్శకుల దగ్గర పనిచేసిన వాడే. ఇప్పుడు తెలంగాణా ఔత్సాహిక దర్శకులకి తాము  కూడా ఇలా  టాప్ దర్శకులవ్వాలనే కలలుంటే,  అవి వరల్డ్ మూవీస్ ఇన్పుట్స్ తో నేరవేరవు. అలాగని తెలంగాణా జీవితపు వాస్తవిక కథా చిత్రాలు తీయాలనుకుంటే వరల్డ్ మూవీస్  అధ్యయనం చేసుకోవచ్చు. కానీ అలాటి తెలంగాణా జీవితపు వాస్తవిక కథా  చిత్రాలకి ఇప్పుడు మార్కెట్ ఎక్కడిది? పైన చెప్పుకున్నట్టు ఎకనమిక్స్ లేదా రోమాంటిక్సే మార్కెట్. ఈ ఔత్సాహిక దర్శకులు టాప్ తెలంగాణా దర్శకుల్లాగా ఎదగాలనుకుంటే అది మంచి ఆలోచనే. అప్పుడేం చేయాలంటే, ఇదే బ్లాగులోనే  కొన్ని వ్యాసాల్లో రాసినట్టు,  వరల్డ్ మూవీస్ కి ధడాలున తలుపులు మూసి పారేసి,  హాలీవుడ్ మూవీస్ మాత్రమే చూసుకోవాలి. ఆ ఇన్పుట్స్  మాత్రమే తీసుకోవాలి. 
        
    ఇక్కడ కూడా తప్పులో కాలేసే వీలుంది. మళ్ళీ హాలీవుడ్ సినిమాలనగానే కొందరు పాత మేధావులకి అదే ‘క్లాసాబ్లాంకా’, అదే ‘రోమన్ హాలిడే’, అదే ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ లే తప్ప,  ఇక హాలీవుడ్డే  లేదన్నట్టు వుంటారు. నేటి తెలుగు సినిమాలతో సంబంధం లేని వీళ్ళ రికమెండేషన్ల కి, ఉపన్యాసాలకి దూరంగా వుంటూ, గత ఇరవై ఏళ్లుగా వస్తున్న హాలీవుడ్ సినిమాలని ఇన్పుట్స్ గా తీసుకుంటే ప్రయోజన ముంటుంది.
        
ఎందుకు హాలీవుడ్ ని తీసుకోవాలంటే, అవి కమర్షియల్ సినిమాల త్రీయాక్ట్  స్ట్రక్చర్ లో వుంటాయి. వరల్డ్ మూవీస్ కి,  ఆ మాటకొస్తే ఒకప్పుడు వచ్చిన భారతీయ కళాత్మక సినిమాలకీ స్ట్రక్చర్ అనేది వుండదు. స్ట్రక్చర్ అంటే స్క్రీన్ ప్లేలో బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లు. స్ట్రక్చర్  లేకపోవడమంటే మిడిల్ లేకపోవడం. అంతే గాక ప్రధాన పాత్రలు యాక్టివ్ పాత్రలుగా వుండవు, పాసివ్ గా వుంటాయి. ఇంకా చెప్పుకుంటే,  ప్రధాన పాత్ర కథ నడపదు, కథే ప్రధాన పాత్రని నడుపుతుంది. ఇన్ని వరల్డ్ సినిమాలు చూస్తున్న వాళ్ళు ఈ పాటికి ఈ సాంకేతిక తేడాలు గమనించే వుండాలి. మిడిల్ మిస్సయిన సినిమా కమర్షియల్ గా ఆడదు. వరల్డ్ మూవీస్ కీ, కమర్షియల్ సినిమాలకీ సాంకేతికంగా ఈ తేడా తెలిసిన తెలుగు ఔత్సాహిక దర్శకుడు / రచయిత ఛస్తే వరల్డ్ మూవీస్ చూడడు. ఈ వ్యాసకర్త కూడా వాటి జోలికి పోవడం లేదు.

        తెలంగాణా ఔత్సాహిక దర్శకుల ఇన్పుట్స్ విశేషాలు చెప్పుకున్నాక, అసలు ఇన్పుట్స్  అంటే ఏమిటి? సినిమాలేనా? ఇంకా ఏమైనా వున్నాయా? ఇది ఈ కింద చూద్దాం...

        న్పుట్స్ పట్ల ఆసక్తి లేకపోతే ఏం జరగవచ్చో చూద్దాం... ఒక ఐడియా తడుతుంది. ఆ ఐడియాలో ఒక హీరో వుంటాడు. అతను చేసిన ఒక పని వల్ల ఇంకెక్కడో  వున్న తనకు తెలీని హీరోయిన్ జీవితం దెబ్బతింటుంది. ఇది హీరో తెలుసుకుని ఎలా చక్కదిద్దాడు..? అన్నప్రశ్న దగ్గర ఆగిపోయింది ఐడియా. దీన్నేం చేయాలా అని నల్గుర్నీ అడగడం ప్రారంభిస్తాడు సదరు కథకుడు. ఆ నల్గురూ తనలాంటి వాళ్ళే. వాళ్ళ దగ్గరా సమాధానం వుండదు. బాగా చర్చించుకుంటారు. అసలు హీరో చేసిన అంత దారుణమైన పనేమిటనేది కథకుడికి కూడా తెలీదు. హీరోయిన్ జీవితం దెబ్బతిందంటే ఏం జరిగిందో కూడా తెలీదు. ఇదే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోమంటాడు. అది తెలిస్తే హీరోయిన్ జీవితాన్ని చక్కదిద్దే మార్గం తెలుస్తుంది. ఇలాకాదని ఇలాటి కథలతో ఏమేం సినిమాలు చూశామా అని వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. ఫలానా ఫలానా  సినిమాలు చూడమంటూ కథకుడికి సలహా ఇస్తారు. కథకుడు ఎన్నో సినిమాలు చూస్తాడు. ఎక్కడా తను అనుకుంటున్న ఐడియా కనెక్ట్ అవదు. అంటే తన కొచ్చిన ఐడియాతో సినిమాలే రాలేదంటే తన ఐడియా ఎంత గొప్పదోనని ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. ఎక్కడో వున్న హీరో ఇంకెక్కడో వున్న హీరోయిన్ జీవితాన్ని తెలియకుండా పాడుచేశాడు... ఎంత మంచి బంపర్ ఐడియా! కానీ మళ్ళీ అదే చిక్కు ప్రశ్న... ఎలా పాడు చేశాడు హీరోయిన్ జీవితాన్నీ? 
           
ర్లేరా, అసలా హీరో  ఏం చేస్తూంటాడో చెప్పిచావు – అంటారు స్నేహితులు. ఇది కూడా ఇప్పుడాలోచించి చావాలంటాడు కథకుడు. అన్నీ మేమే ఆలోచించి చావాలంటే ఎలారా అని చచ్చిపోతూంటారు స్నేహితులు. భీకరంగా మేధోమధనం జరుగుతుంది. మధ్య మధ్యలో గర్ల్ ఫ్రెండ్స్ తోకూడా అంతర్మధనం జరుగుతూంటుంది. ఏరా, మా జీవితాల్నేపాడు చేసే ఐడియాలు కావాల్రా మీకూ - అని గొడవలు కూడా జరుగుతూంటాయి వాళ్ళతో. 
        
    ఇదే గనుక ఇన్పుట్స్ వుంటే ఎలా వుంటుంది? ఎక్కడో వున్న హీరో వల్ల ఇంకెక్కడో వున్న హీరోయిన్ జీవితం పాడయ్యిందా? హీరో ఏం చేసివుంటాడు? అప్పుడు ఒకానొక దేశంలో ఒక వెడ్డింగ్ యాప్ వల్ల కొందరి పెళ్ళిళ్ళు పెటాకులైన వార్తా విశేషాలు గుర్తుకొస్తాయి. దాన్ని తనకొచ్చిన ఐడియాకి వాడుకుంటాడు  కథకుడు. అంటే హీరో అలాటి యాప్ ని డెవలప్ చేశాడు. దాన్ని హీరోయిన్ వాడుకుని పెళ్లి చేసుకోబోయి ఘోరంగా పరువు పోగొట్టుకుంది.  కానీ ఆ యాప్ అసలు  హీరో విడుదల చేయలేదు. అదింకా ప్రయోగ  దశలోనే వుంది. హీరో ఫ్రెండ్ వుంటాడు. అతడికి హీరోయిన్ తో చెడింది. కనుక ఆమె పెళ్లి చెడగొట్టాలని ఫ్రెండ్ దగ్గర ప్రయోగ దశలో వున్న యాప్ కొట్టేసి ఆమెకి పంపాడు... ఇలా కథని విస్తరించుకుంటూ పోగలడు కథకుడు తనదగ్గర ఇన్పుట్స్ వుంటే.  

    ఏ రంగంలో వున్నా కథకుడన్నాక అతడిలో జర్నలిస్టు అంశ, జిజ్ఞాస తప్పకుండా  వుంటాయి. తనలో జర్నలిస్టు పనిచెయ్యని కథకుడు కథకుడు కాదు. జర్నలిస్టులు వేరు, మనం వేరనీ, మనకి వివిధ ప్రపంచ విషయాలతో సంబంధం లేదనీ, మన కథకి మనం డ్రామా వరకూ ఆలోచించుకుంటే సరిపోతుందనుకుంటే ఆ కథకుడు డొల్లగా తయారవుతాడు. లోపలేమీ లేదు, కాబట్టి బయటికేమీ తీయలేడు. డ్రామా అంటే ఏమిటి? అది జడప్రాయం కాదు. టెంప్లెట్ కాదు. అది కూడా ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచ విషయాలని తనలోకి తీసుకుంటుంది. తనని తాను సంస్కరించుకుంటుంది. తమకి ఉద్యోగాలివ్వలేదని నిరుద్యోగులు కాపేసి నాయకుణ్ణి చంపాలనుకోవడం మూస డ్రామా, లేదా టెంప్లెట్. నాయకుడే అనూహ్యంగా ఆ కాపేసిన నిరుద్యోగుల మీద కాల్పులు జరిపి చంపడం సీన్ రివర్సల్, చలనంలో వున్న యాక్షన్ – డ్రామా. యాక్షన్ కూడా టెంప్లెట్ లో బందీ అవదు. అది జడప్రాయం కాదు. ఫారిన్లో హీరో బర్త్ డే జరుపుకోవడం, వూళ్ళో తాత భోజనాలు పెట్టడం మూస. అన్ని వయసుల వాళ్ళూ సినిమాలు చూస్తున్న కాలంనాటి ఫార్ములా. కొన్ని వయసుల వాళ్ళే సినిమాలు చూస్తున్ననేటి డైనమిక్స్ కాదు. 

దర్శకుడు 90 - కథకుడు10
        కాలీన స్పృహ వుండని కథకుల గురించి ఒక కొటేషన్ వుంది : వీళ్ళు తమ పధ్నాల్గవ యేట తెలిసిన జ్ఞానంతో అక్కడే  వుండిపోతారని. తెలుగులో వచ్చే ప్రేమ సినిమాలు చూస్తే  ఈ అపరిపక్వతే  కన్పిస్తుంది. ప్రపంచ విషయాల పట్ల,ఇన్పుట్స్ పట్లా ఆసక్తి లేకపోవడం. ఇలాటి కథకులకి సినిమా కథ రాయాలన్న ఆసక్తి ఎప్పుడు పుడుతుందంటే, సినిమాల మీద మోజు పెంచుకున్న తర్వాతే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, విజయశాంతిలు  నటించిన ఎన్నో సినిమాలు చూసేశాం కదా, ఇక మనకి కూడా సినిమాలు తీయాలన్న కోరిక పుట్టేసింది, ఇక మనమే కథకులై పోవచ్చని వచ్చేస్తూంటారు. 
        
     కానీ ఏ మనిషిలోనూ ఎకాఎకీన కథకుడు పుట్టడు. ఎప్పటి నుంచో ఒక జర్నలిస్టు అంశ తనలో వుండే వుంటుంది. జర్నలిస్టు అంశే ప్రాచీన కాలంలో రాయించడం మొదలెట్టించింది. మొట్ట మొదట చరిత్రలు రాయించింది. అంటే శోధనతో రచన చేయడం మొదలైంది. శోధన అంటే జర్నలిజమే. ఆ రాసిన చరిత్రల్ని శోధించి  నాటకాలు రాశారు. నాటకాల నుంచి కావ్యాలూ, ఇతర సాహిత్య  ప్రక్రియలూ వెలువరించడం మొదలెట్టారు. ఇలా ఒకదాన్ని శోధిస్తూ  ఇంకొకటి కళా ప్రక్రియలు అవతరించాయి. నాటక కళని శోధించే సినిమాకళ వచ్చింది. 
        
    కనుక  దేన్నీ ఊహల్లోంచి సృష్టించ లేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఊహించి ఏదీ సృష్టించడం సాధ్యం కాదు. శాస్త్రాలన్నీ పదార్థ ఫలితాలే. పదార్థముంటేనే శాస్త్రం. ప్రాచీనకాలంలో రాజులనే పదార్ధముంది కాబట్టే వాళ్ళని గమనించి చరిత్రలు. చరిత్రలనే పదార్థముంది కాబట్టే అవి చూసి నాటకాలు. నాటకాలనే పదార్ధముంది కాబట్టే ఇవి చూసి ఇతర కావ్యాలూ కథలూ కాకరకాయలూ, అన్ని కళలూ! నాట్యాలనే పదార్థాలున్నాయి కాబట్టే వాటిని చూసి భరతముని నాట్య శాస్త్రమూ.  సినిమాలనే పదార్థాలున్నాయి కాబట్టే వాటిని చూసి స్క్రీన్ ప్లే శాస్త్రమూ.  విశ్వముంది కాబట్టే దాన్ని చూసి ఖగోళ శాస్త్రమూ. యాపిల్ కింద పడింది కాబట్టే దాన్ని చూసి గురుత్వాకర్షణ సిద్ధాంతమూ. పదార్థాలే ముందు, శాస్త్రాలు తర్వాత. వీటన్నిటి చోదక శక్తి మళ్ళీ శోధించే జర్నలిస్టు అంశే. 
        
    కాబట్టి సినిమాల మీద ఓ పొద్దుటే కోడెగిత్తలా పుట్టిన మోజుతో కథకులై  పోవడానికి సినిమాలనే పదార్థముంది ఓకే, మరి జర్నలిస్టు అంశ ఏదీ? పదార్థాన్ని (సినిమాల్ని) చూసి మోజైతే బాగానే రేగింది, మరి ఇప్పటికప్పుడు జీవితాల్నీ ప్రపంచాన్నీ శోధించాలంటే జర్నలిస్టు అంశ ఎలా పొడుచుకు వస్తుందీ? ఇంకా సినిమాల్ని ఏమని శోధిస్తావ్? ఆల్రెడీ నాటకాల్ని శోధించి బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లతో ఓ సినిమా కళని స్థాపించారు. ఇంకా నువ్వేం స్థాపిస్తావ్? ఆల్రెడీ తెలుగు సినిమాల యాక్షన్ కి ఒక టెంప్లెట్, లవ్ కి ఇంకో టెంప్లెట్ వున్నాయి. వాటిలో నువ్వేం విషయం వేస్తావ్? వేసిన విషయమే వేస్తూ పోతావా? ఇందుకా మళ్ళీ  నువ్వు పుట్టి పెరిగిందీ?
        
   టాప్ దర్శకులు కూడా కొద్ది కాలంలోనే హతాశులవడానికి కారణం జర్నలిస్టు అంశ లోపించడమే. ఒక ఫ్యాక్షన్ టెంప్లెట్ పట్టుకునో, ఒక యాక్షన్ కామెడీ టెంప్లెట్ పట్టుకునో నాల్గు సినిమాలు తీసేసరికి వాళ్ళ పనై పోయింది. కానీ హిచ్ కాక్ చెప్పినట్టు,  సినిమా అంటే 90 శాతం రాత, 10 శాతమే తీత. ఇదిప్పుడు తారుమారైంది. 90 శాతం తీత, 10 శాతం రాతగా మారిపోయింది తలరాత. కాబట్టి ఓ పొద్దుటే సినిమాలు తీసేద్దామని వచ్చే నేటి దర్శకులు కమ్ రచయితల్లో  90 శాతం దర్శకుడవ్వాలనే కోరికే తప్ప, ముందు కథకుడయ్యేందుకు జర్నలిస్టు అంశ అసలే వుండదు, ఆసక్తి కూడా 10 శాతం మాత్రమే. కనుకే 90 శాతం ఫ్లాపులు.
        
    ఒక సీనియర్ దర్శకుడు పదిహేనేళ్ళ క్రితమెప్పుడో ఈ వ్యాసకర్తతో చెప్పారు :  చదవాలండీ, చదువుతూనే వుండాలి. ఏదని కాదు, వీలైనన్నివిషయాల మీద చదువుతూనే వుండాలి. దర్శకత్వమనేది శారీరకమే, మనం మానసికంగా స్ట్రాంగ్ గా వుండాలంటే చదవాలి... అని. 
        
    ఈ చదువు కొరవడితే ఇన్పుట్స్ వుండవు. ఇన్పుట్స్ లేకపోతే  అవుట్ పుట్ వుండదు. ఇప్పుడున్న  ట్రెండ్ ప్రకారం తెలుగులో దర్శకుడే కథకుడు, కథకుడే దర్శకుడనే ఫ్రెంచి ఓటర్ (auteur) విధానం అమల్లో వుంది. ఇది వరల్డ్ మూవీస్ కి యూరప్ దేశాల్లో పుట్టిన విధానం. హాలీవుడ్ లో 1920 ల నుంచే స్క్రీన్ రైటర్స్ అని విడిగా వుంటూ వస్తు న్నారు. వాళ్ళందించే కథలతోనే, స్క్రిప్టులతోనే దర్శకులు సినిమాలు తీస్తూంటారు. అరుదుగా క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్, రియాన్ జాన్సన్ లాంటి తామే రాసుకుని తామే తీసే ‘ఓటర్స్’ వుంటారు. వీళ్ళు కూడా మామూలుగా వుండరు. వీళ్ళల్లో 90 శాతం కథకుడుంటే, 10 శాతమే దర్శకుడుంటాడు. అందుకే పల్ప్ ఫిక్షన్, బ్లడ్ సింపుల్, బ్రిక్ లాంటి వీళ్ళు తీసిన కమర్షియల్ అద్భుతాలొచ్చాయి, యూనివర్సిటీల్లో బోధనాంశాలయ్యాయి. పల్ప్ ఫిక్షన్ తో టరాంటినో ఆధునిక గ్యాంగ్ స్టర్ కథ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో అపూర్వ క్రియేటివిటీ ప్రదర్శించాడు. కోయెన్ బ్రదర్స్ 25 – 27 మధ్య వయస్కులుగా వుండగానే తొలి సినిమా బ్లడ్ సింపుల్ తో ఆశ్చర్యపర్చారు. ఫ్రెంచి జానరైన ఫిలిం నోయర్ ని 1930 లనుంచీ హాలీవుడ్ తన వ్యాపార తరహాకి అనుకూలంగా మార్చుకుని, హాలీ వుడ్ లో దాన్ని కూడా ఒక జానర్ గా కలుపుకున్నాక,  కాలానుగుణంగా కలర్ సినిమాలతో నియో నోయర్ గా మార్చుకుని,  ఇప్పటికీ తీస్తూనే వుంది. ఫ్రెంచి నుంచి తెచ్చుకున్న ఫిలిం నోయర్ కథలకోసం అమెరికాలోనే  డెషెల్ హెమెట్ రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల్నే తీసుకున్నారు. తెలుగులో జానపద సినిమాలు ఎలా వచ్చేవో అంత విరివిగా  హాలీవుడ్  నోయర్ సినిమాలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. 1980 లలో కోయెన్ బ్రదర్స్ వచ్చేటప్పటికి, వాళ్ళు వచ్చిన నోయర్ సినిమాలనే చూసి బ్లడ్ సింపుల్ తీయలేదు. వాళ్ళల్లో జర్నలిస్టు అంశ మేల్కొంది. అసలు డెషెల్ హెమెట్ ఏం ప్రతిపాదించాడబ్బా  అని హెమెట్ నవలలు చదవడం ప్రారంభించారు. అప్పుడు మాత్రమే ఆ జానర్ కి దగ్గరగా వెళ్లి అనుభవించగల్గి,  బ్లడ్ సింపుల్ తీసి రికార్డు సాధించారు.
        
    2005 లో రియాన్ జాన్సన్ బ్రిక్ తీసినప్పుడు కూడా హెమెట్ సాహిత్యాన్ని అధ్యయ నం చేశాడు. అతడికి ఫిలిం నోయర్, నియో నోయర్ లాగా అడల్ట్ కథతో, పెద్ద నటులతో తీసే ఉద్దేశం లేదు. అడల్ట్ ప్రపంచంగా వుంటూ వస్తున్న నోయర్ జానర్ని,  కాలేజీ టీనేజీ నోయర్ గా మార్చేసి సంచలనం సృష్టించాడు. ‘ఓటర్’ బాధ్యతల్ని నిర్వహించుకోవడం ఇలా వుంటుంది అధ్యయనాలతో కలుపుకుని.     
    
100 శాతం ఓటర్సేనా?
        అయితే తెలుగులో ఈ తరం దర్శక రచయితల్ని పూర్తిగా ఓటర్స్ అనలేం. యూరోపియన్ సినిమా ఫీల్డులో ఓటర్ అంటే రచన నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ దాకా అన్నిశాఖలూ తనవే అన్నట్టు  ముద్రవేసుకునే దర్శకులని ఓటర్స్ అంటారు. సినిమాలో ఏ శాఖ పనితనం చూసినా ఆ దర్శకుడి ప్రత్యేక శైలియే కన్పిస్తుంది. యూరప్ లో జీన్ లక్ గోడార్డ్, ఇంగ్మార్ బెర్గ్ మన్, ఫ్రాంకోయిస్ ట్రూఫాట్ లాంటి గొప్ప దర్శకులు నిజమైన ఓటర్స్ అన్పించుకున్నారు. తెలుగులో చూస్తే, వంశీ సినిమాల అణువణువులో అన్నీ శాఖల్లో ఆయన శైలియే కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. నటీనటుల నటనల దగ్గర్నుంచీ భావోద్వేగాలు, సంభాషణలు, ఛాయాగ్రహణం, సంగీతం, కళా దర్శకత్వం, పోరాటాలూ సమస్తం ఆయన శైలిలోకి మారిపోయి కన్పిస్తాయి. క్వెంటిన్ టరాంటినో, కోయెన్ బ్రదర్స్, రియాన్ జాన్సన్ లు ఓటర్స్ గా ఇదే సాధించారు. ఇది సాధించాలంటే ముందు జర్నలిస్టు అంశతో, శోధనతో పూర్తి 90 శాతం కథకులవగల్గాలి. అవుతారా? అవడానికి మనస్కరించదు. 
        
    యూరప్ యూనియన్ చిన్న చిన్న దేశాల్లో అక్కడి కొద్దికొద్ది జనాభాకి,  చిన్న చిన్న బడ్జెట్లతో ‘ఓటర్స్’  తీసే పర్సనల్ సినిమాలు నప్పుతాయి. ‘ఓటర్స్’ తీసే సినిమాలు ఎంత వరల్డ్ మూవీస్ అని ఇప్పుడు ఫ్యాషన్ గా చెప్పుకుంటున్నా అవి ఆర్ట్ సినిమాలే. జర్మన్ ఎక్స్ ప్రెషనిస్టు కళ వాటికి  మూలం. ఈ సినిమాలు అక్కడి జీవితాల గురించి వుంటాయి, వినోదం గురించి వుండవు. కాబట్టి వాటి నేటివ్ జీవితాలతో అవి మిగతా ప్రపంచంలో ఆడవు. భారత దేశంలో కూడా,  కాశ్మీరు నుంచీ కన్యాకుమారీ దాకా కాదుకదా,  అబిడ్స్ నుంచి  అమీర్ పేట వరకూ కూడా ఎక్కడా ఆడినట్టు మనం చూడలేదు.  హాలీవుడ్ సినిమాలే మన గల్లీల్లో కూడా ఆడతాయి. 
        
    ఈ సినిమాల్లో కథనం హాలీవుడ్ లాగా సంఘటనలతో సాగదు, డైలాగులతో నిదానంగా సాగుతుంది. హాలీవుడ్ లాగా యాక్టివ్ పాత్రలు ఎప్పుడో గానీ వుండవు. భావాలు హాలీవుడ్ లాగా డైలాగులతో పలకరు, ముఖభావాల మీద ఫోకస్ చేసి పలకని మాటలు అర్ధం జేసుకోమంటారు. హలీవుడ్ లాగా కథకి స్ట్రక్చర్ వుండదు. పర్సనల్ సినిమాలు కాబట్టి. ‘ఓటర్’ గారి ఫీలింగ్సే సినిమాలుగా వుంటాయి. ఈ వరల్డ్ మూవీస్ పైన స్క్రీన్ ప్లే పుస్తకాలుండవు. స్ట్రక్చర్ అనేది వుంటే కదా? స్క్రీన్ ప్లే పుస్తకాలన్నీ హాలీవుడ్ సినిమాల గురించే వుంటాయి. 
        
    మరి ఇంతా చేసి యూరప్ అంతటా అక్కడి  వరల్డ్ మూవీస్ ఆడేదెంతా అంటే,  అక్కడ 80 శాతం మార్కెట్ ని హాలీవుడ్ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. అందుకని హాలీవుడ్ సినిమాలు విశాల ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ఆడాలి కాబట్టి,  అక్కడి స్టూడియోలు నిర్మాణ బాధ్యతల్ని ఒక్క ‘ఓటర్’ చేతిలో  పెట్టేయవు. ఒక దర్శకుడు, కథ ఇచ్చిన స్క్రీన్ ప్లే రచయిత, మరికొందరు  డెవలప్ మెంట్  రచయితలూ, స్టూడియో ఎగ్జిక్యూటివ్ లూ, మార్కెట్ నిపుణులూ మొత్తం కలిసి మహా ‘హుండీ’ యాగం నిర్వహిస్తారు. హుండీ ముఖ్యం. ఏ వొక  ‘ఓటర్’ కపాల మోక్షమో కాదు.
        
    అదృష్టవశాత్తూ తెలుగు సినిమాలు  ఒక చిన్న తెలంగాణా ప్రాంతం, ఇంకో ఒక చిన్న కోస్తాంధ్ర ప్రాంతం, మరింకో  చిన్న రాయల సీమ ప్రాంతమని విడివిడిగా,  చిన్న చిన్న ఏరియాలుగా విడిపోయి లేవు. అలా వుంటే యూరప్ లో చిన్న చిన్న ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నేటివ్ జీవితాల వరల్డ్ మూవీస్ లాగే  ‘ఓటర్’  సినిమాలే వర్కౌట్ అవచ్చు. అలాలేదు. సినిమాల విషయంలో తెలుగు ప్రజలందరిదీ ఒకే అభిరుచి. అది కమర్షియల్ అభిరుచి. మరి హాలీవుడ్ అంత కాకపోయినా, హాలీవుడ్ లాగే వ్యాపారాత్మకంగా అన్ని ప్రాంతాల తొమ్మిది పది కోట్లమంది  తెలుగు ప్రేక్షకులకి కమర్షియల్ సినిమాలు అందించాలంటే, ఇప్పుడు కొనసాగుతున్న ‘ఓటర్’ సాంప్రదాయంలో, ఆ దర్శకుడు ఏ స్థాయి సినిమా కథకుడై  వుండాలి?

ఇన్పుట్స్  ఎక్కడ? 
        కేవలం సినిమాలు చూస్తూ సినిమా కథకులు కాలేరు. అందునా వరల్డ్ మూవీస్ చూసి కమర్షియల్ కథకులు కాలేరు. నాటకాలు చూసినా ఆ చూసే ప్రత్యక్ష డ్రామా వల్ల కమర్షియల్ రచన రాణించే అవకాశముంది. కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటే పక్కా కమర్షియల్ సినిమాలే చూడాలి. కళాత్మక సినిమాలకంటే, వరల్డ్ మూవీస్ కంటే కమర్షియల్ సినిమాలు తీయడమే కష్టం. కమర్షియల్ సినిమాలతో పండిత పామరులందనీ వినోదపర్చాల్సి వుంటుంది. కమర్షియల్ సినిమాలు చూస్తే డేటా బ్యాంక్ కి ఉపయోగపడాలి. కొన్ని స్క్రీన్ ప్లే పుస్తకాలూ, కొన్ని డౌన్ లోడ్ చేసుకున్న సినిమాలూ ఇవి మాత్రమే లైబ్రరీ అన్పించుకోవు. బ్యాకప్ గా డేటా బ్యాంక్ వుండాలి. డేటా బ్యాంక్ వుండాలంటే చదవడానికి కొంత టైము కేటాయించుకోవాలి. ఇక్కడే వస్తోంది సమస్య. అసలేమీ చదవరని ఒక సీనియర్ రచయిత విసుక్కున్నారు. అసలు ఇంగ్లీషు పరిజ్ఞానమే వుండదని ఒక సినిమా విమర్శకుడు విమర్శించారు. ఈ రెండూ సీరియస్ సమస్యలే ఇన్పుట్స్ కి. ఈ వ్యాసకర్త ఒక డిస్కషన్లో ఓ దర్శకుడుకి చెప్పిన కామెడీ సీక్వెన్సుని,  అక్కడున్న ఇంకో కథకుడు వేరేచోట తీసికెళ్ళి అమ్మేశాడు. ఆ  పెద్ద సినిమాలో ఆ సీక్వెన్స్ హిట్టయ్యింది. వేరే ఆఫీసులో ఈ వ్యాసకర్తే  రాస్తున్న సీన్లని అక్కడున్న కథకుడు కాపీ చేసుకుని పై అంతస్తులోనే వున్న వేరే ఆఫీసులో ప్రతిరోజూ చేరవేస్తూంటే ఒకరోజు పట్టుకున్నారు. ఇన్పుట్స్ లేకపోవడం వల్లే ఇలాటివి చేసే ఖర్మ పడుతుంది. వీళ్ళని చూస్తే నవ్వొస్తుంది – అడిగితే మనమే కావాల్సినన్ని ఇన్పుట్స్ ఇస్తాంగా? పని చేస్తున్న సినిమాలకే  ద్రోహం చేయడమెందుకు?  ఒకసారి ద్రోహి ఇంకెప్పటికీ అచ్చోసిన ద్రోహియే. 
         
    ఇప్పటికిప్పుడు కథకుల్లో జర్నలిస్టు అంశ పుట్టుకు రావాలంటే రాదు. అది దాదాపు పుట్టుకతోనే వుంటుంది. కాకపోతే కనీసం ఇప్పుడు ఆపద్ధర్మంగా జిజ్ఞాస అయినా పెంచుకుంటే కొంతలో కొంత బెటర్. శోధన అనేది నిత్య కార్యక్రమం అవ్వాలి. నీరవ్ మోడీ పారిపోయిన రోజు చానెల్లో ఒక క్యాబ్ వాలా బాధ వెళ్ళబోసుకున్నాడు. తన క్యాబ్ ఈఎంఐకి ఒక్క రూపాయి తక్కువ కట్టినందుకు  సీజ్ చేస్తామని బ్యాంకు వాళ్ళు నోటీసులిచ్చారని లబలబ లాడేడు. దీనికి నవ్వూ రావొచ్చు, కోపంతో తిట్టుకోనూ వచ్చు. ఇది సాధారణ ఓటర్లు చేసే పని. కానీ సినిమాలు తీసే ‘ఓటర్’ ఏం చేయాలి? ఓట్లేసే ఓటర్లలాగా తనుకూడా నవ్వుకునో తిట్టుకునో వదిలెయ్యాలా? అలా చేస్తే అతడికి సినిమాల గురించి మాట్లాడే అర్హత వుండదు.  వెంటనే నోట్ చేసుకుని డేటా బ్యాంకులో పెట్టుకోవాలి. తను స్వార్ధంతో వుండాలి. చూసే, వినే, చదివే ప్రతీదీ, రాసే – తీసే సినిమాల దృష్టితోనే వుండాలి. ఇది మనకి పనికొస్తుందా అని పరిశీలించి,  పనికొస్తుందనిపిస్తే డేటా బ్యాంకుకి పంపాలి. న్యూస్ పేపర్ విధిగా చదవాల్సి వుంటుంది. ఏదో పైపైన చదివేస్తే కాదు. అండర్ లైన్లు చేసే దృష్టితో పెన్ను పట్టుకుని చదవాలి. లైట్ రీడింగ్ మెటీరియల్ లాగా కొన్ని వార్తలు మాత్రమే చదివితే కాదు. ఎడిట్ పేజీ వ్యాసాలూ కూడా చదివితే వివిధ అంశాలపైన అభిప్రాయాలు తెలుస్తాయి. అలాగే పత్రికల్లో కథలూ ఇతర ఆర్టికల్సూ తప్పవు. ఇవన్నీ డేటా బ్యాంకు అవుతాయి. డేటా బ్యాంకు వున్న కథకుడు మంచి ఆస్తిపరుడు. 
        
    ఇదంతా ఒకెత్తు అయితే డిజిటల్ ప్లాట్ ఫాం ఒకెత్తు. ఇవ్వాళ వచ్చిన ఒక కథ ఐడియాకి సంబంధించి ఏది తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్ ని మించిన వనరు లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులు, రచయితలూ అహర్నిశలూ పనిచేస్తూ వెబ్ సైట్స్ ద్వారా అందిస్తున్న సమాచారం మనకి ఉత్తపుణ్యాన లభిస్తోంది. లేని అంశమంటూ లేదు. రోమాన్స్ ఎలాటి పోకడలు పోతోందో, బ్రేకప్స్ ఎన్ని విధాలుగా జరుగుతున్నాయో ప్రతీదీ అప్డేట్ అవుతూ వుంటాయి. లవర్స్ ఇంకెలాటి కొత్తకొత్త సమస్యలెదుర్కొంటున్నారో, వాటికి పూజాబేడీ లాంటి వాళ్ళు చెప్పే పరిష్కారాలేమిటో చదువుకుంటే,  మూస ప్రేమ డ్రామాలకి ఎలా తెరదించవచ్చో తెలుస్తుంది. 
        
    డేటాబ్యాంక్ సృష్టించుకోవడానికి యాప్స్ వున్నాయి. క్లిపిక్స్, పాకెట్ మొదలైనవి. వివిధ వెబ్ సైట్లలో కావాల్సిన ఆర్టికల్స్ ని అప్పటికప్పుడు క్లిప్ చేసి ఈ యాప్ లో సేవ్ చేసుకుంటే అరచేతిలో ఇన్పుట్స్ వున్నట్టే. టాపిక్స్ వారీగా వీటి బాక్సుల్లో సేవ్ చేసుకోవచ్చు. ఇవేకాక లోర్ ఫోర్జ్ అనే రైటర్ రిసోర్సెస్ యాప్ వుంది. ఇందులో చాలా జనరేటర్లు వుంటాయి. ముఖ్యంగా ప్లాట్, మోటివ్, కాన్ ఫ్లిక్ట్ జనరేటర్లు, క్యారక్టర్ టైప్స్, ఇన్ స్పిరేషన్, ఐడియా జనరేటర్లు మొదలైనవి. 
       
    రాయలేక పోవడానికి  కారణమొక్కటే, చదవకపోవడం. కొత్తగా రాయలేకపోవడానికి కారణమొక్కటే, చదవకపోవడం. చూసిన సినిమాలే చూసి ఆ పాత మూసే రాయడానికి కారణమొక్కటే, చదవకపోవడం. చదివితే మెదడుకి బాగా ఎక్కుతుంది. అదిక వూరుకోదు. ప్రాసెస్ చేసుకుంటూ వుంటుంది. ఎప్పుడో ఎక్కడో అవసరమొచ్చి ఆలోచిస్తూంటే,  అది యాప్ లో సేవ్ చేశావ్ చూసుకో ఫో అని గుర్తుచేస్తుంది. మనం యాప్ ని క్లిక్ చేస్తాం. ఇంతే, చాలా సింపుల్. ఈ మాత్రం దానికి రూమ్మేట్స్ తో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో గరీబోళ్ళలాగా చొక్కాలు చించుకోవాలా? చుట్టూ ప్రపంచాన్ని, తీసే సినిమాల కోసం సమాచార కక్కుర్తితో చూడని కథకుడికి,  తన మనసులో గరీబీ హటావో ఎప్పుడుంటుంది?.

సికిందర్