విషయం 12. విక్రం ప్రీతి పేరెంట్స్ ని కలుస్తాడు. ప్రీతి ఒక అనాధ అనీ; మోహన్, లక్ష్మీ లు ఆమె పెంపుడు తల్లిదండ్రులనీ తెలుసుకుంటాడు.
సరస్వతి అనే ఆవిడ నడిపే అనాధాశ్రయం నుంచీ మోహన్ తమ్ముడు శివ, మరదలు ప్రియ, ప్రీతిని
చిన్నప్పుడు దత్తత తీసుకుని యూఎస్ వెళ్ళారనీ, అక్కడ వాళ్ళిద్దరూ ప్రమాదంలో చనిపోవడంతో, ప్రీతిని తెచ్చుకుని మోహన్ లక్ష్మీలు పెంచుకున్నారనీ
తెలుసుకుంటాడు. ఆ అనాధాశ్రయాన్ని ప్రీతి
మేనేజ్ చేస్తోందని కూడా తెలుసుకుంటాడు. అనాధాశ్రయం నిర్వాహకురాలు సరస్వతి, ప్రీతి
ఇచ్చే నిధులు దుర్వినియోగం కావడం లేదని చెప్తుంది.
వివరణ: కిడ్నాపర్ ని పట్టించే దూదీ సూదీ వుండగా ప్రీతి పేరెంట్స్ దగ్గర ఆరాలు తీస్తున్నాడు విక్రం. ఎక్కడ మా కూతురు? దూదీ సూదీ దొరికాక కిడ్నాపర్ ని పట్టుకోక ఇక్కడి కెందు కొచ్చావ్? - అనాల్సింది అనడు మోహన్. పైగా కూతురు పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకొచ్చాడు. ఇంకా ప్రీతి మొన్న రాత్రి ఎక్కడి కెళ్ళిందీ, నిన్న సాయంత్రం ఎక్కడి కెళ్ళిందీ అంటూ ప్రేక్షకులకి తెలిసిన విషయాలే అడిగాడు విక్రం. అంటే కాలేజీలో చదివే మీ కూతురు - ఎక్కడో సిటీ లో పబ్బుల్లో క్లబ్బుల్లో పడి తాగి - అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుమీద రూల్స్ ని అతిక్రమిస్తూ - డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ తిరిగొస్తూంటే మీకేం పట్టదా? కన్న కూతురు కాదనా? మీ వల్లే ఈ కిడ్నాప్ అనే నేరం జరిగి నాకు తలనొప్పి వచ్చిందని తెల్సా? ...అని నిలదీయడు, అసలే తనకున్న ఫ్లాష్ బ్యాక్ తో సతమతమవుతున్న విక్రం.
శ్రీదేవి నటించిన ‘మామ్’ అనే థ్రిల్లర్లో, కూతురు ఆ నైట్
ఎక్కడో ఫాం హౌస్ కి పార్టీకి వెళ్తోంటే,
‘సెల్ చార్జింగ్ వుందా?’ అనడుగుతుంది శ్రీదేవి. ఆమె చేయాల్సింది పోలీస్ యాప్ డౌన్ లోడ్ చేసివ్వడం,
బ్యాగులో ఒక చిల్లీ స్ప్రే వుంచడం- ఒక తల్లిగా, అందులోనూ టీచర్ గానూ. ఇవేం చెయ్యక, ముందు తను బాధ్యతగా వుండక, కూతురు
గ్యాంగ్ రేప్ అయిపోతే కత్తి పట్టుకుని రివెంజికి బయల్దేరుతుంది. ఇప్పుడేం లాభం
నేరం జరిగే అవకాశమిచ్చేశాక?
సరైన నేర కథలు కేవలం నేరస్థుణ్ణి పట్టుకునే దర్యాప్తు కథలుగా వుండవు. నేరము -నీతి చుట్టూ వుండే ప్రశ్నల్ని ఎక్కుపెట్టే క్రియేటివ్ ప్రక్రియలు. నైతిక విలువలకి పట్టంగట్టే, నైతిక బాధ్యతల్ని గుర్తుచేసే కళా రూపాలు. ఫిలిం నోయర్ జానర్ అప్పట్లో ఇదే చేసింది. తెలుగులో ‘నేనూ మనిషినే’ (1974) అనే క్రైం థ్రిల్లర్లో జడ్జి అయిన గుమ్మడి హత్య చేస్తాడు. తమ్ముడైన ఉన్నత పోలీసు అధికారి కృష్ణ, అన్నకి అనుకూలంగా కేసులో వాస్తవాల వక్రీకరణలకి పాల్పడతాడు (ఇందులో బుల్లెట్స్ తో వుండే బాలస్టిక్స్ సైన్స్ గురించి అప్పట్లోనే చూపించారు). రక్తసంబంధానికే లొంగి పోతాడు. హోదావల్ల అవకాశం దక్కితే స్వార్ధాలు, నైతికపతనాలు, అధికార దుర్వినియోగాలూ, సమస్త రుగ్మతలూ ఎలా వెల్లువెత్తుతాయో ఇక్కడ చూస్తాం మనం. చివరికి గుమ్మడియే దిగివచ్చి నైతిక ధర్మాన్ని స్థాపిస్తాడు. నేర కథలు నైతిక విలువల బ్యాక్ డ్రాప్ లో నైతిక విలువల్ని, బాధ్యతల్ని గుర్తు చేస్తూ వుంటాయి.
‘ప్రిజనర్స్’ (2013) లో ఇదెక్కువైపోయి, ఇన్వెస్టిగేషన్ తగ్గిపోయింది. ‘హిట్’ లో ఇన్వెస్టిగేషన్ అడ్డదిడ్డంగా పెరిగిపోయి, మోరల్ ప్రెమీస్ గల్లంతయ్యింది. ‘ప్రిజనర్స్’ లో ఇద్దరు బాలికలు అదృశ్యమవుతారు. పోలీస్ డిటెక్టివ్ లోకీ అనేవాడు కేసు చేపడతాడు. కానీ బాలికల్లో ఒకరి తండ్రి కిడ్నాపర్ మీద రివెంజితో చెలరేగిపోతాడు. ఇలా ఫాదర్స్ రివెంజి డ్రామా అయింది. ఇందులో పోలీస్ డిటెక్టివ్ లోకీ, మన విక్రం లాగే పర్సనల్ ఫ్లాష్ బ్యాక్ తో కిందా మీదా అవుతూంటాడు. బాగానే కాపీ కొట్టాడు మన విక్రం ని ‘ప్రిజనర్స్’ దర్శకుడు.
ఇక ప్రీతి మేనేజ్ చేస్తున్న అనాధాశ్రయంలో నిధులు దుర్వినియోగం కావడం లేదని చెప్పించి, అనుమానాల్నిమాత్రం అలాగే వదిలేశాడు కథకుడు. ఆమె అదృశ్యంలో అనాధాశ్రయం కోణాన్ని కొత్తగా కలిపాడు. అనుమానితుల సంఖ్య పెంచడానికి.
విషయం: 13. ఇరుగుపొరుగుతో ప్రీతి ఎలా వుంటుందని పేరెంట్స్ ని అడుగుతాడు విక్రం. షీలాతో క్లోజ్ గా వుంటుందని చెప్తాడు ప్రీతి తండ్రి మోహన్. మోహన్ లక్ష్మిల లాలాజలం, వేలిముద్రల శాంపిల్స్ తీసుకుంటారు. యూఎస్ లో తన తమ్ముడి ఆస్తి ప్రీతికి బదిలీ అయిందని చెప్తాడు మోహన్. అనుమానితుల లిస్టులో ప్రీతి పేరెంట్స్ ని కూడా చేరుస్తాడు రోహిత్.
వివరణ: అనుమానితుల సంఖ్య ఇంకా పెంచుతున్నాడు. ఇక్కడ ప్రీతి ఆస్తి కోణాన్ని ముందుకు తెస్తూ ఆమె పెంపుడు పేరెంట్స్ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాడు. ఆమెని కిడ్నాప్ చేయించి ఆస్తినెలా కొట్టేస్తారు. ఆమెని చంపేసివుంటారా? విక్రంకి ఈ అనుమానం వచ్చిందా? రాలేదు, అతడి స్కిల్స్ కి అంత సీను లేదు. ఒక దిశాదిక్కూ, వ్యూహం విధానం లేని ఇన్వెస్టిగేషన్. ఆ పేరెంట్స్ ని కూర్చోబెట్టి లాలాజలం, వేలిముద్రల శాంపిల్స్ లాగేశాడు. మేమెందుకివ్వాలి శాంపిల్స్ అని వాళ్ళు తిరగబడలేదు. చీఫ్ కి కంప్లెయింట్ చేయలేదు, ఇబ్రహీం విషయంలో చేసినట్టుగా. ఈ శాంపిల్స్ వ్యవహారం తర్వాత చివర్లో కథకుడు కథలో వాడుకోవడానికి- వీళ్ళని ఇరికించడానికి- అవసరం. కథలో ఈ అపహాస్యం ఎలా జరిగిందో గత వ్యాసంలో చెప్పుకున్నాం.
విక్రం వీళ్ళకైనా దూది చూపించి ప్రశ్నించడు - ప్రీతి ఫ్రెండ్స్ ఎవరైనా అత్తరు వాడతారా? పోనీ ప్రీతి డ్రగ్స్ తీసుకుంటోందా? ఆమె కారు దగ్గర విరిగిన సిరంజీ దొరికింది. ఆమె సెల్ ఫోన్ ఏదీ? ఆమె కాల్స్, సోషల్ మీడీయా యాక్టివిటీ చెక్ చేయాలి...అంటూ అడగాల్సిన ముఖ్య ప్రశ్నలేవీ అడగడు. ఇక పొరుగున షీలాతో ప్రీతి క్లోజ్ గా వుంటోందని ఇంకో క్లూ. ఇంకో అనుమానితురాలు.
విషయం 14. పొరుగున వుండే షీలాని కలిస్తే, ప్రీతి ఒక్కతే తనతో మాట్లాడుతుందనీ, తను డైవర్సీ కావడంతో ఎవరూ తనతో మాట్లాడరనీ అంటుంది షీలా. ప్రీతి మిస్సయిన సమయంలో తను తన కూతుర్ని కలవడానికి వెళ్లినట్టు చెప్తుంది.
వివరణ: షీలాతో ఇలా ఒక సబ్ ప్లాట్ ని ప్రారంభించాడు.
తర్వాత దీంతో ఇంటర్వెల్ సీను క్రియేట్ చేశాడు. సబ్ ప్లాట్ తో ఇంటర్వెల్ క్రియేట్
చేస్తారా, మెయిన్ ప్లాట్ తో చేస్తారా? ఇది ఇంటర్వెల్
సీన్లో చూద్దాం. షీలా బాధేమిటంటే తనను డైవర్సీ
అవడం వల్ల ఇక్కడందరూ తనని దూరం పెట్టారని. ప్రీతి ఒక్కతే తనతో ఫ్రెండ్లీగా
వుంటోందని. ఇంకా నయం, డైవర్సీతో నీకు సావాసాలేమిటని ఆ జనం, ఆమె పేరెంట్స్ ఆమెని
ఇంట్లో కూర్చోబెట్టలేదు. ఈ డైవర్సీని అన్యాయంగా కథకుడిలా కథకోసం కావాలని ఒంటరి చేశాడు.
ఇది ఇంటర్వెల్ సీన్లో తెలుస్తుంది. కథ కోసం పాత్రనా, పాత్ర కోసం కథనా? పాత్ర కోసం
కథనుకుంటే ఒక డైవర్సీ తో ఇలా చెయ్యడు. పాత్రకి అన్యాయం చేయకుండా కథనే
మార్చుకుంటాడు. మార్చుకునేలా చేస్తుంది పాత్ర. డైవర్సీ అంటే నెగెటివ్ క్యారక్టర్
కాదని తిరగబడుతూ. ఈ సినిమాలో లేడీస్ ని నెగెటివ్ గానే చిత్రించాడు కథకుడు. విక్రం పాయింటాఫ్
వ్యూలో నేహా బెడ్ మీద ఇంకొకడితో వుండగా, ప్రీతి అనే స్టూడెంట్ ని పబ్బుల్లో తాగే
అమ్మాయిగా (కనీసం బాధితురాలైన పాత్రని నెగెటివ్ మరకలతో చూపించకూడదన్న కథా మర్యాద పాటించకుండా),
షీలా డైవోర్సీ కాబట్టి అనుమానించదగ్గ క్యారక్టర్ అన్నట్టుగా, ఆఖరికి ‘హిట్’
ఉద్యోగి రోహిత్ భార్య స్వప్నని హంతకురాలిగా... ఇక నేహా తల్లిని, ప్రీతి తల్లినీ
ఒట్టి దిష్టి బొమ్మలుగా. తన కథలో లేడీసంతా ఇలా వున్నారని గమనించాడో లేదో కథకుడు.
ఇక
షీలాకి కూడా దూది చూపించి- అడగడు విక్రం. కథలో దూదిని సృష్టించి కథకుడు దానికదే ఒక
ప్లాట్ డివైస్ అయ్యేలా చేసుకున్నాడు. చేసుకున్నాక ప్లాట్ డివైస్ ని ప్లే చేస్తూ వుండాల్సిందే. దాంతో మిస్టరీ అంతు
చూడాల్సిందే. ఈ కథా పథకం ఓకే అనుకుంటే, అప్పుడు వెనక్కెళ్ళి ఇబ్రహీం తో సీను దగ్గర,
అతడికి దూది చూపిస్తే అతను కూడా తెలియదని చెప్పేలా చేసి కేసుని జటిలం చెయొచ్చు.
కేసు దర్యాప్తులో ఒక ప్రధాన క్లూని పట్టుకు సాగకపోతే, కథనం ఏకత్రాటిపై వుండదు.
విక్రం చేస్తున్నట్టుగా దారి పొడవునా ఏవేవో క్లూలు ఏరుకోవడమే. కథనం ఎటెటో
వెళ్ళిపోవడమే.
ఇంకోటేమిటంటే విక్రం అసలు క్రిమినల్ మైండ్ ని తెలుసుకునే ప్రయత్నమే చేయడం లేదు. కథకి ఓ పాయింటుని ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనే చేయడం లేదు. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో ట్రైనింగ్ వుంటుంది. ఈ ట్రైనింగ్ చేసొచ్చాడో లేదో తెలీదు. కిడ్నాపర్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? వాడు పరిచితుడా, అపరిచితుడా? పరిచితుడైతే మోటివ్ ఏమిటి. కాకపోతే మోటివ్ ఏమిటి? డబ్బుకోసమా? అయితే పేరెంట్స్ కి కాల్స్ ఎందుకు చేయడం లేదు? ఒకవేళ కాల్స్ ని పేరెంట్స్ దాస్తున్నారా? వాళ్ళ ఫోన్స్ ని సీజ్ చేసి ఎందుకు చెక్ చేయ కూడదు? కిడ్నాపర్ ఒకడేనా, వాడి వెనుక ఇంకెవరైనా వున్నారా? బ్లూ సెడాన్ కారుందంటే ఆ కారెవరిది? నగరంలో ఎన్ని బ్లూ సెడాన్ కార్లున్నాయి, వాటి రిజిస్ట్రేషన్ వివరాలేమిటి? అసలు ఈ కిడ్నాపర్ ప్రీతి బాయ్ ఫ్రెండా? వాడితో కలిసి ప్రీతి ప్లాన్ చేసిందా? తన ప్లాన్ ఎవిడెన్స్ సహా నేహాకి తెలిసిపోయిందని ఆమెని తనే కిడ్నాప్ చేయించిందా? కిడ్నాపర్ ఒకే రకం అత్తరు వాడుతున్నాడంటే, ఈ అత్తరు ఎక్కడ కొంటున్నాడు?... వగైరా వగైరా ప్రశ్నావళితో అర్జెంటుగా అదృశ్య విలన్ ని ప్రేక్షకుల సౌకర్యార్ధం క్రియేట్ చేయాల్సిన అవసరముంది ఈ కథకి. ప్రేక్షకులు విలన్ని ఫీల్ కాకపోతే, విలన్ చుట్టూ మిస్టరీని అనుభవించక పోతే, ఇంకేదీ పట్టించుకోరు. ఎండ్ సస్పెన్స్ కథలో చివరి వరకూ విలన్ కన్పించని అసంతృప్తిని ఇలా తీర్చాలి. నేరం -అదృశ్య విలన్- హీరో అనే త్రికోణం మీద ఫోకస్ చేసి నడిపినప్పుడు, పాయింటు కొచ్చి కథ ఒక కథలా వుండే అవకాశముంది
.
ఇప్పుడు విక్రం క్యారక్టరైజేషన్ ఎలా
వుండొచ్చంటే, ఎక్కడికెళ్ళినా అత్తరు వాసన కోసం ముక్కుపుటాలెగరేయ వచ్చు. ఎవర్ని
కలిసినా అత్తరు వాసన కోసం పట్టి పట్టి వాసన చూడొచ్చు. ఈ అత్తరు - దూది అన్నవి ఈ
కథలో ప్లాట్ డివైస్ ప్రాముఖ్యాన్ని సంతరించుకుని ఇలా తప్పనిసరి చేస్తున్నాయి కథనాన్ని
మరి. ఇంకా విలన్ని ట్రాప్ చేయడానికి అదే అత్తరు తనే పూసుకు తిరగొచ్చు. హాలీవుడ్ క్లాసిక్
‘డెత్ విష్’ (1974) లో ఇలాగే చేస్తాడు ఛార్లెస్ బ్రాన్సన్. తన పెళ్ళయిన కూతుర్ని
రేప్ చేసిన దోపిడీ దొంగల్ని పోలీసులు పట్టుకోలేకపోతూంటే, తానే రంగంలోకి దిగుతాడు.
ఆ దోపిడీ దొంగలెవరో తెలీదు. నగరంలో వున్న దోపిడీ దొంగలందర్నీ ఒక పథకం ప్రకారం
నిర్మూలిస్తాడు. బంగారం, లేదా డబ్బు ప్రదర్శిస్తూ రాత్రి పూట నగరంలో
సంచరిస్తూంటాడు. అవి చూసి దొంగలు దోచుకోవడానికి మీది కొచ్చినప్పుడు కాల్చి
చంపుతూంటాడు...ఈ మూవీకి ఎంత పేరొచ్చిందో, అంత వివాదాస్పదమైంది. సోసైటీతో కనెక్ట్
చేయకుండా క్రైం కథల్ని చెప్పలేరు. సొసైటీ అవకాశమిస్తేనే క్రైములు జరిగేది.
‘హిట్’ సినిమా ఆ మధ్య ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన దిశా కేసు స్పూర్తితో తీశారని కొందరనుకుంటున్నారు. అలాంటప్పుడు, అలాటి నేరాల అనాటమీని విప్పి ప్రేక్షకుల ముందు పెట్టాలి. లేదా దిశా కేసు ఎలా ముగిసిందో తెలిసిందే - అలా విక్రం మోటార్ సైకిలు మీద సంచరిస్తూ, కిడ్నాపర్స్ ని ట్రాప్ చేసి కాల్చి చంపడం మొదలెట్టాలి మోటార్ సైకిల్ డైరీస్ రాసుకుంటూ.
కథకుడి కథలో విక్రం ఒకరితర్వాత ఒకరు అనుమానితుల్ని పోగేసుకుంటూ, ఒకదానితర్వాతొకటి ఏవేవో క్లూస్ ఏరుకుంటూ పాసివ్ కథనం చేసేకన్నా, ఇలా పాయింటు పట్టుకుని అదృశ్య విలన్ కోసం యాక్షన్లోకి దిగితే, మోక్షం లభించేదేమో ఈ కథకి. అంటే ఇలా చేసి ఎండ్ సస్పెన్స్ కథల్ని నిలబెట్టుకోవాలని చెప్పడం కాదు. ఎండ్ సస్పెన్స్ కథలు వద్దేవద్దు!!
విషయం 15. విక్రం, రోహిత్ లు పబ్ కెళ్తారు. అక్కడ
బార్ అటెండర్ ని ప్రశ్నించబోతే అతను భయపడి పారిపోతాడు. వెంటాడి పట్టుకుంటే అతడి
దగ్గర డ్రగ్స్ బయటపడతాయి. అతణ్ణి పోలీసులకి అప్పజెప్తాడు విక్రం. ప్రీతి పేరెంట్స్
ని కలిసి పూజకి ఏర్పాట్లు చేయమంటాడు. ప్రీతి క్షేమం కోసం ఏర్పాటు చేసే పూజకి
ఎవరెవరు వస్తారో, ఎవరెవరు రారో కనిపెట్టేందుకు.
వివరణ: ‘ప్రిజనర్స్’ లో అదృశ్యమైన బాలికల గురించి కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు పోలీస్ డిటెక్టివ్ లోకీ. ప్రదర్శనకి ఆ బాలికల కుటుంబాలకి తెలిసిన వాళ్ళలో ఎవరెవరొస్తారు, ఎవరెవరు రారు చూసి విలన్ ని పట్టుకోవాలని. ఒకవేళ వచ్చినవాళ్ళలో విలన్ కూడా వుంటే కనిపెట్టి పట్టుకోవచ్చని. ఆ వచ్చినవాళ్ళలో ఒకడు దొంగ చూపులు చూస్తూంటాడు. వాణ్ణి పట్టుకోబోతే పారిపోతాడు. వెంటాడితే వాడు జంతు కళేబరాల దగ్గరికి దారి తీస్తాడు. ఫాల్స్ లీడ్ అని వదిలేస్తాడు లోకీ.
విక్రం పబ్ కెళ్ళి బార్ అటెండర్ ని ప్రశ్నించబోతే వాడు భయపడి పారిపోతాడు. వెంటాడి పట్టుకుంటే డ్రగ్స్ సప్లయర్ గా బయటపడతాడు. ఫాల్స్ లీడ్ అనుకుని వాణ్ణి పోలీసులకి అప్పజెప్పి చేతులు దులుపుకుంటాడు విక్రం. ఇలా ఎలా చేస్తాడు? ‘ప్రిజనర్స్’ లో వాడికి బాలికలతో సంబంధం లేదు. ఇక్కడ బార్ అటెండర్ డ్రగ్స్ సరఫరా చేస్తూంటే, పబ్ కొచ్చే ప్రీతితో సంబంధం వుండొచ్చుగా? ఫ్రెండ్ తో కలిసి ఆమె డ్రగ్స్ కి అలవాటు పడిందేమో? లేకపోతే ఈ ప్రీతి వచ్చే పబ్ లో డ్రగ్స్ యాంగిల్స్ ని సృష్టించడమెందుకు సీనులో? ఇంకో సినిమాలోంచి కాపీచేస్తే, కథెలా రాసుకున్నామో చూసుకుని కాపీ చేయాలి. ప్రీతి ఈ పబ్ కొస్తున్నట్టు కథ రాసుకుని, ‘ప్రిజనర్స్’ లో సీను తెచ్చి మార్చి పెట్టుకుంటే, ఇలాగే అర్ధమొస్తుంది ప్రీతితో. ఇందుకే ఏ సీను రాయాలన్నా సెటప్స్ అండ్ పే ఆఫ్స్ సరి చూసుకోవాలనేది.
అలా పబ్ ఎపిసోడ్ ఫెయిలయ్యాక విక్రం ఇలా ప్లానేశాడు పూజా కార్యక్రమమంటూ. ‘ప్రిజనర్స్’ లో కొవ్వొత్తుల ప్రదర్శన అనే డిటెక్టివ్ లోకీ ప్లానుని, విక్రం పూజా కార్యక్రమంగా మార్చుకున్నాడు. ‘ప్రిజనర్స్’ లో కొవ్వొత్తుల ప్రదర్శన లోంచే అనుమానితుడి పలాయనమనే సీనుంది. విక్రం దీన్ని విడదీసి వేర్వేరు సీన్లుగా పెట్టుకున్నాడు. పూజకి తెలిసిన వాళ్ళు ఎవరెవరొస్తారు, ఎవరెవరు రారు చూసి, రాని వాళ్ళని అనుమానించాలని. పూజ కేర్పాట్లు చేసుకోమంటాడు ప్రీతి పేరెంట్స్ తో. ప్రీతి పేరెంట్స్ ని ఆల్రెడీ అనుమానితుల లిస్టులో పెట్టాడు. వాళ్ళనే పూజ పెట్టుకోమనడమేమిటి? విక్రంని అర్ధం జేసుకోవడం షెర్లాక్ హోమ్స్ వల్ల కూడా కాదు. అసలు పూజ కేర్పాట్లు చేయించి తనకే ఇబ్బంది తెచ్చుకుంటున్నాడని తెలుసుకోవడం లేదు. మనకి తెలుస్తోంది... ఎందుకంటే అతడి మైండ్ మనకి తెలుసు.
విషయం 16. పూజకి
అందరూ వస్తారు. ఎవరి మీదా అనుమానం రాదు. ఇంతలో పొరుగున వుండే షీలా
పరుగెత్తుకొచ్చి, తలుపు దగ్గర లెటర్ దొరికిందని చెప్తుంది. ఆ లెటర్లో - డేడ్ బాడీ
వికారాబాద్ రాజూ గెస్ట్ హౌస్ ముందు వుందని రాసి వుంటుంది. విక్రం షాకవుతాడు. నేహా
మెదుల్తుంది. డిస్టర్బ్ అవుతాడు. ప్రీతి కోసం పూజ
దగ్గర హోమంలో మంట చూసి తలతిరిగి పడిపోతాడు (విశ్రాంతి).
వివరణ : మాయమైన ప్రీతి క్షేమాన్ని కాంక్షిస్తూ చేస్తున్న పూజకి మనకి చూపించిన అనుమానితులందరూ హాజరయ్యారు షీలా తప్ప. డైవర్సీగా ఆమెని బాయ్ కాట్ చేశారు కాబట్టి ఆమె రాదు. పోనీ అంత క్లోజ్ గా వుండే ప్రీతి కోసం ఇంట్లోనైనా ప్రార్ధించదు. ఇంట్లో ప్రార్ధిస్తున్నట్టు ఒక ఇంటర్ కట్ షాట్ వేయాలని ఆలోచించలేదు. ఉన్న ఒక్క ఫ్రెండ్ పట్ల ఆమె వైఖరిని కూడా దిగజార్చారు. ఇల్లు కాలి ఒకరేడుస్తూంటే చలి కాచుకున్నట్టు ఆమె పాత్ర చిత్రణ చేశారు. ఇది తర్వాత చూద్దాం.
పూజకి పోలీసు పటాలమంతా వచ్చింది చీఫ్ సహా. వీళ్ళు దేనికి, విక్రం ఒక్కడే వచ్చి కనిపెట్టక? ‘ప్రిజనర్స్’ లో పోలీసులు ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనగా బాలికల పేరెంట్స్ కి తప్ప ఇతరులకి తెలీనివ్వకుండా, పోలీస్ డిటెక్టివ్ లోకీ ఏర్పాట్లు చేసి, రహస్యంగా వుండి గమనిస్తూంటాడు ఆహుతుల్ని. విక్రం ఇంకెప్పుడాలోచిస్తాడు సక్రమంగా? ‘హిట్’ టీములో కూడా అనుమానితులున్నారా వాళ్ళంతా రావడానికి? వీళ్ళంతా ఇలా వచ్చి వుంటే, నిజంగానే ఏమీ ఎరగనట్టు విలన్ కూడా వస్తే, పోలీసుల్ని చూసి దొరికిపోకుండా తన చర్యలతో జాగ్రత్త పడడా?
ఇంతలో షీలా కేకలు పెడుతూ వచ్చేసింది. విక్రం ని తీసికెళ్ళి ఇంటి మెట్టు మీద ఒక లెటర్ని చూపించింది... ఆ లెటర్లో - డెడ్ బాడీ వికారాబాద్ రాజూ గెస్ట్ హౌస్ ముందు వుందని విషయం.
ఇది ఇంటర్వెల్ సీను. ఇక్కడ్నించీ ఈ ఇంటర్వెల్ సీనంతా చెడిపోవడం చూస్తాం. ప్రీతి కోసం పూజ జరుగుతూంటే, డెడ్ బాడీ గురించి లెటర్ రావడం మంచి బ్యాంగే. కానీ సెకండాఫ్ లో వెల్లడయ్యే అసలు విషయాన్ని బట్టి చూస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ చీటింగ్. ప్రేక్షకుల మెదళ్ళకి మేత పెడుతూ, వాళ్ళ ఐక్యూని పరీక్షిస్తూ నడుపుతున్న కథతో చీటింగ్.
సెకండాఫ్
లో వెల్లడయ్యే దాన్ని బట్టి ఈ లెటర్ కావాలని అబద్ధంగా షీలా సృష్టించిందే. డెడ్
బాడీ లేదు, ఏమీ లేదు. తనని అందరూ దూరం పెడుతున్నారు కాబట్టి పబ్లిసిటీ చేసుకుని
వార్తల కెక్కడానికే ఈ లెటర్ సృష్టి అంటూ
తనే ఒప్పుకుంటుంది. తనకి వున్న ఒకే ఒక్క ఫ్రెండ్ ట్రాజడీ లోంచి లాభం పొందాలన్న
దురాలోచన అన్నమాట. ఇలావుంది పాత్ర చిత్రణ ఇంటర్వెల్ సీను కోసం.
రెండో విఘాతమేమిటంటే, షీలా ఆమె పాట్లతో చేసింది పూర్తిగా ఆమెకి సంబంధించిన సబ్ ప్లాట్. ఒక సబ్ ప్లాట్ ని తీసుకొచ్చి మెయిన్ ప్లాట్ కి ముడిపెడుతూ ఇంటర్వెల్ ఎలా ఇస్తారు? మెయిన్ ప్లాట్ లో వున్న విక్రం, ప్రీతి, నేహా, అదృశ్య విలన్ పాత్రల్లో ఒకదాంతో ముడి పెట్టాలి గాని. ఈ కథకైతే అదృశ్య విలన్ తో ఇంటర్వెల్ ఇవ్వాలి. ఇక అదృశ్య విలన్ రంగంలోకి దిగాడన్నస్టోరీ డెవలప్ మెంట్ - ఛేంజ్ ఓవర్ - చూపించాలి. మెయిన్ ప్లాట్ గేరు మార్చాలి ఇంటర్వెల్ తో.
మూడో విఘాతమేమిటంటే. మంట చూసి విక్రం కుప్ప కూలడం. అసలా లెటర్ చూడగానే ప్రీతి మెదలదు. అది ప్రీతి డెడ్ బాడీ కావచ్చనుకోడు (మన మెంటల్ రిఫ్లెక్షన్లో ప్రీతియే ఫ్లాషవుతుంది. అవ్వాలి కూడా. ఎందుకంటే మనం ప్రీతి కథనే ఫాలో అవుతున్నాం, నేహా కథని కాదు. నేహా కథే లేదు). విక్రం విపరీతంగా షేక్ అయిపోతూ నేహాతోనే ప్రేమ దృశ్య మాలిక దర్శించుకుంటాడు. వాటీజ్ దిస్ విక్రం భాయ్? కాస్త మమ్మల్ని కనికరించు. నువ్వు తేల్చుకోవాల్సింది ఈ కేసుతో కాదు, నిన్నింతలా అన్ పాపులర్ చేస్తున్న స్టోరీ రైటర్ తో!
విక్రం
ఎప్పుడు మంట చూసినా తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి విచలితుడైపోతాడు. అలాంటిది
ఎందుకు ప్లాన్ చేయాలి ఈ పూజ? పూజ అంటే మంట వుంటుందని తెలీదా? మంట చూసి ఇంటర్వెల్
ని మసి చేస్తాడని తెలీదా? విక్రం! ఏంటబ్బా ఇది? నువ్వు ఫస్ట్ లాక్ డౌన్ లోకెళ్ళిపో!
చివరికి ప్రీతీ డెడ్ బాడీ కాదు, నేహా డెడ్ బాడీ కాదు, విక్రం ఫ్లాష్ బ్యాక్ గురించి ఇంటర్వెల్. ఫ్లాష్ బ్యాకులో ఏం జరిగిందో మనకి తెలియని ఫ్లాష్ బ్యాకు గురించి ఇంటర్వెల్!
***
ఎండ్ సస్పెన్స్ కథల్లో ఇంటర్వెల్ అంటే అనుమానితుల్లో ఒకరి మీద కీలక సమాచారం లభించడం లేదా, అదృశ్యంగా వున్న విలన్ తను దొరక్కుండా ట్విస్టు ఇవ్వడం.
ఎండ్ సస్పెన్స్ కథల్లో ఇంటర్వెల్ అంటే అనుమానితుల్లో ఒకరి మీద కీలక సమాచారం లభించడం లేదా, అదృశ్యంగా వున్న విలన్ తను దొరక్కుండా ట్విస్టు ఇవ్వడం.
(రేపు మిడిల్ టూ సంగతులు)
―సికిందర్