రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, May 2, 2020

933 : స్క్రీన్ ప్లే సంగతులు




       విషయం: 8. ప్రీతిని కిడ్నాప్ చేసిన వాడే కచ్చితంగా నేహా ఫ్లాట్ కెళ్లాడని, అతనెవరని రోహిత్ తో అంటాడు విక్రం. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేద్దామని రోహిత్ అడుగుతాడు. ప్రీతి కేసు ఫైల్స్, ఓఆర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్ ఫుటేజీ, అలాగే ఫోరెన్సిక్స్ కి పంపిన కేస్ మెటీరియల్ మొత్తం తన టేబుల్ కి రావాలంటాడు విక్రం. స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామంటాడు. నేహా ప్రీతి కేసు గురించి ఏమైనా మాట్లాడిందేమో షిండేని కనుక్కోమంటాడు. అలాగే నేహా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి కోర్టు పర్మిషన్ తీసుకున్నారేమో తెలుసుకోమంటాడు.

        వివరణ : మొత్తానికి ప్రీతి కేసు ఛార్జి తీసుకున్న విక్రం దర్యాప్తు ప్రారంభించాడు. విక్రం కథలోకి రావడానికి ఇప్పటికే 37 నిమిషాలు వృధా అయ్యాయి. ఇప్పుడు కేసు టేకప్ చేశాక యాక్షన్లోకి దిగిపోకుండా, ఇంకా ప్రీతిని కిడ్నాప్ చేసిన వాడే కచ్చితంగా నేహా ఫ్లాట్ కెళ్లాడనీ, ప్రీతి కేసు ఫైల్స్, ఓఆర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్ ఫుటేజీ, అలాగే ఫోరెన్సిక్స్ కి పంపిన కేస్ మెటీరియల్ మొత్తం తన టేబుల్ కి రావాలనీ అంటూ ప్రేక్షకులకి తెలిసిన ఉపోద్ఘాతమే వల్లెవేస్తూ సీను వేస్ట్ చేస్తున్నాడు (ఈ సీను తీయడానికి ఎంత ఖర్చయి వుంటుందో). వెనుక జరిగిన సీను ప్రకారం, నేహా సూది మీద డిటెక్షన్ అనే పాయింటు వచ్చింది. తను చీఫ్ దగ్గర కేసు పర్మిషనంటూ తీసుకున్నాక, నేహా లీడ్ నే పట్టుకుని ఇక డైరెక్టుగా - హాఫ్ వేలో ఫోరెన్సిక్ లాబ్ లో నేహా కంప్యూటర్ చెక్ చేస్తూ యాక్షన్ లోకి దిగిపోకుండా, ఇంకా ఏదో కేస్ మెటీరియల్ తన టేబుల్ కి రావాలనీ, స్టడీ చేయాలనీ చెప్తూ కూర్చున్నాడు. 

        పైగా ప్రీతి కేసు గురించి నేహా ఏమైనా మాట్లాడిందేమో షిండేని కనుక్కోమనడం ఒకటి! ఇదేం పోలీస్ దర్యాప్తు? ఇంకా షిండేని కనుక్కునేదేమిటి? నేహా కంప్యూటర్ని ఓపెన్ చేయమనక. ప్రీతీ కేసుతో నేహా కేసుకి సంబంధమున్నప్పుడు, రెండు కేసుల్నీ క్లబ్ చేసి విక్రం, అభిలాష్ లని కంబైన్డ్ దర్యాప్తు చెయ్యండ్రా అని మెడలు వంచాలి చీఫ్. కానీ చీఫే సిగ్గుతో తల వంచుకుని వున్నాడు. వీళ్ళకి సెల్యూట్ చేసే మర్యాద కూడా లేకపోతే ఏం చేస్తాడు. 


     ఇంతకీ తను రోహిత్ ని అడిగినవేవీ టేబుల్ మీదికి రావు, స్టడీ చేసేదీ వుండదు.  ఇక నేహా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి కోర్టు పర్మిషన్ తీసుకున్నారేమో తెలుసుకోమనడం ఒకటి. లాలాజాలం, వేలిముద్రలు శాంపిల్స్ తీసుకోవడాంకి కోర్టు పర్మిషన్ ఎందుకు? ఇవి క్యారక్టర్ బిల్డప్ డైలాగులు. తనకెంతో తెలుసనీ ప్రేక్షకులు అనుకోవడానికి బిల్డప్. ఇలా తప్పుడు సమాచారమిస్తూ. 

        అసలు నేహా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర శాంపిల్స్ దేనికి? శుభ్రంగా కిడ్నాపర్ ని పట్టిచ్చే దూదీ సూదీ వుండగా? అవి పట్టుకుని వాణ్ణి పట్టుకోకుండా, ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని అనుమానిస్తూ శాంపిల్స్ అడుగుతున్నాడంటే ఏమనాలి? ఇలాటి స్కిల్స్ కోసమా ఇంట్రడక్షన్లో  అంత శాంపిల్ స్కిల్స్ చూపించి బిల్డప్ ఇచ్చింది?

        తర్వాత ప్రీతి పేరెంట్స్ దగ్గర శాంపిల్స్ తీసుకునే సీనూ వస్తుంది. ఈ సీను తీయడానికి ఎంత ఖర్చైందో. మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్... ఇక బడ్జెట్ యాస్పెక్ట్ కూడా గుర్తు చేయాలేమో స్క్రీన్ ప్లే సంగతుల్లో...ఇంతకీ ఈ శాంపిల్స్ దేనికంటే, చివర్లో ప్రీతి శవం దొరికినప్పుడు ఆమె పంటి మీద తండ్రి డీఎన్ఏ, తొడ మీద అనాధాశ్రయం సరస్వతి తెల్ల వెంట్రుకా సాక్ష్యాలుగా దొరుకుతాయి. అంటే ఆమె హత్యలో పాల్గొన్న రోహిత్, ఆమె తండ్రి చర్మాన్నీ, సరస్వతి శిరోజాన్నీ వాళ్ళకి తెలియకుండా తీసుకుని శవానికి అంటించాడట. వాళ్ళని ఇరికించడానికి. దీనికోసం కథకుడు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ శాంపిల్స్ అంటూ అసహజ మాటలు విక్రం చేత అలా అన్పించడన్నమాట. అలా ప్రీతి పేరెంట్స్ నుంచి ముందస్తుగా శాంపిల్స్ సేకరించేలా చేశాడన్న మాట కథకుడు. ఇంత అడ్డగోలుగా మర్డర్ మిస్టరీ వుంటే ఎలా? 

        విషయం: 9. విక్రం ఎస్సై ఇబ్రహీం ని అతడి ఇంటికి తీసుకెళతాడు. దారిలో స్కూటర్ రిపేరు కిచ్చానని మెకానిక్ ఫాహద్ దగ్గరాగి స్కూటర్ తీసుకుంటాడు ఇబ్రహీం. ఇంటికెళ్ళాక నిన్ను అనుమానించడం లేదనీ, ఇంకేమైనా మర్చిపోయావేమో గుర్తు తెచ్చుకుని చెప్పమంటాడు విక్రం. ఇదే జరిగిందని చెప్తాడు ఇబ్రహీం. ఒకసారి ఇల్లు చూడొచ్చా అని గదిలోకి వెళ్లి అక్కడున్న అత్తరు బాటిల్ తీసి వాసన చూస్తాడు విక్రం. రోహిత్ వస్తాడు. ఈ అత్తరు కాదన్నట్టు తలాడిస్తాడు విక్రం. బయల్దేరుతూ ఇబ్రహీం కి సిగరెట్ ఆఫర్ చేస్తూ, మళ్ళీ అవసరమైతే హెల్ప్ చేయాలని షేకాండిస్తాడు విక్రం. అక్కడ్నించి తిరిగి వెళ్తూ, ఇబ్రహీం చూశానంటున్న బ్లూ కారు ఇంకెవరూ  చూడలేదని, శ్రీనివాస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా బ్లూ కారు జాడలేదనీ అంటాడు. అరచేతికున్న సెల్లో ఫేన్ టేప్ తీసిస్తూ, దీని మీద ఇబ్రహీం వేలిముద్రలు కలెక్ట్ చేసుకోమంటాడు. ఇబ్రహీం తాగి పడేసిన సిగరెట్ పీక మీద ఇబ్రహీం డీఎన్ఏ తీసుకోమంటాడు.

        వివరణ : ఇక్కడ ఎస్సై ఇబ్రహీం మీద దృష్టి పెట్టిన విక్రం అతడింట్లో ఇంకో దర్యాప్తు కాని దర్యాప్తు చేశాడు అతణ్ణి అనుమానిస్తూ. అమ్మాయిల మిస్సింగ్ కేసులిలా దర్యాప్తు చేస్తే, ఈ లోగా మిస్సయిన అమ్మాయిలు చచ్చూరుకోవడమే. ఇబ్రహీం ఇంట్లో అత్తరు సీసా వాసన చూసి, ఇది కాదన్నట్టు రోహిత్ ని చూసి తలూపుతాడు విక్రం. ఇది సిల్లీ సీను. ఆ ఇబ్రహీంకి ఆ దూదినే  చూపించి - ఇది నీదేనా కాదా చెప్పమంటే, ఈ అత్తరు మెకానిక్ ఫాహెద్ వాడతాడని వెంటనే చెప్పెసేవాడు ఇబ్రహీం. ఖేక్ ఖతం, దుకాన్ బంద్. ఇలా మూడోసారి కూడా సినిమా అయిపోతే ఇంకేంటి సీన్లు తీయడం? ఎన్ని షార్ట్ మూవీస్ తీస్తున్నారో అర్ధం గావడం లేదు.

        ఇక బయటికి వస్తూ ఇబ్రహీంకి సిగరెట్ ఆఫర్ చేసి, షేకాండిచ్చి వచ్చి, తన అరచేతికున్న సెల్లో ఫేన్ టేప్ తీసి రోహిత్ కిచ్చి, దాని మీద ఇబ్రహీం వేలిముద్రలు కలెక్ట్ చేసుకోమనడం ఇంకో తప్పుడు సంగతి. ఇబ్రహీం వేలిముద్రలు సేకరించడానికి విక్రం వాడిన టెక్నిక్. అయితే ఇబ్రహీం చేయి కలిపినప్పుడు అతడి వేళ్ళు విక్రం అరచేతిలోపల తాకడం లేదు, అరచేతి పైన తాకుతున్నాయి. విక్రం సెల్లో ఫేన్ టేపు అంటించుకున్నది అరచేతి లోపల. ఇబ్రహీం వేలిముద్రలు ఎక్కడ పడినట్టు? వేలిముద్రలు పడలేదు, కాలిముద్రలు పడలేదు. రోహిత్ దాన్ని లాబ్ లో టెస్ట్ చేయిస్తే తెల్లమొహం వేయక తప్పదు. ఇబ్రహీంకి ఆ సెల్లో ఫేన్ స్పర్శ తగిలే వుంటుంది. నా చేతి వేళ్ళు దానికి తగల్లేదుగా? - అనుకునే వుంటాడు. జోక్ చేయడం కాదు, సీరియస్ గానే  చెప్పుకుంటే ఒక ఆలోచన వస్తోంది...కమెడియన్లని పెట్టి కామెడీ ఇన్వెస్టిగేషన్ అంటూ తీస్తే, ఇంకో కొత్త జానర్ పుట్టుకొచ్చేలా వుంది. 

        ఇబ్రహీం డీఎన్ఏ కూడా సేకరించాలన్న దురాశతో విక్రం సిగరెట్ కూడా ఆఫర్ చేశాడు.  ఇబ్రహీం తాగి పడేసిన సిగరెట్ పీక మీద ఇబ్రహీం డీఎన్ఏ కూడా తీసుకోమన్నాడు విక్రం. సిగరెట్ పీక టూ ఇన్ వన్ అన్న సంగతి తెలీదేమో విక్రంకి. ఆ సిగరెట్ పీక మీదే డీఎన్ఏ కోసం ఇబ్రహీం ఉమ్మితో బాటు, అతడి వేలిముద్రలు కూడా పడతాయి. అరచేతికి ఏదో టేప్ అంటించుకుని తన మైండ్ బ్లోయింగ్ టెక్నిక్ తో ప్రేక్షకుల్ని ఆశ్చర్య చకితుల్ని చేయనవసరం లేదు. అసలు ఇబ్రహీం డీఎన్ఏ, వేలిముద్రలు తీసుకుని ఏం చేద్దామని? సింపుల్ గా  అతడికి దూది చూపించి యాది తెప్పిస్తే అయిపోయేదానికి. 


     కిడ్నాపర్ తో నేరుగా లింకున్న ఇంత ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్సు - ఈ దూదీ- సూదీ  వుండగా, ఇంకెలా ఈ సినిమా చూపించినా షార్ట్ మూవీసే పుట్టుకొస్తాయి- తడవకో ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అవుతూ. 

        ఈ సినిమాలో చివరి వరకూ విక్రం కాదేదీ కవిత కనర్హం అన్నట్టు, ఏదిపడితే అది ర్యాగ్ పికర్ లా ఎత్తుకెళ్ళి ఫోరెన్సిక్ లాబ్ లో పడెయ్యడం చూడొచ్చు. చీటికీ మాటికీ ఫోరెన్సిక్ లాబ్ అంటూ పాన్ షాప్ లా వాడేశాడు. తమ ‘హిట్’ నే  అలా ట్రీట్ చే స్తున్నప్పుడు ఫోరెన్సిక్ లాబ్ ని వదిలిపెడతారా. 

        విషయం: 10. కాలేజీకి వెళ్లి అజయ్, సంధ్య అనే స్టూడెంట్స్ ని దర్యాప్తు చేస్తాడు. అజయ్ మీద అనుమానాలు రావు. కిడ్నాపైన ముందు రోజు తనూ ప్రీతీ పబ్ కెళ్లామని అంటుంది సంధ్య. అక్కడేం జరగలేదని అంటుంది.  చంద్రమౌళి అనే టీచర్ మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. చంద్రమౌళిని కలిసి అతడి పాత్రేమీ లేదని నిర్ధారించుకుంటాడు విక్రం. 

        వివరణ: ఈ సీన్లు కూడా వృధా. చంకలో పిల్లనుంచుకుని వూరంతా తిరిగిన సామెత. దూదీ సూదీ వున్నాక ఈ కాలేజీ కహానీలకి అర్ధం లేదు. 

        విషయం: 11. పబ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలని రోహిత్ తో అంటాడు విక్రం. ప్రీతి కేసు గురించి షిండేకి నేహా ఏమైనా చెప్పిందేమో కనుక్కున్నావా అని అడుగుతాడు. ఆమె ఏం చెప్పలేదని అంటాడు రోహిత్. ఇంతలో అభిలాష్ వచ్చి, ప్రీతి మీద నీకెందుకు ఆసక్తి అని నిలదీస్తాడు. 

        వివరణ:  కాసేపు దూదీ సూదీ మర్చిపోయి, ఇంకా చేస్తున్న దర్యాప్తు కూడా ఎలా చేస్తున్నాడో చూద్దాం. పబ్ లో ఏమైనా జరిగిందేమో తెలుసుకోబోతున్నాడు మంచిదే. ఈ పబ్ సీను ‘ప్రిజనర్స్’  ( 2013)  లో వేరే సీనులోంచి తీసి వాడినట్టుగా వుంది. ఇది తర్వాత చూద్దాం. పోతే మళ్ళీ షిండే గురించి అదే పేలవమైన డైలాగు. నేహా షిండేకి ఏమీ చెప్పలేదని రోహిత్ జవాబు. అంటే షిండే దాస్తున్నట్టా? మరెందుకు షిండే ఆమె కంప్యూటర్ ఓపెన్ చేసి, ఇంత ప్రధానమైన కేసు గురించి తెలుసుకోడు? ఆమె లేకపోతే ఇక కేసు మురిగిపోవాల్సిందేనా? ఇప్పటికీ విక్రం ఎందుకు వెళ్లి సూది సమాచారం కావాలని కోరడు? కోరాలని తెలీదు కాబట్టి. 

        ఇక నేహా మిస్సింగ్ కేసు ఏమైందో, అభిలాష్ ఏం చేస్తున్నాడో తెలీదు. ఇప్పుడొచ్చి ప్రీతి మీద నీకెందుకు ఆసక్తి అంటూ విక్రంతో గొడవపడతాడు. ఈ పాత్రల ప్రాబ్లమ్స్ ఏమిటో, గొడవలేమిటో అర్ధంగాదు. ప్రేక్షకులకి అనవసర మానసిక శ్రమ. 

        మర్డర్ మిస్టరీలకి ఎండ్ సస్పెన్సులతో వాటి జానర్ మర్యాదలుంటాయి. అవైనా పాటించలేదు. బ్లేక్ స్నీడర్ ‘సేవ్ ది క్యాట్’ స్క్రీన్ ప్లే రచనా పుస్తకం చదివానన్న కొత్త దర్శకుడు, సినిమా ఇలా తీశాడేమిటా అన్పించక మానడు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పుస్తకాలు చదవడం వేరు, జానర్ మర్యాదలు తెలుసుకోవడం వేరు. తను తీసిన ఈ ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీని ఎలా రాసి ఎలా తీస్తారో రీసెర్చి కూడా చేసివుంటే ఇంత గందరగోళం వుండేది కాదు.

(మిడిల్ వన్ మిగతా భాగం మరింత సరదాగా రేపు)

సికిందర్