రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, February 10, 2019

రిపీట్ ఆర్టికల్

వి
డు
దల 
య్యే  సినిమాల  గురించి అసలేం తెలుసుకోకుండా సినిమాలు  చూస్తే  ఎలాటి ప్రయోజనాలుంటాయి రైటర్స్ కి? ఈ ప్రశ్నని తాజాగా గతవారం విడుదలైన ‘24’ మీద ప్రయోగిస్తూ, అసలా సినిమా గురించి ప్రింట్, విజువల్, ఆడియో సమాచారాన్నంతటినీ బ్యాన్ చేసుకుని, వాటి వైపు చూడకుండా,  సినిమా గురించి ఏమీ తెలీని అమాయకుడిలా ఈ వ్యాసకర్త ఆ సినిమా కెళ్తే, ఒక అద్భుత ప్రపంచం ఆవిష్కారమైంది. అంటే సగటు ప్రేక్షకుడి పాయింటాఫ్ వ్యూలో కాదు ఆ  అద్భుత ప్రపంచం.. దాని కథా కథనాలు, పా త్రలు, నటనలు, పాటలు, ఫైట్లు వగైరా విషయపరమైన సమాచారానికి సంబంధించి అనుభవమైన ఎడ్యుకేషన్. సినిమాల గురించి ముందస్తు సమాచారంతో, అంచనాలతో ఒక అభిప్రాయం ఏర్పరచుకుని చూడడం వేరనీ, అసలేం తెలుసుకోకుండా ప్రత్యక్ష ప్రమాణం (direct perception) తో చూడడం వేరనీ తెలిసొచ్చింది…


        అంటే సినిమాలకి పబ్లిసిటీ  ఉండకూడదని కాదు. కచ్చితంగా అవసరమే. ప్రేక్షకుల్ని బలవంతంగా ఆకర్షించడానికి పబ్లిసిటీ వుండాల్సిందే.  వద్దన్నా అంత బలవంతంగా ఆకర్షిస్తే తప్ప,  ఇవ్వాళ ఇన్నేసి వివిధ దృశ్య మాధ్యమాల ప్రభావంలో కొట్టుకు పోతున్న ప్రేక్షకులు ఓ పట్టాన సినిమాల్ని పట్టించుకునేలా లేరు. కాబట్టి బలవంతంగా బరితెగించి వాళ్ళని ఆకర్షించాల్సిందే. తాళ్లూ సంకెళ్ళూ వేసి వాళ్ళని థియేటర్లకి లాగాల్సిందే. 

        కానీ ఒక వృత్తిలో వున్న రైటర్స్ వినియోగదారుల్లా కాకుండా (ప్రేక్షకులుగా కాకుండా) ఉత్పత్తిదారుల్లా వుంటే బావుంటుంది, ఇంకో వృత్తిలో వున్న రివ్యూ రైటర్స్ కూడా వినియోగదారుల్లా కాకుండా (ప్రేక్షకులుగా  కాకుండా)  ఉత్పత్తిదారుల్లా వుంటేనే బావుండొచ్చు. సినిమాల గురించి ముందస్తు అంచనాలూ అభిప్రాయాలూ అనేవి ట్రేడ్ పండితుల సంగతి.  రైటర్స్ కి దీంతో పనిలేదు పనికిరాని టైం పాస్ కి తప్ప. సినిమాలు చూసే ముందు రాబోయే సినిమాల గురించి అంచనాలు, ముందస్తు అభిప్రాయాలూ అనేవి రైటర్స్ ఏర్పర్చుకోకుండా వుండాలంటే, విడుదలయ్యే ముందు ఆ  సినిమాల పబ్లిసిటీ వైపు కన్నెత్తి  చూడకూడదు. ఆ ఫస్ట్ లుక్ లో హీరో గెటప్ చూడకూడదు, ట్రైలర్స్ లో పంచ్ డైలాగులు వినకూడదు, కథేమిటో తెలుసుకోకూడదు, విజువల్స్ చూడకూడదు, మేకింగ్ ఎలా వుందో చూడకూడదు, ఆడియో అస్సలు వినకూడదు, పోస్టర్లు, పత్రికల్లో ప్రకటనలూ కూడా చూడకూడదు. సినిమాలు చూసే ముందు రివ్యూలు కూడా చదవకూడదు, సినిమా ఎలా వుందని ఎవర్నీ అడక్కూడదు, చర్చలు పెట్టకూడదు. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణ పధ్ధతి  అందించే ప్రయోజనాలకి విఘాతం  కల్గిస్తాయి. 

       టీవీ ఛానెల్స్ లో వంటావార్పూ ప్రోగ్రాముల్లో యాంకర్ కి తనేం రుచి చూడబోతోందో ముందు అస్సలు తెలీదు. చూద్దామన్నా మార్కెట్ లో ఆ వంట తాలూకు శాంపిల్ కూడా దొరకదు, పబ్లిసిటీ కూడా వుండదు. ఆ వంటతను వండి పెట్టనంత వరకూ ఆ వంటకం రుచే, రూపు రేఖలే తెలీవు ఆమెకి. పరీక్షా హాల్లోకి వెళ్ళే వరకూ ప్రశ్నాపత్రం ఎలా వుంటుందో  తెలీనట్టూ, ఆ వంటతను వండి పెట్టాకే రుచి చూసి- అపుడు అన్ని ప్రోగ్రాముల్లో  ఒకే ఎక్స్ ప్రెషన్ తో, ఒకేలాంటి  డైలాగుతో  -అబ్బ,  ఎంతబావుందో-  అంటుంది. ఇంతకి  మించి  వాళ్లకి వేరియేషన్స్ వుండవు. అన్ని వంటల రుచికీ  ఒకటే  లైబ్రరీ షాట్ కామెంట్ -కం -ఎక్స్ ప్రెషన్ ఇంటర్ ప్లే. అలాటి యాంకర్స్ జీవితంలా వుండాలి రైటర్స్ జీవితం. వంట చేస్తూంటే- ఈయన  బాగా వండుతున్నాడు, దీని గురించి నేను బాగా చెప్పాలి-  అని ఏ యాంకరూ అనుకోదు బహుశా. కానీ సినిమా చూస్తూ - మా హీరో సార్  బాగా నటించేస్తున్నారు, సినిమా చాలా బావుంది- అనే భజన  భక్తి భావంతో రైటర్ నిరభ్యంతరంగా అనుకోవచ్చు. అతడిష్టం. దీంతో ప్రత్యక్ష ప్రమాణం మాత్రం ఏర్పడదు. అది ముందు ఏర్పరచుకున్న అభిప్రాయంతో అనుపలబ్ది (non - perception) ప్రమాణం అవుతుంది.

        ప్రత్యక్ష ప్రమాణం వర్కౌట్ అవాలంటే- దాని ప్రయోజనాల గొప్ప తెలియాలంటే- చూడబోయే సినిమా గురించి పబ్లిసిటీకి కళ్ళూ చెవులూ మూసుకుని, జీరో నాలెడ్జితో, ఒక ఏమీ తెలీని అమాయకుడిలా రైటర్ వెళ్లి సినిమాలు చూడాలి. జీరో నాలెడ్జి ఎందుకంటే, రైటర్ ఒక హీరోకో, నిర్మాతకో, దర్శకుడికో కథ చెప్పబోయే ముందు వాళ్ళా కథ గురించి జీరో నాలెడ్జి తోనే , ఫ్రెష్ మైండ్ తోనే  వుండి వింటారు కాబట్టి.  అలాటి జీరో నాలెడ్జితో, ఫ్రెష్ మైండ్ తోనే  రైటర్ కూడా సినిమాలు చూడాలని కమిటవాలి. ప్రేక్షకులు పబ్లిసిటీ చూసి పూర్తి నాలెడ్జితో బుద్ధిపూర్వకంగా  సినిమాల కెళ్తే, రైటర్ అప్పుడే  బస్సు దిగి సిటీ చూస్తున్న పల్లెటూరి వాడిలా, జీరో నాలెడ్జితో యాంత్రికంగా వెళ్ళాలి. థియేటర్ దగ్గరి కెళ్లి సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులతో, - సినిమా ఎలా వుంది బాబూ- అని  ఎగ్జిట్ పోల్ సర్వే  కూడా నిర్వహించకూడదు. ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో అవగానే రిజల్ట్ కోసం ఆదరాబాదరా ఫోన్లు కూడా చేయకూడదు- అది తన కథతో వచ్చిన సినిమా అయితే తప్ప. ఇక చూడదల్చుకోని చిన్నా చితకా సినిమాలతో ఈ నిషేధాలు  అవసరమే  లేదు. 


       సినిమా ట్రైలర్స్ కూడా కథ తెలిసిపోయే విధంగా ఉంటున్నాయి. లేదా ఫలానా టైపు సినిమాగా  తెలిసిపోయేట్టు ఉంటున్నాయి. ట్రైలర్స్ అన్నీ ఆ సినిమాలో  హీరో చుట్టే  వుంటాయి. హీరో పంచ్  డైలాగ్- ఒక ఫైట్- ఒక పాట. ఒక్కో పంచ్ డైలాగుతో ఒక్కో ట్రైలర్ విడుదల చేస్తూంటారు. ఇవి వినీ వినీ థియేటర్ కి వెళ్లి చూసేసరికి ప్రేక్షకులకి ఏం థ్రిల్ మిగిలి వుంటుందో గానీ, రైటర్లు సర్ప్రైజ్ ఎలిమెంట్ ని కోల్పోతారు. కథాగమనంలో వచ్చే డైలాగులు అప్పటికప్పుడు ఆ ప్యాకేజీలో- దాని నేపధ్యంతో పాటు కలిపి  చూసి- అక్కడి కక్కడే  ఎలా వర్కౌట్ అయ్యిందో గమనించడం వేరు, విడిగా ముందే డైలాగులు  వినీవినీ ఒక అభిప్రాయంతో వెళ్లి కథాగమనంతో పాటూ చూసి ఆ డైలాగు వర్కౌట్ అయిన విధం  పసిగట్టడం వేరు. ‘షోలే’ లో ఒక అమ్జాద్ ఖాన్ డైలాగులో, ‘ముత్యాలముగ్గు’ లో ఒక రావుగోపాలరావు డైలాగులో బయట ఎన్నెన్ని సార్లు విన్నా, తెర మీద మళ్ళీ మళ్ళీ చూడాలన్పించడానికి కారణం- ఆ డైలాగులకి దడి కట్టిన అత్యుత్తమ పాత్ర చిత్రణలు, వాటి అనితరసాధ్యమైన డ్రమెటిక్ నేపధ్యాలూ.  రైటర్లు ఎన్ని లక్షల సార్లు ఈ డైలాగులు విన్నా, సినిమా చూసినప్పుడల్లా ఒక్కో కొత్త కోణం, ఒక్కో కొత్త భావం స్ఫురిస్తూనే వుంటుంది తప్పకుండా. 

        హాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ కి  సాధారణంగా ఒక పద్ధతిని అవలంబిస్తారు. అవి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లాగే వుంటాయి. బిగినింగ్ లోంచి హీరో ఎవరో తెలిపే కొన్ని కట్స్, మిడిల్లోంచి హీరో ఎదుర్కొనే సమస్యలోంచి కొన్ని కట్స్, చివర ఎండ్ లోంచి చాలా ఎక్సైటింగ్ యాక్షన్ కట్సూ తీసుకుని,  గొప్ప సస్పన్స్ నీ, ఇంటరెస్ట్ నీ  క్రియేట్ చేస్తారు-  
వీటిని ఫాలో అవుతూ మూడు ఆడియో, విజువల్, వెర్బల్ క్యూస్ (సంకేతాలు) తో సినిమా చూడాలన్న ఆత్రుత, ఆందోళనా  ఇంకా  పెంచేస్తారు. వాళ్ళు విషయపరంగా  ఆడియెన్స్ ని టీజ్ చేస్తారు, తెలుగులో కేవలం  హీరో విన్యాసాల పరంగా టీజర్స్ చూపిస్తారు.
  
        సినిమా చూస్తున్నప్పుడు ‘విషయం’  ఎలాగెలా రివీల్ అవుతూ ఎక్కడెక్కడ ఎలాగెలా   ఆసక్తిరేపే బీట్స్ తో వర్కౌట్ అయిందో,  రైటర్ ఒక ఉత్పత్తి దారుడి మెంటాలిటీ తో  ఫస్ట్ హేండ్ నాలెడ్జి తో గమనించాలంటే, ముందు నుంచీ పబ్లిసిటీ కి ఏమాత్రం ఎక్స్ పోజ్ కాకూడదు.

‘24’ అనే గతవారం విడుదలైన సూర్య నటించిన  సైన్స్ ఫిక్షన్ సినిమా  విషయంలో, ఈ వ్యాసకర్త ఈ ప్రయోగాన్నే దృష్టిలో పెట్టుకుని, సినిమా గురించి జీరో నాలెడ్జితో  పరీక్షకెళ్ళే విద్యార్థిలా వెళ్లి చూస్తే. ఒక కొత్త అనుభవం ఎదురయ్యింది- ఇంతకాలంగా  సినిమాలు చూస్తూ వస్తున్న తీరుతో అనుభవం వేరు, ఇప్పుడు వేరు. ఇంతకాలం ముందుగానే  సినిమా గురించిన  సమాచారం మెదడు కెక్కించుకుని చూడ్డంవల్ల యాంత్రికంగా చూసినట్టు అన్పిస్తే, ఇప్పుడు ఏమీ తెలుసుకోకుండా చూస్తూంటే ఎడిటింగ్ టేబుల్ దగ్గరో, ఫస్ట్ కాపీ వచ్చినప్పుడో, ఇంకెలాటి మీడియా ఓవర్ లోడ్ ప్రారంభం కాకముందే ఒరిజినాలిటీతో చూస్తున్న ఫీలింగ్.  

DISTRACTED? NO WORRIES!  Courtesy: www.fulfilmentdaily.com

 ఒక్క సైన్స్ ఫిక్షన్ అని మాత్రమే ఈ సినిమా గురించి తెలుసు తప్ప, ఇందులో సూర్య ది త్రిపాత్రాభినయమని కూడా తెలీదు. విషయమేమేటో  ప్రత్యక్ష ప్రమాణంతో మనం తెలుసుకుని ఆ మంచీ చెడ్డలు అనుభవించాలి తప్ప, ఇతరత్రా తెలుసుకున్న ఉపమాన ప్రమాణం (comparison- perception) ముందు పెట్టుకుని, పోల్చుకుంటూ సెకెండ్ హేండ్ విశ్లేషణ చేసుకోవడం తగదని తెలిసొచ్చింది. ముందు తెలుసుకున్న సమాచారం ఏమీ లేకపోవడంతో,  ఫ్రెష్ గా ఏకాగ్రత అంతా చెక్కుచెదరకుండా చూస్తున్న సినిమా మీదే కేంద్రీకృతమై వుంది. దీని ఏ ట్రైలర్ లోని విజువల్సూ అడ్డు పడలేదు. దీని ఏ ఆడియో పాటా గుర్తుకు రాలేదు. అంతా ఎలైస్ ఇన్ వండర్ లాండ్ లాంటి ప్రపంచం. త్రిపాత్రాభినయమనీ తెలీదు, ‘24’ అంటే అర్ధమేమిటో ఏమిటో తెలీదు, విజువల్స్ ఎలా ఉంటాయో తెలీదు, పాటలెలా ఉంటాయో తెలీదు...ఏమీ తెలీదు! ఇప్పుడే ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకోవవడం. అప్పుడప్పుడు దర్శకులు తాము రాసుకున్న కథలు విన్పిస్తూంటారు. వాటి గురించి ముందుగా మనకేమీ తెలీదు. చెప్తున్నప్పుడే తెలుస్తూంటుంది. ఫలానా అతను  ఫలానా ఈ విధంగా వున్న కథ చెప్తాడు,  వినండి-  అని ఎవరైనా అంటే, ఓహో అలాటి కథా అనే అంచనానో అభిప్రాయమో ముందుగానే మనకేర్పడిపోతుంది. అతను కథ చెప్తున్నప్పుడు చెప్తున్నదాంతో ముందుగా ఏర్పడ్డ ఇంప్రెషన్ అడ్డుతగులుతూ తులనాత్మక పరిశీలనకి  దారి తీస్తూ వుంటుంది. ఇదే వద్దనేది.

రైటర్ అనేవాడు ఎలాటి ఇన్ పుట్స్  లేకుండా సినిమాలు చూస్తూంటే, తను నిర్మాతకో దర్శకుడికో హీరోకో కథ చెప్తూ, తన కథ గురించి ముందుగా ఏమీ తెలీని వాళ్లకి ఎలాటి థ్రిల్లో నిల్లో కలిగించగలడో, సరీగ్గా అలా తను సినిమాలు చూస్తున్నప్పుడూ అలాటి ఒరిజినాలిటీతో థ్రిల్లో నిల్లో  వినియోగదార్లయిన ప్రేక్షకులకంటే ఉత్పత్తి దారుగా ఎక్కువ ఫీలవగలడు. 

        అలా చూసిన సినిమాలకి నోట్స్ రాసి పెట్టుకుంటే అవే వాటి ఫస్ట్ హేండ్ ఇన్ఫర్మేషన్ గా తర్వాత రాస్తున్న కథలకి రిఫరెన్సుగా ఏర్పడతాయి. మరొకటేమిటంటే, ఇలా ప్రత్యక్ష ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చూస్తూంటే, రాసుకుంటున్న స్క్రిప్టు మీద కూడా ఇంకా దేని ప్రభావమో పడకుండా ఒరిజినాలిటీతో, సొంత బ్రాండింగ్ తో తొణికిస లాడుతుంది. స్వావలంబన చేకూరుతుంది. ఎవర్నో గురువుగానో, గైడ్ గానో పెట్టుకునే అవసరమే వుండదు. రైటర్స్ కి గురువులూ గైడ్సూ వుండరు, ఎందుకంటే 
వాళ్ళే సమాజానికి గురువులూ  గైడ్సూ  కాబట్టి!

-సికిందర్

Sunday, May 8, 2016





Thursday, February 7, 2019

736 : ఇంటర్వ్యూ


     సినిమా నిర్మాణం అనేది సమిష్టి కృషి.  మొత్తం తారాగణం, యూనిట్, క్రియేటివ్ టీం అందరి నుంచీ గొప్ప నైపుణ్యాన్నీ ప్రతిభనూ డిమాండ్ చేస్తుంది సినిమా నిర్మాణం...కానీ సినిమాకి ఒరిజినల్ కళాకారుడు రచయిత మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ- నటులు, దర్శకులు, ఛాయాగ్రాహకులు, ప్రొడక్షన్ డిజైనర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణులూ మొదలైన వారంతా ఆ రచయిత ఆవిష్కరించి సృష్టించిన కథా ప్రపంచానికి,  అందులోని పాత్రలకి, ఘటనలకీ భాష్యం చెప్పడానికీ, జీవం పోయడానికీ ప్రయత్నించే కళాకారులు మాత్రమే...అంటారు సుప్రసిద్ధ స్క్రీన్ ప్లే పండితుడు రాబర్ట్  మెక్ కీ. ఈయన రాసిన స్టోరీఅనే ఉద్గ్రంథం  సినిమా రచయితలకి / దర్శకులకి మార్గదర్శిగా అలరారుతోంది. స్క్రీన్ ప్లేలకి సంబంధించి డెబ్రా ఎకర్లింగ్ కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మెక్ కీ అనేక విజ్ఞానదాయక విషయాలని ప్రస్తావించారు. అవేమిటో చూద్దాం...

సర్, బలమైన కథలో మౌలికంగా ఏఏ  అంశాలు ఉంటాయంటారు?
          ఈ మౌలికమైన అంశాలేమిటని  చెప్పడానికే  ‘స్టోరీఅనే నా 500 పేజీల గ్రంథమంతా పట్టింది. ఈ ప్రశ్న ఎలాంటిదంటే, సంగీతంలో వుండే మౌలికాంశాలేమిటని అడగడం లాంటిదే. ఏది మౌలికమో ఎలా నిర్ణయిస్తాం?  ఉదాహరణకి కొంతమంది- కథల్లో డైలాగుల్ని మౌలిక అంశంగా భావిస్తారు. మరి సైలెంట్ ఫిలిమ్స్ సంగతేమిటి? బ్యాలేల మాటేమిటి? కథల్ని అందంగా చెప్పే వివిధ కళారూపాలూ మాధ్యమాలూ అనేకం వున్నాయి. వీటన్నిటిలో కామన్ గా వుండే మౌలికాంశాలేవో కనిపెట్టలేం. దేని మౌలికాంశాలు దానివే. కాబట్టి కళారూపాలని బట్టి మౌలికాంశాలు మారుతూంటాయని చెప్పుకోవాలి. 

          ఇంకాస్త సరళంగా, కథకి నిర్వచనం చెబుతూ మీరడిగిన ప్రశ్నకి జవాబు చెప్తాను. కథ ఎలా ప్రారంభ మవుతుందో ఒకసారి గమనించండి. మానవ నిర్ణయం వల్లో, సృష్టిరీత్యా జరిగే ప్రమాదాల వల్లో  ఓ ఘటన జరిగినప్పుడు కథ  ప్రారంభమవుతుంది. అది కథానాయకుడి జీవితంలో అంతవరకూ ఉంటున్న  ప్రశాంతతని తలకిందులు చేస్తుంది. అప్పుడా కథానాయకుడు తిరిగి ఆ ప్రశాంతమయ జీవితాన్ని కోరుకుని, దాన్ని స్థాపించుకునే లక్ష్యంతో ఉద్యమిస్తాడు. ఈ లక్ష్యమే అతడి ఆకాంక్ష అవుతుంది. ఇది వినా అతను ఉద్యమించలేడు. అప్పుడు అతను తన లోపలా, బయటా వుండే వ్యతిరేక శక్తులతో పోరాడతాడు. తన లోపల వుండే వ్యతిరేక శక్తులు భయం, ఆత్మవిశ్వాస రాహిత్యం, అధైర్యం లాంటివి కావొచ్చు; బయటి శక్తులు వచ్చేసి తన చుట్టూ వుండే వ్యక్తులెవరైనా కావొచ్చు. ఈ పోరాటంతో తన ఆకాంక్షని సాధించుకోవచ్చు, లేదా సాధించులేక పోవచ్చు. అంతిమంగా తిరిగి కోరుకున్న ప్రశాంతమయ జీవితాన్ని స్థాపించుకోవచ్చు లేదా ఓటమిని పొందవచ్చు. ఇవీ కథలో ఇమిడి వుండే మౌలికాంశాలు. జీవితంలోని ప్రశాంతతని తలకిందులు చేసే ఓ ఘటన, తిరిగి ఆ ప్రశాంతమయ జీవితాన్ని పునరుద్ధరించుకునేందుకు  ప్రకటించే ఆకాంక్ష, దీంతో తన లోపలి బలహీనతలతో, బయటి శక్తులతో చేసే పోరాటం, అంతిమంగా దాని ఫలితమూ..ఇవీ స్థూలంగా కథల కుండే మౌలికాంశాలని చెప్పాలి.   

రీరైటింగ్ ఎంతవరకు ఉపయోగ పడుతుందంటారు?
          క్లిష్ట ప్రశ్న ఇది. నా పుస్తకంలో హెమింగ్వే కొటేషన్ ఒకటి వాడాను : మొదటి రాతప్రతి ఎప్పుడూ పరమ చెత్త అని! రచయితలు గుర్తించ నిరాకరించే ఒక కీలకాంశం ఏమిటంటే,  తామెంత ప్రతిభ కల వాళ్ళయినా, ఎంత సర్వశక్తులూ ధారబోసి రాసినా- ఆ  రాసినదాంట్లో తొంభై శాతం తమ బెస్ట్ వర్క్ కానే కాదనేది! వాళ్ళ నిజమైన టాలెంట్ పది శాతమే అందులో వుంటుంది. ఉదాహరణకి మీరో 40 నుంచి 60 సీన్లతో 120 పేజీల స్క్రీన్ ప్లే రాశారనుకోండి. అందులో నాల్గు నుంచీ ఆరు సీన్లే ఓహో అన్నట్టుంటాయి. రీరైటింగ్ పేరుతో ఆ సీన్లని మార్చకుండా, వాటిలో  డైలాగుల్ని దిద్దుతూ, మళ్ళీ మళ్ళీ దిద్దుతూ వుంటే, అది రీ రైటింగ్ అన్పించుకోదు. కేవలం పాలిషింగ్ అన్పించుకుంటుంది! రీరైటింగ్ అంటే కథకీ, పాత్రలకీ లోతైన స్ట్రక్చరల్  మార్పు చేర్పులు చేయడం... అదీ రీరైటింగ్ అంటే! మీరు రాసిన సీన్లన్నిటినీ ఈ విధంగా మార్పు చేర్పులకి గురిచేయడం సాధ్యమో కాదో పరిశీలించుకోకుండా ఆట్టే పెట్టుకుంటే, ఇందాక చెప్పినట్టు ఆ 40- 60 సీన్లలోనూ ఓ ఐదారు మాత్రమే క్వాలిటీతో ఉంటాయనీ, అంత వరకే మీరిచ్చిన బెస్ట్ వర్క్ అనీ, మిగిలిన సీన్లన్నీ ఉత్త చెత్త అనీ గుర్తు పెట్టుకోండి. రీరైటింగ్ కఠోర పరిశ్రమ అనుకోవద్దు. రీరైటింగ్ అంటే రీ- ఇమాజినింగ్, రీ - క్రియేటింగ్, అన్ని రకాల క్రేజీ ఐడియాలతో ఇంప్రూవ్ మెంట్! 
ఇలా అర్ధంజేసుకుంటే మీకే కొత్త ఉత్సాహం వస్తుంది. 

క్వెంటిన్ టరాంటినో  ఒక మాటన్నారు- సమూహంలో అమెరికన్ కళాకారులు ప్రత్యేకంగా ఎందు కుంటారంటే, వాళ్లెప్పుడూ మాంచి కథని చెప్పగల సామర్ధ్యంతో ఉంటారని. మీరు ఏకీభవిస్తారా?
          ఓ మేరకు ఏకీభవిస్తాను. మొట్టమొదట- అది అమెరికన్లకి మాత్రమే ఒనగూడిన ప్రత్యేకత కాదు, మొత్తం ఇంగ్లీష్ భాషా ప్రపంచపు ప్రత్యేకత అంటాను. ఇంగ్లీషు అమల్లో వున్న ఏ దేశంలో నైనా - అమెరికా నుంచీ ఇంగ్లాండ్ వరకూ, ఆస్ట్రేలియా నుంచీ ఇండియా వరకూ ఆంగ్లభాషలో ఉత్కృష్టమైన కథాసాహిత్యం వెలువడుతోంది. దీన్నలా ఉంచితే, అత్యంత సృజనాత్మక సినిమా సంస్కృతి ప్రపంచంలో ఒక్క ఆసియా ఖండంలోనే పరిఢవిల్లుతోందని చెప్పొచ్చు. వాళ్ళ కల్చర్ కి వెలుపల ఇతర సంస్కృతుల కథల్ని సైతం బలమైన కామిక్/ట్రాజిక్ సినిమాలుగా తీయగలిగే సామర్ధ్యాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. 

మంచి కథలు చెప్పే నైపుణ్యం తగ్గిపోయిందంటారా?
          నోనైపుణ్యం గానీ కళ గానీ తరగిపోలేదు. ఎనర్జీని కోల్పోయారని మాత్రం నేనను
కుంటున్నాను. ఎనర్జీని  ఇతర విషయాల మీదికి మళ్ళిస్తున్నారు. విషయం మీద ఖర్చు పెట్టాల్సిన ఎనర్జీని వైభవాల మీద వెచ్చిస్తున్నారు. అంటే విషయం లేని వైభవాలుగా సినిమాల్ని అందిస్తున్నారన్న మాట. ఇప్పుడనే కాదు, కథ చేప్పే కళకి దుర్దినాలు వందేళ్ళ క్రిందట కూడా ప్రాప్తించాయి.  అప్పట్లోనే నవలల్లో నాటకాల్లో కథ చెప్పే కళ అడుగంటింది. ఇప్పుడేమిటంటే రైటర్లు ఎక్కువై పోయారు. పోటీ పెరిగి అది వేగాన్ని డిమాండ్ చేయడం వల్ల, వీళ్ళు కథల్ని పైపైన తడిమి వదిలేస్తున్నారు. వాటికి వైభావాల్ని సమకూరుస్తున్నారు. యాంత్రికమైపోయింది. అంతా డొల్ల. నాకు తెలిసి టెలివిజన్లో కథ చెప్పే కళ ఇంకా బతికుంది. ఎందుకంటే వాటి స్క్రీన్లు చిన్నవి, వైభావాలు చూపెట్టడానికి ఆస్కారం లేదు.   

మీరు స్టోరీ డిజైన్ అనే మాటని తరచూ వాడుతూంటారు, అంటే దానర్ధం ఏమిటి
          పాత్ర జీవితంలో ఒకానొక ఘటన జరుగుతుంది. దాన్ని ఉత్ప్రేరక ఘటన అంటాం. ఇదే కథని ప్రేరేపిస్తుంది. ఈ ఉత్ప్రేరక ఘటన తో పాత్ర జీవితం తలకిందు లవుతుంది. దీన్ని సరిదిద్దాలన్న ఒక లక్ష్యం తో కూడిన ఆకాంక్ష ఆ పాత్రకి ఏర్పడుతుంది. ఆ ఆకాంక్ష తన జీవితాన్ని తారుమారు చేసిన వాణ్ణి చంపడం కావచ్చు, జైల్లో పెట్టించడం కావచ్చు, ఇంకేదో న్యాయం పొందడం కావచ్చు, ఇంకా లేకపోతే కేవలం బతికే హక్కుని పొందడం కావచ్చు- ఆకాంక్ష ఏదైనా దానికోసం గట్టిగా పాటుపడుతుంది పాత్ర. స్టోరీ డిజైన్ ఈ ఉత్ప్రేరక ఘటన లోంచే తయారవుతుంది. ఈ ఘటనలో ఎమోషన్ బలంగా వుంటుంది. ఈ బలాన్ని తగ్గించకుండా కథని ఎలాఎలా కొనసాగించాలో తెలిపేదే స్టోరీ డిజైనింగ్ మెథడ్. రెండు గంటలపాటు ప్రేక్షకుల ఎమోషనల్, ఇంటలెక్చువల్ ఆసక్తులు తగ్గిపోకుండా అప్రతిహతంగా కథని షేపులో పెట్టడమే స్టోరీ  డిజైనింగ్ లో తెలుసుకునే ప్రక్రియ. ఇది సినిమా సినిమాకీ, కథ కథ కీ మారే ప్రక్రియ. మంచి డిజైనింగ్ ఎప్పుడు అన్పించుకుంటుందంటే, కథకి ఓ లంగరు వేసి పట్టుకుని, అది ప్రేక్షకుల ఆసక్తిని పే- ఆఫ్ చేసేదిగా ఉండేట్టు చూసుకున్నప్పుడు మంచి డిజైనింగ్ అన్పించుకుంటుంది. ఇది వర్కౌట్ అయ్యేటట్టయితే, కథ ఎన్ని యాక్ట్స్ తో చెప్తున్నామన్నది ముఖ్యమే కాదు. ఒక యాక్ట్ తో చెప్పొచ్చు, లేదా పది యాక్ట్స్ తో చెప్పొచ్చు; మోనో ప్లాట్ కావొచ్చు, మల్టీ ప్లాట్ కావొచ్చు- జానర్ తో సంబంధం లేదు. 

ఉత్ప్రేరక ఘట్టాన్ని సృష్టించేందుకు ఏమైనా  గ్రౌండ్ రూల్స్ ఉన్నాయంటారా
          రచనలకి సంబంధించి ఏ యాస్పెక్ట్ లోనూ గ్రౌండ్ రూల్స్ అనే మాటకి తావులేదు- ఉత్ప్రేరక ఘటనతో సహా!  నేను అనేక సార్లు చెప్పినట్టు కళారూపాలకి రూల్స్-  అనగా  - నిబంధనల్లేవు. ప్రిన్సిపుల్స్ - అనగా - మూలసూత్రాలు మాత్రమే వున్నాయి. రూల్స్ జడప్రాయమైనవి. అవి నువ్విలాగే చెయ్యాలి! అని ఆదేశిస్తాయి. ప్రిన్సిపుల్స్ అలా కాదు, అవి స్వేచ్ఛ నిస్తాయి. ఇవి – ఈ రూపంలో ప్రాచీనంగా కళ మౌలిక స్వభావం వుంది, దీన్ని సాంప్రదాయంగా అనుసరిస్తున్నారు..దీంతో కథని ఎలాగైనా వంచి, విరిచి, తలకిందులు చేసి, ఇంకె లాగెలాగో చేసి కథనానికి ఔన్నత్యాన్ని కల్పించవచ్చుఅంటాయి. రూల్స్ కి పాత్రలతో, ఘటనలతో ఎలాటి ఫీలింగ్స్ వుండవు. అవి నిర్దయగా అమలవుతాయి. కానీ కథ చెప్పేందుకు స్టోరీ లైన్ మీద ఒక టెక్నిక్ ని ప్రయోగించినప్పుడు, ఆ స్టోరీ లైన్ వెంట ముందూ వెనుకా చోటు చేసుకునే ఘటనలపై ఆ టెక్నిక్ ప్రభావం ఎలా వుంటుందో లోతుగా అర్ధం జేసుకుందుకు ప్రిన్సిపుల్స్ తోడ్పడతాయి. స్ఫూర్తిని, ప్రేరణని, పాత్ర చిత్రణల్ని, కాకతాళీయాల్ని, సెట్టింగ్స్ ని, ఫ్లాష్ బ్యాక్స్/ ఫ్లాష్ ఫార్వర్డ్స్ నీ, సెటప్- పే ఆఫ్స్ నీ.. ప్రిన్సిపుల్స్ గైడ్ చేస్తాయి - పాత్రల మీద, ప్రేక్షకుల మీదా వీటి ప్రభావానికి సంబంధించి. కనుక రూల్స్ సూక్ష్మదర్శిని అయితే, ప్రిన్సిపుల్స్ స్థూలదర్శిని అనాలి.  

          ఉత్ప్రేరక ఘటన విషయానికి వస్తే, రెండు ప్రిన్సిపుల్స్ వున్నాయి. అవి ప్లేస్ మెంట్, ఎఫెక్ట్. ఈ రెండిటికీ అవినాభావ సంబంధముంది. ఒకటి లేక ఇంకొకటి లేదు. రెండూ కలిస్తేనే ప్రభావ
శీలత. వీటి ప్రశస్తి పూర్తిగా రచయితకి కథా నిర్వహణపట్ల వుండే అవగాహన మీద ఆధారపడి వుంటుంది. 

          ప్లేస్ మెంట్ : హాయిగా గడిపేస్తున్న హీరో జీవితాన్ని ఉత్ప్రేరక ఘటన ఉన్నపళాన తలకిందులు చేసేస్తుంది. కనుక ప్రేక్షకుల సమయాన్ని వృధా చేయకండి. కథలో ఈ ఉత్ప్రేరక ఘటనని వీలైనంత త్వరగా తీసుకు వచ్చేయండి. 

          ఎఫెక్ట్ :  అయితే ఉత్ప్రేరక ఘటనకి వుండే ఎమోషనల్, ఇంటలెక్చువల్ ఎఫెక్ట్స్ ని  ప్రేక్షకులు పూర్తిగా ఫీల్ కాక ముందే తీసుకురాకండి. 

          ఆ సమయం ఎప్పుడు? ఎవరు చెప్పగలరు? ఒక్కో కథకి ఒక్కో విధంగా వుంటుంది. పరిపూర్ణమైన ఉత్ప్రేరక ఘటన రావడానికి కి ముందు సెటింగ్, హిస్టరీ, క్యారక్టర్లకి సంబంధించిన ఎంత సమాచారం ప్రేక్షకులకి అవసరముండొచ్చు? కొన్ని కథల్లో అస్సలు అవసరముండదు, కొన్ని కథల్లో చాలా సమాచారం అందించాలి. హీరో పట్ల సానుభూతి ఎలా ఎప్పుడు ప్రేక్షకులకి కలగవచ్చు? కొన్ని కథల్లో వెంటనే, మరికొన్ని కథల్లో అస్సలు సానుభూతి ఏర్పడదు ప్రేక్షకులకి, ఇంకొన్ని కథల్లో కథ నడవగా నడవగా ఎప్పుడో! ఉత్ప్రేరక ఘటన టైమింగ్ తెలియాలంటే రచయిత తన కథా ప్రపంచాన్ని, ఆ ప్రపంచంలో తన పాత్రల్నీ పూర్తిగా అర్ధం జేసుకోగల రిచ్ ఇంటలెక్చువల్ అవగాహనని అభివృద్ధి చేసుకోవాలి. రూల్స్ లేవు. రాసేవాళ్ళందరూ రూల్స్ విషయం మర్చిపోవాలి. 

ఏ కీలకాంశాలు కథా పథకాన్ని నిర్వచిస్తాయి
          హుక్, హోల్డ్, పే- ఆఫ్ ఈ మూడూ కథా పథకాన్ని (ప్లాట్ ని) నిర్వచించే కీలకాంశాలు. వీటితో రచయితలకి ఈ ప్రశ్నలు ఎదురవ్వచ్చు..  హుక్ : ఉత్ప్రేరక ఘటనతో నేనేసిన హుక్- ప్రేక్షకుల ఆసక్తిని పెంచి- ఇప్పుడేమిటి? అన్న సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుందా లేదా?  హోల్డ్ : హీరో నిరంతరంగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆకాంక్షప్రేక్షకుల్ని చివరివరకూ హోల్డ్ చేసి పెట్టగలదా?  పేఆఫ్ : స్టోరీ క్లయిమాక్స్ ప్రేక్షకుల సందేహాలన్నిటినీ తీర్చి సంతృప్తి పర్చగలదా?

రచనకి ముందు రచయిత వేసుకోవాల్సిన ముఖ్య ప్రశ్నలేమిటో చెప్పండి?  
          పట్టుదల లేని టాలెంట్ వృధా. పర్ఫెక్షన్ కోసం రాయాలి, రాసింది రీరైట్ చేయాలీ అన్న పట్టుదల వుండాలి. కనుక రాయడానికి ఏదైనా ఐడియా స్పురించగానే ఈ ప్రశ్నలు  వేసుకోండి : ఈ ఐడియా చాలా డిఫరెంట్ గా ఉందా? దీన్ని కథగా మల్చుకునేతీరులో, నా జీవితంలో నెలల తరబడీ బహుశా సంవత్సరాల తరబడీ శ్రమించేందుకు తగ్గ విలువ కలిగి ఉందా? నేను తెల్లారి లేవగానే రాయాలన్న ఆకలితో కూర్చునేంత ఎక్సైటింగ్ గా ఈ కాన్సెప్ట్ ఉందా? ఈ ఇన్స్పిరేషన్ నా జీవితంలో ఇతర ఆనందాల్ని త్యాగం చేసుకుని ఆహర్నిశలూ కృషి చేసేంత గొప్పదా? సమాధానం కాదని వస్తే, ఇంకో ఐడియాని వెతుక్కోండి. టాలెంట్- టైం ఈ రెండే రైటర్ కి ఎసెట్స్. మీ  అబివృద్దికి తోడ్పడని ఐడియాని పట్టుకుని మీరెందుకు త్యాగాలు చేయాలి

కథనీ, క్రాఫ్ట్ నీ ట్రెండ్స్ ఎలా ప్రభావితం చేస్తూంటాయో చెప్పండి?
           త్రీడీ టెక్నాలజీ కాలంలో కథ భవిష్యత్తు ఎలావుంటుందని  అడిగేందుకు నా దగ్గరికి చాలా మంది యంగ్ టాలెంట్స్ వస్తూంటారు. టెక్నాలజీ అంటే వాళ్ళు పడి చస్తారు. నాకు టెక్నాలజీ ముఖ్యం కాదు. టెక్నాలజీ ఏదైనప్పటికీ, వాళ్ళు చెప్పేందుకు విషయం లేకపోతే,  విషయమున్నా దాన్నెలా చెప్పాలో తెలియక పోతే, వాళ్ళు ఏ టెక్నాలజీని లేదా మాధ్యమాన్ని ఉపయోగించినా నిరర్ధకమే.  ఏ క్వాలిటీ తో కథ చెప్పగల్గుతున్నారో ఆ క్వాలిటీయే ఆ టెక్నాలజీ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది తప్ప- టెక్నాలజీ వచ్చేసి కథల పురోగతిని దెబ్బ తీయడమంటూ వుండదు. టెక్నాలజీ లేకుండా కథ మన గలదు, కథ లేకుండా టెక్నాలజీ ఉంటుందా? భావికాలంలో కథల్ని రోడ్డు పక్క బొమ్మలు గీసి చెప్తారేమో? ఐతేనేం, కథ చెప్పేవాడి కంటెంట్, ఇన్స్పిరేషన్, టాలెంట్ సక్రమంగా వుంటే ఏ మాధ్యమం ద్వారా కథ చెప్తేనేమిటి

కథలెప్పుడూ నమ్మశక్యంగానే ఉండాలా? ఏది నమ్మశక్యంగా ఉండేట్టు చేస్తుంది?
          మీ కథా ప్రపంచాన్ని ప్రేక్షకులు నమ్మి తీరాలి. కొలెరిడ్జ్ మాటల్లో చెప్పాలంటే ప్రేక్షకులు స్వచ్ఛందంగా కాస్సేపు వాళ్ళ నమ్మకాల్నీ, అపనమ్మకాల్నీ పక్కన పెట్టి మీ కథా ప్రపంచంలో లీనమవగల్గాలి. అంటే తాత్కాలికంగా ప్రేక్షకులు మీరు సృష్టించిన కాల్పనిక ప్రపంచాన్ని ఐతే కావొ చ్చులే’ - అని నమ్మడానికి సిద్ధపడతారు. ఐతే కావొచ్చులే’  -అన్న కాన్సెప్ట్  చేసే మ్యాజిక్ ఎలాంటిదంటే,  ప్రేక్షకుల్ని వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రపంచాల్నుంచీ  అది మీ కాల్పనిక  ప్రపంచంలోకి అలవోకగా తీసికెళ్ళి పడేస్తుంది! అక్కడి అబద్ధపు సస్పెన్స్ నీ, కన్నీళ్ళనీ, నవ్వుల్నీ, అర్ధాల్నీ, ఎమోషన్స్ నీ నమ్మేసేట్టు చేసేదే ఐతే కావొచ్చులే  కాన్సెప్ట్.  ఐతే ఎప్పుడైతే ప్రేక్షకులకి ఐతే కావొచ్చులే అని సరి పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారో, మీ కథ విశ్వసనీయతని అనుమానిస్తారో- అప్పుడు రచయితగా మీరు విఫలమైనట్టే. అది మీ వృత్తి మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 
          ఒకటి గుర్తు పెట్టుకోండి- నమ్మశక్యంగా .. అంటే- వాస్తవికంగా..  అని కాదు.
          నాన్ రియాలిజం జానర్స్ వున్నాయి- ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, యానిమేషన్ మ్యూజికల్స్  మొదలైనవి. వీటిలో చూపించే కథా ప్రపంచాలు అస్సలు జరిగి ఉండేందుకు వీల్లేదు. అయినా ప్రేక్షకులు ఎందుకు చూస్తున్నారు? అవలాగే  ఉంటాయని తెలుసుకాబట్టి. సాధారణ పాత్రలతో మెయిన్ స్ట్రీం సినిమాల్ని అలా తీస్తే ఐతే కావొచ్చులే అని సరి పెట్టుకుని చూడగలరా? ఇక్కడ ప్రకృతి సూత్రాలన్నీ పని చేయాల్సిందే. సినిమాల్లో చూపించే కార్యకలాపాలు నమ్మశక్యంగా అన్పించాలంటే  వాటికి ఎమోషన్ ప్లస్ లాస్ ఆఫ్ యాక్షన్ వుండాలి. న్యూటన్ చలన సూత్రాలు పనిచేయాలి. 

స్క్రిప్టు ల్లో మీకు కొట్టొచ్చినట్టుగా కన్పించే బలహీనత  లేమిటి?
          డల్ సీన్లు. బలహీన సంఘర్షణ, డైనమిక్స్ లేని పాత్రల ప్రవర్తనా కలిసి డల్ సీన్లని సృష్టిస్తున్నాయి. సీన్ మొదట్లో క్యారక్టర్లు ఎలా  ఉంటాయో ముగింపు లోనూ అదే స్థితిలో వుండడం, పాత్రల యాక్టివిటీ స్టోరీ యాక్షన్ కి దోహదం చేయకపోవడం సీన్లని  డల్ గా మారుస్తాయి. రెండోది- ఎక్స్ పోజిషన్ : కథనంలో ఆల్రెడీ ప్రేక్షకులకి తెలిసిపోయిన విషయాలే పాత్రలు మాట్లాడుకోవడం. దీనితో పాత్రలతో కనెక్షన్ తెగిపోయి సీన్లు బోరు కొట్టడం. మూడోది మూస : సవాలక్ష సినిమాల్లో చూసేసిన సంఘటనలనే, పాత్రలనే రచయితలు మళ్ళీ సృష్టించడం.  ఆ రచయితలు  ఇలా రాసి సక్సెస్ అయ్యారు కాబట్టి,  మనం కూడా రాసి సక్సెస్ అవుదా మనుకోవడం!  

థాంక్యూ సర్! 
***