రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, February 10, 2019

రిపీట్ ఆర్టికల్

వి
డు
దల 
య్యే  సినిమాల  గురించి అసలేం తెలుసుకోకుండా సినిమాలు  చూస్తే  ఎలాటి ప్రయోజనాలుంటాయి రైటర్స్ కి? ఈ ప్రశ్నని తాజాగా గతవారం విడుదలైన ‘24’ మీద ప్రయోగిస్తూ, అసలా సినిమా గురించి ప్రింట్, విజువల్, ఆడియో సమాచారాన్నంతటినీ బ్యాన్ చేసుకుని, వాటి వైపు చూడకుండా,  సినిమా గురించి ఏమీ తెలీని అమాయకుడిలా ఈ వ్యాసకర్త ఆ సినిమా కెళ్తే, ఒక అద్భుత ప్రపంచం ఆవిష్కారమైంది. అంటే సగటు ప్రేక్షకుడి పాయింటాఫ్ వ్యూలో కాదు ఆ  అద్భుత ప్రపంచం.. దాని కథా కథనాలు, పా త్రలు, నటనలు, పాటలు, ఫైట్లు వగైరా విషయపరమైన సమాచారానికి సంబంధించి అనుభవమైన ఎడ్యుకేషన్. సినిమాల గురించి ముందస్తు సమాచారంతో, అంచనాలతో ఒక అభిప్రాయం ఏర్పరచుకుని చూడడం వేరనీ, అసలేం తెలుసుకోకుండా ప్రత్యక్ష ప్రమాణం (direct perception) తో చూడడం వేరనీ తెలిసొచ్చింది…


        అంటే సినిమాలకి పబ్లిసిటీ  ఉండకూడదని కాదు. కచ్చితంగా అవసరమే. ప్రేక్షకుల్ని బలవంతంగా ఆకర్షించడానికి పబ్లిసిటీ వుండాల్సిందే.  వద్దన్నా అంత బలవంతంగా ఆకర్షిస్తే తప్ప,  ఇవ్వాళ ఇన్నేసి వివిధ దృశ్య మాధ్యమాల ప్రభావంలో కొట్టుకు పోతున్న ప్రేక్షకులు ఓ పట్టాన సినిమాల్ని పట్టించుకునేలా లేరు. కాబట్టి బలవంతంగా బరితెగించి వాళ్ళని ఆకర్షించాల్సిందే. తాళ్లూ సంకెళ్ళూ వేసి వాళ్ళని థియేటర్లకి లాగాల్సిందే. 

        కానీ ఒక వృత్తిలో వున్న రైటర్స్ వినియోగదారుల్లా కాకుండా (ప్రేక్షకులుగా కాకుండా) ఉత్పత్తిదారుల్లా వుంటే బావుంటుంది, ఇంకో వృత్తిలో వున్న రివ్యూ రైటర్స్ కూడా వినియోగదారుల్లా కాకుండా (ప్రేక్షకులుగా  కాకుండా)  ఉత్పత్తిదారుల్లా వుంటేనే బావుండొచ్చు. సినిమాల గురించి ముందస్తు అంచనాలూ అభిప్రాయాలూ అనేవి ట్రేడ్ పండితుల సంగతి.  రైటర్స్ కి దీంతో పనిలేదు పనికిరాని టైం పాస్ కి తప్ప. సినిమాలు చూసే ముందు రాబోయే సినిమాల గురించి అంచనాలు, ముందస్తు అభిప్రాయాలూ అనేవి రైటర్స్ ఏర్పర్చుకోకుండా వుండాలంటే, విడుదలయ్యే ముందు ఆ  సినిమాల పబ్లిసిటీ వైపు కన్నెత్తి  చూడకూడదు. ఆ ఫస్ట్ లుక్ లో హీరో గెటప్ చూడకూడదు, ట్రైలర్స్ లో పంచ్ డైలాగులు వినకూడదు, కథేమిటో తెలుసుకోకూడదు, విజువల్స్ చూడకూడదు, మేకింగ్ ఎలా వుందో చూడకూడదు, ఆడియో అస్సలు వినకూడదు, పోస్టర్లు, పత్రికల్లో ప్రకటనలూ కూడా చూడకూడదు. సినిమాలు చూసే ముందు రివ్యూలు కూడా చదవకూడదు, సినిమా ఎలా వుందని ఎవర్నీ అడక్కూడదు, చర్చలు పెట్టకూడదు. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణ పధ్ధతి  అందించే ప్రయోజనాలకి విఘాతం  కల్గిస్తాయి. 

       టీవీ ఛానెల్స్ లో వంటావార్పూ ప్రోగ్రాముల్లో యాంకర్ కి తనేం రుచి చూడబోతోందో ముందు అస్సలు తెలీదు. చూద్దామన్నా మార్కెట్ లో ఆ వంట తాలూకు శాంపిల్ కూడా దొరకదు, పబ్లిసిటీ కూడా వుండదు. ఆ వంటతను వండి పెట్టనంత వరకూ ఆ వంటకం రుచే, రూపు రేఖలే తెలీవు ఆమెకి. పరీక్షా హాల్లోకి వెళ్ళే వరకూ ప్రశ్నాపత్రం ఎలా వుంటుందో  తెలీనట్టూ, ఆ వంటతను వండి పెట్టాకే రుచి చూసి- అపుడు అన్ని ప్రోగ్రాముల్లో  ఒకే ఎక్స్ ప్రెషన్ తో, ఒకేలాంటి  డైలాగుతో  -అబ్బ,  ఎంతబావుందో-  అంటుంది. ఇంతకి  మించి  వాళ్లకి వేరియేషన్స్ వుండవు. అన్ని వంటల రుచికీ  ఒకటే  లైబ్రరీ షాట్ కామెంట్ -కం -ఎక్స్ ప్రెషన్ ఇంటర్ ప్లే. అలాటి యాంకర్స్ జీవితంలా వుండాలి రైటర్స్ జీవితం. వంట చేస్తూంటే- ఈయన  బాగా వండుతున్నాడు, దీని గురించి నేను బాగా చెప్పాలి-  అని ఏ యాంకరూ అనుకోదు బహుశా. కానీ సినిమా చూస్తూ - మా హీరో సార్  బాగా నటించేస్తున్నారు, సినిమా చాలా బావుంది- అనే భజన  భక్తి భావంతో రైటర్ నిరభ్యంతరంగా అనుకోవచ్చు. అతడిష్టం. దీంతో ప్రత్యక్ష ప్రమాణం మాత్రం ఏర్పడదు. అది ముందు ఏర్పరచుకున్న అభిప్రాయంతో అనుపలబ్ది (non - perception) ప్రమాణం అవుతుంది.

        ప్రత్యక్ష ప్రమాణం వర్కౌట్ అవాలంటే- దాని ప్రయోజనాల గొప్ప తెలియాలంటే- చూడబోయే సినిమా గురించి పబ్లిసిటీకి కళ్ళూ చెవులూ మూసుకుని, జీరో నాలెడ్జితో, ఒక ఏమీ తెలీని అమాయకుడిలా రైటర్ వెళ్లి సినిమాలు చూడాలి. జీరో నాలెడ్జి ఎందుకంటే, రైటర్ ఒక హీరోకో, నిర్మాతకో, దర్శకుడికో కథ చెప్పబోయే ముందు వాళ్ళా కథ గురించి జీరో నాలెడ్జి తోనే , ఫ్రెష్ మైండ్ తోనే  వుండి వింటారు కాబట్టి.  అలాటి జీరో నాలెడ్జితో, ఫ్రెష్ మైండ్ తోనే  రైటర్ కూడా సినిమాలు చూడాలని కమిటవాలి. ప్రేక్షకులు పబ్లిసిటీ చూసి పూర్తి నాలెడ్జితో బుద్ధిపూర్వకంగా  సినిమాల కెళ్తే, రైటర్ అప్పుడే  బస్సు దిగి సిటీ చూస్తున్న పల్లెటూరి వాడిలా, జీరో నాలెడ్జితో యాంత్రికంగా వెళ్ళాలి. థియేటర్ దగ్గరి కెళ్లి సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులతో, - సినిమా ఎలా వుంది బాబూ- అని  ఎగ్జిట్ పోల్ సర్వే  కూడా నిర్వహించకూడదు. ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో అవగానే రిజల్ట్ కోసం ఆదరాబాదరా ఫోన్లు కూడా చేయకూడదు- అది తన కథతో వచ్చిన సినిమా అయితే తప్ప. ఇక చూడదల్చుకోని చిన్నా చితకా సినిమాలతో ఈ నిషేధాలు  అవసరమే  లేదు. 


       సినిమా ట్రైలర్స్ కూడా కథ తెలిసిపోయే విధంగా ఉంటున్నాయి. లేదా ఫలానా టైపు సినిమాగా  తెలిసిపోయేట్టు ఉంటున్నాయి. ట్రైలర్స్ అన్నీ ఆ సినిమాలో  హీరో చుట్టే  వుంటాయి. హీరో పంచ్  డైలాగ్- ఒక ఫైట్- ఒక పాట. ఒక్కో పంచ్ డైలాగుతో ఒక్కో ట్రైలర్ విడుదల చేస్తూంటారు. ఇవి వినీ వినీ థియేటర్ కి వెళ్లి చూసేసరికి ప్రేక్షకులకి ఏం థ్రిల్ మిగిలి వుంటుందో గానీ, రైటర్లు సర్ప్రైజ్ ఎలిమెంట్ ని కోల్పోతారు. కథాగమనంలో వచ్చే డైలాగులు అప్పటికప్పుడు ఆ ప్యాకేజీలో- దాని నేపధ్యంతో పాటు కలిపి  చూసి- అక్కడి కక్కడే  ఎలా వర్కౌట్ అయ్యిందో గమనించడం వేరు, విడిగా ముందే డైలాగులు  వినీవినీ ఒక అభిప్రాయంతో వెళ్లి కథాగమనంతో పాటూ చూసి ఆ డైలాగు వర్కౌట్ అయిన విధం  పసిగట్టడం వేరు. ‘షోలే’ లో ఒక అమ్జాద్ ఖాన్ డైలాగులో, ‘ముత్యాలముగ్గు’ లో ఒక రావుగోపాలరావు డైలాగులో బయట ఎన్నెన్ని సార్లు విన్నా, తెర మీద మళ్ళీ మళ్ళీ చూడాలన్పించడానికి కారణం- ఆ డైలాగులకి దడి కట్టిన అత్యుత్తమ పాత్ర చిత్రణలు, వాటి అనితరసాధ్యమైన డ్రమెటిక్ నేపధ్యాలూ.  రైటర్లు ఎన్ని లక్షల సార్లు ఈ డైలాగులు విన్నా, సినిమా చూసినప్పుడల్లా ఒక్కో కొత్త కోణం, ఒక్కో కొత్త భావం స్ఫురిస్తూనే వుంటుంది తప్పకుండా. 

        హాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ కి  సాధారణంగా ఒక పద్ధతిని అవలంబిస్తారు. అవి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లాగే వుంటాయి. బిగినింగ్ లోంచి హీరో ఎవరో తెలిపే కొన్ని కట్స్, మిడిల్లోంచి హీరో ఎదుర్కొనే సమస్యలోంచి కొన్ని కట్స్, చివర ఎండ్ లోంచి చాలా ఎక్సైటింగ్ యాక్షన్ కట్సూ తీసుకుని,  గొప్ప సస్పన్స్ నీ, ఇంటరెస్ట్ నీ  క్రియేట్ చేస్తారు-  
వీటిని ఫాలో అవుతూ మూడు ఆడియో, విజువల్, వెర్బల్ క్యూస్ (సంకేతాలు) తో సినిమా చూడాలన్న ఆత్రుత, ఆందోళనా  ఇంకా  పెంచేస్తారు. వాళ్ళు విషయపరంగా  ఆడియెన్స్ ని టీజ్ చేస్తారు, తెలుగులో కేవలం  హీరో విన్యాసాల పరంగా టీజర్స్ చూపిస్తారు.
  
        సినిమా చూస్తున్నప్పుడు ‘విషయం’  ఎలాగెలా రివీల్ అవుతూ ఎక్కడెక్కడ ఎలాగెలా   ఆసక్తిరేపే బీట్స్ తో వర్కౌట్ అయిందో,  రైటర్ ఒక ఉత్పత్తి దారుడి మెంటాలిటీ తో  ఫస్ట్ హేండ్ నాలెడ్జి తో గమనించాలంటే, ముందు నుంచీ పబ్లిసిటీ కి ఏమాత్రం ఎక్స్ పోజ్ కాకూడదు.

‘24’ అనే గతవారం విడుదలైన సూర్య నటించిన  సైన్స్ ఫిక్షన్ సినిమా  విషయంలో, ఈ వ్యాసకర్త ఈ ప్రయోగాన్నే దృష్టిలో పెట్టుకుని, సినిమా గురించి జీరో నాలెడ్జితో  పరీక్షకెళ్ళే విద్యార్థిలా వెళ్లి చూస్తే. ఒక కొత్త అనుభవం ఎదురయ్యింది- ఇంతకాలంగా  సినిమాలు చూస్తూ వస్తున్న తీరుతో అనుభవం వేరు, ఇప్పుడు వేరు. ఇంతకాలం ముందుగానే  సినిమా గురించిన  సమాచారం మెదడు కెక్కించుకుని చూడ్డంవల్ల యాంత్రికంగా చూసినట్టు అన్పిస్తే, ఇప్పుడు ఏమీ తెలుసుకోకుండా చూస్తూంటే ఎడిటింగ్ టేబుల్ దగ్గరో, ఫస్ట్ కాపీ వచ్చినప్పుడో, ఇంకెలాటి మీడియా ఓవర్ లోడ్ ప్రారంభం కాకముందే ఒరిజినాలిటీతో చూస్తున్న ఫీలింగ్.  

DISTRACTED? NO WORRIES!  Courtesy: www.fulfilmentdaily.com

 ఒక్క సైన్స్ ఫిక్షన్ అని మాత్రమే ఈ సినిమా గురించి తెలుసు తప్ప, ఇందులో సూర్య ది త్రిపాత్రాభినయమని కూడా తెలీదు. విషయమేమేటో  ప్రత్యక్ష ప్రమాణంతో మనం తెలుసుకుని ఆ మంచీ చెడ్డలు అనుభవించాలి తప్ప, ఇతరత్రా తెలుసుకున్న ఉపమాన ప్రమాణం (comparison- perception) ముందు పెట్టుకుని, పోల్చుకుంటూ సెకెండ్ హేండ్ విశ్లేషణ చేసుకోవడం తగదని తెలిసొచ్చింది. ముందు తెలుసుకున్న సమాచారం ఏమీ లేకపోవడంతో,  ఫ్రెష్ గా ఏకాగ్రత అంతా చెక్కుచెదరకుండా చూస్తున్న సినిమా మీదే కేంద్రీకృతమై వుంది. దీని ఏ ట్రైలర్ లోని విజువల్సూ అడ్డు పడలేదు. దీని ఏ ఆడియో పాటా గుర్తుకు రాలేదు. అంతా ఎలైస్ ఇన్ వండర్ లాండ్ లాంటి ప్రపంచం. త్రిపాత్రాభినయమనీ తెలీదు, ‘24’ అంటే అర్ధమేమిటో ఏమిటో తెలీదు, విజువల్స్ ఎలా ఉంటాయో తెలీదు, పాటలెలా ఉంటాయో తెలీదు...ఏమీ తెలీదు! ఇప్పుడే ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకోవవడం. అప్పుడప్పుడు దర్శకులు తాము రాసుకున్న కథలు విన్పిస్తూంటారు. వాటి గురించి ముందుగా మనకేమీ తెలీదు. చెప్తున్నప్పుడే తెలుస్తూంటుంది. ఫలానా అతను  ఫలానా ఈ విధంగా వున్న కథ చెప్తాడు,  వినండి-  అని ఎవరైనా అంటే, ఓహో అలాటి కథా అనే అంచనానో అభిప్రాయమో ముందుగానే మనకేర్పడిపోతుంది. అతను కథ చెప్తున్నప్పుడు చెప్తున్నదాంతో ముందుగా ఏర్పడ్డ ఇంప్రెషన్ అడ్డుతగులుతూ తులనాత్మక పరిశీలనకి  దారి తీస్తూ వుంటుంది. ఇదే వద్దనేది.

రైటర్ అనేవాడు ఎలాటి ఇన్ పుట్స్  లేకుండా సినిమాలు చూస్తూంటే, తను నిర్మాతకో దర్శకుడికో హీరోకో కథ చెప్తూ, తన కథ గురించి ముందుగా ఏమీ తెలీని వాళ్లకి ఎలాటి థ్రిల్లో నిల్లో కలిగించగలడో, సరీగ్గా అలా తను సినిమాలు చూస్తున్నప్పుడూ అలాటి ఒరిజినాలిటీతో థ్రిల్లో నిల్లో  వినియోగదార్లయిన ప్రేక్షకులకంటే ఉత్పత్తి దారుగా ఎక్కువ ఫీలవగలడు. 

        అలా చూసిన సినిమాలకి నోట్స్ రాసి పెట్టుకుంటే అవే వాటి ఫస్ట్ హేండ్ ఇన్ఫర్మేషన్ గా తర్వాత రాస్తున్న కథలకి రిఫరెన్సుగా ఏర్పడతాయి. మరొకటేమిటంటే, ఇలా ప్రత్యక్ష ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చూస్తూంటే, రాసుకుంటున్న స్క్రిప్టు మీద కూడా ఇంకా దేని ప్రభావమో పడకుండా ఒరిజినాలిటీతో, సొంత బ్రాండింగ్ తో తొణికిస లాడుతుంది. స్వావలంబన చేకూరుతుంది. ఎవర్నో గురువుగానో, గైడ్ గానో పెట్టుకునే అవసరమే వుండదు. రైటర్స్ కి గురువులూ గైడ్సూ వుండరు, ఎందుకంటే 
వాళ్ళే సమాజానికి గురువులూ  గైడ్సూ  కాబట్టి!

-సికిందర్

Sunday, May 8, 2016