రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, May 20, 2017

రివ్యూ + పేపరు పెన్నులు



దర్శకత్వం :  రాంగోపాల్ వర్మ
తారాగణం : అమితాబ్ బచ్చన్, అమిత్ సాద్, యామీ గౌతం, మనోజ్ బాజ్ పాయ్, జాకీ ష్రాఫ్, భజరంగ్ బలి  సింగ్, రోణిత్ రాయ్ తదితరులు
కథ : నీలేష్ గిర్కార్, రచన : పి. జయకుమార్, మాటలు : రాం కుమార్ సింగ్, సంగీతం : రవిశంకర్, రోహన్ వినాయక్, ఛాయాగ్రహణం : అమోల్ రాథోడ్
బ్యానర్స్ : అలంబ్రా ఎంటర్ టైన్మెంట్, వేవ్ సినిమాస్, కంపెనీ ప్రొడక్ట్, ఎబి కార్ప్ లిమిటెడ్
నిర్మాతలు :  రాహుల్ మిత్రా, ఆనంద్ పండిట్, గోపాల్ శివరాం దాల్వీ, కృషన్ చౌదరి
విడుదల : మే 12, 2017

***
          మితాబ్ బచ్చన్ తో ‘సర్కార్’ స్రవంతిలో  మూడవదైన ‘సర్కార్ -3’ లో రాం గోపాల్ వర్మ లోని  మేకర్ కంటే టెక్నీషియనే ఎక్కువ ప్రకాశిస్తాడు.   గత మూవీ ‘కిల్లింగ్ వీరప్పన్’  తో  మేకర్ గానూ టెక్నీషియన్ గానూ బాలీవుడ్ లో  తిరిగి ప్రతిష్ట పెంచుకున్న వర్మ, ఈ తాజా సర్కార్ తో  ఆ ప్రతిష్టకి సరితూగడం కష్టమైపోయింది. సర్కార్ సినిమాలంటే అమితాబ్ బచ్చన్ గాడ్ ఫాదర్ తరహా పాత్రకి బాల్ థాక్రే  స్ట్రోక్ తో  గ్లామరైజ్ చేసి తీస్తున్న పొలిటికల్ థ్రిల్లర్సే కాబట్టి- వీటిలో టాప్ యువ గ్లామర్ తారలు కూడా లేకపోతే నేటి జనరేషన్ కి మన వ్యవహారం కాదన్నట్టే వుండిపోతాయి. ఎప్పుడో రెండు తరాల కిందటి హాలీవుడ్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’ తో  నేటి జనరేషన్ కి  ఎలాటి సంబంధ బాంధవ్యాలూ వుండేందు కవకాశం లేదు భావోద్వేగాలు రెచ్చ గొట్టుకుని చూడ్డానికి. ఒకటవ సర్కార్ లో (2005) అభిషేక్ బచ్చన్ - కత్రినా కైఫ్, రెండవ సర్కార్ లో  (2008) అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ లలాంటి టాప్ యువ స్టార్ హీరోహీరోయిన్ల ఆకర్షణ లుండబట్టి వాటిని చూసి హిట్  చేశారు. 

         
ప్పుడు తొమ్మిదేళ్ళ తర్వాత,  మూడవ సర్కార్ కొచ్చేసరికి - అమితాబ్ తప్ప మరే టాప్ యువ స్టార్ హీరో హీరోయిన్ల గ్లామరూ  లేని సాదా వ్యవహారమైపోవడంతో,  దేశవ్యాప్తంగా ఓపెనింగ్స్ కే ఎసరొచ్చింది. అమిత్ సాద్- యామీ గౌతంలు టాప్ యువ స్టార్ లైతే కాదు. పెద్దగా తెలీని నటులు. కనుక టాప్ యువ స్టార్ హీరో హీరోయిన్లు మిస్సయితే ఏ సర్కారూ గాడ్ ఫాదర్ ఫార్ములాతో  వర్కౌట్ కాదని తేలుతోంది. 1930-50 ల నాటి ఫిలిం నోయర్ అనే డార్క్ మూవీ జానర్,  1960 లకల్లా కొత్త రూపాన్ని సంతరించుకుని ఇప్పటివరకూ నియో నోయర్ గా వర్ధిల్లుతోంది. గాడ్ ఫాదర్  ప్రేమికుడైన వర్మ,  ఇంకా ఆ నాటి గాడ్ ఫాదర్  టెక్నిక్ నే  నేటి గ్లోబల్ తరానికి అందిస్తున్నారు తప్ప, నవీకరించి ప్రధాన స్రవంతిలో కలపలేక పోతున్నారు. 

          ఈ మూడో సర్కార్  అన్నివిధాలా మార్కెట్ యాస్పెక్ట్ కి దూరంగా వుండిపోయింది. మేకింగ్ పరంగా ఈ కథ రాసినతను, కథనం చేసినతను, మాటలు రాసినతనూ ముగ్గురూ కూడబలుక్కుని అవుట్ డేటెడ్ రచయితలుగా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. వీళ్ళతో వర్మ జత కలిశారు. అసలు ఈ సినిమాకి కథ చేశారా, గాథ  చేశారా; పొలిటికల్ థ్రిల్లర్ చేశారా, ఎండ్ సస్పెన్స్ చేశారా; ఆర్ట్ సినిమా తీశారా, కమర్షియల్ సినిమా తీశారా వంటి  బేసిక్స్  కూడా సరిచూసుకున్నట్టు కన్పించదు. 2010 లో ప్రకాష్ ఝా తీసిన రాజకీయ డ్రామా ‘రాజనీతి’ కీ దీనికీ తేడా లేదు. ‘రాజనీతి’ ఏ కారణాలతో అట్టర్ ఫ్లాప్ అయిందో అవే  మూడో సర్కార్ లో  జొరబడకుండా చూసుకోలేదు. సినిమాలు ఫ్లాపవడానికి ఎక్కువగా పేపర్ పెన్నులే కారణమవుతాయి. ఇది ఒప్పుకోకుండా  తప్పించుకుంటే, చాపకింద కన్నీరులా ఆ పేపర్ పెన్నులే  ఇంకా ఫ్లాపులు కొడుతూ పోతూంటాయి. 

          మూడో సర్కార్ కి  గత రెండు  సర్కార్ లతో సంబంధం లేదు, ఇది సపరేట్ కథ. రెండో సర్కార్ కథ  ఐశ్వర్యా రాయ్ పాత్ర సర్కార్ గా పగ్గాలందుకోవడంతో ముగుస్తుంది. ఇప్పుడు మూడో సర్కార్ లో దీని కొనసాగింపు గానీ, ఐశ్వర్యారాయ్ పాత్రగానీ కనపడవు. ఒకటవ, రెండవ సర్కార్లలోని శంకర్ (అభిషేక్ బచ్చన్), విష్ణు (కేకే మీనన్)  ల గురించి మూడో సర్కార్ లో  పాత్రలు  మాట్లాడుకుంటాయి గానీ, రెండో సర్కార్ లో పగ్గాలందు కున్న అనిత ( ఐశ్వర్యారాయ్) ఏమయ్యిందో  మాట్లాడుకోకపోవడం విచిత్రం. ఇంట్లో మనిషి కన్పించకపోతే వెతకరా?

         మనవడు శివాజీగా అమిత్ సాద్ ఎంటరవుతాడు. బహుశా ఇతనొస్తే అనిత (ఐశ్వర్యారాయ్) పనిబడతాడని తప్పించేశారు.  మళ్ళీ ఇక్కడ కథ రెండో సర్కార్  ఎత్తుగడతోనే వుంటుంది. దీంతో ఈ మేరకు మూడో  సర్కార్ లో  నావెల్టీ లేదు. గాంధీ (భజరంగ్ బలి సింగ్) అనే కార్పొరేట్ శక్తి, 1400 కోట్ల ప్రాజెక్టుతో ధారవీ ఏరియా బస్తీలమీద కన్నేసి సుభాష్ నాగ్రే (అమితాబ్) సహకారం కోరడం పాత విషయమే.  సుభాష్ నాగ్రే మహారాష్ట్రలో ఏ ప్రభుత్వమున్నా తన చెప్పు చేతల్లో వుంచుకునే రాజ్యాంగేతర శక్తి. అతడి మాటకి ఎదురు లేదు, చేతకి  చెదలు లేదు. అతడి అనుమతి తీసుకోందే పూచికపుల్ల కూడా కదలదు. పేద ప్రజలకి దేవుడులా వుంటాడు. ఆ పేద ప్రజలకి ఎసరు పెట్టే ప్రతిపాదనతో గాంధీ రావడంతో తిప్పికొడతాడు. దీంతో మొదలవుతాయి కుట్రలు. 

          గోవింద్ దేశ్ పాండే (మనోజ్ బాజ్ పాయ్) అనే నాయకుడు తన రాజకీయ ఎదుగుదలకోసం సుభాష్ ని నిర్మూలించాలనుకుంటూంటాడు.  అతడి తల్లి రుక్కుబాయీ దేవి (రోహిణీ హటంగడి) కి ఇదే కోరిక బలంగా వుంటుంది. దుబాయ్ లో వుంటూ  ఆపరేట్ చేసే  ప్లేబాయ్ మల్టీ మిలియనీర్ మైకేల్ వాల్యా ( మాల్యా? - జాకీష్రాఫ్)  ధారవీ ప్రాజెక్టుని మూవ్ చేస్తున్న అసలు శక్తి. ఇతను గోవింద్ ని కలుపుకుని సుభాష్ ని చంపే పథకం వేస్తాడు.

          ఈ పరిస్థితుల్లో సుభాష్ మనవడు శివాజీ విదేశం నుంచి వస్తాడు. సుభాష్ కి విష్ణు (కేకే మీనన్), శంకర్ (అభిషేక్ బచ్చన్) అనే ఇద్దరు కొడుకులు వుండేవాళ్ళు. అన్న విష్ణుని తమ్ముడు శంకర్ చంపేశాడు. ఆ విష్ణు కొడుకే ఇప్పుడు వచ్చిన సుభాష్ మనవడు శివాజీ. 

          ఇతడి రాక సుభాష్ అనుచరుడైన గోకుల్ (రోణిత్ రాయ్) కి నచ్చదు.  సుభాష్ వారసత్వాన్ని తను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాడు. దీంతో తన కడ్డుగా వున్న శివాజీ మీద ద్వేషంతో వుంటాడు. శివాజీకి అన్నూ  (యామీ గౌతమ్) అనే గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. ఈమె తండ్రిని గతంలో సుభాష్ చంపించాడని సుభాష్ మీద పగదీర్చుకోవాలని చూస్తూంటుంది. శివాజీకి ఆవేశం ఎక్కువ. గణేష్ ఉత్సవాల్లో తాత సుభాష్ మీద గోవింద్ హత్యాయత్నం చేస్తే అతణ్ణి చంపి పారేస్తాడు. దీంతో సుభాష్ శివాజీని బహిష్కరిస్తాడు. తాత మీద కోపంతో వెళ్లి శత్రువులతో కలిసిపోతాడు శివాజీ.
***
      ఈ కుటుంబ డ్రామా అంతా మరో బాహుబలిలా భారీగా వుంటుంది. గందరగోళంగానూ వుంటుంది. ఒకదశ కొచ్చేటప్పటికి ఎవరు ఎవరి వైపున్నారు, ఎవరు ఎవరి మీద కుట్ర చేస్తున్నారనే తికమక ఏర్పడిపోతుంది. కథ పేరుతో బోలెడంత  ఇన్ఫర్మేషన్ ఏ రూపంలో (16- డి, వెంకటాపురం) ఇచ్చినా కొంత సేపటి తర్వాత తల బొప్పికట్టి ఫాలో కావడం మానేస్తాం. వర్మ ‘కంపెనీ’ అనే మాఫియా తీశారు. అందులో అపార్ధమనే ఎలిమెంటుతో యాక్షన్ సీన్స్ పరుగులుపెడుతూంటాయి. కథ యాక్షన్ ఓరియెం టెడ్ గా వుంటుంది. కానీ ఈ మూడో సర్కార్ లో విశ్వాసమనే ఎలిమెంటుతో డైలాగులతో కథ  నడుస్తూ ఎక్కడేసిన గొంగళిలా వుంటూ సహన పరీక్ష పెడుతుంది!

          ప్రకాష్ ఝా ‘రాజనీతి’ తీసినప్పుడు మహాభారతంలో నేటి రాజకీయాల్ని చూపించానని చెప్పుకున్నారు. అది కూడా మనం ఫాలో కాలేని బోలెడు మహాభారత్ మోడల్ పాత్రలతో డైలాగుల మీద డైలాగులు మోగించుకుంటూ వుంటాయే తప్ప- అమీ తుమీ తేల్చుకోవాలని యాక్షన్ లోకి దిగవు.  వర్మ కూడా తన రోల్ మోడల్ గాడ్ ఫాదర్ ని మహాభారతం చేసి పాత తరం డైలాగులతో సరిపెట్టారు.  

          ఉదాహరణకి-
         
విలువల్ని పట్టుకు వేళ్ళాడే వాడికి స్నేహితులు తగ్గిపోయి శత్రువులు పెరిగిపోతారు
         
అత్యాశ, భయమూ  ద్రోహిగా మార్చేస్తాయి’
         
ప్రతీ మంచికీ నిర్ణీత మూల్యం  వుంటుంది. అది డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, బాధ కావచ్చు’
         
మంచి పని అన్పిస్తే నేను చేస్తాను. అది దేవుడికి వ్యతిరేకమైనా, సమాజానికి వ్యతిరేకమైనా; పోలీసులూ చట్టం, మొత్తం  వ్యవస్థకే వ్యతిరేకమైనా సరే!’
         
మనుషుల్ని కలిపితేనే శక్తి, విడదీస్తే కాదు’
         
ఆట వాళ్ళు  మొదలెట్టారు, నేను ముగిస్తాను
         
నేను సర్కార్ మనవణ్ణని మర్చిపోకు!’
         
నేను సింహాలకి సింహాన్ని!’’
         
ఎలుకలన్నీ ఒక్కటైనా పులిని కాదుకదా పిల్లిని కూడా ఏం చేయలేవ్!
          పులి తోలు కప్పుకున్న కుక్క కుక్కే!’’
         
కుక్కలన్నీ ఒక్కటైతే సింహాన్ని చంపగలవ్!

          అప్పట్లో ధర్మేంద్ర-  నీచ్- కమీనే –కుత్తే – మై తేరా ఖూన్ పీజావూంగా!- అనే కుక్కల్ని తిట్టే డైలాగులే పేల్చేవాడు. దీంతో భరించలేక కుక్కలన్నీ బయల్దేరి వచ్చి  వెండి తెరని   చించేశాయంటూ రాజూ శ్రీవాస్తవ్ కామెడీ షో చేశాడు!  ఇలా వర్మ జంతుజాలాన్ని కూడా దూరం చేసుకున్నారు డైలాగులతో. కుక్కలు ఎలుకలు పిల్లులు పులులు సింహాలతో జూ చూపిస్తున్నట్టు చేశారు. ఇతర డైలాగులతో  నస పెట్టారు –

          ‘ప్రతీ మంచికీ నిర్ణీత మూల్యం  వుంటుంది. అది డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, బాధ కావచ్చు....’  ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు? ‘ప్రజల బాధకి మూల్యం చెల్లించుకో!’ అనేసి ఒక్క ముక్కలో ఆర్డరేస్తే  సర్కార్ పాత్రకి తగ్గట్టుగా బలంగా  వుంటుందిగా? 

          ‘మంచి పని అన్పిస్తే నేను చేస్తాను. అది దేవుడికి వ్యతిరేకమైనా, సమాజానికి వ్యతిరేకమైనా; పోలీసులూ చట్టం, మొత్తం  వ్యవస్థకే వ్యతిరేకమైనా సరే!’  - ఈ నసపెట్టే సొంత డబ్బా ఎందుకు- ‘మంచి పని అన్పిస్తే నేను చేస్తాను’  అనే నీతి డైలాగు ఎందుకు?  తనలాంటి  ఓట్లతో గెలవని రాజ్యాంగేతర శక్తి చేసేది మంచో చెడో ప్రపంచం నిర్ణయిస్తుంది. మంచే  చేస్తున్నానని ఎలా చెప్పుకుంటాడు? ఇదంతా లేకుండా- దేవుడు, సమాజం, పోలీసులూ చట్టం, వ్యవస్థా- ఈ గొప్ప మాటల జోలికి పోకుండా -  ఒక్క ముక్కలో -‘మిన్ను విరిగి మీద పడ్డా చేసేది చేసేస్తా!’ – అని అంటే అతడి అధార్టీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుందిగా? అధార్టీ ని చూపించి, జడ్జి మెంటుని ప్రేక్షకులకి వదిలెయ్యాలి గానీ -  సంజాయిషీ లిచ్చుకోవడ మెందుకు - బలహీన పాత్ర అవడానికి కాకపోతే? పెదరాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న పాత్రలు అధార్టీ చూపిస్తాయి, సంజాయిషీ లిచ్చుకోవు.

          ‘విలువల్ని  పట్టుకు వేళ్ళాడే వాడికి స్నేహితులు తగ్గిపోయి శత్రువులు పెరిగిపోతారు’ -  ఇదింకో  మైకేల్ వాల్యా నీతి డైలాగు. ఈ విలన్ చిట్ట చివర్లో సర్కార్ తో  ముఖాముఖీ అయి- దీన్ని ఓపెనింగ్ డైలాగుగా చెప్తాడు ఈ మాత్రం జ్ఞానం సర్కార్ కి లే నట్టు. ఈ డైలాగుతో సర్కార్ మారిపోతాడన్నట్టు అజ్ఞానాన్ని వెల్లడించుకుంటాడు. బలహీన విలన్ అయిపోతాడు. ‘ఇంకెన్నాళ్ళు నీ విలువల రాజకీయాలు చేస్తావ్?’ అని సవాలు విసిరేట్టుగా వచ్చి మాటాడితే, కనీసం ఈ క్లయిమాక్స్ దృశ్యంలోనైనా యాక్షన్ ఓరియెంటెడ్ గా సీను ఓపెన్ అయి,  థ్రిల్ చేసేది. తను బలమైన విలన్ అన్పించుకునే వాడు. 

          ‘విలువల్ని  పట్టుకు వేళ్ళాడే వాడికి స్నేహితులు తగ్గిపోయి శత్రువులు పెరిగిపోతారు’ -  సర్కార్ తను నమ్మిన విలువలకోసం అందరికీ దూరమయ్యాడని కథాక్రమంలో తెలుస్తూనే వుంది. తెలిసిన విషయాన్నే  ప్రేక్షకులకి కామెంటరీ చెప్పడమెందుకు? ప్రేక్షకులు ఫీలవుతున్న సబ్ టెక్స్ట్ ని చెడగొట్టడమెందుకు? ఏ డైలాగుకి ప్రేక్షకుల మూడ్ ఏమౌతుందోనన్న వివేచన వుండాలిగా? 

          ఇలాటిదే ఇంకోటి- ‘అత్యాశ, భయమూ  ద్రోహిగా మార్చేస్తాయి’- అని సర్కార్ డైలాగు. శివాజీ రాకతో అనుచరుడు అభద్రతకి లోనవుతున్నాడనీ, వారసత్వం కోసం ఏదో చేస్తాడనీ, దేనికో పాల్పడతాడనీ, పాల్పడ్డాడనీ కూడా కథాక్రమంలో ప్రేక్షకులు క్యారక్టరైజేషన్ ని  గమనించారు. మళ్ళీ దీన్నిప్రేక్షకులకి  కామెంటరీ చెప్పడ మెందుకు? ప్రేక్షకులకి ట్యూషన్లు చెప్పడం, స్పూన్ ఫీడింగ్ చేయడం ఇదే జరిగింది ఎక్కువగా.  కనపడుతున్న విషయాన్ని చెప్పడం, చెప్పాలనుకున్న విషయాన్ని కనపడకుండా చేయడం ఇదే జరిగింది. 

          పాత్రల తత్త్వాల్ని విడమర్చి చెప్పనవసరం లేని డైలాగులు ఓ పక్కనుంటే, కొన్ని సామాజిక స్పృహతో కూడిన  డైలాగులు బావున్నాయి. అయితే ఇవి రెండు మూడే కన్పిస్తాయి-  

          ‘మీరు గాంధీ విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు  గూండాల్ని పూజించడం మానె య్యండి’ - మనోజ్ బాజ్ పాయ్.
          ‘ఒక చేతిలో మాల, ఇంకో చేతిలో భాలా (ఈటె)’ -  
మనోజ్ బాజ్ పాయ్.
          ‘స్వ పక్షానికి ద్రోహం చేసి వచ్చిన వాడితో నేను చేతులు కలపను’ – సీఎం.
          రెండో సర్కార్ లో మరపురాని  అభిషేక్ బచ్చన్ డైలాగు వుంటుంది- ‘జనాలకి డెవలప్ మెంట్ అక్కర్లేదు, ఎంటర్ టైన్మెంట్ కావాలి’ అని. 

         
రెండో సర్కార్ తర్వాత తొమ్మిదేళ్ళలో ఈ మూడో సర్కార్ కి వార్ధక్యం వచ్చేసింది. ఇది దిలీప్ కుమార్ సినిమా అయినట్టూ- ప్రాణ్ విలన్ గా వున్నట్టూ-  రాహీ మాసూం రజా వచ్చేసి డైలాగులు లిఖిస్తున్నట్టూ- పాత మోడల్ డైలాగులన్నీ తెచ్చి,   ఉమర్ ఖయ్యాం మధుపానశాలకి  పాలరాతి మెట్లకి మల్లే పేర్చారు.
***
     మనవడు శివాజీ మొదటి సర్కార్ లో  పుట్టాడు. ఇప్పుడు పెరిగి మూడో సర్కార్ లోకి  వచ్చాడంటే, ఇప్పటికి కనీసం పాతికేళ్ళ కథాకాలం గడిచినట్టు. ఈ పాతికేళ్ళూ సుభాష్ నాగ్రే  ఏమీ మారలేదు. ఒకటవ, రెండవ సర్కార్ లలో ఎలా వున్నాడో, ఇప్పుడు పాతికేళ్ళ కాలాన్ని సూచిస్తున్న మూడవ సర్కార్ లోనూ అలాగే వున్నాడు. ఇదంతా ఎందుకంటే గాడ్ ఫాదర్, ఆ తర్వాత వచ్చిన దాని రెండు సీక్వెల్స్ లో  కథాకాల విస్తృతిని దృష్టిలో పెట్టుకునే కథ, పాత్రలు వుంటాయి. ఆషామాషీగా తీసి ఆస్కార్లు క్లెయిమ్  చేయలేదు.  

          మార్పుకి పాతికేళ్ళ కాలావధిని తీసుకోకపోయినా, రెండో సర్కార్ తర్వాత ఇప్పటికి ఈ తొమ్మిదేళ్ళుగా చూసుకున్నా సుభాష్ నాగ్రే  ఏమీ మారలేదు. అప్పుడెలా వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు. పాత్ర ఇక ఏం ఆసక్తి కల్గిస్తుంది? ఈ రీత్యా కూడా బాక్సాఫీసు అప్పీల్ ని కోల్పోయింది కథ. అవే నల్ల వస్త్రాలతో, అదే చీకటి బంగళాలో, అలాగే కూర్చుని,  అదే చాయ్ తాగుతూ వుంటాడు.  అదే పాత రాజకీయం చేస్తూంటాడు. మారిపోయిన రాజకీయ సామాజికార్ధిక పరిస్థితులు అతడి చుట్టూ కన్పించవు. కాలం కూడా తనలాగే స్థంభించినట్టు వుంటుంది. ఈ మారని నేపధ్య సృష్టితో  కూడా బాక్సాఫీసు అప్పీల్ కి దూరమైపోయింది కథ. ఈ పరిస్థితుల్ని సమకాలీనం చేసివుంటే తేజోవంతంగా వుండేది కథ. ఒకటవ రెండవ మూడవ సర్కార్ లన్నిటినీ – పాతికేళ్ళూ ఒకే కాంగ్రెస్ కాలపు కథల్లా చూపించడం మింగుడుపడని వ్యవహారం. తొమ్మిదేళ్ళ క్రితం చనిపోయిన చిన్న కొడుకు శంకర్ ఫోటో పెట్టుకుని, అక్కడున్న మొక్కకి నీళ్ళు పోస్తూ వుంటాడు. అది బొన్సాయి మొక్క. చిన్న కొడుకు చంపిన పెద్ద కొడుకు ఫోటో వుండదు. 

          ఈ పరిస్థితుల్లో పిలవని పేరంటంలా చనిపోయిన పెద్ద కొడుకు కొడుకు (శివాజీ) రావడం,  బాధ్యతలు చేపడతానడం కూడా అర్ధం కాదు. తన తండ్రిని చంపిన కుటుంబంలోకి తనెందుకు రావాలి?  ఎందుకు ఉద్ధరించాలి? తన తండ్రిని చంపిన బాబాయ్ ఫోటో పెట్టుకుని తాత వుంటే ఎందుకని ప్రశ్నించడు తన తండ్రికి ఇస్తున్న విలువ గురించి? అసలిలా వచ్చి కలిసిన మనవణ్ణి  తాత  సర్కార్ ఎందుకు అనుమానించడు? 

          సర్కార్ మీద పగ పెంచుకున్న అమ్మాయిని మనవడు ప్రేమిస్తూంటాడు. అంటే ఆమె పగకి ఆమోద ముద్ర వేసినట్టేనా? ఆమె సర్కార్ ని చంపితే ఓకేనా? మరి స్వయం ప్రకటిత సర్కార్ వారసుడిగా తను వచ్చాడే? ఒకసారి సర్కార్ అడుగుతాడు- ‘నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి తండ్రిని నేను చంపించాను, అయినా నీకు సరేనా’ – అని. అభ్యంతరం లేదంటాడు మనవడు శివాజీ. అభ్యంతరం ఇతడి కెందుకుంటుంది? వుంటే ఆ అమ్మాయికుండాలి. వీడు తాతని చంపనిస్తాడో లేదోనని ఇతణ్ణి  దూరంపెట్టాలి, ప్రేమించకూడదు. 

          అయితే సర్కార్ మనవణ్ణి అలా అడగడం పూర్తిగా మిస్ లీడింగ్ సీను.  ఎందుకంటే, హీరోయిన్ తన తండ్రిని చంపించింది సర్కార్ కాదని తెలుసుకుని చంపిన అసలు వాణ్ణి చంపేస్తుంది చివర్లో. అలాంటప్పుడు –‘నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి తండ్రిని నేను చంపించాను’ అని సర్కార్ ఎలా అంటాడు? ఏమిటిదంతా మనకి అర్ధంగాదు. ఫాల్స్ డ్రామాతో సస్పన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని మాత్రం అర్ధమౌతుంది. 

          ఇక జాకీ ష్రాఫ్ విలన్ లా కాక జోకర్ లా వుంటాడు. ఎంతసేపూ దుబాయిలో బికినీ బేబీని పట్టుకుని స్విమ్మింగ్ పూల్స్  దగ్గర తచ్చాడుతూ ఫోన్ కాల్స్ మాట్లాడ్డమే. ఇదంతా కామెడీగా వుంటుంది తప్ప సీరియస్ నెస్ వుండదు. జయప్రకాష్ రెడ్డిని బ్యాంకాక్ లో వూహించుకుంటే ఎలా వుంటుందో అలాగే వుంటుంది. అలాగే మొదట్లో ప్రపోజల్ తో సర్కార్ దగ్గరికి గాంధీ అనే ఇంకో విలన్ వచ్చి శృంగభంగమయ్యాక - లవ్ యూ- అని సర్కార్ కి చెప్పేసి వెళ్ళిపోతాడు. అంత చనువుగా, చులకనగా మాట్లాడినందుకు సర్కార్ అంతటి వాడు ఏమీ అనుకోడు- అదే సమయంలో ఇలా కామెడీగా అనేసి వెళ్ళిపోయిన  గాంధీ కమిట్ మెంట్ ఉత్తదే అన్పించేలా వుంటుంది.  

          హీరోయిన్ యామీ గౌతం కూడా పగదీర్చుకోవాలంటుంది గానీ, ఆ పనే మొదలెట్టదు. అదిరిపోయే మేకప్ వేసుకుని ముంబాయిని  సిడ్నీలా వూహించు కుంటున్నట్టు టూరిస్టులా తిరుగుతూంటుంది. గాంధీకి లాగే ఈమె కమిట్ మెంట్ ఎంతటిదో తెలిసిపోతూంటుంది. 


          ఇక సర్కార్ ని చంపాలనుకునే నయా నేత  మనోజ్ బాజ్ పాయ్ ఆ ప్రయత్నం విఫలమైతే పారిపోయి తలదాచుకోడు. తలకాయ హీరోకి అప్పజెప్పి హరీ మంటాడు. ‘నా కొడుకుని సర్కార్ అన్యాయం గా చంపే శాడయ్యో!’ అని అతడి తల్లి గగ్గోలు పెడుతుంది. అంతకి ముందు - ‘సర్కార్ ని యెయ్యాలి, యేసెయ్యాలి!’  అని కొడుకుని రెచ్చగొట్టి  మరీ సర్కార్ మీదికి పంపింది తనే. ఆ కొడుకు ఛస్తే సర్కార్ అన్యాయంగా చంపేశాడట!   
***
     అసలు ఈ సినిమాకి కథ చేశారా, గాథ చేశారా అనేది పెద్ద సందేహం.  కథ చేసివుంటే ప్లాట్ పాయింట్స్ కన్పించాలి. మొదటి ప్లాట్ పాయింట్లో సంఘర్షణ పుట్టి మిడిల్ లో పడాలి కథ. మిడిల్లో పడి మరింత సంఘర్షణాత్మకం అవాలి కథ. రెండో ప్లాట్ పాయింట్లో ఆ సంఘర్షణకి సమాధానం దొరికి ఎండ్ లో పడాలి కథ. చాలా సింపుల్.

          ఈ స్ట్రక్చర్  కన్పించదు. కథా  ప్రారంభంలోనే  ప్రపోజల్ తో గాంధీ రావడం, దాన్ని సర్కార్ కాదనడం జరిగి సంఘర్షణ పుట్టేస్తుంది. అంటే ఇది ప్లాట్ పాయింట్ వన్ అనుకోవాలి. అయితే ఈ పుట్టిన సంఘర్షణ జాడ వుండదు. ప్రాజెక్ట్ కోసం గాంధీ, విలన్  వాల్యాతో కలిసి ఏదో  చేయబోవడం, దాన్ని సర్కార్ అడ్డుకోవడం లాంటి యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే వుండదు. మాటలే వుంటాయి. పైగా వివిధ పాత్రల పరిచయాలే అవుతూంటాయి. డైలాగులతోనే సీన్లు మొదలవుతాయి, డైలాగులతోనే ముగుస్తాయి, మళ్ళీ డైలాగులతోనే మొదలవుతాయి. అరగంటయ్యేసరికి హీరో ప్రవేశిస్తాడు. ఇతడితో కూడా కథలో మార్పు రాదు. కూర్చుని మాట్లాడుకునే అవే డైలాగులు. గంటా పది నిమిషాలు గడుస్తున్నా ఏమీ జరగదు. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలీ అని పాత్రలు అనుకోవడమే గానీ ఏమీ చెయ్యవు. పగతో వున్న హీరోయిన్ కూడా ఏమీ చెయ్యదు. దుబాయ్ లో విలన్ అయితే ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తూంటాడు.  ప్రపోజల్ గాంధీ అయిపు వుండడు. నయా నేత గోవింద్ ఉపన్యాసాలతో గడిపేస్తూంటాడు. అన్నీ వదరుబోతు పాత్రలే, ఏవీ పనిమంతులు కావు. 

          అప్పుడు ఇంటర్వెల్ వచ్చి ఒక యాక్షన్ సీను జరుగుతుంది- గోవింద్ సర్కార్ మీద హత్యాయత్నం చేస్తాడు. మళ్ళీ సెకండాఫ్  షరా మామూలే. ఇదంతా చూస్తూంటే స్ట్రక్చర్ వుండని గాథలా వుంటుంది. కమర్షియల్ సినిమాకి పనికి రాని ప్రక్రియ గాథ. కమర్షియల్ సినిమాలకి కథలే వుండాలని గతంలో ఎన్నో సార్లు చెప్పుకున్నాం. కథంటే ఆర్గ్యుమెంట్. హీరోకీ విలన్ కీ మధ్య వాళ్ళ వాళ్ళ వాదాలు చెలరేగుతాయి. ఎవరికి  వాళ్ళు తమ వాదాన్ని గెలిపించుకోవడానికి పోరాటం మొదలెడతారు. చివరికి ఎవరి వాదం కరెక్టో జడ్జిమెంట్ ఇస్తుంది కథ. 

          గాథ ఇలాకాదు. ఇది స్టేట్ మెంట్ మాత్రంగా వుంటుంది. నేనిలా చేస్తే, నాకిలా జరిగి, ఇలా ముగిసిందీ  నా కథా అని స్టేట్ మెంట్ మాత్రమే ఇచ్చుకునేదిగా వుంటుంది.
కథ ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. గాథ స్టేట్ మెంట్ నిస్తుంది. అనిల్ కుమార్ రోడ్డు మీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. కాలు ఫ్రాక్చరైందని తేల్చారు. తిరిగి నడవాలంటే కొన్ని నెలలు పడుతుందని చెప్పారు. కొన్ని నెలల తర్వాత తిరిగి ఎప్పటిలా నడవసాగాడు. ఇది గాథ. ఇది ఇలా  స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోతుంది. ఇలాగే వుంటుంది మూడో సర్కార్ కథనం.

         
అనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందే నని  పట్టుబట్టాడు. కోర్టులో కేసు వేశారు. అనిల్ కుమార్ కేసు పోరాడి గెలిచాడు. వాహనదారుడిదే తప్పని తేలింది. అనిల్ కుమార్ కి నష్ట పరిహారం లభించింది. ఇది కథ . ఇది  ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తోంది. ఇలావుండదు మూడో సర్కార్ కథనం. 

          పైన చెప్పుకున్న
స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోయిన  గాథ ఎంత  చప్పగా వుందో, ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తున్న కథ అంత  ఆసక్తి కరంగా వుందని తేలుతోంది. ఇందుకే సినిమాలకి పనికొచ్చేది కథలే గానీ, గాథలు కాదు. ఇంకోటి గమనిస్తే- గాథకి స్ట్రక్చర్  వుండదు, కథకి వుంటుంది. సినిమాకి స్ట్రక్చరే ముఖ్యం.  గాథలో బిగినింగ్ మాత్రమే వుండి, సాగి సాగి  బిగినింగ్ తోనే ముగుస్తుంది. మూడో సర్కార్ ఇలాగే వుంటుంది. అందుకని సినిమాకి పనికి రాదు. కథ కి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ కూడా వుండి  సంతృప్తికరంగా ముగుస్తుంది. గాథకి ప్లాట్ పాయింట్స్ వుండవు- మూడో సర్కార్ కీ లేవు. కథకి వుంటాయి. గాథకి క్యారక్టర్ ఆర్క్ వుండదు, ఎలా వున్న పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. మూడో సర్కార్ ఇంతే. కథకి క్యారక్టర్ ఆర్క్ తో పాత్ర ఉద్విగ్నభరితంగా వుంటుంది. గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుండదు, కథనం నేలబారుగా సాగుతూ వుంటుంది. దీన్ని మూడో సర్కార్ లో గమనించవచ్చు. కథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుంటుంది, కథనం ఉత్థాన పతనాలతో కట్టి పడేస్తుంది. గాథలో ఇవి వుండవు- మూడో సర్కారే ఉదాహరణ.

         
గాథలో సంఘర్షణ వుండదు- మూడో సర్కార్ లోనూ లేదు. సంఘర్షణ లేనిది కథ వుండదు. గాథకి ప్రతినాయక పాత్ర వుండదు- మూడో సర్కార్లో వున్నా లేనట్టే వున్నారు. కథకి ప్రతినాయక పాత్ర కీలకం. గాథలు ఆర్ట్ సినిమాలకి బావుంటాయి- ఆర్ట్ సినిమా లాంటిదే  మూడో సర్కార్ గాథ.  కథలు కమర్షియల్ సినిమాలకి బావుంటాయి.  గాథతో జరిగే మోసమేమిటంటే, అది గాథ  అని చాలాసేపటి వరకూ తెలీదు. ఇంకా ప్లాట్ పాయింట్ వన్ వస్తుందనే ఎదురు చూస్తూంటాం. ఎంతకీ రాదు, విశ్రాంతి వచ్చేస్తుంది. అది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదని తేలడంతో అప్పుడు తెలుస్తుంది మోసం. మోసపోయామే అని లేచిపోవడమో లేకఏం చేస్తాం ఖర్మ అనుకుని మిగతాదంతా చూడడమో చేస్తాం. సర్కార్ తోనూ ఇదే అనుభవం. కాకపోతే ప్రారంభంలో చూపించింది ప్లాట్ పాయింట్ వన్ అని మోసపోయాం. 

         
చేస్తున్నది కథలనుకుని  గాథలు రాసుకుంటూ తీసినవన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి- కృష్ణ వంశీ ‘మొగుడు’, ‘పైసా’; శర్వానంద్ ‘రాజాధిరాజా’, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’, సునీల్ ‘జక్కన్న’  సుధీర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, విజయ్ దేవరకొండ ‘ద్వారక’ ...చెప్పుకుంటూపోతే చాలా  వున్నాయి.
                                                                        
***


     సెకండాఫ్ లో సర్కార్ మీద హత్యాయత్నం చేసిన గోవింద్ ని హీరో చంపి ఇంట్లోంచి బహిష్కృ తుడవడం ముఖ్య ఘట్టం. ఇది కథయ్యుంటే ఇంటర్వెల్ లోనే ఈ ఘట్టం వస్తుంది. స్ట్రక్చర్ చెదిరిపోయి సెకండాఫ్ లో వచ్చిందంటే ఇది కథ కాదు, గాథ. ఇలా బహిష్కృ తుడైన హీరో వెంటనే ఒక మాఫియా దగ్గరి కెళ్ళి పోయి – ‘తాతతో నాకు పడలేదు, మనం మనం ఒకటీ’  అంటాడు. ఓకే అని చేతులు  కలుపుతాడు మాఫియావెంటనే గాంధీ దగ్గరికి వెళ్ళిపోయి ఇదే మాట చెప్తాడు. గాంధీ కూడా ఓకే అనేస్తాడు. తాత వెళ్ళగొడితే ఇంత చిల్లరగా వాళ్ళ పంచన చేరుతున్నాడే హీరో అన్పించేలా వుంటాయి దృశ్యాలు. ఇలా వచ్చిన వాణ్ణి శత్రువు లెందుకు నమ్ముతారో అర్ధం గాదు.

          హీరో స్వతంత్రంగా అడ్డా తెరచి కూర్చుంటే ఒక అర్ధం వుంటుంది. వీడేంటి ఇలా వచ్చాడని 
శత్రువులే మంచీ చెడులు నిర్ధారించుకుని ఎలాగూ  వచ్చి చేతులు కలుపుతారు. ఇది ఎత్తుగడ, చేసింది మాత్రం అందరి పాత్ర చిత్రణల్నీ దెబ్బతీయడం. మళ్ళీ మాట్లాడుకుంటూనే వుంటారు. మాటలతోనే సీన్లు నడుస్తూంటాయి. అప్పుడు సర్కార్ అనుచరుణ్ణి నువ్వే సర్కార్ అవుతావని విలన్ లొంగ దీసుకుంటాడు. సర్కార్ కి నమ్మక ద్రోహం చేసిన అనుచరుడు హతమవుతాడు. తను కోరుకుంటున్న వారసత్వానికి హీరో తనకి అడ్డు తొలగిపోయాక, ఈ  అనుచరుడికి ఈ విశ్వాసఘాత మెందుకు, చావడమెందుకు?  

 ఇలా పరస్పర విరుద్ధంగా సాగుతూంటాయి సీన్లు. చివరికి తేలేదేమంటే – హీరోని సర్కార్ వెళ్ళగొట్టడం అంతా ఒక నాటకమట. ఇలా నాటక మాడితే ఎవరెవరు శత్రువు లున్నారో బయటపడి  హీరోకి దగ్గరవుతారనీ, అప్పుడు ఒక్కొక్కర్నీ చంపి శత్రువుల్లే కుండా చేసుకోవచ్చనీ తాతా మనవళ్ళ పథకమట. 

          ఈ సంగతి దాచి పెడుతూ  సీన్లు నడిపి చివర్లో ఓపెన్ చేయడంతో-  కమర్షియల్ సినిమాలకి పనికిరాని ఎండ్ సస్పెన్స్ ప్రక్రియ అయ్యిందన్న మాట. గాథ అనుకుంటే ఆ గాథకి  ఎండ్ సస్పన్స్ కూడా తగిలించారు. దీంతో ప్రధాన పాత్ర అయిన సర్కార్ లక్ష్యం ఏమిటో మనకి అస్సలు తెలీక, ఏ పాయింటుతో ఈ గాథకి సీన్లు నడుస్తున్నాయో అస్సలు అర్ధంగాక- మన ఇన్వాల్వ్ మెంట్ కి దూరంగా – స్పష్టం కాని వాటి వాటి ప్రపంచాల్లో పాత్రలు బతికేస్తూంటే, డైలాగులు వల్లిస్తూంటే చూస్తూ తెగ బోరు ఫీలవుతాం. 

          ఎవరెవరు శత్రువులో సర్కార్ కి తెలిసే వున్నారు, మనకి కూడా చూపించేశారు. సర్కార్ కి తెలియకుండా వుండి పోయిన శత్రువు అనుచరుడొక్కడే.  ఈ ఒక్కడి కోసమే ఇంత డ్రామా నడిపినట్టయింది. మొదట్లో ఏదో అనుకుని మొదలు పెట్టిన గాథ  కూడా ఇంకేదోగా తేలింది.
***
సినిమా విజువల్ మీడియా అని తెలిసిందే. పాత్రలు చర్యలకి పాల్పడితేనే విజువల్ మీడియా అవుతుంది. కూర్చుని బాతా ఖానీ వేసుకుంటే విజువల్ మీడియా అవదు, స్టేజి నాటకమవుతుంది. ఈ గాథని కూడా సీన్లకి సీన్లు డైలాగులతోనే నడిపినప్పుడు సినిమా తీయనవసరం లేదు- ఆడియో రూపొందించి రిలీజ్ చేస్తే మొత్తం అర్ధమైపోతుంది  రేడియో నాటికలా. మహా అయితే కోటి రూపాయలతో పనైపోతుంది. ఆడియో స్క్రిప్టుని 35 కోట్లు పెట్టి సినిమా తీస్తే 34 కోట్లూ బొక్క. సినిమా కథని కంటారు, వినరు. సినిమాకి కనే కథే  కావాలి, వినే కథ కాదు. పేపరు పెన్నులు పడరాని చేతుల్లో పడితే  చాలా ప్రమాదం. ముగ్గురు పండితులు, ఆరు చేతులు, అరవై తప్పులు! 

  జీవితంలో మొదటిసారిగా రాం గోపాల్ వర్మ ప్రయోగాత్మకంగా ఆడియో స్క్రిప్టుని సినిమాగా తీశారు. కనే కథగాని వినే కథ, రామన్న గాథ!

-సికిందర్




































Friday, May 19, 2017

రివ్యూ!


రచన దర్శకత్వం : సుదీర్ వర్మ
తారాగణం : నిఖిల్, రీతూ వర్మ, ఇషా కొప్పీకర్, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్ ,ప్రియదర్శి
సంగీతం : సన్నీ ఎంఆర్ఛాయాగ్రహణం: మణి 
బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్
నిర్మాత : అభిషేక్  నామా
విడుదల : మే 19, 2017
      హీరో నిఖిల్ ఇతర హీరోలకి భిన్నమైన  సినిమాలు చేసుకుపోతూ తనదైన వొక కొత్త స్కూలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అవి తెలుగు సినిమాలకి అలవాటు లేని కొత్త పాయింట్లే కావొచ్చు- నచ్చితే కళ్ళు మూసుకుని చేసేస్తున్నాడు. ‘సూర్య వర్సెస్ సూర్య’ లో  పోర్ఫీలియా అనే వ్యాధిగ్రస్తుడిగా నటిస్తే, ఇప్పుడు ‘కేశవ’ లో డెక్స్ ట్రోకార్డియా బాధితుడిగా పాత్ర పోషించాడు. న్యూవేవ్ ధోరణిలో కొత్తదనాన్నిఆహ్వానిస్తున్న అతడ్ని అభినందించక తప్పదు.  అలాగే ‘స్వామి రారా’  ఫేం దర్శకుడు సుధీర్ వర్మ, ఆ తర్వాత ‘ దోచేయ్’ అనే ఫ్లాప్ తీసి తిరిగి అదే నిఖిల్ తో  ఇప్పుడు ‘కేశవ’ అనే థ్రిల్లర్ తీశాడు.  మళ్ళీ ఒకటైన వీళ్ళిద్దరి కాంబినేషన్ లో  ఈ కొత్త ఆఫర్ ఎలావుందో ఒకసారి చూద్దాం...

కథ 
      కాకినాడలో లా చదివే  కేశవ శర్మ (నిఖిల్) చిన్నప్పుడు కారు ప్రమాదంలో తల్లి దండ్రుల్ని కోల్పోతాడు. ఆ ప్రమాదం  చేసిన తాగుబోతులైన పోలీసుల్ని గుర్తు పెట్టుకుంటాడు. అతడికి అరుదైన హృదయ సంబంధ సమస్య వుంటుంది. గుండె కుడివైపు వుంటుంది. దీంతో అతను  ఎక్కువ ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా జీవించాలి. కానీ ఇప్పుడు పెద్దయ్యాక ఈ పోలీసుల మీద పగ తీర్చుకోకుండా వుండలేక పోతాడు. ఒక్కొకర్నీ రహస్యంగా చంపడం మొదలెడతాడు. అదే కాలేజీలో చదివే చిన్ననాటి స్నేహితురాలు సత్య భామ ( రీతూ వర్మ ) అతణ్ణి అనుమనిస్తూంటుంది. ఈ హత్యల్ని  దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఆఫీసర్ గా షర్మిల (ఇషా కొప్పీకర్ ) వస్తుంది. ఇప్పుడు ఈమెని తప్పించుకుంటూ మిగిలిన పోలీసుల్ని కేశవ్  ఎలా చంపాడన్నది మిగిలిన కథ.

ఎలావుంది కథ ?
     రొటీన్ రివెంజి  ఫార్ములా కథ. గత వారమే నిఖిల్ ‘హేపీ డేస్’ కొలీగ్ రాహుల్ ‘వెంకటాపురం’  లో పగతో పోలీసుల్ని చంపే కార్యక్రమం ఆల్రెడీ చేశాడు. ఇక మరో కొలీగ్ వరుణ్ సందేశ్ కూడా చేస్తే  ముగ్గురితో ఓ పని పూర్తయి పోతుంది. నిఖిల్, రాహుల్ ఇద్దరి సినిమాల్లోనూ  పోలీసులు పుసుక్కున చస్తారు. తల్లిదండ్రుల చావుకి ప్రతీకారం తీర్చుకోవడం, ప్రేయసి మరణానికి పగదీర్చుకోవడం లాంటి కథలు  నిజానికి 1970 ల నాటి ఫార్ములా. ఆ తర్వాత బి- గ్రేడ్ సినిమాలకి ఈ ఫార్ములా బదిలీ అయింది. దీన్ని ‘ఏ’ గ్రేడ్ గా  పాలీష్ చేసి ఈనాటి ప్రేక్షకుల్ని ఆకట్టుకుందామనుకుంటున్నారు. ఇంతకంటే ఈ రివెంజి ఫార్ములా గురించి చెప్పుకోవడానికేమీ లేదు. 

          ఈ రివెంజి కథలో  హీరోకి ‘కుడివైపు గుండె’ సమస్య చెప్పారు. ఈ సమస్యతో బెంగాలీ లో (సజరూర్ కాంతా), హిందీలో (లక్) , హాలీవుడ్ లో  (డాక్టర్ నో) వంటి సినిమాలు వచ్చాయి. ఇవి ఆసక్తికరంగా వుంటాయి.  

ఎవరెలా చేశారు 
       నిఖిల్ డార్క్ మూడ్ లోవుండే పాత్ర ఇది. ఒక్క చోట కూడా నవ్వడు, సరదాగా వుండడు,  సంతోషంగా వుండడు. గత సినిమాలన్నిటి కంటే భిన్నంగా యమ సీరియస్ గా రివెంజి మూడ్ లోనే వుంటాడు. అతడి ఫ్యాన్స్ కి జీర్ణం కాని కొత్త వ్యవహారం కావచ్చు ఇది. ఈ పాత్రకి చంపడం తప్పితే ఇంకెలాంటి కమర్షియల్ హంగులు కూడా లేవు- హీరోయిన్ రీతూ వర్మతో రోమాన్సూ పాటలూ సహా. ఆ చంపడం కూడా థ్రిల్లింగ్ గా వుండదు, నాసిరకంగా వుంటుంది. 

          నిఖిల్ కుడివైపు గుండెగల అరుదైన  సమస్యతో స్ట్రగుల్ చేసే పాత్ర పోషించినట్టు భారీగా పబ్లిసిటీ చేశారు. ఇది నమ్మి వెళ్తే తీవ్ర ఆశాభంగం తప్పదు. ఈ గుండె సమస్య కథలో భాగం కాదు, పాత్రకి అదొక సమస్య కూడా కాదు. కేవలం ప్రారంభంలో నిఖిల్ తనకి ఈ అరుదైన సమస్య వుంది కాబట్టి గట్టిగా నవ్వినా, ఉద్రేకాలకి లోనైనా  ప్రాణాలు పోతాయి కాబట్టి, ప్రశాంతంగా మర్డర్లు చేస్తానని ఒకమాట చెప్పి  వదిలేస్తాడు. ఆ తర్వాత ఎక్కడా మళ్ళీ దీని ప్రసక్తే వుండదు, ఆ సమస్య వున్నవాడిలా కన్పించడు. ఏదైనా యాక్షన్ సీను వుంటే అప్పుడు ఛాతీని రుద్దుకుంటాడు- అది కూడా  కుడి వైపు కాదు, ఎడమవైపు! 

          డెక్స్ ట్రోకార్డియా సమస్య పిండ దశలోనే కోటి మందిలో ఒకరికి వచ్చే అవకాశముందని అంటారు. గుండె ఛాతీకి ఎడమవైపు వుంటుందని అనుకుంటారు. కానీ  కాదు. గుండె ఛాతీ మధ్యలో రెండు వూపిరి తిత్తుల మధ్య వుంటుంది. కేవలం ఎడమ వైపు ఒరిగి వుండడం వల్ల ఎడమ వైపు గుండె వుందని అనుకుంటాం. డెక్స్ ట్రోకార్డియా ని సైటస్  ఇన్వర్సస్ అనికూడా అంటారు. ఈ కేసుల్లో  గుండె కుడి వైపు వొరిగి వుంటుంది, అంతే.  ఇలా కుడి వైపు వొరిగి వున్నప్పడు శరీరంలో అన్నిటి స్థానాలూ మారిపోతాయి-  కాలేయం, ప్లీహం, మూత్ర పిండాలు, మూత్రాశయం మొదలైనవి ఎడమ వైపు కొచ్చేస్తాయి. 

         ఇది నయం కాని సమస్యేం కాదు, సర్జరీతో సరి చేయవచ్చు. లేకపోతే జీవితాంతం మందులు వాడాలి. పైగా శరీరం నీలి వర్ణంలోకి మారుతుంది, ఆక్సిజన్ సరిగా అందదు. జీర్ణ వ్యవస్థ సరిగ్గా వుండదు. అయితే ఎంత వొత్తిడికి లోనైనా, భావోద్రేకాలకి లోనైనా, నవ్వినా  ఏడ్చినా, పరుగెత్తినా వచ్చే ప్రమాదమేమీ లేదు. 

          సినిమాల్లో ఈ ‘కుడివైపు గుండె’ ఫార్ములా యాక్షన్ సినిమాల్లో సర్ప్రైజ్  ఎలిమెంట్ గానే వాడుకున్నారు తప్పితే  స్ట్రగుల్ కి కాదు. జేమ్స్ బాండ్ మూవీ  ‘డాక్టర్ నో’ లో షూట్  చేస్తే చావడు. బతికి, నాగుండె కుడి వైపు వుందని షాకిస్తాడు. 

        కాబట్టి ‘కేశవ’ లో గుండె స్థానభ్రంశాన్ని ఎమోషన్స్ కి ముడిపెట్టి వివరించడం సరికాదు. అయితే శారీరక ఇబ్బందులు ఖచ్చితంగా చూపించాల్సిందే. ఇవి చూపించలేదు. పైగా ఉద్రేకాలకి, ఆందోళనలకి లోననైతే ప్రాణాలు పోతాయన్నారు. అలాంటప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రమాదంలో ఘోరంగా చనిపోయినప్పుడే చూసి తనూ హార్ట్ ఎటాక్ తో అప్పుడే పోవాలి. అసలు ఆ కార్లు గుద్దుకున్న తాకిడికే గుండాగిపోవాలి. 

          గొప్పగా ఎక్కడా లేని జబ్బులు కథలో పెట్టుకుని వార్తల కెక్కడమే గానీ, కథలో వాటి నిర్వహణ కొచ్చేసరికి  ఆ విషయ పరిజ్ఞాన మేమీ వుండడం లేదు. నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ కూడా ప్రేక్షకుల్ని ఇలా మభ్యపెట్టి  థియేటర్లకి పరుగులు పెట్టించిన వ్యవహారమే. అందులో నిఖిల్ పాత్ర పదిహేను నిమిషాలు వెలుగులో వుంటే చచ్చి పోయే జబ్బున్న (పోర్ఫీరియా) పాత్ర అని ప్రచారంచేశారు. రాత్రిపూటే బయట తిరుగుతాడు. ఈ సమస్యతో వున్న ఇతడితో ప్రేమలో పడ్డ హీరోయిన్ కి ఈ సమస్య గురించి తెలిస్తే ఎమౌతుందన్న పాయింటు వస్తుంది. దీన్ని పక్కకు తోసేసి,  ప్రేమలో ఇంకేవో అపార్ధాలు సృష్టించి సవాలక్ష సినిమాల్లో చూసేసిన ఏడ్పుల ప్రేమల్నే చూపించారు రొటీన్ గా !  అలాంటప్పుడు గొప్పగా పోర్ఫీరియా ప్రచారాలెందుకు? 

          నిఖిల్ కొత్త ప్రయోగాలు  చేద్దామనుకోవడం మంచిదే, అవి హాస్యాస్పదంగా వుంటే తనే దెబ్బ తింటాడు. సినిమాల్లో హీరో గార్ని ఛీఫ్ ఎడిటర్ గా పరిచయం చేసి  ఆ తర్వాత దాని వూసే వుండని  మూస యాక్షన్ హీరోగా మార్చేసినట్టు, వ్యాధులతో కుదుర్తుందా? 

          హీరోయిన్ రీతూవర్మకి ఇందులో ఏ పనీ లేదు. స్పెషలాఫీసర్ పాత్రలో ఇషా కొప్పీకర్ పాత్రని హాస్యాస్పదంగా సృష్టించాడు దర్శకుడు. ఆమె మాట తీరుగానీ, దర్యాప్తు విధానంగానీ సిల్లీగా వున్నాయి. ఇక పోలీసు పాత్రల్లో వున్న వాళ్ళు ఏకపక్షంగా చావడమే. ఎందుకు ఛస్తున్నామో కూడా తెలియకుండా చావడమే. కొన్ని చోట్ల తప్పించుకునే అవకాశమున్నా హీరోకి చంపడానికే అవకాశమిస్తారు- ఆయన ఎక్కువ పారితోషికం తీసుకుంటాడు కాబట్టి  ఆమాత్రం కాయకష్టం వుండాలన్నట్టు. 

          అక్కడక్కడా కాస్త కామెడీలు చేసుకుని నవ్వించే వాళ్ళు వెన్నెల కిషోర్, సత్య, ప్రియదర్శి లే. రెండే పాటలున్నాయేమో, అవేం బాగా లేవు. ఛాయాగ్రహణం మాత్రం డార్క్ మూడ్ కి తగ్గట్టే వుంది. 

          ఇకపోతే ఒక చీకాకు ఇక్కడ కూడా తప్పలేదు- ఛానెల్ వార్తలు స్క్రీన్ నిండా  పర్చి ఎడాపెడా చూపించడాలు. మాటాడితే – ఇప్పుడే అందిన వార్త అంటూ మొదలెడతారు యాంకర్లు చీటికిమాటికీ. శర్వానంద్ ‘రాధా’ లో ఈ ఎడాపెడా మోత భారీగా వుంటుంది అనాగరికంగా. చీప్ క్రియేషన్ – కథకి అడ్డుపడుతూ. దీనికి ‘సర్కార్- 3’ లో రాం గోపాల్ వర్మ టీవీ స్క్రీన్ లు చూపించకుండా, పాత్రలు పని చేసుకుంటూ తక్కువ వాల్యూంలో వస్తున్న న్యూస్ వింటున్నట్టు అత్యంత సహజంగా చూపించారు. తెలుగు సినిమాల్లో  పాత్రలు కాక, సినిమా కొచ్చిన ప్రేక్షకులు వినాలన్నట్టు ఆయా ఛానెళ్ళ  స్క్రీన్లు వెండి తెరల నిండా వేసి మోత మోగిస్తున్నారు అనాగరికమైన పద్ధతుల్లో. సినిమాకొచ్చామా, ఛానెళ్ళు చూడ్డాని కొచ్చామా అని తలపట్టుకోవాల్సిన పరిస్థితి.

 చివరికేమిటి 
      ఫస్టాఫ్ లో ఒకవైపు హత్యలు, ఇంకో వైపు పోలీసు దర్యాప్తు అనే కథ కొనసాగుతూ ఇంటర్వెల్లో హీరో దొరికిపోయాక- సెకండాఫ్ లో కథలేదు దర్శకుడు చెప్పడానికి. అందుకే  సీన్లు మందకొడిగా సాగుతాయి. ప్రేక్షకులు వూహించే విధంగానే సాగి హమ్మయ్యా అని ముగగింపు కొస్తుంది. ఇందులో రొటీన్ గా స్పెషలాఫీసర్ హీరోకే  హెల్ప్ చేసే అనౌచిత్యం వుంటుంది. ఇదంతా మూసఫార్ములా చిత్రణే తప్ప వాస్తవిక ధోరణి కాదు. సీన్లలో సస్పెన్స్, థ్రిల్, లాజిక్, వేగం అనేవి వుండవు. ఓపికపట్టి నెమ్మదిగా సాగే తెలిసిన సీన్లే చూస్తూండాలి. చిత్రీకరణ వరకూ స్టయిలిష్ గా వుండేట్టు చూసుకున్నాడు దర్శకుడు. విషయం రొటీన్ గా దాని మానాన దాన్ని వదిలేశాడు. ఈ సినిమా చూస్తూంటే ఇలాటిదే  డార్క్ మూడ్ లో వుండే పవన్ కళ్యాణ్  ‘పంజా’ గుర్తుకొస్తోంది. నో- ఆ లుక్, ఆ క్యారక్టర్ పవన్ కి మేలు చేయలేదు- నిఖిల్ కి చేస్తుందా?

-సికిందర్ 
http://www.cinemabazaar.in



Tuesday, May 16, 2017

రివ్యూ & స్క్రీన్ ప్లే సంగతులు!

రచన- దర్శకత్వం: వేణు ఎం.
తారాగణం : రాహుల్, మహిమా  మక్వానా, అజయ్ఘోష్, అజయ్, కాశీవిశ్వనాథ్తదితరులు
సంగీతం: అచ్చు, ఛాయాగ్రణం: సాయిప్రకాష్
బ్యానర్స్ :
గుడ్సినిమా గ్రూప్, బహుమన్య ఆర్ట్స్
నిర్మాతలు: తూము ఫణికుమార్, శ్రేయాస్శ్రీనివాస్
విడుదల : మే, 12, 2017
          ***
         టెంప్లెట్ సినిమాలు తీయడానికి స్వావలంబన అక్కర్లేదు, పరాధీనత సరిపోతుంది. ఎవరో ఎప్పుడో ప్రారంభించిన అదే టెంప్లెట్ పెట్టుకుని అందులో తూనికలూ కొలతల ప్రకారం అక్కడక్కడా కథ వేసుకుంటూ పోతే దానికదే తెలుగు సినిమా అనే పదార్ధం తయారైపోతుంది. టెంప్లెట్ సినిమా తీయడానికి కొత్త కథలు కూడా అవసరంలేదు, మూడు నాల్గు లేటెస్టుగా వచ్చిన ఇతర హీరోల సినిమాలనే కలిపి వండేసినా  హీరోకేం తెలీదు. టెంప్లెట్ సినిమాలు తీయడానికి మేధోపరమైన టాలెంట్ కూడా అవసరంలేదు, ఎంత తక్కువ విషయ పరిజ్ఞానంతో తీస్తే  అంత టెంప్లెట్ తెలుగు ట్రంపెట్ మోగుతుంది. టెంప్లెట్ సినిమాలకి ప్రపంచంతో పనిలేదు, కాల్పనిక ప్రపంచంలో తేలియాడుతూ స్వైరకల్పనలు చేస్తే సరిపోతుంది. టెంప్లెట్ సినిమాలకి అప్డేట్ అవాల్సిన అవసరం కూడా లేదు, ఎంత పాత  చింతకాయలా వుంటే అంత చల్లారిన ఆమ్లెట్ లా వుంటుంది. సెక్స్ లేకుండా కణ విభజనతో సంతానోత్పత్తి చేసుకునే ఏకకణ జీవులైన అమీబాలు టెంప్లెట్లు. ఇందుకే ఇవి మొగుడు అక్కర్లేని పాసివ్ సినిమాలు.

         
దృష్టవశాత్తూ ఈ టెంప్లెట్ బారినుంచి థ్రిల్లర్ జానర్  తప్పించుకుంటోంది- కారణం, ఇది సిసలైన డీఎన్ఏతో  వుండే  జానర్.  ఇందులో ఏ కథకా కథ కొత్త తరహా కథనాన్నే డిమాండ్ చేస్తుంది. ఫార్ములా రహిత కొత్త కథన చాతుర్యాన్నీ డిమాండ్ చేస్తుంది. కొత్త కొత్త క్రియేటివ్ ద్వారాల్నీ,  మేధోపరమైన టాలెంట్ నీ డిమాండ్ చేస్తుంది.  ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చుట్టూ వున్న పరిస్థితుల్ని చూపిస్తుంది. యూత్ కథలతో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇంకే టెంప్లెట్, రోమాంటిక్ కామెడీ, దెయ్యం కామెడీ -దేనికీ సాధ్యంకాని ఇన్వాల్వ్ మెంట్ నిస్తూ, ఆద్యంతం ఉత్కంఠతో కూర్చోబెట్టగల సామర్ధ్యం వున్న ఏకైక  జానర్ ఇదొక్కటే. ఇందుకే ఇవి మొగుడులా వుండే యాక్టివ్ సినిమాలు. 

          ఇందుకే శ్రమించడం ఇష్టంలేని  పాసివ్ వర్గాలకి తెలుగులో ఈ జానర్ సహజంగానే పట్టదు – అవతల తమిళ మలయాళాల నుంచి  ఇవి వచ్చేసి సొమ్ములు చేసుకుంటున్నా కుంభనిద్ర వదలదు. కథలకోసం సమాజంలోకి చూడకపోతే చూడకపోయారు- కనీసం సమాజంలో ఏఏ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి వుండదు. ఇలాటి పరిస్థితుల్లో అరుదుగా ఎప్పుడో ఒక ‘క్షణం’ లాంటిది వస్తే, మళ్ళీ ‘వెంకటాపురం’ లాంటిది రావడానికి రెండు మూడేళ్ళు పడుతోంది. చిన్న బడ్జెట్లు తీసే కొత్త దర్శకులకే కాదు, నిర్మాతలకీ  మార్కెట్ నాలెడ్జి అస్సలు లేదు. మార్కెట్ అంటేనే  ఎలర్జీ!

          కొత్త దర్శకుడు వేణు, నిర్మాతలు ఫణికుమార్, శ్రీనివాస్ లు ఇతరులకి భిన్నంగా  ‘వెంకటాపురం’ అనే థ్రిల్లర్ తీయడానికి ముందుకు రావడమే గొప్ప.  దీని కథనంలో వున్న సంక్లిష్టతని చూసి రెగ్యులర్ తెలుగు కథలా లేదని వెనక్కిపోకుండా,  నిర్మాతలు కొత్త దర్శకుడికి దన్నుగా నిలవడం మరీ గొప్ప. ఇంత మాత్రాన ఈ గొప్పల్ని చూసి తప్పొప్పుల్ని ఎన్నకుండా వుండలేం. తప్పొప్పులు పట్టించుకోకుండా దీన్ని చూసి ఇంకెవరైనా ఇలాటి సినిమాలు తీస్తూ పోయినా లాభముండదు- బాగుపర్చలేని రోమాంటిక్ కామెడీలకీ, దెయ్యం కామెడీలకీ పట్టిన గతే వీటికీ పట్టి మూన్నాళ్ళకే ఈ ముచ్చట కాస్తా  ముగుస్తుంది. 

           కాబట్టి అసలు ‘వెంకటాపురం’ లో వున్నదేమిటి, ఇది ఏఏ కోణాల్లో థ్రిల్లర్ లా వుంది, ఏఏ కోణాల్లో లేదు- ఒకసారి పరిశీలిద్దాం. 

కథ 
       వైజాగ్ లో  ఆనంద్ (రాహుల్ ) ఒక పిజ్జా డెలివరీ బాయ్. ఒక పెంట్ హౌస్ లో వుంటాడు. ఆ అపార్ట్ మెంట్ లోనే తల్లిదండ్రులుంటున్న ఫ్లాట్ లోకి కి చైత్ర (మహిమా మక్వానా) అనే స్టూడెంట్ వచ్చి దిగి, పరీక్షలకి చదువుకుంటూ వుంటుంది. ఆరుబయట టెర్రస్ మీద చదువుకుందా మంటే రాత్రిళ్ళు తాగి అడ్డగోలుగా నిద్ర పోయే ఆనంద్ కన్పిస్తూంటాడు. తండ్రికి చెప్పి అతణ్ణి ఖాళీ చేయించేస్తుంది. ఒకరోజు చైత్ర  ఇంటికి దారిమర్చిపోయి బస్టాపులో వుండి పోతే,  రౌడీలు కన్నేస్తారు. ఆమెకి లిఫ్ట్ ఇచ్చి ఆనంద్ కాపాడతాడు. దీంతో అతడిమీద ఆమె తల్లిదండ్రులకి సదభిప్రాయమేర్పడుతుంది. వూరు తెలీని ఆమెకి  వూరంతా తిప్పి చూపించమని పురమాయిస్తారు.

          ఇలా ఆనంద్,  చైత్రలు  దగ్గరవుతూంటారు. కాలేజీలో చైత్రకి ఇద్దరు బెంచి మేట్స్ వుంటారు. వీళ్ళు చాటు మాటుగా సిగరెట్లు తాగుతూంటారు. చైత్ర కూడా వాళ్ళతో కలుస్తుంది. కాలేజీలో సిగరెట్లు తాగడం కుదరక భీమిలీ బీచ్ కి వెళ్తూంటారు ముగ్గురూ.  అక్కడ ఓ ముగ్గురు రౌడీలు అరాచకాలు చేస్తూంటారు. వాళ్ళ కంట వీళ్ళు పడి ఇద్దరమ్మాయిలు అన్యాయమైపోతారు. చైత్ర తప్పించుకుంటుంది.

          అయితే ఆమె హేండ్ బ్యాగు అక్కడే పడిపోతుంది. దాంతో ఆమెని బ్లాక్ మెయిల్ చేస్తూంటారు రౌడీలు.  జరిగింది ఆనంద్ కి చెప్పేస్తుంది చైత్ర. తన హాల్ టికెట్ వున్న ఆ హేండ్ బ్యాగు తనకి చాలా అవసరమని అంటుంది. ఉద్రేకంతో ఆనంద్ ఒక వేట కత్తి  కొనుక్కుని రౌడీల కోసం బయల్దేరతాడు.  అలా భీమిలీ బీచికి వెళ్లి రౌడీల్ని చంపడానికి కాపేస్తాడు. అప్పుడొక అనుకోని అనుభవం ఎదురవుతుంది.  చైత్ర హత్య కేసులో పోలీసులకి చిక్కి జైలు పాలవుతాడు. అతడికి ఎదురైన అనుభవం ఏమిటి? చైత్ర హత్య కేసులో ఎలా ఇరుక్కున్నాడు? పోలీసులు ఆడిన గేమ్ ఏమిటి? వాళ్ళనేం చేశాడు ఆనంద్...ఇదంతా మిగతా  కథ. 

ఎవరెలా చేశారు
        ‘హేపీడేస్’ హీరోల్లో ఒకడైన రాహుల్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఇమేజి మేకోవర్ తో యాక్షన్ హీరో అవతారమెత్తాడు. విచిత్రంగా  యాక్షన్ హీరోగానే బావున్నాడు. ‘హేపీ డేస్’ సహ హీరో వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ తో  తను జీవితంలో యాక్షన్ హీరో కాలేనని తే ల్చుకున్నాడు. రాహుల్ కి తానేమిటో తెలుసుకోవడానికి నాలుగైదు ఫ్లాపులు అవసరమయ్యాయి. తను ఎటు వెళ్ళాలో ‘హేపీ డేస్’ లో వేసిన  మైక్ టైసన్ పాత్రే రాసిపెట్టినట్టు, ఇప్పుడు ‘వెంకటా పురం’ లో  సిక్స్ ప్యాక్ తో టైసన్ లా ఎంటరై, తమిళంలో కూడా పెద్ద బ్యానర్లో హీరోగా బుక్కై పోయాడు. 

          టైసన్ రాహుల్ నటనలో ఇంప్రూవ్ అయ్యాడు, అయితే పలకడానికి డైలాగులు తక్కువే. ఇది ఎంటర్ టైనర్ కాదుకాబట్టి డైలాగులు తక్కువే వుండొచ్చు. తన పాత్రకి రెండు ముఖాలున్నాయి- ప్రేమికుడి ముఖం,  పగదీర్చుకునే వాడి ముఖం. ప్రేమికుడి ముఖానికి సరైన బలం వుండి వున్నట్లయితే,  పగదీర్చుకునే ముఖానికి విశ్వసనీయత వచ్చేది. పరుచూరి బ్రదర్స్ వి  అధిక భావోద్వేగాల రచనలనుకుంటాం గానీ, వాళ్ళవే ఏ ఎండాకా గొడుగు పట్టే ఎమోషన్స్. ‘ఖైదీ’  లో చిరంజీవికి ప్రేమ పార్శ్వం అంత ఎమోషనల్ గా లేకపోయినట్లయితే, యాక్షన్ పోర్షన్ అంత హిట్టయ్యేది  కాదు. రాహుల్ యాక్షన్ ని విరగదీస్తూంటే దాని పూర్వ రంగం  బలహీనంగా కన్పించి వుండాల్సింది కాదు. యాక్షన్ హిట్టవ్వాలంటే రెండే ప్రేరణలు వుంటాయి- యాక్షన్ కి  తగ్గ భావోద్వేగాలు, లేదా హాస్య ప్రియత్వం ( ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్- 8’ లోలాగా).  వర్మ తీయించిన ‘జేమ్స్’ లో హీరోలాగా కార్డ్ బోర్డ్ పాత్ర రెండు పార్శ్వాల్లోనూ రాహుల్ పాత్రని సజీవం చేయలేకపోయింది. పాసివ్ పాత్రకి  ప్రాణం లేకపోయినా అది దాని లక్షణం, కానీ యాక్టివ్ పాత్రకి యాక్షన్ తో పాటు రక్త ప్రసరణ కూడా  ముఖ్యమే. అప్పుడే యాక్షన్లో మన రక్త ప్రసరణ కూడా పెరిగి  బీపీ తెచ్చుకోగలం.
***
          కొత్త హీరోయిన్  మహిమా మక్వానా ఈ థ్రిల్లర్ కథలో పాత్రకి  సరిపోవడం అలా వుంచి, అసలు వెండి తెరకి ఆనే  మొహం కూడా కాదు, శరీరం కూడా కాదు. నటన గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని థ్రిల్లర్స్ లో హీరోయిన్లవి కీలక పాత్రలై వుండొచ్చు, బాధిత పాత్రలై వుండొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్స్ ని ఎంపిక చేసుకోకపోతే, బడ్జెట్ సినిమాలకి హీరోయిన్స్ పరంగా రావాల్సిన బాక్సాఫీస్ డివిడెండ్స్ ని చేతులారా రాకుండా చేసుకోవడమే. మార్కెట్ దృష్టి లేకపోతేనే ఇలా జరుగుతుంది. మార్కెట్ అంటే ఎలర్జీ కదా. వినియోగదార్లుగా ప్రేక్షకులతో మార్కెట్ బంధం ఏనాడో  శాటిలైట్స్ బూమ్ లోనే తెగిపోయి మార్కెట్ ఎలర్జీ పట్టుకుంది. సినిమాల్ని థియేటర్ల కోసం కాకుండా అప్పనంగా వచ్చిపడుతున్న  శాటిలైట్ హక్కుల కోసం  కుప్పలు తెప్పలుగా తీస్తూ మార్కెట్ ఎలర్జీని పెంచుకున్నారు. ఇప్పుడా శాటిలైట్ హక్కులు హుళక్కి అయినప్పటికీ ఇంకా మార్కెట్  గుర్తుకే  రావడం లేదు. ఆనాటి ఆ ఎలర్జీ ఎటాక్ మామూలు ఎటాక్ కాదు.           

          హీరోయిన్ పాత్రలో ఎవరో ముక్కూ  మొహం తెలీని కొత్త హీరోయిన్ రేప్ కి గురై చనిపోతే who cares? ఆడియెన్స్ కేర్ చెయ్యరు. ‘శంకరాభరణం’ నుంచీ ‘ఎర్ర మందారం’ దాకా  నోటెడ్ హీరోయిన్సే రేప్ గురయితే ఆ పాత్రలకి అంత సానుభూతి వచ్చింది. నాల్గు సినిమాలతో ప్రేక్షకులకి తెలిసిన హీరోయిన్ అయితేనే అయ్యో అని బాధపడతారు. ఆమె పాత్రని ఫాలో అవుతారు. కానీ నాల్గు సినిమాలతో పాపులరైన బడ్జెట్ హీరోయిన్ తెలుగులో ఎక్కడుంది?  శాటిలైట్ రేసులో ఈమెని కూడా తయారు చేసుకోలేకపోయారు. సినిమాకొక కొత్త పిల్లని తెచ్చుకోవడం, చెత్తబుట్టలో పారెయ్యడం. అప్పుడెప్పుడో గజలా వుండేది, తర్వాత అవికా గోర్ వుండేది, ఇప్పుడు తేజస్వి మదివాడ కన్పిస్తోంది...ఈమెని కూడా బడ్జెట్ సినిమా హీరోయిన్ గా పాపులర్ చేసుకుని ప్రయోజనం పొందలేకపోతున్నారు. డిటో హెబ్బా పటేల్.

          థ్రిల్లర్స్ లో హీరోకి మొండి చెయ్యి చూపించినా ఫర్వాలేదు, కానీ వాటిలో కీలక, బాధిత పాత్రలకి గుర్తింపు వున్న హీరోయిన్ కి ఎక్కువ డబ్బులు పెట్టయినా  తెచ్చుకోవాల్సిందే. ఇది హిందీలో చేస్తున్నారు. కానీ మనకి  మార్కెట్ పరిణామాల్ని గమనించే అలవాటే లేదు కదా. స్క్రిప్టుని దిద్దుకుంటూ దిద్దుకుంటూ అద్భుతాలు చేయాలనుకోవడమే గానీ, మార్కెట్టే పట్టదు. మార్కెట్ పట్టినప్పుడే స్క్రిప్టు దిద్దుబాట్లకి, నగిషీలు చెక్కడానికీ  అర్ధం పర్ధం. ఇలా  ‘వెంకటాపురం’ కొత్త హీరోయిన్ వల్ల  ఈ కథతో  ఎమోషన్ కనెక్ట్ ప్రసక్తే లేకుండా పోయింది. 

          దుష్ట ఎస్సైగా అజయ్ ఘోష్, చివర్లో కేసు సాల్వ్ చేసే ఎసిపి గా అజయ్ కన్పిస్తారు. అజయ్ ఘోష్ విలనీ రొటీనే అయితే, అజయ్ డీసెంట్ నటనతో ఆకట్టుకుంటాడు. హీరోయిన్ తండ్రిగా కాశీ విశ్వనాథ్ ఏమంత బలమైన నటన కనబరచలేదు. చనిపోయింది కూతురే కావచ్చని ఫోన్ వచ్చినప్పుడు కూడా క్యాజువల్ గా వినడమేగానీ,  మోహంలో తదనుగుణ ఆందోళన కన్పబర్చడు. సెకండాఫ్ లో  భార్య పాత్ర సహా తనూ కన్పించడు. ఆత్మ హత్య చేసుకున్నారని చెప్తుంది హీరోయిన్.

          బడ్జెట్ కారణంగా కావొచ్చు కెమెరా వర్క్, ఇతర సాంకేతికాలు  వగైరా అంతంతమాత్రంగా వున్నాయి. అచ్చు కూర్చిన సంగీతంలో ఐదు పాటలున్నాయి.  ఇలాటి థ్రిల్లర్స్ లో రిలీఫ్ కోసం  మధ్య మధ్యలో పాటలు పెడితే ఒక్కోసారి అవి అడ్డుతగిలేట్టు వుంటాయి. ఇందులో ఫస్టాఫ్ లో పెట్టిన మూడు పాటలూ  ప్రేమ ట్రాకుని అనవసరంగా పొడి గించడానికే ఉపయోగపడ్డాయి. 

          ఈ జానర్ సినిమాలు కథతోనే నిలబడతాయి కాబట్టి దర్శకుడికి స్క్రిప్టు మీద చాలా పనుంటుంది. అరగంట పాటలు, ఇంకో అరగంటా ఫైట్లు పోనూ మిగిలిన గంట సేపు కథకి పాత సీన్లే రాసుకుంటే టెంప్లెట్ సినిమా పూర్తయిపోతుంది- కానీ ‘వెంకటాపురం’ లాంటి థ్రిల్లర్ కి రెండు గంటలసేపూ ‘కిల్లర్ సీన్ల’ తో నింపాల్సిందే. వేరే అడ్డదారులు వుండవు. ఇందుకే ఇవి  తీసే దర్శకులు మొనగాళ్ళు. కొత్త దర్శకుడు వేణు ఇలా  వూపిరాడకుండా చేసి కూర్చో బెట్టగల్గింది సెకండాఫ్ లోనే. ఐతే ఇందులో కూడా ఓడిడుకులున్నాయి. కానీ ఓ కొత్త దర్శకుడు ఈ మాత్రం తీశాడంటే అభినందించాల్సిందే. ప్రస్తుత కాలంలో ఇలాంటివి తీసినప్పుడే కొత్త దర్శకుడు నల్గురి దృష్టిలో పడతాడు. దెయ్యాలూ ప్రేమలూ  ఎటూకాని సినిమాలు తీసేవాళ్ళు మొదటి ఆట మొదటి అరగంటకే  హిమాలయాలు పట్టుకుని పోవాల్సిందే.


స్క్రీన్ ప్లే సంగతులు  
       తెలుగు సినిమాలు రెండు గంటలలోపు వున్నవి ఎప్పుడూ ఆడలేదు. బావున్నా ఆడలేదు. తెలుగు వాడికి కనీసం ఓ రెండు గంటలు కూర్చుని  తెలుగు సినిమా చూడకపోతే  కడుపు నిండిన ఫీలింగ్ రాదు. అలాంటిది ఈ గంటా 50 నిమిషాల థ్రిల్లర్ తెలియబర్చే దేమంటే, వూపిర్లు బిగబట్టి, కళ్ళప్పగించి  చూసేట్టు చేస్తే-  గంటకే ముగించినా అదే  కడుపునిండిన ఫీలింగ్ వస్తుందని.  

          మెటీరియల్ – మెటీరియల్ కావాలి ప్రేక్షులకి, అంతే.  మెటీరియల్ లేని సినిమాల్లో పదేపదే హీరో గారు మెటీరియల్ కావాలీ మెటీరియల్ కావాలీ అని ఫాల్స్ కేకలేయడం చూశాం. అలాటి టెంప్లెట్  ‘మెటీరియల్’ మూడుగంటలు చూపించినా అర్ధాకలితోనే కడుపులు పట్టుకుని పోతారు  వీక్షకులు. 

          ‘వెంకటాపురం’ నియో నోయర్ జానర్ లో వచ్చిన డార్క్ మూవీ కాదు. డార్క్ మూవీ లక్షణాలేవీ దీనికి లేవు. భీమిలీ బీచిలో వాస్తవికంగా నేటి రిచ్ యూత్ ఆగడాలేవీ చూపించలేదు, ఫార్ములా మూస రౌడీల్నే చూపించారు. తెలుగు సినిమాలు పుట్టినప్పట్నించీ రౌడీల గుణగణాలు చూస్తున్నదే. కొత్తగా చూసేందుకు ఏమీ వుండదు. వీళ్ళు అవుట్ డేటెడ్ అయిపోయారు. కాబట్టి ‘వెంకటాపురం’ ఈ సెగ్మెంట్ లో కూడా కొత్తదనా న్ని కోల్పోయినట్టే. హీరోయిన్ పాత్రకి ఎంపిక చేసుకున్న నటితో బాటు, ఈ రౌడీ విలన్ పాత్రల సృష్టి  కూడా రావాల్సిన బాక్సాఫీసు డివిడెండ్లకి అడ్డుపడినట్టే. 

          సినిమా అనేది నిల్వ నీరు కాదు, పారే సెలయేరు. సమాజంలో కొత్త ఫ్యాషన్లు ఎలా వస్తాయో, కొత్త అసాంఘీక శక్తులు అలా వస్తూంటాయి. వాటి మీద ఫోకస్ చేస్తేనే సినిమా కాలీన స్పృహతో వున్నట్టు, లేకపోతే కాలం చెల్లినట్టు.  16-డి, పింక్, షైతాన్ లాంటి డార్క్ మూవీస్ మనకు తెలీని నయా సంపన్న యూత్ ఆగడాల్నికొత్తగా  వాస్తవికంగా చూపిస్తాయి కాలీన స్పృహతో. రౌడీల్లా తిరగాలని ఎవరూ కోరుకోరు, కానీ ఆధునిక యువత రౌడీలు చేసే పనుల్లాంటివే రిచ్ గా చేస్తూ దొరక్కుండా తిరుగుతూంటారు. డార్క్ మూవీస్ లో చూపించే ఆధునిక రిచ్ యువ విలన్ ఒక రూపకాలంకారం- మెటఫర్. ఈ రూపకాలంకారం సినిమా చూసే యువతకి-  జాగ్రత్త, మీలో నేనున్నాను- అని హెచ్చరిస్తూంటుంది. దీన్ని యువత నమ్ముతుంది. ఎందుకంటే తమలాంటి  రూపకాలంకారమే చెప్తోంది....అదే రౌడీని రూపకాలంకారం చేసి ఇలాటి హెచ్చరిక జారీచేయిస్తే యూత్ ఎవరూ నమ్మరు, ఎందుకంటే తాము జీవితంలో అలాటి రౌడీలు కాలేరు. అదే పురాణాల్లో రూపకాలంకారంగా రావణుడు అంటే నమ్ముతారు- తమలో కూడా రావణుడు వుంటాడని.  పురాణాల్లోని  రూపకాలంకారం, వర్తమానంలో ఆధునిక రూపకాలంకారం తప్ప మధ్యలో అంతా మిధ్య. పౌరాణిక –వర్తమాన  కాలాల మధ్య  ఇంకే కాలానికి బందీ చేసి రూపకాలంకారం చూపించినా మిధ్య!  ‘వెంకటాపురం’ లో రౌడీ పాత్రల్ని రూపకాలంకారం చేయడం మిధ్య! వృధా!

          మాస్ కోసం ఈ పాత్రల్ని సృష్టించామన్నా,  సినిమాల కొచ్చే మాస్ ప్రేక్షకుల్లో కూడా మాస్ యువతే వుంటారు. ఈ మాస్ యూత్ఇ వ్వాళ్ళ చుట్టూ వెలిగిపోతున్న ప్రపంచంలో తామూ సుఖాలనుభవించాలనే కలలు గంటున్నారు- బస్తీల్లో అవే మాస్ జీవితాలతో ఇంకా రాజీపడే కాలం పోయింది.
***
       వాళ్ళ నేపధ్యాల చేత వాళ్ళు గడిపే విశృంఖల జీవితాల్లోంచి ఆధునిక యువ విలన్స్ కల్పించుకునే నేరమనస్తత్వాలని డార్క్ మూవీస్ బట్టబయలు చేస్తాయి. అవి రేప్ కావొచ్చు, రోడ్ రేజ్ కావొచ్చు,  బైక్ రేసింగ్ కావచ్చు, లేట్ నైట్ పార్టీల్లో హింస కావొచ్చు, రాష్ డ్రైవింగ్ తో ప్రాణాలు పోగొట్టుకోవడమో, తీసుకోవడమో కావచ్చు...వగైరా వగైరా డార్క్ మూవీస్ లో రాత్రి పూటే జరుగుతాయి. రాత్రి పూట జరగని హై సొసైటీలో ప్రధాన సంఘటన డార్క్ మూవీ  కిందికి రాదు. 

           ‘వెంకటాపురం’ లో ప్రధాన సంఘటన బీచిలో పగలే జరుగుతుంది. ఇది రెగ్యులర్ రివెంజి యాక్షన్ మూవీ. కనుకే లాజిక్ తో అంతగా పనిలేకుండా, రివెంజి డ్రామాగానే  వుంటుంది. డార్క్ మూవీస్ లో పాత్రలు పలికే ప్రతీ మాటకి, పాల్పడే ప్రతీ చేతకీ లాజిక్ వుంటుంది. ‘వెంకటాపురం’ లాంటి రివెంజి యాక్షన్లో  హీరోయిన్ ఇంటికి దారి తెలీక,  రాత్రయినా వెళ్ళలేక బస్టాపులో వుండిపోవడానికి లాజిక్ అక్కర్లేదు. లాజికల్ గా  ఆమె తల్లిదండ్రులకి ఫోన్ చేయనక్కర్లేదు. తల్లిదండ్రులు కూడా కంగారు పడి  ఆమెకి ఫోన్లూ  చేయనక్కర్లేదు. హీరో వచ్చి కాపాడే  ఫార్ములా సన్నివేశమే ఇక్కడ ముఖ్యం. ఈ రివెంజి యాక్షన్లో మూస ఫార్ములా కూడా కలిసిపోయి వుంది. అంటే ఈ కొత్త దర్శకుడు ఇంకా పాత స్కూల్లోంచి పూర్తిగా బయటికి రాలేదు. 

          లేదా హీరోయిన్ సిగరెట్లు తాగడం గురించి. బీర్లు తాగే హీరోనే బ్యాడ్ అనుకుని పెంట్ హౌస్ లోంచి ఖాళీ చేయించిన తను, వేరే బ్యాడ్  నేస్తాలతో సిగరెట్లు తాగడానికి అలవాటు పడ్డానికి కూడా లాజిక్ ఏమీ అక్కర్లేదు. లేదా బీచిలో మూటలో దొరికిన, గుర్తించడానికి వీల్లేకుండా వున్న శవం డీఎన్ఏ పరీక్షలు లేకుండానే హీరోయిన్ దని పోలీసులు ప్రకటిస్తే, తండ్రి నమ్మేయడానికీ  లాజిక్ అక్కర్లేదు. కథలో ఇలాటివన్నీ మూస ఫార్ములా హంగులు.  

          వీటిని నివారించలేమా అంటే నివారించవచ్చు. కానీ కొత్త దర్శకుడు తెలిసీ ఇలాగే ఫిక్స్ అయితే  ఈ అవాస్తవికతల్ని భరించక తప్పదు.
                                                ***

       ఈ కథకి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింటు (యూ ఎస్పీ) వుంది. అవతల ఎవరున్నారు? అన్న పాయింటే చివరి దాకా ఉత్కంఠగా వుండడం. రివెంజి మూడ్ లోవున్న హీరో,  బీచిలో వేట కత్తి విసురుతాడు. అదెవరికి తగిలింది, అవతల ఎవరున్నారు, అది హీరో అంచనాలని ఎలా తలకిందులు చేసిందనే సస్పెన్స్ తో కూడిన బలమైన యూఎస్పీయే  చివరి దాకా కూర్చోబెడుతుంది. కథకి ఇలాటి  బలమైన యూఎస్పీ ని కనిపెట్టడం, దాన్ని తురుపు ముక్కలా వాడుకోవడం మాత్రం కొత్త దర్శకుడి గొప్ప టాలెంటే. టెంప్లెట్ సినిమాల్లో ఇలాటి వేమీ వుండవు. వాటిలోంచి కొత్తదర్శకులు / రచయితలు  తెలుసుకోవడానికీ, నేర్చుకోవడానికీ ఏమీ వుండదు. వాటికి  రివ్యూలు కూడా బోరు కొడతాయి.  

          ఈ కథని ఫ్లాష్ బ్యాకులతో చెప్పుకొచ్చారు. ఫస్టాపులో ఒకే ఫ్లాష్ బ్యాక్ వుంటుంది కాబట్టి సరిపెట్టుకోవచ్చు గానీ, సెకండాఫ్ లో అడుగడుగునా ఫ్లాష్ బ్యాకులతో కథ పదేపదే ముందుకీ వెనక్కీ ప్రయాణిస్తూంటే, సంఘటనల్ని ఓ క్రమంలో పట్టుకుని అర్ధంజేసుకోవడం కనా కష్టమై పోతుంది. కన్ఫ్యూజ్ చేయడం గొప్ప టాలెంట్ కిందికి రాదు. మాస్ మీడియా అయిన సినిమా సులభంగా అర్ధమైపోవాలి- మౌత్ టాక్ పొందాలన్నా, రిపీట్ ఆడియెన్స్ వుండాలన్నా సినిమా సులభగ్రాహ్యమవాలి. 16- డి లోనూ అత్యుత్సాహానికి పోయి లెక్కలేనన్ని క్లూస్ మీద పడేస్తూపోతే,  వాటిని పట్టుకుని కథని ఫాలోఅవడానికి దేవుడు దిగిరావాల్సి వచ్చింది- ఏమంటే రెండోసారి చూస్తే సినిమా అర్ధమవుతుందన్నాడు కొత్త దర్శకుడు. ఇలావుంటుంది వరస. అందులో క్లూస్ తో జడివాన అయితే, ఇందులో ఫ్లాష్ బ్యాకుల కుంభవృష్టి! 

          చేటలో బియ్యం  వేసుకుని రాళ్ళు  ఏరేసినట్టు,   కథలోంచి మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులనే ఖండికల్ని వేరు చేసి, కథని పట్టుకోవాల్సిన మానసిక  శ్రమ ఎందుకు కల్గించాలి?  రాంగోపాల్ వర్మకి లేని ఫ్లాష్ బ్యాకుల నిషా కొత్తదర్శకుల కెందుకు? మిల్లర్లు కూడా రాళ్ళు లేని పరిశుభ్రమైన బియ్యమందించేందుకు అప్డేట్ అయ్యారు. తెలుగు సినిమాలకి అప్డేట్ అంటేనే అసహ్యం- చైనా గోడ కట్టుకుని చేరగిలబడ్డమే. 

          ఈ  రాళ్ళూ బియ్యం సిండ్రోమ్ లో స్ట్రక్చర్ ని పట్టుకోవడం ఇంకో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ పరీక్ష లాంటిది. ఫ్లాష్ బ్యాకు ఖండికల్లోంచి కథనీ,  కథలోంచి ఫ్లాష్ బ్యాకుల్నీ విడదీసి విడదీసి ఆలోచిస్తూ అలసిపోయి అర్ధరాత్రి ఇంటి కొస్తే- మనోడు వేటకత్తి విసరడమే ప్లాట్ పాయింట్ వన్ అని టపటప కొట్టుకుని ట్యూబ్ లైటు వెలిగింది. 

          ఇలా వేటకత్తి విసరడానికి ముందు, విసిరిన తర్వాతా  అన్నట్టుగా తేలిన స్ట్రక్చర్ లో బిజినెస్ చూస్తే-  బిగినింగ్ విభాగం మళ్ళీ ఒక  టెంప్లెట్టే!  

          మిడిల్ లో బీచిలో శవం దొరకడంతో ప్రారంభమవుతుంది కథ. దొరికిపోయిన హీరో పోలీస్ స్టేషన్ తో తోటి ముద్దాయికి చెప్తూంటే మొదలవుతుంది ఫ్లాష్ బ్యాక్ - అంటే బిగినింగ్ విభాగం.

          ఇందులో హీరో- హీరోయిన్ పాత్రల పరిచయం, సాన్నిహిత్యం, హీరోయిన్ సిగరెట్ల అలవాటుతో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా- రౌడీలతో సమస్య ఏర్పాటూ వుంటాయి. స్థూలంగా చూస్తే ఈ బిగినింగ్ విభాగపు బిజినెస్ నియమాలకి లోబడే వుంటుంది - అయితే ఈ బిజినెస్ ని హీరో హీరోయిన్ల మధ్య బలహీనమైన  సాన్నిహిత్యపు సాగతీత సీన్లతో, సాంగ్స్ తో- టెంప్లెట్ సినిమాల్లో లాగా ఇంటర్వెల్ దాకా లాగి  లాగి- అప్పుడు సమస్య ఏర్పాటు చేశారు. ‘శివ’ లోనాగార్జునకీ  రౌడీలతో అమల వల్లే సమస్య వస్తుంది. అయితే ఇది అరగంట లోపే ఏర్పాటవుతుంది. బిగినింగ్ కి ఇంతకిమించి నిడివి వుంటే నసే. 

          హీరోయిన్ హీరోకి దూరమయ్యే ఏదైనా ప్రమాదంలో పడబోతూంటే వాళ్ళ జీవితాల్ని చాలా  అందంగా బలంగా చూపించాలి- ‘కాబిల్’ లో ఇలాగే చూపించి సక్సెస్ అయ్యారు. అప్పుడు ప్రమాదానంతరం వాళ్ళిద్దరి పట్లా ప్రేక్షకులకి ఆందోళన పెరిగే అవకాశం వుంటుంది. కానీ ఇక్కడ ఇంటర్వెల్ దాకా చూపించినా హీరో హీరోయిన్ల మధ్య బలమైన ప్రేమగానీ, స్నేహంగానీ ఏర్పడవు టెంప్లెట్  సినిమాల్లోలాగా. టెంప్లెట్ సినిమాల్లో ఫస్టాఫ్ అంతా కథకాని కథ అయిన లవ్ ట్రాక్ తో కాలక్షేపం చేసినట్టు- ఈ యాక్షన్ థ్రిల్లర్ లో  కూడా ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అన్న సంగతి పక్కన బెట్టి, రసభంగం కల్గించే ఫ్లాష్ బ్యాక్ రూపంలో ప్రేమపురాణంతో ఫస్టాఫ్ నింపేశారు. 

          సస్పెన్స్ థ్రిల్లర్ ‘క్షణం’ లో ఇలాటి ట్రాప్ లో  పడకుండా జాగ్రత్త తీసుకున్నారు.  ఇందులో ప్రేమ కథని విడతలవారీగా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా ఆసక్తికరంగా చివరిదాకా వేస్తూ పోయి- ప్రధాన కథకి అడ్డు లేకుండా చూశారు. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కథ అవదు. అది ప్రధాన కథలా అంకాల్ని అక్రమించకూడదు. అది ప్రధాన కథకి కావలసిన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. దీన్ని గంటల కొద్దీ చూపించడమంటే, ఎంతకీ ప్రధాన కథలోకి వెళ్ళకుండా, సమాచారాన్ని ఇస్తూ కూర్చోవడం లాంటిది. ఇంకా రైలే రాకపోతే ఇప్పుడొస్తుంది. ఇప్పుడే వచ్చేస్తుందని ఎనౌన్సర్ చెపుతూ సహనాన్ని పరిక్షీంచడం లాంటిది. రైలు రావడం జీవిత కాలం లేటైతే, ప్రధాన కథ  వచ్చేటప్పటికి పుణ్య కాలం  గడిచిపోతుంది.
***
     ఇలా ఈ ఫస్టాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో  హీరోహీరోయిన్ల బలహీన సంబంధం వల్ల, ఈ బిగినింగ్ విభాగం మిడిల్ విభాగానికి చేరడానికి పూర్తి స్థాయిలో పరిపక్వత చెందకుండా పోయిందన్న మాట. అపరిపక్వ బిగినింగ్ బిజినెస్ అపరిపక్వ ప్లాట్ పాయింట్ వన్ నే ఇస్తుంది. ఒకవైపు హీరోయిన్ కోసం రియాక్ట్ అవడానికి ఆమెతో అతడి కలాటి బలమైన ఈక్వేషనే లేదు, మళ్ళీ తగుదునమ్మా అని ఎవరో తెలీని ఆమె ఫ్రెండ్స్ కి జరిగిన అన్యాయం కోసం కూడా కత్తి కడతాడు.

          ఈ ఫ్రెండ్స్ కోసం కూడా కత్తి గట్టడమే ఏకసూత్రతని దెబ్బతీసి, హీరోయిన్ పట్ల సానుభూతిని పలచన చేసింది. ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి లక్ష్యం ఒకే సమస్యతో ఏర్పడుతుంది, ఏర్పడాలి. గ్యాంగ్ రేప్ కి గురైన హీరోయిన్ ఫ్రెండ్స్ అనే ఒక సమస్య, బ్యాగు పోగొట్టు కున్న హీరోయిన్ అనే ఇంకో సమస్యా అనే రెండు చీలికలతో సినిమా కథ వుండదు. కథ ఒక్క హీరోయిన్ తోనే వుండాలి. కానీ ఆమెది ఆఫ్టరాల్ బ్యాగు సమస్య.  ప్రెండ్స్ ది ఆమె కంటే తీవ్రమైన గ్యాంగ్ రేప్ సమస్య. ఫ్రెండ్స్ సమస్య హీరోయిన్ సమస్యని డామినేట్ చేసేదిగా వున్నప్పుడు హీరోయిన్ సమస్య ఈ కథలో అప్రధానమైపోతుంది. ఆమె కోసం కాక,  ఆమె ఫ్రెండ్స్ కోసం హీరో కత్తి గట్టినట్టు వుంటుంది. మళ్ళీ ఎవరో తెలీని ఆ హీరోయిన్ ఫ్రెండ్స్ పట్ల కృత్రిమ  ఎమోషన్సే వుంటాయి. 

          ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్ కి గురవకుండా మొత్తం ముగ్గురూ తప్పించుకుని, వాళ్ళల్లో హీరోయిన్ మాత్రమే బ్యాగుని పోగొట్టుకుని వుంటే,  హీరోయిన్ పాత్రకి సహజ ప్రాధాన్యం ఏర్పడి ఏకత్రాటిపై వుండేది కథ.

          అయితే కేవలం బ్యాగుకోసం కత్తి పట్టుకుని  చంపడానికి పోవాలా- అన్న ప్రశ్న వస్తుంది. అంతవరకూ తన పనేదో తాను చేసుకునే ఒక సాధారణ పిజ్జా డెలివరీ బాయ్ సడెన్ గా చంపేసేంత హింసావాది అయిపోవడం అతకని వ్యవహారమే. ఇక్కడ ‘శివ’ ని  తీసుకోవాలి. ఇందులో నాగార్జున కాలేజీలో బయటి రౌడీల పెత్తనాన్ని గమనిస్తూంటాడు. వాళ్ళ ప్రతినిధిగా వుంటున్న  జేడీ  ఆగడాల్ని భరిస్తూంటాడు.  ఒకసారి కొట్టబోతే ఫ్రెండ్స్ ఆపుతారు. ఇంకోసారి ఆగడు, సైకిలు చైనుతో జేడీ భరతం పడతాడు. ఇక్కడ సమస్య జేడీ అమలని డాష్ ఇవ్వడంతోనే  పుడుతుంది.  ఇలా జేడీని నాగార్జున కొట్టడం ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. 

          ‘వెంకటాపురం’ లో కూడా సమస్య  హీరోయిన్ బ్యాగుకోసం పుడితే సరిపోతుంది. కానీ ఇంతకి  ముందు బిగినింగ్ లో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో జరిగిన లోపమేమిటంటే- ముందు నుంచీ హీరోకి కూడా రౌడీలతో సంపర్కం లేకుండా చేయడమే.  రౌడీలు హీరోకి తెలిసుండి, బీచిలో వాళ్ళ అగడాల గురించిన సమాచారం అతడికుండి, ఒకటి రెండు సార్లు స్వల్ప ఘర్షణలు జరిగివుంటే, ఆ తర్వాత వాళ్ళు హీరోయిన్ మీద ఎటెంప్ట్ చేసి, బ్యాగు లాక్కుని వుంటే- అప్పుడు వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకడానికి రెండు వేలు పెట్టి ఇంట పెద్ద వేట కత్తి కొనుక్కుని- భావోద్వేగాలతో, భూకంపాలతో, భీకర ప్రళయాలతో అతను బయల్దేరితే -  డీటీఎస్ సౌండు ఎఫెక్ట్స్ కూడా అర్ధవంతంగా వుంటాయి. పూర్వరంగం మ్యాటర్స్.  తగిన పూర్వరంగం లేక బిగినింగ్ మిడిల్ కి వెళ్ళలేదు, అప్పుడు  ప్లాట్ పాయింట్ వన్ అనే కథకి మొదటి మూలస్థంభాన్ని  బలిష్టంగా ఏర్పాటు చెయ్యదు.
                                                       ***

    ఇక ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో కత్తి విసిరే యాక్షన్ కూడా  గజిబిజి అయింది. బీచిలో ఎమోషన్ తో కూర్చుని చూస్తూంటాడు హీరో కత్తి పట్టుకుని. చూసి చూసి కళ్ళు  మూసుకుంటాడు- రెచ్చిపోతూ కత్తి విసురుతాడు కళ్ళు మూసుకునే. అతను ఎవర్ని చూశాడు? టార్గెట్ చేసిన రౌడీల్నే చూసి కళ్ళు మూసుకుని కత్తి విసిరాడా? కానీ వాళ్ళు రౌడీలు కారే?  మరెవర్ని చూసి కళ్ళుమూసుకుని కత్తి విసిరాడు?  టార్గెట్ కాని వాళ్ళ మీదకి ఎందుకు విసిరాడు? అలికిడి అయ్యింది  కాబట్టి,  వాళ్ళే   టార్గెట్స్ అనుకుని కళ్ళుమూసుకుని విసిరాడా? బీచిలో అంతా ఓపెన్ గానే వుంటుంది. చాటునుంచి ఎవరూ వచ్చేదేమీ వుండదు. ఎవరొస్తున్నారో దూరంనుంచే తెలిసి పోయి తను లేచి పారిపోవాలి లెక్కకైతే. పారిపోవాలి- ఎందుకంటే,  ఆ వస్తున్న వాళ్ళు అలాంటివాళ్ళు. వాళ్ళ మీద తను దాడి చేయదానికి కారణాల్లేవు. ఒకవేళ మాట వరసకి వాళ్ళు తాననుకున్న టార్గెట్సే అనుకున్నా- కళ్ళు మూసుకుని కత్తి విసరడ మేమిటి? అలా విసిరితే రౌడీలు ముగ్గురూ చచ్చి పోతారా? ఎవడో ఒకడు బతికిపోయి అదే కత్తితో వెంటాడితే?  అసలు ముగ్గుర్లో ఎవరికీ తగలక, అదే కత్తితో ఆ రౌడీలు ముగ్గురూ ఆవురావురని వచ్చి, రాక్షసానందంతో  ముక్కలు ముక్కలుగా నరికి, ఎంజాయ్ చేసి -  సముద్రంలో విసిరేసి  పోతే?  ఇంత తెలివితక్కువ హీరో బిల్డప్పులతో కత్తి తీసుకుని బంపర్ యాక్షన్ హీరోగా ఎలా బయల్దే రతాడు చావడానికి కాకపోతే? ఇలా కథా సౌలభ్యం కోసం ప్లాట్ పాయింట్ వన్ లో ఫాల్స్ డ్రామా  సృష్టించారు- అమాయక ప్రేక్షకుల్ని బుట్టలో పడెయ్యడానికి. ప్లాట్ పాయింట్ వన్ లో ఫాల్స్ డ్రామాని ఏ సినిమాలోనూ చూడం. 



          ఈ సీనుతోనే ఇంటర్వెల్ పడుతుంది- అవతల ఎవరున్నారు? అనే ప్రశ్నని రేకెత్తిస్తూ. సెకండాఫ్ లో ఒకచోట ఇదే రిపీట్ అయి సస్పెన్సుని ఇంకా పెంచుతుంది. చిట్టచివరికి కత్తి విసిరినప్పుడు అవతలెవరున్నారో మొత్తం  రివీల్ వుతుంది. అవడానికి ఇది మంచి యూఎస్పీయే గానీ,  దీని నిర్మాణంలో పునాదుల్లేవు. 



          అసలు హీరోయిన్ కేం జరిగింది, పోలీసులందర్నీ హీరో ఎందుకు చంపేశాడూ అన్న మిగిలిన అంశాలు వివిధ ఫ్లాష్ బ్యాకుల ద్వారా వెల్లడవుతాయి. ఈ ఫ్లాష్ బ్యాకుల్లో మళ్ళీ ఫ్లాష్ బ్యాకులుంటాయి. కథ పొరలు పొరలుగా విప్పుతూంటాడు దర్శకుడు. కానీ మహేష్ భట్ తీసిన ‘గ్యాంగ్ స్టర్’ లో ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ కథ తికమక పెట్టదు. ఇది పెద్ద హిట్టయ్యింది.


          హీరోయిన్ కి చేసిన అన్యాయానికి హీరో పోలీస్ స్టేషన్లో బాధ్యులైన పోలీసులందర్నీ చంపేసి పోతాడు. కానీ ఒకసారి బీచిలో తను కత్తి విసిరి చంపబోయిన రౌడీల జోలికి మళ్ళీ ఎప్పుడూ పోడు. ఎప్పుడైతే ప్లాట్ పాయింట్ వన్ కి అర్ధముండదో, హీరో చేసే పనులకీ అర్ధముండదు. ప్లాట్ పాయింట్ వన్ బలహీనంగా వున్నా క్లయిమాక్స్ బలహీనమైపోతుంది. మొత్తం స్క్రీన్ ప్లేకి నాడీ  కేంద్రం లాంటిది ప్లాట్ పాయింట్ వన్. ఒక సినిమా ఎలావుందో తెలియడానికి సినిమా మొత్తం చూడనవసరం లేదు, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటుని  చూస్తే  తెలిసిపోతుంది. ప్లాట్ పాయింట్ వన్ తర్వాతి కథనంలోని మంచి చెడులన్నీ ప్లాట్ పాయింట్ వన్ నుంచే పుడతాయి. గాలిలో ఒక సీన్ ని పట్టుకుని దానిమంచి చెడుల వాదులాట పెట్టుకుని లాభంలేదు- ఆ సీన్ని ప్లాట్ పాయింట్ వన్ కి అన్వయించే నిజ నిర్ధారణ చేయాలి.  స్వతంత్రంగా ఏ సీనూ వుండదు- అన్నీ ప్లాట్ పాయింట్ వన్ ని పరివేష్టించే వుంటాయి. 

          ‘వెంకటాపురం’ స్థితి గతులిలా వున్నాక, ఒకవేళ నిర్మాతలు దీని డీవిడీలు విడుదల చేస్తే, చూసుకుంటూ విశ్లేషణ చేసుకోవాలి. దీని సబబైన ఇంకో వెర్షన్ ని ప్రాక్టీసు చేయాలి. ఏదో సినిమా చూసేసి మనం కూడా ఇలాటిది తీయగలమని గుడ్డిగా నమ్మేయకూడదు. ముఖ్యంగా థ్రిల్లర్స్ లో, మర్డర్ మిస్టరీల్లో ఎక్కువ కథ జొప్పించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ క్లూలూ, ఎక్కువ ఫ్లాష్ బ్యాకులూ, సమస్య ఎలా పరిష్కారమయ్యిందో  చెప్పడానికి ఆది నుంచీ ఎన్నో సంఘటనల్ని గుర్తు చేస్తూ ఎక్కువ వివరణలూ ఇవ్వకూడదు. ఇది నవల చేసే పని, మాస్ మీడియా అయిన సినిమా చేయాల్సింది కాదు. తాము చాలా టాలెంటెడ్ అని తెలియడానికే  తెర మీద హడావిడి చేస్తూంటారు దర్శకులు. సినిమా చూస్తున్నప్పుడు దర్శకుడి మీదికి దృష్టి మళ్ళకూడదు. ప్రపంచాన్ని
చూస్తున్నప్పుడు మనకి దేవుడు మనకి కన్పించడు. క్రియేటర్స్  ఆర్ సైలెంట్ వండర్స్.


-సికిందర్
http://www.cinemabazaar.in