రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, February 21, 2017

రివ్యూ!

రచన- దర్శకత్వం : సుభాష్ కపూర్

తారాగణం : అక్షయ్ కుమార్, హుమా ఖురేషీ, సయానీ గుప్తా, సౌరభ్ శుక్లా, అన్నూ కపూర్, మానవ్ కౌల్, ఇనాముల్ హక్, కుముద్ మిశ్రా, వినోద్ నాగ్  పాల్ తదితరులు సంగీతం: మంజ్ ముసిక్, మీత్ బ్రదర్స్, చిరంతన్ భట్, ఛాయాగ్రహణం : కమల్జిత్ నేగీ

బ్యానర్ : ఫాక్స్ స్టార్ స్టూడియోస్ 
విడుదల : ఫిబ్రవరి 10, 2017
***

       
కోర్టు రూమ్ డ్రామాలు హిందీలో పెరుగుతున్నాయి. ఇటీవలే ‘రుస్తుమ్’ తర్వాత ‘పింక్’, దీని తర్వాత ఇప్పుడు ‘జాలీ, ఎల్ ఎల్  బి- 2’ వచ్చాయి. వీటికి జస్ట్ ముందు ‘జాలీ- ఎల్ ఎల్ బి’, ‘ఓ మై గాడ్’ వచ్చాయి. చాలా కాలంగా ఖాళీగా వున్న  ఈ జానర్ స్లాట్ ని భర్తీ చేస్తున్నాయి. ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే, ఇవి టాప్ స్టార్స్ తో వచ్చి ఆకర్షిస్తున్నాయి. మరుగున పడ్డ ఒక జానర్ ని తిరిగి కొత్త తరంలో పాపులర్ చేయాలంటే స్టార్స్ ని ఆశ్రయించక తప్పడంలేదు. ఒక తరగతి ప్రేక్షకులకోసం బి గ్రేడ్ సినిమలుగా వుండి పోయిన హారర్ జానర్ ని మహేష్ భట్  అప్పట్లో స్టార్స్ తో ‘రాజ్’ (రహస్యం) గా  2002 లో తీసి, హార్రర్ ని కుటుంబ ప్రేక్షకుల్లోకి  తీసికెళ్తూ, ఇక హారర్స్ లో స్టార్స్ నటించే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు- కోర్టు రూమ్ డ్రామాలకీ  స్టార్స్ తోనే  కలెక్షన్స్ వచ్చేట్టున్నాయి. 

          అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించిన ఈ కోర్టు  రూమ్ డ్రామా పూర్తిగా భిన్నం. ఇది చాలా డేరింగ్ గా న్యాయవ్యవస్థని వ్యంగ్యం చేస్తుంది. ఎలా చూపించడానికి ఇతరులు వెనుకాడతారో అలా చూపించేస్తుంది. ఈ సినిమా విడుదలైన వారంతర్వాత తమిళనాడు అసెంబ్లీ బలపరీక్ష రచ్చరచ్చ అయి వుండొచ్చు గానీ, ఆ రచ్చ దృశ్యాలే కొన్ని ఈ కోర్టు రూమ్ కిష్కింధకాండలో ప్రత్యక్షమవడం నిజంగా విచిత్రం!  న్యాయ స్థానాల్లో,  చట్టసభల్లో రేపేం జరగవచ్చో ఈ కోర్టు రూమ్ డ్రామా ముందే చెప్పేసిందన్న మాట! ఇదంతా ఏమిటో వివరంగా చూద్దాం...
కథ 
       అతను జగదీశ్వర్ మిశ్రా అలియాస్ జాలీ (అక్షయ్ కుమార్). లక్నో సెషన్స్ కోర్టులో లాయర్ గా ప్రాక్టీసు చేయాలని తహతహలాడుతూంటాడు. అతడి తండ్రి ముప్ఫై ఏళ్ళు సీనియర్ లాయర్ రిజ్వీ సాబ్ (రాం గోపాల్ బజాజ్) దగ్గర టైపిస్టుగా చేశాడు. జాలీ కూడా అక్కడ గులాంగిరీ చేస్తూనే పెరిగాడు, రిజ్వీ సాబ్ ఇంటి పనులు  కూడా చేస్తూ. అందుకని ఏదో  ఎల్ఎల్ బీ చదివేసి రిజ్వీ సాబ్ దగ్గర జ్యూనియర్ గా కుదరాలన్న ఆటలు సాగడం లేదు. పైగా తను టక్కరి. మందిని ముంచడమే తెల్సు. లాయర్ వృత్తికే మచ్చ. ఇంటిదగ్గర తను వండి పెడితే తిని, తాగి తిరిగే  భార్య పుష్పా (హుమా ఖురేషీ), ఓ కొడుకూ వుంటారు. 

          ఇక రిజ్వీ సాబ్ తనని జ్యూనియర్ గా తీసుకునే పరిస్థితి లేక, తనే ఆఫీసు తెరచుకుని ప్రాక్టీసు పెట్టాలని ప్లానేస్తాడు జాలీ. ఇందుకు రెండు లక్షలు కావాలి. ఒక హీనా సిద్దీఖ్ (సయానీ గుప్తా) అనే ఆమె రిజ్వీ సాబ్ అపాయింట్ మెంట్ కోసం తిరుగుతూంటుంది. కడుపుతో వున్న ఆమె తన భర్త ఇక్బాల్ ఖాసిం (మానవ్ కౌల్) ఎన్ కౌంటర్ కేసు ఆయనకి  అప్పజెప్పాలని ప్రయత్నిస్తూంటుంది. పెళ్ళయిన మర్నాడే అతను ఎన్ కౌంటర్ అయ్యాడు. జాలీ ఆమెని నమ్మిస్తాడు. ముందు  కేసు తీసుకోవాలంటే రిజ్వీ సాబ్ కి రెండు లక్షలు ఫీజు ఇవ్వాలని తీసుకుని ఆ డబ్బుతో ఆఫీసు పెట్టేస్తాడు. ఆమె మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది.  
 
          లోకం చేత ఛీఛీ అన్పించుకుని జాలీ బుద్ధి తెచ్చుకుంటాడు. ఇక ఆమె భర్త ఎన్  కౌంటర్  కేసుని తనే వాదించి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ దరిమిలా ప్రమోద్ మాథుర్ (అన్నూ కపూర్) అనే పెద్ద లాయర్నీ, సూర్యవీర్ సింగ్ (ప్రమోద్ మిశ్రా) అనే ఎన్ కౌంటర్ ల పోలీసు అధికారినీ, సెషన్స్ జడ్జి సుందర్లాల్ త్రిపాఠి (సౌరభ్ శుక్లా) నీ ఎదుర్కొంటాడు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ చూస్తే, అవినీతితో నిండి వుంటాయి. తలపండిన పెద్ద తలకాయలు ఆజమాయిషీ చేస్తూంటాయి. తను చూస్తే  ఛోటామోటా లాయర్. తన మీద తుపాకీ గుళ్ళు పేలుతాయి,  కాశ్మీర్ పోలీసులూ  వెంటపడతారు...

          అసలీ ఎన్ కౌంటర్  వెనుక జరిగిన కుట్రేమిటి? ఇందులో ఎవరెవరున్నారు? హీనా భర్త ఇక్బాల్ ఖాసింని ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు? ఇక్బాల్ ఖాసిం టెర్రరిస్టు అయితే, ఇక్బాల్ ఖాద్రీ (ఇనాముల్ హక్) ఎవరు? ఇతనెక్కడున్నాడు? అవినీతి వ్యవస్థ ఇతన్నెందుకు కాపాడుతోంది? ఇవన్నీ జాలీ ఎదుర్కొనే చిక్కు ప్రశ్నలే. ఈ చిక్కు ముళ్ళు విప్పి సమాధానాలు కనుక్కోవడమే మిగతా కథ. 
ఎలావుంది కథ 
      ప్రేమలో యుద్ధంలో ఏం జరిగినా రైటే అని ఎవరో ఎప్పుడో ఎందుకో చెప్పిన మాట పట్టుకుని సరిహద్దులో సైనికుల గొంతులు శత్రువులు కోయడం లాంటివి, దేశంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోవడం లాంటివీ  జరుగుతున్నాయనీ- ఘాటు వ్యాఖ్య  చేస్తుందీ కథ. ప్రధానంగా దిగజారుతున్న న్యాయ వ్యవస్థ ప్రతిష్టని ప్రశ్నిస్తూ, న్యాయవ్యవస్థ- పోలీసు వ్యవస్థ- నేరవ్యవస్థ ఈ మూడిటి చెట్టపట్టాలు సామాన్యులకి ఏ పరిస్థితుల్ని తెచ్చి పెడుతున్నాయో కొత్త కోణంలో కళ్ళకి కడుతుంది. 

          వచ్చిన మూస కథలనే దృష్టిలో పెట్టుకుని కొత్త కథలు సృష్టించడం వేరు. వాటిలో సమాజం కన్పించదు, కాలానికి దూరంగా పాత సినిమానే కన్పిస్తుంది. మూస కథల్లాగా సమాజం శిలాసదృశం కాదు, అదెప్పుడూ కొత్త కల్లోలాలు పుట్టిస్తూంటుంది. ఎప్పటికప్పుడు ఆ కల్లోల్లాలోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు సినిమాలో అప్పటి వర్తమాన సమాజం కన్పిస్తుంది. వర్తమాన సమాజ చిత్రణే  ప్రేక్షకులతో కనెక్ట్ అవుతుంది. ఇవాళ్టి సినిమాల షెల్ఫ్ లైఫ్ కొద్ది రోజులే. సమకాలీన సామాజిక కథతో ఎంత బలంగా తీసిన ‘పింక్’ లాంటిదైనా ఆర్నెల్ల తర్వాత ఎవరూ చూడలేరు. అప్పటికి కొత్త  కల్లోలమేదో పుట్టివుంటుంది, దాన్ని పట్టుకోవాలి. ఇవాళ్టి సినిమాకి సామాజిక కథ అనేది తెల్లారితే చదవలేని న్యూస్ పేపర్ లాంటిది, గంట తర్వాత చూడలేని బ్రేకింగ్ న్యూస్ లాంటిది. ఇవాళ్టి సామాజిక కథ పరుగులు పెట్టిస్తూ వుంటుంది, అవినీతి మీద ఇంకా అక్కడే కూర్చుని అవే మూస కథలు తీస్తామంటే కుదరదు. 

          వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందనుకోవడం ఒక థాట్ మాత్రమే. అది కళ్ళకి కన్పించేది కాదు, మనసుకి అన్పించేది. కార్యాలయాలు మామూలుగానే పనిచేస్తూంటాయి, శాఖలు అట్టహాసంగానే వుంటాయి. భ్రష్టత్వం అక్కడ పనిచేసే వాళ్ళ మెదళ్ళల్లో వుంటుంది. వాళ్ళు చేసి పెట్టే పనుల్లో బయటపడుతుంది. మహా అయితే వ్యవస్థ భ్రష్టు పట్టి పోవడాన్ని సింబాలిక్ గా ఒక షాట్ లో చూపించడం ఆనవాయితీ. పాక్షికంగా రూపం ఇవ్వడం మాత్రమే. కానీ వ్యవస్థ భ్రష్టుపట్టి పోవడమనే థాట్ కి  అక్షరాలా పూర్తి రూపమిస్తూ డ్రమటైజ్  చేస్తే? భ్రష్టు పట్టిన మెదళ్లలో వాళ్ళ ఆలోచనలెలా వుంటాయో వాటికి భౌతిక రూపమివ్వడమే.  
          అప్పుడు వ్యవస్థ అంటే ఏ పట్టింపూ వుండని జడ్జి డాన్సు చేస్తూ కోర్టు కొస్తాడు. సీటులో కూర్చుని ఏం చదువుతున్నాడో కళ్ళకి కన్పించక లైటుని కిందకీ పైకీ  లాగుతూ దొర్లి కిందపడిపోతాడు. సొరుగులో దేవులాడి దేవులాడి ఐదు సుత్తులు తీసి బల్ల మీద పెట్టుకుంటాడు. నిమిషానికో మారు మొక్కకి నీళ్ళు పోస్తూంటాడు. వాదోపవాదాలు పట్టించుకోకుండా, తన కూతురి పెళ్ళికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా చేత  డ్రెస్సు కుట్టిస్తే ఎంతవుతుందని లాయర్ని అడుగుతాడు.  కూతురి పెళ్లి కార్డు మీద బూతుల్ని (అచ్చు తప్పుల్ని) దిద్దుకుంటూ కూర్చుంటాడు. సెల్ ఫోన్లో పెళ్లి ఏర్పాట్లు మాటాడుతూంటాడు. అక్కడే  కూర్చుని టిఫిన్  తింటాడు. ఈ క్షణంలో వాడు నిర్దోషి వదిలెయ్యమని చెప్పి, మరుక్షణం లాక్కొచ్చి బోనెక్కించమంటాడు. నువ్వేం పీకుతావని లాయర్ అంటే,  నువ్వేం పీకుతావని ఎదురుతిరుగుతాడు. తన మీద బూటు విసిరితే, కోర్టులో బూట్లని – మొత్తం పాదరక్షల్నీ నిషేధిస్తాడు. ఆలియా భట్ తన ఫ్యాన్ అంటాడు. ఆమె నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది  ఇయర్’ సినిమా  11 సార్లు చూశానంటాడు. తన ఛాంబర్లో అలియాభట్  పోస్టర్ పెట్టుకుంటాడు....ఇలా ఎన్నో. 

          ఇదన్న మాట భ్రష్టత్వాన్ని కళ్ళకి కట్టడం. లీగల్ వ్యవస్థని ధైర్యంగా డార్క్ కామెడీ చేయడం, సెటైర్ చేయడం, డార్క్ జోకులతో కుళ్ళ బొడవడం. ఈ సినిమామీద కేసులు పడ్డాయి. జడ్జిని చూపించిన తీరు మీద కాదు, లాయర్ల అవినీతిని  చూపించినందుకు. లాయర్ తప్పుడు సాక్ష్యాధారాలు  ప్రవేశ పెట్టినట్టు చూపించి లాయర్ల పరువు తీసినందుకు. టైటిల్ లోంచి ‘ఎల్ఎల్ బి’ తీసేయాలని ఇంకో కేసు... బూట్ల మీద బాటా కంపెనీ కూడా కోర్టు కెక్కింది. ఆ కేసుని కొట్టేస్తింది కోర్టు. గతంలో  ‘జాలీ ఎల్ ఎల్ బి’ మీద కూడా కేసులు పెట్టారు. ‘జాలీ ఎల్ ఎల్ బి’ కి సీక్వెల్ అయిన ఈ కథ  కేసుల గురించి పెద్దగా పట్టించుకోకుండా చెప్పాల్సింది చెప్పేసింది. ఈ సెమీ రియలిస్టిక్ కథని ‘నేరము శిక్ష’ ఫార్ములా సెటప్ లో పెట్టి చెప్పారు. అంటే తన వల్ల ఓ కుటుంబానికి జరిగిన నష్టాన్ని అవమానాలు భరించి సరిదిద్దే హీరో కథన్నమాట.
ఎవరెలా చేశారు
       'జాలీ ఎల్ ఎల్ బి' (2013) లో హీరో పాత్ర అర్షద్ వార్సీ పోషించాడు. ఈ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ పాత్రకి విశాల ప్రాతిపదిక వుంది. మొత్తం న్యాయ- పోలీసు- నేర వ్యవస్థలతో తలపడ్డం వుంది. అయితే ప్రారంభ దృశ్యాల్లో కన్నింగ్ లాయర్ గా అక్షయ్ లో ఇదివరకున్న స్పార్క్ ఇప్పుడు కన్పించదు. కేవలం డైలాగులే పలుకుతాయి, మైండ్ చలించదు. ‘హేరా ఫేరీ’, ఆ తర్వాత వచ్చిన అలాటి కొన్ని సినిమాల్లోని మైండూ డైలాగులూ ఒకటైన ఫన్నీ యాక్షన్ టక్కరి తనం ఇప్పుడు కనపడదు.
          తర్వాత కేసు టేకప్ చేశాక, పాత్రకి వున్న ప్రత్యేకత ఏమిటో గుర్తించక పాత్రకి మించిన ప్రతిభతో నటించుకుపోతాడు. ఈ  కారణంగా కథలో డార్క్ హ్యూమర్ డ్రామా సృష్టికర్త తను కాకుండా పోయాడు. ముందు తానేమీ కొమ్ములు తిరిగిన లాయర్ కాదు, పైగా మాయమాటలతో మందిని ముంచే రకం. అలాంటి వాడు తన వల్ల ఒక వ్యక్తి  మరణించిందని ఆమె కేసు టేకప్ చేసినప్పడు, ఉన్నట్టుండి  గొప్ప లాయర్ అయిపోలేడు. ముందు నుంచే గొప్ప లాయర్ అయి వుండీ అవినీతి చేస్తూంటే  ఆ అవినీతి మానుకుని గొప్ప లాయర్ గానే  పనిచేస్తున్నాడంటే అర్ధముంటుంది. కానీ  ‘లా’ విషయంలో తను అసమర్ధుడు. తన పాత్రకి అసమర్ధ లాయర్ గా, మందినిముంచే కిలాడీగా  రెండు షేడ్స్ వున్నాయి. ఈ రెండు షేడ్స్ లో రెండవది ఆ వ్యక్తి  మృతితో మాసిపోవచ్చు. కేసు విచారణకి సంబంధించి వారణాసి వెళ్ళినప్పుడు పాపాల్ని కడిగేసుకుంటున్నట్టు గంగా నదిలో దూకుతాడు. కానీ అదే సమయంలో వృత్తి విషయంలో స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి అసమర్ధ లాయర్ అనే రెండో షెడ్ అలాగే వుండి పోతుంది. అలా వుంటేనే పాత్ర అర్ధవంతంగా వుంటుంది. ఆ అసమర్ధతే పాత్రకి ఒక ప్రత్యేకతగా ప్రకాశిస్తుంది. పాత్రకి ఈ ప్రత్యేకతని గుర్తించకుండా ప్రతిభావంతుడైన లాయరన్న కోణంలో చిత్రణ చేస్తే ఎలా?

           అందుకే, కళ్ళముందు న్యాయప్రక్రియ రసాభాస అవుతూంటే బిత్తర చూపులు చూస్తూంటాడు. అదే అసమర్ధ లాయర్ గా వుంటే వచ్చీ రాని  పనితనంతో అసలే భ్రష్టు పట్టిన  వ్యవస్థల్నిఇంకింత నాశనం చేస్తూ అసలు వ్యవస్థలే లేకుండాపోయే, ఎవరికీ కొలువులే లేకుండా పోయే పరిస్థితి తెచ్చి వాళ్ళచేత కాళ్ళు పట్టించుకునే వాడు... ఇదీ కాన్సెప్ట్. 

          పాత్రకున్న షేడ్స్ విషయంలాగే, కథకీ రెండు షేడ్స్ వున్నాయి. ఇక్కడా  ఏ షేడ్ కాన్సెప్టో  గుర్తించినట్టు కనపడదు. కథకి వున్న ఆ  రెండు షేడ్స్ : ఒకటి, ఎన్ కౌంటర్ కేసు; రెండు, వ్యవస్థల భ్రష్టత్వం. ఈ రెండిట్లో ఏది కాన్సెప్ట్? రెండోదే. దీన్నే ప్రధానం చేయాలి, దీంతోనే తలపడాలి, ఎం కౌంటర్ కేసుని అందుకు సాధనంగా మాత్రమే వాడుకోవాలి. 

         కానీ ఎన్ కౌంటర్ కేసుని కూడా ప్రధానం చేయడంవల్ల సమస్య వచ్చింది. ఈ ప్రధానం చేయడంలో కూడా ఎన్నో లోసుగులూ బలహీనతలూ వున్నాయి- ఎందుకంటే ఒక వొరలో రెండు ఎలిమెంట్స్ ఇమడవు, ఒకటి బలి అవాల్సిందే. ఇక్కడ ఎన్  కౌంటర్ కేసు కథనం అందుకే  సంతృప్తికరంగా వుండదు. ఈ కథలో వ్యంగ్యం వ్యవస్థలతోనే వుంది గానీ కేసుతో లేదు, అలాంటప్పుడు కథకి ప్రధాన రసమైన ‘వ్యంగం’ అనే ఎలిమెంట్ కి విఘాతం కలక్కుండా చూసుకోవాలి.

          ఈ దర్శకుడే 2010 లో తీసిన ‘ఫస్ గయారే ఒబామా’  (తెలుగులో ‘శంకరాభరణం’ ) లో కూడా ఒక బ్యాక్ డ్రాప్ వుంటుంది : అమెరికాలో ఏర్పడిన ఆర్ధిక మాంద్యం బాధితుడిగా ప్రధానపాత్ర ఇండియాకి రావడం.  కానీ ఈ బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ కాదు, అందుకని దాన్నే కథగా చేయలేదు. అలాటి వాడు ఇండియాకి వచ్చి ఎదుర్కొన్న అనుభవాలే ప్రధాన కథ. ఈ అనుభవాలతోనే పాత్రని నడిపించుకుపోయారే తప్ప, బ్యాక్ డ్రాప్ లో వున్న ఆర్ధిక మాంద్యం  జోలికి పోలేదు. అంటే ఇక్కడ ప్రధాన పాత్ర  అమెరికాలో ఆర్ధిక మాంద్యం అనే బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చింది. అందుకని తదనంతర  అనుభవాలే కథయ్యింది. 

      అదే ప్రస్తుత కథలో అక్షయ్ కుమార్ పాత్ర వ్యవస్థల భ్రష్టత్వం అనే బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళాలి. ‘ఫస్ గయారే ఒబామా’ లో హీరో పాత్ర బ్యాక్ డ్రాప్ లోంచి వస్తే, ‘జాలీ ఎల్ ఎల్ బి -2’ లో హీరో పాత్ర బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళాలి. ఇదీ సంగతి. ‘ఫస్ గయారే ఒబామా’ లో హీరో పాత్ర బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చి జీవితాన్ని మధించడమే కథగా పెట్టుకుంటే, ‘జాలీ ఎల్ ఎల్ బి -2’ లో హీరో పాత్ర  ఎన్ కౌంటర్ కేసు అనే తన ముందున్న అనుభవం లోంచి బ్యాక్ డ్రాప్ లో కెళ్ళి వ్యవస్థల్ని మధించాలి.

          ఈ  స్పష్టత కొరవడ్డంతో హీరో యమ సీరియస్ గా, గొప్ప లాయర్ గా, ఎన్ కౌంటర్ కేసుని పట్టుకుని, వ్యవస్థల భాగోతాన్ని కళ్ళప్పగించి చూడాల్సి వచ్చింది.

          పాత్రని సరీగ్గా నిర్వచించుకోక పోతే అది అన్నిటినీ చెడగొట్టే అవకాశముంది- కాన్సెప్ట్ నీ, కథనీ, కథనాన్నీసమస్తాన్నీ. పాత్రని అసమర్ధ లాయర్ గానే నిర్వచించుకుని వుంటే ఇవన్నీ దార్లో పడేవి.

          నిజానికైతే  పాత్ర కేసుని టేకప్ చేసే అవకాశం కూడా లేదు. కేసు కోసం తనని ఆశ్రయించిన ఆమెనే మోసం చేసి, ఆమె మృతికి కారకుడైన వాడిమీద చట్టం చర్య  తీసుకోదా?  బార్ అసోసియేషన్ వూరుకుంటుందా? కానీ  బార్ అసోషియేషన్ ఇప్పుడు వూరుకుని,  కేసు నడుస్తున్నప్పుడు అతనేదో అక్రమానికి పాల్పడ్డాడని బహిష్కరిస్తుంది. వెంటనే నిజాయితీని నిరూపించుకోమని నాల్గు రోజులు గడువిస్తుంది. ఇదంతా ఫాల్స్ డ్రామాగా తేలిపోయింది.

          హీరో ఈ కేసుని టేకప్ చేయడానికి క్లయంట్ లేదు. ఆమె తండ్రి వున్నాడు. కానీ ఆయనకి ముఖం చూపించలేడు. అందుకని పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేస్తాడు. ఇదెలా సాధ్యం? ఒక వ్యక్తి  కేసుని పిల్ గా కోర్టెలా స్వీకరిస్తుంది? ప్రజలందరికీ ఎఫెక్ట్ అయ్యే సమస్యలకే  పిల్ వర్తిస్తుంది. మృతురాలి భర్త ఎన్ కౌంటర్ ప్రజలందరికీ ఎఫెక్ట్ అయ్యే సమస్య కాదుగా? ఆ ఎన్  కౌంటర్ల అధికారి ఎన్నో ఎన్ కౌంటర్లు చేశాడు. అలాంటప్పుడు అది ప్రజాసమస్య కావొచ్చు. అప్పుడు ఈ కేసు సహా, గతంలో ఎన్ కౌంటర్ల కేసులన్నీ కలిపి అతడి మీద కేసు వేస్తే అది ప్రజాప్రయోజన వ్యాజ్యం అవుతుంది గానీ,  ఒకే  కేసు పట్టుకుని పిల్ ఎలా వేస్తాడు, కోర్టెలా విచారణకి తీసుకుంటుంది?

          వ్యవస్థల్ని చెండాడే ముందు కథకుడు తన కథతో కరెక్టుగా వుండాలి. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఎలావుంటుందో, అడ్డగోలు కథతో నీతులు చెప్పినా  అలాగే వుంటుంది. 

          పాత్ర వ్యక్తిగత గోల్ తోనే బయల్దేరింది. కానీ తర్వాత అది వ్యవస్థాగత గోల్ గా ఎదగాల్సింది ఎదగలేదు, ప్రేక్షక పాత్రకే పరిమిత మయ్యింది. తన వల్ల చనిపోయినామె  కేసు పోరాడి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న వ్యక్తిగత  గోల్ తో బయల్దేరినప్పుడు, అదైనా సరీగ్గా కుదిరిందా?  దాంతో ఏర్పడాల్సిన ఎమోషన్ పాత్రకి ఏర్పాటయ్యిందా? 

          ఆమె మృతితో నైతికంగా తను పూర్తిగా మారివుంటే, మారాలనుకుంటే, వెంటనే వెళ్లి ఆమె తండ్రి కాళ్ళు పట్టుకోవాల్సింది. అది చెయ్యక గంగా నదిలో మునకేసి ఏం లాభం? ఆ తండ్రి  ఎన్ కౌంటర్ లో అల్లుణ్ణి, హీరో మోసం వల్ల కూతుర్ని, కూతురి కడుపులో వున్న మనవరాల్నో మనవడ్నో  – ఇంతమందిని కోల్పోయి ముసలితనంలో ఒంటరిగా మిగిలాడు. అతడి దగ్గరికి హీరో వెళ్ళక పోతే అతనెలా బలమైన పాత్రవుతాడు?  వెళ్లి వుంటే అక్కడే బలమైన డ్రామా, పాత్రకి ఇంధనం లాంటి నిఖార్సైన  ఎమోషనూ  ఏర్పడి పాత్ర పునీతమయ్యేది.

         వ్యవస్థ  బాధితుల్ని కలుపుకోకుండా వ్యవస్థమీద పోరాడే హీరో, సరైన ఎమోషనల్ కనెక్ట్ లేక తేలిపోతాడని మొన్నే ‘సింగం -3’ రివ్యూలో గుర్తు చేసుకున్నాం. సెకండాఫ్ లో ఎప్పుడో హీరో ఒక అడ్రసు కోసం ఆ తండ్రి దగ్గరి కెళ్ళడాన్ని చూపించి ఆ లోటు తీర్చా మనుకున్నట్టుంది  దర్శకుడు- కానీ హీరో వెళ్ళాల్సింది అడ్రసు కోసం  ఇక వెళ్ళక తప్పదన్నట్టు ఎప్పుడో వెళ్ళడం కాదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే, తను మారాలనుకున్నప్పుడే,  ఆ తండ్రి దగ్గరికి ప్రాయశ్చిత్తం కోసం వెళ్ళాలి- మారాలన్న ఆలోచన పెట్టుకుని తనతో తానే నిజాయితీగా లేకపోతే  ఎలా?

          ఇన్ని లొసుగులున్న పాత్రలో ఒక  స్టార్ ని ఎవరైనా ఎలా చూసి ఎంజాయ్ చేస్తారు? మనకైతే తెలీదు.

          ఇక సినిమాల్లో విలన్ బొట్టు పెట్టుకుంటే మరింత కఠినంగా కన్పిస్తాడు. అదే హీరో బొట్టు పెట్టుకుని  తిరిగితే పప్పుసుద్దలా కన్పిస్తాడు. సినిమాల్లో హీరో పూజలు చేస్తూ కన్పించడు. విలన్ పూజ చేస్తే వచ్చి నరుకుతాడు. విలన్ ద్వంద్వ నీతికి ఈ పూజలూ బొట్లూ అద్దం పడతాయి. అయితే సినిమా సాంతం ఒక హీరోగా అక్షయ్ కుమార్ బొట్టుతోనే వుండడం పాత్రౌచిత్యాన్ని దెబ్బతీసింది.  

          ప్రారంభంలో బొట్టుతోనే చాలా మందిని ముంచానని, ఒకామె చావుకీ కారకుణ్ణి అయ్యాననీ  తెలుసుకుంటే,  బొట్టు తీసేసి దాని పవిత్రతని కాపాడేవాడు. ఈ పరివర్తనతో  ప్రేక్షకులకి దగ్గరయ్యే వాడు. కేసు పోరాడుతున్నపుడు బొట్టు అవసరమే లేదు. జంధ్యం తీసి చూపించాడు, చాలు. ఇప్పుడు బొట్టు తీసేస్తేనే పవర్ఫుల్ గా వుంటాడు- శపథం చేసినట్టు. కథ మొత్తం అయ్యాక తిరిగి బొట్టు పెట్టుకుంటే అది సింబాలిక్ గా వుంటుంది తన విజయానికి.

          ఈ కథలో బొట్టు అనేది ప్లాట్ డివైస్. ప్లాట్ డివైస్ స్తబ్దుగా వుండిపోదు. ప్లాట్ డివైస్ ని కథానుగుణం గా ప్లే చేయకపోతే కథతో పాటు పాత్రకూడా నిస్తేజంగా వుంటాయి. 
                                    ***
      ప్రత్యర్ది లాయర్ పాత్ర బ్రహ్మాండంగా వుంది. కొన్ని కథల్లో కాని పనులు చేసే  ప్రత్యర్ధియే బ్రహ్మండంగానే వుంటాడు. తను చేయాల్సిన వెధవపనులన్నీ అత్యంత నిజాయితీతో చేసుకుపోతాడు. మంచి పనులు చేసే హీరోకే వాటి పట్ల నిజాయితీ నిబద్ధతలనేవి కన్పించవు. అతడికి కామెడీలూ హీరోయిన్లతో సరసాలూ కావాలి. 
          ప్రత్యర్ధి లాయర్ పాత్రలో అన్నూకపూర్ హీరోకంటే హైలైట్. వ్యవస్థల్ని పాడు చేసి బాముకునే బడా లాయర్ గా ప్లే చేయాల్సిన ట్రిక్కులన్నీ ప్లే చేస్తాడు. అలాగే జడ్జి పాత్రలో సౌరభ్ శుక్లా లేకపోతే  ఈ సినిమా లేదు. భారతీయ చలనచిత్ర  చరిత్రలో అతడిది  ఇంతవరకూ రాని  వినూత్న పాత్ర. అడ్డగోలు జడ్జిగా చాలా క్రియేటివ్ పాత్ర. ఈ విషయంలో దర్శకుణ్ణి అభినందించక తప్పదు. ఇక మిగతా అన్ని పాత్రలూ రియలిస్టిక్ గా కన్పించేవే. కానీ హీరోయిన్ హుమా ఖురేషీ కి ఏఎ సినిమాలో అంతగా పనిలేదు, వూరికే వుండే పాత్ర. హీనా సిద్దీఖ్ పాత్రలో సయానీ గుప్తా మాత్రం అక్షయ్ కుమార్ ని నిలదీసే సన్నివేశంలో పూర్తిగా డామినేట్ చేసి ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. 

          పాటలకి పెద్దగా ప్రాముఖ్యం లేదు, అవి ఆకట్టుకునేది కూడా లేదు. సహజత్వానికి దగ్గరగా కళా దర్శకత్వం, ఛాయాగ్రహణం బావున్నాయి. 

చివరికేమిటి 
     వ్యవస్థల అవినీతిని చెప్పే  కాన్సెప్ట్ బలమైనదే అయినా, కాన్సెప్ట్ కి సాధనమైన ఎన్ కౌంటర్ కథకీ ప్రాధాన్య మివ్వడంతో  స్క్రీన్ ప్లే ఒడిదుడుకుల పాలై కన్పిస్తుంది. అయితే ఒక సాధారణంగా కన్పించే ఎన్ కౌంటర్ కథ క్రమక్రమంగా చిక్క బడుతూ, విశాలమవుతూ- కొత్త రహస్యాల్ని వెల్లడిస్తూ, పతాక స్థాయికి వెళ్లి అసలు గుట్టు రట్టు చేయడమనే సస్పెన్స్ తో వున్నప్పటికీ,  ఇదంతా చూపించుకు రావడం వల్ల అసలు కాన్సెప్ట్ మీద ఫోకస్ చెదిరిపోయి కన్పిస్తుంది. పైగా ఈ కేసు కథలో లాజికల్ గా ఎన్నో లోపాలు. అలాగే సంఘటనల కూర్పు కూడా అతుకులేసినట్టు వుంటుంది. షాకింగ్ దృశ్యాల కల్పనలో షాక్ వుండదు. వున్నట్టుండి హీనా పాత్ర ఆత్మ హత్య చేసుకోవడంలో అది ప్రేరేపించాల్సిన అయ్యోపాపమనే భావం ప్రేరేపించదు. 

          అలాగే ఇంటర్వెల్ దృశ్యంలో హీరో మీద దుండగులు కాల్పులు జరిపే సంఘటన కూడా... అకస్మాత్తుగా జరిగే సంఘటన అకస్మాత్తుగా ముగిసిపోవాలనే నియమం ఇక్కడ కన్పించదు. హీరో తన ఫ్యామిలీతో మార్కెట్ లో వున్నప్పుడు సడెన్ గా దుండగులు వచ్చి హీరో మీద కాల్పులు జరుపుతారు. కానీ  దాడి జరిపినంత మెరుపు వేగంతో మాయమైపోరు. డిలే చేస్తారు. దీంతో షాక్ వేల్యూ నీరుగారిపోయింది. 

          ఎలా సడెన్ గా వచ్చి ఎటాక్ చేశారో, అంత  సడెన్ గానూ  మాయమైపోతే అందులో షాక్ వేల్యూ  వుంటుంది ఆడియెన్స్ కి కూడా. ఇంటర్వెల్ సీనుకి ఈ షాక్ వేల్యూ  చాలా అవసరం. ఇదొక వెర్షన్.

          ఇంకో వెర్షన్ లో-  సంఘటన సడెన్ గా జరగడం గాక, అది జరగబోతున్నట్టు సీన్ ఓపెన్ చేసి, ఒక వైపు దుండగుల్ని  చూపిస్తూ, మరో వైపు హీరోని చూపిస్తూంటే, అది సస్పెన్స్ ని  క్రియేట్ చేస్తుంది. అప్పుడు వచ్చి దాడి చేసి తక్షణం పారిపోకపోయినా  ఫర్వాలేదు- సస్పన్స్ ని ముగించారు కాబట్టి ఈ సీన్లో  ఎమోషన్ తీరిపోతుంది. 

          ఈ రెండూ కాక, దుండగులు సడెన్ గా వచ్చి హీరో మీద కాల్పులు జరిపి, తమని పట్టుకోవాలని పెనుగులాడుతున్న భార్యని విడిపించుకునే ప్రయత్నాలు చేస్తూ, పారిపోవడం డిలే చేస్తే  సస్పెన్సు, ఎమోషన్,  షాక్ వేల్యూ ఏవీ వుండవు. ఇలాగే  చూపించారు ఇంటర్వెల్ సీనులో.  
          అంటే పైన చెప్పుకున్న మొదటి వెర్షన్ ప్రారంభాన్ని,  రెండో వెర్షన్ ముగింపుతో  కలిపి కిచిడీ చేశారన్న మాట. దీంతో ఇంటర్వెల్ ఇవ్వాల్సిన ఎఫెక్ట్ ఇవ్వకుండా ఏదో  ముచ్చట్లాడు కుంటున్నట్టుగా వుండిపోయింది.

          ఇలా కాన్సెప్ట్- దాని సాధనం, పాత్ర - దాని తర్వాతి క్రమం, సంఘటన ప్రారంభం - దాని ముగింపు...ఇలా ఏ క్రియేటివ్ యాస్పెక్ట్ లోనూ  దర్శకుడు క్షీరనీర న్యాయం చేయలేకపోతున్నాడు. చేసి వీటి లోంచి  కేవలం పనికొచ్చే పాలనే తీసుకోవాలని గుర్తించ లేకపోతున్నాడు.
                                                ***
      కోర్టు సీన్ల సెటైర్లు, డార్క్ కామెడీ మాత్రం ధైర్యంగా అపూర్వంగా ప్రదర్శించిన క్రియేటివిటీ. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ దృశ్యాలు కొన్ని ఇక్కడ లైవ్ గా కన్పిస్తాయి. కోర్టులో ప్రత్యర్ది లాయర్  వర్గం సృష్టించే బీభత్సం, కొట్లాట, తన్నులాట, ఫైళ్ళ ఎగరవేత, బల్లలూ కుర్చీల విసిరివేత, జడ్జి బల్ల కింద దూరివేత (అంతకి ముందు  జడ్జి ‘నా కుర్చీలో కూర్చో రా!’  అని ఆరుస్తాడు- ఇది కూడా చేసి వుంటే తమిళ నాడు అసెంబ్లీ ఎపిసోడ్ కి పూర్తి న్యాయం జరిగేది), అన్నాడీఎంకే సభ్యుల్లా హీరో మౌనం గా చూస్తూ వుండడం,  చివరికి స్టాలిన్ లా ప్రత్యర్ధి లాయర్ అక్కడే ధర్నా కూర్చోవడం! (చూస్తే  స్టాలిన్, ఈ సినిమా చూసే ఆ యాక్షన్ డ్రామా అంతా  సృష్టించాడేమో అన్పిస్తుంది- సినిమాలో పూర్తి  చెయ్యని జడ్జి కుర్చీలో కూర్చునే ఘట్టాన్ని, అసెంబ్లీ లో స్పీకర్ సీటుతో చేసి చూపించాడేమో).
          ఇక అసెంబ్లీకి ఆ రోజు కె. కరుణానిధి రాలేదేమో గానీ, ఇక్కడ కోర్టులో కరుణానిధి లాంటి ఆరోగ్యపరిస్థితుల్లోనే ఒక బాగా వృద్ధుడు వీల్ చైర్ లో వచ్చి ప్రొసీడింగ్స్ గమనిస్తాడు (పై ఫోటో చూడండి).

          సినిమాలో జడ్జి కూడా, ధర్నా కూర్చున్న ప్రత్యర్ది లాయర్ ముందు కింద కూర్చోవడం ఇంకో స్పెషాలిటీ. అలా కోర్టు నిండా జనం చూస్తూనే వుంటారు. అర్ధరాత్రి గడిచిపోతుంది. తమిళనాడు అసెంబ్లీ  స్పీకర్ విశ్వాస పరీక్ష మధ్యలో జరిగిన రభసకి, సభ వాయిదా వేసి మళ్ళీ తర్వాత  విశ్వాస పరీక్ష జరపడం రూల్సు కి విరుద్ధమని అంటున్నారు.
ఇక్కడ జడ్జి అలా కేసు వాయిదా వేయడు. అర్ధరాత్రి దాకా ధర్నా జరగనిచ్చి, కేసు వాయిదా వేయకుండా కంటిన్యూ చేస్తాడు. ఇదన్యాయం, చట్ట విరుద్దమంటే- ఇప్పుడెలాగూ బయటికెళ్తే రిక్షాలుండవు, బస్సు లుండవు- ఎందుకొచ్చిన గొడవ - ఇక్కడే కూర్చుని పని ముగిద్దామని రసాభాసగా విచారణ కొనసాగించి, తెల్లారేసరికల్లా తీర్పు చెప్పేసి వెళ్ళిపోతాడు కూతురి పెళ్ళి పనులకి.

          మొత్తానికి రెండు వేర్వేరు జానర్స్  - సెటైర్, సీరియస్ యాక్షన్ డ్రామా- లని కలిపి ఒక ప్రయోగం చేశాడు దర్శకుడు. క్రియేటివిటీకి కొలమానాల్లేవన్నట్టు ఏదైనా చేసెయ్య వచ్చేమో!

-సికిందర్ 
http://www.cinemabazaar.in

Friday, February 17, 2017

రివ్యూ!


రచన- దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి

తారాగణం :  రానా గ్గుబాటి, తాప్సీ, కె.కె.మీనన్, రాహుల్ సింగ్, ఓంపురి, అతుల్ కులర్ణి, నాజర్, ఓంపురి, రాహుల్ సింగ్, త్యదేవ్, వి ర్మదితరులు
మాటలు : గుణ్ణం గంగరాజు, సంగీతం : కె, కెమెరా : మాధి, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విజువల్ స్టంట్స్ : జాషువా, ఎఫెక్ట్స్ః ఈవా మోషన్ స్టూడియోస్
బ్యానర్ః మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పివిపి సినిమా
నిర్మాతలుః పివిపి సినిమా-పెరల్ వి.పొట్లూరి, మ్ వి.పొట్లూరి, విన్ అన్నె, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్-అన్వేష్ రెడ్డి, న్మోహన్ వంచ, వెంక ణా రెడ్డి
విడుదల : ఫిబ్రవరి 17, 2017
***
         యుద్ధ సినిమాలు తెలుగు నేటివిటీకి దూరమే. ఎక్కడో దేశ సరిహద్దు వుంటే అక్కడి హిందీ వాళ్ళకే యుద్ధ సినిమాలు నేటివిటీతో కలుస్తున్నాయి. వాళ్ళు ‘బోర్డర్’ తీస్తారు, ‘హకీఖత్’ తీస్తారు. అలాంటిది ‘కంచె’ తో యుద్ధ సినిమా తెలుగు గడప తొక్కింది. ‘శాతకర్ణి’  టైపు రాజుల యుద్ధాలు తెలుగు జీవితమే. కానీ  ‘కంచె’ యుద్ధాన్ని యూరప్ లో చూపించడం సాహసమే. అక్కడ్నించీ యుద్ధాన్ని విశాఖపట్నం తీసుకొస్తే? మావూరికి సర్కస్ వచ్చిం దన్నంత ఆనందం తెలుగు ప్రేక్షకుడనే వాడికి. వాడికీ ఆనందం లేకపోతే తెలియని చరిత్రల్ని   కోల్పోతాడు. శాతకర్ణి తెలియని చరిత్ర తెలుసుకున్నాడు, హథీరాం బాబా తెలియని చరిత్ర కూడా తెలునుకున్నాడు, ఇప్పుడు విశాఖ సైడు ఘాజీ చరిత్రా తిలకిస్తాడు. తెలియని చరిత్రలు బయటికి తీస్తున్న తెలుగు సినిమాలు ఎదిగినట్టేనని ఆనందిస్తాడు. తెలుగు ప్రేక్షకుణ్ణి ‘ఘాజీ’ చూసేందుకు ఇలా సిద్ధం చేద్దాం...
ముందు కథ

      1971లో తూర్పు పాకిస్తాన్ (తర్వాత బంగ్లాదేశ్) లో పశ్చిమ పాకిస్తాన్ సాగిస్తున్న దమనకాండ నేపధ్యంలో భారత నేవీ తన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకని విశాఖపట్నం తూర్పు నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కి   బదిలీ చేయడం పాకిస్తాన్ కి ఆందోళన కల్గిస్తుంది. సముద్ర తీరంలో తూర్పు పాకిస్తాన్ కి చేరువలో ఐఎన్ఎస్ విక్రాంత్ వుండడం ప్రమాదమని, దాన్ని నాశనం చేయడానికి  తన జలాంతర్గామి (సబ్ మెరైన్) పిఎన్ఎస్ ఘాజీని పంపడానికి పథకం వేస్తుంది. తూర్పు పాకిస్తాన్ లోని చిట్టగాంగ్ కి పంపిన ఒక రహస్య సందేశాన్ని టాప్ చేయడం ద్వారా ఈ పాక్ పథకం తూర్పు నావల్ కమాండర్- ఇన్- చీఫ్ (ఓంపురి) కి తెలుస్తుంది. ఆయన వెంటనే ఐఎన్ఎస్ రాజ్ పుత్ జలాంతర్గామిని రంగంలోకి దింపుతాడు. భారత సముద్ర జలాల్లోకి ఘాజీ వస్తోందా లేదా నిఘావేసి తెలియజేయాల్సిందిగా కెప్టెన్ రణ్ విజయ్ సింగ్ (కెకె మీనన్) ని ఆదేశిస్తాడు. రణ్ విజయ్ సింగ్ ది  ఉడుకు రక్తం. చూసి తెలియజేయడమెందుకు, చూసి పేల్చేస్తామంటాడు. అది యుద్ధానికి దారి తీస్తుందని, కేవలం చెప్పినట్టు చేయమని హెచ్చరిస్తాడు ఛీప్. రణ్ విజయ్ సింగ్ ని కంట్రోలులో వుంచాల్సిందిగా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ(రానా దగ్గుబాటి) ని కోరతాడు. వీళ్లిద్దరితో బాటు  ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ (అతుల్ కులకర్ణి) బయల్దేరతాడు.

       సముద్ర అంతర్భాగంలో రహస్యప్రయాణం మొదలెడుతుంది రాజ్ పుత్; అట్నుంచి ఘాజీ సముద్రం లోపల్నుంచి గుట్టుగా వస్తూంటుంది. అప్పుడు ఈ రెండిటి మధ్య యుద్ధం ఎలా  జరిగింది, ఈ యుద్ధంలో  బద్ధ వ్యతిరేకులైన కెప్టెన్ రణ్ విజయ్ సింగ్, లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మల మధ్య  ఏం ఘర్షణ జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ ఎలా నలిగాడు, డ్యూటీ విషయంలో అదుపుతప్పే రణ్ విజయ్ ఆవేశాన్ని అర్జున్ ఎలా కంట్రోలు చేశాడు, మధ్యలో ఘాజీ ఒక మర్చంట్ నౌక ని పేల్చేస్తే అందులోంచి అర్జున్ రక్షించిన ఆ యువతి, బాలిక ఎవరు; చివరికి ఘాజీ మీద ఇండియన్ బృందం ఎలా విజయం సాధించిందీ... ఇవన్నీ తెలుసుకోవాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే.
ఎలావుంది కథ 
        ఇది 1971 నాటి యుద్ధ చరిత్ర. అయితే సినిమా కథ చేసినట్టుగా చరిత్ర జరగలేదు. ఇందుకు ఆధారాల్లేవు. 2003, 2010, 2011 వరకూ కూడా నావికాదళాధికారులు పదేపదే ఘాజీ మునకతో రాజ్ పుత్ కి  ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు (ఇదే పాక్ అధికారులైతే మేమే ముంచేశామని  గొప్పలు చెప్పుకునే వారు). ఆ సమయంలో రాజ్ పుత్ పోర్టులోనే వుందని అంటున్నారు. ఘాజీ లోపల ప్రమాద వశాత్తూ టార్పెడోలూ మందు పాతరలూ పేలి మునిగిపోయిందనీ; బ్యాటరీలని ఛార్జి చేసేటప్పుడు హైడ్రోజన్ వాయువులు  వెలువడ్డమే ఈ పేలుళ్ళకి కారణమనీ భారత నావికాదళాధికారులు ధృవీకరించారు. అయితే ఘాజీ మునక ఎప్పటికీ తేలని మిస్టరీగానే  మిగిలిపోయిందనే నిపుణులూ లేకపోలేదు.

           అయితే ఈ ‘చరిత్ర’ మరుగున పడిపోయిందనీ, ఇందులో పాల్గొన్న మన నావికా దళ సభ్యుల విజయం కూడా ప్రపంచానికి తెలియకుండా పోయిందనీ ఈ కథ చేసిన దర్శకుడు అభిప్రాయపడ్డాడు. కానీ సినిమాకోసం చరిత్రని ఇలా మార్చెయ్యడం విచిత్రమే. దీన్ని దర్శకుడి విజ్ఞతకే వదిలేద్దాం. 

          ఘాజీ సబ్ మెరైన్ నిజానికి అమెరికానుంచి లీజుకి తీసుకుంది పాక్. దాన్ని నిర్వహించుకోలేక మంటగలుపుకుంది. లీజుకి తీసుకున్నపుడు  దాని అమెరికన్ పేరు యూఎస్ ఎస్ డయాబ్లో. చాలా శక్తిమంతమైన జలాంతర్గామి అది. సముద్రం లోపల మందు పాతరలని కూడా పెడుతుంది. భారత సబ్ మెరైన్స్  కి అప్పట్లో ఈ ఏర్పాటు లేదు.

          సినిమా కోసం ఈ కథ చేసినప్పుడు ఇందులో దేశభక్తిని బాగా దట్టించారు. రొటీన్ గా ఒక మాటనేస్తూంటారు- దేశం కోసం ప్రాణాలివ్వాలని. దర్శకుడు మాత్రం ఈ మూస డైలాగుని తిప్పి కొడుతూ- దేశం కోసం ప్రాణాలివ్వడం కాదు, శత్రువుని చంపి గెలవాలని, కామన్ సెన్స్ తో డైలాగు పలికిస్తాడు. 

          ఇంతవరకూ భూమ్మీద, సముద్రం మీద, గాల్లో జరిగే యుద్ధాలతోనే దేశంలో సినిమాలు వచ్చాయి. సముద్రం లోపల జరిగే పోరాటంతో ఒక పకడ్బందీ కథ ఇలా తొలిసారిగా వచ్చింది. దీన్ని తెలుగు – హిందీ భాషల్లో నిర్మించారు. టామ్ క్లేన్సీ  నవల ఆధారంగా హాలీవుడ్ లో తీసిన ‘ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్’ జలాంతర్గాముల  యుద్ధం ఈ సందర్భంగా గుర్తుకొస్తే రావొచ్చు.

ఎవరెలా చేశారు 
      ఇలాటి రియలిస్టిక్, ఇంటలిజెంట్ సినిమాల్లో నటనలు మారిపోతాయి : ఫార్ములా  నటనల బెడద తప్పిపోతుంది. పైగా ప్రధానపాత్రలో రానా,  ఏ కమర్షియల్ సినిమాలోనైనా మొదట్నించీ హీరోకుండే డామినేటింగ్ స్థానాన్ని తీసుకోకుండా, క్రమక్రమంగా పూర్తి  యాక్షన్ లోకొస్తాడు. దాదాపు ఫస్టాఫ్ అంతా  అతను ప్రధాన పాత్ర కాదేమో అన్నట్టుంటాడు. ఉడుకురక్తం కెప్టెన్ ని కంట్రోల్ చేసే సీన్లే అతడికి ఇన్నర్ స్ట్రగుల్ (ఎమోషనల్ యాక్షన్) ని కల్పించి, ఔటర్ స్ట్రగుల్ (ఫిజికల్ యాక్షన్) గా శత్రువుతో పోరాటాన్ని పెట్టి  పాత్ర చిత్రణ చేశారు. దీనివల్ల ఇదొక సమగ్ర పాత్రయింది. ఈ పాత్రలో అతడి నటన అత్యంత నిజమైన నేవీ అధికారి అన్పించేట్టే వుంది- ‘రుస్తుం’ లో నావల్ ఆఫీసర్ గా నటించిన అక్షయ్  కుమార్ కి లాగే. కొత్త దర్శకుడు సంకల్ప్  రెడ్డి ఇంత పకడ్బందీగా పాత్ర చిత్రణ చేయడం ఆశ్చర్య పరచే విషయమే. రానా గుర్తుండి పోతాడు.

          ఇక ఇంకో గుర్తుండిపోయే పాత్ర కెకె మీనన్ నటించిన రణ్ విజయ్. అత్యంత ప్రతిభావంతమైన- క్లాసిక్  ముఖభావాలతో స్టన్నింగ్ క్లోజప్స్ ఇచ్చాడు. రణరంగంలో అప్పటి పరిస్థితిని బట్టి రియాక్ట్ అవ్వాలే గానీ, ఎక్కడ్నించో వచ్చే రాజకీయ నిర్ణయాల్ని పాటించడం పట్ల అసహనం ప్రదర్శించే తన  పర్సనాలిటీ ట్రెయిట్ ని స్వయంగా తాననుభవిస్తున్నట్టే ప్రదర్శించాడు. అతడికి ఈ లక్షణం ఎందుకుందో ఆలోచింపజేసే గత జీవితం కూడా వుంది. 

       శరణార్ధిగా అవతలి దేశం దాటుకుని వచ్చే పాత్రలో తాప్సీ కి పెద్దగా పనిలేకపోయినా- మరీ సినిమా మొత్తంలో ఆడమనిషే కన్పించకపోతే వరస్ట్ గా వుంటుంది కాబట్టి,  ఆ లోటుని భర్తీ చేస్తున్నట్టు ఏకైక ఆడ పాత్రగా- గ్లామర్ లెస్ గా  వుంటుంది ( ‘పింక్’ లో తాప్సీ కోసం ఎగబడ్డ అమ్మాయిలే ఇప్పుడూ భారీగా తరలివచ్చి నిరుత్సాహ పడివుంటారు). అతుల్ కులకర్ణి కూడా ఎక్సెలెంటే. ‘మనవూరి రామాయణం’లో  ప్రకాష్ రాజ్ ని ఇరుకున పెట్టేసే ఆటో వాడి పాత్రలో అలరించిన సత్యదేవ్ మరోసారి ఆకట్టుకుంటాడు. తెలిసిన మొహం రవివర్మకి కూడా నిడివి గల పాత్రే దొరికింది. పాక్ కెప్టెన్ రజాక్ గా ( రాహుల్ సింగ్) మరో ఆకర్షణ.

          ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరూ అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విధంగా పనిచేశారు. ‘శాతకర్ణి’ ని అలా పెడితే, ‘కంచె’ తర్వాత ఇంత క్వాలిటీ యుద్ధ సినిమా తెలుగులో ఇదే. ఇక గుణ్ణం గంగరాజు రాసిన మాటలూ సహజంగా వున్నాయి – ‘పైకీ కిందకీ... పైకీ కిందకీ ...ఎవడ్రా వాడు కమాండరా?  లిఫ్ట్ మానా?’ అని రజాక్ 
పాత్ర అర్చినప్పుడు, ఆ  డైలాగు బాగా పేలి హాలంతా నవ్వులతో దద్దరిల్లింది. 

చివరికేమిటి         కొత్త దర్శకులు  ఇంకా పాత మూస సినిమాలతోనే నానా గడ్డి కర్చి నిర్మాతల్ని ఒప్పించుకుంటున్న కాలంలో,  ఓ కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి- మూసకి మూడులోకాల  అందనంత దూరంలో, ఎక్కువ బడ్జెట్ ని కోరే  ఇలాటి డిఫరెంట్ సినిమాని ఒప్పించుకోవడం, దీన్ని చేపట్టేందుకు పొట్లూరి వరప్రసాద్, అన్వేష రెడ్డిల  లాంటి నిర్మాతలూ ముందుకు రావడం ఈవారం హిందీ తెలుగు ప్రేక్షకులకి –ఓవర్సీస్ ప్రేక్షకులకి కూడా- రిలీఫ్.
          సంకల్ప్ రెడ్డి సబ్ మెరైన్స్ గురించి చాలా రీసెర్చి చేసే ఒక అథారిటీ లాగా ఘాజీని నడుపుతున్నట్టు కన్పిస్తాడు. స్పీల్ బెర్గ్ జాస్ తీసినప్పుడు ఆ మోడల్ లోపల ఇంజనీర్లు కూర్చుని ఆ ‘సొరచేప’ ని ఆపరేట్ చేశారేమోగానీ,  ఇక్కడ సంకల్ప్  రెడ్డి స్వయంగా సబ్ మెరైన్స్ లో కూర్చుని తను నడుపుతున్నట్టే, మొత్తం మెకానిజమూ, ఇంజనీరింగ్ సాంకేతికాలూ సహా –ఆయా ప్రమాదాల్లో తీసుకోనే జాగ్రత్తలు సహా – క్షుణ్ణమైన అవగాహనతో వున్నట్టు కన్పిస్తాడు.

          నీటిలోపల రాజ్ పుత్  వర్సెస్ ఘాజీ వేసుకునే ఎత్తుగడలూ, చేసుకునే టార్పెడో దాడులూ, క్షణ క్షణం టెన్షన్ ని బిల్డప్ చేసే యాక్షనూ, మెలోడ్రామా తప్పుపట్టలేని విధంగా వున్నాయి. ఇంతే ‘ఇంజనీరింగ్’ స్క్రీన్ ప్లేకీ చేశాడు. స్క్రీన్ ప్లే అంటే పాత్ర చిత్రణలు సహా మొత్తం కథా నడకా. మొదటి ఇరవై అయిదు నిమిషాల్లో ఘాజీని ప్రవేశపెడుతూ (ప్లాట్ పాయింట్ వన్) బిగినింగ్ ని ముగించాడు. ఇక్కడ్నించీ ఈ మిడిల్ ఇంటర్వెల్ కి ముందు అరగంటా చూపించి, ఇంటర్వెల్ కి తర్వాత ఇంకో అరగంటా చూపిస్తూ ముగించాడు. ఇక్కడ కెప్టెన్ రణ్ వీర్ మరణం తర్వాత శపథం చేయడమే ప్లాట్ పాయింట్ టూ. ప్లాట్ పాయింట్ వన్ కీ, టూకీ మధ్య గంట పాటు మిడిల్ విభాగమంతా సమస్యతో సంఘర్షణనే పెంచుకుంటూ పోయాడు నియమాల ప్రకారం. ఇక ప్లాట్ పాయింట్ టూ నుంచీ అరగంట పాటూ క్లయిమాక్స్ కి కేటాయించాడు. ఈ మొత్తం స్ట్రక్చర్ కీ రాజ్ పుత్ కి మందు పాతర (మైన్) పెట్టడంతో ఇంటర్వెల్ ఇచ్చాడు. 

          స్ట్రక్చర్ ని కోరుకోని ఇంకా పాత స్కూలు యువ వృద్ధులు తమ కథలతో ఈ సినిమా కథ ఎలా విబేధించి తమ కథలకంటే ఇంత పకడ్బందీగా వుందో విశ్లేషించి చెప్పగల్గితే, వాళ్ళని ఘనంగా సన్మానించ వచ్చు. చిక్కేమిటంటే, వాళ్ళకి ఏ సినిమా చూసీ విశ్లేషించడం చేతగాదు!

-సికిందర్      


Monday, February 13, 2017

          
     హ  అంతా ఓకే అనుకుని కీ బోర్డు మీద మీరు ఫైనల్ గా సేవ్ కొడతారు. టేబుల్ మీద అటు పక్క వున్న మగ్గులో పొగలు గక్కుతున్న కాఫీని ఇంకోసారి సిప్ చేసి, వర్డ్ డాక్యుమెంట్ ని క్లోజ్ చేస్తారు. ఆ వర్డ్ డాక్యుమెంట్ లో మీరు ఇప్పుడిప్పుడే ఫినిష్ చేసిన బ్లాక్ బస్టర్ స్క్రిప్టు వుంది. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఫీలవుతారు. గర్వంగానూ ఫీలవుతారు. ఎందుకంటే- ఒక స్క్రిప్టు ని పట్టుబట్టి ఫినిష్  చేయడమంత  గొప్ప పని లేదు! అయితే ఒకటే సమస్య- మీరా స్క్రిప్టుని ప్రేమించకపోవడం, ఇంకా వరస్ట్ గా మిమ్మల్ని మీరే ప్రేమించుకోవడం!
          షాకింగ్ గా వుందా? వుండొచ్చు. వుంటుంది కూడా. రైటర్ గా మీతో మీరే ప్రేమలో పడితే, టాలెంట్ పరంగా మీరొక పెద్ద కొండనే ఢీకొంటారు. ఆ కొండని ఒక్క అంగుళం కూడా కదిలించుకుని దాటలేరు. మీరు అట్టడుక్కి  జారుకుంటే తప్ప-మీ ఇగో కిందనుంచి మీరు కూర్చోబెట్టిన  పీఠాన్ని లాగేస్తే తప్ప!

         రైటర్స్ తో  వచ్చిన చిక్కేమిటంటే, వాళ్ళు సక్సెస్ ని ఫేమ్ గా చూస్తారు. ఫేమ్ కోసం రాస్తారు. రాయడం కోసం రాయరు. వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ నిండా ప్రపంచంలో తాము పొందబోయే పేరుప్రఖ్యాతుల వాసనలతో నింపేస్తారు. తాము రాసింది పబ్లిక్ లోకి వెళ్ళాలని గాక, రాసిందాంతో తామే పబ్లిక్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాలనుకుంటారు. తమ పేరే కన్పించాలి, తాము రాసింది ఎలా వున్నా ఫర్వాలేదన్న పటాటోపంతో ప్రవర్తిస్తారు.  


          అప్పుడేం జరుగుతుంది? ఇలా మీ గురించి  మీరు ఫీలైపోతే, మీరు రాసిందాంట్లో మీరే కన్పిస్తారు; మీ ఇగోయే కన్పిస్తుంది; పేరుతెచ్చుకోవాలన్న మీ యావే కన్పిస్తుంది. ఒక కంపెనీ తన ఉత్పత్తులకి ప్రజల్లో పేరురావాలన్న సంకల్పంతో నాణ్యమైన ఉత్పత్తిని చేస్తుంది, ఉత్పత్తిని వదిలేసి కంపెనీకే పేరురావాలని ప్రాకులాడదు.
          మీరలా కాదు, మీరు మీకే పేరు రావాలనుకుని రాస్తారు, రాసిందాని నాణ్యత పట్టించుకోరు. రాసిందాన్ని ఎప్పుడూ నిష్పాక్షికంగా సరిచూసుకోవాలని కూడా ప్రయత్నించరు. మీ ఇగో మిమ్మల్ని మీరింతగా ప్రేమించుకునేట్టు మాయ చేస్తుంది. మీ ఇగో మీకిచ్చిన  కాన్ఫిడెన్స్ మీద ఈగని కూడా వలనివ్వదు. ఇగోయే మీరు, మీరే ఇగో అన్నట్టుగా మీరుంటారు.
          ఇలా గాలికొట్టి ఉబ్బించుకున్న కాన్ఫిడెన్స్ తో మీరు స్క్రిప్టు ని సబ్మిట్ చేస్తారు. ఇగో చేసే ఇంకో మాయ ఏమిటంటే అది అవతలివారికి కూడా ఇగో వుంటుందన్న స్పృహ మీకు కలగనివ్వదు. మీ స్క్రిప్టు చదివే అవతలి వ్యక్తి  అందులో మీ ‘రైటింగ్ పవర్’ ని చూసి పడిపోతాడనుకుంటారు. కానీ అతడికీ ఇగో వుంటుందనీ, ఆ ఇగోతో అతనూ రియాక్ట్ అవుతాడనీ అనుకోరు. మీ రైటింగ్ పవర్ లో మీ ఇగోని చూసిన అతను కూడా వెంటనే తన ఇగోతో దాన్ని తిప్పికొట్టేస్తాడు.
రెండు ఇగోలూ ఒక ఒరలో ఇమడవు. అవతలి వ్యక్తికి ఇగో లేకుండా మీరు చేయలేరు. ఎంతో కొంత అతడి ఇగోని సంతృప్తిపర్చడమే మీరు చేయగలరు. అతడి ఇగోని  సంతృప్తిపర్చాలంటే మీరు రాసిం దాంట్లో మీ ఇగో కన్పించకూడదు, వినయపూర్వక రాతే కన్పించాలి. ఆ రాతలో ఆ రాతద్వారా ఆ కంపెనీకి వచ్చే లాభాలే కన్పించాలి, మీ పేరుప్రఖ్యాతులు కాదు. కంపెనీకి మీ ఇగో నచ్చి  నడిబజార్లో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని అమ్మాలనుకోదు, మీరు రాసింది నచ్చితే దాన్ని అమ్మాలనుకుంటుంది.
రాసిందాంట్లో అంతా మీ ఇగోయే నిండిపోయి వుంటే, దాన్ని రిజెక్ట్ చేస్తుంది, డీఫేమ్ చేస్తుంది, డస్ట్ బిన్ లో పడేస్తుంది. అప్పుడేమవుతుంది? ఇతరుల్నిఇంప్రెస్ చేయడంలో మీరు ఇలా ఫెయిలవడంతో మీ ఇగో స్థానంలో మిమ్మల్ని అవమానభారం, నిరాశానిస్పృహలు, విరక్తి, వైరాగ్యం, పిరికితనం ఇవన్నీ చుట్టుముడతాయి. మీ ఇగో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్తుందన్న మాట.
అందుకని ఏంచేయాలి? మీతో మీరు ప్రేమలో పడకండి, మీ రాతతో ప్రేమలో పడండి. మీ రాతపట్ల కమిట్ మెంట్, నిజాయితీ ఉట్టి పడేట్టు రాయండి. ఆ రాత ద్వారా మీరేదో సాధించాలన్న ఆశలు పెట్టుకున్నట్టు గాక, మీ రాత ఏం సాధించగలతో ద్యోతకమయ్యేట్టు రాయండి. అప్పుడు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ మిమ్మల్ని దెబ్బ తీయదు, ఇంకోచోట సబ్మిట్ చేసుకుంటారు.  రిజెక్షన్స్ మిమ్మల్ని బాధించవు, అదికాక పోతే ఇంకోటి రాయడానికి సిద్ధమవుతారు. రాసిందే శాశ్వతమని భావించరు, ఇంప్రూవ్ మెంట్ ఎప్పటికీ వుంటుందని కరెక్షన్స్ చేస్తూంటారు. ఎన్ని కరెక్షన్స్ తో ఎంత పర్ఫెక్షన్ మీరు సాధిస్తూంటే, అంత ఒప్పించడానికి మీరు దగ్గరవుతూంటారు. మార్కెట్లో డబ్బే మాటాడుతుందని గుర్తు పెట్టుకోండి, రాత కాదు.
అంటే మీకంటూ ఏమీ ఆశించకుండా రాయాలా? అవునంతే, ఆశించకూడదు. అది రాస్తే మీకింత పేరొస్తుందని రాయకూడదు, అది రాస్తే మీకింత డబ్బొస్తుందని రాయకూడదు, అది రాస్తే మరెన్నో  ఆఫర్స్ వస్తాయనీ రాయకూడదు. వస్తాయీ అన్నది వూహ, వూహలు చేయకూడదు. వూహించడంటే భవిష్యత్తులో వుండడమే. కానీ మీరు వర్తమానంలో వుండాలి. మీరు భవిష్యత్తుని కలలు గంటూంటే, అది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికీ, ఆ ప్రేమతో మిమ్మల్ని మీరేదో వూహించుకోవడానికీ, పగటి కలలు కనడానికీ, ఫలితంగా ఇగో వచ్చి ఆక్రమించడానికీ, ఆ ఇగోయే మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకోవడానికీ, ఆ సెల్ఫ్ లవ్ తో వర్తమానంలో మిమ్మల్ని నడిపించడానికీ దారి తీస్తుంది. మీ చేతిలో వున్న పనిని సరిగా జరగనివ్వదు, డిస్టర్బ్ చేస్తూంటుంది.
ఏదో రావాలని, ఏదో కావాలని మీరు వూహాజనితమైన భవిష్యత్తులోకి వెళ్ళిపోయే కంటే, వాస్తవికమైన వర్తమానాన్ని నమ్ముకుంటేనే పనిని నమ్ముకున్నట్టు. వర్తమానంలో దృష్టి పెట్టి మీరు సరిగా రాయకపోతే మిమ్మల్ని  మీరెలా నమ్ముకోగలరు. అందుకని పనిని నమ్ముకోవాలి, మిమ్మల్ని కాదు. పనివల్లే మీమీద మీకు నమ్మకం ఏర్పడుతుంది, వూహలవల్ల కాదు. పనిని నమ్ముకున్నప్పుడే  మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా వుంటారు. ఎందుకంటే వాస్తవంలో లేదా వర్తమానంలో- ఈ క్షణంలో- మీరు చేయాల్సిన పనే మీ ముందుంటుంది. ఆపని తనని ప్రేమించమంటుంది. అందుకని మీ రాతపనిని మాత్రమే మీరు ప్రేమించాలి, అది నిర్దుష్టంగా వుంటే, అదే మీ భవిష్యత్తుని కావలసినంత గొప్పగా తీర్చిదిద్దుతుంది. సరైన వస్తువు నివ్వకుండా మీరే వస్తువూ పొందలేరు, భవిష్యత్తు బంగారమవ్వాలంటే వస్తువే సమాధానం! ఇగోని భవిష్యత్తు వికర్షిస్తుంది, ఒకవేళ ఆకర్షిస్తే  అది తాత్కాలికమే.
-ఏజెన్సీస్