రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, సెప్టెంబర్ 2016, బుధవారం

నాటి సినిమా!




క రీడర్స్ డైజెస్ట్ జోకు వుంది-
        స్వర్గంలో దేవుడు సుఖాసీనుడై వుంటే సైంటిస్టు వచ్చాడు.
          ‘దేవుడు గారూ! మాకు మీ అవసరం తీరింది. ఇక మీరెళ్ళి పోవచ్చు. ప్రాణిని ఎలా సృష్టించవచ్చో కిటుకు మాకు తెలిసిపోయింది. అన్నిటికంటే బిగినింగ్ లో మీరేం చేశారో అది మేమూ చేయగలం’ అన్నాడు యమ సీరియస్ గా.
           ‘అలాగా?’ అని ఆసక్తిగా  చూశాడు దేవుడు.
          ‘ఔను. ఇంతమట్టిని ఉండలా చేసి ఫిగరొకటి తయారు చేస్తాం. అందులోకి ఉఫ్ ఫ్... మని ప్రాణాన్ని వూదేస్తాం. దట్సాల్, మనిషి తయార్. చూస్తారా?’
          ‘ఏదీ చూపించు నాయనా!’
          సైంటిస్టు ఉత్సాహంగా వంగి, మట్టిని తీయబోతున్నాడు. అది చూసి దేవుడు వెంటనే, ‘ఆగు నాయనా, ముందు నువ్వు తయారు చేసిన నీ మట్టేదో నువ్వు చూపించాలి కదా?’ అన్నాడు  నవ్వుతూ. ఈ మాటలకి గతుక్కుమన్నాడు సైంటిస్టు. జవాబు దొరక్క బుర్ర గోక్కో సాగాడు వెర్రివాడిలా...


       కాబట్టి ఏ మట్టి ఎవరి సొంతం? ఏ మట్టిని ఎవరు తయారుచేయగలరు?  ఏ సినిమా కథ మీద ఎవరికి హక్కులు? ఏ సినిమా కథ ఎవరు సొంతంగా తయారు చేయగలరు? పది పాత సినిమాల కలబోతే కొత్త సినిమా కథ. మోహన్ బాబు వచ్చేసి ప్రతిష్టాత్మకంగా తీసిన ‘పెదరాయుడు’, తాము రాసిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లాగే వుందని పరుచూరి బ్రదర్స్ వెళ్ళేసి ఈరోడ్ సుందర్ ( ‘పెదరాయుడు’ తమిళ మాతృక ‘నాట్టమాయి’ రచయిత) ని పట్టుకుంటే, అతడింకెన్ని  సినిమాల్లోంచి తీసుకుని  ఆ కథ రాశాడో తవ్వుకుంటూ పోతే ఎక్కడ తేలతాం...మట్టి తీసిన సైంటిస్టూ, కథలు తీసిన రచయితా ఒక్కటే. ఏ కథా ఎవ్వరి సొంతమూ కాదు! 

        ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఛాయలు ‘పెదరాయుడు’ లో చాలా కనిస్తాయి. వాటి పాయింట్లే వేర్వేరు, పాత్రలు మాత్రం అవే. హీరోల ద్విపాత్రాభినయాలు అవే. రెండిట్లో అన్నల పొరపాటు తీర్పులే. తమ్ముళ్ళకి అన్యాయపు బహిష్కరణలు, అన్నల భార్యల వేదనలు, వాళ్ళ మీదా బహిష్కరణల వేట్లూ,  అన్నల మీద ఎదుటి జమీందార్ల కుట్రలు కుహకాలూ, పూర్వీకుల బలిదానాలూ వగైరా వగైరా రెండిట్లో ఒకటే. తేడా అల్లా ‘పెదరాయుడు’ రామాయణాన్ని కలిపి చెబుతుంది- ఫలితంగా హుందాగా ఉదాత్తంగా కన్పిస్తుంది. 

          అన్న మాట కోసం తమ్ముడు త్యాగం చేయడంతోనే  ధర్మం నిలబడదు, అన్న కూడా తనవల్ల తమ్ముడికి హాని జరిగిందనుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకుని తనూ వెళ్లి పోయినప్పుడే ధర్మం నిలబడుతుంది. ఇది కూడా గుర్తు చేస్తుందీ గాథ. ‘పెదరాయుడు’ ... కలెక్షన్  కింగ్ మోహన్ బాబు బాక్సాఫీసు చరిత్రని తిరగరాసిన తమిళ రీమేకు. ఇది తన జీవితంలో మర్చిపోలేని అధ్యాయమంటాడాయన. ఇందులో తన పాపులర్  మేనరిజమ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు.  అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా లాంటి మాస్ ఊతపదాలు, వీర హీరోయిజాలతో భీకర రావాలూ లాంటి ఫార్ములా చేబదుళ్ళకి దూరంగా,  అర్ధవంతమైన సహజ పాత్ర పోషణ చేశారు.

        రీమేకుల రాజా రవిరాజా పినిశెట్టి  కూడా తన క్వాలిటీ  స్పృహని కోల్పోకుండా, ఉన్నత విలువలతో విషయాన్ని మనోజ్ఞంగా ప్రెజెంట్ చేశారు. మోహన్ బాబు సహా నటీ నటులందరూ ఆయా పాత్రల్లో అచ్చు గుద్దినట్టు ఒదిగిపోగా, ఆ కథంతా వచ్చేసి రవిరాజా గుప్పెట్లో ముఖమల్ వస్త్రంలా ముడుచుకుంది.  సన్నివేశాల కల్పనలో ఏమాత్రం కృత్రిమత్వానికీ పాల్పడకపోగా, వాటిలో ఏయే విభిన్న రసపోషణలు జరిగినా, అంతర్వాహినిగా ఒకే నిశబ్ద మెలోడీ అనుభవమయ్యేలా ఏక సూత్రత్వాన్ని అమలుచేశారు. దాని పేరే కథాత్మ. ఈ కథాత్మ, బలీయమైన అన్నదమ్ముల అనుబంధం వల్ల ప్రాణం పోసుకుంది. 

        పాత దర్శకుడు డాన్ లివింగ్ స్టన్ ‘ఫిలిం అండ్ ది డైరెక్టర్’ అని రాసిన పుస్తకంలో, ‘మూవ్ మెంట్’ అన్న విభాగంలో ఇలాగంటాడు- ‘కెమెరా మూవ్ మెంట్ ని ఇంటలిజెంట్ గా నిర్వహించడం  దర్శకుడి విజువల్ టెక్నిక్స్ లో ప్రథమ స్థానం వహించాలి. అప్పుడే అతను  ప్రేక్షకుల్ని చాలా ఈజ్ తో సినిమా చూసేట్టు చేసేయగలడు. పాత్రల వ్యక్తిత్వాల చిత్రణ సుబోధకం చేయగలడు. అంతే కాదు, ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూడ్ లోకి ఇట్టే తీసికెళ్ళి కట్టిపడెయ్యనూ గలడు- ‘ అని.  రవిరాజా దిగ్విజయంగా సాధించిందిదే : స్లో మూవ్ మెంట్స్ తో, కథా నడకలో ఒక లయని స్థాపించి, కథాత్మ (సోల్) ని పోషించడం!

       నిజ ప్రపంచంలో ఎక్కడెలా వున్నా,  కనీసం సినిమాల్లో చూపించే ఫ్యూడల్ వ్యవస్థకో నీతివుంటుంది. సినిమా జమీందార్లు బయట ఎలాటి తీర్పులు చెప్తారో, ఇంట్లో జరిగే తప్పులకీ తడుముకోకుండా అలాటి తీర్పులే చెప్పి పడేస్తారు. జమీందారీ వ్యవస్థ కాల గర్భంలో కలిసిపోవచ్చు-  ఇప్పుడు నయా జమీందార్లుగా వెలసిన కొందరు ఎమ్మెల్యేలు, ఏంపీలూ జమీందార్ల స్టయిల్లో ఇంట్లో జరిగే తప్పులకి తీర్పులేం చెప్పరు. కొడుకులో తమ్ముళ్లో పాత జమీందార్ల వారసుల పాత్రలు పోషిస్తూ ఏ అఘాయిత్యానికో పాల్పడితే. సదరు ప్రజాప్రతినిధి గారు తీర్పులు చెప్పరు గాక చెప్పరు- ఏకంగా కేసే లేకుండా మాయం చేసేస్తారు.

        వెండితెర జమీందార్లు ధర్మం తప్పరు. ‘తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒకటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం’ అంటూ ప్రాణం విడవడానికీ సిద్ధపడతారు. ఈ గాథలో పెద్ద జమీందారు పాత్రయిన రజనీ కాంత్ ఇలాగే చేస్తాడు. బావ చేతిలో వెన్ను పోటుకి గురైన పెద్ద జమీందారు రజనీ కాంత్. తమ్ముడు మోహన్ బాబు కి అన్న మాటే శిరోధార్యం. అందుకే, ‘నువ్వే పాపం చేయలేదని అన్నకి ఎందుకు చెప్పవు?’ అని భార్య సౌందర్య అడిగినప్పుడు –ఆయన అడగలేదు కాబట్టి చెప్పలేదంటాడు. ఆయన అడగంది ఏదీ తను చెప్పలేదనీ, ఆయన చెప్పంది  ఏదీ తను చేయలేదనీ అంటాడు.  ‘ఆరోజు రాముడు నేను అడవుల కెందుకెళ్లాలని ప్రశ్నించి వుంటే రామాయణం జరిగుండేది కాదు. తండ్రి మాటని గౌరవించి రాముడు అడవులకెళ్లాడు. తండ్రి కంటే గొప్పవాడైన అన్న మాటని గౌరవించి నేనిక్కడికొచ్చాను’ అంటాడు. 

         చూస్తే రామాయణంలో రఘువంశమంతా పాసివ్ క్యారక్టర్ల మయమే, కైకేయితప్ప. ఈమె యాక్టివ్ గా తన లక్ష్య దృష్టితో దశరధుడి మీద కోర్కెల బాణం విసరకపోతే, రామాయణమే లేదు. గాథల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యకపోతే పాసివ్ పాత్రలకి ఉనికే లేదు. ట్రాజడీల్లేవు. వాటి త్యాగాలూ గొప్పతనాలూ తేలవు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లో కృష్ణం రాజు పోషించిన రెండు పాత్రలకీ లక్ష్యం వుండదు. ఉన్న లక్ష్యమల్లా రావుగోపాల రావు ప్రతినాయక పాత్రకే వుంటుంది. అలాగే ‘పెదరాయుడు’ లోనూ మోహన్ బాబు రెండు పాత్రలూ డిటో. ఏదో ఒక టార్గెట్ వున్న వాడు విలన్ పాత్ర అనంత్ రాజ్ ఒక్కడే. 

        ఈ అనంత్ రాజ్ మేనమామ రజనీకాంత్ హయాంలో ఒక మనభంగం చేసి, రజనీ కాంత్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమెనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ఆ  తీర్పుకి తాళలేని అనంత్ రాజ్ తండ్రి చలపతి రావు, రజనీకాంత్ ని చంపేస్తాడు. చనిపోతూ  రజనీకాంత్,  ఈ ధిక్కారానికి మరో తీర్పు చెప్తాడు- తన బావ అయిన ఈ చలపతి రావు కుటుంబానికి 18 ఏళ్ళూ  సాంఘిక బహిష్కారం విధిస్తాడు. దీంతో ఎక్కడో అతిహీనంగా బతికిన అనంత్ రాజ్ ఆ శిక్షా కాలంపూర్తి కాగానే, రజనీకాంత్ తమ్ముడు మోహన్ బాబు మీద పగదీర్చుకోవడానికి వచ్చేస్తాడు. 

       ‘వెన్నెల’ సినిమా తీసిన ఎన్నారై దర్శకుడు కట్టా దేవ కౌషిక్ ఓ సిట్టింగ్ సందర్భంగా ఓ ముఖ్యమైన విషయాన్ని దృష్టికి తెచ్చారు. చాలా  సినిమాలు ఫ్లాపవడానికి సెకండాఫ్ లో రెండో పాట తర్వాత- క్లయిమాక్స్ కి ముందు - కథలో కొత్త మలుపు రాకపోవడమే కారణమని. తరచి చూస్తే, ఇది నిజమన్పించడానికి అనేక సినిమాలు కన్పిస్తాయి. అయితే, దాదాపు దశాబ్దంన్నర క్రితం తీసిన ‘పెదరాయుడు’ లో ఇలాటి తప్పు జరిగినట్టు కన్పించదు. పైగా దీనికి విరుగుడు కన్పిస్తుంది. మొదట్నించీ కథనంలో ప్రేక్షకులు ఏమాత్రం అనుమానించడానికి వీల్లేని విషయాన్ని క్లయిమాక్స్ కి ముందు ముందుకు లాగి- కథని కొత్త మలుపు తిప్పుతాడు విలన్ అనంత్ రాజ్! ఫస్టాఫ్ లో ఎందుకు జరిగిందో లాజిక్ కి అందక, గాల్లో వేలాడుతూ వుండిన టీచర్ పాత్ర ఆత్మహత్యా  ఘటన వెనుక అసలు కథ అనూహ్యంగా ఇప్పుడు వెలుగులోకి రావడంతో-  ఈ సినిమా క్లయిమాక్స్ కి కొత్త బలం వచ్చి అమాంతం పైకి లేస్తుంది. స్క్రీన్ ప్లే పరిభాషలో ఇలా అప్రధానంగా వుండిపోయి తర్వాత ప్లే అయ్యే టీచర్ పాత్ర ఆత్మహత్యా  ఘటనలాంటిది కావొచ్చు, లేక ఏదైనా క్లూ కావొచ్చు, ఇంకేదైనా వస్తువూ లేదా పాత్ర కావొచ్చు- ఈ ప్లాట్ డివైస్ ని ‘మెక్ గఫిన్’ అంటారు. 

        ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లే లెసన్. ఇందులో గోపీ- మోహన్ లు రాసిన బ్రహ్మానందం - బాబూ మోహన్ ల కామెడీ ట్రాకు కూడా కథాశిల్పంలో ఇమిడిపోయి కన్పిస్తుందే తప్ప- పక్క వాటుగా తెచ్చి అతికించినట్టుండదు. ముందే చెప్పుకున్నట్టు,  పాత్రలన్నీ ఒద్దికగా కన్పిస్తాయి. ప్రధానపాత్రలో మోహన్ బాబు హూందా తనం, రెండో పాత్రలో  వినయ విధేయాలు, భార్యల పాత్రల్లో భానుప్రియ, సౌందర్యల సౌమనస్యాలు, మేనత్త పాత్రలో జయంతి దైన్యం, పెద్ద జమీందారు పాత్రలో రజనీకాంత్ దర్పం ... ఇలా హృదయాల్ని తాకని పాత్రంటూ వుండదు. వీటికి జి. సత్యమూర్తి రాసిన మాటలు అంతే  ఉన్నతంగా వుంటాయి. 

        మోహన్ బాబు సినిమా అంటే తప్పకుండా ఓ జేసుదాస్ పాట! ఇక్కడ కూడా ‘కదిలే కాలమా’ అంటూ జేసుదాస్ తన కంఠాన్ని ఖంగుమన్పించాడు. సంగీత దర్శకుడు కోటి స్వరపర్చిన మిగతా మెలోడీ పాటలు కూడా కథ మూడ్ ని ఎలివేట్ చేసేట్టే వుంటాయి. 

        సౌభాతృత్వం అనే థీమ్ ని ఆలోచనాత్మకంగానూ, అంతే వినోదాద్మకంగానూ తెరమీద దృశ్యమానం చేసిన ‘పెదరాయుడు’ - రీమేక్ లో కూడా ఒరిజినల్ సోల్ ని తెచ్చి ధారాళంగా ప్రవహింపజేయవచ్చని నిరూపిస్తోంది.


-సికిందర్
(సెప్టెంబర్ 2009, ‘స్సాక్షి’)
http://www.cinemabazaar.in
       

 

       



12, సెప్టెంబర్ 2016, సోమవారం

సాంకేతికం :

      ఫిలిం  మేకింగ్ ఎలాంటి సంక్లిష్ట వ్యవహారమో మనకు తెలుసు. అన్ని శాఖల మీద సరైన  నియంత్రణ లేకపోతే చాలా సమస్య లెదురవుతాయి. ప్రతి పనికీ యంత్రపరికాల మీద ఆధారపడుతున్న దర్శకులు,  ఆ యంత్రపరికరాలతో పనిని సులభతరం చేసుకునే వీలుంటే అంతకంటే అదృష్టం వుండదు. అలాటి వీలు మరెక్కడో లేదు. చేతిలో వున్న ఐ పాడ్, ఐ ఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల లోనే వుంది. చేయాల్సిందల్లా ఆయా యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోవడమే. కాకపోతే కొంత ఖర్చవుతుంది. గూగుల్, ఇ ఫోన్ లు ఇటువంటి అనేక అప్లికేషన్స్ ని అందుబాటులోకి తెచ్చాయి. అటువంటి తొమ్మిది  యాప్స్ ఏమిటో ఈ క్రింద చూద్దాం:

1.వ్యూ ఫైండర్ యాప్స్

      ఆర్టెమిస్ డైరెక్టర్స్ వ్యూ ఫైండర్ : ఐ ఫోన్, ఐ పాడ్, ఆండ్రాయిడ్ డివైస్ లకు మాత్రమే, ధర: రూ. 1875.99, ఐ ట్యూన్స్ లేదా గూగుల్ డౌన్ లోడ్
        ఇది దర్శకులకి, ఛాయాగ్రాహకులకి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో వాడుతున్న కెమెరాని, లెన్స్ ని చూజ్ చేసుకుంటే, యాప్ వివిధ ఫోకల్ లెంత్స్ లో ఏ ఏ వ్యూస్ ని పొందవచ్చో చూపిస్తుంది. రిహార్సింగ్ చేస్తున్నప్పుడు, బ్లాకింగ్ చేస్తున్నప్పుడు ఈ యాప్స్ ఎంతో సహాయకారిగా వుంటుంది. 

        క్యాడ్రేజ్ :  ఐ ఫోన్
, ఐ పాడ్, ఆండ్రాయిడ్ డివైస్ లకు మాత్రమే,ధర : రూ. 590.00, ఐ       ట్యూన్స్ లేదా గూగుల్ డౌన్ లోడ్
        తక్కువ ధరలో ఇది ఆర్టెమిస్ కి ప్రత్యాన్మాయం. ఆర్టెమిస్ స్ లో వున్న సౌకర్యాలే ఇందులోనూ వున్నాయి, కాకపోతే ఫోటో కెమెరా ఫార్మాట్స్ కి, లెన్సులకీ కూడా అనువైనది.

2. క్లాపర్ యాప్స్

        డిజిటల్ క్లాపర్ : ఆండ్రాయిడ్ కి మాత్రమే, ధర : ఉచితం, గూగుల్ డౌన్ లోడ్ 
        సాధారణ క్లాప్ బోర్డులా పనిచేసే ఇది సౌండ్ ఎడిటర్ కోసం టైం స్నాప్ షాట్ ని క్రియేట్ చేస్తుంది. చిత్రీకరించిన షాట్స్ జాబితాని సేవ్ చేసుకోవచ్చు, ఎక్స్ పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో అదనం గా టైం కోడ్ జనరేటర్ కూడా వుంది. 

        మూవీ స్లేట్ : ఐ ఫోన్
, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : రూ. 1494.15, ఐ ట్యూన్స్ డౌన్        లోడ్
        ఈ టైం కోడెడ్ డిజిటల్ స్లేట్ లో అదనంగా ప్రొడక్షన్ పేరు
, దర్శకుడి పేరు వంటి మౌలిక సమాచారాన్ని యాడ్ చేఉకోవచ్చు. కెమెరా ఆప్టిక్ ఇన్ఫర్మేషన్ అయిన ఫైల్ నేమ్, నాయిజ్, ఉపయోగిస్తున్న ఎక్విప్ మెంట్ ఏ రకం,  మొదలైన వివరాల్ని  ఇందులో యాడ్ చేసుకోవచ్చు. 

3. స్క్రీన్ రైటింగ్ యాప్స్
        ఫెడ్ ఇన్ మొబైల్ : ఆండ్రాయిడ్ 2.2, అప్ / ఐ ఓ ఎస్ లకు మాత్రమే, ధర : ఉచితం,        గూగుల్, ఐ ట్యూన్స్ డౌన్ లోడ్ .
        రైటింగ్ కీ
, ఫార్మాటింగ్ కీ ఉపయోగపడే యాప్ ఇది. ఒక టచ్ తో సీన్లు, పాత్రలు, డైలాగులు మొదలైన వాటిని చూసుకోవచ్చు. పూర్తయిన స్క్రిప్టుని డ్రాప్ బాక్స్ కి ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు. పెయిడ్ వెర్షన్ లో అదనంగా డాక్యుమెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే రెండు మూడు స్క్రిప్టు ల్ని ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు. 

        స్క్రీన్ రైటర్: ఆండ్రాయిడ్ 1.5 డివైస్ కి మాత్రమే
, ధర : రూ. 54.37, గూగుల్ డౌన్ లోడ్
        ఇది స్టాండ్ ఎలోన్ యాప్, అంటే పిసి కంపానియన్  సాఫ్ట్వేర్ అవసరం వుండదు. రైటర్లు ఆలోచనలను రాసుకోవడానికి, రఫ్ ప్రతిని రాసుకోవడానికీ   ఉపయోగ పడే ఈ యాప్ నుంచి పూర్తయిన పాఠాన్ని పిసి కి అప్లోడ్ చేసుకోవచ్చు. సినాప్సిస్, క్యారక్టర్, లోకేషన్స్, సీన్స్ మొదలైన వాటిని సులభంగా ట్యాబింగ్ చేసుకునే సౌకర్యం ఇందులో వుంది. ఫైనల్ స్క్రిప్ట్ ని షేరింగ్ కి, ఎడిటింగ్ కీ సులభంగా ఈ మెయిల్ చేసుకోవచ్చు. 

        సెల్ టెక్స్  : ఆండ్రాయిడ్ 2.2
, ఐ ఫోన్,  ఐ పాడ్ లకు మాత్రమె,  ధర : ఉచితం,       గూగుల్,ఐ ట్యూన్స్ డౌన్ లోడ్.
        ఇది మార్కెట్ లో లభిస్తున్న పవర్ఫుల్ డెస్క్ టాప్ స్క్రీన్ రైటింగ్ ప్రోగ్రాంలలో ఒకటి. స్క్రీన్ ప్లే, స్టేజి ప్లే, కామిక్స్ వంటి ఆప్షన్స్ ఇందులో వున్నాయి. వీటిమీద వర్క్ చేసుకుంటూ కామెంట్స్ ని, నోట్స్ నీ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. స్క్రిప్ట్ ని  సులభంగా ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

4. కెమెరా అసిస్టెన్స్ యాప్స్

         పాకెట్ ఏసీ :  ఆండ్రాయిడ్ కి మాత్రమే, ధర : 644.80, గూగుల్ డౌన్ లోడ్
        కెమెరాఅసిస్టెంట్ లకు ఉపయోగపడే ఈ యాప్స్ లో వివిధ టూల్స్, క్యాలికులేటర్స్, రిఫరెన్సెస్ వున్నాయి. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్యాలికులేటర్, డిజిటల్ రన్ టైం క్యాలికులేటర్, కెమెరా స్పెక్స్ రిఫరెన్స్, ఫిలిం స్టాక్స్ రిఫరెన్స్, ఎక్స్ పోజర్, ఫీల్డ్ ఆఫ్ వ్యూ క్యాలికులేటర్, ఫోకస్, ఛార్ట్ ఇన్సర్ట్ స్లేట్, ఇంకా అనేకం ఇందులో వున్నాయి. 

        కోడక్ సినిమా టూల్స్ : ఆండ్రాయిడ్ 2.2
, ఐ ఫోన్స్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర :    ఉచితం, గూగుల్, ఐ ట్యూన్స్ డౌన్ లోడ్
        ఇందులో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్యాలికులేటర్, ఫిలిం క్యాలికులేటర్,  గ్లోసరీ వున్నాయి. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్యాలికులేటర్ ద్వారా ఫిలిం ఫార్మాట్, ఎఫ్ స్టాప్, సబ్జెక్ట్ డిస్టెన్స్,/ ఫోకల్ డిస్టెన్స్ మొదలైన సమాచారాన్ని చేర్చుకుంటే,  తీస్తున్న షాట్స్ వాస్తవ డెప్త్ ఎంతో తెలియ జేస్తుంది.

        షాట్ డిజైనర్ : ఆండ్రాయిడ్ 2.2
, ఐ ఫోన్స్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : ఉచితం, అప్       గ్రేడ్ వెర్షన్  : రూ. 1202. 00, గూగుల్ ఐ ట్యూన్స్ డౌన్ లోడ్
       
లైటింగ్, కెమెరా, బ్లాకింగ్ డయాగ్రమ్స్ కిది ఏకైక యాప్.ఇది సింపుల్ గావుండే  అతి పవర్ఫుల్ యాప్. 

5. లైటింగ్ యాప్స్ 
       సన్ స్కౌట్ : ఐ ఫోన్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : 597.00, ఐ ట్యూన్స్, ఆండ్రాయిడ్ కి    సన్ పొజిషన్
       
అవుట్ డోర్ లైటింగ్ వల్ల అవుట్ డో ర్ షాట్స్ ని సమన్వయపర్చడం కష్టమౌతుంది. లొకేషన్ లోవున్నప్పుడు సూర్యుడు ఏ సమయంలో ఎక్కడ ఉంటాడో ఈ యాప్స్ తెలియజేస్తుంది. ఫలానా టైం లో ఆ రోజే కాక, రానున్న రోజుల్లో సూర్యుడు ఎక్కడుంటాడో పొజిషన్ ని తెలియజేస్తుంది. స్మార్ట్ ఫోన్ లో వుండే కెమెరాని, కంపాస్ ని, జిపీస్ నీ ఉపయోగించుకుని ఇది సూర్యుడి పొజిషన్ ని ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. 

        లైట్ మీటర్  టూల్స్ : ఐ ఫోన్
, ఐ పాడ్ లకు మాత్రమమే,ధర : రూ. 178.77, గూగుల్  డౌన్ లోడ్
        ఈ యాప్  ఆండ్రాయిడ్ డివైస్ ని లైట్ మీటర్ గా మార్చేస్తుంది. డివైస్ లోని కెమెరాని ఉపయోగించుకుని స్పాట్ మీటరింగ్ ని
, డివైస్ లోని లైట్ సెన్సార్ నుపయోగించుకుని ఇన్సిడెంట్ మీటరింగ్ నీ నిర్ణయిస్తుంది.

ఇతర యాప్స్
         6. రోడ్ రెక్ : ఐఫోన్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : ఉచితం, ఐ ట్యూన్స్ డౌన్ లోడ్
        ఇది స్మార్ట్ ఫోన్ ని
48Khz సామర్ధ్యం గల ఫెల్డ్ రికార్డర్ గా మార్చుకుని పని చేస్తుంది. ఇది నేరుగా  AIFF, WAVE, AAC లకు రికార్డింగులు చేయగలదు. అంతే గాక, సౌండ్ క్లౌడ్, డ్రాప్ బాక్స్ లకు అనుసంధానం కాగలదు. 

        7.
హిచ్ కాక్ స్టోరీ బోర్డ్ కంపోజర్ : ఐ ఫోన్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : రూ. 920.00, ఐ ట్యూన్స్ డౌన్ లోడ్
        సొంతంగా స్టోరీ బోర్డ్ రూపొందించుకో లేని వారికి ఇది చక్కటి ప్రత్యాన్మాయం. 

        8. ప్రొడ్యూసర్ :
ఐ ఫోన్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : రూ. 896. 25, ఐట్యూన్స్ డౌన్ లోడ్
        ఇందులో వివిధ ప్రాజెక్టుల సమాచారాన్ని పొందు పరచుకో వచ్చు. విడివిడిగా ఒక్కో ప్రాజెక్టు ఆప్షన్ లో లోకేషన్స్
, తారాగణం, సిబ్బంది, బడ్జెట్ వివరాలను నమోదు చేసుకోవచ్చు. లోకేషన్స్ ని ఎంపిక చేసుకునే టప్పుడు ఇమేజెస్ తీసుకుని వాటిని ఆయా ప్రాజెక్ట్ ఆప్షన్స్ కి యాడ్ చేసుకోవచ్చు. సిబ్బంది అందరి కాల్ షీట్స్, షాట్ లిస్ట్స్,  స్క్రిప్ట్ రైట్ అన్నిటినీ  యాడ్ చేసుకుని రెడీ రిఫరెన్స్ గా ఉంచుకోవచ్చు.

        9.రిమోట్ ప్రాంప్టర్ : ఆండ్రాయిడ్ 2.2 కి మాత్రమే. ధర : ఉచితం
, గూగుల్ డౌన్ లోడ్
        ఇది నటులు డైలాగులను గుర్తుపెట్టుకునే టెలీ ప్రాంప్టర్ టూల్. ఇది వైర్లెస్ గా పనిచేస్తుంది. స్క్రోలింగ్ స్పీడు, ఫాంట్ సైజ్, కలర్ మొదలైన వాటిని వైర్లెస్ గానే కంట్రోల్ చేయవచ్చు. కొత్తనటీ నటు లకి, రిహార్శల్స్ కి బాగా ఉపయోగపడుతుంది.          

   ***                      





10, సెప్టెంబర్ 2016, శనివారం

స్క్రీన్ ప్లే సంగతులు-2

   




    కథల్లోలాగా ఒక ఆసక్తికర ప్రధాన సమస్య చుట్టూ పరిష్కారాన్ని పొందే సంఘర్షణగా కాక, కేవలం కొన్ని సంఘటనల కూర్పు మాత్రంగా సాగే ‘గాథ’ లాగా,  ‘గ్యారేజ్’ లో విషయం ఇలా వుంటుంది : 
   1980 లలో స్వగ్రామంలో మెకానిక్ గా పనిచేస్తూ తమ్ముడు శివ(రెహమాన్) ఉన్నత చదువుకీ, ఆపై ఉద్యోగానికీ తోడ్పడ్డ సత్యం (మోహన్ లాల్), అదే తమ్ముడి ప్రోద్బలంతో హైదరాబాద్ వచ్చి జనతా గ్యారేజ్ అనే అన్ని రకాల వాహనాలని మరమ్మత్తు చేసే కేంద్రాన్ని నెలకొల్పుతాడు. పేదల పక్షపాతికూడా  అయిన సత్యం మరోవైపు గ్యారేజీలో పనిచేసే బోసు ( అజయ్), నాగరాజు (బ్రహ్మాజీ), సైదులు (బెనర్జీ పోషించిన ఈ పాత్ర పేరు సైదులు నల్లగొండ జిల్లాలో వుండే పేరు?) అనే వాళ్ళ బృందంతో  పేదల సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఒక బలమైన శక్తిగా ఎదిగి, అక్రమాలు చేసే బడా బిజినెస్ మాన్ ముఖేష్ రాణా ( సచిన్ ఖెడేకర్) కి కంటగింపుగా మారతాడు. ఒక రేప్ అండ్ మర్డర్ కేసుని యాక్సిడెంట్ గా చిత్రించి తప్పించుకున్న రాణా తమ్ముడూ అతడి ఫ్రెండ్స్ మీద చర్య తీసుకోవాలని పోలీసు అధికారి చంద్ర శేఖర్ (సాయి కుమార్) ని కోరతాడు సత్యం. చంద్రశేఖర్ సత్యం తమ్ముడు శివతో పాటు చదువుకున్న వాడే. అయినా సత్యం మాటల్ని పట్టించుకోడు. దీంతో సత్యం తనే రంగంలోకి దిగి ఆ రేపిస్టులు నల్గుర్నీ యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. దీంతో రాణా పగబట్టి సత్యం తమ్ముడు  శివనీ, అతడి భార్యనీ చంపించేస్తాడు. వాళ్ళ కొడుకు ఆనంద్ అనాధ అవుతాడు. ముంబాయి నుంచి వాడి మామయ్య (సురేష్) వచ్చి, మేనల్లుడు ఆనంద్ ని ఈ వాతావరణంలోంచి దూరంగా తనతో తీసుకెళ్ళి పోతాడు సత్యం కోరిక మీద. వాడి తల్లిదండ్రులు ఎలా మరణించారో కూడా వాడికి తెలియనివ్వ కూడదని మాట తీసుకుంటాడు సత్యం.

       పాతికేళ్ళూ గడిచిపోతాయి. ముంబాయిలో ఆనంద్ (ఎన్టీఆర్) ఒక యువశక్తిగా ఎదుగుతాడు. మామయ్య, అత్త, మరదలు బుజ్జి (సమంతా)లతో కలిసి వుంటూ, ప్రకృతిని ప్రేమించే పర్యావరణ కార్యకర్తగా, పరిశోధకుడుగా బిజీగా ఉంటాడు. పనీపాటా లేని బుజ్జి ఇతణ్ణి ప్రేమిస్తూంటుంది. బయట ఆనంద్ జనాలకి మొక్కల పెంపకం గురించి, ప్లాస్టిక్ బ్యాగుల వాడకం గురించీ అవగాహన కల్పిస్తూంటాడు. ఇలాటి ఒక సందర్భంలో ఒకమ్మాయి (నిత్యా మీనన్) పరిచయమవుతుంది. ఈమె హైదరాబాద్ లో పోలీసు అధికారి చంద్ర శేఖర్ కూతురు. ముంబాయిలోనే ఆనంద్ ఒక పార్కు పరిశ్రమగా మారడాన్ని అడ్డుకుంటాడు. ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోతాడు. ఆనంద్ శ్రేయోభిలాషి వచ్చి ఆనంద్ మామయ్యని హెచ్చరిస్తాడు- ఎమ్మెల్యే మనుషులు ఆనంద్ కి హాని తలపెట్ట బోతున్నారనీ, ఆనంద్ ని ఇక్కడ్నించీ దూరంగా పంపించెయ్యాలనీ. కానీ హైదరాబాద్ హైదరాబాద్ వెళ్లేందుకు ఆనంద్ నిరాకరిస్తాడు.

     ఇప్పుడు హైదరాబాద్ లో సత్యం అదే గ్యారేజ్ నడుపుతూ అదే పేదల పాలిట దేవుడిగా కంటిన్యూ అవుతూంటాడు. రాణాతో వైరం అలాగే వుంటుంది. సత్యంకి ఇంట్లో భార్యా కొడుకూ వుంటారు. కొడుకు రాఘవ (ఉన్ని ముకుందన్) కి తండ్రి చేసే పనులు నచ్చవు. అతను  రాణా కూతుర్ని ప్రేమిస్తూంటాడు. సీఎంతో సన్నిహితంగా వుండే రాణా, ఓ పేదల బస్తీ మీద కన్నేసి దాన్ని ఆక్రమించాలని చూస్తాడు. సత్యం అడ్డుకుంటాడు. సత్యం కి యాక్సిడెంట్ జరిపిస్తాడు రాణా. బతికి బయట పడ్డ రాణాకి గుండె సమస్య వుందని, అతను గ్యారేజీ కార్యకలాపకి దూరంగా వుండాలనీ డాక్టర్ చెప్తాడు. ప్రజలకి దూరంగా ఎలా వుండనని ఆక్రోశిస్తాడు సత్యం. కష్టాలతో ప్రజలు వచ్చి నిరాశపడి తిరిగి వెళ్లి పోతూంటారు. రాణా వచ్చి తన కూతురితో పెళ్లి సంబంధం కలుపు కుంటాడు. కొడుకుని కాదనలేక ఆ సంబంధం ఒప్పుకుంటాడు సత్యం. రాఘవని అల్లుడిగా చేసుకున్న రాణా,  ఇక రెచ్చిపోతాడు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ మైనింగ్ పనులు రాఘవకి అప్పజెప్తాడు. ఇది ముంబాయిలో వున్న ఆనంద్ కి తెలుస్తుంది. వెంటనే వచ్చేసి మైనింగ్ ని అడ్డుకుని రాఘవకి బుద్ధి చెప్తాడు. రాఘవని ఆపలేని సత్యం ఇందుకు సంతోషించి, ఆనంద్ ని రప్పించుకుంటాడు. గ్యారేజ్ వ్యవహారాలు, సత్యం పరిస్థితీ తెలుసుకున్న ఆనంద్, సత్యం బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించి- బాధిత పేదలకి సాయం చేసేందుకు తిరిగి గ్యారేజీ ద్వారాలు తెరుస్తాడు...

        ఇప్పుడు రాణా ఈసారి ఆస్పత్రి నిర్మాణంతో తెర మీదికొస్తాడు. దాని అక్రమ పర్మిషన్ కి మున్సిపల్ ఉద్యోగి (రాజీవ్ కనకాల) ని వేధిస్తాడు. ఆనంద్ వెళ్లి ఆ గూండాలకి బుద్ధిచెప్పి, రాణా అక్రమాన్ని ఆపుతాడు. భార్యతో ఇంట్లోనే వుంటున్న రాఘవకి ఆనంద్ అంటే పడదు. ఓ అర్ధరాత్రి భార్యతో తాగి  వచ్చినందుకు వారిస్తాడు ఆనంద్. ఆ గొడవలో భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు రాఘవ. గ్యారేజీ వర్కర్ బోసు భర్త లేని ఒకావిణ్ణి ప్రేమిస్తూంటాడు. ఆనంద్, సత్యంలు వెళ్లి ఆ పెళ్లి జరిపిస్తారు. అటు కూతురితో ఆనంద్ పెళ్లి చేయాలనుకుని ఆనంద్ మామయ్యా అత్తా వస్తారు. వస్తే ఆనంద్ సత్యం దగ్గరే వుంటున్నాడని తెలుస్తుంది. దీంతో తామిద్దరెవరెవరో పరస్పరం తెలుస్తుంది ఆనంద్, సత్యంలకి. ఐతే ఈ ఇంట్లో ఒకసారి తన చెల్లెల్ని ఇచ్చి పోగొట్టుకున్నానని, ఇప్పుడు కూతుర్ని కూడా ఇచ్చి పోగొట్టుకోలేనని ఆనంద్ మామయ్య చెప్పేస్తాడు. ఆనంద్ కి బుజ్జి కావాలంటే తమతో వచ్చెయ్యాలని, లేదూ పెదనాన్న సత్యమే కావాలంటే బుజ్జిని వదులుకోవాలనీ  కండిషన్ పెడతాడు. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకి లోనైన ఆనంద్ బుజ్జినే వదులుకుంటాడు.

        అటు రాణాకి సీఎంతో తేడా వస్తుంది. ఏం చెయ్యాలో పాలుపోదు. సీఎం వ్యతిరేకి ఒకడు (ఆశీష్ విద్యార్థి) ఒక ఐడియా ఇస్తాడు. సీఎంని గద్దె దింపి తను సీఎం అయితే రాణా పనులన్నీ జరుగుతాయని. అందుకు బాంబు దాడులు జరపాలని ప్లాన్ ఇస్తాడు. అల్లుడు రాఘవతో కలిసి రాణా నగరంలో బాంబు దాడులు జరుపుతాడు. ఎంతోమంది చనిపోతారు. గ్యారేజీ వర్కర్ బోసు భార్య కూడా చనిపోతుంది. ఇంకోసారి కూడా దాడులు జరపాలని ప్లానేస్తూంటారు. అంతలో బోసు రైలుపట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.          పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ ఆ బాంబు దాడుల వెనుక తెలిసిన వాళ్ళ కుట్రే వుందని డిజిపితో వాదిస్తాడు. డిజిపి ఒప్పుకోడు. చంద్రశేఖర్ వచ్చి గ్యారేజీ తలుపులు తడతాడు. తను చేయలేకపోతున్న పనిని ఆనంద్, సత్యంలు పూర్తి చేయాలనీ విన్నవించు కుంటాడు. ఆనంద్ కి ఒక లారీ డ్రైవర్ ద్వారా బోసు అనుమానపు పోకడ తెలుస్తుంది. దాన్ని పట్టుకునిపోతే, ఒక బాంబుల తయారీ డెన్ తెలుస్తుంది. ఈ డెన్ తెలుసుకున్నాడనే, రాఘవ బోసు ని చంపి రైలు పట్టాల మీద పడేశాడన్న మాట. ఇంట్లో గంభీర వాతావరణం తలెత్తుతుంది. ఇలాటి కొడుకు రాఘవని చంపెయ్యాలనే తీర్పు చెప్తాడు సత్యం. తనే కొడుకుని చంపేస్తాడు. అక్కడే వున్న రాణాని ఆనంద్ చంపేస్తాడు. సమాప్తం.

గాథకి స్క్రీన్ ప్లే?

        ది కథలా వుందా? వుంటే ఎక్కడెక్కడ  ప్లాట్ పాయింట్స్ వున్నాయి? ఎక్కడ ప్రాబ్లం సెటప్ అయింది? ఎక్కడ్నించి ఎక్కడిదాకా బిగినింగ్, ఎక్కడ్నించి ఎక్కడి దాకా మిడిల్, ఎక్కడ్నించీ ఎక్కడి దాకా ఎండ్ ఇందులో వున్నాయి?  గుర్తు పట్టగలమా? మిడిల్, ఎండ్ వుండాలంటే బిగినింగ్ ముగియాలి కదా? బిగినింగ్ ఎప్పుడు ముగుస్తుంది? కథ ప్రారంభమైనప్పుడు. కథ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రాబ్లం సెటప్ అయినప్పుడు. పైన చెప్పుకున్న విషయంలో బిగినింగ్ ఎక్కడ ముగిసింది, ఇంటర్వెల్లో ముంబాయి నుంచి ఆనంద్ వచ్చి మైనింగ్ ని అడ్డుకుని సత్యంని మొట్ట మొదటిసారిగా కలిసినప్పుడా? కలిసినప్పుడు ఏ ప్రాబ్లం సెటప్ అయ్యింది? ఇలాటివి సహించనని ఆనంద్ చెప్పి వెళ్ళాడు, ఎవరితో? సత్యంతో. సత్యం ఎవరు?ఆనంద్ చేసిన పనికి (మైనింగ్ ని అడ్డుకోవడం) ఇంప్రెస్ అయిన పాజిటివ్ క్యారక్టర్. పాజిటివ్ క్యారక్టర్ తో ప్రాబ్లం సెటప్ అవుతుందా? అవదు కదా, నెగెటివ్ క్యారక్టర్ తో అవుతుంది. 

        కాబట్టి ఇక్కడ కూడా, అంటే ఇంటర్వెల్ దగ్గర కూడా, ప్రాబ్లం సెటప్ అయి బిగినింగ్ ముగియలేదు; అంటే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడలేదు. అంటే కథ ప్రారంభంకాలేదు. ఇంటర్వెల్ అర్ధోక్తిలో, విషయమేమిటో తేల్చకుండా పడింది- ‘హోరాహోరీ’ లో లాగా, ‘కిక్-2’ లో లాగా.   

        ఇలా కాక, ఒకవేళ ఇంటర్వెల్ లోపే ఎక్కడైనా కథ ప్రారంభమయ్యిందా? ముంబాయి నుంచి ఆనంద్ రాక ముందు- ఇంటర్వెల్ లోపే ఇటు సత్యంకి - విలన్ రాణాకీ మధ్య ప్లాట్ పాయింట్ వన్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య కథ ఏమైనా ప్రారంభమయ్యిందా? పాతికేళ్ళ నుంచీ వాళ్ళ మధ్య తగాదాలు తెమలడమే లేదు. ఎప్పుడో 1980లలో ప్రారంభమైన వాళ్ళిద్దరి మధ్య వైరం పాతికేళ్ళయినా కొలిక్కి రాకుండా నాన్చుడు గానే వుంది తప్ప కొత్త డెవలప్ మెంట్ ఏమైనా వుందా? ఆనంద్ వచ్చే ముందు, ఫస్టాఫ్ లో రాణా నుంచి సత్యం ఎదుర్కొన్న సమస్యలేమిటి- పేదల బస్తీ ఆక్రమణ, తన మీద హత్యా యత్నం, అక్రమ మైనింగ్. ఈ మూడిట్లో  ఏవొక్క దాని  దగ్గరైనా కథనం ఆగి, ఇదిగో ఈ పాయింటుతో బిగినింగ్ ముగిస్తున్నాం, ప్లాట్ పాయిట్ వన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం,  ఇలా కథ ప్రారంభిస్తున్నాం, సంఘర్షణ  మొదలెడుతున్నాం, కథకి కేంద్ర బిందువు ఇదే అన్నట్టుందా?

        కాబట్టి  ఇటు సత్యం - విలన్ ల పరంగానూ, లేదా అటు ఆనంద్- సత్యంల పరంగానూ, ఇంకా లేదా ఆనంద్- విలన్ ల పరంగానూ  ఫస్టాఫ్ లో పాయింటు లేదు. సెకండాఫ్ లో విలన్ మళ్ళీ ఆస్పత్రి వ్యవహారం అంటూ మొదలెట్టాడు- దీనిదగ్గరైనా ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందా? రాలేదు, ఆస్పత్రి గొడవ కూడా కథకి కేంద్ర బిందువు కాలేదు. క్లయిమాక్స్ లో విలన్ మళ్ళీ ఇంకొక కుట్ర ఎత్తుకున్నాడు- బాంబు దాడులంటూ. ఇలా ఒకటి కాదు, దేని దగ్గరా ఆగడు, ఎక్కడా జండా పాతి జమాయించి కూర్చోడు విలన్ రాణా అనే వాడు. ఇదిగో ఈ కథకి హీరోని నేనేనండోయ్ అని విలన్ గనుక తెగ ఫీలై పోకపోతే ఆ స్క్రీన్ ప్లే  అచ్చంగా చచ్చుబడి పోతుందని -
Your Screenplay Sucks! -  అన్నపుస్తకంలో విలియం ఎకర్స్ హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తూ పుస్తకాలు రాస్తాడు, పనిలేకా?

        పోనీ, ఫైనల్ గా వచ్చిన ఈ బాంబు దాడులే ప్లాట్ పాయింట్ వన్ అనుకుందామానుకుంటే క్లయిమాక్స్ లో ఎక్కడైనా ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుందా? ఆఫ్ కోర్స్, ఒకప్పుడు  ఏర్పడేవి. పదిహేనేళ్ళ క్రితం యూత్ సినిమాల ట్రెండ్ లో  ‘మిడిల్ మటాష్’ అనే మనం పేరెట్టిన కథలొచ్చేవి. క్లయిమాక్స్ దగ్గర  ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, అప్పుడు మాత్రమే మిడిల్లో పడేది కథ! అయిదు నిమిషాల్లో ఆ మిడిల్ కాస్తా ముగిసి ఎండ్ ప్రారంభమయ్యేది! 

        కనుక ‘గ్యారేజ్’ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ కూడా కాదు. ఇక్కడ జాగ్రత్తగా తేడా గుర్తించాలి. మిడిల్ మటాష్ అంటే, కథనంలో మరెక్కడా పాత్రల మధ్య  ఇంకే సమస్యా పుట్టకుండా, కేవలం క్లయిమాక్స్ దగ్గరే ఆ చెప్పాలనుకున్న ఒకే సమస్య పుడుతుంది.  అప్పుడది ఆలస్యమైపోయిన ప్లాట్ పాయింట్ వన్ అన్పించుకుంటుంది. ఆలస్యపు పెళ్లి హాస్యంగా ఉన్నట్టే ఇలాటి స్క్రీన్ ప్లేలు కూడా వెక్కిరింతగా ఉండేవి. పైన చెప్పుకున్న ప్రేమ సినిమాల ట్రెండ్ లో ఇలాగే ఉండేవి. 

      ‘గ్యారేజ్’ లో ఇలా కాదు, అడుగడుగునా సమస్యలు పుడుతూ పోతాయి క్లయిమాక్స్ వరకూ- ఒక కేంద్రబిందువైన సమస్యంటూ లేకుండా! ఒక కేంద్రబిందువైన సమస్య వుండి, దాంతో పోరాట ఫలితంగా అందులోంచి పుట్టే పిల్ల సమస్యలు ఉంటాయే తప్ప- కేంద్రబిందువైన ఒక ప్రధాన సమస్య లేకుండా- ‘గ్యారేజ్’ లాంటి కథనాల్లో లాగా విడివిడి సమస్య లుండవు. విడివిడి సమస్యలతో కథ వుండదు, స్క్రీన్ ప్లే వుండదు. స్క్రీన్ ప్లే అంటే మూడంకాలు, ఒక కేంద్ర బిందువు, అంతే.  కేంద్ర బిందువూ దాంతో బాటు అంకాలూ అటూ ఇటూ జరగవచ్చు;  కానీ ఇవంటూ వుంటాయి కథకి, దాని స్క్రీన్ ప్లేకి.  గాథలకే ఇవి వండవు. ఆ మాటకొస్తే గాథలకి అసలు స్క్రీన్ ప్లేనే వుండదు, కుదరదు కూడా. స్క్రీన్ ప్లేలో గాథల్ని కూర్చలేరు. స్క్రీన్ కి (వెండి తెరకి) పనికి రాని విషయానికి స్క్రీన్ ప్లేనే ఉండదు. కాబట్టి గాథలు రాసుకుని దానికి  స్క్రీన్ ప్లే అని పేరేసుకోవడం కామెడీ అవుతుంది. 

        కనుక ‘గ్యారేజ్’ ది కథ కాదు, గాథ అని నిరూపణ అవుతోంది. గాథలతో ఎలాటి భ్రాంతిలో వుంటామంటే,  మనం చూస్తున్నది కథ కాదు, గాథ అని చాలా సేపటి వరకూ పసిగట్టలేం. ఇంటర్వెల్లోనూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడకపోతే సెకండాఫ్ లో పెట్టి అప్పుడు మొదలేదతాడేమో చూద్దాం అనుకుంటాం. మిడిల్ మటాష్ కి లాగా క్లయిమాక్స్ లోనూ ప్లాట్ పాయింట్ రాకపోతే, అప్పుడర్ధ మవుతుంది- మనం క్లయిమాక్స్ దాకా చూస్తూ కూర్చుని టైం వేస్ట్ చేసుకుంది కథతో  కాదూ గాథతో  అని- మోసపోయామనీ! ఇది జనరల్ ఆడియెన్స్ కీ తెలీక, సినిమాలు తీసే వాళ్లకీ తెలీక తెగ ఆడేస్తూంటాయి సినిమాలు కాని  సినిమాలు- అటూ ఇటూ తెలుగునాట, ఇంకా అటు ఓవర్సీస్ లో వుండే కొద్ది శాతం  మనలాంటి వాళ్ళం తెల్లబోయి చూస్తూంటాం!

పాయింటేంటి?
       పోనీ, ఇదంతా వదిలేద్దాం- అసలు ‘గ్యారేజ్’ పాయింటేంటి? చెప్పాలనుకున్న దేంటి? దేనిగురించి? కాన్సెప్ట్ ఏంటి?  పర్యావరణం గురించా, పేద బాధితుల గురించా, లేకపోతే కుటుంబం గురించా? కుటుంబం గురించే ఎక్కువ కన్పిస్తుంది. సినిమా ప్రారంభంలో  ‘ఇది ఒక కుటుంబ కథ’ అనే వేశారు. మరైతే కుటుంబ కథ ఇలాగా చెప్పడం? కుటుంబ కథలో కుటుంబానికి ఎదురైన సమస్యేమిటి? మరుగున వుండి బయటపడ్డ ఆనంద్- సత్యంల బంధుత్వమా? ఆనంద్ - బుజ్జిల పెళ్లి సమస్యా? చెడ్డ కొడుకు రాఘవ సమస్యా? వీటిలో ఏ ఒక్కటి పరిష్కారమైంది? ‘ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును’ అన్నాక,   ఆనంద్- బుజ్జిల పెళ్లి  సమస్యని ఎందుకు రిపేరు చేయలేకపోయారు? చెడ్డ కొడుకు రాఘవని మంచి కొడుకుగా ఎందుకు మార్చలేకపోయారు? రిపేరు చేయడమంటే కొడుకుని చంపడమా? ఇది కుటుంబ కథే అయితే దీని ద్వారా చెప్పిందేమిటి? చెడ్డ కొడుకు విలన్ కి అల్లుడవడం, చెడ్డ కొడుకు విలన్ పక్షం వహించి తల్లిదండ్రుల్ని బాధించడం, కుట్రలు చేయడం; పెద్దాయనకి తనతో ఉంటున్న హీరో చిన్నప్పటి ఫలానా తన బంధువేనని రివీల్ అవడం, పెద్దాయన కోసం హీరో మరదల్ని త్యాగం చేయడం - ఇవెంత పాత రొటీన్, ప్రాక్టికల్ గా నేటి ప్రేక్షకుల అనుభవంలోకి రాని మెలోడ్రామాలు! కుటుంబ కథని నేటి కాలమాన పరిస్థితుల్లో పెట్టి  కొత్తగా చెప్పాల్సింది. కుటుంబ కథ అనగానే  పాత సినిమాల్లోంచి అవే అరిగిపోయిన డ్రామాల్ని దిగుమతి చేయకుండా, సొంత పరిజ్ఞానంతో స్వయంగా సృష్టించుకుంటే పరువు ప్రతిష్ట లేమీ మాయమై పోవుగా?

        ‘గ్యారేజ్’ బిజినెస్ కొస్తే, ఇది ‘సర్కార్’,  ‘రౌడీ’,  ‘గాడ్ ఫాదర్’  ల మిక్చర్ లా వుంటుంది. ‘సర్కార్’ లో లాగే ప్రారంభ దృశ్యాల్లో ఒక రేప్  అండ్ మర్డర్, దాంతో సత్యం వెళ్లి  దుష్టుల్ని శిక్షించడం జరుగుతాయి! శ్రీకాంత్ నటించిన, ఈవారం విడుదలైన ‘మెంటల్’ లోనూ ఇలాటి మాస్ కాపీయింగ్ దృశ్యాలే వచ్చేశాయి... ‘సర్కార్’ లో అయినా ‘గాడ్ ఫాదర్’ లోనైనా, పెద్దాయన మంచాన పడో మరణించో ఆయన కొడుకు బాధ్యతలు తీసుకుంటాడు. ‘గాడ్ ఫాదర్’ లో పెద్దాయన  కొడుకైన హీరో ఆ బిజినెస్ పట్ల వైముఖ్యంతో వుంటాడు. అలాంటి వాడు గుండె పోటుతో పెద్దాయన పోవడంతో,  మాఫియా బిజినెస్ బాధ్యతలు తీసుకోక తప్పదతడికి. పాత్రచిత్రణ పరంగా ఇక్కడ గుర్తించాల్సిన ప్రవర్తన ఒకటుంది : హీరో సైన్యం లో పని చేసిన అనుభవంతో సమస్య మూలాల్ని తొలగించకుండా, పైపైన సమస్యకి ప్రతిరూపాలుగా వున్న వాళ్ళని కాల్చి చంపుతూంటాడు. మన ప్రభుత్వాలు చేసే పని ఇదేగా? హీరో కూడా ఒకప్పటి ప్రభుత్వోద్యోగియే. దటీజ్ క్యారక్టరైజేషన్.

        ‘సర్కార్’ లో పెద్దాయన హత్యానేరం మీద జైలు కెళ్ళడంతో కొడుకు బాధ్యతలు తీసుకుంటాడు. తర్వాత పెద్దాయన మంచాన పడతాడు. అంటే ఇక్కడేం అర్ధం జేసుకోవాలంటే, వయసులో భారీ వ్యత్యాసమున్న రెండు ప్రధాన పాజిటివ్ పాత్రలు, విలన్ కి వ్యతిరేకంగా వుంటే, వాటిలో పెద్ద పాజిటివ్ పాత్ర  పిక్చర్లోంచి తప్పుకోవడమో (గాడ్ గాదర్), లేదా ఇన్వాలిడ్ అవడమో (సర్కార్) జరగాలి. చిన్న పాజిటివ్ పాత్ర – అంటే హీరో- ఒక్కడే విలన్ అంతు చూడాలి. అప్పుడే అది కమర్షియల్ సినిమా రూలు. 

        ‘గ్యారేజ్’ లో ఇదే జరిగింది. కాకపోతే వేరే రూటులో. ఇక్కడ చిన్న పాజిటివ్ పాత్ర ఆనంద్ వచ్చి, పెద్ద పాజిటివ్ పాత్ర  సత్యంతో చేతులు కలిపాడు. గాడ్ ఫాదర్ కి లాగే సత్యం మీద హత్యాయత్నం జరిగి గుండె బలహీన పడ్డా చావలేదు. చస్తే మలయాళంలో మోహన్ లాల్ ని చూపించడానికేమీ వుండదు. పోనీ ‘సర్కార్’ లోలాగా మంచాన కూడా పడలేదు. అలా కూడా మలయాళ సోదరులకి చూపించలేరు. ఈ సమస్యని మనం అర్ధం జేసుకోగలం. అప్పుడేం చేయాలి? చేయాల్సిందంతా కాన్సెప్ట్ లోనే దాగి వుంది- చేయాలన్పిస్తే. 

        ఆనంద్- సత్యంలని పరస్పరం శత్రువుల్లా మార్చెయ్యాలి. ఇది కాన్సెప్ట్ డిమాండ్ చేస్తోంది- కాన్సెప్ట్ పట్ల నిజాయితీతో వుంటే. కాన్సెప్ట్ ని కుటుంబ కథ అనో ఇంకేదో అనో స్పష్టత లేని పలాయన వాదంతో నిర్వచించుకోకుండా- తమిళ దర్శకులు, స్టార్లు చూపించే తెగువ ప్రదర్శించ గల్గితే -కమర్షియల్ గానే విషయాన్ని పాత చింతకాయ మూస నుంచి ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి 
స్థాపించుకోగల్గితే – అన్ని స్క్రిప్టింగ్ లోపాలూ సమసిపోగలవు- గాథ అనే పెద్ద గుదిబండ సహా!

        వీళ్ళిద్దరూ శత్రువులైతే  మరి విలన్ ఏం చేస్తాడనొచ్చు. ఇప్పుడు విలన్ వుండి  కూడా ఏం చేశాడు- కాసేపు అది కావాలంటాడు, కాసేపు ఇది కావాలంటాడు, అదీ ఇదీ కాకపోతే బాంబులు పేల్చుకుంటాడు! సినిమా క్లయిమక్స్ ని ఎలా తెచ్చి బ్యాడ్ గా అతికించారో అలాగే అంత సడెన్ గానూ  ఎండ్ అయ్యింది సినిమా. ఇదంతా కాన్సెప్ట్ పట్ల నిబద్ధత లేకపోవడం వల్లే.

హీరో లక్ష్యమే కాన్సెప్ట్!
      కమర్షియల్ సినిమాల్లో హీరో పాత్రల  కొనసాగింపు రెండు రకాలుగా వుంటుంది : హీరోకి ఏదైనా స్పెషల్ ఇంటరెస్ట్ వుంటే ప్రారంభంలో ఒకటి రెండు సీన్లలో చూపించి దాన్ని కట్ చేసి అనుకున్న కథలోకి పంపించెయ్యడం; స్పెషల్ ఇంటరెస్ట్ తోనే ఫస్టాఫ్ అంతా హీరోని చూపించుకొస్తే, దాన్నే కంటిన్యూ చేసి సెకండాఫ్ కూడా దాన్నాధారంగానే నడపడం, అదే కథవడం. 

        ‘గ్యారేజ్’ లో ఆనంద్ ఇంటరెస్ట్ అంతా పర్యావరణం గురించే. ఈ ఇంటరెస్ట్ ని ఏదో ‘టాగూర్’ లో సంఘసేవికగా శ్రియని పరిచయం చేసినట్టు, లేదా ‘టెంపర్’ లో జంతు ప్రేమికురాలిగా కాజల్ ని పరిచయం చేసినట్టు, ఆ కార్యకలాపాల్ని రెండు మూడు సీన్లకే పరిమితం చేసి వదిలేసినట్టూ - ఆనంద్ ని కూడా పర్యావరణం అనే ఇంటరెస్ట్ తో అలా పరిచయం చేసి వదిలేస్తే అది వేరు- అప్పుడది పైన  చెప్పుకున్న ఒకటో రకం హీరో పాత్ర కొనసాగింపు అయ్యేది.

        కానీ అలా చెయ్యలేదు. రెండో రకం హీరో పాత్ర కొనసాగింపు చేశారు. అంటే ఫస్టాఫ్ లో ముంబాయిలో అతడి జీవితాన్ని పర్యావరణమే ప్రాణంగా చూపించుకొచ్చారు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ అతడి ఎవేర్నెస్ పాఠాలు, పార్కు విషయంలో అతడి తిరుగుబాటు కూడా చూపించి, మొక్కల్ని ప్రేమించే అతడి ఇంటరెస్టే వినూత్నంగా అతడి లక్ష్యంగా డ్రైవ్ చేశారు ముంబాయిలో అతడి పాత్రని మొత్తం. అంటే ఇంటరెస్ట్ కాస్తా కథకి పూర్తి స్థాయి లక్ష్యమైందన్న మాట. అంటే దీని కొనసాగింపుతోనే సెకండాఫ్ కూడా నడవాలన్న మాట. 

        ‘గాడ్ ఫాదర్’ లోలాగా, ‘సర్కార్’ లో లాగా కొడుకులకి వేరే లక్ష్యాలు లేనప్పుడు వాళ్ళొచ్చి ఫాదర్స్ బిజినెస్సుల్ని బేపర్వాగా టేకప్ చేసి- శత్రు నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతారు. ఆనంద్ కూడా ముంబాయిలో ఇంకా లక్ష్యం ఏర్పడక, పైన చెప్పుకున్న ఒకటో రకం హీరో పాత్రలాగా  లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడైతే,  ఆపద్ధర్మంగా వచ్చి సత్యంగారి ‘గ్యారేజీ’ దందాని టేకప్ చేయగలడు. ఈ దందాలో సత్యం గారి ఆశయమే తన ఆశయంగా చేసుకుని పోరాడనూగలడు. అంటే ఏమవుతోందంటే, ఇలా హీరో ప్రవేశించే అసలు కథా ప్రపంచంలో సాఫీగా ప్రవేశం జరుగుతుందన్న మాట. ఇది పాయింటాఫ్ ఎటాక్ : ఎక్కడో వున్న హీరో ఇంకెక్కడో వున్న అసలు కథా ప్రపంచంతో వచ్చి స్పర్శించడం. ఇలా స్పర్శించాలంటే అంతవరకూ హీరోకి వేరే లక్ష్యం వుండకూడదు. స్పర్శతోనే లక్ష్యం ఏర్పడాలి. 

        ముంబాయిలో ఆనంద్ పర్యావరణ ట్రాకు ఒకటి, హైదరాబాద్ లో గ్యారేజీతో సత్యం ట్రాకు ఒకటీ ఫస్టాఫ్ లో చూపించు కొస్తున్నప్పుడు- కథనంతో ఒక ఎజెండా వుంటుంది. దాన్ని తురుపు ముక్కలా ప్రయోగించి సర్ప్రైజ్ చెయ్యాలి. ఈ రెండు కథనాలూ ఎక్కడ ఎలా స్పర్శించి (పాయింటాఫ్ ఎటాక్), ఇంటర్వెల్లో రెండు పాత్రల మధ్య ఎలాటి ఉరుములు ఉరుముతాయో, ఎలాటి మెరుపులు మెరిపిస్తాయో- పిడుగులు కురిపించి సీట్లలో మనల్ని బిక్కచచ్చిపోయేలా చేస్తాయోనని గంటన్నర పాటుగా ఎదురు చూస్తోంటే- ఆనంద్ సాబ్ వచ్చేసి చల్లగా గ్యారేజీలో దూరిపోయాడు. పేలుతుందనుకున్న పర్యావరణ మందు పాతరని పక్కన పడేశాడు. సత్యం సాబ్ గ్యారెజీని ఆనంద్ సాబ్ కి అప్పజెప్పేసి పక్క వాద్యంగా మారిపోయాడు. ఛోటేమియా బడేమియా కలిసి వాళ్ళ కుటుంబ గోత్రాలు చూసుకోవడం మొదలెట్టారు. 

        కుటుంబ కథ చెప్పడానికి మొక్కలతో, బక్క జీవులతో ఇంత డొంకతిరుగుడు అవసరం లేదు : శుభ్రంగా ‘గాడ్ ఫాదర్’ లా చెప్పవచ్చు. 

        హీరోకి ఏదైతే లక్ష్యంగా వుంటుందో అదే కాన్సెప్ట్  అవుతుంది. పర్యావరణ పరిరక్షణ హీరో లక్ష్యమని ఫస్టాఫ్ అంతా చూపించినప్పుడు అదే కాన్సెప్ట్ అవుతుంది! గ్యారేజీ కథ కాన్సెప్ట్ అవదు! రెండో పాత్ర లక్ష్యం ఎప్పుడూ హీరోకి మించి వుండదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఫస్టాఫ్ లో హీరోకి ఇంత  లక్ష్యం వున్నాక,  దాంతో పోరాటమూ చేస్తున్నాక- దాన్ని కొనసాగించే దమ్ముండాలి దర్శకుడికి. లేకపోతే దీని జోలికే పోకూడదు. 

        కొనసాగిస్తే ఏమవుతుంది? అన్ని స్క్రిప్టింగ్ లోపాలూ దూరమైపోతాయి- కథగా కళకళలాడుతూ - ప్రేక్షకులకి ఒక అపురూప వీక్షణానుభవాన్ని ఇస్తుంది!

       
ఎలా కొనసాగించాలి హీరో లక్ష్యాన్ని?
        వెళ్లి వెళ్లి హైదరాబాద్ లో విలన్ రాణా ఫ్యాక్టరీ ఏదైనా వుంటే దాన్ని పేల్చేయ్యాలి.
        అప్పుడేమవుతుంది?
        లబోదిబోమంటూ కార్మికులు రోడ్డున పడతారు- సత్యంకి చెప్పుకుంటారు.
        సత్యం ఏం చేస్తాడు?
        ఎవడ్రా నువ్వు నా కార్మికుల్ని రోడ్డున పడేశావ్? - అని ఆనంద్ ని పట్టుకుంటాడు.
        ఆనంద్ ఏం చేస్తాడు?
        వాడు నా మొక్కల్ని నాశనం చేశాడు అంటాడు.
        సత్యం ఏమంటాడు?
        ఎవడు నీ మొక్కల్ని నాశనం చేశాడు?
        ఆనంద్  రెస్పాన్స్?
        రాణా  గాడే. మొక్కల్ని కొట్టేసి ఫ్యాక్టరీ కట్టాడు. ఇంకెవడు మొక్కల్ని కొట్టేసి ఏది కట్టినా, కట్టబోతున్నా అవన్నీ పేలిపోతాయ్!
        సత్యం కౌంటర్?
        నీకు పిచ్చెక్కింది- ఇది జరగనివ్వను.
        ఆనంద్ క్వశ్చన్?
        ఎందుకు జరగనివ్వవ్?
        సత్యం ఆన్సర్?
        నీ మొక్కల కోసం నా కార్మికుల జీవితాల్ని నాశనం చేస్తావా?
        ఆనంద్ 
        మనిషికన్నా మొక్కెక్కువ నాకు!
        సత్యం వార్ డిక్లేర్!
        చూస్తా ఎలా పేలుస్తావో!
        ఆనంద్ వార్ స్లోగన్!
        పీకడం మీ పనైతే పేల్చడం నాపని!! ఎన్నిమొక్కలు పీకి నీ గ్యారేజీ కట్టావ్?
                                                           ***

   1992లో బ్రిటన్ లో ఒక గ్రూపు ఏర్పడింది. ఎర్త్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఆ గ్రూపు పర్యావరణాన్ని నాశనం చేస్తున్న పరిశ్రమల్ని పేల్చేయడం మొదలెట్టింది. ఈ ఉద్యమం యూరప్ లో 17 దేశాలకూ ప్రాకింది. పరిశ్రమలు కడుతున్నప్పుడు చెట్లని  కొట్టేవద్దని, అడవుల్ని నాశనం చేయవద్దనీ సంబంధిత అధికారులకి, పోలీసులకి, రాజకీయ నాయకులకీ ఎంత ప్రాధేయపడినా వినకపోవడంతో, ఈ గ్రూపు సాయుధ పోరాటానికి దిగి అలాటి పరిశ్రమల్ని పేల్చేయ్యడం మొదలెట్టింది. వీళ్ళని ఎకో టెర్రరిస్టులుగా ముద్రవేశాయి ప్రభుత్వాలు. దశాబ్దానికి పైగా దొరక్కుండా పారిశ్రామికవేత్తల గుండెల్లో నిద్రపోయారు. చివరికి 2005 లో దొరికిపోయారు. 

       ఈ ఉదంతం మీదే ‘ఇఫ్ ఏ ట్రీ ఫాల్స్ అనే డాక్యుమెంటరీ తీశాడు మార్షల్ కర్రీ అనే దర్శకుడు. 2011 లో ఇది ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయ్యింది. 

        సినిమా కథకి ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్. నిజ సంఘటన కాబట్టి కాపీ కొట్టినట్టు కాదు. మొక్క వర్సెస్ మనిషి పాయింటుతో ఆనంద్- సత్యంల మధ్య సంఘర్షణకి సరికొత్త టాపిక్. ‘జనతా గ్యారేజ్’ ది వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణని డిమాండ్ చేస్తున్న కాన్సెప్ట్. తమిళ స్టార్లు, దర్శకులైతే దీన్ని కళ్ళ కద్దుకుని ఎక్కడికో....తీసికెళ్ళి పోతారు!!



-సికిందర్ 
http://www.cinemabazaar.in

9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

 



రచన- దర్శకత్వం : శ్రీనివాస్ అవసరాల

తారాగణం : నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా, పావని గంగిరెడ్డి, సీత,
రాజేశ్వరి, హేమంత్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాని (గెస్ట్ రోల్ లో) తదితరులు
సంగీతం : శ్రీ కళ్యాణ్ రమణ,  ఛాయాగ్రహణం : వెంకట్ సి. దిలీప్
బ్యానర్ : వారాహి చలన చిత్ర,  నిర్మాత: రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
విడుదల : సెప్టెంబర్ 9, 2016
***
చాలా కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న నారా రోహిత్, నాగశౌర్యలు ఒకటై దర్శకుడుగా ఒక హిట్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ తో కలిసి ఒక రోమాంటిక్ కామెడీతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వీళ్ళకి దన్నుగా నిలబడింది. హీరోయిన్ గా రేజీనా కాసాండ్రా దొరికింది. తెలుగులో రోమాంటిక్ కామేడీలకి కొరత లేదు. అదే సమయంలో జాడించి రెండు వారాలాడినవీ పెద్దగా లేవు. ప్రేమకథల్లో ఏదో వైవిధ్యం, ప్రత్యేకత వుంటే తప్ప నిలబడే అవకాశం లేదు. ఈ నేపధ్యంలో ప్రస్తుత రోమాంటిక్ కామెడీ ఏ ప్రత్యేకతలతో వచ్చింది, మిగతా రోమాంటిక్ కామెడీలకి తను తేడా గల కామెడీ అని నిరూపించుకుందా, లేకపోతే  మరో సగటు ప్రేమ సినిమా అన్పించుకుందా ఈ కింద చూద్దాం

కథ
        అచ్యుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగ శౌర్య) అన్నదమ్ములు. మధ్యతరగతి కుటుంబం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయి తల్లి (సీత) తో కలిసి వుంటారు. ఓ పెళ్లి రోజున పార్టీలో అన్నదమ్ముల మధ్య జ్యోత్స్న (రేజీనా) అనే అమ్మాయి ప్రస్తావన వస్తుంది. దీంతో వాళ్ళ భార్యలు ఆ మాట పట్టుకుని నిలదీస్తారు. ఇద్దరూ కట్టుకథలు చెప్తారు. తమ పెళ్లి కాక ముందు ఈ ఇంట్లో అద్దెకున్న జ్యోత్స్న కి తమ్ముడితో లింకు పెట్టి అన్న చెప్తే, అన్నకి లింకు పెట్టి తమ్ముడు చెప్పి భార్యల్ని శాంతింపజేసుకుంటారు. కానీ జరింగింది వేరు. ఇంట్లో అద్దెకి దిగిన జ్యోత్స్న తో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఒకళ్ళనొకళ్ళు దెబ్బకి దెబ్బ తీసుకుంటూ పోటీలు పడతారు. ఆమె ఇద్దరితోనూ  సరదాగా వుంటుంది.  ఆమె కొద్ది రోజుల్లో యూఎస్ కి వెళ్లిపోవాలి. వెళ్లి పోతూ, తను ఎవర్నీ ప్రేమించ లేదనీ, తనకి భరద్వాజ్ (సుశాంత్) అనే బాయ్ ఫ్రెండ్  వున్నాడనీ చెప్తుంది. దీంతో అచ్యుత్ కి ఒళ్ళు మండి  ఆమె పాస్ పోర్ట్ తగులబెడతాడు. అదే సమయంలో ఇంట్లో ఇంకో విషాద సంఘటన జరుగుతుంది. దీనికి జ్యోత్స్నయే కారమని అన్న దమ్ములు నమ్ముతారు. జ్యోత్స్న వాళ్ళని తిట్టేసి వెళ్లిపోతుంది. ఇదీ జరిగిన విషయం. 

        మూడేళ్ళు గడిచిపోయాక, ఇప్పుడు తాజాగా యూఎస్ నుంచి వస్తుంది జ్యోత్స్న . వచ్చి అదే ఇంట్లో అద్దెకి దిగుతుంది. పెళ్ళయిన అన్నదమ్ములకి హుషారొస్తుంది. ఆమె ఒకరికి తెలీకుండా ఒకరికి ప్రేమిస్తున్నానని చెప్పి కంగారు పుట్టిస్తుంది. ఇప్పుడిలా వచ్చిన జ్యోత్స్న ఉద్దేశమేమిటి? ఆమె మనసులో ఏం పెట్టుకుని వచ్చింది, ప్రతీకారమా?  ప్రత్యుపకారమా? ఇంకేదైనా సహాయం కోరి వచ్చిందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే సెకండాఫ్ చూడాల్సిందే.

ఎలావుంది కథ
        సగటు ప్రేమ కథే. ఇలాటి ముక్కోణ ప్రేమ కథలో, అందునా పెళ్ళయిన హీరోల కథలో కొత్తగా ఆశించడానికేమీ వుండదు. సరే, వున్న రొటీన్ కథనైనా సస్పెన్స్ లేకుండా మొదట్నించీ మొత్తం విప్పి చెప్పుకుపోయారు. ఇది ఇంటర్వెల్ వరకే పనికొచ్చింది. ఆతర్వాత విషయం లేక శూన్య స్థితికి చేరింది. 1976 లో సి. ఆనందరామం రాసిన ‘మమతల కోవెల’ నవల ఆధారంగా కె రాఘవేంద్ర రావు జయసుధతో తీసిన ‘జ్యోతి’ లో జయసుధ వచ్చి గుమ్మడిని పెళ్లి చేసుకుంటాననే షాకింగ్ మాటలతో సస్పెన్సుతో ప్రారంభమవుతుంది కథ. అలాగే ప్రస్తుత కథలో రేజీనా పెళ్ళయిన హీరోల ఇంటికి వచ్చి- ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని దుమారం రేపుతూ ప్రారంభించివుంటే కథకి చివరంటా ప్రాణవాయువు లభించేది. సస్పెన్స్, థ్రిల్  లేకుండా రామాయణం కూడా లేదు. సస్పెన్స్, థ్రిల్ అనేవి ఏవో క్రైం సినిమాల ఎలిమెంట్స్  మనకెందుకని ప్రేమసినిమాల కర్తలు పక్కన బెడితే గాలి తీసిన బెలూన్లా వుంటాయి. 

ఎవరెలా చేశారు
        ఈ మధ్యకాలంలో నవ్వొచ్చే విధంగా ఎంతో లావెక్కి నటిస్తున్న నవ హీరో నారా రొహిత్, ఈసారి ఆ ఒబెసిటీ నుంచీ, వీర లెవెల్ మాస్ పాత్రల నుంచీ రక్షిస్తూ చాలా బాక్సాఫీస్ ఫ్రెండ్లీ పొజిషన్ లోకొచ్చాడు. ఇలా సింపుల్ గా నటిస్తే, నవ్విస్తే, కాస్త ఏడిపిస్తే కూడా తనకి సూటవుతుంది. అంతేగానీ శరీరం వేసుకుని లేనిపోని విన్యాసాలే చేస్తే వినాశాకాలే. సిబ్లింగ్ రైవల్రీ తో, అదే సమయంలో బ్రోమాన్స్ తో అచ్యుత్ క్యారెక్టర్ తనకి దక్కిన ఒక వరం. 

        తమ్ముడి పాత్రలో నాగశౌర్య కూడా డీసెంట్ గా నటించాడు. ఇంతకాలం డైమెన్షన్ లేని రొటీన్  బాయ్ ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడేమో, ఈసారి  డైమెన్షన్ తో ఫుల్ లెన్త్ అన్నకి తమ్ముడిగా కూడా నటించడంతో- కొత్తగా కన్పిస్తాడు. రోహిత్, శౌర్య లిద్దరూ ఇలా నవ్యంగా కన్పించడానికి కారకుడు దర్శకుడు అవసరాల శ్రీనివాసే. తన విజన్ లో సృష్టించి, రచించి, నటింపజేసిన ఈ పాత్రలతో ఇద్దరూ ప్రేక్షకులకి దగ్గరయ్యే అదృష్టానికి నోచుకున్నట్టయ్యింది. 

        రేజీనా కీలక పాత్ర పోషిస్తూ ఫస్టాఫ్ లో అలరించినా ఆ తర్వాత ఏమైందో మూస ఫార్ములా హీరోయిన్ లా కథలోంచి దాదాపు మాయమయిపోయింది. తన పాత్ర లేకపోతే కథే లేనప్పటికీ,  రాంగ్ వే లో కథ చెప్పడం వల్ల తన పాత్ర గాలి సగంవరకే సరిపోయింది. ఆ తర్వాత ఎంత గాలి కొట్టినా లాభం లేకపోయింది.
        సంగీతం, ఛాయాగ్రహణం, ఇతర సాంకేతికాలు ఈ రోమాంటిక్ ఫీల్ కి తగ్గట్టే వుండి- దర్శకుడి అభిరుచిని చాటుతాయి.  

చివరికేమిటి?
        ఇది దర్శకుడి సినిమా. అయితే స్క్రీన్ ప్లే దగ్గర ఈ సాదా రొటీన్ కథనే సాంతం పకడ్బందీగా చెప్పడం కుదరలేదు. ఫస్టాఫ్ ముగిశాక, సెకండాఫ్ అతికించిన వేరే కథ అయిపోయి సెకండాఫ్ సిండ్రోమ్  బారినపడింది. ప్రారంభ దృశ్యమే హీరోలకి పెళ్ళిళ్ళయినట్టు చూపించేయడం కథని ఫైనల్ చేసినట్టయ్యింది. అంటే హీరోయిన్ వున్నా కథకి ముగింపు ఈ పెళ్ళిళ్ళకి లోబడే ఉంటుందని ముందే తెలిసిపోతోంది. రెండోది, ఇద్దరు హీరోలతో హీరోయిన్ ముక్కోణ ప్రేమ కథ అన్నాక కూడా వీళ్లిద్దరితో ఆమె ఎలా విడిపోయిందనే పాయింటే ప్రధానమై ఈ దృష్టితోనే సినిమా చూడాల్సి వస్తుంది. ఇలా ఫలితాలు ముందే తెలిసిపోవడంతో సస్పెన్స్ లేకుండా పోయింది. పైన చెప్పుకున్న ‘జ్యోతి’ మార్కు నేరేషన్ పెట్టుకుని వుంటే ఈ బాధ తప్పేది. అన్నదమ్ములతో అమ్మాయి కథ కాస్తా అన్నదమ్ముల వేరే కథగా మారక తప్పని పరిస్థితి ఏర్పడేది కాదు. చివరి అరగంట అన్నదమ్ములతో విషాదభారం ఎక్కువయ్యే బాధ కూడా తప్పేది. హీరోయిన్ మళ్ళీ వచ్చిన కారణం- తన బాయ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కాబట్టి,  వాడి సంగతి చూడాలనడం- సరుకు లేని ప్లాట్ పాయింట్. ఇలాటి తప్పులు దొర్లకుండా చూసుకుందుకే కొన్ని పాత  సినిమాలు మార్గదర్శకాలుగా వున్నాయి. 

        సినిమా ఫస్టాఫ్ చాలా ఫన్నీగా వుండి, సెకండాఫ్ లేకపోవడం ఏకసూత్రతని పాటించక పోవడమే. మాటలు, దర్శకత్వం ఈ రెండిట్లో ప్రతిభ కనబరచిన అవసరాల, మిగతా రచన కూడా కమర్షియల్ సినిమాకి దగ్గరగా చేసుకుని వుంటే బావుండేది.  సిగరెట్ జోకులు పేల్చినంత కామెడీతో,  కథని కూడా దారిలో పెట్టుకుని ఆద్యంతం పేల్చి వుండాల్సింది.



-సికిందర్
http://www.cinemabazaar.in