రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, సెప్టెంబర్ 2016, బుధవారం

నాటి సినిమా!




క రీడర్స్ డైజెస్ట్ జోకు వుంది-
        స్వర్గంలో దేవుడు సుఖాసీనుడై వుంటే సైంటిస్టు వచ్చాడు.
          ‘దేవుడు గారూ! మాకు మీ అవసరం తీరింది. ఇక మీరెళ్ళి పోవచ్చు. ప్రాణిని ఎలా సృష్టించవచ్చో కిటుకు మాకు తెలిసిపోయింది. అన్నిటికంటే బిగినింగ్ లో మీరేం చేశారో అది మేమూ చేయగలం’ అన్నాడు యమ సీరియస్ గా.
           ‘అలాగా?’ అని ఆసక్తిగా  చూశాడు దేవుడు.
          ‘ఔను. ఇంతమట్టిని ఉండలా చేసి ఫిగరొకటి తయారు చేస్తాం. అందులోకి ఉఫ్ ఫ్... మని ప్రాణాన్ని వూదేస్తాం. దట్సాల్, మనిషి తయార్. చూస్తారా?’
          ‘ఏదీ చూపించు నాయనా!’
          సైంటిస్టు ఉత్సాహంగా వంగి, మట్టిని తీయబోతున్నాడు. అది చూసి దేవుడు వెంటనే, ‘ఆగు నాయనా, ముందు నువ్వు తయారు చేసిన నీ మట్టేదో నువ్వు చూపించాలి కదా?’ అన్నాడు  నవ్వుతూ. ఈ మాటలకి గతుక్కుమన్నాడు సైంటిస్టు. జవాబు దొరక్క బుర్ర గోక్కో సాగాడు వెర్రివాడిలా...


       కాబట్టి ఏ మట్టి ఎవరి సొంతం? ఏ మట్టిని ఎవరు తయారుచేయగలరు?  ఏ సినిమా కథ మీద ఎవరికి హక్కులు? ఏ సినిమా కథ ఎవరు సొంతంగా తయారు చేయగలరు? పది పాత సినిమాల కలబోతే కొత్త సినిమా కథ. మోహన్ బాబు వచ్చేసి ప్రతిష్టాత్మకంగా తీసిన ‘పెదరాయుడు’, తాము రాసిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లాగే వుందని పరుచూరి బ్రదర్స్ వెళ్ళేసి ఈరోడ్ సుందర్ ( ‘పెదరాయుడు’ తమిళ మాతృక ‘నాట్టమాయి’ రచయిత) ని పట్టుకుంటే, అతడింకెన్ని  సినిమాల్లోంచి తీసుకుని  ఆ కథ రాశాడో తవ్వుకుంటూ పోతే ఎక్కడ తేలతాం...మట్టి తీసిన సైంటిస్టూ, కథలు తీసిన రచయితా ఒక్కటే. ఏ కథా ఎవ్వరి సొంతమూ కాదు! 

        ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఛాయలు ‘పెదరాయుడు’ లో చాలా కనిస్తాయి. వాటి పాయింట్లే వేర్వేరు, పాత్రలు మాత్రం అవే. హీరోల ద్విపాత్రాభినయాలు అవే. రెండిట్లో అన్నల పొరపాటు తీర్పులే. తమ్ముళ్ళకి అన్యాయపు బహిష్కరణలు, అన్నల భార్యల వేదనలు, వాళ్ళ మీదా బహిష్కరణల వేట్లూ,  అన్నల మీద ఎదుటి జమీందార్ల కుట్రలు కుహకాలూ, పూర్వీకుల బలిదానాలూ వగైరా వగైరా రెండిట్లో ఒకటే. తేడా అల్లా ‘పెదరాయుడు’ రామాయణాన్ని కలిపి చెబుతుంది- ఫలితంగా హుందాగా ఉదాత్తంగా కన్పిస్తుంది. 

          అన్న మాట కోసం తమ్ముడు త్యాగం చేయడంతోనే  ధర్మం నిలబడదు, అన్న కూడా తనవల్ల తమ్ముడికి హాని జరిగిందనుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకుని తనూ వెళ్లి పోయినప్పుడే ధర్మం నిలబడుతుంది. ఇది కూడా గుర్తు చేస్తుందీ గాథ. ‘పెదరాయుడు’ ... కలెక్షన్  కింగ్ మోహన్ బాబు బాక్సాఫీసు చరిత్రని తిరగరాసిన తమిళ రీమేకు. ఇది తన జీవితంలో మర్చిపోలేని అధ్యాయమంటాడాయన. ఇందులో తన పాపులర్  మేనరిజమ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు.  అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా లాంటి మాస్ ఊతపదాలు, వీర హీరోయిజాలతో భీకర రావాలూ లాంటి ఫార్ములా చేబదుళ్ళకి దూరంగా,  అర్ధవంతమైన సహజ పాత్ర పోషణ చేశారు.

        రీమేకుల రాజా రవిరాజా పినిశెట్టి  కూడా తన క్వాలిటీ  స్పృహని కోల్పోకుండా, ఉన్నత విలువలతో విషయాన్ని మనోజ్ఞంగా ప్రెజెంట్ చేశారు. మోహన్ బాబు సహా నటీ నటులందరూ ఆయా పాత్రల్లో అచ్చు గుద్దినట్టు ఒదిగిపోగా, ఆ కథంతా వచ్చేసి రవిరాజా గుప్పెట్లో ముఖమల్ వస్త్రంలా ముడుచుకుంది.  సన్నివేశాల కల్పనలో ఏమాత్రం కృత్రిమత్వానికీ పాల్పడకపోగా, వాటిలో ఏయే విభిన్న రసపోషణలు జరిగినా, అంతర్వాహినిగా ఒకే నిశబ్ద మెలోడీ అనుభవమయ్యేలా ఏక సూత్రత్వాన్ని అమలుచేశారు. దాని పేరే కథాత్మ. ఈ కథాత్మ, బలీయమైన అన్నదమ్ముల అనుబంధం వల్ల ప్రాణం పోసుకుంది. 

        పాత దర్శకుడు డాన్ లివింగ్ స్టన్ ‘ఫిలిం అండ్ ది డైరెక్టర్’ అని రాసిన పుస్తకంలో, ‘మూవ్ మెంట్’ అన్న విభాగంలో ఇలాగంటాడు- ‘కెమెరా మూవ్ మెంట్ ని ఇంటలిజెంట్ గా నిర్వహించడం  దర్శకుడి విజువల్ టెక్నిక్స్ లో ప్రథమ స్థానం వహించాలి. అప్పుడే అతను  ప్రేక్షకుల్ని చాలా ఈజ్ తో సినిమా చూసేట్టు చేసేయగలడు. పాత్రల వ్యక్తిత్వాల చిత్రణ సుబోధకం చేయగలడు. అంతే కాదు, ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూడ్ లోకి ఇట్టే తీసికెళ్ళి కట్టిపడెయ్యనూ గలడు- ‘ అని.  రవిరాజా దిగ్విజయంగా సాధించిందిదే : స్లో మూవ్ మెంట్స్ తో, కథా నడకలో ఒక లయని స్థాపించి, కథాత్మ (సోల్) ని పోషించడం!

       నిజ ప్రపంచంలో ఎక్కడెలా వున్నా,  కనీసం సినిమాల్లో చూపించే ఫ్యూడల్ వ్యవస్థకో నీతివుంటుంది. సినిమా జమీందార్లు బయట ఎలాటి తీర్పులు చెప్తారో, ఇంట్లో జరిగే తప్పులకీ తడుముకోకుండా అలాటి తీర్పులే చెప్పి పడేస్తారు. జమీందారీ వ్యవస్థ కాల గర్భంలో కలిసిపోవచ్చు-  ఇప్పుడు నయా జమీందార్లుగా వెలసిన కొందరు ఎమ్మెల్యేలు, ఏంపీలూ జమీందార్ల స్టయిల్లో ఇంట్లో జరిగే తప్పులకి తీర్పులేం చెప్పరు. కొడుకులో తమ్ముళ్లో పాత జమీందార్ల వారసుల పాత్రలు పోషిస్తూ ఏ అఘాయిత్యానికో పాల్పడితే. సదరు ప్రజాప్రతినిధి గారు తీర్పులు చెప్పరు గాక చెప్పరు- ఏకంగా కేసే లేకుండా మాయం చేసేస్తారు.

        వెండితెర జమీందార్లు ధర్మం తప్పరు. ‘తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒకటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం’ అంటూ ప్రాణం విడవడానికీ సిద్ధపడతారు. ఈ గాథలో పెద్ద జమీందారు పాత్రయిన రజనీ కాంత్ ఇలాగే చేస్తాడు. బావ చేతిలో వెన్ను పోటుకి గురైన పెద్ద జమీందారు రజనీ కాంత్. తమ్ముడు మోహన్ బాబు కి అన్న మాటే శిరోధార్యం. అందుకే, ‘నువ్వే పాపం చేయలేదని అన్నకి ఎందుకు చెప్పవు?’ అని భార్య సౌందర్య అడిగినప్పుడు –ఆయన అడగలేదు కాబట్టి చెప్పలేదంటాడు. ఆయన అడగంది ఏదీ తను చెప్పలేదనీ, ఆయన చెప్పంది  ఏదీ తను చేయలేదనీ అంటాడు.  ‘ఆరోజు రాముడు నేను అడవుల కెందుకెళ్లాలని ప్రశ్నించి వుంటే రామాయణం జరిగుండేది కాదు. తండ్రి మాటని గౌరవించి రాముడు అడవులకెళ్లాడు. తండ్రి కంటే గొప్పవాడైన అన్న మాటని గౌరవించి నేనిక్కడికొచ్చాను’ అంటాడు. 

         చూస్తే రామాయణంలో రఘువంశమంతా పాసివ్ క్యారక్టర్ల మయమే, కైకేయితప్ప. ఈమె యాక్టివ్ గా తన లక్ష్య దృష్టితో దశరధుడి మీద కోర్కెల బాణం విసరకపోతే, రామాయణమే లేదు. గాథల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యకపోతే పాసివ్ పాత్రలకి ఉనికే లేదు. ట్రాజడీల్లేవు. వాటి త్యాగాలూ గొప్పతనాలూ తేలవు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లో కృష్ణం రాజు పోషించిన రెండు పాత్రలకీ లక్ష్యం వుండదు. ఉన్న లక్ష్యమల్లా రావుగోపాల రావు ప్రతినాయక పాత్రకే వుంటుంది. అలాగే ‘పెదరాయుడు’ లోనూ మోహన్ బాబు రెండు పాత్రలూ డిటో. ఏదో ఒక టార్గెట్ వున్న వాడు విలన్ పాత్ర అనంత్ రాజ్ ఒక్కడే. 

        ఈ అనంత్ రాజ్ మేనమామ రజనీకాంత్ హయాంలో ఒక మనభంగం చేసి, రజనీ కాంత్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమెనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ఆ  తీర్పుకి తాళలేని అనంత్ రాజ్ తండ్రి చలపతి రావు, రజనీకాంత్ ని చంపేస్తాడు. చనిపోతూ  రజనీకాంత్,  ఈ ధిక్కారానికి మరో తీర్పు చెప్తాడు- తన బావ అయిన ఈ చలపతి రావు కుటుంబానికి 18 ఏళ్ళూ  సాంఘిక బహిష్కారం విధిస్తాడు. దీంతో ఎక్కడో అతిహీనంగా బతికిన అనంత్ రాజ్ ఆ శిక్షా కాలంపూర్తి కాగానే, రజనీకాంత్ తమ్ముడు మోహన్ బాబు మీద పగదీర్చుకోవడానికి వచ్చేస్తాడు. 

       ‘వెన్నెల’ సినిమా తీసిన ఎన్నారై దర్శకుడు కట్టా దేవ కౌషిక్ ఓ సిట్టింగ్ సందర్భంగా ఓ ముఖ్యమైన విషయాన్ని దృష్టికి తెచ్చారు. చాలా  సినిమాలు ఫ్లాపవడానికి సెకండాఫ్ లో రెండో పాట తర్వాత- క్లయిమాక్స్ కి ముందు - కథలో కొత్త మలుపు రాకపోవడమే కారణమని. తరచి చూస్తే, ఇది నిజమన్పించడానికి అనేక సినిమాలు కన్పిస్తాయి. అయితే, దాదాపు దశాబ్దంన్నర క్రితం తీసిన ‘పెదరాయుడు’ లో ఇలాటి తప్పు జరిగినట్టు కన్పించదు. పైగా దీనికి విరుగుడు కన్పిస్తుంది. మొదట్నించీ కథనంలో ప్రేక్షకులు ఏమాత్రం అనుమానించడానికి వీల్లేని విషయాన్ని క్లయిమాక్స్ కి ముందు ముందుకు లాగి- కథని కొత్త మలుపు తిప్పుతాడు విలన్ అనంత్ రాజ్! ఫస్టాఫ్ లో ఎందుకు జరిగిందో లాజిక్ కి అందక, గాల్లో వేలాడుతూ వుండిన టీచర్ పాత్ర ఆత్మహత్యా  ఘటన వెనుక అసలు కథ అనూహ్యంగా ఇప్పుడు వెలుగులోకి రావడంతో-  ఈ సినిమా క్లయిమాక్స్ కి కొత్త బలం వచ్చి అమాంతం పైకి లేస్తుంది. స్క్రీన్ ప్లే పరిభాషలో ఇలా అప్రధానంగా వుండిపోయి తర్వాత ప్లే అయ్యే టీచర్ పాత్ర ఆత్మహత్యా  ఘటనలాంటిది కావొచ్చు, లేక ఏదైనా క్లూ కావొచ్చు, ఇంకేదైనా వస్తువూ లేదా పాత్ర కావొచ్చు- ఈ ప్లాట్ డివైస్ ని ‘మెక్ గఫిన్’ అంటారు. 

        ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లే లెసన్. ఇందులో గోపీ- మోహన్ లు రాసిన బ్రహ్మానందం - బాబూ మోహన్ ల కామెడీ ట్రాకు కూడా కథాశిల్పంలో ఇమిడిపోయి కన్పిస్తుందే తప్ప- పక్క వాటుగా తెచ్చి అతికించినట్టుండదు. ముందే చెప్పుకున్నట్టు,  పాత్రలన్నీ ఒద్దికగా కన్పిస్తాయి. ప్రధానపాత్రలో మోహన్ బాబు హూందా తనం, రెండో పాత్రలో  వినయ విధేయాలు, భార్యల పాత్రల్లో భానుప్రియ, సౌందర్యల సౌమనస్యాలు, మేనత్త పాత్రలో జయంతి దైన్యం, పెద్ద జమీందారు పాత్రలో రజనీకాంత్ దర్పం ... ఇలా హృదయాల్ని తాకని పాత్రంటూ వుండదు. వీటికి జి. సత్యమూర్తి రాసిన మాటలు అంతే  ఉన్నతంగా వుంటాయి. 

        మోహన్ బాబు సినిమా అంటే తప్పకుండా ఓ జేసుదాస్ పాట! ఇక్కడ కూడా ‘కదిలే కాలమా’ అంటూ జేసుదాస్ తన కంఠాన్ని ఖంగుమన్పించాడు. సంగీత దర్శకుడు కోటి స్వరపర్చిన మిగతా మెలోడీ పాటలు కూడా కథ మూడ్ ని ఎలివేట్ చేసేట్టే వుంటాయి. 

        సౌభాతృత్వం అనే థీమ్ ని ఆలోచనాత్మకంగానూ, అంతే వినోదాద్మకంగానూ తెరమీద దృశ్యమానం చేసిన ‘పెదరాయుడు’ - రీమేక్ లో కూడా ఒరిజినల్ సోల్ ని తెచ్చి ధారాళంగా ప్రవహింపజేయవచ్చని నిరూపిస్తోంది.


-సికిందర్
(సెప్టెంబర్ 2009, ‘స్సాక్షి’)
http://www.cinemabazaar.in