రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, October 7, 2014

రీ- రివ్యూ / ఆనాటి సినిమా 

ఒరిజినల్ నే తలదన్నింది!

అభినయంతో ఆమె కవిరాసిన పాత్రని ఇట్టే కవిత్వం చేసి పెట్టేయగలదు – మరి ఆమె అభినయ కళావిరుపుల మెరుపుల్ని అక్షరాల్లో పట్టగల కవి కుమారుడెవడు – కలాలు మొరాయించాల్సిందేగా!
            కలాల్నే ఓడించే కళా స్వామ్యమామెది!

          శ్రమలేని జీవితం నేరమైనట్టే, కళ లేని శ్రమా ఘోరమే. జీవితంలో కళనంతా కోల్పోయి, శ్రమలోనే కళని రెండు కళ్ళుగా చేసుకుందామె. తుది యంటూ లేని సుషుప్తావస్థలో తనుంటే, పైలోకాల్లో దేవతలకి స్వాగత సన్నాహాలు పూర్తి చేయడానికి నెలలకి నెలలూ పట్టేసిందని స్వయంగా ఆత్రేయ రాసేశాక, మానవ మాత్రులకి ఎన్నెన్ని జన్మలు కావాలి ఆమెకి సరితూగే నాల్గక్షరాలు ఏర్చి కూర్చడానికి...ఏవో తోచిన నాల్గు విశేషణాలు జోడించుకుని ఆనందించడం మినహా!
           సావిత్రియే ఒక విశేషణం, పర్యాయపదం. ఈమాట ఎవరు చెప్పారు? సాక్షాత్తూ వైజయంతీ మాలే చెప్పింది. అలా  నటనలో అత్యున్నత శిఖరాల అధిరోహణకి ఒక్క ముక్కలో సావిత్రీ అని అభివర్ణిం చెయ్యొచ్చు. గమనిస్తే - ఇంత  సులువు చేసి పోయింది సావిత్రి పెన్ మాస్టర్లకి!
          సినిమా అంటే జీవితమే అని ఆమె నిర్వచనమాయ్యాక, రౌద్ర రసంలో గాజులు పగిలి రక్తం చిందేంత, శోక రసంలో శోష వచ్చి పడిపోయేంత నటనా పటిమే ఆమె జీవితం నిండా చదివించే  పేజీలైపోయాయి. ఆ పేజీల్ని ఆబగా తిప్పేస్తూంటే, మూడు చోట్ల చెవులు పట్టి ఆపి చాచి కొడుతుందామె! ముందు ‘మిస్సమ్మ’ చదువుకోవోయ్, ఆ తర్వాత ‘మాయాబజార్’ చూసుకో, ఇంకా తర్వాత ‘చివరకుమిగిలేది’ తెలుసుకుని ముందుకుపో! ఫో!! – అనేసి. 
           మొదటి రెండూ తను అజరామరం చేసిన అమోఘ పాత్రలే. చివరిదే జాతీయంగా గెలిచిన గర్వించే పాత్ర. దేవదాసుగా అక్కినేని ఎక్కడెక్కడి వెండి తెర దేవదాసులందర్నీటోకున జయించేసినట్టే, ‘చివరకు మిగిలేది’ తో సావిత్రి ఇటు బెంగాలూ అటు బాంబే అభినేత్రులందర్నీ ఓడించి పారేసి, వచ్చి అక్కినేని సరసన నించుంది సగర్వంగా - తెలుగు జాతి బలిమిని చాటుతూ. ఈ చిత్ర రాజాన్ని ఒక మాగ్నం ఓపస్ గా చరిత్ర కెక్కించి చేతులు దులిపేసుకుంది!

          క్లైమాక్స్ సీనే ఈ ముగ్గురు తెలుగు – బెంగాలీ – హిందీ నటీమణుల టాలెంటు కి గీటురాయి అయింది. ఈ క్లైమాక్స్ అంటూ చిత్రీకరిస్తే అది రాత్రి పూటే వుండాలని నిబంధన పెట్టింది సావిత్రి. షాట్ పూర్తయ్యాక తన సమీపంలోకి ఎవరూ రావొద్దని ఆక్షలు విధించింది. రీటేకు లేమాత్రం లేని షాట్స్ తో, మతి చలించిన విధివంచిత పాత్ర ఆక్రందనని గుండె పగుల గొట్టుకుని మరీ ప్రతిష్టించేసి, వెళ్లి మూల కూలబడి వెక్కి వెక్కి ఏడ్వడమే! పాత్ర తాలూకు ఆ గుండె కోతంతా వదిలాక,  చక్కాలేచి గుడ్ నైట్ చెప్పేసి సొంత గూటికి వెళ్ళిపోవడమే!
             ఈ అమృత తుల్యమైన షాట్సే అటు బెంగాలీ మాతృక ‘దీప్ జలే జాయే’ లో సుచిత్రా సేన్ నీ, ఇటు మళ్ళీ హిందీ రీమేక్ 'ఖామోషీ’ లో వహీదా రెహమాన్ నీ ఆలౌట్ చేసేశాయి. స్వయంగా ఈ ఓటమి ఒప్పేసుకుంది కూడా వహీదా.
          మనసులాట ఇదంతా. వికటించే ఒక వింత ప్రయోగం. అయినా ఆ రిటైర్డ్ కల్నల్ డాక్టర్ (డాక్టర్ ప్రభాకర రెడ్డి) కి ఈ ప్రయోగమే కావాలి. మానసిక రోగులకి మందులతో గాక, ప్రేమతో వైద్యం చేయాలనే సూతత్రీకరణ. విఫల ప్రేమలతో పిచ్చివాళ్ళయిన పెషంట్లకి ప్రేమ నటించి బాగు చేస్తే బావుంటుందని ఆలోచన. అప్పటికి ప్రపంచంలో మొట్ట మొదటిదైన ఈ ప్రయోగాన్ని ఎలాగైనా విజయవంతంగా పూర్తిచేసి  పేరు ప్రతిష్టలు గడించాలన్నఆశ.  ఇందుకు సాధనం అదే ఆస్పత్రిలో పనిచేసే పద్మ ( సావిత్రి) అనే అమాయక నర్సు.  
           కేస్ – 1 : భాస్కర్ ( టి.ఎల్. కాంతారావు)అనే పేషంట్ తో, నర్సు పద్మ వలచి ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నిజంగా తనే ప్రేమలో పడిపోయింది. మనసారా అతను కోలుకుని వెళ్తూ, ఆమె చూపించిన ఈ ప్రేమ అంతా ప్రయోగంలో భాగంగా ఉత్తి నటనే అని అపార్ధం జేసుకుని వెళ్ళిపోయాడు. కాదూ నిజంగానే ప్రేమించానూ అని అతడికైనా, ఆ డాక్టర్ కైనా ఎలా చెప్పుకోవాలామె? ఎలా?

         కేస్ – 2 : ప్రకాష్ (ఎం. బాలయ్య) అనే ఇంకో పేషంట్ ని కూడా ఇలాగే నయం చేసి పంపించాలని డాక్టర్ ఇంకో హుకూం. వల్లకాదంది, తనవల్ల ఇక కాదంటే కాదంది. మనసంతా ఆ వెళ్లిపోయిన భాస్కరే నిండి వుంటే, బరితెగించి మళ్ళీ ఇంకోడితో నటనా? ఐనా ఉద్యోగ ధర్మం కొద్దీ ఓర్చుకుని ఎలాగో ఈ ప్రకాష్ కి సపర్యలు చేస్తూ, ఇతడి ప్రేమ కథలో మోసగించిన ప్రియురాల్ని తెచ్చి అప్పగించేస్తే, ఛీ కాదు పొమ్మన్నాడు. నువ్వే నా ప్రేయసీ అంటూ గలాభా సృష్టించాడు. మతిపోయి తలుపులు బిడాయిం చుకుని పిచ్చి చూపులు చూసింది. పచ్చిగా పిచ్చిదై తెరలుతెరలుగా నవ్వడం మొదలెట్టింది. అదే ఆస్పత్రిలో అదే పేషంట్లకి నయం చేసిన అదే గదిలో, తనే ఓ పేషంటైపోయి ఈసురోమంటూ చీకటిని మిగుల్చుకుని చతికిల బడింది. అప్పుడు మిన్నంటే అక్రందన -
          “నేను అభినయం చేయలేదూ , నిజంగా నేను అభినయం చేయలేదు! నేనెన్నడూ అభినయం చేయలేదు! అభినయించడం నాకు చేత గాదు, నా చేత గాదు, నా చేత గాదూ ..” అనేసి!
          “చిగురంటి వయసులో చిక్కని జీవితాన ...చివరకు మిగిలేది చీకటేనా కారు చీకటేనా” –(కృష్ణ శాస్త్రి)...సేవికగా, నటించే నాయికగా, మనసిచ్చిన మానినిగా, భగ్నహృదయిని గా, భయవిహ్వలగా, బలిపశువుగా... పాత్ర నడక (క్యారక్టర్ ఆర్క్) ని అంకురం దగ్గర్నుంచీ చివరాఖరికి విధ్వంసం వరకూ ఒంటి చేత్తో లాక్కెళ్ళేసి, నిటారుగా నింగి నంటించిన సినిమా ప్రపంచపు సామ్రాజ్ఞిని వృత్తి నైపుణ్యాన్ని వర్ణించడానికి ఆ భరతముని దిగివచ్చినా బలాదూరే!

      మతి పోగొట్టుకోవడంలో ఆ కళ్ళు తిప్పడం వుందే...అదే  సుచిత్రా వహీదా నటద్వయం చాపకిందికి నీరు తెచ్చేసింది! బేసిగ్గా ఈ కళ్ళు తిప్పే టెక్నిక్ ని ఈ అఖండ తారామణు లిద్దరూ ఎందుకు విస్మరించారో వాళ్ళకే తెలియాలి. పైపెచ్చు సుచిత్రా సేన్ లో పాత్ర డిమాండ్ చేసే సగటు ఆడదాని అణుకువ కంటే కూడా మోడరన్ గాళ్ పాయిజే పెల్లుబికింది బాగా. వహీదా రెహమాన్ లో సగటు స్త్రీ తొంగి చూసినా, ఆ కీలక మతి చాంచల్య ఘట్టంలో ఉల్లాస ఛాయలు దేనికో?
          మొత్తానికి ఇలా సావిత్రిదే పైచేయై పోయింది!
          1960 లో మంజీరా ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా బెంగాలీ మాతృక, ‘నర్స్ మిత్ర’ అనే నవలకి తెర రూపం. ఆశుతోష్ ముఖోపాధ్యాయ ఆ నవలా రచయిత. అసిత్ సేన్ ని దర్శకుడిగా పెట్టుకుని, అనిల్ చటర్జీ, సుచిత్రాసేన్ లని హీరో హీరోయిన్లుగా తీసుకుని ప్రఖ్యాత సంగీత దర్శుకుడు హేమంత్ కుమార్ ఈ సినిమా నిర్మాణం చేపట్టాడు. అది సూపర్ హిట్టయ్యింది. 1969 లో ఇదే దర్శకుడు రాజేష్ ఖన్నా –వహీదా రెహమాన్ – ధర్మేంద్ర లతో ‘ ఖామోషీ’ గా రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాపయ్యింది. 
          బెంగాలీలో హేమంత్ కుమార్ పాడిన ‘అయి రాత్ తుమార్ అమార్’ (ఈ రాత్రి నీదీ నాదీ) అనే హమ్మింగ్ సాంగ్ వుంది. ఈ ట్యూన్ నే తెలుగు రీమేక్ ‘చివరకు మిగిలేది’ లోనూ వాడుకుంటూ ‘సుధవో సుహాసినీ’ అని దేవులపల్లి కృష్ణ శాస్త్రితో పాట రాయించుకుని, ఘంటసాల చేత పాడించుకున్నాడు సంగీత దర్శకుడు అశ్వత్థామ. వేరే ట్యూన్ తో హిందీ రీమేక్ లో కిషోర్ కుమార్ పాడిన గుల్జార్ రాసిన పాట- ‘వో హ్ షామ్ కుచ్ అజీబ్ థీ’ గుండెల్లో సాయంకాలపు రాగాల్ని నాటుతుంది. ఇకపోతే బెంగాలీ మాతృక, హిందీ రీమేక్ ల కథనం కథానాయిక దృక్కోణంలో సాగుతుంది. 


           మొదటి కేసులో సాగే ఆమె ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ లో, అది కూడా నీడలా ఆ భగ్న ప్రేమికుడ్ని చూపించే టెక్నిక్ తో, డైరీలో ఆమె జ్ఞాపకాల్ని తోడుకునే కథనంతో లీలామాత్రంగా వుంటుంది. తెలుగులో దీన్నిదర్శకుడి దృక్కోణం (పాయింటాఫ్ వ్యూ) కి మార్పు చేశారు. రెండు కేసుల్నీ కేసుని వర్తమానంలో నడిచే కథలుగానే చూపించారు. దీనికి కారణాలేమిటో ఎగ్జిక్యూటివ్ నిర్ణాత ఎం.ఆర్. కొండల రెడ్డి వివరిస్తారు (కింది సెక్షన్లో చూడండి). అలాగే ఏసుప్రభు, పాలగ్లాసు, రేడియో దృశ్యాలతో పాటు; రాజబాబూ రమణా రెడ్డిల మెంటలోళ్ళ కామెడీ ఒరిజినల్ లో లేని చేరికలే. అప్పటి పాపులర్ హీరో హరనాథ్ కూడా ఓ ప్రత్యేకపాత్ర పోషించిన ఈ సినిమాకి గుత్తా రామినీడు దర్శకుడు. ఈయన అప్పుడప్పుడే ‘మా ఇంటి మహాలక్ష్మి’ అనే సినిమాతో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు పొంది వున్నాడు.

 చరిత్రలో ఒక పేజీ..
డా. ఎం.ఆర్. కొండలరెడ్డి 
చివరకు మిగిలేది నిర్మాతలుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు యు. పురుషోత్తమ రెడ్డి, ఎం. సత్యనారాయణ లున్నా, పర్యవేక్షణంతా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా డా. ఎం.ఆర్. కొండలరెడ్డి తన భుజానేసుకున్నారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ లో రాజధాని బ్యాంక్ ఉపాధ్యక్షులుగా, సెన్సార్ బోర్డు మెంబరుగా వున్నారు. ఈ వయసులో నీలకంఠ తీసిన ‘షో’ చిత్రం మీద ఎం.ఫిల్ కూడా చేస్తున్నారు. మృదుభాషి అయిన ఈయన దగ్గర ‘చివరకు మిగిలేది’ సమాచారం పుష్కలంగా వుంది!
           1959 లో ‘సినీ అడ్వాన్స్’ అనే పత్రికలో బెంగాలీ చిత్రం ‘దీప్ జలే జాయే’ రివ్యూ చదివి ఉత్తేజితుడైన ఈయన( అప్పట్లో ఒక ఆంగ్ల పత్రికలో సినిమా రివ్యూలు రాసేవారీయన) పురుషోత్తమ రెడ్డిని, దర్శకుడు గుత్తా రామినీడునీ వెంట బెట్టుకుని కలకత్తా వెళ్ళిపోయారు. అక్కడ నిర్మాతా సంగీత దర్శకుడూ అయిన హేమంత్ కుమార్ దగ్గర పది వేలకి ఆ సినిమా తెలుగు రైట్స్ కొని, మద్రాసు వచ్చేశారు. ముందు జమునని అనుకున్నారు. ఆమె పారితోషికం ఎక్కువ చెప్పడంతో, సావిత్రిని కలిశారు. ఈ సినిమా చేయడానికి సావిత్రి సాహసించక పోవడంతో, అక్కినేని నాగేశ్వర రావుతో చెప్పించారు. అలా ఒప్పుకున్న సావిత్రి అప్పుడే తన పారితోషికం 40 వేలలోంచి పాతిక వేలూ పెట్టి ఈ నిర్మాతల దగ్గరే తమిళ డబ్బింగ్ రైట్స్  కొనేశారు. ఐతే తెలుగులో ఈ రీమేక్ ఫ్లాప్ కావడంతో సావిత్రి తమిళ డబ్బింగ్ జోలికెళ్ళ లే దు. అది వేరే విషయం.

          సావిత్రి బిజీ కారణంగా నెలకి మూడు రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వడంతో, వీనస్ స్టూడియోలో వేసిన సెట్లో అలాగే ఆరు నెలల  పాటు షూటింగ్ జరిపారు. ప్రఖ్యాత దర్శకుడు కె.వి. రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. మూడు లక్షల బడ్జెట్ తో నిర్మాణం పూర్తి చేసి,  1960 అక్టోబర్ లో 12 ప్రింట్లతో విడుదల చేస్తే, వెనువెంటనే తిప్పికొట్టారు తెలుగు ప్రేక్షకులు. పిచ్చి సినిమాలో సావిత్రికి కాదు, ఇలాటి సినిమా తీసిన నిర్మాతలకి పట్టిందని చెడ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. విజయవాడలో ఒకే ఒక్క ఆటకి బాక్సు వెనక్కొచ్చేసింది. కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ లలో మాత్రం రెండు వారాలాడింది. మద్రాసులోని సౌత్ ఇండియన్ ఫిలిం క్రిటిక్స్ సంఘం దీనికి మూడు అవార్డులిచ్చింది(ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు). 1990 లో హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తే క్రిక్కిరిసి చూశారు డెలిగేట్లు. ఇప్పుడీ సినిమా ప్రింట్లు ఎక్కడా లేవు. చివరి ప్రింటు కూడా శిథిలమౌతూంటే, జాగ్రత్త పడి సీడీలు తీసి భద్రపర్చారు. ఆ సీడీలే ఈ రాస్తున్న ఆర్టికల్ కి మూలాధారం. ఇవి మార్కెట్లో విడుదల చేయలేదు. రైట్స్ కొనేవాళ్ళు లేరు. ఈ వ్యాసకర్త భుజానేసుకుని హైదరాబాద్, చెన్నైలలోని ప్రముఖ ఛానెళ్లలో ప్రయత్నించినా వాళ్ళు ముందుకు రాలేదు. ఈ సినిమా రైట్స్ తీసుకుంటే చివరికి తమకి కూడా ఏమీ మిగలదన్నుకున్నారో ఏమో. 

           అట్లూరి పిచ్చేశ్వర్రావు చేత మాటలు రాయించారు. తర్వాత కృష్ణశాస్త్రి వీటిని సంస్కరించారు. అయితే కథనంలో పాయింటాఫ్ వ్యూ పరంగా ఒరిజినల్ కీ ఈ రీమేకుకీ  వ్యత్యాసాన్ని కొండల రెడ్డి వివరిస్తూ- అలా తెలుగు ప్రేక్షకుల సౌలభ్యం కోసమే  చేశామన్నారు. కాంతారావుతో సావిత్రి ప్రేమాయణాన్ని అలా ప్రత్యక్షంగా చూపించక పో తే తెలుగు ప్రేక్షకులకి నచ్చేది కాదన్నారు. అలాగే సావిత్రి బాలయ్యని డీల్ చేస్తున్నప్పుడు, ఒరిజినల్ లో లాగా తల్లి ప్రేమ యాంగిల్ ని ప్రవేశపెట్టినా కూడా మన ప్రేక్షకులకి రుచించేది కాదన్నారు. సూడో ఫీనియా, ఎక్యూట్ మేనియా, వంటి వైద్య భాషని, బాల్యం నించీ వివిధ దశల్లో పురుషుడి మానసికావస్థ కి సంబంధించిన డిస్కషన్ నీ ఇందుకే పరిహరించామన్నారు. తర్వాత 1964 లో కొండల రెడ్డి తానొక్కడే నిర్మాతగా జగ్గయ్య, కృష్ణ కుమారి లతో ‘వీలునామా’ నిర్మించి విజయం సాధించారు.



-సికిందర్ 

(డిసెంబర్ 6, 2009 సావిత్రి జయంతి సందర్భంగా 'సాక్షి' కోసం)

         





          







Sunday, October 5, 2014

రీ- రివ్యూ/ ఆనాటి సినిమా

స్వర్ణ యుగపు స్క్రీన్ ప్లే!

          సినిమా కథకి దైవత్వాన్ని ప్రసాదించిన ప్రవక్త స్వర్గీయ బి.ఎన్. రెడ్డి అని అభివర్ణించవచ్చు.
1939 లో ‘వందేమాతరం’ నిర్మిస్తూ బి.ఎన్.రెడ్డి హంపి కెళ్తే, అక్కడి విరూపాక్షాలయం గర్భగుడి తీవ్ర భావావేశానికి లోనుజేసింది. ఇక్కడే కదా అలనాడు విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు
నించుని ప్రార్ధన చేశాడన్న స్పహకి కదిలిపోయి, ఎలాగైనా సరే రాయలవారి ఆ అంగరంగ వైభవాన్ని   వెండితెర మీద దృశ్యమానం చేయాలన్న కోర్కె బలంగా నాటుకుపోయింది. ఇది పదేళ్ళకి నెరవేరేసరికి, ఆ కళాసృష్టి ‘మల్లీశ్వరి’ ప్రపంచ సినిమా జగత్తులోనే అజరామరంగా నిల్చిపోయింది!

 బీఎన్ కేదో అతీతశక్తి ఆవహిస్తే తప్ప ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ శక్తి దేవరాయలు! స్వయంగా ‘ఆముక్త మాల్యద’ అనే అపూర్వ కావ్యఖండాన్నిచ్చిన వాడు. ఆయనే బీఎన్ ని ప్రవక్తగా మార్చి ‘మల్లీశ్వరి’ అనే అనితర సాధ్య సృష్టితో ఈ కళా ప్రపంచంలోకి పంపించి ఉంటాడు.

          ప్రవక్తలు వాసికి బద్దులు.
          గత 50 -60 సంవత్సరాల మధ్యకాలంలో ‘మల్లీశ్వరి’ (1951) గురించి ఎందరెందరో మహానుభావులు ఎంతెంతో రాసేశారు. ఇంకా రాయడానికి ఏమీ మిగలనంతగా. అయినా ఈ రాస్తున్న కలం ఇంకేవో తంటాలు పడుతోంది. దేవరాయలి గురించి ఓ కథ ప్రచారంలో వుంది. రాజకోట నిర్మాణం కోసం అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తూ అరణ్యంలో కెళ్ళారు. అక్కడో వింత దృశ్యం ఎదురైంది. ఓ నాల్గు కుందేళ్ళు రెండు అడవి కుక్కల్ని వెంటాడుతున్నాయి - గ్రేట్ యాక్షన్ సీన్! ఇది గమనించిన పండితులకి తక్షణం ఆ స్థల మహాత్మ్యం అవగతమై ఇక్కడ గనుక రాజకోట నిర్మిస్తే, రాయలవారి రాజ్యం వెయ్యేళ్ళూ  వర్ధిల్లుతుందని సెలవిచ్చారు. ఇక కోట నిర్మాణం ప్రారంభమైపోయింది. ఆ భూమి పూజకి దేవరాయలు నదీ స్నానమాచరించి, శంఖం పూరించాలి. ఆ శంఖా రావం విన్పించగానే పలుగుతో భూమ్మీద ఒక్క పోటు పొడిచారు. అంతలో మరో శంఖారావం విన్పించి కంగారు పడి పోయారు. ఇదేమిటిది - అని ఆరాతీస్తే, మొదటి రావం రాయల వారు పూరించింది కాదని తేలింది! దీంతో డీలాపడిపోయి, ఇహ వందేళ్ళతో ఈ సామ్రాజ్యం పని సరి- అని కుమిలిపోయారు.
          రాసి కాదు, వాసి ముఖ్యం. వందేళ్ళు కూడా కాదు, అందులో కేవలం ఐదో వంతు- ఇరవై ఏళ్ళు పాలించినప్పటికీ ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ సుభిక్ష పాలనకి ఆదర్శప్రాయంగా నిలచిపోయాడు. అలాగే కేవలం పదకొండు సినిమాలే తీసినప్పటికీ బీ ఎన్ రెడ్డి ( 1908 – 1977) ప్రపంచ దృష్టినాకర్షించాడు. చలనచిత్ర రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయ్యాడు. పద్మభూషణ్ కీ పాత్రుడయ్యాడు. పోస్టల్ స్టాంప్ పైనా ప్రకాశించాడు. ఇంకేం కావాలి?

        అలాటి ఆయన అందించిన ‘మల్లీశ్వరి’ చరిత్రకి కల్పనని జోడించిన అపురూప సంగీతభరిత ప్రేమ కథగా పండిత పామరులందర్నీ అలరిస్తోంది నేటికీ. మరో కీర్తి కూడా దీని సొంతమైంది. స్క్రీన్ ప్లే పరంగా ఎన్నదగ్గ  అతికొద్ది పాత క్లాసిక్స్ లాగే ఇది కూడా ఒక పాఠ్యాంశం కాగలదని గుర్తించారు. అయితే ఈ పాఠ్యాంశాన్ని ఎవరెంత తమ తమ సినిమాల్లో వినియోగించుకున్నారో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం సినిమాలు పూర్తిగా రూపు రేఖలు మార్చుకుంటున్న ఈ కాలంలో – కనీసం చిన్న సినిమాలకి సంబంధించి – ఒక ప్రత్యాన్మాయ స్క్రీన్ ప్లే నమూనా అవసరం ఎంతైనా వుంది. ఈ అవసరాన్ని ‘మల్లీశ్వరి’ మహాద్భుతంగా తీర్చగలదని బాక్సాఫీసుని గుద్ది మరీ చెప్పొచ్చు! 
             ఇప్పడు ఓంకార, లవ్ ఆజ్ కల్, లండన్ డ్రీమ్స్ వంటి సినిమాల్ని చూస్తే ఒక మార్పు కన్పిస్తుంది. వీటిలో గజినీ, వాంటెడ్ లలో లాంటి రొటీన్ మసాలా విలన్లు కన్పించరు. హిందీ మల్టీప్లెక్స్, ఓవర్సీస్ ప్రేక్షకులు ఇప్పుడు సినిమాల్ని కాలక్షేప బఠానీల కన్నా తేలిగ్గా తీసుకోవడంతో, పై మూడు చిత్రాల్లో కేవలం పరిస్థితులు, పాత్రల మనస్తత్వాలు అనే రెండు ఎలిమెంట్స్ మాత్రమే కథలకి విలన్లుగా కన్పిస్తున్నాయి. ఇవే వాటి విజయాలకి సరిపోతున్నాయి. కాలమహాత్మ్యమేమో...కుందేళ్ళన్నీ కలిసి అడవి కుక్కల్ని తరిమి కొడుతున్నాయి!
          ఇదేగనుక తెలుగు సినిమాల్లోనూ జరిగితే, ప్రేమ కథల్లో కూడా విలన్ గాడితో పొడిపించు కోవడాలు, రక్తాలు పారించు కోవడాలూ ఇక వుండవు. అసలు విలన్ పాత్రే వుండదు!
          బీఎన్ రెడ్డి విరూపాక్షాలయ దర్శనానుభవం తర్వాత చాలాకాలం మంచి కథ కోసం అన్వేషించాడు. రెండేళ్ళూ గడిచి పోయాయి. అప్పుడు రెండు కథలు దృష్టిలోపడ్డాయి.
          అవి ఒకటి – మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమైన బుచ్చిబాబు నాటకం ‘రాయల కరుణాకృత్యం’
          రెండు -  ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ఈ నాటకాన్నే పోలిన ఇంకో కథ. 
          ఈ రెంటినీ కలిపి ఓ కథ తయారు చేసుకున్నాడు బీఎన్. 
          ‘మల్లీశ్వరి’ చిత్రకథ తెలిసిందే. నాగరాజు (ఎన్టీఆర్) అనే శిల్పి, అతడి మరదలు మల్లీశ్వరీ (భానుమతి) ప్రేమించుకుంటారు. మల్లీశ్వరి తల్లి నాగమ్మ (ఋష్యేంద్రమణి) ఇందుకు వ్యతిరేకం. దీనిక్కారణం నాగరాజు రాళ్ళు కొట్టుకునే కూలీ కావడం. నాగమ్మ భర్త నారప్ప (దొరై స్వామి) కి తనచెల్లెలి కొడుకైన ఈ నాగరాజు అంటేనే అభిమానం. ఈ పరిస్థితుల్లో ఓ వర్షపు రాత్రి సత్రంలో మల్లీశ్వరి చేస్తున్న నాట్యాన్ని చూస్తాడు మారువేషంలో రాజ్యం లో సంచరిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు ( శ్రీవాస్తవ).

   అప్పుడున్న సాంప్రదాయాల ప్రకారం దేవరాయలు తన కెవరైనా పడతి నచ్చిందంటే ఆమె ఇంటికి పల్లకీని పంపుతాడు. పల్లకీ వచ్చిందంటే ఆ పిల్ల అదెక్కి రాణీ వాసానికి తరలిపోవాల్సిందే. ఇప్పుడా వచ్చి మల్లీశ్వరి నాట్యాన్ని చూస్తోంది సాక్షాత్తూ రాయలవారేనని తెలీని నాగరాజు - ఈ మల్లిని మీ పల్లకీలో పట్టు కెళ్ళి పొండని వేళాకోళా మాడేస్తాడు!
     దీన్తర్వాత ఎప్పటికైనా మల్లిని పెళ్ళాడ్డానికి డబ్బు సంపాదించుకుందామని నగరానికి వలసెళ్ళిపో తాడు నాగరాజు. అతనెళ్ళిపోయాక ఇటు మల్లీశ్వరి ఇంటికి పల్లకీ వచ్చేస్తుంది. హతాశురాలైన ఆమెకి,  అదెక్కి రాణీవాసానికి తరలివెళ్ళడం వినా గత్యంతర ముండదు.
           తిరిగొచ్చిన నాగరాజు జరిగిందంతా తెలుసుకుని, మల్లి మోసం చేసిందనే అపోహ పడి, పిచ్చోడైపోతాడు. ఒక శిల్పాచారి వచ్చి రాజకోటలో నర్తన శాల నిర్మాణం పనులున్నాయని చెప్పి, నాగారాజుని తీసుకుపోతాడు. అలా రాజకోటలో అడుగుపెట్టిన నాగరాజు అక్కడ ‘వంచకి అయిన మల్లి’  ని చూస్తాడు!
          చరిత్ర ప్రకారం రాణివాసంలో పడతులకేసి పరాయి మగాడు కన్నెత్తి చూస్తే శిరఛ్ఛేదం తప్పదు. అంటే ఇప్పుడు నాగరాజు తల తెగిపడే పరిస్థితి అన్నమాట. బీఎన్ కరుణాకృత్యం’ నాటకమూ, ఇంకో పత్రికలోని కథా అలా కలిసి వచ్చి రాయలని పాజిటివ్ గా చూపించే అవకాశం లభించింది గానీ లేకపోతే  ఏమయ్యేదో.  ఇక్కడే స్క్రీన్ ప్లే లో విలన్ పాత్ర ఉనికిని శుభ్రంగా చేరిపేస్తోందీ సినిమా. మరి విలన్ పాత్ర లేకపోతే కథెలా నడవాలి? నాగరాజు ఆడిన వేళాకోళమే అతడి పాలిట విలన్ అయ్యింది కదా! తెర మీద నడిచే సినిమా అంతా కూడా మన మానసిక ప్రపంచంలోని భావోద్వేగాల సమాహారమే కదా! మన సబ్ కాన్షస్ మైండ్ తో కాన్షస్ మైండ్ ఆడే ఆటే కదా! కచ్చితమైన స్క్రీన్ ప్లే  పరిభాషలో చెప్పుకోవాలంటే, సినిమా కథని సినిమాకథ అనరు. స్టోరీ మైండ్ అంటారు. ఈ దృష్టితోనే స్క్రీన్ ప్లే ని నిర్వచిస్తారు.

       ఈ స్టోరీ మైండ్ లో నాగరాజు అనే వాడు కాన్షస్ మైండ్ లాంటి వాడు. అంటే ఇగో అన్నమాట. తన ఈ ఇగో తన సబ్ కాన్షస్ మైండ్ తో,  లేదా అంతరంగంతో చెలగాట మాడిందన్నమాట - అలా వేళాకోళం చేసేసి! మరి ఈ అంతరంగానికి తెర మీద కన్పించే భౌతిక రూపం ఎవరు? అది దేవరాయాలి పాత్రే! 
           ఇప్పుడు మనం గనుక డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘ది పవరాఫ్ యువర్ సబ్ కాన్షస్ మైండ్’ అనే గ్రంధాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, మన ఇగో చెప్పిన మాటని,  లేదా చేసే ఆలోచననీ  మన అంతరంగం తక్షణ ఆదేశాలుగా స్వీకరించి దాంతో ఎక్కడికైనా, ఎంతదూరమైనా సాగి పోయి సాధించు కొచ్చేస్తుంది. ఈ సృష్టి అంతా శక్తితరంగాల ఆటు పోట్లే తప్ప మరేం కాదుగా?  ప్రతీదీ శక్తి తరంగాల గుచ్ఛమే. రాయీ రప్పా సైతం! అలా నాగరాజు అంతరంగానికి పాపం నాగరాజు వేళాకోళ మాడేడని అస్సలు తెలీదు. హాస్యాని కనే మాటల్ని కూడా నిజం చేసేయడం దాని నైజం. అందుకే ఇలాటి నమ్మకమైన సేవకుడు లాంటి అంతరంగ ప్రతీక అయిన దేవరాయలి పాత్ర కాస్తా నాగరాజు చెప్పింది తు.చ. తప్పకుండా పాటిస్తూ మల్లీశ్వరి ఇంటికి పల్లకీ పంపించేసిం దన్నమాట!

      దేవరాయలి పాత్రని ఇలా అర్ధం చేసుకుంటేనేగానీ అపోహలు తొలగవు. లేకపోతే ఇదేమిటీ, అంతటి మహా రాజూ వేళాకోళమని తెలిసీ ప్రేమికులతో ఇలాటి అనైతికతకి ఎలా పాల్పడ్డాడూ అన్న సందేహం వస్తుంది.      

     ఇక క్లైమాక్స్ కొస్తే, కోటలో పాగా వేసి దొరికిపోయిన నాగరాజు తల నరకమనలేదు ఆనవాయితీ ప్రకారం దేవరాయలు. నాగరాజూ మల్లీశ్వరీ లు ఎంత ప్రాణత్యాగానికి సిద్ధపడినా రాయలవారు పంతానికి పోలేదు. మన అంతరంగం చాలా దయాళువు కూడా. పైన చెప్పిన గ్రంధం ప్రకారం మన అంతరంగం మనతో అడ్డగోలుగా వాదించదు.  సత్యాన్ని తెలియ జేసి వూరుకుంటుందంతే.  రాయలి పాత్ర చేసింది ఈ పనే. నాగరాజు వేళాకోళం ఎంత కాడికి తెచ్చిందో కను విప్పయ్యేలా చేసి, అంతటి సంఘర్షణకీ తెర దించేసింది!
          కాబట్టి ఈ స్క్రీన్ ప్లే లో నాగరాజు మనసే అతడి శత్రువయ్యింది. అందుకే ఇది పనిగట్టుకుని విలన్ ఆర్టిస్టుల్ని పెట్టుకునే అవసరం లేని స్క్రిప్టులకి స్వర్ణ యుగపు స్క్రీన్ ప్లే రోడ్ మ్యాప్ అవుతోంది - కావాల్సింది సినిమా కథని స్టోరీ మైండ్ గా అర్ధంజేసుకునే తాహతు మాత్రమే!


-సికిందర్

(ఫిబ్రవరి 2010 ‘సాక్షి’ కోసం)  
          
          
          

Saturday, October 4, 2014

రివ్యూ..


పాసివ్ పాత్రకి పల్లకీ!
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణ వంశీ
తారాగణం: రాంచరణ్, కాజల్ అగర్వాల్, జయసుధ, కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, రెహమాన్,
కోట శ్రీనివాస రావు, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి తదితరులు.
సంగీతం: యువన్ శంకర్ రాజా,  ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి,  కళ : అశోక్, కూర్పు: నవీన్ నూలి
బ్యానర్ : పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ , నిర్మాత : బండ్ల గణేష్
సెన్సార్ : U/A        విడుదల : 1 అక్టోబర్, 2014.
***
పాసివ్ పాత్రకి పల్లకీతన తండ్రి అడుగుజాడల్లో మాస్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న రాంచరణ్ కాస్త సాత్విక పాత్ర
నటించాలన్న కోరిక కొద్దీ ఈ కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నాడు. ఏ యువ స్టారయినా మాస్
తప్పితే ఓ కుటుంబ కథా చిత్రం- ఈ రెండే ఛాయిస్ లు తప్ప ఇంకో వైవిధ్యానికి అవకాశ మివ్వడు కాబట్టి మార్పు లేకుండా ఈ రెండు - ఇవే తరహా సినిమాలకి ప్రేక్షకులు కూడా అలవాటు పడిపోవాలి. అదే
సమయంలో మార్పు లేకుండా అవే కథలకీ అలవాటు పడాలి. ఈ కథలు కూడా సీనియర్ స్టార్ల కాలం లోంచి అరువు దెచ్చుకునేవే కాబట్టి చూసేసిన ఆ పాతనే మళ్ళీ మళ్ళీ కొత్తగా ఫీలయ్యేందుకు ప్రేక్షకులూ మతిమరుపు తెచ్చుకుని సిద్ధపడాలి.  
          దర్శకుడు కృష్ణ వంశీకి కూడా మార్గాంతరం లేనట్టుంది. చాలా విచిత్రంగా హిందీలో ఉమ్మడి కుటుంబ కోలాహ కోలాటాల ‘హమ్ ఆప్ కే హై కౌన్’ బ్రాండ్ సినిమాల దర్శకుడు సూరజ్ బర్జ్యాత్యా అలాటి రెండు మూడు సినిమాలకే అంతర్ధానమైపోయాడు. కానీ ఆయన్నే అందిపుచ్చుకుని అలాటి ‘నిన్నే పెళ్ళాడుతా’ తీసిన కృష్ణ వంశీ మళ్ళీ ఇన్నాళ్ళకీ అదే ఫార్ములా వర్కౌట్ అవుతుందనుకోవడం ఆశ్చర్య పర్చే విషయం. ఈ వారం ‘టైమ్’ మ్యాగజైన్ లో అచ్చయిన ఒక ఆర్టికల్ ప్రకారం సీక్వెల్స్ హవాలో కొట్టుకుపోతున్న హాలీవుడ్ లో ఫ్యామిలీ డ్రామాలనేవి కనుమరుగై పోయాయి. అలాటి వొక డ్రమెటిక్ కామెడీ స్క్రిప్టు ఏళ్ల తరబడి వార్నర్ బ్రదర్స్ దగ్గర పడి మూల్గుతోంది. ఒక దర్శకుడు ధైర్యం చేసి చాలా లో- బడ్జెట్ లో తీస్తానని ఒప్పించుకున్నాడు. అది ‘దిస్ ఈజ్ వేర్ ఐ లీవ్ యూ’ గా తయారై ఈ సెప్టెంబర్ 19 న విడుదలయ్యింది. సుమారు 19 మిలియన్ డాలర్లతోనే  తీసిన ఈ సినిమా మొదటివారంలోనే 24 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఓహో అన్పించుకుంది. ఏమిటీ ఈ ఫ్యామిలీ డ్రామా కనబర్చిన తేడా అంటే, నల్గురు అన్నదమ్ములు పోట్లాడుకుని విడిపోయిన ఒక కుటుంబం కొన్నేళ్ళ తర్వాత తండ్రి మరణంతో అదే వూళ్లో అదే ఇంటికొచ్చి తమ తమ కుటుంబాలతో సహా  ఓ వారం గడపాల్సి వస్తే ఎలావుంటుందనే సమకాలీన పరిస్థితుల, మనస్తత్వాల చిత్రణ. ఇదే పేరుతో జోనాథన్ ట్రాపర్ రాసిన నవలకి తనే చేసిన చిత్రానువాదమిది. ఆడియెన్స్ ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే ఇందులో ఒక్కో పాత్రలో తమ జీవితాలే కన్పిస్తున్నాయి.
          ఇది ఈ కాలంలో సాధ్యం కాని ఉమ్మడి కుటుంబ కథ కానేకాదు. ఎవరి వృత్తి వ్యాపారాలు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోయిన దరిమిలా ఎందుకో తెగి పోయిన బంధాల పునరేకీకరణ ఇది. ప్రపంచంలో నేడు చాలా మంది తోబుట్టువులు ఎదుర్కొంటున్న గ్లోబల్ సమస్య ఇది.
          కానీ కుటుంబ సినిమాల ‘స్పెషలిష్టు’ కూడా అయిన కృష్ణవంశీకి ప్రత్యాన్మాయమే లేనట్టు, కుటుంబాల్లో వేరే సమస్యలే ఉండనట్టు, మళ్ళీ అదే తిరగమోత మూస ఫార్ములా తాలింపే శరణ్యమైంది. సూరజ్ బర్జ్యాత్యాని మళ్ళీ బతికించుకుని తెలుగు ప్రేక్షకుల్ని ఒప్పించుకోవాలనే తాపత్రయమే మిగిలింది.

            ఉద్రేకాల ఉమ్మడి కుటుంబం 
ఒకూళ్లో ఓ భూస్వామి బాలరాజు  ( ప్రకాష్ రాజ్) పాతికేళ్ళ క్రితం రోగుల బాధ చూళ్లేక ఊళ్లోనే పెద్ద కొడుకు చంద్ర శేఖర్ (రెహమాన్/రఘు) ని మెడిసిన్ చదించి పెద్ద ఆస్పత్రి కట్టిస్తాడు. ఆ కొడుకు తండ్రి ఆశయాన్ని ధిక్కరించి  బాగా సంపాదించుకోవాలని ప్రేమించిన పడతితో లండన్ వెళ్ళిపోతాడు. ఆ కొడుకుని చచ్చిన వాడి కింద లెక్కించి ఫోటోకి దండ వేసి పెడతాడు తండ్రి.
          చిన్నకొడుకు బంగారి( శ్రీకాంత్) తాగుబోతని ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఇద్దరు కూతుళ్ళని ఇల్లరికం వుంచుకుంటాడు. వాళ్ళ పిల్లలు ప్లస్ ఇంకో చిత్ర (కమలినీ ముఖర్జీ) అనే పెళ్ళికాని మేనకోడలు. ఈమె తల్లిని తండ్రి బలితీసుకుంటే తనే చేరదీశాడు బాలరాజు. ఈమెని పెళ్లి చేసుకోవాలని ఆవారాగా తిరిగే బంగారి ఎత్తుకు పైఎత్తులు. ఈపరిణామాలన్నీచూస్తూ లోలోన కుమిలిపోయే భార్య ( జయసుధ) వుంటుంది. మరో పక్క అన్న(కోట శ్రీనివాసరావు), అతడి కొడుకులూ పగబట్టి అడపాదడపా మారణాయుధాలతో విలనీ ప్రదర్శిస్తూంటారు. ఇలా చుట్టూ పొసగని బంధుత్వాలతో, బోలెడు ఉద్రిక్త వాతావరణంతో ఎప్పుడు బీపీ పెరిగి పడిపోతాడో తెలియని, సుఖం లేని ఉమ్మడి కుటుంబానికి ఘరానా అధిపతి గా ఉంటాడు బాలరాజు.
          అటు లండన్ లో స్థిరపడిన పెద్దకొడుకు ఇప్పుడు డాక్టర్ గా మంచి పొజిషన్లో ఉంటాడు. అయితే వచ్చిందనుకున్న యూనివర్సిటీ డీన్ పదవి మరొకరికి దక్కడంతో జ్ఞానోదయమై ఇది తనకి జరగాల్సిన శాస్తే నంటూ కొడుకు అభిరాం(రాం చరణ్) కి తన పూర్వ కథ వెల్లడిస్తాడు. తండ్రికి అలా ద్రోహం చేసినందుకే తనకిలా జరిగిందని వాపోతాడు. దీంతో అభిరాం చెప్పా పెట్టకుండా తండ్రిని తాతతో కలిపే ఆలోచనతో ఇండియా వచ్చేస్తాడు.
          ఇదీ విషయం. ఇప్పుడీ మనవడు తానెవరో తెలియనియ్యకుండా వ్యవసాయం నేర్చుకునేందుకు వచ్చిన ఎన్నారై గా నమ్మించి ఉమ్మడి కుటుంబంలో సెటిలవుతాడు. ఇక్కడ సరసాలకి మరదలు (కాజల్ అగర్వాల్) కూడా రెడీగా వుంటుంది. బంగారికీ, విలన్లకీ కంట్లో నలుసుగా ఉంటూ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటూంటాడు. తాతకి దగ్గరయ్యే ప్రయత్నంలో సెంటిమెంట్లు, డ్రామాలు పండించడాలు సమస్యలు తీర్చడాలు లాంటివి చేస్తూంటాడు... 
   రాం చరణ్ కి సంబంధించి నంతవరకూ ఈ పాత్ర కొత్తది కావొచ్చుగానీ, ప్రేక్షకులకి కొత్తేం గాదు. ఇలాటి పాత్రలు సీనియర్లు, సాటి యువ స్టార్లూ ఎన్నోసార్లు నటించగా నటించగా చూసేశారు. ఈ పాత్ర ప్రేక్షకులకి కొట్టిన పిండే కాబట్టి పాత్రపరంగా సస్పెన్సు ఏదీ లేకుండా పోయింది. పాత్ర ఎప్పుడేం చేస్తుందో, చివరికి కథ ఎలా ముగుస్తుందో చర్వితచరణమే గాబట్టి, రామ్ చరణ్ తానుగా ఫీలయ్యిన ఈ కొత్తదనం ఎలాటి క్రేజ్ నీ సృష్టించ లేకపోయింది. అపార వనరులూ, విస్తృత అవకాశాలూ వుండే ఏ వర్ధమాన యువ స్టార్ అయినా ఇతరులు నటించేసిన సెకండ్ హేండ్ పాత్రనే మళ్ళీ ఎందుకు నటించాలి? అదెలాటి ఇమేజి మేకోవర్?
          ఇక కాజల్ ఇంకా వొళ్ళు పెంచుకుని అలాగే కనపడ్డం ఆమె ఆఖరి ఘడియల్ని సూచిస్తోంది. అర్జెంటుగా ఆమె సన్నబడకపోతే ఉన్న అవకాశాలు కూడా సన్ననగిల్లిపోయే ప్రమాదముంది. ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ వుండదు. ఏ పాత్ర నటించినా ఆయన తనదైన ముద్ర వేసి వదుల్తాడు. ఇక శ్రీకాంత్ ఆవారా పాత్రలో కమెడియన్ లేని లోటు తీర్చాడు. మిగిలిన పాత్రల్లో నటీనటులందరూ షో పీసులుగా మిగిలారు. ఇలాటి ఉమ్మడి కుటుంబాల కథల్లో రెండు మూడు పాత్రలకే పనుండి, మిగిలిన పాత్రలు ఖరీదైన చీరలూ నగల ప్రదర్శనలతో బ్యాక్ గ్రౌండ్ ని నింపడానికే పొంచి వుంటాయి.
          ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఎక్కడపడితే అక్కడ నేను కూడా ఉన్నానంటూ కళా దర్శకుడు సైతం రంగుల డబ్బాలు పట్టుకుని ఎడాపెడా రంగులు పులిమేశాడు. ఇంత భీకర కళాదర్శకత్వం ఎక్కడా చూడం.
          సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం, రామ్ – లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ ల పోరాటాలూ- ఈ మూడు సాంకేతిక శాఖలే సినిమాకి దర్జాని చేకూర్చాయి. పరుచూరి సోదరుల సంభాషణలు పాత మూసలో లేకపోవడం ఒక రిలీఫ్.

            స్క్రీన్ ప్లే సంగతులు
    హీరోకి మార్పు కోసం, దర్శకుడికి పునర్జన్మ కోసం తీసిన ఇంతటి ప్రతిష్టాత్మక సినిమా స్క్రీన్ ప్లే సంగతుల గురించి చెప్పుకోవాలంటే ఇదొక బాధాకరమైన అనుభవం. ఇలాటి అనుభవం ఇలాటి భారీ సినిమాలతో ఇంకెప్పుడూ ఎదురు కాకూడదు. నిజానికి ఈ కీబోర్డు ఎల్లప్పుడూ ‘మనం’ లాంటి గుణాత్మకమైన, ఎక్సైటింగ్ గా వుండే స్క్రీన్ ప్లే సంగతుల్ని రికార్డు చేయాలని ఉరకలేస్తూంటుంది. కానీ అలాటి సినిమాలు అరుదై పోయాయి. శత అవకరాలతో వుండే స్క్రీన్ ప్లేలనే విశ్లేషించాల్సి వస్తోంది. ఈ విశ్లేషణలేవీ ఆయా దర్శకులకి రుచించవని తెల్సు. ఐనా సమాచారాన్ని అందించడమే ఈ బ్లాగు కర్తవ్యం.
          భూతద్దం పెట్టి వెతికినా ప్రస్తుత సినిమా స్క్రీన్ ప్లే లో ఏ అంకం ఎక్కడ మలుపు తీసుకుందో, అసలు అంకాలున్నాయో లేదో, రాం గోపాల్ వర్మ ‘అనుక్షణం’ లాగా లేడికి లేచిందే పరుగన్నట్టు ఎటు వెళ్తోందో తెలియనంత, భూమికూడా గుండ్రంగా ఉంటుందనే నిజాన్ని కూడా తిప్పి కొడుతున్నట్టు, మొదలంటా చదును చేసేసి వుంది. చదును చేసిన నేలలో రైతు విత్తితే పంట మొలకెత్తుతుంది. చదును చేసి సాపు చేసేసిన స్క్రీన్ ప్లే బీడు భూమిలో ఇంకే ఎత్తు పల్లాలు మిగుల్తాయి? ఆది మధ్యంతాల గొడవలేదు, ప్లాట్ పాయింట్స్ పేచీ లేదు, టైం అండ్ టెన్షన్ థియరీ తలనొప్పుల్లేవు, క్యారక్టర్ ఆర్క్, డైనమిక్స్, టెంపో బాదరబందీ అసలే లేదు ...చక్కగా గృహమే కదా స్వర్గ సీమ అని తోచినట్టల్లా రాసుకుంటూ పోతే అది ఇంత బిగ్ బడ్జెట్ సినిమా స్క్రీన్ ప్లే అయిపోయింది సులువుగా!
          ప్రథమార్థం గంటన్నర పాటు సుదీర్ఘంగా సాగి సాగి  గంటన్నరకి ఇంటర్వెల్ పడినా కథ పాయింటుకి రాకుండా, అసలింత సేపూ చూపించిన దాని ప్రయోజనమేమిటో అర్ధం గాకుండా, అయోమయంలో పడెయ్యడమే ‘కొత్త క్రియేటివిటీ’ లేదా ‘కొత్త సస్పెన్స్ కళ’ అనుకున్నారో ఏమో, ఇది కాస్తా బెడిసికొట్టి, ప్రేక్షకుల నుంచే ఫస్టాఫ్ బోర్ అనే టాక్ కి కారణమయ్యింది. బడ్జెట్ లో దాదాపు సగం వ్యయమయ్యే గంటన్నర నిడివి గల  సగం సినిమా బోర్ అన్పించుకుందంటే, ఆ డబ్బు పైసా పైసా కూడా వృధా చేసినట్టేగా? ఎంత దారుణం!
          స్ట్రక్చర్ లో లేని స్క్రీన్ ప్లేతో బాటు, పక్కా పాసివ్ హీరో పాత్ర  కథనపరంగా ఈ సినిమాని నీరసంగా తయారు చేశాయి. పాత్ర గురించి తర్వాత మాట్లాడుకుందాం; స్క్రీన్ ప్లే విషయానికొస్తే, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే, స్క్రీన్ ప్లే రచనకి మూడంకాలుంటాయి. అసలీ మూడంకాల పరంగానే సినిమా కథ అనే పదార్ధాన్ని ఆలోచించాలి. మరోలా ఆలోచించడానికి వీల్లేదు. యాక్టివ్ గా హీరో కథ నడిపితే కమర్షియల్ సినిమా, పాసివ్ గా కథే హీరోని నడిపితే ఆర్టు సినిమా ఎలా అవుతాయో, అలా అంకాలుంటే డబ్బులొచ్చే కమర్షియల్ సినిమా, అంకాలు మాయమైపోతే డబ్బులు కూడా మాయమైపోయే ఆర్టు సినిమానే అవుతాయి! ఇంకెవరు ఏ వాదనలు పెట్టుకున్నా ఈ కామన్ సెన్సుని మట్టుబెట్టలేరు.
            a) చేజారిన టెక్నిక్ 
          ఈ సినిమాలో ఇంకేవో నాల్గైదు సినిమాల ఛాయలున్నాయంటూ వస్తున్న టాక్ కూడా అప్రస్తుతం. మొత్తంగా కూర్చిన కథెలా వున్నదనే దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటే, సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు హై కాన్సెప్ట్ కథలతో వుంటాయి. అంటే హీరో పాత్రని అత్యంత రిస్కులో పడేసేవన్నమాట. పులి నోట్లో హీరో తల పెట్టాడు-అప్పుడేంటి? అన్న థ్రిల్లింగ్ ప్రశ్నని లేవనెత్తే కథలు. ప్రస్తుత సినిమా గురించే చెప్పుకుంటే, తాతని- తండ్రినీ  కలపాలనుకున్న హీరో ప్రాణాలు పోగొట్టుకోవడానికి సైతం తెగబడ్డాడు - అనే కాన్సెప్టు టెక్నిక్ అత్యంత ఆసక్తి రేపుతుంది. దీని కమర్షియల్ బెనిఫిట్స్ చాలా వుంటాయి. ఇది జరగాలంటే కచ్చితంగా కథని  హీరో పాత్ర పరంగా ఆలోచించాలి. అప్పుడు అంకాలు వాటికవే ఏర్పడతాయి. కమర్షియల్ సినిమా కథ ఒక్క హీరో పాత్రది తప్ప మరెవ్వరిదీ కావడానికి వీల్లేదు. 
          ఈ సినిమాలో ఇలా జరగలేదు. ఈ కథ హీరో పాత్రదని తెలిసినా, దర్శకుడు/రచయితలూ ఆక్రమించి గడుసుగా కథని నడుపుకుంటూ పోయారు. హీరోని నడిపించనియ్య లేదు. దీంతో సాంతం ఇది పాత కాలపు దైవిక సంఘటనల సమాహారం గా తయారయ్యింది! పాత్రని పక్కన బెట్టి కథ నడిపితే ఏ కథయినా ఇలాగే అంతా దేవుడి దయ చందంగానే తయారవుతుంది. దేవుడు కరుణించడం వల్ల అంతా సుఖాంతమయ్యింది- అనే అర్ధంలో ముగుస్తాయి.  ఓస్ ఇదా హీరోయిజమంటే అని ముక్కున వేలేసుకోవడం మన వంతవుతుంది!
          కోరికలు స్టార్ కే కాదు, ఆ స్టార్ నటించే పాత్రకీ వుంటాయి. కథని బట్టే పాత్రకి ఖరారయిన  కోరికలు నచ్చకపోతే ఆ పాత్ర నటించడం మానెయ్యాలే తప్ప, పాత్ర కోరికల్ని మట్టుబెట్టి నటించకూడదు. నా కథ నేను నడుపుకుంటాను ప్లీజ్ - అనేది పాత్రకుండే కనీస కోరిక. అప్పుడు నా కష్ట సుఖాలేవో నాకు బాగా తెలుస్తాయి, నా వ్యూహాలూ నిర్ణయాలూ ఎలావుండాలో, ఎప్పుడేం చేయాలో నా అనుభవంలోంచి సహజంగా నాకు తెలుస్తాయి, నా లక్ష్య సాధనలో నేనే ఎలాటి సంఘటనలు సృష్టించాలో, ఎలాటి మలుపులు తిప్పి ఆశ్చర్య పర్చాలో, రస పోషణ చేయాలో నాకు మాత్రమే బాగా తెలుస్తుంది సార్! – అంటూ  మొర పెట్టుకుంటుంది ఏ స్టార్ పాత్రయినా. ఈ సోది ఎవడిక్కావాలి అని పాత్రని వదిలేసి కథ నటిస్తే చివరికి ఆ స్టార్ కాస్తా హాస్యాస్పదంగా జీరోలా కన్పిస్తూంటాడు సినిమా ఆద్యంతమూ.
          b) మొదటి అంకం మనుగడ
      లండన్లో కథ మొదలెడుతూ ‘కాన్సెప్ట్’ ఏమిటో బాగానే చెప్పారు. ‘ఈ రోజు చేసే పని రేపటికి పెట్టుబడి’ అనే అర్ధంలో హీరో చేత డైలాగు చెప్పించి, తాతా తండ్రుల్ని కలిపే లక్ష్యంతో వండర్ఫుల్ గా ఇండియా పంపారు. అతను ఉమ్మడి కుటుంబంలో తన ఐడెంటిటీ బయట పడకుండా బెస్టుగా పాగా వేశాడు. అయితే ఇదింకా మొదటి అంకమే (అంటే ‘బిగినింగ్’ మాత్రమే) గనుక చకచకా పాత్రల పరిచయాలు, కథా నేపధ్యం ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా, చివరికి సమస్య ఏర్పాటుతో ( సింపుల్ గా ఇది గ్రాహ్య మవాలంటే రాం గోపాల్ వర్మ ‘శివ’ మొదటి అరగంట చూస్తే చాలు) ఈ అంకాన్ని ముగిస్తారని ఎదురు చూస్తూంటే, అరగంట- ముప్పావు గంటలో ముగియాల్సిన ఈ అంకం ఎంతకీ ఫస్టాఫ్ లో ముగియనే ముగియదు. ఇంతసేపూ పాత్రల పరిచయాలు, కథా నేపధ్యం ఏర్పాటు రెండే జరిగాయి. మిగతా రెండిటి ఊసే లేకుండా ఇంకా ఏవో కాలక్షేప సీన్లతో స్క్రీన్ టైము – షూటింగ్ ఖర్చూ దండగ చేసుకుంటూ, లక్ష్య సాధనలో హీరో ఎదుర్కోబోయే సమస్య తాలూకు పరిస్థితుల కల్పనా- ఇది ముదిరి అతణ్ణి సమస్యలో పడెసే మొదటి మలుపు అనే ధ్యాసే లేకుండా- - పక్క దార్లో ఇంకేదో ఉపకథ నెత్తుకున్నారు. చిత్రని బలవంతంగా బంగారి చేసుకుంటున్న పెళ్లిని హీరో ఆపే దృశ్యం మీద విశ్రాంతి వేసి, సామాన్య ప్రేక్షకుడు సైతం ఉస్సూరనేలా చేశారు. 

           హీరోకి ప్రత్యర్ధి పక్కపాత్ర బంగారి కానే కాదు. హీరోకి ప్రత్యర్ధి ముఖ్య పాత్ర తాతే. ఇంటర్వెల్ మలుపు సబ్ ప్లాట్ ( ఉపకథ) మీద ఎవ్వరూ వెయ్యరు, మెయిన్ లైన్ మీద దాని పాయింటుతోనే వేస్తారు. మెయిన్ లైన్లో తాతని ఢీకొనడానికి హీరో వచ్చాడు. అతడికి అంతర్గత- బహిర్గత సయ్యాటలు రెండున్నాయి. అంతర్గతంగా తాతా తండ్రుల్ని కలపడం, బహిర్గతంగా వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చిన ఎన్నారై గా నటించడం. మొదటిది మనం ఫీలయ్యే ఎమోషనల్ యాక్షన్, రెండోది మనకి కన్పించే ఫిజికల్ యాక్షన్. 


          ఈ మొదటి అంకంలో మెయిన్ లైన్లో ప్రేక్షకులకి గురిచేసిన అత్యంత ఆందోళనా పూర్వక ఎమర్జెన్సీ ఏమిటంటే, హీరో ఐడెంటిటీ తాతకి ఎప్పుడెలా ఎక్కడ తెలిసి పోతుందో ననే పాయింటుతో కూడిన ఫిజికల్ యాక్షన్ మాత్రమే. ఈ మొదటి అంకంలో ఈ బ్లాకు వరకూ హైలైట్ చేస్తూ నిర్వహించాల్సిన కథా పథకం ఇది మాత్రమే. కానీ ఈ ఎమర్జెన్సీని కూడా పట్టించుకోకుండా, ఇంకేవో కాలక్షేప సీన్లతో ఇంటర్వెల్ వరకూ లాక్కొస్తున్నప్పుడే అర్ధమైపోతుంది, ఈ కథ మొత్తంగా ఎంత చక్కగా అభాసు పాలవుతుందో! (మొదటి అంకం అందం చందం చూసి మొత్తం సినిమా జాతకం చెప్పెయ్యొచ్చు).


           ఐతే... ఐతే ఎంత పొరపాటు చేసినా, ఒక్కోసారి సిక్స్త్ సెన్స్ ఎగదన్నుకొచ్చి చేయాల్సిన పనిని కాస్తా అన్ కాన్షస్ గా చేయిం చేస్తుంది. చూసి చూసి డ్యామేజీ కంట్రోల్ కి పూనుకుంటుంది. ఇదే ఎట్టకేలకు హీరో ఐడెంటిటీ ఇంటర్వెల్లోనే బయటపడే సన్నివేశంగా క్రియేటయ్యింది! పెళ్లి దగ్గర హీరో బంగారితో పోరాడుతున్నప్పుడు సెల్ ఫోన్ పడిపోయి హీరోయిన్ కి దొరికిపోతుంది. అందులో ఆమె చూస్తే, హీరో తండ్రి ఫోటో కనపడి హీరో అసలెవరో ఆమెకి తెలిసి పోతుంది- బట్, బట్- ఈమె పక్క పాత్ర మాత్రమే! ఈ కీలక సన్నివేశంలో ఈమెకి అంత సీనే వుండకూడదు. ఈ కీలక సన్నివేశంలో ఆ ఫోటో కళ్ళ జూడాల్సిన పాత్ర - హీరో ప్రత్యర్ధి అయిన తాత మాత్రమే కావాలి! కానీ ఈ ప్రత్యర్ధి ఏమో ఉన్నట్టుండి ఎందుకో ఠపీమని స్పృహ తప్పి పడిపోతాడు- హతవిధీ! క్రియేటర్ల కాన్షస్ మైండ్ ఇంత కొంటెగా అడ్డుపడితే సిక్స్త్ సెన్స్ మాత్రమేం చేస్తుంది? ఇలా చెయ్యండి బాబూ అని హింట్ ఇచ్చే సిక్స్త్ సెన్స్, అలా చెయ్యకపోతే గొడవేం పెట్టుకోదు – ఎస్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్- అనేసి కాన్షస్ మైండ్ కి సలాము కొట్టి సైలెంట్ గా తప్పుకుంటుంది. 


          ఇలా ఇంత గందరగోళం మధ్య ఆ ఇంటర్వెల్ సీనుకి కూడా అర్ధం పర్ధం లేకుండా పోయింది.
          c) రెండో అంకం రగడ
          అలా ఇంటర్వెల్ దగ్గర కథ పాయింటుకి వచ్చీ రాకుండా (రాజకీయ నాయకుడి హామీలాగా),
మొదటి అంకం అక్కడ ముగిసిందో లేదో అర్ధం గాక, హీరోకి సమస్య ప్రారంభమయ్యిందో లేదో అంతు చిక్కక, సినిమా సెకండాఫ్ ప్రారంభమై, దీన్ని రెండో అంకం అనుకోవాలో వద్దో చెప్పే వాళ్ళు ఎవరూ లేక, అనాధ ప్రేక్షకులుగా మిగిలి పోయిన మనం మిగిలిన తమాషా చూస్తే- హీరో అసలెవరో తెలిసిపోయిన హీరోయిన్ ఆ సెల్ ఫోన్ని హీరోని బ్లాక్ మెయిల్ చేయడం కోసం వాడుకుంటుంది. అంతకి ముందు ఫస్టాఫ్ లో హీరోయిన్ కి చెందిన అభ్యతరకర ఫోటోతో హీరో బ్లాక్ మెయిల్ చేస్తూ ముద్దులు పెట్టించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సెకండాఫ్ లో హీరోయిన్ టర్న్ వచ్చిందన్న మాట. ఇలాటి టైం వేస్ట్ అమెచ్యూర్డ్ పునరుక్తి కథనాలు చాలా సినిమాల్లో వచ్చాయి. అదే ఈ సినిమాలోనూ పాల్పడ్డారు తప్ప కొత్త క్రియేటివిటీ ఏం లేదు.
          ఇలా సెకండాఫ్ లో ప్రారంభమైన రెండో అంకంలో అసలేం జరగాలి? మెయిన్ లైన్లో హీరోకి సమస్యతో పోరాటం జరగాలి. అంటే ప్రత్యర్ధి కూడా చలనం లోకొచ్చి అతడితో యాక్షన్ రియాక్షన్ల పరంపర కొనసాగాలి. హీరో పడుతూ లేస్తూ పోవాలి. కొత్తవిషయాలు నేర్చుకోవాలి. చివరికి ఈ రెండో అంకం చివర్న సమస్యకి పరిష్కార మార్గం కనుగొని, ప్రత్యర్ధిని చిత్తు చేయడానికి తిరుగులేని అస్త్రం ధరించాలి. ఇదీ రెండో అంకం బిజినెస్. ఇదే ఏ సినిమాకైనా వెన్నెముక. ఇది కూడా మొదటి అంకం బిజినెస్ తోనే డీలాపడిందో,  సినిమా నడ్డి విరిగినట్టే.
          ఇదే జరిగిందీ సినిమాలో. ఇంటర్వెల్ తర్వాతైనా రెండో అంకం జాడే లేదు. ఇంటర్వెల్ దగ్గర మొదటి అంకం ముగిసిందని విధిలేక మనం ఊహించుకుంటున్నాం – కానీ అక్కడ మెయిన్ లైన్లో తాతతో కాక హీరోకి పక్క ట్రాక్ లో హీరోయిన్ తో సమస్య ఎస్టాబ్లిష్ అయ్యింది. కనుక తనకి తెలిసిపోయిన అతడి రహస్యంతో ఆమె బ్లాక్ మెయిల్ చేయడమే సెకండాఫ్ కొనసాగింపు అయింది. ఇది మెయిన్ లైన్ కాదు. అంటే రెండో అంకం అనేది ఇంటర్వెల్ తర్వాతా ప్రారంభం కాలేదు. స్క్రీన్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే అసలు కథే ఇంకా ప్రారంభం కాలేదు. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే, మెయిన్ లైన్ ని పక్క లైను ప్రేమ ట్రాకు హైజాక్ చేసింది. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ వెళ్ళే ట్రాకులోకి రేపల్లె ప్యాసింజర్ వచ్చేసింది! పరస్పరం ఢీ – మెయిన్ లైన్ మటాష్. ఎక్కడికక్కడ మెయిన్ లైన్ ని చదును చేసుకుంటూ వెళ్ళడమే.
          కనుక ఇలా రెండో అంకం బిజినెస్ ని పక్క పాత్రల సబ్ ప్లాట్స్ స్మగ్లింగే కనుమరుగు చేశాక, చివరికి హీరో చేతికి ఏ పరిష్కార మార్గం చిక్కుతుందని? అందుకే లండన్నుంచి వచ్చిన చెల్లెల్ని కూడా తీసుకుని బేలగా తాత ఇంట్లోంచి పరాజితుడిగా వెళ్ళిపోయాడు!
          d) మూడో అంకం విరగడ  
     సమస్యకి పరిష్కార మార్గమే కనుగొనని హీరో చెల్లెల్ని తీసుకుని ఏటో వెళ్లిపోతూంటే సడెన్ గా తాత శత్రువు తాలూకు మనిషి ఆ చెల్లెల్నికిడ్నాప్ చేసెయ్యడం! మళ్ళీ మెయిన్ లైన్ ని వదిలేసి పక్క పాత్రలతో( చెల్లెలు ప్లస్ శత్రువు తాలూకు మనిషి) పక్క ట్రాకులో సందడి! తాతగారి అన్నా అతడి మిగతా గ్యాంగు ఏమైపోయారో క్లైమాక్స్ లో రారు. ఇక కన్పించరు. తన సబ్ ప్లాట్ లో హీరోతో మొదట్నించీ వున్న
కక్ష కొద్దీ మైనర్ విలన్, హీరో చెల్లెల్ని కిడ్నాప్ చేసిన దరిమిలా జరిపిన కాల్పుల్లో,  హీరో వొళ్ళు జల్లెడవుతుంది. దీంతో తాతగారు కరిగిపోవడం. శుభంకార్డు వేయడం.
          హీరోకి పరిష్కారమార్గం లభించకపోయినా ఈ మూడో అంకంలో అసలు జరగాల్సిందిదీ...చెల్లెల్ని మైనర్ విలన్ కిడ్నాప్ చేయడం, హీరో మీద కాల్పులు జరపడం గాకుండా, తాతగారి ప్రధాన శత్రువే ఫైనల్ గా యాక్టివేట్ అయి- తను తలపెట్టిన ప్రాజెక్టుకి అడ్డున్న ఆ తాతగార్ని హతమార్చేందుకు కాల్పులు జరిపితే, తాతని రక్షిస్తూ ఆ బుల్లెట్స్ కి హీరో గాయపడితే- ఈ పరిణామం తాతమీద ప్రభావశీలంగా వుంటుంది. కథ తాతా మనవళ్ళ మధ్య అయినప్పుడు, సంఘటనలు వాళ్ళ మధ్యే జరగి తీరాలి.
          ఈ ఒకటి – రెండు - మూడు అంకాలన్నీ మన ఊహాజనితాలే. సినిమాలో ఇవేవీ లేవని ముందే చెప్పుకున్నాం. కాబట్టి కథనానికి ఓ దారీతెన్నూ లేకుండా పోయింది.
          ఇక కథనంలోంచి పాత్ర చిత్రణల్లోకి వెళ్దాం –
            పాత్రోచితానుచితాలు
         
ఈ కథకి బీజం వేసే పాత్ర తాత బాలరాజు. చాలా విచిత్ర పాత్ర. పాత్ర చిత్రణ మీద పట్టులేక ఇతనో గందరగోళం వ్యక్తిలా కన్పిస్తాడు. ఇతడి మాటకీ చేతకీ పొంతనలేని చిత్రణ. గ్రామంలో వైద్యం అందక చనిపోతున్న రోగుల్ని చూసి తనే ఒక ఆస్పత్రిని కట్టించాడు. పెద్ద కొడుకుని మెడిసిన్ చదివించాడు. తీరా ఆస్పత్రి బాధ్యతలు చేపట్టమని కొడుకుని అడిగితే ఆ కొడుకు కాదని విదేశం వెళ్ళిపోయాడు.  
          అంతే, దాంతో ఆ కొడుకు చచ్చాడనుకుని అతడి పటానికి దండ వేసి పెట్టాడు. అంత ద్వేషించే కొడుకు పటం కూడా ఇంట్లో ఉండడాన్ని ఎలా సహిస్తాడు? కళ్ళ ముందు రోజూ ఆ ‘ద్రోహి’ రూపాన్ని పాతికేళ్ళుగా భరిస్తూనే వుంటాడా?
          ఆస్పత్రికి సంబంధించి తన ఆశయాన్ని కొడుకుకు కాదని వెళ్ళిపోతే, తన ఆశయాన్నేవదులుకున్నట్టు ఆస్పత్రి భవనాన్ని పాడు బెట్టిన ఇతడి చిత్త శుద్ధి ఎంత? ఆ కొడుకు కాకపొతే ఇంకో కొడుకు, వాడూ కాకపోతే ఇంకెవరైనా డాక్టర్లు - అదీ కాకపొతే ప్రభుత్వానికే ఆ భవనాన్ని అప్పగిస్తే మిగతా విషయాల్ని ఆ ప్రభుత్వమే చూసుకుంటుందిగా?  
          ఇలా చెయ్యక రోగుల్ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి ఇంకెన్ని చావుల్ని ఈ పాతికేళ్ళుగా కళ్ళ జూసి ఉంటాడో కదా! తన ఆశయంతో తనకే నిజాయితీ లేనప్పుడు, స్వార్ధంగా ఆలోచించాడని కొడుకునెలా
తప్పు పడతాడు? తనకి కొడుకు చేసిన ద్రోహం కంటే కూడా తను రోగుల పట్ల చేసిన అపచారమే ఎక్కువ.
          ఈ పెద్ద మనిషికోసం కాలం కూడా ఆగలేదు. ఊరూరా నిమిషాల్లో వచ్చి వాలిపోయే అంబులెన్సులు వచ్చాయి, రోగులకి పెద్దాసుపత్రుల్లో ఖరీదైన ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ పథకాలూ వచ్చాయి. ఇప్పుడు తగుదునమ్మా అని ఇతగాడి మనవడొచ్చి ఆస్పత్రిని పునరుద్ధరించడమంటే, ఆ ప్రభుత్వాన్నుంచి లక్షలు జేబులో వేసుకోవడానికే అన్నట్టు తయారయ్యింది చిత్రణ!
          ఇక ఉమ్మడి కుటుంబం సంగతి. కొడుకుల్ని వెళ్ళగొట్టి అల్లుళ్ళని ఇల్లరికంపెట్టుకోవడం, అన్నతో అతడి కుటుంబంతో కూడా సత్సంబంధాలు లేకపోవడం, ప్రాణాల మీదికి తెచ్చుకునే శత్రుత్వాలు పెంచుకోవడం, ఇంట్లో నియంతలా వ్యవహరిస్తూ ఆరోగ్యానికే చేటు తెచ్చుకోవడం, భార్యని తిని పడుండే బానిసలా చూడడం, ఇంటిల్లిపాదికీ తన కోపావేశాలతో నరకం చూపించడం- ఇంటా బయటా మోరల్ పోలిసింగ్ చేసే నిర్వాకం చూస్తూంటే...ఇందుకే వేరు కాపురాలే బెటర్ అని జంటలు తమదారి తాము చూసుకుంటున్నాయన్న సమర్ధనకోసమే ఈ చిత్రణ అన్పించేలా తయారయ్యింది క్రియేటివిటీ!

          మనవడి హీరోయిజం
          ఇవ్వాళ్ళ చేసే పని రేపటికి పెట్టుబడి అని డిక్లేర్ చేసుకుని కార్య రంగంలోకి దూకే హీరో- విచిత్రంగా అలాటి ఏ పనీ చేయడు. అన్నీ అతడికి కలిసి వచ్చేస్తూంటాయి! ఎప్పుడే సంఘటన జరుగుతుందా, దాన్నెలా ఉపయోగించుకోవాలా అని ఆశగా ఎదురుచూస్తున్నట్టు వుంటుంది ఇతడి ధోరణి. ఊళ్ళోకి రాగానే కోడిపందాల రాయుళ్ళ బారి నుంచి తాతని కాపాడ్డం, ఆ  వెంటనే ఇంటి కెళ్ళగానే తెగి పడిపోతున్న రోప్ వే మీదున్న పసిపిల్లని కాపాడ్డం, వీటిద్వారా ఇంట్లో మంచి మార్కులు కొట్టేయడం, తాత స్పృహ తప్పిపడిపోతే ఆ వంకతో పాడుబడ్డ ఆస్పత్రిని తండ్రి దగ్గర్నుంచి పరికరాలు తెప్పించి తెరిపించాలనుకోవడం, తద్వారా తాతనీ తండ్రినీ దగ్గర చెయ్యొచ్చనుకోవడం, తన ఐడెంటిటీ బయటపడకుండా నటిస్తున్న వాడు కాస్తా, సెల్ ఫోన్లో రట్టయ్యే ప్రమాదమున్నప్పటికీ అందులో తండ్రి ఫోటో పెట్టుకుని తిరగడం, చివరాఖరికి ఏకంగా టాబ్లెట్ లోనే పెట్టుకువచ్చిన లండన్లో తన ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలూ రట్టుచేసుకోవడం...ఇతను మనవడని తెలిసిపోయి తాత వెళ్ళ గొడితే చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోవడం, ఆ వెళ్లి పోవడం ఎక్కడికి వెళ్తున్నాడో స్పష్టత లేకపోవడం, ఇంతలో ఈ పై అన్ని దైవిక సంఘటనల్లాగే-ఇంకో సంఘన జరిగి మైనర్ విలన్ ఆ చెల్లెల్ని కిడ్నాప్ చేయడం, మరింకో  దైవిక సంఘటనలో కాల్పులకి గురై పడిపోతే- తాతకి హృదయం చలించి(!) కథ సుఖాంతం చేసుకోవడమూ ...ఈ సంఘటనల క్రమం చూస్తూంటే ఎలా అన్పిస్తోంది?
          తన లక్ష్యం పూర్తి చేసుకోవడానికి ఏ వ్యూహం పన్నాలో, ఈ కార్యాచరణ పాటించాలో ఒకయాక్షన్ ప్లాన్ అంటూ లేకుండా- కాలక్షేపం చేస్తూ- ఏదో దేవుడి దయవల్ల సంఘటనలు జరుగుతోంటే-ఆ క్రెడిట్ తను కొట్టేసి రెచ్చిపోవడాన్నేమంటారు? ఆదైవం కూడా నువ్వు కర్మ చెయ్, ఫలితాన్ని నాకొదిలెయ్ అని కదా అంటాడు. కానీ ఇతను ఫలితాలమీద కన్నేసి దేవుడు జరిపించే వాటి మీద కన్నేస్తూంటాడు. ఇలా వుంటే  దీన్ని పాసివ్ క్యారక్టర్ అంటారు. ఇది కూడా తెలుగు సినిమాల్ని చిరకాలంగా పట్టిపీడిస్తున్న రుగ్మత. ఇంకా తెలుగు సినిమాలున్నంత కాలం ఇది వుండే తీరుతుంది.
          ఇంకాస్త వివరంగా..
          కథానాయకుడన్నాక కథని తాను నడపకుండా, కథ నడిచినట్టూ తాను నడుచుకునే పాసివ్ పాత్రతో కథనమంతా విధివిలాసంగానే వుంటుంది. ‘డ్రమెటికా – ఏ న్యూ థియరీ ఆఫ్ స్టోరీ’ అని మెలానీ ఏన్ ఫిలిఫ్స్, క్రిస్ హంట్లీ అనే ఇద్దరు కలిసి డెవలప్ చేసిన పరిశోధనాత్మక స్క్రీన్ ప్లే థీసిస్ లో- యాక్షన్ క్యారక్టర్, డెసిషన్ క్యారక్టర్ అనే రెండింటి గురించి చెప్పారు. యాక్షన్ క్యారక్టర్ లక్ష్యం వెంట పడుతుంది. కథకి ఈ క్యారక్టర్ డ్రైవర్ లాంటిది. నిప్పు రాజేసి యాక్షన్ ని ఎల్లప్పుడూ పుట్టిస్తూ యాక్టివ్ క్యారక్టర్ గా వుంటుంది.
          అదే డెసిషన్ క్యారక్టర్ లక్ష్య సాధన అవశ్యకతని ఇతర పాత్రలకి ఉద్బోధిస్తూ మోటివేట్ చేస్తుంది.
అంత మాత్రాన ఇది చేతలుడిగిన పాసివ్ క్యారక్టర్ కాదు. ఇంకో రూపంలో వున్నయాక్టివ్ క్యారక్టరే.
          యాక్టివ్ క్యారక్టర్ do-er గా ఉండొచ్చు లేదా be-er గా ఉండొచ్చు. మొదటి తరహాగా వుంటే బౌతికంగా యాక్షన్ లో వుంటుంది, రెండో తరహాలో మానసికంగా యాక్టివ్ గా వుంటుంది. మైండ్ గేములు ఆడుతుంది. అప్రోచ్ లో తేడా తప్ప చేరే గమ్యం ఒకటే.
          పురాణాల్లో చూస్తే గోవిందుడు, అంటే కృష్ణుడు అతిపెద్ద యాక్టివ్ క్యారక్టర్. ఏ పురాణాల్లోనూ నాయకత్వ స్థానంలోవున్న ఏ పాత్రా దద్దమ్మలా పాసివ్ గా వుండదు. అందుకే అవి యుగాలుగా నిలిచిపోయాయి. కృష్ణుడైతే పైన చెప్పుకున్నట్టు యాక్షన్ - డెసిషన్ క్యారక్టర్ లు రెండూ కూడా. do-er, be-er  రెండూ కూడా!
          అతనెక్కడుంటే అక్కడ యాక్షనే. క్రిష్ణ్ నే కర్మ్ కీ రీత్ సిఖాయీ.. అని దేవానంద్ ‘హరే రాం హరే కృష్ణ’ లో పాడతాడు కూడా. గోవిందుడు అనేక రూపాలు ధరిస్తూ ఎలాటి లీలలనైనా చూపిస్తాడు. గోపాలకుల్లో, గోపికల్లో, గోవుల్లో, గోదూడల్లో..అన్నిటి రూపంలో తానుంటూ అందరిలో ప్రేమని జాగృతం
చేస్తాడు. అందరిలో – గోపాలకుల తల్లుల్లో సైతంశుద్ధ ప్రేమని జాగృతం చేస్తాడు. ఎటుచూసినా ప్రేమ-ప్రేమ
-ప్రేమ ప్రవాహాన్నే పారిస్తాడు...అందుకు ఎలాంటి చర్యలకైనా పాల్పడతాడు. అతడిక్కావాల్సింది సమస్త
జగత్తులో వాత్సల్యం, సఖ్య భావం, సామరస్యం.
          మరి మన గోవిందుడు ఈ లీలలేమైనా ప్రదర్శించాడా? ఉమ్మడికుటుంబ కథా ప్రపంచంలో ఈ అవకాశం వుండీ, అలాటి పురాణ పురుషుడికి మిథికల్ క్యారక్టర్ గా భాసించాడా? పురానికపాత్రాలు కాల్పనిక కథల్లో మెరిస్తే ప్రేక్షకులు/పాఠకులు ఆటోమేటిగ్గా కనెక్టయి తమ ఆత్మిక దాహాన్ని తీర్చుకుంటా రంటాడు జేమ్స్ బానెట్. ఇది మన గోవిందుడు కి సాధ్యంకాలేదు. ఎందుకంటే, అతడికి కోరికలు(లక్ష్యం)
అయితే ఉందిగానీ అవి తీర్చుకునే ఏ వ్యూహమూ లేదు!
          ఈ సందర్భంగా రాం గోపాల్ వర్మ తీసిన ‘రౌడీ’ పాత్ర చిత్రణ గురించి ఇదే బ్లాగులో ప్రస్తావించిన అంశాన్ని మరోసారి ఇక్కడ రీ ప్రొడ్యూస్ చేసుకుని ఈ టాపిక్ ని ముగిద్దాం:
          “
...పాసివ్ పాత్ర కమర్షియల్ సినిమా విజయానికి పనికిరాదనే విషయం ఇవ్వాళ్ళ కొత్తగా చెప్పుకుంటున్నది కాదు. ఈ సినిమాలో ఉన్నట్టే పాసివ్ పాత్రకి కథలో ఎదుగుదల కన్పించదు. అంటే క్యారక్టర్ ఆర్క్ ఉండదన్నమాట. ఇది లేకపోతే ఈ సినిమాలో లాగే చాలా బోరు కొడుతుందన్నమాట. ఈ పాత్ర సినిమా ప్రారంభంలో ఏ మానసిక స్థాయిలో వుందో, ముగింపు లోనూ జీవితంలోంచి ఏమీ నేర్చుకోకుండా అదే మానసిక  స్థాయిలో ఉండిపోయింది. అయినా కూడా ఇలాటి పాత్రతో నూ కథని రంజింప జేయగలమా అంటే, తప్పకుండా చేయవచ్చు. దీని మెకానిజం ఎలావుంటుందో అన్నా మరియా క్రమ్ అనే స్క్రీన్ ప్లే రచయిత్రి ఆసక్తికరంగా వివరించింది...ఇదామె కు 2008 లో విడుదలైన డిస్నీ- పిక్సార్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన వాల్-ఇఆనే యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చూసినప్పుడు  కలిగిన అవగాహన...ఇందులో వాల్-ఇ అనే  రోబో పొరపాటున అంతరిక్ష నౌకలో పడి ఒక గ్రహం మీది కెళ్తుంది. అక్కడ ఈవ్ నే ఇంకో రోబోని ప్రేమిస్తుంది. ఇతర రోబోల్ని ఇది వాటికున్న ప్రోగ్రామింగ్ ని మించి ఎదగవచ్చని మోటివేట్ చేస్తూంటుంది. ఒక్కో రోబోని ఒక్కో విధంగా ఎగదోస్తూ వాటి అంతర్గత శక్తుల్ని బయటికి తీయిస్తుంది. దీంతో ఆ రోబోలన్నీ వాల్-ఇ ని దైవసమానంగా చూస్తూ అరాధిస్తాయి. స్థూలంగా ఇదీ కథ.

         ఈ కథలో ప్రధాన పాత్ర అయిన వాల్-ఇ కి ఒక లక్ష్యం గానీ సంఘర్షణ గానీ లేకపోవడంతో దాని ఎదుగుదల- క్యారక్టర్ ఆర్క్ కన్పించదు. క్యారక్టర్ ఆర్క్ లేకుండా ఏ కథా ఎంజాయ్ చేయలేం. అలాంటిది వాల్-ఇ విషయంలో ఈ లోటే తెలీలేదు సదరు రచయిత్రికి. ఎందుకని? ఎందుకనంటే, అది ఇతర క్యారక్టర్ల ఎదుగుదలకి దోహదపడి వాటి క్యారక్టర్ ఆర్క్ లని తనే క్రియేట్ చేస్తోంది  కాబట్టి. అయితే  ఈ కోవలో ఇది సీరియస్ గా  క్లాసు పీకే పాత్రలా బోరు కొట్టే ప్రమాదం కూడా వుంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ఈ పాత్రకి హాస్యప్రియత్వం అనే లక్షణాన్ని జోడించారు.  వెరసి ఇదొక రూల్స్ ని బ్రేక్ చేసిన క్యారక్టర్ ఆర్క్ లేని విజయవంతమైన పాత్రగా సూపర్ హిట్టయ్యింది!
         
ఇలాటిది రౌడీలో జరగలేదు. జడం గా వుండే మోహన్ బాబు పాత్ర ఏ పాత్ర ఎదుగుదలనీ కోరుకోలేదు. కనీసం కుట్రని తిప్పికొట్టే సూత్రధారిగా ఇతర పాత్రల్ని తన ప్రయోజనం కోసం అస్త్ర శస్త్రాలుగా నైనా ఉపయోగించుకోలేదు. రూల్స్ ని బ్రేక్ చేయాలనుకుంటే అసలంటూ రూల్సేమిటో  తెలిసి వుండాలికదా? అదీ సమస్య!

-సికిందర్