స్వర్ణ యుగపు స్క్రీన్ ప్లే!
సినిమా కథకి దైవత్వాన్ని ప్రసాదించిన ప్రవక్త స్వర్గీయ బి.ఎన్. రెడ్డి అని అభివర్ణించవచ్చు.
1939 లో ‘వందేమాతరం’ నిర్మిస్తూ బి.ఎన్.రెడ్డి హంపి కెళ్తే, అక్కడి విరూపాక్షాలయం గర్భగుడి తీవ్ర భావావేశానికి లోనుజేసింది. ఇక్కడే కదా అలనాడు విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు
నించుని ప్రార్ధన చేశాడన్న స్పహకి కదిలిపోయి, ఎలాగైనా సరే రాయలవారి ఆ అంగరంగ వైభవాన్ని వెండితెర మీద దృశ్యమానం చేయాలన్న కోర్కె బలంగా నాటుకుపోయింది. ఇది పదేళ్ళకి నెరవేరేసరికి, ఆ కళాసృష్టి ‘మల్లీశ్వరి’ ప్రపంచ సినిమా జగత్తులోనే అజరామరంగా నిల్చిపోయింది!
1939 లో ‘వందేమాతరం’ నిర్మిస్తూ బి.ఎన్.రెడ్డి హంపి కెళ్తే, అక్కడి విరూపాక్షాలయం గర్భగుడి తీవ్ర భావావేశానికి లోనుజేసింది. ఇక్కడే కదా అలనాడు విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు
నించుని ప్రార్ధన చేశాడన్న స్పహకి కదిలిపోయి, ఎలాగైనా సరే రాయలవారి ఆ అంగరంగ వైభవాన్ని వెండితెర మీద దృశ్యమానం చేయాలన్న కోర్కె బలంగా నాటుకుపోయింది. ఇది పదేళ్ళకి నెరవేరేసరికి, ఆ కళాసృష్టి ‘మల్లీశ్వరి’ ప్రపంచ సినిమా జగత్తులోనే అజరామరంగా నిల్చిపోయింది!
బీఎన్ కేదో అతీతశక్తి ఆవహిస్తే తప్ప ఇది సాధ్యమయ్యేది
కాదు. ఆ శక్తి దేవరాయలు! స్వయంగా ‘ఆముక్త మాల్యద’ అనే అపూర్వ కావ్యఖండాన్నిచ్చిన
వాడు. ఆయనే బీఎన్ ని ప్రవక్తగా మార్చి ‘మల్లీశ్వరి’ అనే అనితర సాధ్య సృష్టితో ఈ
కళా ప్రపంచంలోకి పంపించి ఉంటాడు.
ప్రవక్తలు వాసికి బద్దులు.
గత 50 -60 సంవత్సరాల మధ్యకాలంలో
‘మల్లీశ్వరి’ (1951) గురించి ఎందరెందరో మహానుభావులు ఎంతెంతో రాసేశారు. ఇంకా
రాయడానికి ఏమీ మిగలనంతగా. అయినా ఈ రాస్తున్న కలం ఇంకేవో తంటాలు పడుతోంది. దేవరాయలి
గురించి ఓ కథ ప్రచారంలో వుంది. రాజకోట నిర్మాణం కోసం అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తూ
అరణ్యంలో కెళ్ళారు. అక్కడో వింత దృశ్యం ఎదురైంది. ఓ నాల్గు కుందేళ్ళు రెండు అడవి
కుక్కల్ని వెంటాడుతున్నాయి - గ్రేట్ యాక్షన్ సీన్! ఇది గమనించిన పండితులకి తక్షణం ఆ స్థల మహాత్మ్యం
అవగతమై ఇక్కడ గనుక రాజకోట నిర్మిస్తే, రాయలవారి రాజ్యం వెయ్యేళ్ళూ వర్ధిల్లుతుందని
సెలవిచ్చారు. ఇక కోట నిర్మాణం ప్రారంభమైపోయింది. ఆ భూమి పూజకి దేవరాయలు నదీ
స్నానమాచరించి, శంఖం పూరించాలి. ఆ శంఖా రావం విన్పించగానే పలుగుతో భూమ్మీద ఒక్క
పోటు పొడిచారు. అంతలో మరో శంఖారావం విన్పించి కంగారు పడి పోయారు. ఇదేమిటిది - అని
ఆరాతీస్తే, మొదటి రావం రాయల వారు పూరించింది కాదని తేలింది! దీంతో డీలాపడిపోయి, ఇహ
వందేళ్ళతో ఈ సామ్రాజ్యం పని సరి- అని కుమిలిపోయారు.
రాసి కాదు, వాసి ముఖ్యం. వందేళ్ళు
కూడా కాదు, అందులో కేవలం ఐదో వంతు- ఇరవై ఏళ్ళు పాలించినప్పటికీ ఆంధ్రభోజ శ్రీకృష్ణ
దేవరాయ సుభిక్ష పాలనకి ఆదర్శప్రాయంగా నిలచిపోయాడు. అలాగే కేవలం పదకొండు సినిమాలే
తీసినప్పటికీ బీ ఎన్ రెడ్డి ( 1908 – 1977) ప్రపంచ దృష్టినాకర్షించాడు. చలనచిత్ర
రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయ్యాడు. పద్మభూషణ్ కీ పాత్రుడయ్యాడు.
పోస్టల్ స్టాంప్ పైనా ప్రకాశించాడు. ఇంకేం కావాలి?
అలాటి ఆయన అందించిన ‘మల్లీశ్వరి’
చరిత్రకి కల్పనని జోడించిన అపురూప సంగీతభరిత ప్రేమ కథగా పండిత పామరులందర్నీ అలరిస్తోంది
నేటికీ. మరో కీర్తి కూడా దీని సొంతమైంది. స్క్రీన్ ప్లే పరంగా ఎన్నదగ్గ అతికొద్ది పాత క్లాసిక్స్ లాగే ఇది కూడా ఒక
పాఠ్యాంశం కాగలదని గుర్తించారు. అయితే ఈ పాఠ్యాంశాన్ని ఎవరెంత తమ తమ సినిమాల్లో వినియోగించుకున్నారో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం సినిమాలు పూర్తిగా రూపు రేఖలు
మార్చుకుంటున్న ఈ కాలంలో – కనీసం చిన్న సినిమాలకి సంబంధించి – ఒక ప్రత్యాన్మాయ
స్క్రీన్ ప్లే నమూనా అవసరం ఎంతైనా వుంది. ఈ అవసరాన్ని ‘మల్లీశ్వరి’ మహాద్భుతంగా
తీర్చగలదని బాక్సాఫీసుని గుద్ది మరీ చెప్పొచ్చు!
ఇప్పడు ఓంకార, లవ్ ఆజ్ కల్, లండన్
డ్రీమ్స్ వంటి సినిమాల్ని చూస్తే ఒక మార్పు కన్పిస్తుంది. వీటిలో గజినీ, వాంటెడ్
లలో లాంటి రొటీన్ మసాలా విలన్లు కన్పించరు. హిందీ మల్టీప్లెక్స్, ఓవర్సీస్
ప్రేక్షకులు ఇప్పుడు సినిమాల్ని కాలక్షేప బఠానీల కన్నా తేలిగ్గా తీసుకోవడంతో, పై
మూడు చిత్రాల్లో కేవలం పరిస్థితులు, పాత్రల మనస్తత్వాలు అనే రెండు ఎలిమెంట్స్
మాత్రమే కథలకి విలన్లుగా కన్పిస్తున్నాయి. ఇవే వాటి విజయాలకి సరిపోతున్నాయి.
కాలమహాత్మ్యమేమో...కుందేళ్ళన్నీ కలిసి అడవి కుక్కల్ని తరిమి కొడుతున్నాయి!
ఇదేగనుక తెలుగు సినిమాల్లోనూ
జరిగితే, ప్రేమ కథల్లో కూడా విలన్ గాడితో పొడిపించు కోవడాలు, రక్తాలు పారించు కోవడాలూ
ఇక వుండవు. అసలు విలన్ పాత్రే వుండదు!
బీఎన్ రెడ్డి విరూపాక్షాలయ
దర్శనానుభవం తర్వాత చాలాకాలం మంచి కథ కోసం అన్వేషించాడు. రెండేళ్ళూ గడిచి పోయాయి.
అప్పుడు రెండు కథలు దృష్టిలోపడ్డాయి.
అవి ఒకటి – మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమైన బుచ్చిబాబు నాటకం ‘రాయల కరుణాకృత్యం’
రెండు - ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ఈ
నాటకాన్నే పోలిన ఇంకో కథ.
ఈ రెంటినీ కలిపి ఓ కథ తయారు
చేసుకున్నాడు బీఎన్.
‘మల్లీశ్వరి’ చిత్రకథ తెలిసిందే.
నాగరాజు (ఎన్టీఆర్) అనే శిల్పి, అతడి మరదలు మల్లీశ్వరీ (భానుమతి)
ప్రేమించుకుంటారు. మల్లీశ్వరి తల్లి నాగమ్మ (ఋష్యేంద్రమణి) ఇందుకు వ్యతిరేకం. దీనిక్కారణం నాగరాజు రాళ్ళు కొట్టుకునే కూలీ కావడం. నాగమ్మ భర్త నారప్ప (దొరై
స్వామి) కి తనచెల్లెలి కొడుకైన ఈ నాగరాజు అంటేనే అభిమానం. ఈ పరిస్థితుల్లో ఓ
వర్షపు రాత్రి సత్రంలో మల్లీశ్వరి చేస్తున్న నాట్యాన్ని చూస్తాడు మారువేషంలో
రాజ్యం లో సంచరిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు ( శ్రీవాస్తవ).
అప్పుడున్న సాంప్రదాయాల ప్రకారం దేవరాయలు తన కెవరైనా పడతి నచ్చిందంటే ఆమె ఇంటికి
పల్లకీని పంపుతాడు. పల్లకీ వచ్చిందంటే ఆ పిల్ల అదెక్కి రాణీ వాసానికి
తరలిపోవాల్సిందే. ఇప్పుడా వచ్చి మల్లీశ్వరి నాట్యాన్ని చూస్తోంది సాక్షాత్తూ
రాయలవారేనని తెలీని నాగరాజు - ఈ మల్లిని మీ పల్లకీలో పట్టు కెళ్ళి పొండని వేళాకోళా
మాడేస్తాడు!
దీన్తర్వాత ఎప్పటికైనా మల్లిని
పెళ్ళాడ్డానికి డబ్బు సంపాదించుకుందామని నగరానికి వలసెళ్ళిపో తాడు నాగరాజు. అతనెళ్ళిపోయాక
ఇటు మల్లీశ్వరి ఇంటికి పల్లకీ వచ్చేస్తుంది. హతాశురాలైన ఆమెకి, అదెక్కి రాణీవాసానికి తరలివెళ్ళడం వినా గత్యంతర ముండదు.
తిరిగొచ్చిన నాగరాజు జరిగిందంతా తెలుసుకుని,
మల్లి మోసం చేసిందనే అపోహ పడి, పిచ్చోడైపోతాడు. ఒక శిల్పాచారి వచ్చి రాజకోటలో
నర్తన శాల నిర్మాణం పనులున్నాయని చెప్పి, నాగారాజుని తీసుకుపోతాడు. అలా రాజకోటలో
అడుగుపెట్టిన నాగరాజు అక్కడ ‘వంచకి అయిన మల్లి’ ని చూస్తాడు!
చరిత్ర ప్రకారం రాణివాసంలో
పడతులకేసి పరాయి మగాడు కన్నెత్తి చూస్తే శిరఛ్ఛేదం తప్పదు. అంటే ఇప్పుడు నాగరాజు
తల తెగిపడే పరిస్థితి అన్నమాట. బీఎన్ కరుణాకృత్యం’ నాటకమూ, ఇంకో పత్రికలోని కథా
అలా కలిసి వచ్చి రాయలని పాజిటివ్ గా చూపించే అవకాశం లభించింది గానీ లేకపోతే ఏమయ్యేదో.
ఇక్కడే స్క్రీన్ ప్లే లో విలన్ పాత్ర ఉనికిని శుభ్రంగా చేరిపేస్తోందీ సినిమా.
మరి విలన్ పాత్ర లేకపోతే కథెలా నడవాలి? నాగరాజు ఆడిన వేళాకోళమే అతడి పాలిట విలన్
అయ్యింది కదా! తెర మీద నడిచే సినిమా అంతా కూడా మన మానసిక ప్రపంచంలోని భావోద్వేగాల
సమాహారమే కదా! మన సబ్ కాన్షస్ మైండ్ తో కాన్షస్ మైండ్ ఆడే ఆటే కదా! కచ్చితమైన
స్క్రీన్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే, సినిమా కథని సినిమాకథ అనరు. స్టోరీ
మైండ్ అంటారు. ఈ దృష్టితోనే స్క్రీన్ ప్లే ని నిర్వచిస్తారు.
ఈ స్టోరీ మైండ్ లో నాగరాజు అనే
వాడు కాన్షస్ మైండ్ లాంటి వాడు. అంటే ఇగో అన్నమాట. తన ఈ ఇగో తన సబ్ కాన్షస్ మైండ్
తో, లేదా అంతరంగంతో చెలగాట మాడిందన్నమాట -
అలా వేళాకోళం చేసేసి! మరి ఈ అంతరంగానికి తెర మీద కన్పించే భౌతిక రూపం ఎవరు? అది
దేవరాయాలి పాత్రే!
ఇప్పుడు మనం గనుక డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన
ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘ది పవరాఫ్ యువర్ సబ్ కాన్షస్ మైండ్’ అనే గ్రంధాన్ని
ప్రామాణికంగా తీసుకుంటే, మన ఇగో చెప్పిన మాటని, లేదా చేసే ఆలోచననీ మన అంతరంగం తక్షణ ఆదేశాలుగా స్వీకరించి దాంతో
ఎక్కడికైనా, ఎంతదూరమైనా సాగి పోయి సాధించు కొచ్చేస్తుంది. ఈ సృష్టి అంతా
శక్తితరంగాల ఆటు పోట్లే తప్ప మరేం కాదుగా? ప్రతీదీ శక్తి తరంగాల గుచ్ఛమే. రాయీ రప్పా సైతం!
అలా నాగరాజు అంతరంగానికి పాపం నాగరాజు వేళాకోళ మాడేడని అస్సలు తెలీదు. హాస్యాని
కనే మాటల్ని కూడా నిజం చేసేయడం దాని నైజం. అందుకే ఇలాటి నమ్మకమైన సేవకుడు లాంటి అంతరంగ
ప్రతీక అయిన దేవరాయలి పాత్ర కాస్తా నాగరాజు చెప్పింది తు.చ. తప్పకుండా పాటిస్తూ మల్లీశ్వరి
ఇంటికి పల్లకీ పంపించేసిం దన్నమాట!
దేవరాయలి పాత్రని ఇలా అర్ధం చేసుకుంటేనేగానీ
అపోహలు తొలగవు. లేకపోతే ఇదేమిటీ, అంతటి మహా రాజూ వేళాకోళమని తెలిసీ ప్రేమికులతో ఇలాటి అనైతికతకి
ఎలా పాల్పడ్డాడూ అన్న సందేహం వస్తుంది.
ఇక
క్లైమాక్స్ కొస్తే, కోటలో పాగా వేసి దొరికిపోయిన నాగరాజు తల నరకమనలేదు ఆనవాయితీ ప్రకారం
దేవరాయలు. నాగరాజూ మల్లీశ్వరీ లు ఎంత ప్రాణత్యాగానికి సిద్ధపడినా రాయలవారు పంతానికి పోలేదు.
మన అంతరంగం చాలా దయాళువు కూడా. పైన చెప్పిన గ్రంధం ప్రకారం మన అంతరంగం మనతో అడ్డగోలుగా
వాదించదు. సత్యాన్ని తెలియ జేసి వూరుకుంటుందంతే.
రాయలి పాత్ర చేసింది ఈ పనే. నాగరాజు వేళాకోళం
ఎంత కాడికి తెచ్చిందో కను విప్పయ్యేలా చేసి, అంతటి సంఘర్షణకీ తెర దించేసింది!
కాబట్టి ఈ స్క్రీన్ ప్లే లో నాగరాజు
మనసే అతడి శత్రువయ్యింది. అందుకే ఇది పనిగట్టుకుని విలన్ ఆర్టిస్టుల్ని పెట్టుకునే
అవసరం లేని స్క్రిప్టులకి స్వర్ణ యుగపు స్క్రీన్ ప్లే రోడ్ మ్యాప్ అవుతోంది - కావాల్సింది
సినిమా కథని స్టోరీ మైండ్ గా అర్ధంజేసుకునే తాహతు మాత్రమే!
-సికిందర్
(ఫిబ్రవరి 2010
‘సాక్షి’ కోసం)