రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, October 7, 2014

రీ- రివ్యూ / ఆనాటి సినిమా 

ఒరిజినల్ నే తలదన్నింది!

అభినయంతో ఆమె కవిరాసిన పాత్రని ఇట్టే కవిత్వం చేసి పెట్టేయగలదు – మరి ఆమె అభినయ కళావిరుపుల మెరుపుల్ని అక్షరాల్లో పట్టగల కవి కుమారుడెవడు – కలాలు మొరాయించాల్సిందేగా!
            కలాల్నే ఓడించే కళా స్వామ్యమామెది!

          శ్రమలేని జీవితం నేరమైనట్టే, కళ లేని శ్రమా ఘోరమే. జీవితంలో కళనంతా కోల్పోయి, శ్రమలోనే కళని రెండు కళ్ళుగా చేసుకుందామె. తుది యంటూ లేని సుషుప్తావస్థలో తనుంటే, పైలోకాల్లో దేవతలకి స్వాగత సన్నాహాలు పూర్తి చేయడానికి నెలలకి నెలలూ పట్టేసిందని స్వయంగా ఆత్రేయ రాసేశాక, మానవ మాత్రులకి ఎన్నెన్ని జన్మలు కావాలి ఆమెకి సరితూగే నాల్గక్షరాలు ఏర్చి కూర్చడానికి...ఏవో తోచిన నాల్గు విశేషణాలు జోడించుకుని ఆనందించడం మినహా!
           సావిత్రియే ఒక విశేషణం, పర్యాయపదం. ఈమాట ఎవరు చెప్పారు? సాక్షాత్తూ వైజయంతీ మాలే చెప్పింది. అలా  నటనలో అత్యున్నత శిఖరాల అధిరోహణకి ఒక్క ముక్కలో సావిత్రీ అని అభివర్ణిం చెయ్యొచ్చు. గమనిస్తే - ఇంత  సులువు చేసి పోయింది సావిత్రి పెన్ మాస్టర్లకి!
          సినిమా అంటే జీవితమే అని ఆమె నిర్వచనమాయ్యాక, రౌద్ర రసంలో గాజులు పగిలి రక్తం చిందేంత, శోక రసంలో శోష వచ్చి పడిపోయేంత నటనా పటిమే ఆమె జీవితం నిండా చదివించే  పేజీలైపోయాయి. ఆ పేజీల్ని ఆబగా తిప్పేస్తూంటే, మూడు చోట్ల చెవులు పట్టి ఆపి చాచి కొడుతుందామె! ముందు ‘మిస్సమ్మ’ చదువుకోవోయ్, ఆ తర్వాత ‘మాయాబజార్’ చూసుకో, ఇంకా తర్వాత ‘చివరకుమిగిలేది’ తెలుసుకుని ముందుకుపో! ఫో!! – అనేసి. 
           మొదటి రెండూ తను అజరామరం చేసిన అమోఘ పాత్రలే. చివరిదే జాతీయంగా గెలిచిన గర్వించే పాత్ర. దేవదాసుగా అక్కినేని ఎక్కడెక్కడి వెండి తెర దేవదాసులందర్నీటోకున జయించేసినట్టే, ‘చివరకు మిగిలేది’ తో సావిత్రి ఇటు బెంగాలూ అటు బాంబే అభినేత్రులందర్నీ ఓడించి పారేసి, వచ్చి అక్కినేని సరసన నించుంది సగర్వంగా - తెలుగు జాతి బలిమిని చాటుతూ. ఈ చిత్ర రాజాన్ని ఒక మాగ్నం ఓపస్ గా చరిత్ర కెక్కించి చేతులు దులిపేసుకుంది!

          క్లైమాక్స్ సీనే ఈ ముగ్గురు తెలుగు – బెంగాలీ – హిందీ నటీమణుల టాలెంటు కి గీటురాయి అయింది. ఈ క్లైమాక్స్ అంటూ చిత్రీకరిస్తే అది రాత్రి పూటే వుండాలని నిబంధన పెట్టింది సావిత్రి. షాట్ పూర్తయ్యాక తన సమీపంలోకి ఎవరూ రావొద్దని ఆక్షలు విధించింది. రీటేకు లేమాత్రం లేని షాట్స్ తో, మతి చలించిన విధివంచిత పాత్ర ఆక్రందనని గుండె పగుల గొట్టుకుని మరీ ప్రతిష్టించేసి, వెళ్లి మూల కూలబడి వెక్కి వెక్కి ఏడ్వడమే! పాత్ర తాలూకు ఆ గుండె కోతంతా వదిలాక,  చక్కాలేచి గుడ్ నైట్ చెప్పేసి సొంత గూటికి వెళ్ళిపోవడమే!
             ఈ అమృత తుల్యమైన షాట్సే అటు బెంగాలీ మాతృక ‘దీప్ జలే జాయే’ లో సుచిత్రా సేన్ నీ, ఇటు మళ్ళీ హిందీ రీమేక్ 'ఖామోషీ’ లో వహీదా రెహమాన్ నీ ఆలౌట్ చేసేశాయి. స్వయంగా ఈ ఓటమి ఒప్పేసుకుంది కూడా వహీదా.
          మనసులాట ఇదంతా. వికటించే ఒక వింత ప్రయోగం. అయినా ఆ రిటైర్డ్ కల్నల్ డాక్టర్ (డాక్టర్ ప్రభాకర రెడ్డి) కి ఈ ప్రయోగమే కావాలి. మానసిక రోగులకి మందులతో గాక, ప్రేమతో వైద్యం చేయాలనే సూతత్రీకరణ. విఫల ప్రేమలతో పిచ్చివాళ్ళయిన పెషంట్లకి ప్రేమ నటించి బాగు చేస్తే బావుంటుందని ఆలోచన. అప్పటికి ప్రపంచంలో మొట్ట మొదటిదైన ఈ ప్రయోగాన్ని ఎలాగైనా విజయవంతంగా పూర్తిచేసి  పేరు ప్రతిష్టలు గడించాలన్నఆశ.  ఇందుకు సాధనం అదే ఆస్పత్రిలో పనిచేసే పద్మ ( సావిత్రి) అనే అమాయక నర్సు.  
           కేస్ – 1 : భాస్కర్ ( టి.ఎల్. కాంతారావు)అనే పేషంట్ తో, నర్సు పద్మ వలచి ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నిజంగా తనే ప్రేమలో పడిపోయింది. మనసారా అతను కోలుకుని వెళ్తూ, ఆమె చూపించిన ఈ ప్రేమ అంతా ప్రయోగంలో భాగంగా ఉత్తి నటనే అని అపార్ధం జేసుకుని వెళ్ళిపోయాడు. కాదూ నిజంగానే ప్రేమించానూ అని అతడికైనా, ఆ డాక్టర్ కైనా ఎలా చెప్పుకోవాలామె? ఎలా?

         కేస్ – 2 : ప్రకాష్ (ఎం. బాలయ్య) అనే ఇంకో పేషంట్ ని కూడా ఇలాగే నయం చేసి పంపించాలని డాక్టర్ ఇంకో హుకూం. వల్లకాదంది, తనవల్ల ఇక కాదంటే కాదంది. మనసంతా ఆ వెళ్లిపోయిన భాస్కరే నిండి వుంటే, బరితెగించి మళ్ళీ ఇంకోడితో నటనా? ఐనా ఉద్యోగ ధర్మం కొద్దీ ఓర్చుకుని ఎలాగో ఈ ప్రకాష్ కి సపర్యలు చేస్తూ, ఇతడి ప్రేమ కథలో మోసగించిన ప్రియురాల్ని తెచ్చి అప్పగించేస్తే, ఛీ కాదు పొమ్మన్నాడు. నువ్వే నా ప్రేయసీ అంటూ గలాభా సృష్టించాడు. మతిపోయి తలుపులు బిడాయిం చుకుని పిచ్చి చూపులు చూసింది. పచ్చిగా పిచ్చిదై తెరలుతెరలుగా నవ్వడం మొదలెట్టింది. అదే ఆస్పత్రిలో అదే పేషంట్లకి నయం చేసిన అదే గదిలో, తనే ఓ పేషంటైపోయి ఈసురోమంటూ చీకటిని మిగుల్చుకుని చతికిల బడింది. అప్పుడు మిన్నంటే అక్రందన -
          “నేను అభినయం చేయలేదూ , నిజంగా నేను అభినయం చేయలేదు! నేనెన్నడూ అభినయం చేయలేదు! అభినయించడం నాకు చేత గాదు, నా చేత గాదు, నా చేత గాదూ ..” అనేసి!
          “చిగురంటి వయసులో చిక్కని జీవితాన ...చివరకు మిగిలేది చీకటేనా కారు చీకటేనా” –(కృష్ణ శాస్త్రి)...సేవికగా, నటించే నాయికగా, మనసిచ్చిన మానినిగా, భగ్నహృదయిని గా, భయవిహ్వలగా, బలిపశువుగా... పాత్ర నడక (క్యారక్టర్ ఆర్క్) ని అంకురం దగ్గర్నుంచీ చివరాఖరికి విధ్వంసం వరకూ ఒంటి చేత్తో లాక్కెళ్ళేసి, నిటారుగా నింగి నంటించిన సినిమా ప్రపంచపు సామ్రాజ్ఞిని వృత్తి నైపుణ్యాన్ని వర్ణించడానికి ఆ భరతముని దిగివచ్చినా బలాదూరే!

      మతి పోగొట్టుకోవడంలో ఆ కళ్ళు తిప్పడం వుందే...అదే  సుచిత్రా వహీదా నటద్వయం చాపకిందికి నీరు తెచ్చేసింది! బేసిగ్గా ఈ కళ్ళు తిప్పే టెక్నిక్ ని ఈ అఖండ తారామణు లిద్దరూ ఎందుకు విస్మరించారో వాళ్ళకే తెలియాలి. పైపెచ్చు సుచిత్రా సేన్ లో పాత్ర డిమాండ్ చేసే సగటు ఆడదాని అణుకువ కంటే కూడా మోడరన్ గాళ్ పాయిజే పెల్లుబికింది బాగా. వహీదా రెహమాన్ లో సగటు స్త్రీ తొంగి చూసినా, ఆ కీలక మతి చాంచల్య ఘట్టంలో ఉల్లాస ఛాయలు దేనికో?
          మొత్తానికి ఇలా సావిత్రిదే పైచేయై పోయింది!
          1960 లో మంజీరా ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా బెంగాలీ మాతృక, ‘నర్స్ మిత్ర’ అనే నవలకి తెర రూపం. ఆశుతోష్ ముఖోపాధ్యాయ ఆ నవలా రచయిత. అసిత్ సేన్ ని దర్శకుడిగా పెట్టుకుని, అనిల్ చటర్జీ, సుచిత్రాసేన్ లని హీరో హీరోయిన్లుగా తీసుకుని ప్రఖ్యాత సంగీత దర్శుకుడు హేమంత్ కుమార్ ఈ సినిమా నిర్మాణం చేపట్టాడు. అది సూపర్ హిట్టయ్యింది. 1969 లో ఇదే దర్శకుడు రాజేష్ ఖన్నా –వహీదా రెహమాన్ – ధర్మేంద్ర లతో ‘ ఖామోషీ’ గా రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాపయ్యింది. 
          బెంగాలీలో హేమంత్ కుమార్ పాడిన ‘అయి రాత్ తుమార్ అమార్’ (ఈ రాత్రి నీదీ నాదీ) అనే హమ్మింగ్ సాంగ్ వుంది. ఈ ట్యూన్ నే తెలుగు రీమేక్ ‘చివరకు మిగిలేది’ లోనూ వాడుకుంటూ ‘సుధవో సుహాసినీ’ అని దేవులపల్లి కృష్ణ శాస్త్రితో పాట రాయించుకుని, ఘంటసాల చేత పాడించుకున్నాడు సంగీత దర్శకుడు అశ్వత్థామ. వేరే ట్యూన్ తో హిందీ రీమేక్ లో కిషోర్ కుమార్ పాడిన గుల్జార్ రాసిన పాట- ‘వో హ్ షామ్ కుచ్ అజీబ్ థీ’ గుండెల్లో సాయంకాలపు రాగాల్ని నాటుతుంది. ఇకపోతే బెంగాలీ మాతృక, హిందీ రీమేక్ ల కథనం కథానాయిక దృక్కోణంలో సాగుతుంది. 


           మొదటి కేసులో సాగే ఆమె ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ లో, అది కూడా నీడలా ఆ భగ్న ప్రేమికుడ్ని చూపించే టెక్నిక్ తో, డైరీలో ఆమె జ్ఞాపకాల్ని తోడుకునే కథనంతో లీలామాత్రంగా వుంటుంది. తెలుగులో దీన్నిదర్శకుడి దృక్కోణం (పాయింటాఫ్ వ్యూ) కి మార్పు చేశారు. రెండు కేసుల్నీ కేసుని వర్తమానంలో నడిచే కథలుగానే చూపించారు. దీనికి కారణాలేమిటో ఎగ్జిక్యూటివ్ నిర్ణాత ఎం.ఆర్. కొండల రెడ్డి వివరిస్తారు (కింది సెక్షన్లో చూడండి). అలాగే ఏసుప్రభు, పాలగ్లాసు, రేడియో దృశ్యాలతో పాటు; రాజబాబూ రమణా రెడ్డిల మెంటలోళ్ళ కామెడీ ఒరిజినల్ లో లేని చేరికలే. అప్పటి పాపులర్ హీరో హరనాథ్ కూడా ఓ ప్రత్యేకపాత్ర పోషించిన ఈ సినిమాకి గుత్తా రామినీడు దర్శకుడు. ఈయన అప్పుడప్పుడే ‘మా ఇంటి మహాలక్ష్మి’ అనే సినిమాతో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు పొంది వున్నాడు.

 చరిత్రలో ఒక పేజీ..
డా. ఎం.ఆర్. కొండలరెడ్డి 
చివరకు మిగిలేది నిర్మాతలుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు యు. పురుషోత్తమ రెడ్డి, ఎం. సత్యనారాయణ లున్నా, పర్యవేక్షణంతా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా డా. ఎం.ఆర్. కొండలరెడ్డి తన భుజానేసుకున్నారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ లో రాజధాని బ్యాంక్ ఉపాధ్యక్షులుగా, సెన్సార్ బోర్డు మెంబరుగా వున్నారు. ఈ వయసులో నీలకంఠ తీసిన ‘షో’ చిత్రం మీద ఎం.ఫిల్ కూడా చేస్తున్నారు. మృదుభాషి అయిన ఈయన దగ్గర ‘చివరకు మిగిలేది’ సమాచారం పుష్కలంగా వుంది!
           1959 లో ‘సినీ అడ్వాన్స్’ అనే పత్రికలో బెంగాలీ చిత్రం ‘దీప్ జలే జాయే’ రివ్యూ చదివి ఉత్తేజితుడైన ఈయన( అప్పట్లో ఒక ఆంగ్ల పత్రికలో సినిమా రివ్యూలు రాసేవారీయన) పురుషోత్తమ రెడ్డిని, దర్శకుడు గుత్తా రామినీడునీ వెంట బెట్టుకుని కలకత్తా వెళ్ళిపోయారు. అక్కడ నిర్మాతా సంగీత దర్శకుడూ అయిన హేమంత్ కుమార్ దగ్గర పది వేలకి ఆ సినిమా తెలుగు రైట్స్ కొని, మద్రాసు వచ్చేశారు. ముందు జమునని అనుకున్నారు. ఆమె పారితోషికం ఎక్కువ చెప్పడంతో, సావిత్రిని కలిశారు. ఈ సినిమా చేయడానికి సావిత్రి సాహసించక పోవడంతో, అక్కినేని నాగేశ్వర రావుతో చెప్పించారు. అలా ఒప్పుకున్న సావిత్రి అప్పుడే తన పారితోషికం 40 వేలలోంచి పాతిక వేలూ పెట్టి ఈ నిర్మాతల దగ్గరే తమిళ డబ్బింగ్ రైట్స్  కొనేశారు. ఐతే తెలుగులో ఈ రీమేక్ ఫ్లాప్ కావడంతో సావిత్రి తమిళ డబ్బింగ్ జోలికెళ్ళ లే దు. అది వేరే విషయం.

          సావిత్రి బిజీ కారణంగా నెలకి మూడు రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వడంతో, వీనస్ స్టూడియోలో వేసిన సెట్లో అలాగే ఆరు నెలల  పాటు షూటింగ్ జరిపారు. ప్రఖ్యాత దర్శకుడు కె.వి. రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. మూడు లక్షల బడ్జెట్ తో నిర్మాణం పూర్తి చేసి,  1960 అక్టోబర్ లో 12 ప్రింట్లతో విడుదల చేస్తే, వెనువెంటనే తిప్పికొట్టారు తెలుగు ప్రేక్షకులు. పిచ్చి సినిమాలో సావిత్రికి కాదు, ఇలాటి సినిమా తీసిన నిర్మాతలకి పట్టిందని చెడ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. విజయవాడలో ఒకే ఒక్క ఆటకి బాక్సు వెనక్కొచ్చేసింది. కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ లలో మాత్రం రెండు వారాలాడింది. మద్రాసులోని సౌత్ ఇండియన్ ఫిలిం క్రిటిక్స్ సంఘం దీనికి మూడు అవార్డులిచ్చింది(ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు). 1990 లో హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తే క్రిక్కిరిసి చూశారు డెలిగేట్లు. ఇప్పుడీ సినిమా ప్రింట్లు ఎక్కడా లేవు. చివరి ప్రింటు కూడా శిథిలమౌతూంటే, జాగ్రత్త పడి సీడీలు తీసి భద్రపర్చారు. ఆ సీడీలే ఈ రాస్తున్న ఆర్టికల్ కి మూలాధారం. ఇవి మార్కెట్లో విడుదల చేయలేదు. రైట్స్ కొనేవాళ్ళు లేరు. ఈ వ్యాసకర్త భుజానేసుకుని హైదరాబాద్, చెన్నైలలోని ప్రముఖ ఛానెళ్లలో ప్రయత్నించినా వాళ్ళు ముందుకు రాలేదు. ఈ సినిమా రైట్స్ తీసుకుంటే చివరికి తమకి కూడా ఏమీ మిగలదన్నుకున్నారో ఏమో. 

           అట్లూరి పిచ్చేశ్వర్రావు చేత మాటలు రాయించారు. తర్వాత కృష్ణశాస్త్రి వీటిని సంస్కరించారు. అయితే కథనంలో పాయింటాఫ్ వ్యూ పరంగా ఒరిజినల్ కీ ఈ రీమేకుకీ  వ్యత్యాసాన్ని కొండల రెడ్డి వివరిస్తూ- అలా తెలుగు ప్రేక్షకుల సౌలభ్యం కోసమే  చేశామన్నారు. కాంతారావుతో సావిత్రి ప్రేమాయణాన్ని అలా ప్రత్యక్షంగా చూపించక పో తే తెలుగు ప్రేక్షకులకి నచ్చేది కాదన్నారు. అలాగే సావిత్రి బాలయ్యని డీల్ చేస్తున్నప్పుడు, ఒరిజినల్ లో లాగా తల్లి ప్రేమ యాంగిల్ ని ప్రవేశపెట్టినా కూడా మన ప్రేక్షకులకి రుచించేది కాదన్నారు. సూడో ఫీనియా, ఎక్యూట్ మేనియా, వంటి వైద్య భాషని, బాల్యం నించీ వివిధ దశల్లో పురుషుడి మానసికావస్థ కి సంబంధించిన డిస్కషన్ నీ ఇందుకే పరిహరించామన్నారు. తర్వాత 1964 లో కొండల రెడ్డి తానొక్కడే నిర్మాతగా జగ్గయ్య, కృష్ణ కుమారి లతో ‘వీలునామా’ నిర్మించి విజయం సాధించారు.



-సికిందర్ 

(డిసెంబర్ 6, 2009 సావిత్రి జయంతి సందర్భంగా 'సాక్షి' కోసం)