రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 4, 2014

ఆనాటి సినిమా!

క్లాస్ విలనీకి కేరాఫ్!
గుమ్మడి వెంకటేశ్వరరావు ఉరఫ్ జడ్జి విశ్వనాథ్ 


కొన్ని పాత్రలు ఫలానా ఆ ఒక్కరి కోసమే అన్నట్టుగా పుడతాయి. ఆ చెప్పుల్లోకి వేరొకళ్ళు కాళ్ళు పెడితే పుళ్ళే పడతాయి. గుమ్మడి ఎందులో కాలెట్టినా పూలే పూస్తాయి. అయినా ఎందుకో గుండె పోటుకి పర్యాయపదంగా ఆయన్నిచేసి ఓ చట్రంలో బిగించేశారు. చూసి చూసి ఆ గుమ్మడి ఓ వాటమైన గుండె దిట వుగల పాత్రతో గుండెదడే  పుట్టించి వదిలాడు. పోయెటిక్ జస్టిస్ అన్నమాట అది. కాబట్టి బివేర్ ఆఫ్ గుమ్మడి వెంకటేశ్వర రావు ఉరఫ్ జడ్జి విశ్వనాథ్ క్యారక్టర్!

నేనూ విలన్నే..అని చాటుకోవడం గుమ్మడికి కొత్తేం గాదు. 1956 లోనే ‘ఏదినిజం’ తో అది పూర్తయ్యింది. నవీన యుగంలో ‘మొండిఘటం’ లో చిరంజీవితోనూ ఆ దుష్టత్వం పండింది. ఇక పూర్తిస్థాయిలో, అదికూడా టైటిల్ రోల్ లో, తన విలనీ విశ్వరూపాన్ని దిగ్విజయంగా చూపించిన చలనచిత్రం మాత్రం –‘నేనూ మనిషినే!’

సినిమా రచయితలు నాటకాలు రాయాలని, నటులు సైకాలజీ చదవాలనీ ఎవరో అన్నారు. కానీ  చదివీ రాసీ అభివృద్ధి చెందాలనుకోవడం బొత్తిగా లో- క్లాస్ యాక్టివిటీ గా, పరమ నామోషీగా ఫీలైపోయే వాళ్లకి,  ‘నేనూ మనిషినే’ ఖామోషీగా, శ్రమ లేకుండా ఒక లై షోయే చూపించేస్తుంది! ఏమిటా లైవ్ షో? సినిమా రచనంటే ఏమిటో, నటనంటే ఏమిటో కూడా చిత్తగించ డానికి క్రైం పిక్చర్ ఎప్పుడూ ఒక ఛాన్సే. క్రైం సినిమాల్ని ఉత్త టైంపాస్ బఠానీలుగా తీసి పారెయ్యొచ్చు ఎవరైనా. ఐతే వాటిలో వుండే మేధకి కాస్త హృదయ బాధని కూడా జోడిస్తే కలకాలం గుర్తుండి పోనూవచ్చు. ఈ సినిమా తీసిన నిర్మాత దీన్నే ఆచరణలో పెట్టి చూపించాడు!

రామప్ప సుందరం 
తమిళనాడు సేలంలోని మోడరన్ థియేటర్స్ లిమిటెడ్ పేరు  తెలియని వాళ్ళుండరు. దీని అధినేత రామప్ప సుందరం తండ్రి ప్రవేశ పెట్టిన  లో-బడ్జెట్ సినిమాల మేకింగ్ ని తు. చ. తప్పక పాటించిన వాడు.  సీనియర్ సుందరం (1907-63) రచయితల్ని సంస్థకి గొప్ప ఎస్సెట్స్ గా పరిగణించి, ఉద్యోగ ప్రాతిపదికన నియమించుకుని, రాయించుకునే వాడు. ఆ రచయితల్లో  కరుణానిధితో మొదలుకొని భారతీ దాసన్, ఆశై తంబీల వరకూ ఎందరో  వున్నారు. అతను తన చిన్న తరహా సినిమాలకంటూ కొన్ని నిర్దిష్ట ప్రమాణాల్ని స్థిరీకరించాడు. సూటిగా స్పష్టంగా ఉండే కథ, పరుగులెత్తే కథనం, షార్ప్ టేకింగ్, సూపర్ ఫాస్ట్ యాక్షన్ సీన్స్, క్యాచీ సంగీతం, నృత్యాలూ హాస్యం వగైరా. ఇలా తండ్రి సాంప్రదాయాన్నే తుదివరకూ కొనసాగించిన జూనియర్  సుందరం కూడా, తనెలా సక్సెసయ్యాడో చెప్పడానికి ఎస్వీ రంగారావుని రౌడీగా చూపిస్తూ ‘మొనగాళ్ళకి మొనగాడు’, గుమ్మడి ని విలన్ గా  చేసి ‘నేనూ మనిషినే’ ...రెండు విజయవంతమైన ప్రయోగాలూ  చాలు!

గుమ్మడిదసలే  గ్రెగరీ పెక్ ని మరపించే నటన, ప్రాణ్ ని తలపించే ఉచ్ఛారణ...
ఇవన్నీ ఒకెత్తు- ‘నేనూ మనిషినే’ లోని జడ్జి క్యారెక్ట రొక్కటీ ఒకెత్తు. ఆ దర్జా, దర్పం, ఫుల్ సూటులో టక్ చేసి, 
నెత్తిన హేటుతో, కళ్ళకి బ్లాక్ స్పెక్ట్స్ తో, , నోట సిగరెట్ పట్టించి పొగ మేఘాలు వదుల్తూ, చేత రివాల్వర్ పట్టి, ఎవర్నీ లెక్క చెయ్యని తనంతో, ఇలా ఫెళఫెళ లాడే గుమ్మడిని ఇంకే సినిమాలోనూ చూడం! చేసుకోక చేసుకోక పెళ్లి చేసుకుంటే ...ఎడారిలో ఒయాసిస్సు లా దక్కిన భార్యని కడదేర్చిన వాణ్ణి స్వయంగా అంతమొందించ కుండా ఎలా ఉంటాడు ఎంత జడ్జి అయినా...అనే మనసులోని చీకటి కోణంతో రగిలిపోతాడు జడ్జి పాత్రలో గుమ్మడి! నేరం గిట్టుబాటు కాదని తెలిసీ మనిషి ప్రతీకారేచ్ఛతో తనలోని రెండో మనిషి వైపే మొగ్గు చూపుతాడు...

ఇక్కడ డా. సి. నారాయణ రెడ్డి జోక్యం చేసుకుని తన పదునైన కలానికి పని చెప్తారు- సినిమా ప్రారంభాన్ని ఏకాగ్రతతో చూసే వాళ్ళకి సినారె రాసిన పాట గుండెల్లో గుబులెత్తిస్తుంది. ఇది ముందు జరగబోయే కథకి సూచనప్రాయంగా  స్క్రీన్ ప్లేలో వాడిన ఫోర్ షాడోవింగ్ అనే టెక్నిక్. గుమ్మడి హత్య చేయడానికి బయల్దేరి పోతూంటే, నేపధ్యంలో దాని పర్యవసానాల్ని హెచ్చరించే పాట .. ‘ఏది కలలోన అసలైన న్యాయం, తెల్చగల్గేది కనరాని దైవం, మనిషి పగబూని చేసేటి నేరం, ఎపుడు దిగిపోని పెనుపాప భారం..’

ఇంత భావోద్వేగంతో ఈ పాట వస్తూంటే గుమ్మడిని అలా వెళ్ళకుండా ఆపెయ్యాలన్పిస్తుంది... ‘మనసు పోరలోన పెరిగే కళంకం, కడిగినా మాసిపోని పంతం, అచట లేదోయీ ఏ కాలిబాట, కానరాదోయీ ఏ పూల తోటా, అచట కరిసేను రాకాసి ముళ్ళూ, అపుడు కురిసేను కన్నీటి జల్లూ..’

పాథెటిక్!

సాగిపోతున్న ట్రైన్ లో గుమ్మడి చేసే హత్యకి ప్రత్యక్ష సాక్షి అవుతుంది కాంచన! ఐరనీ ఏమిటంటే, ఈవిడ తెలీక అదే గుమ్మడి కూతురికి పాఠాలు చెప్పే టీచరుగా వచ్చేస్తుంది. సాలెగూడులో సాక్షి అన్నమాట. ఇక ఆడుకోవడమే గుమ్మడి పని! బ్యూటిఫుల్ డైనమిక్స్.
ఈయన తమ్ముడి గా ఎస్పీ పాత్రలో హీరో కృష్ణ ఉంటాడు. కాంచనని  ప్రేమిస్తున్న ఇతను హంతకుణ్ణి గుర్తించడానికి పోలీస్ స్టేషన్ కి రమ్మంటాడు. అప్పుడు కాంచన నోర్మూయించడానికి గుమ్మడి ఆమె చిన్నారి చెల్లెల్నే ఎత్తుకొచ్చేసి ఇంట్లో పెడతాడు. కాంచన నోరు విప్పితే ఈ పిల్ల ఫినిష్ అవుతుందన్న మాట. ఎత్తుకు పై ఎత్తుల కథాపథకం! కాంచనకి పెద్ద డైలమా. పైగా పదవికి రాజీనామా చేసిన గుమ్మడిని  ఇంకా అదే జడ్జి హోదాలో అవే  దానధర్మాలు చేస్తున్న  దైవంగా కొలుస్తూ జనాలు! దీన్ని కూడా ఎలా ఛేదించాలి  కాంచన?

ఇలాటి అంతర్మథనంతో ఈమె వుంటే, ఓ ప్రమాదం జరిగి సాక్షాత్తూ అదే గుమ్మడి ఆమెకి రక్తదానమిచ్చే పరిస్థితి దాపురిస్తుంది! మోరల్ గా కూడానూ ఇలా బందీ అయిపోయాక ఇంకేం చేస్తుంది? పాజిటివ్ గా, నెగెటివ్ గా ఇలా ప్రతిబంధకాలు పెరిగిపోతున్నాయి- దోషిగా గుమ్మడిని పట్టివ్వడం ఎప్పటికీ సాధ్యం కాదా?

ఇక పూర్తిగా గుమ్మడికే వత్తాసు పలకాల్సిన ఘట్టమూ వస్తుంది..గుమ్మడి అసలు తనెందుకు హత్య చేయాల్సి వచ్చిందీ  చనిపోయిన భార్య రాసిన లేఖ చూపించేసరికి భోరు మంటుంది కాంచన! జడ్జియే  విలన్ అయిపోతే ఇక సాక్షికి సాగుతుందా?

కాంచనతో సమస్య సమసిపోయాక మరొకరితో ముంచుకొచ్చే ప్రమాదాన్ని ఓపెన్ చేయడం...కథనంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ నెస్ కోసం టైమింగ్ తో పాత్రల్ని రప్పించడం!

సత్యనారాయణకి ఈ జరుగుతున్న పరిణామాలేవీ నచ్చవు. . కాంచన గుమ్మడికి వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్తుందని నమ్మాడు.  అది జరక్కపోవడంతో ఆ గుమ్మడినే రివాల్వర్ పెట్టి  షూట్ చేసి పారేస్తాడు. వెళ్లి కోర్టు బోనులో నిలబడతాడు. అయితే దీనికి ముందు అసలా హంతకుడు తన అన్నే అని తెలుసుకున్న కృష్ణ ఠారెత్తిపోతాడు. ఏం చేయాలో పాలుపోదు. రక్తసంబంధంతో అన్నని కాపాడాలా, ఉద్యోగ ధర్మంతో పట్టివ్వాలా?
సత్యనారాయణ చేసుకున్న ఖర్మ మేమిటంటే, గుమ్మడి హత్య చేశాడని భావిస్తున్న సంఘటనలో, గుమ్మడి మీద సత్యనారాయణ హత్యాయత్నం జరిపిన ఘటనలోనూ ఫాటల్ బుల్లెట్స్ ఒకటేనని ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది! అంటే గుమ్మడి చంపి పడేసిన రివాల్వర్ ని తెచ్చుకుని గుమ్మడినే చంపబోయాడన్న మాట. దీంతో సీను రివర్సై, గుమ్మడి చేసిన హత్యలో తనే హంతకుడిగా ఇరుక్కుంటాడు!

గుమ్మడికి ఎంతో రిలీఫ్, సత్యనారాయణకి లైఫ్ తో కటీఫ్!

మరి కృష్ణకి?
ఒకానొక ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ నవల్లో  ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ అంటాడు సెక్రెటరీ డెల్లా స్ట్రీట్ తో- “నా దృష్టిలో లాయరనేవాడు వాస్తవాలతో పేకాడేవాడు. సాక్షి విశ్వసనీయత ఏపాటిదో తెలుసుకోవాలంటే  వాస్తవాల్ని పేకముక్కల్లా కలిపేస్తూ తికమక పెట్టేయాల్సిందే. ఆ వాస్తవాల్ని తను తొ క్కిపట్టనంతవరకూ, వక్రీకరణలతో కేసుని తారుమారు చేయనంత వరకూ, సాక్షితో ఏం చేసినా లీగల్ గా అతను తన హక్కుల పరిధిలో తాను ఉంటూ కేసు వాదిస్తున్నట్టే లెక్క”-అని!

ఒక ఉన్నత పోలీసు అధికారిగా కృష్ణ తన అన్నకి అనుకూలంగా ఈ వాస్తవాల వక్రీకరణలకే  పాల్పడబో తాడు! రక్తసంబంధానికే లొంగి పోయాడతను. హోదావల్ల అవకాశం దక్కితే స్వార్ధాలు, నైతికపతనాలు, అధికార దుర్వినియోగాలూ సమస్త రుగ్మతలూ ఎలా వెల్లువెత్తుతాయో ఇక్కడ చూస్తాం మనం. వీటన్నిటికీ కేంద్రబిందువులా ఉంటూ తమాషా చూసే గుమ్మడి!

కథనంలో గాఢత పెరుగుతూ కథాత్మ ఆవిష్కారమౌతోంది!

మనిషి దేవుడిలా కన్పిస్తే ఇంతేనా? ఎలాటి శిక్షకీ అతను అతీతుడైపోతాడా?

హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ‘జడ్జి డ్రెడ్’ (1995) లో అతడిది జడ్జి పాత్ర. అతడిమీద హత్యానేరం రుజువయ్యాక, చీఫ్ జస్టిస్ మరణశిక్ష విధిస్తున్నట్టు ఎంతో గంభీరంగా తీర్పు చెప్పేసి, పక్కనున్న జ్యూరీ వైపు చూసి- “మనోడే! ఎప్పట్నించో వున్నాడు-కాస్త చూసుకోండి!”- అని మెత్తగా అనేసి వెళ్ళిపోతాడు.

అప్పుడా జ్యూరీ గుసగుసలాడుకుని, బోలెడు సెంటిమెంటుతో తోటి జడ్జీ అయిన స్టాలోన్ కి యావజ్జీవానికి ఆ శిక్షని కుదిస్తూ పైకి మాత్రం- “మన జేవితాల్లోంచీ, జ్ఞాపకాల్లోంచీ వీడి గుర్తుల్ని చెరిపి పారేద్దాం!” –అని కటువుగా లోకానికి ప్రకటించి,  ‘నిజాయితీ’ ని చాటుకుంటారు!

ఇదన్న మాట ‘మనోడు’ అనుకున్న వాడితో జరిగే యూనివర్సల్ ప్రహసనం. కాబట్టి గుమ్మడి తోనూ ఇంతే!
1960లో బీఆర్ చోప్రా తీసిన ‘కానూన్’ (చట్టం) అనే హిందీ ఆఫ్ బీట్ సినిమాలో జడ్జి పాత్రధారి అశోక్ కుమార్ ఇలాగే హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈయన ఉబుసుపోక చేసిన ప్రయోగం ఏమిటంటే,  నేరం చేసి తప్పించుకోవచ్చని పందెం కాయడం! ఐతే దర్శకుడు చోప్రా ఈ జడ్జి ముద్దాయిని ఫార్ములా ముగింపుతో ఒడ్డున పడేస్తాడు. ఆఫ్ బీట్ సినిమాకి ఫార్ములా ముగింపులు బావుంటాయా?

గుమ్మడి కిచ్చిన ముగింపు అలా కాదు- ‘అచట లేదోయీ ఏ కాలిబాట, కానరాదోయీ ఏ పూల తోటా’- అనే జ్ఞానోదయమైంది చివరికి... ఇందర్ని బాధపెడుతూ పొందే సుఖం ఓ సుఖమా? అమాయకుడు ఉరికంబ మెక్కడం న్యాయమా? – “లోకం లోని న్యాయ స్థానాలు కేవలం తీర్పులు మాత్రమే చెప్పగలవు-కానీ  సరైన న్యాయాన్ని చేకూర్చగల న్యాయస్థాన మేమిటో తెలుసా? మానవుడి అంతరాత్మ!”- అంటూ గుండెలు విప్పుకుని ఉద్ఘోషిస్తాడు గుమ్మడి!

ముగింపులో ఈ కోర్టు రూమ్ హై డ్రామా చాలా ఉద్వేగభరితంగా వుంటుంది. నేనూ మనిషినే, నాకూ సగటు మనిషి భావోద్రేకాలుంటాయి - అనే అర్ధంలో గుమ్మడి గుండె చెరువు చేసుకునే దృశ్యం చూసి కదిలిపోని ప్రేక్షకులెవరూ వుండరు!

అసలు నేనూ మనిషినే అని స్టేట్ మెంట్ ఇవ్వడంలోనే ఎన్నో అర్ధాలున్నాయి. ఆశ ఆడిస్తే వాస్తవం నిలేస్తుంది. నీతిగల అధికారికి హోదా అనేది మనసు విచలితం కాకుండా కాపాడే రక్షక కవచమే. ఈ కవచాన్ని కాపాడుకోవడం దగ్గరే వస్తోంది సమస్య!

జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వంలో ఈ సినిమా ఆద్యంతమూ ఎంత ఉత్కంఠభరితమో అంత గుండెల్ని బరువెక్కిస్తుంది. ముందే చెప్పుకున్నట్టు- మేధకి కాస్త హృదయ బాధకూడా జతపడ్డ  క్రైం సినిమా ఇది- సక్సెస్ ఫుల్ క్రైం సినిమా! సినిమా రచయితలకి ఓ డిక్షనరీ లాంటి లైవ్  షో. సాత్విక ఇమేజి వున్న నటుడ్ని ప్రతినాయక పాత్రలో, సంస్కారయుతంగా వుంచుతూనే, పవర్ఫుల్ గా ఎలా చూపించ వచ్చన్న దానికి క్యారక్టర్ స్టడీ!
ఈ థ్రిల్లర్ పాటల పందిరి కూడా. సినారే కాక కొసరాజూ ఓ పాట రాశారిందులో. సంగీత దర్శకుడు వేదా. ఇతడి మీద హిందీ ప్రభావ మెక్కువ. తబలా శైలి ఓపీ నయ్యర్ ది. ఇందులో ‘చూసెనులె నా కనులే’ యుగళగీతం ‘చోరీ చోరీ’ (1956, శంకర్-జైకిషన్) లోని  ‘పంచీ బనూ ఉడ్తీ ఫిరూ’ (పక్షినై ఎగరాలనుంది) డ్యూయెట్ కి పక్కా అనుసరణే.  పోతే, ఈ సినిమాలో గుమ్మడి కూతురిగా ఎనిమిదేళ్ళ శ్రీదేవిని చూడొచ్చు!

1971 లో విడుదలైన మోడరన్ థియేటర్స్ వారి ఈ 110 వ (!) సినిమా క్లాస్ విలనీ కి చెరగని చిరునామా. ఈ సినిమాతో  గుమ్మడి మనకి ఇలా స్వాగతం పలుకుతున్నట్టు వుంటుంది -‘రండి బ్రదర్!జడ్జి విశ్వనాథ్ లా ఓ మర్డర్ చేసి చూద్దాం. పెద్ద వయసు పాత్రలు వేసి వేసి తెగ బోరు కొట్టేస్తోంది బాబు నాకూ!”  అని ఊరిస్తూ. సీడీ వేసుకుని ఈ సినిమాని ఆమూలాగ్రం అవధరించండి!

-సికిందర్
(అక్టోబర్ 2009 ‘సాక్షి’ కోసం)




















స్క్రీన్ ప్లే టెక్నిక్..

గొప్ప కథకి పునాది వేస్తే.....
మంచి కథ మిగలొచ్చు!

నాదొక మాఫియా క్వశ్చన్ బాసూ -  సినిమా కథంటే సరుకులేని స్మగ్లింగేనా!


ఈ మధ్య విడుదలవుతున్న తెలుగు సినిమాలు వాటి అనుకున్న కాన్సెప్ట్సుకి,  ఆ కాన్సెప్ట్సు కిస్తున్న ట్రీట్ మెంట్సు (స్క్రీన్ ప్లే) తో ఎలాంటి సంబంధమూ  లేకుండా ఎందుకొస్తున్నట్టు? సినిమా కథలకి రాసే రచయితలతో బాటు, రాయని ఇంకెందరో ‘రచయితలు’ ఉండడం వల్ల, ఈ సమస్య తప్పడం లేదు.  కనుక కాన్సెప్ట్సు కిచ్చే ట్రీట్ మెంట్స్ మీద ఎందరి హస్తాలు పడ్డా, వాటి ఏకత్వ సూత్రాలకి ఏమాత్రం భంగం కలక్కుండా,  మొత్తం కథ నాణ్యత కూడా పూర్తిగా  దిగజారిపోకుండా కాపాడుకునే మార్గ మేదైనా వుందా?

తప్పకుండా వుంది. నిత్యం ఫీల్డుని బెంబేలెత్తించే ఫ్లాపుల సంఖ్యని తగ్గించుకోవాలనుకున్నా, ఓ పరిష్కారమార్గం ఆవశ్యకత ఎంతైనా వుంది. ఒక టాక్ షోలో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నట్టు- “తెలుగు సినిమాపుట్టి 75 సంవత్సరాలు గడుస్తున్నా,  ఇంకా అనుభవాల మీద ఆధారపడి సినిమాలు నిర్మిస్తున్నారు తప్పితే, ఎలాటి సినిమా సైన్సు పట్లా అవగాహన ఇప్పటికీ లేదు..” నిజమే,  సినిమా సైన్సు అంతా విదేశాల్లోనే దినదినాభివృద్ధి చెందుతూ, ఇంగ్లీషు పుస్తకాల్లో నిక్షిప్తమై వుంది. వీటిని చదివే ఓపిక లేదు.  తెలుగులోకి తెచ్చే ప్రయత్నమూ లేదు. కనుక మన దగ్గర ఇలా భూస్థాపితమై పోయిన సినిమా సైన్సు అనే భోషాణం లోంచి కథా శాస్త్రాన్ని పైకి తీసి చూసుకుంటే, ఓ బ్రహ్మాండమైన పరిష్కార మార్గమే కన్పిస్తుంది!

ఏమిటా పరిష్కారం? చాలా సింపుల్. శ్రమనుకోకుండా కాస్త మూలాల్లో కెళ్ళి, గొప్ప కథలకి ఏ ఏ అంశాలైతే పునాది రాళ్ళుగా ఉంటున్నాయో వాటిని స్థాపించుకుంటూ పోవడమే. అప్పుడా బలమైన నిర్మాణం మీద ఎందరు ఎలా చేయిచేసుకున్నా, నోరెలా పారేసుకున్నా, స్క్రిప్టు పూర్తిగా అధఃపాతాళానికి జారిపోకుండా, కనీసం మధ్యస్థ నాణ్యతా ప్రమాణాలతోనైనా  ఉంటూ, ఓ మంచే కథ అన్పించుకుని బయట పడే అవకాశముంది. ఏ పునాదీ లేకుండా కేవలం సొంత నమ్మకాలాధారంగా గాలిలో అల్లుకునే కథల్ని కథా చర్చల పేరుతో నల్గురూ కలిసి కూర్చుకుని, జీరో చేసి వదిలేకన్నా ఇది నయమే కదా? మధ్యస్థంగా ఓ మంచి కథ!

ఈ రోజుల్లో ఓ మంచికథ తయారైతే చాలు. గొప్ప గొప్ప కళాఖండాలు ఇప్పుడెవరూ తీయడంలేదు. కనుక గొప్ప కథలంటూ తలలు బద్దలు చేసుకోనవసరంలేదు. కాలక్షేపానికి ఒద్దికగా ఓ మంచి కథ అందించ గల్గితే చాలు. గొప్ప కథలంటే హాలీవుడ్ స్థాయిలో వచ్చే ‘స్టార్ వార్స్’, ‘జురాసిక్ పార్క్’, ‘టైటానిక్’, ‘జాస్’, ‘సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ లాంటివన్నమాట. ఇవి అంత గొప్ప కథలెలా కాగలిగాయో తెలుసుకుంటే, కథకుడు ఆ రహస్యాన్ని తన కాన్సెప్టు లో ఇమిడ్చి గొప్ప స్క్రిప్టు నే ఊహించగలడు. అప్పుడు తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది!

కానీ అంత సీను లేదు. కళాఖండాలకి కాలం కాదుకున్నాం గనుక అంతేసి గొప్ప కథలకి గిరాకీ తగలడం అసాధ్యం. నో ప్రాబ్లం. ఐతే మొట్ట మొదట ఆ స్థాయిలో కథని ఊహించ గల్గితేనే కథకుడనే వాడు  అవసరమైతే దాని ఇంకో వెర్షన్ ని కూడా ఆత్మవిశ్వాసంతో విన్పించగలడు. గొప్ప పునాదితో తనకొచ్చిన ఆ గొప్ప ఊహని అప్పుడో మెట్టు కిందికి దించి, ఫ్రేము వదులు చేసి, అలవాటు పడ్డ తెలుగు సినిమాల రన్నింగ్ ని అప్లై చేస్తే, అప్పుడింక ఎవరెన్ని మార్పు చేర్పులు కోరినా, గొప్ప కథ పునాది మొదటే పడింది గనుక, కాన్సెప్ట్ నుంచి ట్రీట్ మెంట్ పతనమూ కాదు, సినిమా భ్రష్టు కూడా పట్టిపోదు.

నాణ్యత ఓ మెట్టు దిగినా, మంచి కథ అనే కితాబు ఎక్కడికీ పోదు. అప్పటికీ నిద్రపట్టక ఇంకా నీచానికి దిగలాగే చేతులు వుంటే, వాళ్ళని అట్టర్ ‘ఫ్లాప్తి’ రస్తు  –అని దీవించేసి వాళ్ళ ఖర్మానికి వదిలెయ్యడమే!

ఇంతకీ గొప్పకథకి అలాటి బలమైన పునాది వేయడమెలా? చాలా సింపుల్. ముందుగా తెరమీద కదలాడే చలన చిత్రమంటే అది మనిషి మనసు లోపలి ప్రపంచాన్ని ( మానసిక ప్రపంచాన్ని) ఆవిష్కరించే శాస్త్రమని గుర్తిస్తే

చాలు. వెండి తెర మీద మనం చూసే పాత్రలు నిజానికి నిజ జీవితంలో నిత్యం మనం చవిచూసే  వివిధ ఎమోషన్స్ కి ప్రతిరూపాలే. ‘ఇగో’  అనే ఎమోషన్ కి హీరో పాత్ర, ప్రేమాశృంగార భావాలకి హీరోయిన్ పాత్ర, మానసికోల్లాసానికి హాస్యగాడు, శాంతి సౌఖ్యాలకి తల్లి, భద్రతా భావానికి తండ్రి, మార్గదర్శకత్వానికి గురువు లేదా గాడ్ ఫాదర్, మనం అణిచిపెట్టుకునే సవాలక్ష జంతు లక్షణాలకి విలన్ పాత్రలూ సింబల్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ అన్నిటినీ కలబోసి మైమరిపించేదే గొప్ప కథ. ఇప్పుడిన్నేసి ఎమోషన్స్ వెండితెరమీద ఆవిష్కారం కావడంలేదు. పాత్రల సంఖ్య తగ్గిపోవడమే ఇందుక్కారణం. మన మనో ప్రపంచాన్ని తెర మీద సంపూర్ణంగా ప్రతిఫలింప జేయడం ఏనాడో తగ్గిపోయింది. అయినా కూడా నో ప్రాబ్లం. మనలో వుండే  తొమ్మిది రకాల ఎమోషన్స్ లో చాలా వాటికి వెండి తెర మీద ప్రాతినిధ్యం తగ్గిపోయినా, ప్రధాన ఎమోషన్ అయిన ‘ఇగో’ ( అంటే హీరో పాత్ర)  నైనా సవ్యంగా పోషించుకో గల్గితే చాలు, అప్పుడు ఆటోమేటిగ్గా అదే ఓ మంచి సినిమాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం వుంది.


ఇగో ఎవరి మాటా వినని మొండి ఘటం. అందుకని దాన్ని యుక్తిగా దారిలో పెట్టి, మెచ్యూర్డ్ ఇగో దిశగా నడిపించేదే గొప్ప కథ కుండే ప్రధానలక్షణం. ఆ నడకలో ఎడబాటు- ప్రయత్నం-అవగాహన- జ్ఞానోదయం అనే నాలుగు మజిలీలుంటాయి. జ్ఞానోదయంవల్ల ఇగో చివరికి ‘మేచ్యూర్డ్ ఇగో’ గా మార్పు చెంది కథ ముగిస్తుంది.

మన మైండ్ రెండు గా విభజించి ఉంటుందనేది తెలిసిందే. ఆ రెండూ కాన్షస్ మైండ్- సబ్ కాన్షస్ మైండ్ లు. కాన్షస్ మైండ్ కి ఇగో కేంద్రంగా ఉంటూ, లాజికల్ గా ఆలోచిస్తుంది. పరిస్థితిని బేరీజు వేస్తుంది. నిర్ణయాలు తీసుకుంటుంది. సినిమా కథలో ఇగో చేసే పాత్ర ప్రయాణం లో దానికి సంబంధించిన కార్యకలాపాల్ని హీరో పాత్ర ద్వారా అడ్డదిడ్డంగా డిస్టర్బ్ చేయకుండా,  జాగ్రత్తగా నిర్దేశిత గమ్యం వైపు నడిపించాల్సి వుంటుంది.

ఇంకాస్త లోతు కెళ్దాం. పైన వివరించిన హాలీవుడ్ సినిమాలు అంత గొప్ప ఆస్కార్  అవార్డు కథ లెందు కయ్యాయంటే, అవి మనిషి మానసికావసరాల్ని అంత కరువుదీరా తీర్చేశాయి గనుక! మనిషి మానసిక ప్రపంచాన్ని పైన చెప్పిన కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ లు ప్రభావితం చేస్తాయి. వెండితెర మీద ఈ రెండు మైండ్స్  కీ చెలగాటం పెట్టి రఫ్ఫాడించి హిట్లు కొడతారు సరయిన సృష్టికర్తలైతే. ఈ రెండు మైండ్సూ ఎలాటి ఏర్పాటుతో ఉంటాయంటే, మధ్యలో లంకలా కాన్షస్ మైండ్ వుంటే, ఆ లంక చుట్టూ  మహా సముద్రంలా పర్చుకుని సబ్ కాన్షస్ మైండ్ వుంటుంది. లంకని పాలించుకునే ఇగోకి,  ఆ సముద్రంలోకి వెళ్ళాలంటే మహా భయం. ఎందుకంటే, ఆ సముద్ర గర్భంలో తాను తట్టుకోలేని నిజాలుంటాయి, ఎదుర్కోలేని ప్రశ్నలు దాగి వుంటాయి. సాధ్యమైనంత వరకూ ఆ  సబ్ కాన్షస్ మైండ్ కి మొహం చాటేసి తిరగడమే అది నేర్చు కుంది. అంతరాత్మకి (సబ్ కాన్షస్) కి సమాధానం చెప్పుకోవడం దానికి సుతరామూ ఇష్టముండదు. పలాయనవాదంతో దాన్ని తొక్కిపెట్టి  బలాదూరు తిరగడమే దానికిష్టం!

ఇదే సమయంలో సబ్ కాన్షస్ మైండ్- లేదా మన అంతరాత్మ అపార విజ్ఞాన ఖని కూడా. దానికి తెలీని సమాచారమంటూ వుండదు. అది సర్వాంతర్యామి. అందుకే తన వైపు రావడానికి జంకే ఇగోకి అది తియ్యటి షుగర్ కోటింగ్ కలలతో అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ఆపత్కాలంలో ఆదుకుంటూ వుంటుంది.

ఇక పాయింటు కొచ్చేద్దామా? సరీగ్గా మనలో లంకలాంటి  కాన్షస్ మైండ్ కీ- ఆ లంక చుట్టూ మహా సముద్రంలా
ఆవరించుకుని వుండే  సబ్ కాన్షస్ మైండ్ కీ లడాయి పెట్టి స్టీవెన్ స్పీల్ బెర్గ్  ‘జాస్’అనే గొప్ప కథా చిత్రాన్ని నిర్మించేశాదు! సినిమాలో చూపించే సముద్రం- ఆ మధ్యలో వుండే దీవి మన మానసిక ప్రపంచానికి నకళ్ళే. సముద్రంలోంచి సొర చేప రివ్వుమని వచ్చేసి దాడి చేస్తూంటుంది. ఈ సొర చేప మన సబ్ కాన్షస్ లో దాగి మనల్ని భయపెడుతూ వుండే నగ్నసత్యాలకి ప్రతీక. ఈ సొర చేపతో తలపడే హీరో మన ఇగోనే!

స్పీల్ బెర్గేతీసిన ‘ఈటీ’ లోనూ భూమ్మీదికి గ్రహాంతర జీవి ఒకటి వస్తుంది. మనకి మనం నివశించే భూమి మనకి తెలిసిన ప్రపంచమే-కాన్ష మైండ్ కి సింబల్ గా దీన్నితీసుకుంటే, అప్పుడా గ్రహాంతర జీవి అదేమిటో మనకి తెలీని నిగూఢ లోకం- సబ్ కాన్షస్ మైండ్ కి గుర్తుగా తీసుకుంటే- (పని గట్టుకుని తీసుకోనవసరంలేదు- యాదృచ్చికంగా మన మెదడే అలా కనెక్ట్ అయిపోతుంది-మెదళ్ళకి కనెక్ట్ అవుతూ  మనకి తెలీకుండా మాయ చేసేదే గొప్ప కథ! ).. అప్పుడు ఈ రెండిటి దోబూచులాట ఎలా వుంటుంది మన మనస్సుకి?

అంతరిక్ష యుద్ధాన్ని చిత్రించే  ‘స్టార్ వార్స్’ మాత్రం? అంతరిక్షం మన సబ్ కాన్షెస్సే! ఇక సముద్రంలో మునిగిపోయే నౌక ‘టైటానిక్’ మాత్రం? సముద్రం భయంకరమైన సబ్ కాన్షస్- నౌక బిక్కుబిక్కు మనే కాన్షస్! ‘జురాసిక్ పార్క్’ లోకూడా ఆ కాంపౌండు మన కాన్షస్ అయితే, దాని చుట్టూ పార్కు సబ్ కాన్షస్. ఇక చూస్కోండి ఆట!

మన మానసికలోకంలో ద్వైదీభావపు ఈ రెండు మైండ్స్ కీ  నిత్యం జరిగే సంఘర్షణకి సజీవ చిత్రణలే ఇవన్నీ. ఇందుకే ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల ప్రేక్షక బాహుళ్యం నాడిని ఇవి అంతబాగా పట్టుకోగాలిగాయి. తెలుగు ఫీల్డులో ప్రేక్షకుల నాడిని పట్టుకోవడం కష్టమని అలవాటుగా అనేస్తూంటారు. అది అవగాహన లోపించిన మాట. పైన పేర్కొన్నట్టు  తమ్మారెడ్డి భరద్వాజ విశ్లేషణ లోంచి పుట్టిన జీవులు అలాగే మాట్లాడతాయి. ఇంకో గమ్మత్తేమిటంటే, జీవితంలో తాము చేయలేనివి తెర మీద హీరో చేస్తూంటే ప్రేక్షకులు ఆనందిస్తారని మోటుగా అనేస్తూంటారు. ఈ మెకానిజమేంటో తెలుసుకోరు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చిందే ఆ మెకానిజం. మన సబ్ కాన్షస్ ని మనం ధైర్యంగా ఎదుర్కోలేకపోవడమనే బలహీనతని, తెర మీద మన ఇగో రూపంలో హీరో చేసేస్తూంటే అది మనకి ఆత్మసంతృప్తి కలిగిస్తుందన్నమాట! 



 సినిమాల్లో కథల్లో లేవనెత్తే సమస్యలకీ, వాటిని పరిష్కార దిశగా నడిపించడానికి రాసుకునే ట్రీట్ మెంట్లకీ పొంతన లేకుండా ఎందుకు ఉంటోందో గ్రహిస్తే కదా నాడిని పట్టుకోవడానికి! స్థాపించే సమస్య సబ్ కాన్షస్ అయితే, దాని పరిష్కార మార్గం, లేదా దానికై పోరాటం కాన్షస్ మైండ్ అన్న ప్రాథమిక జ్ఞానం లేకుంటే ఎలా!


కనీసం తెలుగులోనే వచ్చిన కొన్ని గొప్ప/ మంచి సినిమాలని కాపీ కొట్టి వాటిలాగే హిట్ చేయలన్నా అసలంటూ సైన్సు తెలియాలి. రాం గోపాల్ వర్మ  ‘శివ’ లో నాగార్జున పాత్ర కాన్షస్ ఇగో అవుతుందనీ, అతను తలపడే చీకటి
మాఫియా ప్రపంచం సబ్ కాన్షస్ అవుతుందనీ, అందులో రఘువరన్ విలన్ పాత్ర ఎదుర్కోక తప్పని ఒక కఠిన ప్రశ్నవుతుందనీ ఎందరికి తెలుసు? నీలకంఠ ’మిస్సమ్మ’ లో శివాజీ-భూమికలు కాన్ష ఇగో- సబ్ కాన్షస్ లకి గుర్తులు. ‘ఒక్కడు’లో భూమికని దాచిపెట్టిన గది సబ్ కాన్షస్ అయితే, భూమిక ఆ సబ కాన్షస్ లో పరిష్కరించాల్సిన ఒక సమస్య! మిగతా ఇల్లూ- చార్మినార్ అంతస్తూ కాన్షస్. మహేష్ బాబు పాత్ర కాన్షస్ ఇగో. కురుక్షేత్రం లో నూరుమంది కౌరవులు మన మనసుల్ని పీడించే ప్రతికూల భావాలకి ప్రతీకలైతే, అర్జునుడు వాటితో పోరాడే మన కాన్షస్ ఇగో అని చిన్మయానంద స్వామి తన ‘ఆర్ట్ ఆఫ్ మాన్ మేకింగ్’ అనే గ్రంధంలో ఏనాడో చెప్పేశాడు.

కాబట్టి ఇలా గొప్ప సినిమా కథల అంతర్నిర్మాణ పోస్ట్ మార్టం ని విస్పష్టంగా చూడగల్గినప్పుడు...ఆ బలమైన పునాది కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే తోనే ఏర్పడుతుందనే  అవగాహన పెంచుకున్నప్పుడు, కథలకిచ్చే ట్రీట్ మెంట్స్, లేదా స్క్రీన్ ప్లేలు కనీసం గొప్ప కథల స్కేలు పైనుంచి మరీ కిందికి జారిపోకుండా చూసుకోవడమెలాగో తెలిసిపోతుంది.

కథని ఇలాటి ఇంటర్ ప్లే తో బలంగా లాక్ చేశాక, నలుగురి నోళ్ళూ చేతులూ పడ్డా అది కథనం వరకే పరిమితమౌతూ కొంత మేర వాళ్ళవాళ్ళ ‘క్రియేటివిటీ’ తో దిగజారుస్తారేమో గానీ,  ఏం చేసీ మొత్తంగా చెడగొట్ట లేరు! కథకుడు చేయాల్సింది ఇంటర్ ప్లేకి బలమైన లాక్ వేసి ఆకట్టుకోవడమే. బలహీన లాక్ తో కథా చర్చల్లో కూర్చుంటే ఆ లాక్ కూడా వుండదు- ఇంకేవో కథనాల్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పారించుకునే ఏలూరు లాకుల్లాంటివి వచ్చి పడతాయి!

 (జోసెఫ్ క్యాంప్ బెల్ ‘ ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’, జేమ్స్ బానెట్  ‘స్టీలింగ్ ఫైర్ ఫ్రమ్ ది గాడ్స్’ గ్రంధాలు ఆధారంగా)
-సికిందర్
(జూన్ 2007 ‘ఆంధ్రభూమి’ కోసం)





సాంకేతికం/ ఆనాటి ఇంటర్వ్యూ





ఇంటూరి సాంబయ్య -మేకప్ మాన్ 
           ఇంటూరి సాంబయ్య ఇప్పుడు మిగిలి వున్న ఐదారుగురు అలనాటి అగ్రగణ్య రూపశిల్పుల్లో ఒకరు. 1958లో రంగ ప్రవేశం చేసి, ఐదు దశాబ్దాల పైబడిన తన కెరీర్ లో మొత్తం 1300 సినిమాలకు మేకప్ మాన్ గా సేవలందించి,  నిన్నమొన్నటి ‘యమదొంగ’, ‘యమగోల మళ్ళీ మొదలైంది’ లాంటి పౌరాణిక పార్శ్వం గల సినీమాలకి ఇప్పటికీ అక్కరకొస్తున్న పెద్ద దిక్కు ఆయన...

          మాదాపూర్ లోని నానోటెల్ త్రీ స్టార్ హోటల్ లాంజిలో ఎమోషనల్ గా  రిసీవ్ చేసుకున్నారు ఈ వ్యాసకర్తని  సాంబయ్య. ఎమోషనల్ గా ఎందుకంటే, తన అన్నేళ్ల వృత్తి జీవితంలో ఆయనకి ఇదే తొలి ఇంటర్వ్యూఅట ! –‘నన్ను గుర్తుంచుకుని మీరింత అభిమానంతో వచ్చినందుకు థాంక్స్’ అని ఓపెనయ్యారు. కొందరినెందుకో సొసైటీ గుర్తించదు. సాంబయ్యకి తెలిసిన చరిత్ర ప్రకారం ( మేకప్ గురించి తెలుగులో పుస్తాకాలేవీ లేకపోవడం ఒక లోటు) నాటకా లెప్పుడు మొదలయ్యాయో మేకప్ అప్పట్నించీ వుంది. కాకపోతే ఆ రోజుల్లో ప్రకృతి సిద్ధమైన అర్ధళం, మసిబొగ్గు, గంగ సిందూరం వంటి పదార్ధాలు మేకప్ కి ఉపయోగపడేవి.

          సినిమాలొచ్చాక ప్రారంభ దినాల్లో సాంబయ్య మేకప్ మెటీరియల్ ని స్వయంగా తయారు చేసుకునే వారు. కృష్ణుడి పాత్రకి బ్లూ మేకప్ వేయాలంటే ఆ రంగుల్ని గురువుగారు భద్రయ్య ఇంట్లో నూరుకునే వాళ్ళు. అమెరికా నుంచీ మ్యాక్స్ ఫ్యాక్టర్ మూవీ మేకప్ ఉత్పత్తులు రావడం మొదలయ్యాక, యావద్దేశ సినిమపరిశ్రమలకీ ఆ ఉత్పత్తులే ఆధారభూతమయ్యాయి. మ్యాక్స్ ఫ్యాక్టర్ విప్లవాత్మక ఆవిష్కరణ ‘పాన్ కేక్’. ఇది తిరుగు లేని మేకప్ ఉపకరణంగా  పాపులరయ్యింది. ప్రోక్టర్ అండ్ గాంబుల్ ఈ ప్రోడక్టు ని  టేకోవర్ చేశాక, 2010లో అమెరికా నుంచి ఉత్పత్తుల్ని నిలిపేసింది. దీంతో లండన్ ఉత్పత్తుల మీద మన దేశ సినిమా పరిశ్రమ ఆధార పడుతోంది.

      మొదట్లో తెలుగు సినిమాలు కలకత్తాలో తయారయ్యేవి. మద్రాసుకి మారాక కొందరు కలకత్తా కళాకారులు అక్కడికి తరలి వచ్చారు. వాళ్ళల్లో  మేకప్ కళకి  పితామహుడు అనదగ్గ హరిపాద చంద్ర ( హరిబాబు అంటారు) ఒకరు. దక్షిణ దేశానికి మేకప్ కళ నేర్పించిందీయనే.  తెలుగులో భద్రయ్య, పీతాంబరం, వీర్రా జూలాంటి తొలినాటి రూప శిల్పులు, వీరాస్వామి, మన్మధరావు, వెంకటేశ్వర రావు, అప్పారావు, లంబా కృష్ణ వంటి  సాంబయ్య సమకాలీనులూ హరిబాబు ఏకలవ్య శిష్యులే.

          ఇప్పుడు మేకప్ అద్భుతంగా అభివృద్ధి చెందిందంటారు సాంబయ్య. ఏకంగా మాస్కులతో రూపాల్నే మార్చేస్తున్నా రన్నారు. ఇదంతా సరే, మీరు సాధించిన ఒక విజయం గురించి చెప్పండంటే, 1967లో ‘కంచుకోట’ సినిమాకి గాను నటుడు ప్రభాకరరెడ్డిని మరో నటుడు ఉదయకుమార్ లా మార్చేసిన తన మేకప్ ప్రయోగం గురించి గర్వంగా  చెప్పుకొచ్చారు. అదెలాగంటే, ఏమీలేదనీ - ఉదయకుమార్ ని పడుకోబెట్టి మౌల్డర్ వేలుస్వామి ఆయన ముఖం మీద ప్లాస్టరాఫ్ పారిస్ పోసి ముఖాకృతిని తీసుకున్నాడ న్నారు సాంబయ్య. దాన్ని ఎం ఎం ఫోం కంపెనీకి పంపిస్తే, ఆ  కంపెనీ దాంతో రబ్బర్ మాస్కు తయారు చేసిచ్చిందన్నారు. అంతే, ఇక దాంతో ప్రభాకరరెడ్డి అచ్చం ఉదయకుమార్ లా మారిపోయి, ఆ వెధవ పనులన్నీ చేశాడట ‘కంచుకోట’ లో!

          తోటి మేకప్ మాన్, నిర్మాత కూడా అయిన ఏ ఎం రత్నం ‘భారతీయుడు’ (1996) కి ముందు కమల్  హాసన్ వృద్ధ పాత్ర మాస్క్ తయారీ పనుల్లో హాలీవుడ్ నిపుణుడితో కలిసి సాంబయ్య కూడా పనిచేశారు. ఆ రోజుల్లోనే 40 లక్షలు ఖర్చయ్యిందట ఆ మేకప్ కి. ఇక మేకప్ సాంకేతికాంశాల్లోకి వెళ్తే, సాంబయ్య చెప్పిందాని ప్రకారం - ఏ మేకప్ కైనా పాన్ కేక్ తో బేస్ వేసి, పౌడరు అద్ది, పాన్ స్టిక్ తో మెరుగులు దిద్దుతారు. ఐతే సోషల్ ఈవెంట్స్ కి,  టీవీకి, నాటకానికి, సినిమాకీ మేకప్పులు వేర్వేరు. నిత్య జీవితంలో స్త్రీ పురుషులు చేసుకునే మేకప్ లైట్ గా, నేచురల్ గా వుంటే, టీవీ కొచ్చేసి మీడియం గానూ, నాటకాలకి బ్రైట్ గానూ, సినిమాలకైతే ఒక్కో ఆర్టిస్టుని బట్టి ఒక్కో విధంగా షేడ్స్ తో మేకప్ వేస్తారు.

          పూర్వం సినిమాల్లో మేకప్, కాస్ట్యూమ్స్, హేర్ స్టయిల్స్ ఒకరే చూసుకునే వారు. రాను రాను అది ఒకరే  నిర్వహించడం భారమై పోవడంతో, మూడుగా వాటిని విడదీసి-   మూడు శాఖలకీ  వేర్వేరు టెక్నీషియన్లని ఉనికిలోకితెచ్చారు- మేకప్, కాస్ట్యూమ్స్, హేర్ డ్రెస్సర్ అనే వాళ్ళు. అయితే కాలక్రమంలో శ్రద్ధ లోపిస్తూ దేవతా పాత్రలకి ఎలా మేకప్ వేయాలో చాలా మందికి తెలీడం లేదనీ, హీనపక్షం దేవతా పాత్రలకి బొట్లు కూడా ప్రామాణికంగా పెట్టలేక పోతున్నారనీ  బాధ పడ్డారు సాంబయ్య.

         గుంటూరు జిల్లా ఇంటూరుకి చెందిన ఈయన చేతిలోముస్తాబైన నటీనటుల్లో చిత్తూరు వి.నాగయ్య, సి ఎస్ ఆర్ ఆంజనేయులు, ఈలపాట రఘురామయ్య, ముక్కామల, ధూళిపాళ, షావుకారు జానకి, దేవిక, పి ఆర్ వరలక్ష్మి, హీరో కృష్ణ, శోభన్ బాబు మొదలైన వారెందరో వుండగా, కృష్ణకుమారి, రాజనాల, సత్యనారాయణ, హీరో రామకృష్ణ లకి పర్సనల్ మేకప్ మాన్ గా వ్యవహరించారు. ఇప్పటికీ మోహన్ బాబు, సత్యనారాయణలకి ఈయనే అభిమాన మేకప్ మాన్. 1969 లో ఎ. పుండరీ కాక్షయ్య అవకాశామివ్వడంతో, ‘భలేతమ్ముడు’ కి మేకప్ చీఫ్ అయి, ఎన్టీఆర్ కి తొలిసారిగా మేకప్ వేశారు సాంబయ్య. ఆ తర్వాత మరో మూడు సినిమాలకి ఎన్టీఆర్ కి పనిచేశారు. జానపదబ్రహ్మ విఠాలాచార్య కైతే, రికార్డు స్థాయిలో 50 సినిమాల వరకూ మేకప్ మాన్ గా సేవలందించిన ఘనత వుంది సాంబయ్యకి.

          పోతే, ఇప్పుడున్న మేకప్ రంగ పరిస్థితుల పట్ల తీవ్ర ఆక్షేపణ వుందాయనకి. మార్పుని అంగీకరించాలి కదా, తరాలువాటి కాలమాన పరిస్థితుల్ని బట్టి తంటాలు అవి పడుతూంటాయి కదా అనంటే, అలా కాదనీ - మేకప్ చెట్ల కింది కొచ్చేసిందనీ,  ఏ వృత్తయినా బజార్న పడకూడనీ అభిప్రాయపడ్డారు. అన్నట్టు ఈ ‘నానోటెల్’ హోటల్ ఈయన అల్లుడు గారిదే. తను టెక్నికల్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. పదిమంది సంతానంలో పెద్దవారైన ఈయన, రికార్డు స్థాయిలో 36 మంది బంధువుల పెళ్ళిళ్ళు  చేశారు!

          ఇంతవరకూ ఏ అవార్డూ ఈయనకి రాలేదు. ఇంకో రెండేళ్ళల్లో రిటైర్ కావాలనుకుంటున్న ఈయన తనకు ఏ గౌరవ చిహ్నమూ లేదే అన్న వేదనతో వున్నారు. ఇంతే సొసైటీ... దాని బిజీలో కొందరు గుర్తుకు రారు.   


-సికిందర్
(మే 2011 ‘ఆంధ్రజ్యోతి’ సినిమా టెక్ శీర్షిక)






Sunday, August 31, 2014

'రభస' రివ్యూ..




                                   
కామెడీ సీసాలో కషాయం!


రచన- దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ 

తారాగణం: ఎన్టీఆర్, సమంతా, ప్రణీత, షాయాజీ షిండే, నాజర్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, అజయ్, రఘుబాబు, జయసుధ, హేమ తదితరులు.
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : శ్యాం కె.నాయుడు, కళ : ప్రకాష్, కూర్పు : కోటగిరి, పోరాటాలు : రాం- లక్ష్మణ్, 
బ్యానర్ : శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, సమర్పణ : బెల్లంకొండ సురేష్ 
సెన్సార్ : U/A, విడుదల : 29 ఆగస్టు 2014


***

2010 ‘బృందావనం’ తర్వాత- ఎన్టీఆర్ నటించిన ఐదు సినిమాల్లో ఒక్క ‘బాద్షా’ తప్ప- ‘దమ్ము’, ‘ఊసరవెల్లి’, ‘రామయ్యా వస్తావయ్యా’ - ఇప్పుడు ‘రభస’- నాల్గుకి నాల్గూ అపజయాల పాలవడానికి కారణాలేమిటో ఈపాటికి ఎన్టీఆర్ తెలుసుకునే వుండాలి. తన సీనియర్లైన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా పంథా మార్చుకుని ‘మనం, ’దృశ్యం’, ‘లెజెండ్’ లలాంటి కొత్తదనాలతో సెకెండ్ ఇన్నింగ్స్ ని దిగ్విజయంగా ప్రారంభించుకుని ప్రేక్షకులకి కొత్తానుభూతుల్ని పంచిపెడుతోంటే, తానింకా ఆ సీనియర్లు ఏనాడో నటించి వదిలేసిన 1980-90 లనాటి పురాతన కథా కమామిషుల మీదే ఇంకా మోజుపెంచుకోవడం విచారకరం. మాస్ చిత్రాలకి ఆనాటి సినిమాలే గీటు రాయి కావు. ఏ కాలంలోనైనా భావోద్వేగాలు అలాగే వుంటాయి. అభిరుచులే మరిపోతూంటాయి. భావోద్వేగాల్లోంచి అభిరుచులు పుట్టవు, అభిరుచుల్లోంచే భావోద్వేగాలు ఉద్భవిస్తాయి. ఇదెలాగో, సినిమా సమకాలీన ధర్మానికి అభిరుచుల్ని అనుసరించే భావోద్వేగాలెలా వస్తాయో తర్వాత తెలుసుకుందాం.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కిది రెండో సినిమా. మొదటి సినిమాగా 2011 లో ఇదే నిర్మాతలతో, యంగ్ స్టార్ రామ్ తో ‘కందిరీగ’ అనే రోమాంటిక్ సూపర్ హిట్ కామెడీ తీస్తూ తనదొక శైలినీ, సృజనాత్మకతనీ ఏర్పాటుచేసుకున్న తను, ఇప్పుడు రెండో సినిమాకే అవన్నీ తీసి పక్కనబెట్టేసి, ఓ పెద్ద స్టార్ తో చవకబారు సినిమా లాగించెయ్యడం విషాదకర పరిణామం. తన అనారోగ్యకారణంగా ఇలా జరిగిందనుకోవడానికి వీల్లేదు. స్క్రిప్టు చాలా ముందే తయారైపోయి వుంటుంది.

ఈ స్క్రిప్టుతో దర్శకుడు తెలిసో తెలీకో ‘కందిరీగ’ స్క్రిప్టుతో చేసిన గిమ్మిక్కే చేశాడు. ‘కందిరీగ’ స్క్రీన్ ప్లేది ఫ్రాక్చరైన స్ట్రక్చర్. ఐతే ఇంటర్వెల్లో ఈ ఫ్రాక్చర్ ఫీలవ్వకుండా మొదట్నించీ ఒక స్పష్టమైన ఎజెండాతో స్పీడుగా నడిపిన కథనం, దానికిస్తూ వచ్చిన అమోఘమైన ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన షుగర్ కోటింగ్, దాని సెకండాఫ్ ని బతికించింది.

‘దర్శకులం డాట్ కామ్’ లో ‘కందిరీగ’ రివ్యూ రాసినప్పుడే, ఇలాటి ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లేలతో ఏం జరగవచ్చో హెచ్చరించడం కూడా జరిగింది. ‘కందిరీగ’ లాంటి సంపూర్ణ హాస్యప్రధాన యాక్షన్ కథని మాత్రమే ఆ స్పీడు కథనమూ, అంతేసి షుగర్ కోటింగూ ఫ్రాక్చర్ ని మరిపించగలవేమోగానీ, అదే ఫక్తు సీరియస్ యాక్షన్ కథై నప్పుడు ఆ ఫ్రాక్చర్ దగ్గరే కుప్ప కూలిపోతుందని చెప్పడం జరిగింది.


చెప్పినట్టుగానే సరీగ్గా ‘రభస’ అనే ఫక్తు సీరియస్ యాక్షన్ కథతో మళ్ళీ ‘కందిరీగ’ లాంటి గిమ్మిక్కుకే పాల్పడి మొత్తం కుప్పకూల్చుకున్న దర్శకుడ్ని చూసి నవ్వాలో ఏడ్వాలో అర్ధంగావడం లేదు! ఈ గొడవేంటో ‘స్క్రీన్ ప్లే’ సంగతులు విభాగంలో పూర్తిగా చూద్దాం..


అమ్మకిచ్చిన మాట - వదిలేసి పరోపకారాల బాట! 
అనగనగా కార్తీక్ (ఎన్టీఆర్) అనే అమెరికాలో చదువుకునే విద్యార్ధి. చిన్నప్పుడు తన తల్లి మేనత్త కి మాటిస్తే, ఆ మాట నిలబెట్టడంకోసం ఇండియా వస్తాడు. పాతికేళ్ళ క్రితం మేనత్త చచ్చిపోతూ తన కూతురు చిట్టి (సమంతా) ని కార్తీక్ తల్లి చేతుల్లో పెట్టి, నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని మాట తీసుకుంది. అయితే దీన్ని బేఖాతరు చేసి కుటుంబంతో సహా సిటీ కెళ్ళి పోయి రాజకీయంగా బాగా ఎదిగాడు మేనమామ ధనుంజయ్ (సాయాజీ షిండే). ఇప్పుడతన్ని లొంగ దీసి మరదల్ని పెళ్లి చేసుకురమ్మని పురమాయిస్తుంది కార్తీక్ తల్లి (జయసుధ).

ఇలా సిటీ కొచ్చిన కార్తీక్ చిట్టీ అనుకుని ఆమె ఫ్రెండ్ భాగ్యం ( ప్రణీత) తో ప్రేమలోపడతాడు. ఆమెని ప్రేమలో దింపడం కోసం ఆమె కాలేజీలోనే యాంటీ లవర్స్ స్క్వాడ్ పేరుతో కాలేజీలో ప్రవేశిస్తాడు. అదే కాలేజీలో చదువుతున్న చిట్టీ అలియాస్ ఇందూ అతడితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ వుంటుంది. అసలైన ప్రేమల గురించి లెక్చర్లిచ్చే కార్తీక్ ని చూసి భాగ్యం ప్రేమలో పడుతుంది. ఇంతలో తన మరదలు భాగ్యం కాదు, చిట్టీ అని తెలుసుకుంటాడు కార్తీక్. కానీ మరదలు చిట్టీని చూస్తే ఆమె ఇంకెవర్నో ప్రేమిస్తూంటుంది. ఇప్పుడు అమ్మమాట కోసం చిట్టీని కార్తీక్ తనవైపు ఎలా తిప్పుకున్నాడన్నది మిగతా కథ....అని అనుకుంటా రెవరైనా! కానీ కాదు-మాటా గీటా వదిలిపారేసి, ఇంకేవో రెండు ఫ్యాక్షన్ (గంగిరెడ్డి అనే నాగినీడు- పెద్దిరెడ్డి అనే జయప్రకాష్ రెడ్డి) కుటుంబాల మధ్య ఎప్పుడో తనవల్ల ఏర్పడిన స్పర్ధల్ని తొలగించడానికి వాళ్ళింట్లోనే మకాం వేస్తాడు.

ఎన్టీఆర్ మంచి లుక్ తో, మంచి నటనతో అభిమానులవరకూ అలరిస్తాడేమో. విషయపరంగా సినిమా లుక్ కూడా బావుండాలని చూసుకోకపోతే ఇమేజి పరంగా ఏ లుక్కయినా, ఏ స్టెప్పులూ ఫైట్లయినా సినిమాని ఏం కాపాడతాయి. అరిగిపోయిన పురాతన పాత్రతో, బాగా నలిగిపోయిన అతిపురాతన మామా అల్లుళ్ళ సవాల్ కథతో, అదికూడా అర్ధంకాని గందరగోళపు కథనంతో వుంటే, ట్రెండ్ లో వున్న స్టార్ అనేవాడు ఎన్ని షోకులు చేసుకుంటే ఏం లాభం.


సమంతా ఈ సారికూడా బోల్తా కొట్టింది. ఆమెకీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి- ఇలాటి పనికిరాని పాత్రలతో ఇలాగే కొనసాగితే కనీసం త్రిష లాగించినంత కాలం కూడా సినిమాల్లో వుండదు. ప్రణీత మొహం నిండా పెద్ద పెద్ద కళ్ళే ఇబ్బందికరంగా డామినేట్ చేసే వ్యవహారం. ఈ సినిమాలో అర్ధాంతరంగా ఈమె పాత్ర ముగిసిపోతుంది. అరుపుల షాయాజీ షిండే, ఇంకో అరుపుల అజయ్, భోళా జయప్రకాష్ రెడ్డి, సీరియస్ నాగినీడూ లవి, ఫ్యాక్షన్ సినిమాల్లో ఎప్పుడో అరిగిపోయిన పాత్రలు, నటనలు.

ఇక సెకండాఫ్ అనగానే బ్రహ్మానందం రావడమనే స్కీము ఇంకెన్నాళ్ళు తెలుగు సినిమాల్ని పట్టి పీడి స్తుందో తెలీదు. ఈ స్కీము రహస్యం కూడా తెలిసిపోయేదే- సెకండాఫ్ లో కథ నడపడలేక దర్శకుడు చేతులెత్తేస్తే- బ్రహ్మానందం వచ్చేసి కథతో సంబంధం లేకుండా నవ్వించి వెళ్ళిపోతే, ఓ అరగంట స్క్రీన్ టైము గడిచిపోయి దర్శకుడికి తేలికవుతుంది! పదేపదే ఈ అరిగిపోయిన స్కీము గిన్నీసు బుక్కు బ్రహ్మానందానికి ఎంత త్వరగా బోరుకోడితే అంతమంచిదని ఎదురు చూడ్డం తప్పితే చేసేదేం లేదు. సినిమా మొదట్నుంచీ కథలో భాగంగా ఆ పాత్ర వుంటే అది వేరే విషయం.

చీటికీ మాటికీ ఫైట్స్ ఇంకో సహన పరీక్ష. అలాగే పాటల మీద కూడా శ్రద్ధపెట్టలేదు. ఒక్క ఛాయాగ్రహణం మాత్రమే సాంకేతిక విభాగంలో మార్కు లేయించుకుంటుంది. కథకి తగ్గట్టే సంభాషణలు పేలవంగా ఉన్నాయి.

స్క్రీన్ ప్లే సంగతులు

దర్శకుడు తన తొలి సినిమా ‘కందిరీగ’ ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లే తో తెలిసో తెలీకో చేసిన గిమ్మిక్కు సక్సెస్ కావడంతో- రెండో సినిమాకీ రిస్కు ఎందుకని దాన్నే నమ్ముకున్నట్టున్నాడు...ఐతే తను చేసిన గిమ్మిక్కు ‘కందిరీగ’ లో ఎలా వర్కౌటయ్యిందో సశాస్త్రీయంగా విశ్లేషించుకో నందున, గుడ్డిగా నమ్మి దాన్నే ‘రభస’కీ అన్వయింప జేసినట్టుంది. అప్పుడిది ఎలా తయారయ్యిందంటే, ‘కందిరీగ’ అనే యాక్షన్ కామెడీ సీసాలో ‘రభస’ అనే సీరియస్ యాక్షన్ ని నింపేసి కషాయం తయారు చేసినట్టయ్యింది!

‘కందిరీగ’ ఫస్టాఫ్ లో విలన్ తో ఛాలెంజి ప్రకారం హీరోయిన్ని హీరో ప్రేమించేట్టు చేసి, అతడికి బుద్ధి చెప్పించడంతో, హీరో లక్ష్యం పూర్తయ్యి ఇంటర్వెల్లోనే కథ ముగిసినట్టయ్యింది. ఇక సెకండాఫ్ లో కథే ముంటుంది?

సెకండాఫ్ లో అతికించిన కథే! విలన్ మళ్ళీ అదే హీరోయిన్ని ఎత్తుకుపోయి పెళ్ళాడే ప్రయత్నం చేయడమనే సెకండాఫ్ కొనసాగింపు తెచ్చి అతికించిన ముక్కే. అది ఫస్టాఫ్ కథా కథనాల్లోంచి సహజంగా ప్రవహించిన ప్రక్రియ కాదు. అయితే అతికించిన ముక్క అనే ఫీల్ కలక్కుండా కాపాడిందేమిటంటే, సినిమాప్రారంభం నుంచీ దీన్నో అనితరసాధ్యమైన షుగర్ కోటింగ్ తో- తెగ నవ్వించే యాక్షన్ కామెడీగా స్పీడుగా నడిపించుకు రావడమనే కథన చాతుర్యమే. ఒక్క బోరు కొట్టే సీను గానీ, డైలాగు గానీ లేకుండా పడిన జాగ్రత్తే. షుగర్ కోటింగ్ పాత మూసలో వెలసిపోయిన దై వుంటే కూడా ఎంత కథనమూ ఫ్రాక్చర్ ని మరిపించేది కాదు. ఒక్క అనితరసాధ్యమైన ఇన్నోవేటివ్ షుగర్ కోటింగ్ వల్ల మాత్రమే నిలబడ్డ వికలాంగ స్క్రీన్ ప్లే ‘కందిరీగ’ ది!

ఏమిటా ఇన్నోవేటివ్ షుగర్ కోటింగ్? హీరో రామ్ పాత్రకిచ్చిన వినూత్న తరహా క్యారెక్టరైజేషనే. పాత్ర మేనరిజమ్స్ ప్రధానాకర్షణ అయ్యాయి. రియల్ ఫన్ కీ, వెకిలితనానికీ మధ్యన సన్నని రేఖ వుంటుంది. దీన్ని గుర్తుంచుకుని క్లాస్-మాస్ రెండూ కలగలిసిన టిపికల్ క్యారెక్టర్ గా తీర్చిదిద్దారు. దీన్ని గురించి ఇంకా చెప్పాలంటే- జేమ్స్ బానెట్ తన ప్రసిద్ధ స్క్రీన్ ప్లే పుస్తకంలో రాసినట్టు- ‘Another factor augmenting the sugar coat is real life. Audiences are fascinated and delighted by successful imitations of real life -real human gestures, expressions, moods and conversations, when a great story artistically treats real life to create a metaphor, it retains that fascination and becomes a primary interest holder. It riverts their attention’ అదన్న మాట- నిజజీవితానికి షుగర్ కోటింగ్ ఇస్తూ సక్సెస్ ఫుల్ గా ఇమిటేట్ చేసిన పాత్ర చిత్రణ అది! పాత్ర కలర్ ఫుల్ గా వుంటే కథ ఎన్ని లోపాలనైనా జయించేస్తుంది!

ఈ షుగర్ కోటింగ్ ఏమీ సాధ్యపడని ‘రభస’ లాంటి సీరియస్ (ఫ్యాక్షన్) యాక్షన్ కథని ఇంటర్వెల్లో చేర్చిన మజిలీ- విలన్ కూతుర్ని చేసుకుని తీర్తానని హీరో చేసే ఛాలెంజి – ఆతర్వాత సెకండాఫ్ లో ఐపులేకుండా పోవడమనే ఫ్రాక్చర్ ని ఏం చేసీ- ఎన్ని ఫైట్లు పెట్టీ మరిపించలేకపోయారు. ‘కందిరీగ’ కామెడీతో చేసిన స్కీము సీరియస్ యాక్షన్ కి పనికిరాదని ముందే చెప్పుకున్నాం. సెకండాఫ్ లో హీరో తన లక్ష్యం మర్చిపోయి వేరే కథ నడపడమే- ఉపకథ ని ప్రధాన కథగా మార్చెయ్యడమే ఘోర తప్పిదమైపోయింది.

ఇంకా పాత సినిమాలే ఉన్నదున్నట్టూ అనుసరణీయమనే దురభిప్రాయం కూడా తోడయ్యింది. ఆనాటి సినిమాల్లోని భావోద్వేగాలు (ఎమోషన్స్ ) నిస్సందేహంగా కాలదోషం పట్టనివే. భావోద్వేగాలు ఎప్పుడైనా ఒకలాగే వుంటాయి. వుండనివేమిటంటే ఆయాకాలాల అభిరుచులే (టెస్ట్స్). అభిరుచులు మారిపోతూంటాయి. ముందు ట్రెండ్ లో వున్న ప్రేక్షకాభిరుచుల్ని ఎష్టాబ్లిష్ చేసుకుంటే- వాటిని అడ్డంపెట్టుకుని ఏ ఎమోషన్స్ నైనా ప్రదర్శించుకోవచ్చు. అదే పాత సినిమాల్లోని ఎమోషన్స్ ని ఆనాటి అభిరుచులతో సహా ఎత్తేసి పెట్టుకుంటే మొత్తం సినిమా కాలంచెల్లిన లుక్ తో ‘రభస’లాగే వుంటుంది. ఇటీవలి తాజా హిట్ ’రన్ రాజా రన్’ లో, ముందు ట్రెండ్ లో వున్న అభిరుచుల్ని హైలైట్ చేస్తూ, విలన్లూ -పోలీసుల మూస తరహా భావోద్వేగాలతోనే నింపేసి అలరించారు.

సినిమాలో ఒక చోట షాయాజీ షిండే ఎన్టీఆర్ మీద రెచ్చిపోతూ- ‘చంపండ్రా!’అని గ్యాంగ్ ని ఎగదోస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ కూడా- ‘ఇది కదరా నాకావాల్సిన ఎమోషనూ!!’-అని వాళ్ళ మీద విరుచుకుపడతాడు.

కాస్త ప్రేక్షకాభిరుచులతో ట్రెండ్ లో కూడా ఉంటూ ఎమోషనలై పోవాలని ఇంకెప్పుడు గుర్తిస్తారో!

-సికిందర్




















Monday, August 25, 2014


సాంకేతికం
ఆనాటి ఇంటర్వ్యూ..
డీటీఎస్ కి పూర్వం మేమెవరో తెలీదు!
ఇ.రాధాకృష్ణ, సౌండ్ ఇంజనీర్

   బ్దం 360 డిగ్రీల అనుభవం. దాన్నో పెట్టెలో బందీ చేసి ప్రేక్షకులకి/శ్రోతలకి అభిముఖంగా పెట్టి విన్పించడమంత అన్యాయం లేదు. ఈ అన్యాయాన్ని అరికట్టేందుకే కాబోలు, అపూర్వంగా డిటిఎస్ అనే ఆడియో వైభవాన్ని కనిపెట్టి, శబ్దానికి నివాళిగా అర్పించాడు సైంటిస్టు టెర్రీబెర్డ్.

     ప్పుడు డిటిఎస్ (డిజిటల్ థియేటర్ సిస్టమ్స్) అంటే తెలీని సగటు ప్రేక్షకుల్లేరు. కాని "డిటిఎస్‌కి పూర్వం సౌండ్ ఇంజనీర్లు ఉండేవారని జన సామాన్యానికి తెలీదు. పాటలూ, నేపథ్య సంగీతం సహా సినిమాల్లో విన్పించే అన్నిరకాల శబ్దాల సృష్టికర్త, సమ్మేళనకర్తా సంగీత దర్శకుడనే నమ్మేవారు'' అంటారు ఇ. రాధాకృష్ణ. గత 19 ఏళ్ళుగా ప్రసాద్ ల్యాబ్స్ లో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఈయనకి డిటిఎస్‌తో పదేళ్ల అనుభవముంది. థియేటర్లలో శబ్ద ఫలితాలు ఎలా విన్పించాలన్నది ఆయన చేతుల్లోనే ఉంది. అదే సమయంలో వాళ్లు పడ్డ కష్టమంతా సంపూర్ణంగా ప్రేక్షకులకి బదలాయింపు జరగాలంటే థియేటర్లలో సౌండ్ స్థితిగతులు బాగుండాలి. "డిటిఎస్ అనేది 5.1 ఛానెల్ వ్యవస్థ. ఇందులో వెండితెర వెనుక కుడి, ఎడమ, మధ్యన మూడు, హాలులో కుడివైపు, ఎడమవైపు చెరొక ఛానెల్‌తో మొత్తం ఐదు స్పీకర్లుంటాయి. మిగిలిన (.1) ఛానెల్‌తో ఆరవ స్పీకర్ వెండితెర వెనుకే కింది భాగంలో ఉంటుంది. దీన్ని సబ్ వూఫర్ అంటారు. ఇందులో ముష్టిఘాతాలు, తుపాకీ, బాంబు పేలుళ్ళు లాంటి లో ఫ్రీక్వెన్సీ శబ్దాలు వెలువడతాయి. మిగతా ఐదు స్పీకర్లలోంచి సంభాషణలు, నేపథ్య సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్స్ తాలూకు శబ్దాలు, పాటల్లో వాద్య పరికరాలూ వగైరా విభజన జరిగి వీనుల విందు చేస్తాయి'' అని వివరించారు రాధాకృష్ణ. 

     హాల్లో కుడి ఎడమవైపుల్లో అదనంగా ఎన్నైనా స్పీకర్లు అమర్చుకోవచ్చు. ఈ రెండు వరసలూ ప్రేక్షకుల సీటింగ్ వెనుకవైపు వరకూ కొనసాగుతాయి. మొట్టమొదట సౌండ్ నెగెటివ్‌తో కలిపి పిక్చర్ నెగెటివ్ వేశాక, ఆ సౌండ్ నెగెటివ్ (మోనో ఆడియో ఫార్మాట్)ని అలాగే ఉంచుతారు. ఎందుకంటే పల్లెటూరి థియేటర్లలో డిటిఎస్ సౌకర్యం ఉండదు గనుక. ఇక డబ్బింగ్, రీరికార్డింగ్స్, ఎఫెక్ట్స్, సాంగ్స్ మొదలైన వాటిని ముందేసుకుని మార్కెట్‌లో తిరుగులేని బ్రాండ్‌గా ఉన్న ‘ప్రోటూల్స్ డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్’ మీద డిటిఎస్ మిక్సింగ్‌కి పూనుకుంటారు. ఈ మిక్సింగ్‌ని డిటిఎస్ కంపెనీ తీసుకుని సీడీ రామ్స్ లో ముద్రించి ఇస్తుంది. దీనికి 75 వేలు రాయల్టీ రుసుముతో బాటు, ఒక్కో డిస్కుకి మరికొంత వసూలు చేస్తుంది. దీనివల్ల డిస్కులు తారుమారు కాకుండా ఉంటాయి. అప్పుడు థియేటర్లలో ప్రొజెక్టర్లోంచి సినిమా, సీడీ ప్లేయర్లోంచి డిస్కూ విడివిడిగా రన్ చేస్తే రెండు కలిసి హాల్లో ప్రేక్షకుల్ని అలరింపచేస్తాయన్న మాట!

     అయితే ఒక సినిమాకి 300 ప్రింట్లు వేసి 500 థియేటర్లలో ప్రదర్శించాలంటే, అదనంగా 200 డిస్కుల ఖర్చు పెరుగుతుందని, అదే ప్రింట్ల మీద ముద్రితమయ్యే డోల్బీ డిజిటల్ సిస్టమ్‌తో ఈ అదనపు భారం పడదనీ అన్నారు రాధాకృష్ణ. కానీ డోల్బీకి హిందీ సినిమాలకే తప్ప, దక్షిణాదిలో ఆదరణ లేదన్నారు.


   రాధాకృష్ణ మొదట డోల్బీకేపనిచేశారు. ఆ సినిమా 1998లో విడుదలైన 'ఆవిడా మా ఆవిడే'. చెన్నైలో పుట్టి పెరిగిన రాధాకృష్ణ, అడయార్ ఫిలింఇన్‌స్టిట్యూట్‌లో సౌండ్ ఇంజనీరింగ్ చదివి, 1991లో మీడియా ఆర్టిస్ట్ అనే సంస్థలో పనిచేశారు. అదే సంవత్సరం ప్రసాద్ ల్యాబ్స్ లో డబ్బింగ్ శాఖలో చేరి, అంచెలంచెలుగా రీరికార్డింగ్, మోనో మిక్సింగ్, ఆ తర్వాత డోల్బీకి, డీటీఎస్‌కీ ఎదిగారు. 

     సరే, అయితే డిటిఎస్‌తో అంతా నల్లేరు మీద నడకేనా, బాగా కష్టపెట్టిన సీన్లు లేవా అంటే, ఇష్టపడి చేసిన సీన్లే ఉన్నాయన్నారు. 'మగధీర'లో సామూహిక వధ సీనులో రామచరణ్ గుండెల్లో బాణం గుచ్చుకున్నప్పుడు, సౌండ్స్ అన్నిటినీ మైనస్ చేసి, నెమ్మది నెమ్మదిగా రీరికార్డింగ్ ఇస్తూ, ఫిమేల్ వాయిస్‌తో కాయిర్ వేస్తూంటే ఆ సీను ఉద్విగ్నతే వేరన్నారు. అలాగే 'సింహా' ఫ్లాష్ బ్యాక్‌లో బాలకృష్ణ హతమయ్యే సీన్లో భార్య కష్టం, పిల్లాడి ఏడ్పుకిచ్చిన శబ్ద ఫలితాలు మంచి తృప్తినిచ్చాయన్నారు. మిక్సింగ్ పరంగా ఈ రెండూ ఎంత సంకీర్ణ సన్నివేశాలో మనకు తెలిసిందే. 

     ఇప్పటివరకు 250 సినిమాలకి డిటిఎస్ మిక్సింగ్ చేశారు రాధాకృష్ణ. పూర్వం మోనో మిక్సింగ్‌తో కలుపుకుంటే ఈ సంఖ్య 800 వరకూ ఉంటుంది. వరుసగా మూడుసార్లు పోకిరి, మంత్ర, అరుంధతి సినిమాలకి నంది అవార్డులందుకున్నారు. ప్రస్తుతం బృందావనం, భైరవ, మరో కళ్యాణ్‌రామ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈయన తాజా సినిమా 'సరదాగా కాసేపు' ఈనెల 17న విడుదల అయింది.


   మరి తనకెవరు స్ఫూర్తి? - అనడిగితే, ఏడెనిమిది సార్లు ఆస్కార్అవార్డులందుకున్నఆడియో బ్రహ్మ గేరీ రెడ్‌స్టార్మ్ (జురాసిక్ పార్క్, టర్మినేటర్, టైటానిక్ ఫేమ్) తనకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారని అన్నారు. ఈ రంగంలో తను ఎంత అనుభవం గడించినా నిత్య అధ్యయనం, పరిశీలన తప్పవన్నారు. హైదరాబాద్‌కి మారినప్పటి నుంచి సంగీత దర్శకుడు కోటితో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. అలాగే కీరవాణితో 50 సినిమాలు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. పోతే, మొదట్నుంచీ  నుంచి తన వెన్నుతట్టి ఎంతో ప్రోత్సహిస్తున్న ప్రసాద్ ల్యాబ్స్ ఎండీ రమేష్ ప్రసాద్‌కి ఆజన్మాంతం రుణపడి ఉంటానన్నారు రాధాకృష్ణ. 
 
- సికిందర్

(ఏప్రెల్ 2011 ‘ఆంధ్రజ్యోతి’ సినిమా టెక్ )