రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by date for query బడ్జెట్ మూవీ. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query బడ్జెట్ మూవీ. Sort by relevance Show all posts

Sunday, August 10, 2025

1385 : స్క్రీన్ ప్లే సంగతులు

Most  Trending  Article!

 కమర్షియల్ సినిమాలనుకుంటూ తీసి ప్రేక్షకులకి చూపించేవన్నీ కమర్షియల్ సినిమాలు కావు. వాటిలో కథలతో తీసే సినిమాలు, గాథలతో తీసే సినిమాలు అని వేర్వేరుగా  వుంటాయి. కథలతో తీసే సినిమాలే అందరి కోసం బాక్సాఫీసులో ఆడే సినిమాలు. కథంటే ఏమిటో తెలియకపోయినా ఏదో కథలాంటి ఆకారంతో అయ్యిందన్పిస్తే, నష్టం రావచ్చుగానీ పరువేం పోదు. కథ అనుకుంటూ గాథ తీస్తేనే, నష్టపోవడంతో బాటు పరువూ పోతుంది. కథకి గాథకీ తేడా తెలియని తనం పరువు పోగొట్టుకునే లక్షణం. ఈ బేసిక్ నాలెడ్జి లేకుండా సినిమా ఫీల్డులో కొనసాగడం అన్నిటికన్నా ప్రమాదకర లక్షణం. ఈ లక్షణంతో మరింకో గాథగా కింగ్డమ్’ ’విడుదలైంది. దీంతో విజయ్ దేవరకొండ కొట్టిన హ్యాట్రిక్, ఇదివరకే ద్వారక’, ‘డియర్ కామ్రేడ్అనే రెండు గాథల్లో నటించి ఫ్లాప్ చేసుకున్న అనుభవంతో మళ్ళీ ఇంకో గాథ నటించడం! ఈసారి పానిండియా లెవెల్లో. థియేటర్లో 130 రూపాయలు పెట్టి చూడలేని గాథ మీద ఏకంగా 130 కోట్ల రూపాయల బడ్జెట్ ని ధారాళంగా ప్రవహింపజేసి నిర్మించడం! అది రెండో రోజుకే క్రాష్ అవడం!

రెండు దశాబ్దాల కాలంలో గాథలుగా తీస్తే ఫ్లాపయిన సినిమాలెన్నో వున్నాయి- వాటిలో మచ్చుకి కొన్ని - పైసా, మొగుడు, ఓకే బంగారం, కృష్ణమ్మ కలిపిందినీ, జక్కన్న, ఉన్నది ఒక్కటే జీవితం, రాజుగారి గది 2, రాజాధి రాజా, కబాలీ, ద్వారక, ఒక్కడు మిగిలాడు, డియర్ కామ్రేడ్, జార్జి రెడ్డి, రాదే శ్యామ్, శాకుంతలం, బ్రో, బచ్చలమల్లి...ఇన్నేసి గాథలు ఫ్లాపవుతూండగా అదే పరిపూర్ణ అజ్ఞానంతో వాటిని తీస్తూ పోతూనే వున్నారు. భారీ నష్టాలు చవి చూస్తూనే వున్నారు. గాథలు తీస్తూ ఈ రెండు దశాబ్దాల్లో ఎంత లేదన్నా రెండు వేల కోట్లు నష్టపోయే వుంటారు. అయినా పరిపూర్ణ అజ్ఞానం టాలీవుడ్ లో బేపర్వాగా రాజ్యమేలుతూనే వుంది. కమర్షియల్ గా వర్కౌటయ్యే కథకీ, వర్కౌట్ కాని గాథకీ తేడా గుర్తించి సినిమాలు తీయాలని ఈ బ్లాగు ద్వారా ఎన్నిసార్లు విన్నవించుకున్నా -నాకింకా స్ట్రక్చర్ తో పని యేముంది, డోంట్ కేర్ అన్నట్టు గానే సాగుతోంది పోకడ.

కథతో వుండే స్క్రీన్ ప్లేలో స్ట్రక్చర్ వుంటుంది. గాథకి వుండదు. ఎందుకుండదంటే, శాస్త్రీయంగా అర్ధం జేసుకుంటే, స్క్రీన్ ప్లే అంటే మన మెదడులో కథని స్వీకరించడానికి ప్రాకృతికంగా వైరింగ్ అయి వున్న బ్లూ ప్రింట్ కి ప్రతి రూపం కాబట్టి. గాథ మన మెదడులో ప్రాకృతికంగా వైరింగ్ అయి వున్న ఈ బ్లూ ప్రింట్ కి సరిపోలి వుండదు గాబట్టి స్క్రీన్ ప్లే అవదు. కథల్లో ఈ బ్లూ ప్రింట్ ప్రకారం స్ట్రక్చర్ వుంటుంది కాబట్టి అది స్క్రీన్ ప్లే అవుతుంది. గాథ స్ట్రక్చర్ లేదు కాబట్టి అది స్క్రీన్ ప్లే కాదు. ప్రకృతికి విరుద్ధంగా ఏదో మనసుకి తోచిందల్లా రాసుకుపోయే వేస్టు మెటీరియల్. కథ చెప్పడం నేర్చుకోవడం, లేదా స్క్రీన్ ప్లే ఎలా రాయాలో నేర్చుకోవడం కోసం స్ట్రక్చర్ అనే అభ్యాసం అత్యవసరం. కథా నిర్మాణం (స్ట్రక్చర్) ఆధారంగా కథలు రాయడమనేది ప్రేక్షకులు డబ్బు చెల్లించి సినిమాకి హాజరు కావడానికి అవసరమయ్యే మొదటి అడుగు.

కాబట్టి స్క్రీన్‌ప్లే స్ట్రక్చర్ అంటే ప్రేక్షకుల నుంఛి పరిపూర్ణ భావోద్వేగ ప్రతిస్పందనని పొందడం కోసం స్క్రీన్‌ప్లేలోని కథాంశాలని ఒక నిర్దిష్ట కాలక్రమానుసారం అమర్చమన్న మాట. ఇది గాథతో జరగదు. స్ట్రక్చర్ అనేది పాత్రలు, సంఘటనలు, చర్య- ప్రతిచర్యలు మొదలైన సాధనాలతో ఒక దృఢమైన, భావోద్వేగ సహిత కథాంశాన్ని సృష్టించడానికి అవసరమయ్యే నిర్మాణం.

2. కథంటే ఆర్గ్యుమెంట్- గాథంటే స్టేట్ మెంట్

    కమర్షియల్ సినిమాకి అవసరమయ్యే ఆర్గ్యుమెంట్ అనే యాక్టివ్ టూల్ కథలోనే వుంటుంది. గాథలో కమర్షియల్ గా వర్కౌట్ కానీ ఊత్త పాసివ్ స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. కథలో ఆర్గ్యుమెంట్ వల్లసంఘర్షణ పుడుతుంది. గాథలో స్టేట్ మెంట్ కా రణంగా సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. దృశ్యపరంగా వెండితెర మీద చూసేందుకు కథలే బావుంటాయి. కథలో ఒక ప్రధాన పాత్రకి ఓ సమస్య ఏర్పటై, దానితో మొదలయ్యే సంఘర్షణతో తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ పుట్టి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంటుతో ముగుస్తుంది కథ.

గాథ లో సమస్య వున్నా, పాత్ర దానితో సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంట్ ఇవ్వక, కేవలం ఈ ఫలానా సమస్యతో నాకిలా జరిగిపోయి, చివరాఖరికి నేనిలా దయనీయంగా మిగిలానోచ్ అనేసి ఓ పాసివ్ స్టేట్ మెంట్ పారేసి, తన దారిన తను దులుపుకుని వెళ్ళిపోతుంది పాత్ర.

కమర్షియల్ సినిమా కథంటే సమస్యల్ని పరిష్కరించేదే. సమస్యని  పరిష్కరిస్తేనే కథ. సమస్యని ఏకరువు పెట్టి వాపోయేది గాథ. సమస్య -ఆర్గ్యుమెంట్ - పరిష్కారం ఇదీ కమర్షియల్ సినిమా కథకుండే చట్రం. ఆర్గ్యుమెంట్ అంటే రెండు పాత్రలు, లేదా రెండు వర్గాలు, నువ్వు రైటా, నేను రైటా అని సంఘర్షించుకోవడమే. అందుకే సమస్య - సంఘర్షణ - పరిష్కారం అని ప్రాథమికంగా నిర్వచిస్తారు కమర్షియల్ సినిమాల కథల్ని. ఎటొచ్చీ ఒక సమస్యని లేవనెత్తి దాన్ని పరిష్కరించేందుకే వుంటాయి కమర్షియల్ సినిమాల కథలు. లేకపోతే వాటికి కమర్షియల్ సినిమాల్లో పనిలేదు, బాక్సాఫీసు దగ్గర ఓ చెత్తకుండీ చూసుకుని అందులో సెటిల్ అవడం తప్ప.

3. కథ హాట్ హాట్ - గాథ ఫ్లాట్

    ఇక్కడ సినిమా కథంటే సరిపోతుందిగా, కమర్షియల్ సినిమా కథంటూ పదేపదే చెప్పడ మెందుకని సందేహం రావచ్చు. అసలు సమస్యంతా ఇక్కడే వుంది. కథకి ఆర్గ్యుమెంట్ సంగతే పట్టకుండా రాసేసి తీస్తే అదికూడా సినిమానే అవుతుందని అనుకుంటున్నారు, ఆర్టు సినిమా అవుతుందని తెలీక. ఈ బ్లాగులోనే చాలా సార్లు కొన్ని సినిమాల రివ్యూల్లో చెప్పుకున్నాం -స్టార్ సినిమాలనేవి కమర్షియల్ సినిమాల ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే అని!

ఇందుకే గాథలు చప్పగా, ఫ్లాట్ గా వుంటే, కథలు హాట్ హాట్ గా వుంటాయి. సినిమా ప్రేక్షకులకి జడ్జి మెంటు హాట్ హాట్ సంఘర్షణాత్మక కథలే కావాలి, ఏ సంఘర్షణా జడ్జిమెంటూ వుండని చప్పటి ఫ్లాట్ గాథలు కాదు. కథలోయాక్టివ్ పాత్రలుంటాయి, అందుకే సమస్య చుట్టూ ఆర్గ్యుమెంట్ పుడుతుంది. గాథలో పాసివ్ పాత్రలుంటాయి, అందుకే సమస్య వున్నా పలాయన వాదంతో ఆర్గ్యుమెంట్ పుట్టదు. కమర్షియల్ సినిమాలు యాక్టివ్ పాత్రల వల్ల జనసామాన్యంలో ఆడతాయి. ఆర్ట్ సినిమాల్లాంటి గాథ లు పాసివ్ పాత్రలతో మేధావి వర్గాల మెప్పు కోసం వుంటాయి. వాటితో ఎవరికీ ఏ ప్రయోజనమూ వుండదు. ఎందుకంటే వీటిలో వ్యక్తిత్వ వికాసమూ, మోటివేషనల్ కోర్సూ వుండదు. ఆ పాత్రల్ని చూసి అయ్యో పాపమని అవసరం లేని బాధ పడ్డం తప్ప. ఈ తేడా తెలుసుకోకుండా సినిమా కథా రచన చేపడుతున్నారు కాబట్టి - సినిమాల్లో కమర్షియల్ సినిమాలు వేరయా అని పాట పాడాల్సివస్తోంది. ఎంత పాడినా కమర్షియల్ సినిమాలు మాత్రం ఇప్పటకీ కూడా వందల కోట్ల రూపాయలతో అజ్ఞానపు వ్యాపారంగానే, బిగ్ నెమ్స్ ని ఆసరాగా చేసుకుని, ప్రేక్షకుల్ని మభ్య పెడుతూనే వున్నాయి. ప్రేక్షకులు కూడా జేబులో కష్టార్జితం వందలకి వందలు ప్రభుత్వం ముద్రించిన అసలీ నోట్లిచ్చుకుని, నకిలీ సినిమాలు ఏంచక్కా చూస్తూనే వుంటారు.

4. చివరంటా పాడె మోసి మోసి...

    కమర్షియల్ సినిమాకి కథ వల్ల సమకూరే స్ట్రక్చరే ప్రాణం. గాథ అనే దానికి బిగినింగ్ మాత్రమే వుండి, అదే సాగి సాగి ఆ బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని కమర్షియల్ సినిమాలకి బిగినింగ్ ని మాత్రమే కలిగి వుండే గాథలు పనికి రావు. కథతో అలా కాదు, కథలకి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ లనే మూడంకాలుండి, ఆ ఆదిమధ్యంతాల సృష్టి స్థితి లయలతోప్రాకృతికంగా విషయ విపులీకరణ చేస్తుంది. గాథలో ఎప్పుడో బిగినింగ్ మలుపులో (ప్లాట్ పాయింట్ వన్) లో పాతి పెట్టాల్సిన బిగినింగ్ పాడెని సినిమా చివరంటా మోసి మోసి, ఆ కళేబరాన్ని ప్రేక్షకుల మీద పడేసి వెళ్ళిపోతారు. ఈ పాడె మోయడాన్ని కథకుడు, దర్శకుడు ఎంతో అనిర్వచనీయమైన ఆత్మానందంగా భావిస్తారు- తీస్తున్నది గ్రాండ్ ఎక్స్ ట్రార్డినరీ ఎపిక్ మూవీ అన్న ఫీలింగ్ వల్ల!

        ఇంకా చెప్పుకుంటే, గాథకి ప్లాట్ పాయింట్స్ కూడా వుండవు. కథకి వుంటాయి. గాథకి పాత్ర ఎదుగుదలకి సంబంధించిన క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) కూడా వుండదు. ఎలా మొదలైన పాత్ర నిస్తేజంగా అలాగే పడి వుంటుంది. కథకి అలాకాదు, పాత్ర ఎదుగుదలలతో కూడిన క్యారక్టర్ ఆర్క్ అడుగడుగునా ఉద్విగ్నభరితంగా తయారవుతూ పోతూంటుంది. ఇంకా గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ (కాలం- వొత్తిడి బిందు రేఖ) కూడా ఏర్పడదు. అంటే తెర మీద సినిమా నడిచే కాలం గడిచే కొద్దీ టెన్షన్ కూడా పెరగడం వుండదన్న మాట. ఎలా మొదలయిన సినిమా అలా నేలబారు కథనంతోనే నడుస్తుంది. కథకి అలాకాదు, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ పాలన జరగడంతో పాటు, ఉత్థాన పతనాల కథనంతో కట్టి పడయడమూ వుంటుంది.

        గాథలో సంఘర్షణ కూడా వుండదు, కానీ సంఘర్షణ లేని కథ వుండదు.గాథకి విలన్ కూడా వుండడు, వుంటే సరిగా వుండడు. కథకి విలన్ ఒక కీలక కక్షి దారు. వీడు లేకపోతే మనమీద కక్ష గట్టినట్టు వుంటుంది కథ. గాథలు ఆర్ట్ సినిమాలు చూసుకునే వ్యవహారం. కథలు కమర్షియల్ సినిమాలు చూసుకోవాల్సిన పక్కా వ్యాపారం.

        పైన గాథలుగా వచ్చినట్టు చెప్పుకున్న బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, మొగుడు, పైసా, చక్కలిగింత, కృష్ణమ్మ కలిపిందినీ, రాజాధిరాజా మొదలైన సినిమాలతో- మరొక్క సారి పైన చెప్పుకున్న టూల్స్ ని కలిపి పరిశీలనాత్మకంగా చూస్తే- పై పేరాల్లో చెప్పుకున్న కథకుండే లక్షణాల్లో ఒక్కటి వీటికి లేదనీ, ఈ సినిమాలన్నీ గాథకి చెప్పుకున్న లక్షణాలతో వున్నాయనీ గుర్తించవచ్చు.

5. Story versus Tale

    A TALE  (గాథ) exists with no greater sense of its self, no greater purpose beyond a simple rehashing of events...127 Hours isn’t the only one—Taken, Coraline, Battle: LA, True Grit, IngloriousBasterds, 2012, Where the Wild Things Are, The Informant, Public Enemies—all tales with little to say.  All works of fiction that are easily forgotten.

 A STORY(కథ) gives audience members an experience they can’t have on their own. This experience is why audience members return to a film over and over again. Star Wars, The Shawshank Redemption, The Lives of Others, The Godfather, The Apartment, The Sound of Music, Toy Story, Toy Story 2 (pretty much anything Pixar), The King’s Speech, The Dark Knight, Good Will Hunting, Chinatown—all stories with much to say. All works of fiction that are not so easy to forget.

― Narrative First 

6. కొన్ని గాథలు విజయాలు సాదిస్తున్నాయిగా?


    కథకీ గాథకీ తేడా తెలియక, లేదా ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా, కథ అనుకుంటూ తీసేస్తే అవి ఎటూ గాకుండా పోతున్నాయి. గాథకి ఆలోచింపజేసే విషయం, ఉదాత్త పాత్రలు, పాత్ర చిత్రణలు, నటనలు, సంభాషణలు వుంటూ, టెక్నికల్ హంగామా లేని క్వాలిటీ చిత్రీకరణ, ఫిలాసఫీ ఇవీ అవసరం. గాథ తీయాలంటే మూసఫార్ములా ప్రపంచంలోంచి పూర్తిగా వేరే ఉన్నత ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. దీనికి స్టార్స్ ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది. మీడియం లేదా చిన్న హీరోల మీద ఉదాత్త గాథలు ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో తెలియదు. అవి ఆర్ట్ సినిమాలుగా అన్పించవచ్చు.

 గాథతో కూడిన  'దేర్ విల్ బి బ్లడ్' విడుదలైన సంవత్సరంలోనే (2007) కోయెన్ బ్రదర్స్ దర్శకత్వంలో  'నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్' యాక్షన్ మూవీ విడుదలైంది. ఇది యాక్షన్ జానర్లో గాథ. 'దేర్ విల్ బి బ్లడ్' పీరియెడ్ గాథ. దీనికంటే కోయెన్ బ్రదర్స్ కి రెండు ఆస్కార్ అవార్డులు ఎక్కువే వచ్చాయి - ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ దర్శకత్వం సహా. వాళ్ళు గాథ తో యాక్షన్ తీసినా ఎందుకు గొప్ప సినిమాలవుతున్నాయో ఆలోచించాలి. ఇద్దరు స్టార్స్ లో ఒక స్టార్ గాథలో చనిపోవడానికి ఒప్పుకుంటాడా, ఒప్పుకోకపోతే ఇద్దరూ కలిసి విలన్ ని చంపెయ్యాలా అని రాజీపడి పోతే, 'నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్' లాంటిది తెలుగులో రాదు. గాథ అంటే ఫార్ములా కాదు, ఫిలాసఫీ. 'నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్' సెకండాఫ్ లో ఉన్నట్టుండి విలనే హీరోని చంపేస్తాడు. షాక్ తిని గగ్గోలు పెట్టే  ప్రేక్షకులకి, ఇది హీరో కథ కాదనీ, మొదట్లో కన్పించే ఇంకో హీరో పాయింటాఫ్ వ్యూలో గాథ అనీ చివర్లో చెప్పి, ఆడియెన్స్ ని సంతృప్తి పరుస్తారు కోయెన్ బ్రదర్స్. తెలుగులో ఘనవిజయం సాధించిన పెదరాయుడుకూడా గాథే! ఉత్తమాభిరుచులున్నప్పుడే గాథలు తీసి విజయం సాధించే వీలవుతుంది.

7. ఇప్పుడు కింగ్డం గాథ సంగతులు

            1920లో  శ్రీకాకుళంలో కొందరు జాలర్ల మీద బ్రిటిష్ సైన్యం దాడి చేయడంతో ఆ జాలర్ల నాయకుడు చనిపోయి  జాలర్లు శ్రీలంక  పారిపోతారు. తర్వాత శ్రీలంక సిండికేట్ కింద బానిసలుగా మారిపోయి స్మగ్లింగ్ కి తోడ్పడుతూంటారు. ఎప్పటికైనా చనిపోయిన తమ నాయకుడు తిరిగి వస్తాడని నమ్ముతూంటారు.

        1991 కొస్తే, తెలంగాణా జిల్లాలో సూరి (విజయ్ దేవరకొండ), శివ అన్న దమ్ములు. తాగి వచ్చి తల్లినీ తమనీ కొట్టే తండ్రిని శివ (సత్య దేవ్) ఒకరోజు చంపేసి పారిపోతాడు. సూరి అన్నమీద బెంగతో అలాగే పెరిగి పోలీస్ కానిస్టేబుల్ అవుతాడు. ఎట్టి పరిస్థితిలో అన్న ఎక్కడున్నాడో కనుగొని ఇంటికి తెచ్చుకోవాలన్న పట్టుదలతో వుంటాడు. ఇంతలో శ్రీలంకలో కోవర్టు ఆపరేషన్ జరిపేందుకు సెలెక్టు అవుతాడు. శ్రీలంక వెళ్తే అక్కడ దివి అనే లంకలో జాలర్ల నాయకుడుగా అన్న శివ కనబడతాడు. ఇలా అన్నదమ్ములు ఒకటవుతారు. శ్రీలంక సైన్యం బంగారం స్మగ్లింగ్ ని అరికడుతూ బంగారాన్ని సీజ్ చేస్తే, సిండికేట్ ఆదేశాలతో సూరి వెళ్ళి ఆ బంగారాన్ని దోచుకుని వస్తాడు. అయితే సిండికేట్ బాస్ మురుగన్ అన్నదమ్ముల్లో ఒకరు పోలీస్ ఏజెంట్ అని అనుమానిస్తాడు. ఈ అనుమానంతో సూరి అన్న శివాని చంపేస్తాడు. దీంతో సూరి తిరగబడి సిండికేట్ ని అంతం చేసి జాలర్లకి కొత్త నాయకుడుగా కిరీటాన్ని ధరిస్తాడు. దీనికి  సీక్వెల్ వుంటుందన్న అర్ధంలో ముగుస్తుంది సినిమా.

        ఓ సముద్ర తీరం, అక్కడ జాలర్లో, ఏదో ఒక తెగో ఓ ముఠా చేతిలో స్మగ్లింగ్ కి తోడ్పడే బానిసలుగా బ్రతకడం, హీరో వచ్చి వాళ్లకి విముక్తి కల్గించడం కథలు  ఒక వరసలో వస్తున్నాయి- దేవర, కంగువ, తండేల్, ఇప్పుడు కింగ్డం.  సముద్ర తీరం కాకుండా ఆంధ్రా- చత్తీస్ ఘర్ బోర్డర్లో ఓ హంతక తెగ గురించి తమ్ముడు’. ఈ బ్యాక్ డ్రాప్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. 

    కింగ్డం గాథ ఎలా అయిందో చూద్దాం... 1920 లో జాలర్ల పరిస్థితి చూపించాక, 1991  లో తెలంగాణా జిల్లాలో సూరి - శివల బాల్యం, వేధించే తండ్రి, శివ ఆ తండ్రిని చంపి పారిపోవడం అయ్యాక- శివ కోసం తపిస్తూ సూరి పెరగడం, పోలీసుద్యోగంలో చేరడం, అన్న ఫోటో ఆధారంగా ఇప్పుడు పెరిగి ఎలా వుంటాడో ఊహా చిత్రం తయారు చేయించడం వగైరా బిగినింగ్ బిజినెస్ తో సాగి, సూరి పై అధికారిని కొట్టడం, ఇది విచారణ జరుగుతూండగా వేరే అధికారి శ్రీలంకలో కోవర్ట్ ఆపరేషన్ అప్పగించడం వగైరాలతో అరగంటలో ముగుస్తుంది బిగినింగ్.

        అంటే, ఇక్కడ కోవర్ట్ ఆపరేషన్ అప్పగించడం ప్లాట్ పాయింట్ వన్ అన్న మాట. ఈ ప్లాట్ పాయింట్ వన్ లో పుట్టాల్సిన కాన్ఫ్లిక్ట్ పుట్టలేదు. ఆ అధికారి కోవర్ట్ ఆపరేషన్  కెళ్తే అక్కడ అన్నని కూడా కలుసుకోవచ్చని చెప్పడంతో ఒప్పుకుంటాడు సూరి. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ పుట్టక పోవడం వల్ల సహజంగానే ఇంకెక్కడా కాన్ఫ్లిక్టే లేకుండా ఫ్లాట్ గా మారింది కథనం. ఇంటర్వెల్లో కూడా కాన్ఫ్లిక్ట్ వుండదు.  శ్రీలంక సైన్యం నుంచి బంగారం కొట్టేయడంతో జాలర్లు సూరి తమ హీరోగా చేసుకుని విజయోత్సవం జరుపుకోవడమే ఇంటర్వెల్!

        దీన్నిబట్టి ఏం తేలుతోందంటే, ఇంటర్వెల్లో కూడా కాన్ఫ్లిక్ట్ పుట్టలేదు కాబట్టి ఇదంతా బిగినింగ్ విభాగమేననుకోవాలి. పైన చెప్పుకున్నట్టు గాథల్లో  బిగినింగే సాగుతూ సాగుతూ వుంటుంది కాబట్టి.  అసలు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కాన్ఫ్లిక్ట్ లేకపోవడం, ప్రత్యర్ధి పాత్ర పుట్టకపోవడం- దీని తర్వాత ప్రారంభమయ్యే మిడిల్ విభాగంలో శ్రీలంకలో సిండికేట్ కూడా ప్రత్యర్ధులు ఆవకుండా వాళ్ళకోసమే సూరి పనిచేయడంతో -ఫస్టాఫ్ సూరితో ప్రత్యర్ధి లేని ఏకపక్ష ప్రయానంగా మారింది. 

        మరొకటేమిటంటే కోవర్టుగా, అన్నని ఇంటికి తెచ్చుకో వచ్చానుకున్న తమ్ముడుగా, సూరి  రెండు కోణాలూ పని చేయకపోవడానికి వాటిలో ఎమోషన్ లేకపోవడం. ప్లాట్ పాయింట్ వన్ లో కాన్ఫ్లిక్ట్ లేకపోవడంతో అందులోంచి పుట్టే ఎమోషన్ కూడా లేకుండా పోయింది. దీంతో సెకండాఫ్ కూడా ఎమోషన్ లేని శుష్క వ్యవహారంగా మారింది. ఇవన్నీ గాథ కుండే లక్షణాలే.

        ఇదే కథ అయితే, ప్లాట్ పాయింట్ వన్ లోనే గేమ్ ఎస్టాబ్లిష్ అయ్యేది. ఇలా అనుకుందాం... ఆ అధికారి డబుల్ ప్రమోషన్ మీద కన్నేసిన కన్నింగ్ అధికారి అయివుంటే, ఇరవై ఏళ్ల క్రితం తండ్రి హత్య కేసులో నిందితుడైన శివని పట్టుకునేందుకు సూరినే ప్రయోగించి ఆ అధికారి ప్లాన్ చేసి వుంటే, శ్రీలంకలో కోవర్ట్ ఆపరేషన్ అనేది ఉత్తుత్తి నాటకమే, అసలు ఉద్దేశం అక్కడున్న శివని రప్పించి జైల్లో వేసి డబుల్ ప్రమోషన్ కొట్టేయడమే అయివుంటే, ఈ గుట్టు  ప్రేక్షకులకి తెలిసి,  సూరికి తెలియకుండా వుంటే- అప్పుడు దీన్ని కథ అంటారు.

         కానీ ఇది గాథ కాబట్టి  పాత్రలతో ఏ రకమైన సస్పెన్స్, కాన్ఫిక్ట్ లేని డొల్లగా మారింది కథనం. ఇక్కడ్నుంచి మిడిల్ కెళ్తే, అన్నని కలుసుకోవడం, సిండికేట్ కోసం పనిచేయడం అంతా కృత్రిమంగా- ఫ్లాట్ గా సాగుతుంది ఇంటర్వెల్లో వరకూ. ఫస్టాఫ్ ఇలా తేలిపోయాక, సెకండాఫ్ ఎటు వెళ్ళాలో గోల్ లేదు సూరికి. దీంతో సిండికేట్ హడావిడీ, వాళ్ళ మీటింగులు, ప్లానింగులతో ఏమాత్రం బాక్సాఫీసు అప్పీల్ లేని  నసగా  మారింది రచన.  ఇప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఏర్పడలేదంటే, సెకండాఫ్ లో ఇదంతా కూడా జీడి పాకంలా ఇంకా సాగుతున్న బిగినింగే నన్న మాట.

            తర్వాతెప్పుడో సిండికేట్ ఇద్దర్లో ఒకర్ని కోవర్ట్ అని అనుమానించి శివాని చంపడంతో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ పుడుతుందన్న  మాట. ఈ కాన్ఫ్లిక్ట్ తో నేరుగా మురుగన్ ని చంపే  క్లయిమాక్సే.  ఇదీ గాథ. సూరి పూర్తి  పాసివ్ క్యారక్టర్ గా, గోల్ లేని జడుడుగా మారిపోవడం. కనీసం అన్నదమ్ముల మధ్య అయినా ఫస్టాఫ్ లో కాన్ఫ్లిక్ట్ పుట్టలేదు. పుట్టి వుంటే అది కథగా మార్చే ఆర్గ్యుమెంట్ అయ్యేది. అన్న దమ్ములకి వాళ్ళ నేపథ్యమే గుర్తుకు రాదు. తండ్రి ఎంత చెడ్డవాడైనా చంపడం చంపడమే, హత్య హత్యే. దానికి తగ్గ పరిణామాలుంటాయి, శిక్ష వుంటుంది. ఈ విషయమే తెలీనట్టు వుంటారు. తమ్ముడు అన్నని తీసికెళ్ళడాని కొచ్చాడు. అన్న కనీసం అమ్మకి మొహం చూపించలేనని వెళ్ళడానికి నిరాకరించినా ఒక ఆర్గ్యుమెంట్ అంటూ పుట్టేది.  దీనికి జడ్జిమెంటుతో డ్రామా ముగిసేది. 

    కథకుడు అన్నని సిండికేట్ తో చంపించడం తమ్ముడు సూరి పాత్ర పట్ల చేసిన ఘోరాపచారమనాలి.  కోవర్ట్ ఆపరేషన్ అనీ, అన్నని తీసికెళ్ళాలనీ సూరి వచ్చి వుండకపోతే అన్న బ్రతికి వుండేవాడు. వచ్చి సిండికేట్ కి ఇద్దర్లో ఒకరు పోలీస్ ఇన్ఫార్మర్ అని అనుమానాలు సృష్టించుకుని, అన్నని చంపించుకున్నట్టయ్యింది పాత్ర! తను వచ్చి సాధించిందేమిటంటే ఇదే - అన్నని చంపించుకోవడం!  చంపించుకుని కిరీటం పెట్టుకోవడం!

        కథని స్ట్రక్చర్ కాపాడుతుంది. ఎలాగంటే పాత్ర స్ట్రక్చర్ నియమాలు పాటిస్తుంది. అలా స్ట్రక్చర్ లో దారి తప్పకుండా యాక్టివ్ క్యారక్టర్ గా తన కథ తను సజావుగా నడుపుకుంటుంది. ఇలాగాక పాత్ర కథ కథకుడు జోక్యం చేసుకుని నడిపితే అది పాసివ్ పాత్రగా మారి గాథని సృష్టించుకుంటుంది. ఈ సింపుల్ లాజిక్ తెలియనంత కాలం ఇలాగే  గాథలు తీస్తూనే వుంటారు.
సికిందర్