రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, October 5, 2025

1395 : స్పెషల్ ఆర్టికల్

 

    2019  లో పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వే స్టేషన్‌లో హృదయాల్ని మీటే  ఒక స్వరం పలుకుతోంది. జనం చుట్టూ చేరి సమ్మోహితులవుతున్నారు.  ఆ జనంలో ఒక టెక్కీ దాన్ని వీడియో తీసి వైరల్ చేశాడు. 1972 లో నటుడు, రచయితా నిర్మాతా దర్శకుడూ అయిన  మనోజ్ కుమార్ తీసిన  - 'షోర్' లోని  లతా మంగేష్కర్ పాడిన 'ఏక్ ప్యార్ కా నగ్మా హై' హిట్ సాంగ్ పాడుతున్న ఆ తియ్యటి  గళం - వెళ్ళి వెళ్ళి బాలీవుడ్ లో సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా చెవిన పడింది. వెంటనే ఆమెని పిలిపించుకుని  ఒక రియాలిటీ షోలో పరిచయం చేశాడు. ఆ షోతో ఆమె మరింత హిట్టయ్యింది. ఇక ఆమెకి తన కొత్త సినిమాలో పాడే అవకాశమిచ్చాడు. ఆ పాట 'తేరీ మేరీ కహానీ' వైరల్ హిట్టయ్యి ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టింది. 20 పాటలు పాడేసి రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపొయింది. అప్పుడు ... ఎంత వేగంగా సెలబ్రిటీ సోపానాలెగ బ్రాకిందో అంత  వేగంగానూ వచ్చి ఠపీ మని కింద పడింది!  


రానూ మండల్  ఉత్థాన పతనాల విషాద గాథ షార్ట్ కట్ కళాకారులకి పాఠాలు నేర్పుతుంది. లోతు పాతుల్లేకుండా రాత్రికి రాత్రేం జరగదు. జరిగినా ఎంతో కాలం నిలబడదు. ఆరు నెలల్లో  ఆమె ఎక్కడ్నించి బయల్దేరి బాలీవుడ్ లో సంచలన గాయిక అయిందో, అక్కడ్నుంచి  అదే కోల్ కత సమీపంలోని తన పాడుబడ్డ ఇంట్లో అదే నిరుపేద జీవితంలోకి జారుకుంది. గతవారం నీషూ తివారీ అనే యూట్యూబర్ మతిస్థిమితం కోల్పోయిన ఆమెని వెతుక్కుంటూ వెళ్ళి, అన్నం పెట్టి, ఓదార్చి, వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో కోటి వ్యూస్ కి చేరుకుంది... 


ఈ పతనానికి కారణం అహంకారం, దుష్ప్రవర్తన. తన సెల్ఫ్ ఇమేజీని అంతా నేనే, అన్నీ నాకే - అన్న పొగరు బోతుతనంగా క్రియేట్ చేసుకుని విర్రవీగడం. అభిమానుల మీద చేయి చేసుకోవడం.  ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకురాలు కేథరిన్ బిగేలో కూడా పేదరికంలో మగ్గింది. కానీ ఆమె తనలో వున్న కళని గుర్తించి అభివృద్ధి చేసుకుంది.  కొలంబియా యూనివర్సిటీ నుంచి థియరీ అండ్ క్రిటిసిజం లో మాస్టర్స్ చేసింది. హాలీవుడ్ లో అడుగుపెట్టి నానా ఢక్కా మొక్కీలు తింటూ, 1981-2007 మధ్య ఎనిమిది సినిమాలకి దర్శకత్వం వహించింది. 2008 లో ‘హర్ట్ లాకర్' తీసి ఆస్కార్ ఉత్తమ దర్శకురాలి అవార్డు నందుకుంది. అంతవరకూ ఈ అవార్డు తీసుకున్న దర్శకురాళ్ళు లేరు. తర్వాత 'జీరో డార్క్ థర్టీ'  అన్న మరో ప్రసిద్ధ సినిమా తీసింది. ఈ సంవత్సరం పదమూడో సినిమా 'ది హౌజ్ ఆఫ్ డైనమైట్' తీసి, 45 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్ తో పాఠ్య పుస్తకంలా నిల్చింది. 


రానూ మండల్  తనలోని కళతో సమున్నత స్థానానికి చేరుకోవచ్చని తెలుసుకోలేదు.   పూర్వం పని వెతుక్కుంటూ భర్తతో ముంబాయి వెళ్ళి కూలీనాలీ చేసుకుంటూ కష్టాలు పడలేక తిరిగి వచ్చేసిందే తప్ప- తన గానకళతో జీవితంలో ఎదగ వచ్చనుకోలేదు. ఆమెకి చెప్పే వాళ్ళు కూడా లేరు. వీధుల్లో పాడుకుంటోంటే వినోదించడం తప్ప. ఒక టెక్కీ ఆమె గానాన్ని వైరల్ చేసి బాలీవుడ్ చేర్చినా, ఆ కెరీర్ లో ఎలా మెలగాలో, మల్చుకోవాలో చెప్పే సలహాదారుల్ని కూడా ఆమె నియమించుకోలేదు. రాత్రికి రాత్రి వచ్చి పడిన ఖ్యాతితో అంతా నేనే, అన్నీ నాకే అన్న దురహంకారమే పెరిగి పతనమైపోయింది. 


దర్శకత్వ శాఖలో ఇలాటి షార్ట్ కట్ స్వాములు చాలామందే వుంటారు. రెండు సినిమాలకి అసిస్టెంట్లుగా చేసి నిర్మాతల వేటలో  పడి దర్శకులైపోవడం. ఆ రెండు సినిమాలకి కూడా షూటింగుల వరకే పనిచేయడం. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో పనుండదు. పోస్ట్ ప్రొడక్షన్లో ఏ శాఖ ఏమిటో తెలియాలంటే  అసోసియేట్ గా కొన్నేళ్ళు పనిచేయాలి. అప్పుడే సినిమా తీయడం మీద పూర్తీ అవగాహనా ఏర్పడుతుంది. రెండు సినిమాల అసిస్టెంట్ గా జంప్ చేసి రాత్రికి రాత్రి డైరెక్టర్ లైపోతే రానూ మండల్లే అవుతారు.  నిర్మాతకి ఒక బడ్జెట్ చెప్పి సినిమా ప్రారంభించి, సగం సినిమాకే బడ్జెట్ అయిపోయి మళ్ళీ కనపడకుండా జంపై పోవడం ఇందుకే జరుగుతుంది. 


దర్శకత్వ అవకాశాల కోసం ఎల్ ఏ ఓ ప్రయత్నిస్తే, దీనికి కూడా చాలా కమిటై వుండాలని ముందే చెప్పుకున్నాం. ఇందులో భాగంగా గత వారం సెల్ఫ్ ఇమేజీని ఎలా సృష్టించుకోవాలో చెప్పుకున్నాం. ఈ వారం యోగ్యత (క్వాలిఫికేషన్), లక్ష్యం ఏర్పాటు (గోల్ సెట్టింగ్), విశ్వాసం (బిలీఫ్), ప్రతిజ్ఞ (అఫర్మేషన్స్), దృశ్యీకరణ (విజువలైజేషన్),  కార్యాచరణ (యాక్షన్) ల గురించి తెలుసుకుందాం...


2. యోగ్యత :

    దర్శకుడవ్వాలని గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ కి తగ్గ యోగ్యత ఎంత వరకుందన్న ఆత్మ పరిశీలన చాలా ముఖ్యం. ఈ యోగ్యత గురించి మొదట్నుంచీ మొదలుపెడితే, ముందుగా  పని చేయాలనుకుంటున్న రంగం పుట్టు పూర్వోత్తరాల గురించి ఎంత పరిజ్ఞా నముంది? అంటే,  సినిమా చరిత్ర గురించి ఏం తెలుసు? సినిమా ఎప్పుడు ఎక్కడ పుట్టింది? తెలుగులో మొట్ట మొదటి సినిమా ఎప్పుడు ఎవరు నిర్మించారు? ఏ కథల ఆధారంగా నిర్మించారు? ఆ కథలు కాలక్రమంలో ఎలా మారుతూ వచ్చాయి? తొలి స్వర్ణ యుగంగంలో, మలి స్వర్ణ యుగంలో సినిమాల తీరుతెన్నులేమిటి? తర్వాత వ్యాపార యుగంలో పోకడలేమిటి? అప్పటి పదిమంది ప్రముఖ దర్శకులెవరు? అప్పట్లో వాళ్ళు బాటలు వేసుకుంటూ వస్తేనే ఇప్పుడు అంతా ముందుకు సాగుతున్నారు. వాళ్ళకి కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నారా? ఐన్ స్టీన్ ప్రతి రోజూ పూర్వ శాస్త్రజ్ఞులకి కృతజ్ఞతలు చెప్పుకున్నాకే పని మొదలెట్టేవాడు. కృతజ్ఞతల పవరేమిటో అతడికి తెలుసు. 


తెల్లారి నిద్రలేవగానే తమని పోషిస్తున్న తెలుగు సినిమా పరిశ్రమకి కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటే తెలుస్తుంది అదెలా మ్యాజిక్ లా పని చేస్తుందో.  ఒక్కోసారి  మంచి జరిగినా, చెడు జరిగినా అన్నిటి పట్లా, అందరి పట్లా బేషరతుగా కృతజ్ఞతా భావంతో వుంటే, ఇంకే ఎల్ ఓ ఏ అక్కర్లేదు. కృతజ్ఞత హై ఫ్రీక్వెన్సీ ఫీలింగ్. ఎంత కృ తజ్ఞులై వుంటే అన్ని వరాలు కురిపిస్తుంది విశ్వం. ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో వుంటే నెగెటివ్ ఫీలింగ్స్ కి చోటుండదు. దాంతో పాజిటివ్ పరిణామాలు ఎదురవుతాయి- ఇక్కడ భౌతిక శాస్త్ర నియమం పని చేస్తుంది- ఒక సమయంలో ఒక స్థలంలో రెండు వస్తువులు వుండలేవన్నది ఆ నియమం. అలా మెదడులో నెగెటివ్ ఫీలింగ్స్ వున్నంత కాలం పాజిటీవిటీకి చోటుండదు- సింపుల్ సైన్స్. అందుకని తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేస్తూంటే దాని చరిత్ర తెలుకుని, ప్రతిరోజూ  కృతఙ్ఞతలు చెప్పుకుంటూ వుంటే  ఫలితాలు త్వరగా వస్తాయి. విశ్వం గమనించే యోగ్యతల్లో ఇదొకటి. 


తర్వాత, సినిమాలకి పని చేయడం సరే- కూలీ వాడు కూడా పనిచేస్తాడు. ఆ కూలి పని సరిపోతుందా? రానూ మండల్ అవ్వాలనుకుంటే సరిపోతుంది. కేథరిన్ బిగేలో అవ్వాలంటే మాత్రం సరిపోదు. దాంతో బాటు స్టడీస్ వుండాలి. ఫిలిం స్కూల్లోనే చదవనవసరం లేదు, దర్శకత్వం మీద పుస్తకాలు, సినిమా రచన మీద పుస్తకాలు, టెక్నాలజీ మీద పుస్తకాలూ చదవాల్సి వుంటుంది. వీటికి ఆర్ధిక స్థోమత లేకపోతే వెబ్ సైట్లు వున్నాయి- నిత్యం కొత్త సమాచారమిస్తూంటాయి. బాలీవుడ్ సీనియర్ రచయిత కమలేష్ పాండే తెల్లారి లేవగానే స్క్రీన్ ప్లే వెబ్సైట్స్ లో అప్డేట్స్ ఏమున్నాయా  చూస్తాడు. సీనియరైనా అప్డేట్ అవుతూ వుండకపోతే శూన్యమైపోవాల్సిందే. అంత సంపాదించినా బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బెర్గ్ ప్రభృత  బిలియనీర్లు ప్రతీ రోజూ కొంత సేపు పుస్తకాలు చదువుతారు. జుకర్ బెర్క్ వారానికొక పుస్తకం చదివేస్తాడు. అన్ని బిలియన్ల  డాలర్లు కూడ బెట్టిన వారెన్ బఫెట్ ఇంకా ఏడాదికి 50 పుస్తకాలూ చదవాల్సిన వ అవసరమేమిటి? నాలెడ్జి- నాలెడ్జి పెంచుకుంటున్న కొద్దీ పెరుగుతుంది. 


విశ్వమంతా మనకు తెలియని అపార నాలెడ్జితో  నిండి వుంది. ఏ నాలెడ్జి అయినా మనకు విశ్వం నుంచి అందుతుంది. మన మెదడులో మెరిసే ఐడియాలు, ఆలోచనలు విశ్వం నుంచే అందుతాయి. బిగ్ బ్యాంగ్ తో విశ్వం వయస్సు అంచనా వేస్తే సుమారుగా 13.8 బిలియన్ల సంవత్సరాలు. దానికున్న ఇన్ని బిలియన్ల సంవత్సరాల అనంతమైన నాలెడ్జితో అద్భుత ఇంజనీరింగు చేసి విశ్వాన్నంతా ఏర్పాటు చేసింది. ఇన్ని బిలియన్ల సంవత్సరాల దాని  నాలెడ్జి నుంచే మనకి నాలెడ్జి అందుతోంది. కాబట్టి ఎవరికందిన నాలెడ్జి ఏమిటో తెలుసుకోవడానికి బిలియనీర్లు పుస్తకాలు  చదువుతారు. 


అందుకని సినిమాలకి సంబంధించిన వివిధ పుస్తకాలూ చదవాలి. ఆ పుస్తకాలూ షెల్ఫ్ లో కనపడాలి. ఇక సినిమాలు చూడడం నోట్సు రాసుకోవడం మామూలే. యోగ్యతా కోసం ఇంకా ఎన్ని వీలయితే అన్ని అభ్యాసాలు చేయాలి. ఇక దర్శకుడుగా ప్రమోటవడం గురించి రెండు వాదాలున్నాయి- ఒకటి,  అసిస్టెంట్ గా చేసివుంటే సరిపోతుందని, రెండు- అసోసియేట్ గా కూడా అనుభవం పొందాలని. అసిస్టెంట్ గా చేస్తే షూటింగ్ వరకే పరిమితమవుతారు. పోస్ట్ ప్రొడక్షన్ అనుభవముండదు. అసిస్టెంట్ తర్వాత అసోసియేట్ గా కొనసాగితే పోస్ట్ ప్రొడక్షన్ లో 24 కాదు, ఇప్పుడు 34 క్రాఫ్ట్స్ తో అనుభవం సంపాదించ వచ్చు. ఇది దర్శకత్వానికి గట్టి పునాది వేస్తుంది. షార్ట్ కట్లు అలోచించి అసిస్టెంట్ నుంచి నేరుగా డైరెక్టర్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ నాలెడ్జి వుండదు. టెక్నీషియన్ల మీద ఆధారపడి వాళ్ళు చెప్పినట్టు వినాలి. చులకనైపోవాలి కూడా.  ఈ రెండో కేటగిరీని మనం ప్రమోట్ చేయడం లేదు. అసోసియేట్ గా దర్శకత్వ అవకాశాల కోసం కృషి చేస్తున్న వాళ్ళెందరో వున్నారు. వాళ్ళు ఉపోయోగించుకుంటే ఎల్ ఓ ఏ బాగా పనిచేస్తుంది. విశ్వం చూసే యోగ్యతల్లో ఇదొకటి.


(ఇంకా వుంది)

-సికిందర్  






Friday, October 3, 2025

1394 : స్క్రీన్ ప్లే సంగతులు


        సెకండాఫ్ మూడాఫ్ అయ్యే సినిమాలు ఈమధ్య వరుసగా వస్తున్నాయి. మదరాసి, ఘాటీ, కూలీ, వార్2, కింగ్డం, తమ్ముడు, కుబేరా, థగ్ లైఫ్, రెట్రో, జాక్, రాబిన్ హుడ్, దిల్రుబా….ఇవన్నీ ఈ సెప్టెంబర్- మార్చిమధ్య విడుదనవే. వీటి సరసన ఇప్పుడు ‘ఓజీ’ చేరింది. ఫస్టాఫ్ లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్ అని గొప్పగా  ప్రారంభించి - సెకండాఫ్ రాగానే లైట్సాఫ్, కెమెరా, ప్యాకప్ అనేసి దులిపేసుకుని వెళ్ళిపోతున్నారు. మధ్యలో ఇలైరుక్కున్న ప్రేక్షకులు నానా యాతన పడుతున్నారు.

        కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్టాఫ్ అంతా అవసరానికి మించిన  సమయం తీసుకుని, దాంతో సెకండాఫ్ కథ నడపడానికి ఏం చేయాలా మేథో మథనాలు జరిపి  బుల్ డాగ్స్ చింపిన విస్తరి చేస్తున్నారు. కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటి, అది ఎందుకు ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది, దాని ఫలితమేమిటి తెలుసుకోకుండా కథని అనాధని  చేసి వదుల్తున్నారు.

‘ఓజీ’ లోనైతే అసలు కథకి కాన్ఫ్లిక్టే వుండదన్నట్టు ప్రవర్తించాడు దర్శకుడు ‘సాహో’ ఫేమ్ సుజీత్. రెండు మూడు కాన్న్ఫ్లిక్టు లు జోడిస్తూ పోయి వాటితో తనే కాన్ఫ్లిక్ట్ కి లోనయ్యాడు. ఈ కాన్ఫ్లిక్టులతో కన్ఫ్యూజై సెకండాఫ్ అంతటా రకరకాల పాత్రల సబ్ ప్లాట్స్ తో నింపేసి, పవన్ కళ్యాణ్ కి  ప్రధాన కథంటూ లేకుండా చేసి కిల్ చేశాడు. ‘సాహోలో కూడా ఇంటర్వెల్లో ప్రభాస్ తో పుట్టిన కాన్ఫ్లిక్ట్ ని వదిలేసి, సెకండాఫ్ అంతా బోలెడు మంది విలన్స్ తో ట్విస్టుల మీద ట్విస్టు లిచ్చుకుంటూ, ప్రభాస్ తో వుండాల్సిన ప్రధాన కథని ఖూనీ చేశాడు. పైగా క్లయిమాక్స్ దగ్గర్లో ఇంకో కాన్ఫ్లిక్ట్ ఇచ్చి,  మిడిల్ మటాష్  స్క్రీన్ ప్లే అన్నట్టు  తయారు చేశాడు. ప్రేక్షకులు సినిమా అర్ధం కాలేదని గగ్గోలు పెడితే, ఇంకోసారి చూస్తే అర్ధమవుతుందని సమర్ధించుకున్నాడు !


పునాది తవ్వేసిన కథ!

    'ఓజీ’ లో రెండు మూదు  కాన్ఫ్లిక్ట్స్ తో బాటు ఇంకో ప్రయోగం చేశాడు. అది ఫస్ట్ యాక్ట్ (బిగినింగ్) లో ప్లాట్ పాయింట్ వన్ ని ఎత్తేసి, సెకండాఫ్ లో  ఫ్లాష్ బ్యాక్ రూపంలో దాన్ని రివీల్ చేయడం! ఇదెంత ఘోరమంటే దీన్ని చూస్తే బాక్సాఫీసు గిరగితా కళ్ళు తిరిగి ధడాల్న మూర్చపోతుంది! బిగినింగ్ లో ప్లాట్ పాయింట్ వన్ ని ఎత్తేస్తే ఆ  కథ ఏం కావాలి? ఇంటికి పునాది తవ్వేస్తే ఆ ఇల్ల్లేం కావాలి? మొత్తం స్క్రీన్ ప్లే అనే సౌధానికి ప్లాట్ పాయింట్ వన్ అనేది కథని నిలబెట్టే మూలస్థంభం లాంటిది. దీన్ని ఎత్తేస్తే  అసలు కథే వుండదు! ఎందుకంటే ఇక్కడ పుట్టాల్సిన ప్రాథమిక కాన్ఫ్లిక్ట్ మిస్సయి కథ నడిపించే ప్రధాన పాత్ర పుట్టదు. ప్రధాన పాత్ర పుట్టాలంటే ఇక్కడ ప్రాథమిక ఎమోషన్లు పుట్టాలి. ప్రాథమిక ఎమోషన్స్ ని పుట్టించే ప్లాట్ పాయింట్ వన్నే లేనప్పుడు కథ పుట్టే సమస్యే లేదు.  (All drama is conflict. Without conflict you have no action; without action, you have no character; without character, you have no story; and without story, you have no screenplay - Syd Field)



ఫస్టాఫ్ బిగినింగ్ లో చిన్నప్పుడు  జపాన్ లో సమురాయ్ వర్గాల ఘర్షణల్లో సత్యదాదా (ప్రకాష్ రాజ్) తనని కాపాడి బొంబాయికి తీసుకొచ్చాడని  ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) అలియాస్ ఓజీ అతడికి అంగ రక్షకుడుగా వుంటాడు. సత్య దాదా ఇక్కడ పోర్టు నెలకొల్పుతాడు. పెరిగి పెద్దయ్యాక ఓజీ సత్యదాదాని వదిలేసి వెళ్ళిపోతాడు. మదురై లో డాక్టర్ కన్మణి (ప్రియాంకా మోహన్) ని ప్రేమించి పెళ్ళి చేసుకుని  సెటిలవుతాడు. ఇక్కడ బొంబాయిలో సత్యదాదాకి ఓమి భావు ( ఇమ్రాన్ హాష్మి) తో శత్రుత్వమేర్పడుతుంది. దుబాయి నుంచి  మాఫియా ఓమికి పంపిన కంటెయినర్ లో ఆర్డీ ఎక్స్ ప్రేలుడు పదార్ధ ముంటుంది. దాంతో  బొంబాయిలో ప్రేలుళ్ళు జరపాలని ప్లానేస్తాడు ఓమి. దీన్ని అడ్డుకుని కంటెయినర్ ని దాచేస్తాడు సత్య్హదాదా. దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణలు మొదలవుతాయి. సత్యదాదా ప్రాణాలకి ప్రమాదమొస్తుంది. ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత సత్యదాదాని, బొంబాయిని  కాపాడుకునేందుకు తిరిగొస్తాడు ఓజీ. వచ్చాక ఓమి గ్యాంగ్ తో ఘర్షణలు మొదలవుతాయి. ఈ ఘర్షణల్లో ఓమి  గ్యాంగ్ ఓజీ భార్య డాక్టర్ కన్మణిని  చంపేయడంతో ఇంటర్వెల్.

సెకండాఫ్ కొస్తే, ఇన్స్ పెక్టర్ తావడే (అభిమన్యూ సింగ్) సత్య దాదా పోర్టుకి చెందిన మనుషుల్ని పోలీస్ స్టేషన్లో బంధిస్తే, ఓజీ వచ్చి పోరాడి విడిపించుకుంటాడు.తర్వాత ఓమి తమ్ముడ్ని చంపేస్తాడు. చంపేసి ‘వదిలేయ్, ఆర్డీ ఎక్స్ గీర్డీ ఎక్స్ అన్నీ వదిలేయ్- ఇది నా వార్నింగ్ కాదు, ఫైసలా’ అనేసి ఓమికి చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక పొలిటీషియన్ వచ్చి సత్యదాదాని ఆర్డీ ఎక్స్ ఎక్కడుందో చెప్పమంటాడు. ఇంతలో ఓజీ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ లో తను అతడికి బుద్ధి చెప్పిన విషయం గుర్తు చేసి వెళ్ళగొడతాడు. ఇంకా తర్వాత సత్యదాదా  మనవడు - పెద్ద కోడలు గీతా (శ్రియా రెడ్డి) కొడుకు అర్జున్ (అర్జున్ దాస్) ఒజీ  మీద ప్రతీకారం తీర్చుకునే క్రమం మొదలవుతుంది. ఇందులో భాగంగా అతడి కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. ఆ కూతుర్ని ఇన్స్ పెక్టర్ తావడే కిడ్నాప్ చే సుకు పోతాడు. ఇన్స్ పెక్టర్ తావడే దగ్గర్నుంచి ఓమి  గ్యాంగ్ కిడ్నాప్ చేసుకుపోతారు. ఇదంతా చూసి గీతా అర్జున్ ని తిడుతుంది. ఓజీ ని అపార్ధం జేసుకున్నావని మందలిస్తుంది.

ఇప్పుడు 15 ఏళ్ళ క్రితం ఏం  జరిగిందో  ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో గీతాకి భర్తతో గొడవ జరుగుతుంది. అతడ్ని బయటికి నెట్టేసి ఓజీకి కాల్ చేస్తుంది. ఆ భర్త వెంటిలేటర్ నుంచి చిన్న పిల్లాడుగా వున్న అర్జున్ కి సైగలు చేసి సొరుగులో రివాల్వర్ తెప్పించుకుంటాడు. స్టూలు ఎక్కి ఆ రివాల్వర్ అందిస్తూంటే, అది పేలి అతను (గీతా భర్త) చనిపోతాడు. అదే సమయంలో ఓజీ రావడంతో అతడే చంపాడని నింద వేస్తారు. ఓజీ చేసేది లేక సత్యదాదాని  విడిచి పెట్టి వెళ్ళి పోతాడు. మదురైలో డాక్టర్ కన్మణిని ప్రేమించి పెళ్ళి   చేసుకుని సెటిలైపోతాడు.

ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని పగబట్టిన అర్జున్ శాంతిస్తాడు, ఇక ఓజీ కూతుర్ని కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఓమి బొంబాయిని  పేల్చేసే కుట్ర మొదలెడతాడు. ఇంతలో జపాన్ నుంచి సమురాయ్ వస్తాడు. వచ్చి ఓజీ ఎవరో తెలుసా అని ఓమి గ్యాంగ్ కి బిల్డప్ ఇస్తాడు. దీంతో యాక్షన్ సీను, ఆతర్వాత కథ ముగిస్తూ క్లయిమాక్స్.

దీని స్క్రీన్ ప్లే సంగతులేమిటి?

పై కథ ప్రారంభం నుంచీ చూసుకుంటూ వస్తే,  సత్యదాదాకి అంగ రక్షకుడుగా వున్న ఓ జీ అతడ్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళి పోయాడు చెప్పలేదు. వెళ్ళిపోయి తెర వెనుక ప్రత్యర్థుల మీద పథకం రచిస్తున్నాడా తెలీదు. వెళ్ళిపోవడానికి ముందు పరిస్థితులు కూడా మామూలుగా వున్నాయి. మరెందుకు వెళ్ళిపోయాడు. సత్య దాదాకి మాత్రం  ఓమి గ్యాంగ్ తో ఘర్షణలు, మరణాలు  పెరుగుతాయి. ఇప్పుడు చూస్తే  ఓజీ మదురైలో డాక్టర్ కన్మణి తో ప్రేమలో వుంటాడు. పెళ్ళి చేసుకుంటాడు. కూతురు పుడుతుంది. తర్వాత సత్యదాదాకి ప్రమాద తీవ్రత పెరిగి, బొంబాయికి ప్రమాదం తలెత్తాక  ఇప్పుడు తిరిగి వస్తాడు.

ఇప్పుడు సెకండాఫ్ లో చూద్దాం- ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో గీతా భర్తతో గొడవ పడడం, కొడుకు అతడికి రివాల్వర్ అందించబోతూంటే అది పేలి ఆ భర్త మరణించడం, అప్పుడే వచ్చిన ఓజీ  మీద ఆ నేరం మోపడంతో అతను వెళ్ళిపోవడం వగైరా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో తెలుసుకుంటాం. అంటే ఫస్టాఫ్ లో అతనెందుకు  వెళ్ళిపోయాడో కారణం ఇప్పుడు తెలుస్తోందన్న మాట. ఇప్పుడు తెలియడం వల్ల కథకి జరిగిన మంచి ఏమిటి? ఇది థ్రిల్ చేస్తోందా? లేదు. సస్పెన్సు వీడి రిలీఫ్ నిస్తోందా? లేదు. సెకండాఫ్ కి బలాన్ని చేకూర్చిందా? లేదు. ఓజీ పట్ల సానుభూతిని కల్గించిందా? లేదు. కేవలం అర్జున్ అపార్ధాన్ని తీర్చడానికే పనికొచ్చింది. అర్జున్ అపార్దానికీ, ఓజీ మీద పగకీ అర్ధముందా? ఓజీ భార్య హత్య జరిగినప్పుడే అర్జున్ అపార్ధం, పగ చల్లారి పోవాలి. ఓజీకి ఇంత  కంటే శిక్ష ఏముంటుంది? అసలు సెకండాఫ్ కి ఓజి ప్రధాన ఎజెండా భార్య హత్యకి పగ దీర్చుకోవడమైతే, ఈ ప్రధాన కథని వదిలేసి అర్జున్ తో సబ్ ప్లాట్ తీసుకురా వడమేమిటి?

అంటే  ఈ ఫ్లాష్ బ్యాక్ సీను ప్రధాన కథ ననుసరించి సీను ఫస్టాఫ్ లో ప్రెజెంట్ స్టోరీగా వుండాల్సిందన్నమాట. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాకుగా కాదు. ఈ సీను ఫస్టాఫ్ లో వుంటే అది ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది. ఈ సీనులో ఘర్షణ వుంది, గీతా భర్త మరణం వుంది, ఆ హత్యా నేరం ఓజీ మీదేసుకుని వెళ్ళిపోయే ఎమోషనల్ కంటెంట్ వుంది. ఈ ఎమోషనల్ కంటెంట్ కి ఆడియెన్స్ కి పీలింగ్స్ పుట్టే అవకాశముంది. దాంతో ఓజీ  పట్ల సానుభూతి ఏర్పడుతుంది. కథ అర్ధమై, ఇప్పుడేం  జరుగుతుందా అన్న ఉత్కంఠ, సస్పెన్సూ ఏర్పడతాయి. ఇది బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ సీను కావడంతో, స్క్రీన్ ప్లే కూడా  స్ట్రక్చర్ లో వుంటుంది. ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ లో సమస్య పుట్టి  పాత్ర ఇరుకున పడింది కాబట్టి పాత్ర గోల్ ఏమిటా అన్న ప్రశ్న వస్తుంది. గీతా భర్తని అంటే సత్యదాదా కొడుకుని తను చంపలేదని నిరూపించుకుంటాడా?

అలా చేయలేదు. మదురై వెళ్ళిపోయి డాక్టర్ తో ప్రేమా, పెళ్ళీ, జీవితం పెట్టుకున్నాడు. ఇది ప్రశ్నార్ధకం చేస్తుంది. పాత్ర అర్ధం కాదు. పాత్రకి మరింత సస్పెన్స్ ఏర్పడుతుంది. ఇది ఆడియెన్స్ ని పట్టి ముందుకు తీసికెళ్తుంది. కథనం ఆసక్తికరంగా మారుతుంది. అప్పుడు ఊహిస్తున్న గోల్ కి విరుద్ధంగా పెద్ద మనసు చేసుకుని, సత్యదాదా ప్రమాదంలో వుంటే తిరిగి వచ్చేశాడు- తన మీద నేరం మోపినా పెద్ద మనసు చేసుకుని రావడం పాత్ర పట్ల గౌరవాన్ని పెంచుతుంది. అలా తిరిగి వచ్చినప్పుడు ఆ యాక్షన్ సీనుకి - ఎలివేషన్ కి విపరీతమైన అప్లాజ్ వస్తుంది!

ఎందుకంటే అతడికేం జరిగిందో తెలుసు కాబట్టి ఆ సానుభూతితో వున్నారు ప్రేక్షకులు. అతడికేం జరిగిందో చూపించకుండా ఆ ముక్క కత్తిరించి సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాకుగా వేసుకుంటే అర్ధవంతమైన పై ఎలివేషన్ వస్తుందా? దాన్ని బలపర్చే కథా నేపథ్యం లేక - ఎమోషన్ లేని తాటాకు చప్పుళ్ళు చేస్తుందా?

అతను  తిరిగి వచ్చి ప్రత్యర్దులనుంచి సత్య దాదాని కాపాడేసి, ఆ తర్వాత బొంబా యిని కాపాడే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రారంభించవచ్చు పై కథ ప్రకారం. అంటే దీని అర్ధం ప్లాట్ పాయింట్ లో అతడికి పుట్టింది ప్రాథమిక ఎమోషన్ అయితే సత్య దాదాని కాపాడడం, బొంబాయిని  కాపాడడం వంటివి దాని అనుబంధ ఎమోషన్స్ అవుతాయి. అంటే పాత్ర ఎమోషనల్ ఆర్క్ పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలో- ఈ ఘర్షణలో ఓమి గ్యాంగ్ ఓజీ భార్యని చంపడం తో ఎమోషనల్ ఆర్క్ మరింత పెరిగి- ఇంటర్వెల్ కి భావోద్వేగాలు మరింత ప్రజ్వరిల్లుతాయి. ఇలా జరగలేదు. ఇందుకే ఎమోషనల్ కంటెంట్ ఈ కథలో లేదు.

సరే, అయితే ఒకటుంది- అప్పటి బొంబాయి- ముంబాయి మాఫియాలు ఒక నీతిని పాటించేవాళ్ళు. మనం మనం కొట్టుకు చద్దాం, కుటుంబాల జోలికి పోవద్దని. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో హిందీ సినిమాలు కూడా ఇలాగే వచ్చేవి- రాం గోపాల్ వర్మ తీసిన 'సత్య', 'కంపెనీ' సహా. పరస్పరం మాఫియాలు కుటుంబాల్ని ఇబ్బంది పెట్టుకునే చిత్రణలు లేకుండా. 'ఓజీ' కథలో ఈ నీతిని పాటించలేదు. ఓజీ కూతుర్ని కూడా వదిలిపెట్టలేదు. కథ కోసం రీసెర్చి చేసి వుండరు.

ఇప్పుడు ఫస్టాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ పెరిగి పెరిగి ఇంటర్వెల్లో భార్య హత్యతో పతాక స్థాయికి చేరుకున్నాక సెకండాఫ్ ఎలా ప్రారంభమవాలి? భార్య హత్యకి కసి తీర్చుకోవాలన్న ఏకైక ఎజెండాతో  ప్రారంభమవ్వాలి. ముంబాయిని కాపాడే లక్ష్యం అప్రధానమై, భార్య హత్యే ప్రధానమై పోవాలి. కానీ ఇలా జరగలేదు. వేరే క్యారక్టర్స్ తో ఇంకేవో సీన్లతో సెకండాఫ్ ప్రారంభమవుతుంది. తర్వాత తీరిగ్గా ఓజీ కనిపిస్తాడు. అతడి ముఖంలో భార్య పోయిందన్న విచారంగానీ,భావోద్వేగాలు గానీ వుండవు. అంటే ఫస్టాఫ్ కథతో సెకండాఫ్ తెగిపోయి సెకండాఫ్ సిండ్రోం లో పడిందన్న మాట స్క్రీన్ ప్లే!

ఎప్పుడైతే భార్య హత్యకి అతను ఫీల్ కావడం లేదో, ఇక ఎన్ని యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు చూపించినా బాక్సాఫీసు కూడా ఫీల్ కాదు. ఇంకెన్ని సబ్ ప్లాట్స్ తో నింపినా బాక్సాఫీసు వేసే ప్రశ్న ఒకటే- నీ ప్రధాన కథ ఏది మిస్టర్ ఓజీ?

-సికిందర్