రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 30, 2025

1384 : స్క్రీన్ ప్లే సంగతులు

 

ముందుగా ఒక విజ్ఞప్తి : ‘హరిహర వీరమల్లు’ రివ్యూగానీ, స్క్రీన్ ప్లే సంగతులు గానీ ఎందుకివ్వడం లేదంటే- విడుదల ఆలస్యమైన సినిమాలకి ఇచ్చి లాభంలేదని తేలింది. కొన్నేళ్ళ పాటు నిర్మాణం జరుపుకుని విడుదలైన ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ ల పరిస్థితి తెలిసిందే. నాలుగైదేళ్ళు నిర్మాణ కార్యక్రమాల్లో చిక్కుకుని తీరా విడుదలైతే అవి ఏ రూపు రేఖలతో వున్నాయో తెలిసిందే. వీటి గురించి ఏం రాయగలం, ఎలా రాయగలం. అందుకని ఇవే కారణాలతో ‘హరిహర వీరమల్లు’ ని కూడా పక్కన పెట్టాం. ‘జస్టిస్ డిలేయ్డ్ ఈజ్  జస్టిస్ డినేయ్డ్ అంటారు కోర్టు విచారణలకి సంబంధించి. అంటే న్యాయం చేద్దామని కూర్చుని అది ఆలస్యం చేస్తే  అన్యాయం చేయడం కిందికే వస్తుందని అర్ధం. సినిమాల గురించి నేరుగా కాకపోయినా, ఈ మాట ఆలస్యం వల్ల కలిగే ప్రతికూల పరిణామాల్ని హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా చట్టపరమైన సందర్భాల్లో. సినిమా విడుదలల విషయంలో కూడా జాప్యం ప్రభావం ప్రేక్షకుల మీద తీవ్రంగా పనిచేస్తుంది. సినిమా నిర్మాణంలో, విడుదలలో ఆలస్యం చేయడమంటే సస్పెన్స్ క్రియేట్ చేసి ప్రేక్షకుల్ని ఉత్కంఠతో చంపడం కాదు- సస్పెన్స్ క్రియేట్ చేసి  ఉత్కంఠతో చంపడమనేది సినిమాల్లో చూపించే కథలతోనే సాధ్యమవుతుంది తప్ప సినిమాని ఎప్పుడో ఐదేళ్ళ తర్వాత రిలీజ్ చేస్తే కాదు.

‘ది 100’ స్క్రీన్ ప్లే సంగతులు విషయానికొస్తే- హీరో ఆర్కే సాగర్, దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ కలిసి ప్రయత్నించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తో, ప్రస్తుతం నడుస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ల ట్రెండ్ లో సంఖ్యని పెంచ గలిగారు, క్వాలిటీని కాదు. ఈ సంఖ్యని పెంచే  ఊపులో టైటిల్ గా పెట్టిన 100 అనే సంఖ్యకి చెప్పిన భాష్యం నమ్మశక్యంగా లేకపోవడం మొత్తం చెప్పుకొచ్చిన కథనే ప్రశ్నార్ధకం చేసింది. ఈ సంఖ్యని కథని నిలబెట్టడానికి తగిన విధంగా అన్వయించి వుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇంకో రేంజిలో వుండేది.

సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా ఒక టెంప్లెట్ లోనే  వస్తున్నాయి. నగరంలో వరుస హత్యలు, వాటిని పరిశోధిస్తూ పోలీసు అధికారి, హంతకుడెవరన్నది సస్పెన్స్. ఒక మూసలో ఇవే కథలు తిప్పి తిప్పి తీస్తున్నారు. ఈ తీయడంలో మెళకువ లోపించి విఫలమవుతున్నారు. నేర పరిశోధన, సస్పెన్స్, థ్రిల్స్ ఈ మూడూ ఒక ప్యాకేజీ అయితే, ఈ మూడిటికీ పోటీ పెట్టాల్సిన చోట  ప్యాకేజీ విప్పి, మూడుకి మూడూ మిస్ చేసి, లేదా ఒకటుంచి ఇంకోటి మిస్ చేసి -దాన్నే సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోమంటున్నారు.

         ఈ కథలో విక్రం (ఆర్కే సాగర్) కొత్తగా శిక్షణ పొంది జాయిన్ అయిన ఏసీపీ.  నగరంలో డెకాయిటీ హత్యలు జరుగుతూంటాయి. ఒరిస్సాకి చెందిన ముఠా అమావాస్య నాడు వీటికి పాల్పడుతూ వుంటుంది. ఇళ్ళ మీద దాడి చేసి బంగారం మాత్రమే దోచుకుంటారు. ఆ బంగారాన్ని ఒరిస్సాలో తమ అమ్మవారికి సమర్పించుకుని, అంతరించిపోతున్న తమ తెగని కాపాడుకోవాలని వాళ్ళ ఉద్దేశం.

        వీళ్ళని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న విక్రంకి దొరక్కుండా ఇంకో దోపిడీ చేస్తారు. వీళ్ళు బంగారాన్ని ఎక్కడ అమ్ముతున్నారో కనిపెట్టడానికి విక్రం పోలీస్ ఇన్ఫార్మర్ లని దింపుతాడు. దాంతో ఆ దోపిడీ బంగారం ఒక వ్యాపారస్తుడి ఇంట్లో దొరుకుతుంది. ఆ బంగారంలో ఒక నెక్లెస్ ని గుర్తు పడతాడు విక్రం. ఈ నెక్లెస్ ఒక కార్యక్రమంలో భరత నాట్యం చేస్తున్నప్పుడు తెగి కింద పడితే, తనే తీసి అందించాడు ఆ నాట్య కారిణి ఆరతీ (మీషా నారంగ్) కి విక్రం.

        ఇప్పుడు ఆ నెక్లెస్ తో విక్రం ఆమె ఇంటికెళ్తే  ఆమె తండ్రి ఈ నెక్లెస్ తమది కాదంటాడు. వొత్తిడి చేస్తే చెప్పేస్తాడు. దోపిడీ ముఠా తమ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఈ నెక్లెస్ తో బాటు ఇంట్లో బంగారం దోచుకోవడమే గాక, ఆరతిని  రేప్ చేశారంటాడు. తను ప్రేమిస్తున్న ఆరతి రేప్ కి గురైనట్టు తెలుసుకుని షాకవుతాడు విక్రం. ఇక మళ్ళీ అమావాస్యకి వలపన్ని ఆ ముఠాని పట్టుకుంటే, రేప్ చేసింది వాళ్ళు కాదని తేలుతుంది. మరెవరు? వాళ్ళు ముసుగులు ధరించి వుండడంతో రేప్ చేసిందెవరో ఆరతికి తెలీదు. ఇలా క్లిష్టంగా మారిన కేసుని విక్రం ఎలా పరిష్కరించాడు? చివరికి రేపిస్టుగా దొరికిందెవరు? వాడ్ని ఏం చేశాడు విక్రం? ఇదీ మిగతా కథ.

స్క్రీన్ ప్లే సంగతులు

కథ మధుప్రియ (విష్ణు ప్రియ)  అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో మొదలవుతుంది. ఈ ఆత్మహత్యకి కారణం సెకండాఫ్ లో తెలుస్తుంది. ఆరతి రేప్ కి గురవడంతో ఆమె తల్లి  లక్ష్మి (లతా గోపాలస్వామి) ఆత్మహత్య చేసుకుంటుంది. విక్రం కి కేసులో సహాయపడే సైకియాట్రిస్టు అయిన మదర్  డాక్టర్ లత (కళ్యాణీ నటరాజన్), ఫ్రెండ్ విద్య (ధన్యా బాలకృష్ణన్) వుంటారు. మరో వైపు కార్పోరేట్ కంపెనీ సిఈఓ వల్లభ్ (తారక్ పొన్నప్పన్) వుంటాడు.

        స్థూలంగా ఈ కథ ఆరతిని రేప్ చేసిన గుర్తు తెలియని రేపిస్టుని పట్టుకోవడం గురించే. అంటే రొటీన్ గా హంతకుడెవరన్నది సస్పెన్స్ లో వుంచి నడుపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ టెంప్లెట్ కథ లాంటిదే అన్నమాట. ఆ గుర్తు తెలియని రేపిస్టుని ఎవరు పట్టుకోవాలి? ఏసీపీ విక్రమే. అంటే ఇది విక్రం నడిపే తన కథే నన్న మాట. ఇలా చెప్పడం ఎందుకంటే, ఓపెనింగ్ లో ఐపీఎస్ గా విక్రం ట్రైనింగ్ పొందే సీన్స్ తోనే కథ ప్రారంభమై, అతడి మీదే 100 టైటిల్ తో ముగుస్తుంది. అంటే మొదట్లో  డెకాయిటీల్ని, తర్వాత రేపిస్టునీ పట్టుకుని అభినందనలు పొందే విక్రం కెరీర్ గ్రాఫ్ గురించన్న మాట ఈ కథ.

అంతేగానీ రేప్ బాధితురాలు ఆరతీ గురించి కాదన్నమాట. ఇందుకే ఆరతి విషయం పక్కకెళ్ళి పోయి, విక్రం కోసం విక్రం ఎలివేషన్స్ తో, మాస్ హీరోయిజంతో కథ నడపడం వల్ల అసలు ఎమోషన్లే పలకని ఫ్లాట్ గా కథనంగా మారింది కథ. తను ప్రేమించిన రరేప్ బాధితురాలు ఆరతి కోసమైనా ఒక ఎమోషనల్ డ్రైవ్ తో కథ నడుపుకోడు విక్రం. తన కెరీర్  గ్రాఫ్ కోసం దర్యాప్తులో తెలివి తేటలు ప్రదర్శించుకోవడం  అన్నట్టుగానే  వుంటుంది కథ

     ఇలా చిట్ట చివరికి రేపిస్టుని పట్టుకున్నాక, తన సర్వీస్ రివాల్వర్ ఆరతి కిచ్చి  కాల్చి చంపమంటాడు. ఆమె వాడ్ని కాల్చి చంపుతుంది. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపడంతో చంపింది తనే అవుతాడు. ఆమె కోసం ఈ రిస్కు తీసుకున్నాన్నమాట. వెంటనే తర్వాతి సీన్లో- ఇలా రేపిస్టు ని విక్రం చంపినా, ఐపీసీ సెక్షన్ 100 ప్రకారం ఆత్మ రక్షణ కోసం చంపడం నేరం కాదు కాబట్టి, క్లీన్ చిట్ ఇచ్చేస్తాడు పై అధికారి. దీంతో కథ ముగిసిపోతుంది. ఇదన్నమాట ది 100 కి అర్ధం.

ఇంత సింపుల్ గా జరిగిపోతుందా? పోకీసు అధికారి ఆత్మ రక్షణ పేరుతో ఒకర్ని చెంపి బయట పడిపోగలడా? సెక్షన్ 100 పోలీసుల గురించేనా? కాదు, సెక్షన్ 100 ప్రైవేట్ వ్యక్తుల గురించి. పోలీసుల గురించి సెక్షన్ 99 లో వుంది. ఐపీసీ సెక్షన్ 99 ప్రకారం ఆత్మ రక్షణ పేరుతో చంపే అధికారం పోలీసులకి లేదు! సినిమా కోసం సినిమా కథ ఇలాగే తీయవచ్చంటే ఇక చెప్పేదేమీ వుండదు!

ఇక పైన చెప్పుకున్నట్టు కథనం లో సస్పెన్, థ్రిల్ ఏమాత్రం అనుభవం కావు. విక్రం ఇన్వెస్టిగేషన్ ఏమాత్రం కథని పరుగులు తీయించదు. కారణం, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ని యాక్షన్ తో కాక డైలాగులతో నడపడం! పైగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మర్యాదలు పాటించకుండా, మూస కమర్షియల్ ఫార్ములా రూపం లో దృశ్యాల్ని చూపించడం. దీని కంతటికీ ప్రధాన కారణం ఈ కథని విక్రం కథగా నడపడమే.

అదే ఆరతి కథగా నడిపి వుంటే- చిట్ట చివర్లో చెప్పే  టైటిల్ 100 అర్ధం,  కథ మధ్యకి  వచ్చి బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింటుగా, యాక్షన్ ని ప్రేరేపిస్తూ వుండేది. ఆరతి తనని  రేప్  చేస్తున్నప్పుడే రేపిస్టుగని కాల్చి చంపి, ఈ విషయం ప్రేక్షకుల నుంచి కూడా దాచిపెట్టి- ఇంటి మీదికి దోపిడీ కొచ్చిన ముఠాలో ఒకడ్ని తనే కాల్చి చంపినట్టు అబద్ధం చెప్పి, సెక్షన్ 100 ఆసరా తీసుకుని వుంటే, ఈ పాయింటు మీద కథ ఆసక్తికరంగా సాగేది. సెక్షన్ 100 ప్రకారం తను నిర్దోషినని వాదించడమే ఆమెతో కథ. ఆమెని విడిపించడానికి తగిన సాక్ష్యధారాల కోసం విక్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే, ఆరతి ఇరుకునపడి -తనని రేప్ చేసినందుకే రేపిస్టుని చంపానని  బ్యాంగ్ ఇస్తే - ముగింపు బ్లాస్ట్ అయి- బద్దలైన ఆమె రోదనలతో - షాక్ వేల్యూతో ఈ కథ వేరే ర్న్జిలో వుండేది.

సికిందర్


Thursday, July 17, 2025

1383 : సందేహాలు- సమాధానాలు

 Q:   నితిన్ నటించిన తమ్ముడు కథను ఎలా అర్ధం జేసుకోవాలి. అది తమ్ముడి కథా, లేక అక్క కథా? తమ్ముడు దూరమైన అక్కను కలుసుకోవాలనే ఉద్దేశంతో వుంటే, అక్కేమో  ప్రభుత్వానికి గ్యాస్ లీక్ సంఘటనపై రిపోర్టు అందించే లక్ష్యంతో వుంటుంది. వీళ్ళలో ఎవరి ఆశయం గొప్పది? ఏ ఆశయం చెప్పడానికి ఈ సినిమా తీశారు? దయచేసి వివరించగలరు.
సి. రవీంద్ర బాబు
A :  2000లో జూలియా రాబర్ట్స్ ఆస్కార్ ఉత్తమ నటి అవార్డు పొందిన ‘ఎరిన్ బ్రోకోవిచ్’ భూజలాలు కలుషితమై ప్రజలు తీవ్ర వ్యాధుల బారిన పడే కథ. ఈ భారీ పర్యావరణ కాలుష్యానికి కారణమైన  కార్పోరేట్ కంపెనీ నుంచి ప్రజలకి నష్టపరిహారం ఇప్పించి తీరాలన్న ఆశయంతో జూలియా  రాబర్ట్స్ పోరాడుతుంది. ఈ కథ  1. సామాజిక అన్యాయం, 2. కార్పొరేట్ దుష్ప్రవర్తన, 3.శక్తివంతమైన సంస్థల్ని సవాలు చేసే సాధారణ స్త్రీ శక్తి మొదలైన థీమ్స్ ని  హైలైట్ చేస్తూ సాగుతుంది. పాత్రపరంగా ఒంటరి న్యాయవాది ఆమె. కుటుంబ పరంగా సింగిల్ మదర్. జలకాలుష్యం బాధితుల బాధల్ని తీర్చే ఆమె దృఢ సంకల్పం, అంకిత భావం ప్రేక్షకుల నుంచి బలమైన సానుభూతిని, భావోద్వేగాల్ని రాబట్టుకుంటుంది.

ఐతే ఇక్కడ ‘తమ్ముడు’ లో లాంటి తిరకాసు వుంది. జులియా పాత్రకి రెండు ముఖా లుంటాయి. వృత్తిగత ముఖం, వ్యక్తిగత ముఖం. వృత్తిగత ముఖంతో సామాజిక పోరాటం, వ్యక్తిగత ముఖంతో రిలేషన్ షిప్ సమస్య. ఈ ద్వంద్వ పాత్ర చాపాలు (డ్యుయల్ క్యారక్టర్  ఆర్క్స్) కథనాన్ని కన్ఫ్యూజ్ చేయవు. ఎందుకంటే మొదటిది ప్రధాన కథగా, రెండోది ఉప కథగా సర్దుకున్నాయి కాబట్టి. అంటే వ్యక్తిగత లక్ష్యమైన రిలేషన్ షిప్ కి రెండో స్థానమిచ్చి సబ్ ప్లాట్ కి పరిమితం చేశారు. వృత్తిగత లక్ష్యమైన సామాజిక పోరాటానికి మొదటి స్థానమిచ్చి (మెయిన్ ప్లాట్) ప్రధాన కథగా నడిపారు. కనుక ఈ సినిమా కథ దేని గురించి అన్న దాని పట్ల కన్ఫ్యూజన్ లేదు.

తమ్ముడు’ లో గ్యాస్ లీక్ బాధితులకి న్యాయం చేసే విధంగా కంపెనీని ఎదిరించి రిపోర్టు అందించే వృత్తిగత ఆశయంతో ప్రభుత్వాధికారిగా అక్క పాత్రలో లయ వుంటే, తన చిన్నప్పుడు చేసిన తప్పు వల్ల దూరమైన అక్కని కలుసుకోవాలన్న వ్యక్తిగత ఆశయంతో  తమ్ముడి పాత్రలో నితిన్ వున్నాడు. అంటే పైన చెప్పుకున్న డ్యుయల్ క్యారక్టర్ ఆర్క్స్ ఇక్కడ ఇద్దరికీ విడివిడిగా వున్నాయి. అక్కకి సమాజం కోసం వృత్తిగత ఆశయం, తమ్ముడికి తన కోసం వ్యక్తిగత ఆశయం. సమాజం కోసం ఆశయం గొప్పదా, తన కోసం ఆశయం గొప్పదా? ఏది ప్రధాన కథ, ఏది ఉపకథ?

ఎరిన్ బ్రోకోవిచ్’ లో వున్నట్టు ఈ కథ  1. సామాజిక అన్యాయం, 2. కార్పొరేట్ దుష్ప్రవర్తన, 3.శక్తివంతమైన సంస్థల్ని సవాలు చేసే సాధారణ స్త్రీ శక్తి మొదలైన థీమ్స్ ని  హైలైట్ చేస్తూ సాగిందా? గ్యాస్ లీక్ బాధితుల బాధల్ని తీరుస్తూ ప్రేక్షకుల నుంచి బలమైన సానుభూతిని, భావోద్వేగాల్ని రాబట్టుకునే దృఢ సంకల్పం, అంకితభావం అక్క పాత్రకున్నాయా?

సబ్ ప్లాట్ గా ఉండాల్సిన తమ్ముడి ఆశయం మెయిన్ ప్లాట్ గా మారి, మెయిన్ ప్లాట్ గా వుండాల్సిన అక్క ఆశయం అసలు అడ్రసే లేకుండా పోయాక ఇది ఏ కథ అనేది ఎలా చెప్పాలి?
Q: ఒక కథను "సంక్లిష్టమైనది" అని ఎప్పుడు భావించ వచ్చు? సంక్లిష్టత అంటే ఏమిటి? సంక్లిష్టమైన కథలను ఎలా రాయాలో మనం ఎలా నేర్చుకోవచ్చు? అలాగే సంక్లిష్టమైన కథకు, సంకీర్ణ కథకు మధ్య తేడా ఏమిటి? ఈ రెండిటిలో దేన్ని తీసుకోవాలి?
పిఎస్. రామకృష్ణ
A:  ఏ రచయితయినా ముందు చేయాల్సిన పని సింప్లిసిటీని గౌరవించడం. సంక్లిష్ట కథని కూడా సింప్లిసిటీతో చెప్తే అర్ధమయ్యేట్టు వుంటుంది. లేకపోతే గందరగోళమవుతుంది.  సంక్లిష్ట కథ అంటే - అన్ని నదులూ సముద్రానికి దారితీయడం లాంటిది. సంకీర్ణ కథ అనేక విభిన్నసముద్రాలకి దారితీసే అనేక నదుల్లాంటిది. దీన్ని చిన్న చిన్న కథలతో కూడిన  ఆంథాలజీల్లో చూడొచ్చు. ఇందులో అనేక పాత్రల కథలు వేర్వేరు ముగింపులకి చేరుకుంటాయి. సంక్లిష్ట కథల్లో అనేక పాత్రలు ఒకే ముగింపుకి చేరుకుంటాయి. ఇదీ తేడా. సంక్లిష్ట కథ ఒకే పెద్ద కథగా వుంతే, సంకీర్ణ కథ చిన్నచిన్న కథల సముదాయంగా వుంటుంది.

సంక్లిష్ట కథ అంటే ఏమిటో ఇంకాస్త విడమర్చి చెప్పుకుంటే అనేక పాత్రలు, వాటి ఫ్లాష్ బ్యాకులు, సమస్యలు, సంఘర్షణలు, లక్ష్యాలూ మొదలైన వాటితో కూడిన వివరణాత్మక కథనం. అయినప్పటికీ ఈ పాత్రలన్నీ ఒకే కాన్సెప్ట్ కి లోబడి, ఒక ప్రధాన పాత్ర చుట్టూ అల్లుకుని, ఒకే ప్లాట్ లైన్ లో వుంటాయి. అంటే స్ట్రక్చరల్ బీట్స్ అన్నీ వేర్వేరు విషయాలతో కూడిన ప్లాట్ పాయింట్స్ తో వుండవు. కథ మొదటి ప్లాట్ పాయింట్ లో ప్రత్యర్ధితో సంఘర్షణ, మిడ్ పాయింట్  లో రోమాంటిక్ సబ్ ప్లాట్ కి ట్విస్టు, అలాగే ప్లాట్ పాయింట్ టూ లో  ఏదో సహాయ పాత్ర సమస్యకి మలుపూ రాసుకుంటూ పొతే సంక్లిష్ట కథ కాస్తా గందరగోళ కథ అవుతుంది.

Q :  హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు మన బ్లాగ్‌లో రాసిన ఫ్రీక్వెన్సీ ఆర్టికల్‌లో హై ఫ్రీక్వెన్సీ సీన్స్ స్క్రిప్టులో ఉండాలని చెప్పారు కదా...సాగర సంగమం, మాతృ దేవో భవ, అర్జున్ రెడ్డి సినిమాల్లో క్యారెక్టర్స్ పరాజితులు కదా... నిస్సహాయత స్థితిలో, దిగులుగా, జెలసీతో ఉన్న క్యారెక్టర్స్ కదా... మరి వీటి ఫ్రీక్వెన్సీతో కూడా మంచి సినిమాలు వచ్చాయి కదా? నేను ఒక పాసివ్ హీరో కథ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దానిని  యాక్టివ్ గా మార్చే పనిలో ఉన్నాను. అదే టైమ్ లో ఈ ఫ్రీక్వెన్సీ ఆర్టికల్ కనిపించింది.
−జయసింహా
A :  హాయ్ అండి, నమస్తే. బాగానే వున్నాను. అది ప్రయోగాత్మకంగా రాసిన వ్యాసం. స్పిరిచ్యువాలిటీ ప్రకారం చూసినా ఎల్లప్పుడూ ఆనందంగా గడిపితే మన వైబ్రేషన్స్  హై ఫ్రీక్వెన్సీలో వుంటాయి. హై ఫ్రీక్వెన్సీ తో వున్న వైబ్రేషన్స్, విశ్వ వ్యాప్తంగా పరచుకుని వున్న ఎనర్జీ (మిరకిల్ యూనివర్సల్ సబ్ స్టెన్స్) తో కనెక్ట్ అవుతాయి. అప్పుడు మన ఫ్రీక్వెన్సీతో వున్న వ్యక్తులు కనెక్ట్ అయి మనం కోరుకున్నవి జరుగుతాయి. అదే విచారంతో వుంటే ఫ్రీక్వెన్సీ పడిపోయి విశ్వంతో కనెక్ట్ కాం కాబట్టి మరింత విచారమే మనకి దక్కుతుంది

వేదాంతం, క్వాంటం ఫిజిక్స్ ఇదే చెబుతున్నాయి (వేదాంతంలో అద్వైత సిద్ధాంతం, క్వాంటం ఫిజిక్స్ లో మోనిస్టిక్ థియరీ). అంటే సినిమాలు హై ఫ్రీక్వెన్సీ కథాకథనాలతో వుంటే ఎక్కువ మంది ప్రేక్షకులకి కనెక్ట్ అయి హిట్టవుతాయని మనమొక సిద్ధాంతం సేఫ్ గా చేనుకోవచ్చన్న మాట. మీరు చెప్పిన సినిమాల్లో లో -ఫ్రీక్వెన్సీ ట్రాజడీ ఎంత వున్నా, ఎంతో కొంత హై -ఫ్రీక్వెన్సీ ఎంటర్ టైన్మెంట్ కూడా వుంటుంది. ఒక వేళ ట్రాజడీల్లో ఎంత వినోదం లేకపోయినా శాంతం హై- ఫ్రీక్వెన్సీయే, శోకం కాదు. కనుక వినోద ప్రధానమైన సినిమాల్లో హై -ఫ్రీక్వెన్సీ సీన్ల మీద ప్ర ధానంగా దృష్టి పెట్టాలని భావించాల్సి వస్తోంది.

పాసివ్ క్యారక్టర్ ని తప్పకుండా యాక్టివ్ క్యారక్టర్ గా మార్చుకోవాలల్సిందే. ఈ రోజే సోమర్సెట్ మామ్ మీద ఒక ఆర్టికల్ కన్పించింది. ఆయన రాసే ప్రాజ్ లో పాసివ్ వాయిస్ వుండదని అందులో వుంది. ఉదాహరణకి, మన రాయకూడని ‘బడు’ భాషలో చెప్పుకుంటే, ‘ఆ పులి చంపబడెను’ అని మామ్ రాయడు. ‘అతను పులిని చంపాడు’ అని రాస్తాడు. ప్రింట్ మీడియా అయిన కథల్లో నవలల్లో ఆయనే పాసివ్ నెస్ ని తిరస్కరిస్తే, విజువల్ మీడియా అయిన సినిమాల్లో మనమెంత తిరస్కరించాలి.

దీనికి రిప్లయ్ కూడా ఇచ్చారు : Thank you sir, అవును మీరు చెప్పింది correct యే.. అర్జున్ రెడ్డి, సాగర సంగమం లలో flash back episodes లో మంచి energy ఉంటుంది.. climax ఒకటి paoetic గా ఉంటే మరొకటి hero zero ego state కు వచ్చి calm down అయ్యి ఉంటుంది.. got it sir.. thnk you so much.