తెలుగులో లో- బడ్జెట్ సినిమాల పరిస్థితి తెలిసిందే. గత
సంవత్సరం కూడా 113 విడుదలైతే నాలుగే హిట్టయ్యాయి. 113 లో 109 సినిమాలు
ఫ్లాపయ్యాయి. సక్సెస్ శాతం 3.5 మాత్రమే. ప్రతీ సంవత్సరం ఇదే పరిస్థితి. అందుకని
ఎందుకు తీయాలి లో- బడ్జెట్ సినిమాలు? తీస్తున్న వాటిలో 96.5 శాతం అడ్రసు
లేకుండా పోతూంటే ఎందుకు తీయడం ? కొత్త మేకర్లకి తక్కువ-బడ్జెట్ సినిమాల రూపకల్పనలో తమ సామర్థ్యం
మేరకు ఓ అవగాహన మాత్రమే వుంటే సరిపోతుందా? సక్సెస్
ని ఎలా సాధిస్తారు? సక్సెస్ ని సాధించడం వుండదు, సక్సెస్ ని పుట్టించడమే వుంటుంది. సక్సెస్ ని సాధించాలనే ఆలోచనలోనే సూక్ష్మ దృష్టి వుండదు, స్థూల
దృష్టితో ఏదో ఓవరాల్ గా సబ్జెక్టుని వూహించేయడమే వుంటుంది. కానీ సక్సెస్ ని పుట్టించాలనుకోవడంలో
ఆద్యంతం ఆ సక్సెస్ ని ఇటుక ఇటుక వేసి పుట్టిస్తూ
పోగల సూక్ష్మ దృష్టీ, దాన్ని పట్టి పట్టి చేసుకుపోగల కృషీ
వుంటాయి. పుట్టించడం వేరు, సాధించడం వేరు. పుట్టిస్తేనే కదా
సాధించేది. భారీ బడ్జెట్ సినిమాలకి చాలా సౌకర్యాలుంటాయి. అవన్నీ కూడేసుకుని స్థూల
దృష్టితో చేస్తే సరిపోతుంది. లో -బడ్జెట్ కి చాలా నిజాయితీతో కూడిన ఫాషన్, పట్టుదలా కావాలి. ఫాషన్ లేకపోతే తీయకూడదు. నిజాయితీగల ఫాషన్ వుండి కూడా పట్టుదల
లేకపోయినా తీయకూడదు. లో- బడ్జెట్ సినిమాకి సక్సెస్ ని పుట్టించడానికి ఈ రెండూ
ముఖ్యం.
కొత్తగా ఒక లో- బడ్జెట్ తీసిన తమిళ మేకర్ రాంకుమార్ బాలకృష్ణన్ ‘పార్కింగ్’ తో ఇదే చేశాడు. లో- బడ్జెట్ కథ ఫార్ములాగా వుంటే వర్కౌట్ కానీ రోజులివి. ప్రాక్టికల్ గా వుండాల్సిందే. దీన్ని కష్టపడి ప్రాక్టీసు చేయాల్సిందే. ఈ దర్శకుడు ఎలా ప్రాక్టీసు చేశాడో చూద్దాం...
ఐటీ ప్రొఫెషనల్ ఈశ్వర్ (హరీష్ కళ్యాణ్), గర్భవతి అయిన అతడి భార్య ఆతిక (ఇందుజ) కొత్తగా ఒకింటి పై పోర్షన్ లోఅద్దెకి దిగుతారు. కింది
పోర్షన్ లో మునిసిపాలిటీలో ఈవో అయిన ఏకరాజు (ఎం ఎస్ భాస్కర్), అతడి
భార్య (రామా రాజేంద్ర), బీటెక్ చదివే కూతురు అపర్ణ
(ప్రార్థనా నాథన్) వుంటారు. ఏకరాజు చాలా నిజాయితీగల ప్రభుత్వ
అధికారి. కానీ పాతకాలపు జిత్తులమారి మనిషి. ఆధునిక సమాజంతో సంబంధం లేకుండా జీవిస్తూ,
భార్యాకుమార్తెల చిన్న చిన్న కోరికల్ని కూడా తీర్చని పిసినారిలా వుంటాడు. దీనికి భిన్నంగా ఈశ్వర్ 5 నెలల గర్భవతి అయిన భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ, హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఇబ్బంది పడకూడదని కారు కూడా కొంటాడు.
ఈశ్వర్ కారు కొనే వరకూ రెండు కుటుంబాలు మొదట్లో బాగా కలిసిపోతాయి. పదేళ్ళుగా ఈ ఇంట్లో వుంటున్న ఏకరాజు ఇది వరకు పై పోర్షన్లో అద్దెకుకున్న వాళ్ళకి ఎప్పుడూ కారు లేకపోవడంతో, ఇంటి ముందున్న చిన్న కాంపౌండులో తన బైక్ పార్క్ చేసుకుని తనే వాడుకుంటున్నాడు. ఈ కాంపౌండులో ఈశ్వర్ కారు తెచ్చి పెట్టడంతో గేటు లోంచి బైకు వెళ్ళడానికి కూడా ఇరుకైపోతుంది ఏకరాజుకి. దీంతో గొడవపడతాడు.
పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న తగాదాలు పెరిగి పెరిగి పెద్దవై బద్ధశత్రువులైపోతారు. ప్రాణాలు తీసేందుకూ వెనుకాడరు. ఇలా ఇద్దరి మధ్య కఠినంగా మారిన సమస్య ఎలా పరిష్కారమైందనేదే స్టోరీ అయిడియా లేదా కాన్సెప్ట్.
ఒక కాన్సెప్ట్ లేదా స్టోరీ
ఐడియాని బిగ్ బడ్జెట్ కి స్థూలంగా ఆలోచిస్తే, ఉదాహరణకి- ‘గుంటూరు కారం’ లో మహేష్ బాబు- ప్రకాష్ రాజ్ ల మధ్య సంతకం గురించి గొడవ లాంటిది. ఏ
కాన్సెప్ట్ బలంగా వుండాలన్నా 1. ముందు అది ప్రకటించే కాన్ఫ్లిక్ట్ బలంగా వుండాలి, 2. ఆ కాన్ఫ్లిక్ట్ కి దారి తీసే కారణం ప్రేక్షకుల్ని ఒప్పించేదిగా
వుండాలి, 3. ఆ ఒప్పించే కారణంలోంచి కథకి చోదక శక్తిలా సహజమైన
భావోద్వేగాలు ప్రజ్వరిల్లాలి. ‘గుంటూరు కారం’ లో సంతకం గురించిన కాన్ఫ్లిక్ట్ లో ఈ మూడు టూల్స్ లేవు. ఒరిజినల్ గా
ఆలోచిస్తే అసలు ఈ కాన్ఫ్లిక్ట్ లో సంతకం ప్రసక్తే రాదు. ఎందుకంటే, మహేష్ బాబు తల్లి రమ్యకృష్ణ ఆమె తండ్రి ప్రకాష్ రాజ్ గుప్పెట్లో బందీ
అయిపోయి ఆడించినట్టూ ఆడుతూ నరకం అనుభవిస్తోంది.
అప్పుడు ఆ నరకంలోంచి మహేష్ బాబు ఆమెకి ఎలా
విముక్తి కల్గిస్తాడనే ప్రేక్షకుల్ని ఒప్పించే కాన్ఫ్లిక్ట్ తో కథ అవ్వాలి. సంతకం
కోసం కాన్ఫ్లిక్ట్ అనేది సినిమాకి చాలని చిల్లర తగాదా అయింది.
కానీ పైన చెప్పుకున్నట్టు, భారీ బడ్జెట్ కి చాలా సౌకర్యాలుంటాయి కాబట్టి, స్థూల దృష్టితో అలా కథ చేసేస్తే సరిపోతుందనుకున్నట్టుంది. అయితే సినిమా ఒక సంతకం గురించే తీసినా, దీనికైనా సూక్ష్మ దృష్టితో కథనం చేయాలని కూడా అనుకోలేదు. స్థూల దృష్టితో- సంతకం పెట్టు- పెట్టను- సంతకం పెడతావా లేదా- పెట్టనంటే పెట్టను- ఇలా ఇంటర్వెల్ దాకా కథ అక్కడే వుంటూ, అవే సీన్లు రిపీటవుతూ వుంటాయి. సూక్ష్మ దృష్టితో చేసి వుంటే, ఆ సంతకమనే పాయింటు కొత్త మలుపులు తిరుగుతూ కథని విస్తరించుకుంటూ పోయేది. ఒకసారి సంతకం అడిగితే పెట్టనన్నాక- ఇక సంతకం గురించి అడగకుండా, మహేష్ బాబు సీక్రేట్స్ లాగి అల్లరి చేయ వచ్చు, ఇది ఇంకెక్కడికో దారి తీయొచ్చు, ఇందులోంచి ఇంకా కథ లాగితే మహేష్ బాబు ఫ్యూచర్ నే నాశనం చేసే తీరానికి కూడా కథ చేరుకోవచ్చు. ‘పార్కింగ్’ అనే లో- బడ్జెట్ కి సృష్టించిన కాన్ఫ్లిక్ట్ ని ఇలా సూక్ష్మ దృష్టితోనే కథా విస్తరణ చేశాడు.
అయితే ఈ కాన్సెప్ట్ ని ఏ జానర్
ఎలిమెంట్స్ తో విస్తరిస్తే మార్కెట్ యాస్పెక్ట్ వుంటుంది? ఈ
కాన్సెప్ట్ ని సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఎలిమెంట్స్ తో,
దానికుండే పేసింగ్ తో విస్తరిస్తే
మార్కెట్ యాస్పెక్ట్ వుంటుందని భావించాడు. ఇక్కడొకటి గమనించాలి- అసలు ముందుగా ఈ
కాన్సెప్ట్ సినిమా కథకి పనికొస్తుందా లేదా అని మార్కెట్ యాస్పెక్ట్ దృష్టితో పరిశీలిస్తే, పార్కింగ్ సమస్య లాంటి అల్ప విషయం రెండు గంటల సినిమా కథగా విస్తరించాలంటే
కష్టమే. ‘గుంటూరు కారం’ లో అల్పంగా
కనిపిస్తున్న సంతకం పాయింటు లాగా.
షార్ట్ ఫిలిం ఐడియాని అలాగే సినిమాగా తీస్తే ఏం జరిగిందో ఉదాహరణలున్నాయి. 2016 లో శర్వానంద్ తో తీసిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో హీరోయిన్ ఓ చిన్న కుక్క పిల్ల గురించి హీరోతో విడిపోవడం స్టోరీ అయిడియా. షార్ట్ ఫిలిం కి సరిపోయే ఈ స్వల్ప విషయం సినిమాకెలా సరిపోతుంది? ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యురాలు మహువా మోయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ మోయిత్రా పెంచుకుంటున్న కుక్కపిల్లని అడిగితే ఆమె ఇవ్వలేదన్న గొడవ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేదాకా వెళ్ళి- మధ్యవర్తులతో, పారిశ్రామిక వేత్తలతో అనేక మలుపులు తిరిగి- చివరికి ఆమె లోక్ సభ సభ్యత్వపు పాస్ వర్డ్ మరొకరికి ఇచ్చిందన్న క్లయిమాక్స్ కి చేరి, సభ్యత్వమే కోల్పోవడంతో ముగిసింది.
అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ
పూర్వం కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు రాహుల్ గాంధీని కలవడానికిపోతే, ఆయన పట్టించుకోకుండా కుక్కకి బిస్కెట్లు తినిపిస్తూ కూర్చున్నాడన్న
అవమానంతో బిజెపిలోకి చేరిపోయి ముఖ్యమంత్రి అయిపోయి- రాహుల్ గాంధీ న్యాయయాత్ర
చేస్తూ అస్సాం కొస్తే, కుక్క- బిస్కెట్లు ఇన్సల్టింగ్ సీను
మెదిలి పగ సాధించడం మొదలెట్టాడు- రాహుల్ యాత్రకి నానా ఆటంకాలు కల్పిస్తూ, కేసులు పెట్టి అరెస్టు చేయిస్తాననే దాకా పోయాడు. కాకపోతే ఎండింగ్
పెండింగులో పెట్టాడు- ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తానన్నాడు. ఇప్పుడు చేస్తే
ఎన్నికల్లో బెడిసి కొడుతుందని.
ఇలా స్వల్ప కారణమనుకున్నది పెద్ద సంఘర్షణగా ఎందుకు విస్ఫోటిస్తోంది? ఇగోల వల్లే. పరస్పరం ఇగోల ప్రకోపం వల్లే యాక్షన్ రియాక్షన్ల సంకుల సమరం మొదలైపోతోంది. ఈ మనస్తత్వాల్ని ముట్టుకోకుండా పైపైన కామెడీలు చేయడం వల్ల ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఫెయిలైంది. ఇగో అనేది పవర్ఫుల్ టూల్. దాంతో పుట్టే కాన్ఫ్లిక్ట్ అగ్నిపర్వతం బద్ధలవడం లాంటిది. ‘పార్కింగ్’ లో పార్కింగ్ దగ్గర గొడవ అనే స్వల్ప కారణం ఇగోల సంఘర్షణ అనే టూల్ ని ప్రయోగించడం వల్లే అంత బలమైన కాన్ఫ్లిక్ట్ ని సృష్టించ గలిగింది.
అయితే ఇగోతో రెండు రకాల కథనాలుంటాయి. పుట్టిన ఇగోని మనసులో పెట్టుకుంటే సంఘర్షణకి గ్యాప్ వస్తుంది. దాంతో ఇంకెప్పుడో దానికదే అవకాశం వస్తే అప్పుడు పగదీర్చుకునే మొదటి రకం కథనం (అస్సాం ముఖ్యమంత్రి విషయంలోలాగా), ఇది పాసివ్ ఇగో. ఇలాకాకుండా, పుట్టిన వెంటనే ఆగకుండా అంతు చూసే యాక్టివ్ ఇగో రెండో రకం కథనానికి దారి తీస్తుంది (మహువా మోయిత్రా విషయంలోలాగా). ‘పార్కింగ్’ కాన్సెప్ట్ విషయంలో దర్శకుడు ఈ రెండో రకమే తీసుకున్నాడు. తీసుకున్న కాన్సెప్ట్ ని వర్కౌటయ్యే మార్కెట్ యాస్పెక్ట్ ఇలా యాక్టివ్ ఇగోలతో కూడిన క్రియేటివ్ యాస్పెక్ట్ తో జోడిస్తేనే వస్తుందని నిర్ణయించినట్టు కనిపిస్తోంది.
ఇప్పుడు క్రియేటివ్ యాస్పెక్ట్
కొస్తే, దీనికి ఏ జానర్ ట్రెండీగా వుంటుంది? ఓటీటీలు ట్రెండ్స్ సెట్ చేస్తున్నాయి కాబట్టి దీనికి సస్పెన్స్ థ్రిల్లర్
జానర్ ఎలిమెంట్స్ తో కథనం చేశాడు. యాక్టివ్ ఇగోలకి ఇదే వర్కౌటవుతుంది. సీను సీనుకీ
మలుపులు తీసుకునే కథనంతో, డైనమిక్స్ తో. వెంట వెంటనే
జరిగిపోయే సెటప్స్- పే ఆఫ్స్ తో. అంతకంతకూ పెరిగిపోయే టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ తో, క్యారక్టర్ ఆర్క్స్ తో. కళ్ళు తిప్పి ఏ సీను మిస్సయినా కథ అర్ధం గాని
అటెన్షన్ స్పాన్ డిమాండ్ తో.
తీసుకున్న కాన్సెప్ట్ కి దానికవసరమయ్యే టూల్స్ తో మార్కెట్ యాస్పెక్ట్ ని కల్పించాలని ఇటీవల కూడా ఏ సినిమా విషయంలో ఆలోచించారు? సైంధవ్? నా సామి రంగ? గుంటూరు కారం? ఈగల్? లాల్ సలాం? ఏ సినిమా విషయంలో? మరెందుకు సినిమాలు తీస్తున్నట్టు?
ఐతే ‘పార్కింగ్’ లో కాన్సెప్ట్ ని ఇంకా విశాల దృష్టితో చూడాల్సి వుంది. ఇది జరగ లేదు. ఇందులో రెండు ఇగోల సంఘర్షణ ముగింపుకి చేరినప్పుడు, ఇంకా పరిపూర్ణంగా చేరలేదు. ఎందుకంటే న్యాయం శత్రువుని వ్యక్తిగత శత్రువనుకుని శిక్షించదు. ఎందుకు శిక్షిస్తుందంటే, పరివర్తన చెందుతాడని, పాఠాలు నేర్చుకుంటాడని. అదే ఆవేశం వ్యక్తిగత శత్రువనుకుని శిక్షిస్తుంది. నాశనాన్ని చూసి తృప్తి పడుతుంది.
ఈ కాన్సెప్ట్ లో హీరో పాత్ర, సీనియర్ పాత్ర ఇగోలతో తలపడినప్పుడు, సీనియర్ పాత్ర హీరోపాత్రని మార్చడం కోసం పడే సంఘర్షణగా, హీరో పాత్ర సీనియర్ పాత్ర నాశనం కోసం చేసే ఘర్షణగా పాత్రచిత్రణ లుంటే - ముగింపు పరిపూర్ణంగా, ఆలోచనాత్మకంగా, ప్రయోజనాత్మకంగా వుండేది. న్యాయంతో సీనియర్ పాత్ర, ఆవేశంతో హీరో పాత్ర. సీనియర్ పాత్ర చివర్లో మెచ్యూర్డ్ ఇగోగా తన ఉద్దేశం బయటపెట్టి వుంటే, కథా లక్షణానికి న్యాయం జరిగేది. కథంటే ఇగో మెచ్యూర్డ్ ఇగోగా ఎదిగినట్టు చూపించడమేగా?
—సికిందర్
(రేపు : యాక్ట్స్ లో ఫ్యాక్ట్స్)