రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, February 25, 2024

1407 : రివ్యూ


 రచన- దర్శకత్వం : రాహుల్ సదాశివన్

తారాగణం : మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమాల్డా లిజ్ తదితరులు సంగీతం : క్రిస్టో జేవియర్, ఛాయాగ్రహణం: షెహనాద్ జలాల్
బ్యానర్స్ : నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్
పంపిణీ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (ఏపీ, తెలంగాణ)
విడుదల : ఫిబ్రవరి 24, 2024
***
        72 ఏళ్ళ వయస్సులో కమర్షియల్ పాత్రల్లో ఇంకా సాధించేదేమీ లేని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఈ మధ్య వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న సరళి కన్పిస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ రోర్చాచ్’, విజిలాంటీ థ్రిల్లర్ క్రిస్టఫర్’, పోలీస్ థ్రిల్లర్ కన్నూర్ స్క్వాడ్’, హోమోసెక్సువల్ డ్రామా కాథల్ : ది కోర్’, మెడికల్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్’, రానున్న యాక్షన్ థ్రిల్లర్ బజూకా’, యాక్షన్ కామెడీ టర్బో’... ఇలా రెండేళ్ళలో పీరియడ్ హార్రర్  భ్రమయుగం ( ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్) కలుపుకుని 8 సినిమాలు! భ్రమయుగం ఆధునిక ప్రయోగాత్మక సినిమాల్లో దేశంలోనే మొదటిది. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంతరించిపోయిన దశాబ్దాల తర్వాత, బ్లాక్ అండ్  వైట్ లో తీయడం ప్రయోగాత్మకమే కాదు, సాహసం కూడా. ఈ వయసులో మమ్ముట్టి చేయాల్సింది ఇలాటివే. దీనికి అసాధారణ సినిమా నిర్మాణ  శైలికి, సంక్లిష్ట  కథనాలకి పేరుతెచ్చుకున్న యువ దర్శకుడు రాహుల్ సదాశివన్  ప్రాణం పోయడమొక అదనపు హంగు. రెడ్ రెయిన్’, భూతకాలం వంటి విభిన్న హార్రర్లు తీసిన ఇతను, ఈ సారి హార్రర్ తోనే చేసిన కొత్త ప్రయోగం ఇవాళ దేశవ్యాప్త చర్చ అయింది. దీని ప్రత్యేకత లేమిటో కథలోకి వెళ్ళి చూద్దాం...

కథ

17వ శతాబ్దంలో దక్షిణ మలబార్ లో బానిసల వర్తకం చేస్తున్న పోర్చుగీసు సైన్యాల బారి నుంచి తప్పించుకుంటారు దేవన్ (అర్జున్ అశోకన్), కోరన్ (మణికందన్ ఆచారి). ఆ పారిపోయే క్రమంలో అడవిలో ఒక యక్షి (అమల్డా లిజ్) కోరన్ ని చంపేస్తుంది. దేవన్ ప్రాణాలు రక్షించుకుంటూ ఒక పాడు బడిన భవనం చేరుకుంటాడు. అక్కడి వంటవాడు (సిద్ధార్థ్ భరతన్) పట్టుకుని యజమాని కొడుమాన్ పొట్టి (మమ్ముట్టి) ముందు ప్రవేశపెడతాడు. దేవన్ గాయకుడని తెలుసుకుని పాట పాడించుకుంటాడు పొట్టి. పాటకి మెచ్చి, దేవన్ ని భవనంలోనే బస చేసేట్టు చూస్తాడు.

బస చేసిన దేవన్ కి అక్కడి వాతావరణం భయం గొల్పేదిగా వుంటుంది. వంట వాడి నుంచి కొన్ని భయపెట్టే విషయాలు తెలుసుకుంటాడు. కొడుమాన్ పొట్టి చూడలన్ పొట్టి వంశస్థుడు. జంధ్యం లేని బ్రాహ్మణుడు. ఇతడికి వారాహి దేవత సహాయకుడిగా చాతన్ అనే రాక్షసుడిని ప్రసాదిస్తుంది. అయితే కొడుమాన్ పొట్టి చాతన్ ని హింసిస్తూ వుండడంతో చాతన్ కి పిచ్చి ముదురుతుంది. దీంతో కుటుంబం సహా చూడలన్ పొట్టిని చంపేస్తాడు. బతికున్న కొడుమోన్ పొట్టి చాతన్‌ ని ఓడించి, ఈ భవనం అటకపైన బంధించి వుంచాడు.
        
ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఇక్కడ వంటవాడే కాదు, దేవన్ కూడా ప్రాణాపాయంలో వున్నాడు.  ఎందుకంటే దేవన్ చూస్తున్న కొడుమాన్ పొట్టి కొడుమాన్ పొట్టి కాదు, ఇతను చాతన్. కొడుమాన్ పొట్టిని తన స్థానంలో అటకపైన బంధించి కొడుమాన్ పొట్టిలా నటిస్తున్నాడు. ఈ రాక్షసుడి  తాంత్రిక విద్యలు ఇప్పటికే చవిచూశాడు దేవన్. తామిద్దరూ ఇంకా ఇక్కడుంటే వీడి చేతిలో చావడం ఖాయం.  పారిపోవాలి! ఎలా పారిపోవాలి? పారిపోగల్గారా, లేదా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
'ఇది భ్రమయుగం, కలియుగానికొక వికృత రూపం. భ్రమయుగంలో దేవుడ్ని పూజించి  ఏ ఉపయోగం లేదు. ఆచార సాంప్రయాదాలకి ఇక్కడ ఏ విలువా లేదు. దేవుడి నిష్క్రమణలోనే భ్రమయుగం మొదలైంది. నువ్వెంత అరిచి గీపెట్టి పాడినా దేవుడికి వినిపించదు! అని అసలు విషయం చెప్తాడు కొడు మాన్ పొట్టి, అతడి అతిధిగా బస చేసిన దేవన్ తో.
        
కొడుమాన్ పొట్టి కాదు, కొడుమాన్ పొట్టి పాత్రలో మమ్ముట్టి ఈ డైలాగు చెప్తున్నప్పుడు మన వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. ఇప్పుడొచ్చే హార్రర్ సినిమాల్లో డైలాగులకి భయపడడం ఎప్పుడో మానేశాం. అందులో బ్లాక్ అండ్ వైట్ లో సినిమా వుంటే, అందులోనూ మమ్ముట్టిలాంటి స్టార్ దుష్టపాత్రలో ఆ డైలాగులు చెప్తూంటే వెన్నులోంచే కాదు, రివ్యూ రాస్తూంటే పెన్నులోంచీ వణుకు పుట్టుకొస్తుంది.
        
ఇది పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరించిన పీరియడ్ హార్రర్ థ్రిల్లర్. హార్రర్ ఫీల్ కి బ్లాక్ అండ్ వైట్ ని మించిన మాధ్యమం లేదని, ’70 లలోనే కలర్ సినిమాలు వస్తున్న కాలంలో జగమేమాయ లాంటి బ్లాక్ అండ్ వైట్ హార్రర్లు కొనసాగాయి.
       
భ్రమయుగం బ్లాక్ అండ్ వైట్ వెలుగు నీడలతో కళాత్మకంగానూ వుంటుంది. కాకపోతే ఆర్ట్ సినిమాల నడకలా నిదానంగా కథ నడుస్తూంటుంది. ఇంత నిదానంగా సాగే సినిమాని పనిగట్టుకుని రెండుంబావు  గంటల సేపు కూర్చుని ఎందుకు చూడాలంటే, పెరిగిపోయిన  రకరకాల వొత్తిళ్ళతో ఘోరంగా జీవిస్తున్న మనం, ఈ కళాసృష్టిని చూస్తూ కనీసం రెండు గంటలు ధ్యానముద్రలో వుండగలం. ఈ క్రియేషన్ - వొత్తిళ్ళని దూరం చేసే మెడిటేషన్. యాభై ఏళ్ళనాటి మణికౌల్ సినిమా ఉస్కీ రోటీ చూస్తూ ఏ మేడిటేషన్ లోకెళ్ళి పోతామో, అదే ఈ భ్రమయుగమనే మాయాలోకంలో అనుభవిస్తాం. 

కథ సింపుల్. పాడుబడ్డ భవనంలో కొడుమాన్ పొట్టికి చిక్కిన దేవన్, వంటవాడు ఎలా తప్పించుకు ప్రాణాలతో బయపడ్డారనేది. సాగుతున్న కొద్దీ అపాయాలు, మలుపులు, ఆందోళనలు, టెర్రర్. అరణ్యంలో పాడుబడ్డ భవనం, మూడే పాత్రలు. కొడుమాన్ పొట్టి ప్రాణం దీపంలో వుంటుంది. ఆ దీపాన్ని ఆర్పడమెలా? పూర్తిగా జానపద కథల శైలిలో, నాలుగు  శతాబ్దాల నాటి కథా కాలంతో, ఆనాటి పాత్రలతో హార్రర్ లో కొత్త ప్రయోగమిది. సాలీడు గూడు అల్లడం. వంటవాడు కట్టెలు కొట్టడం, బావిలో బాల్చీ పడడం వంటి కథని సింబాలిక్ గా తెలియజేసే షాట్స్ వున్నాయి. కులపరమైన, సామాజిక పరమైన, రాజకీయపరమైన, ఆర్ధికపరమైన అసమానతల ప్రస్తావనలు కూడా వుంటాయి. దేవన్ తక్కువ కులం, కొడుమాన్ పొట్టి ఎక్కువ కులం. అయితే కొడుమాన్ పొట్టి రూపంలో వున్నది రాక్షసుడు చాతన్. రాక్షసుడు తక్కువ కులం వాడ్ని చంపాలని ఎందుకు అనుకుంటాడు? ఇలా సాగుతూ క్లయిమాక్స్ విషయంలో కొచ్చేసరికి బిగి సడలి పోతుంది. ఇంత రుచి చూపించి చివర్లో చల్లార్చడమొక్కటే లోపం.

నటనలు- సాంకేతికాలు

మమ్ముట్టి నట విశ్వరూపం ఈ సినిమా. సౌమ్యుడుగా మొదలై రాక్షసంగా మారే పాత్ర పరిణామ క్రమం అద్వితీయంగా పోషించాడు. చూసే తీరు, పలికే తీరు టెర్రిఫిక్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అమితాబ్ బచ్చన్ ఇంకా ఇలాటి పాత్రలు పోషించి హడలెత్తించాల్సిన అవసరముంది ఆర్ట్ మూవీస్ స్కూల్లో. మమ్ముట్టి వరుసగా చేస్తున్నది ఇదే. అయితే మమ్ముట్టి కంటే దేవన్ పాత్ర పోషించిన అర్జున్ అశోకన్ ఎక్కువ సేపు కనిపిస్తాడు. నిమ్న కులస్థుడిగా వంటవాడు కూడా అనే మాటలు పడే సన్నివేశాల్లో దైన్యాన్ని బాగా ప్రదర్శిస్తాడు. కొడుమాన్ పొట్టి మాయకి జ్ఞాపక శక్తి కూడా కోల్పోయి -రెండు మూడు రోజులు కాదు, తను ఎన్నో నెలలుగా ఇక్కడుంటున్నాడని ని తెలుసుకుని షాక్ అయే దృశ్యాన్ని బాగా హేండిల్ చేశాడు. ఇక వంటవాడుగా భరతన్ పాత్రకి చివర్లో ఒక ట్విస్టు వుంది. కొడుమాన్ పొట్టి చేతిలో హీనంగా బతుకుతున్న తన జన్మ రహస్యం తనకే తెలీదు. దేనికీ భయపడకుండా శాంతంగా వుండడం తన స్వభావం. ఈ పాత్రని సహజ ధోరణిలో నటించాడు.
       
ఇందులో సాంకేతికంగా హంగులూ ఆర్భాటాలూ వుండవు. కళాత్మకంగా ఉత్తమాభిరుచి మాత్రమే వుంటుంది. హార్రర్ తో అదరగొట్టే చీప్ ట్రిక్స్ వుండవు. వాతావరణమే ఫోక్ సంగీత బాణీలతో భయపెడుతుంది
, అవతల నదులూ జలపాతాల హోరు కలుపుకుని. చిత్రీకరణకి కళాదర్శకత్వం బాగా తోడ్పడింది. బ్లాక్ అండ్ వైట్ కెమెరా వర్క్ ప్రొడక్షన్ నాణ్యతని పెంచింది. దర్శకుడు పూర్తి కమాండ్ తో, కథా కథనాలతో శాసించి ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెడతాడు.
—సికిందర్

Monday, February 19, 2024

1406 : రివ్యూ

 

రచన- దర్శకత్వం: అభిమన్య తాడిమేటి
తారాగణం : ప్రియమణి, శరణ్యా ప్రదీప్, సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, సుదీప్ వేద్, అనూజ్ గుర్వారా, చైతూ జొన్నలగడ్డ, రుద్ర ప్రతాప్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, ఛాయాగ్రహణం :  దీపక్ యారగెరా
నిర్మాతలు: బాపినీడు, సుధీర్ ఈదర
విడుదల : ఆహా ఓటీటీ
***
        2022 లో ఆహాలో స్ట్రీమింగ్ అయిన భామాకలాపం కి సీక్వెల్ ఈ  భామాకలాపం 2. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామాకలాపం వెబ్ మూవీగా హిట్టయ్యింది. అయితే థియేట్రికల్ విడుదల కూడా ప్రకటించిన తర్వాత ఏమైందో దాని సంగతి తెలీదు. క్రైమ్ కామెడీగా హిట్టయిన ఈ వెబ్ మూవీ మధ్యతరగతి పాత్ర నేటివిటీకి ఒక చారిత్రక స్పర్శగల అంశంతో కల్పన చేయడం వల్ల విషయ గాంభీర్యమేర్పడి ఆసక్తిరేపింది. ఈ పాత్రని కొనసాగిస్తూ సీక్వెల్ తీసినప్పుడు ఈసారి ప్రియమణి చేసే అడ్వెంచర్ ఏమై వుంటుందనేది సహజంగానే ఈ సీక్వెన్ ని చూసేలా చేస్తుంది. ఓ రెండు గంటలు కేటాయించుకుని ఆహాలో చూసేందుకు కూర్చుంటే ఓహో అన్పించేలా వుంటే –దిల్ మాంగే మోర్- అని అర్జెంటుగా ఇంకో సీక్వెల్ కావాలని డిమాండ్ చేసేందుకు ఉద్యమించే పరిస్థితి ఏర్పడొచ్చు. దర్శకుడు డిమాండ్ తీర్చగల సమర్ధుడన్న నమ్మకంతో. అయితే నిజంగా అంత వుందా? సీక్వెల్ చూస్తే ఇంకో సీక్వెల్ కి బాట వేసేంత విషయం ఇందులో వుందా? ఇది తెలుసుకుందాం...

కథ

మొదటి భాగంలో ఓ సాధారణ మధ్య తరగతి గృహిణిగా యూట్యూబ్ వంటకాలు చేసుకునే అనుపమ (ప్రియమణి) కి, గాసిప్స్ కోసం ఇతరుల కుటుంబాల్లోకి తొంగి చూసే వ్యసనంతో హత్య కేసులో ఇరుక్కుని బ్రతుకు జీవుడా అని ఎలాగో బయటపడుతుంది. ప్రస్తుతానికొస్తే, వేరే ఫ్లాట్ లో వుంటుంది. మళ్ళీ అక్కడా ఇక్కడా తొంగి చూడకు అని భర్త మోహన్ (రుద్రప్రతాప్) హెచ్చరిస్తాడు. అలాగేనని, యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుతో, పని మనిషి శిల్ప (శరణ్యా ప్రదీప్) పార్టనర్ గా హోటల్ పెడుతుంది. డ్రైవింగ్ నేర్చుకునేందుకు డ్రైవింగ్ స్కూల్లో చేరుతుంది. ఒకడ్ని గుద్ది గొడవలో ఇరుక్కుంటే వాడు బెదిరిస్తూ వుంటాడు.
       
ఇంకోవైపు
అంథోనీ లోబో (అనూజ్ గుర్వారా) అనే బిగ్ షాట్, సినిమా అవకాశాల కోసం ఆంథోనీని నమ్మిన జుబేదా (సీరత్ కపూర్) అనే యువతి కలిసి ఓ భారీ వంటల పోటీ నిర్వహించే పనుల్లో వుంటారు. విజేతకి ఓ బంగారు కోడిపుంజు బొమ్మని ట్రోఫీగా ఇవ్వాలనుకుంటారు. డ్రగ్ స్మగ్లింగ్ కి తోడ్పడే ఈ ట్రోఫీ విలువ వెయ్యి కోట్లు అని స్మగ్లర్లకి బేరం పెడుతూంటాడు ఆంథోనీ. ఈ ట్రోఫీ కొట్టేయాలని మాజీ నార్కోటిక్స్ బ్యూరో అధికారి సదానంద్ (రఘు ముఖర్జీ) నిర్ణయించుకుంటాడు. ఈ వంటల పోటీలో పాల్గొనే అవకాశం అనుపమ కొస్తుంది. అయితే తనని బెదిరిస్తున్న వాడిగురించి అనుపమ సదానంద్ సాయం కోరడంతో, సదానంద్ వాడ్ని చంపి అనుపమనీ, పనిమనిషి శిల్పానీ ఇరికిస్తాడు.  ఇందులోంచి బయటపడాలంటే వంటల పోటీలో ట్రోఫీని దొంగిలించుకు రావాలని కండిషన్ పెడతాడు.
       
ఇప్పుడు ఏం చేసింది అనుపమ
? మళ్ళీ చేయని హత్యలో ఇరుక్కుని ఈసారి ట్రోఫీ దొంగగా మారిందా? వంటల పోటీలో ఏం చేసింది? సదానంద్ తోబాటు ఇంకో ముగ్గురు విలన్లని ఎలా ఎదుర్కొంది? ఇదీ మిగతా కథ.  

ఎలావుంది కథ

భామాకలాపం కథ 200 కోట్లు విలువజేసే కోడి గుడ్డు గురించి అయితే ఈ సీక్వెల్ 1000 కోట్ల విలువైన కోడిపుంజు గురించి.  కోడి గుడ్డు కథకి ఒక డెప్త్ వుంది. ఏసు ప్రభువు పునర్జన్మకి సంకేతంగా వున్న ఎగ్ అని చెప్తూ, ఆధ్యాత్మిక స్పర్శతో కల్పిత కథ చేశారు. ఈ కల్పితాన్ని అసలు దేవుడంటే అర్ధమేమిటో చెప్పడానికి కథలో వాడుకున్నారు. మత ప్రచారకుల మూఢనమ్మకాలకి ప్రజలెలా బలి అవుతారో, దాంతో ఎలాటి దారుణాలు జరుగుతాయో చెప్పే ఈ కాన్సెప్ట్ లో, ఇతరుల విషయాల్లో తలదూర్చి పీతూరీలు చెప్పే అలవాటుతో కూడా ఎలాటి ప్రమాదంలో పడవచ్చో హెచ్చరిక చేశారు. ఈ రెండు ట్రాక్స్ నీ ఏకత్రాటిపై నడిపిస్తూ అర్ధవంతమైన కథ చేశాడు అప్పట్లో దర్శకుడు.

దీనికి ఆర్నెల్ల ముందు, హాలీవుడ్ నుంచి వచ్చిన రెడ్ నోటీస్ అనే కామిక్ థ్రిల్లర్క్లియోపాత్రా ప్రాచీన ఎగ్ కోసం వేటగా  వుంటుంది. క్లియోపాత్ర ప్రాచీన ఎగ్ అనేది సినిమా కోసం కల్పించిన కథ. చారిత్రక స్పర్శతో ఈ కల్పవల్ల కామిక్ థ్రిల్లర్ కో విషయ గాంభీర్యం ఏర్పడింది.  ఇలా రెడ్ నోటీస్’, భామాకలాపం రెండూ కల్పించిన హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వల్ల హూందాతనంతో, రిచ్ గా కన్పిస్తాయి.

 
భామకలాపం 2 కి ఈ బ్యాకప్ లేదు. బంగారు కోడి పుంజు ట్రోఫీకి ఎలాటి విషయ ప్రాధాన్యం లేక కాకమ్మ కథ చెబుతున్నట్టు వుంది. కథా కథనాలన్నీ, పాత్రచిత్రణలన్నీ వెబ్ మూవీ కోరే సహజత్వం దాటి, కమర్షియల్ సినిమాల కృత్రిమత్వంతో చప్పగా తయారయ్యాయి.

        
భామాకలాపం చాలా విషయాల్లో క్రియేటివ్ ఘనత సాధించింది. ముఖ్యంగా ప్రియమణి పాత్ర- కథలో ఈ పాత్ర సమస్యలో పడ్డాక చివరంటా అనేక అనుభవాలు- వాటిలో కొన్ని వొళ్ళు జలదరింప జేసేవి. సమస్య లోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు ఎదురు తిరిగి సమస్యని ఇంకా పెంచేయడం అనే డ్రైవ్ పాత్రని, పాత్రతో బాటు తననీ బిజీగా వుంచుతాయి. కథ తన చేతి నుంచి దాటిపోదు. క్షణం క్షణం థ్రిల్ చేస్తూ, ఒక పక్క అమాయకత్వం, ఇంకో పక్క భయం, తెగింపూ అనే పాత్రోచిత నటనతో సినిమాని భుజానేసుకుని నడిపిస్తుంది.
        
ఈ సీక్వెల్లో మాత్రం తను ఎక్కడుందో తప్పిపోయింది. ముగ్గురు విలన్లతో వాళ్ళ గొడవలే కథగా మారడంతో తను గల్లంతయిపోయింది. మొదటి 40 నిమిషాల తర్వాత తనదేంలేదు- అంతా రాత్రి పూట హోటల్ అనే ఒకే లొకేషన్లో ట్రోఫీ కోసం విలన్ల కథే!
        
భామాకలాపం సాంకేతికంగా కూడా - దృశ్యాల చిత్రీకరణలో ఒక సెటిల్డ్ వాతావరణం కన్పిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ నిదానంగా, నిద్రాణంగా వున్నట్టు- దృశ్య వాతావరణం మోడరన్ హైదరాబాద్ ని ప్రతిబింబించదు. అపార్ట్ మెంట్లో జరిగినవి రెండు మర్డర్స్ అయితే, ఈ పరిస్థితి తీవ్రతకి కాంట్రాస్ట్ గా, నిదానంగా సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్, తీరుబడిగా పాత్రల యాక్టివిటీస్ వగైరా సినిమా చూస్తున్నట్టు వుండదు- మనపక్కనే ఇలాటి దృశ్యాలు ఎలా కన్పిస్తాయో అలా వుంటాయి. చాలా పాత అపార్ట్ మెంట్ భవనం, దాని చుట్టూ పాత ఇళ్ళూ రోడ్లూ, వీటికి తగ్గ కళా దర్శకత్వం- కథ మూడ్ ని స్థాపిస్తాయి.
       
సీక్వెల్లో ఈ నేటివిటీ
, ఫీల్ కనిపించవు. కమర్షియల్ సినిమా ఆర్భాటంతో సహజత్వానికి దూరంగా వుంటుంది. మొదటి నలభై నిమిషాలు ప్రియమణి జీవితం, స్మగ్లర్ల పథకాలు, వంటల పోటీల్లో ప్రియమణికి అవకాశం, కారు యాక్సిండెంట్ – విలన్ సాయం- హత్య, హత్యలో ప్రియమణి ఇరుక్కున్న తర్వాత ఇక చివరి వరకూ వంటల పోటీల్లో ట్రోఫీని దొంగలించడం గురించి మాస్టర్ ప్లాన్ అమలు, ఇంతే.
       
ఈ దోపిడీ ఎపిసోడ్ అంతా విలన్ ఫోన్లో ఇచ్చే సూచనలతో చాలా టెక్నికల్ గా
, వాటిని పాటించే ప్రియమణితో చాలా ఫ్లాట్ గా వుంటుంది. అయిదు నిమిషాల తర్వాత స్కిప్ చేసి, గంట రన్ తర్వాత చివర్లో ఏం జరిగింది చూసుకుంటే సరిపోయేలా వుంది. ఈ చివర్లో విలన్లు ఒకర్నొకరు కాల్చుకునే యాక్షన్, శవాల గుట్టలు అంతా గందరగోళంగా వుంటుంది. ఇది చూశాక ఇంకో సీక్వెల్ కోసం దిల్ మాంగే మోర్ అనిపించే అవకాశం మాత్రం ఏమాత్రం వుండదు.

నటనలు- సాంకేతికాలు

ప్రియమణి పాత్రని ఫాలో అవడానికి ఆమెతో బాటు మనం ఫీలవగల అంశం ఏదీ లేకపోవడం ఒక విషాదం. పైగా భామాకలాపం లో సంఘటనలతో అంత అనుభవమయ్యాక, మళ్ళీ నేరంలో ఇరుక్కోవడమన్నది మూర్ఖత్వమనిపిస్తుంది. యాక్సిడెంట్ ఘటనలో ఎవరో బెదిరిస్తున్నాడని విలన్ సాయం ఎలా అడుగుతుంది, పోలీసులకి చెప్పేయక? ఆ విలన్ హత్య చేసి ఇరికిస్తే వాడి కోసం దోపిడీ ఎలా చేస్తుంది, ఆ బ్లాక్ మెయిల్ ని తిప్పికొట్టక? సీక్వెల్లో క్యారక్టర్ ఎదగపోతే ఎందుకు? నిజానికి విలన్ బ్యాక్ మెయిల్ నే తిప్పికొట్టడ గురించే ఈ కథ అవ్వాలి.
       
జేమ్స్ హెడ్లీ ఛేజ్ రాసిన నవల్లో హెల్గా రాల్ఫ్ అనే ధనిక వివాహిత వుంటుంది. మొదటి నవల్లో బ్లాక్ మెయిలర్ ఆమె బలహీనతల్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటాడు. మళ్ళీ సీక్వెల్లో ఇంకో పథకంతో వస్తాడు. ఈ సారి ఎత్తుకు పై యెత్తులేసి వాడ్ని చిత్తు చేస్తుంది. మళ్ళీ రెండో సీక్వెల్లో ఇంకో గట్టి పథకంతో వస్తాడు. ఈసారి మళ్ళీ కనిపించకుండా దెబ్బమీద దెబ్బ కొడుతుంది. ఇలా క్యారక్టర్ ఎదుగుతూ పోతూంటుంది. గొప్ప సస్పెన్స్
, థ్రిల్స్ పోషిస్తుంది. ప్రియమణి క్యారక్టర్ భామాకలాపం లో కంటే ఎదగలేదు. విలన్లే కథని హైజాక్ చేసినప్పుడు తనేం చేయాలో తెలియక మొక్కుబడిగా నటించేసింది.
        
పని మనిషి శిల్ప పాత్రలో శరణ్యా ప్రదీప్ మరోసారి పాత్రని నిలబెట్టుకుంది ఫన్నీ క్యారక్టరైజేషన్ తో. జుబేదా అనే ఫార్ములా పాత్రలో సీరత్ కపూర్ చేసేదేమీ వుండదు. ఇక ముగ్గురు విలన్లు సరే. కోడిపుంజు కోసం కథ వీళ్ళదే- వీళ్ళని కోడి పుంజులు చేసి గుడ్లు చేతిలో పెట్టాల్సిన ప్రియమణి కీలు బొమ్మగా మారడమొక భామా విలాపమే!
       
టెక్నికల్ గా రిచ్ గా వుంది. అయితే
భామాకలాపం కూడా టెక్నికల్ గా రిచ్ గానే  వుంటుంది. దాంట్లో తెలుగుదనముంది. దీంట్లో కమర్షియల్ సినిమాల కృత్రిమత్వముంది. వెబ్ మూవీస్ అనేవి కమర్షియల్ సినిమాలుగా తీయడానికికాక, ప్రాంతీయ జీవితాల దర్పణాలుగా హృదయాల్ని తట్టేవిగా వుండాలేమో ఆలోచించుకోవాలి.  ప్రాంతీయ ఓటీటీల్ని ఈ జీవితాలకి కనెక్ట్ అవడం కోసమే స్థాపిస్తున్నారు.

—సికిందర్ 

Saturday, February 17, 2024

1405 : రివ్యూ



రచన- దర్శకత్వం : వీఐ ఆనంద్
తారాగణం: సందీప్ కిషన్కావ్యా థాపర్వర్షా బొల్లమ్మవెన్నెల కిషోర్వైవా హర్ష తదితరులుసంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం : రాజ్ తోట, కూర్పు : చోటా కె ప్రసాద్ 
సమర్పణ : అనిల్ సుంకర, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌
బ్యానర్: హాస్య మూవీస్ నిర్మాత: రాజేష్ దండా
విడుదల ; ఫిబ్రవరి 16, 2024
***


క్కడికి పోతావు చిన్నవాడా’, ఒక్క క్షణం’, డిస్కో రాజా వంటి సినిమాలు తీసిన దర్శకుడు వీఐ ఆనంద్ ఊరు పేరు భైరవకోన తో తిరిగి వచ్చాడు. సందీప్ కిషన్ తో ఫాంటసీ థ్రిల్లర్ గా తీసిన ఈ సినిమా ఇటీవల ట్రెండ్ గా మారిన రూరల్ హార్రర్స్ లో మరొకటిగా చేరుతోంది. మరి ఈ రూరల్ హార్రర్ మిగతా వాటికి ఎందులో భిన్నంగా వుంది? ఒక బలమైన పాయింటుతో భావోద్వేగాల జర్నీలా వుందా, లేక మూడు నాల్గు జానర్లు కలిపేసిన కిచిడీలా వుందా తెలుసుకుందాం...

కథ

బసవ (సందీప్ కిషన్) సినిమాల్లో హీరోలకి డూప్ గా పనిచేస్తూంటాడు. ఒక రోజతను ఫ్రెండ్ జాన్ (వైవా హర్ష) తో కలిసి ఓ పెళ్ళిలో పెళ్ళికూతురి నగలు దోచుకుని పారిపోతాడు. పోతూంటే దారిలో గీత (కావ్యా థాపర్) యాక్సిడెంట్ జరిగి పడిపోయి వుంటుంది. ఆమెని కారెక్కుంచుకుని పోతూంటే అడవిలో ఒక వూరు కన్పిస్తుంది. అక్కడ గీతకి వైద్యం చేయించడానికి పోతే ఆ వూళ్ళో అందరూ దెయ్యాలై వుంటారు.
       
ఎవరీ దెయ్యాలు
? ఎందుకు వూరంతా దెయ్యాలు వుంటున్నాయి? భైరవకోన వూరి కథ ఏమిటి? ఆ వూళ్ళో దెయ్యాల మధ్య ఇరుక్కున్న ముగ్గురూ ఎలా తప్పించుకున్నారు? మధ్యలో బసవ ప్రేమించిన భూమి (వర్షా బొల్లమ్మ) ఎవరు? ఆమె ఏమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఫాంటసీ జానర్ కథ. అయితే ఇందులో ఏదో ఒక జానర్ కాకుండా హార్రర్, అతీంద్రయ శక్తులు, పురాణం, జాంబీ హార్రర్ జానర్లన్నీ కలిపేసి ఏదీ ఫీలవకుండా రస భంగం కలిగిస్తూ పోయాడు దర్శకుడు. భైరవకోనకి  శ్రీకృష్ణ దేవరాయలి కాలంలో గరుడ పురాణంతో కల్పిత కథ చేసి- దాని చుట్టూ హార్రర్, అతీంద్రయశక్తులు, జాంబీ హార్రర్ జానర్లు తెచ్చి కలిపారు. సజాతి జానర్లతో మల్టీజానర్ కథ చేసి చూపించవచ్చు, విజాతి జానర్లతో కాదు. గరుడ పురాణం కేంద్రంగా కథ వున్నప్పుడు స్పిరిచ్యువల్ థ్రిల్లర్ జానర్ చేస్తే సరిపోయేది. కార్తికేయ2 లాగానో, హనుమాన్ లాగానో ఆకట్టుకునేది.
       
గరుడపురాణం ప్రకారం చచ్చిన వాళ్ళు కర్మల్ని బట్టి స్వర్గ నరకాలకి పోతారని
, కోపం, ద్వేషం, పగ వున్న ఆత్మలు భైరవ కోనకి చేరుతాయని, ఇక్కడ పెద్దమ్మ (వడివుక్కరసు) అనే ఆవిడ వాళ్ళని మంచి ఆత్మలుగా మారుస్తుందనీ ఏదేదో కల్పితాలు చేశారు. ఇదేమీ అతకలేదు. శంకర్ తీసిన అపరిచితుడు లో గరుడపురాణంలో చెప్పిన శిక్షల ప్రకారం అవినీతి పరుల్ని శిక్షిస్తూ వుంటాడు విక్రమ్. ఇది అతికి సినిమా సూపర్ హిట్టయ్యింది.
       
రాజప్ప (రవిశంకర్) అనే అతను కూతురి పెళ్ళికి దాచిన నగల్ని పనివాడు (జయప్రకాష్) దోచుకునిపోయి ధనవంతుడవుతాడు. ఆ నగల్నే ఇతడి కూతురి పెళ్ళిలోంచి బసవ దోచుకుపోతాడు. ఆ నగలే భైరవకోనలో దెయ్యమై వున్న రాజప్ప లాక్కుంటాడు. వీటిని తిరిగి సంపాదించి తను ప్రేమిస్తున్న భూమి (వర్ష) కి ఇవ్వాలన్నది బసవ లక్ష్యం. అయితే ఈ స్పష్టంగా వున్న పాయింటుని రకరకాల జానర్ల కథనాలతో అర్ధమవకుండా
, ఫాలో అవకుండా గజిబిజి చేశారు. బసవ మొదట రాజప్ప నుంచి నగల కోసమని, తర్వాత ప్రేమిస్తున్న భూమి కోసమనీ అంటూ కథని విరిచి కథనం చేయడంతో మరీ ముఖ్యంగా సెకండాఫ్ తేలిపోయింది. 
       
ఫస్టాఫ్ కథని సెటప్ చేస్తూ సవ్యంగా సాగినా
, ఇంటర్వెల్లో భైరవకోనలో ఉన్నవి దెయ్యాలని రివీల్ చేశాక, సెకండాఫ్ పూర్తిగా ఆ దెయ్యాల గోలతో అభాసు అయింది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు కూడా అర్ధం గావు. ముగింపు హడావిడిగా కానిచ్చేశారు. ప్రేక్షకులతో కనెక్షన్ తెగిపోయిన సెకండాఫ్ అనాధగా మిగిలింది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన వాళ్ళే కాదు, ఉన్న వూరు విడిచి ఒంటరిగా వెళ్ళిన వాళ్ళు కూడా అనాధలేలని ఈ సినిమాలో డైలాగు వుంది. కథని రెండుగా విరిచేసిన సెకండాఫ్ కూడా అనాధేనని తెలుసుకుని వుండాల్సింది.
       
ఇన్ని జానర్లతో ఇంత హడావిడీ చేసే సినిమాలో థ్రిల్లింగ్ దృశ్యాలు
, ఎమోషనల్ డ్రామాలు, కట్టి పడేసే సస్పెన్సు కూడా లేకపోవడం విచిత్రం. ప్రారంభంలో సందీప్ కిషన్ క్యారక్టర్ నగలతో పారిపోతున్నప్పుడే వాటికి ప్రేమించిన అమ్మాయితో లింకు వుందని చెప్పేసి వుంటే, ఆ అమ్మాయి కోసం అన్వేషణే ఏకైక లక్ష్యంగా పోరాటమని ఎస్టాబ్లిష్ చేసి కథని కిక్ స్టార్ట్ చేసివుంటే, బలంగా ముందుకు దూసుకుపోయేది.

నటనలు - సాంకేతికాలు

సందీప్ కిషన్ కి చాలాకాలం తర్వాత మంచి పాత్రే దక్కింది. దీన్ని కష్టపడి నటించాడు. అయితే ప్రేమ ప్రధానమైన కథలో ప్రేమికుడుగానే కనిపించకపోవడం పెద్ద లోపం. హీరోయిన్ వర్షతో ప్రేమ ఎక్కడో సెకండాఫ్ లో రివీల్ అవడంతో అప్పటివరకూ రోమాంటిక్ యాంగిల్ లేని డ్రై పాత్రగా మిగిలాడు. రెండో హీరోయిన్ కావ్య, సందీప్ కిషన్ భైరవ కోనకి చేరేందుకు ఒక సహాయపాత్రగా మిగిలింది. సందీప్ కి వైవా హర్షతో కామెడీ ఎంటర్ టైన్ చేస్తాయి. అలాగే యాక్షన్ సీన్లు బావున్నాయి.
       
హీరోయిన్ వర్షకి లవ్ ట్రాక్ తెగి పోవడంవల్ల హీరోయిన్ గా ప్రభావం చూపించాడు. రెండు పాటల్లో తనే కనిపిస్తుంది. సెకండ్ హీరోయిన్ కావ్య సందీప్ పక్క వాద్యంగా వుంటుంది. ఈ సినిమాలో అత్యంత ఫన్నీ సీన్స్ వెన్నెల కిషోర్- వైవా హర్షల మధ్య వున్నాయి. ఇద్దరి మధ్య డైలాగులు బాగా పేలాయి. ఇక దెయ్యాలుగా నటించిన సీనియర్
, జూనియర్ నటులందరూ మామూలే. వూళ్ళో తిరిగే ఈ దెయ్యాలు జాంబీ సినిమాల్లో నడిచే శవాలుగా కన్నా పిచ్చి వాళ్ళుగా కనిపిస్తారు. వూరంతా పిచ్చి వాళ్ళుగా కన్పిస్తూంటారు. 2012లో అక్షయ్ కుమార్ నటించిన జోకర్ అనే సైన్స్ ఫిక్షన్ లో ఇలాగే వూరంతా పిచ్చి వాళ్ళ పాత్రలుంటాయి. సినిమా ఫ్లాపయ్యింది.
       
కథా కథనాలు వదిలేస్తే
, దర్శకుడు ఆనంద్ చిత్రీకరణ విషయంలో టాలెంట్ చూపించాడు. గ్రాఫిక్స్ కి చాలా పని వున్న ఈ సినిమాలో  హైక్వాలిటీ విజువల్స్ ని సృష్టించాడు. అలాగే సెట్స్, కళా దర్శకత్వం బాగా ఖర్చుపెట్టి సమకూర్చాడు. కెమెరా మాన్ రాజ్ తోట, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఈ సినిమాతో హైలైట్ అవుతారు. ఫస్టాఫ్ ఎంటర్ టైనర్ గా, సెకండాఫ్ అదో టైపుగా వున్న ఈ మిక్సీలో వేసిన ఫాంటసీ బాక్సాఫీసుకి మాత్రం సస్పెన్సే!
—సికిందర్


Wednesday, February 14, 2024

1404 : స్క్రీన్ ప్లే సంగతులు

 

      తెలుగులో లో- బడ్జెట్ సినిమాల పరిస్థితి తెలిసిందే. గత సంవత్సరం కూడా 113 విడుదలైతే నాలుగే హిట్టయ్యాయి. 113 లో 109 సినిమాలు ఫ్లాపయ్యాయి. సక్సెస్ శాతం 3.5 మాత్రమే. ప్రతీ సంవత్సరం ఇదే పరిస్థితి. అందుకని ఎందుకు తీయాలి లో- బడ్జెట్ సినిమాలు? తీస్తున్న వాటిలో 96.5 శాతం అడ్రసు లేకుండా పోతూంటే ఎందుకు తీయడం ? కొత్త మేకర్లకి  తక్కువ-బడ్జెట్ సినిమాల రూపకల్పనలో తమ సామర్థ్యం మేరకు ఓ  అవగాహన మాత్రమే వుంటే సరిపోతుందా? సక్సెస్ ని ఎలా సాధిస్తారు? సక్సెస్ ని సాధించడం వుండదు, సక్సెస్ ని పుట్టించడమే వుంటుంది. సక్సెస్ ని సాధించాలనే ఆలోచనలోనే  సూక్ష్మ దృష్టి వుండదు, స్థూల దృష్టితో ఏదో ఓవరాల్ గా సబ్జెక్టుని వూహించేయడమే వుంటుంది. కానీ సక్సెస్ ని పుట్టించాలనుకోవడంలో  ఆద్యంతం ఆ సక్సెస్ ని ఇటుక ఇటుక వేసి పుట్టిస్తూ పోగల సూక్ష్మ దృష్టీ, దాన్ని పట్టి పట్టి చేసుకుపోగల కృషీ వుంటాయి. పుట్టించడం వేరు, సాధించడం వేరు. పుట్టిస్తేనే కదా సాధించేది. భారీ బడ్జెట్ సినిమాలకి చాలా సౌకర్యాలుంటాయి. అవన్నీ కూడేసుకుని స్థూల దృష్టితో చేస్తే సరిపోతుంది. లో -బడ్జెట్ కి చాలా నిజాయితీతో కూడిన ఫాషన్, పట్టుదలా కావాలి. ఫాషన్ లేకపోతే తీయకూడదు. నిజాయితీగల ఫాషన్ వుండి కూడా పట్టుదల లేకపోయినా తీయకూడదు. లో- బడ్జెట్ సినిమాకి సక్సెస్ ని పుట్టించడానికి ఈ రెండూ ముఖ్యం.
        
కొత్తగా ఒక లో- బడ్జెట్ తీసిన తమిళ మేకర్ రాంకుమార్ బాలకృష్ణన్ పార్కింగ్ తో ఇదే చేశాడు. లో- బడ్జెట్ కథ ఫార్ములాగా వుంటే వర్కౌట్ కానీ రోజులివి. ప్రాక్టికల్ గా వుండాల్సిందే. దీన్ని కష్టపడి ప్రాక్టీసు చేయాల్సిందే. ఈ దర్శకుడు ఎలా ప్రాక్టీసు చేశాడో చూద్దాం...

కాన్సెప్ట్

ఐటీ ప్రొఫెషనల్ ఈశ్వర్‌ (హరీష్ కళ్యాణ్)గర్భవతి అయిన అతడి భార్య ఆతిక (ఇందుజ) కొత్తగా ఒకింటి పై పోర్షన్ లోఅద్దెకి దిగుతారు. కింది పోర్షన్ లో మునిసిపాలిటీలో ఈవో అయిన ఏకరాజు (ఎం ఎస్ భాస్కర్), అతడి భార్య (రామా రాజేంద్ర), బీటెక్ చదివే కూతురు అపర్ణ (ప్రార్థనా నాథన్) వుంటారు. ఏకరాజు చాలా నిజాయితీగల ప్రభుత్వ అధికారి. కానీ పాతకాలపు జిత్తులమారి మనిషి. ఆధునిక సమాజంతో సంబంధం లేకుండా జీవిస్తూ, భార్యాకుమార్తెల చిన్న చిన్న కోరికల్ని కూడా తీర్చని పిసినారిలా  వుంటాడు. దీనికి భిన్నంగా ఈశ్వర్ 5 నెలల గర్భవతి అయిన భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ, హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఇబ్బంది పడకూడదని కారు కూడా కొంటాడు.
        
ఈశ్వర్ కారు కొనే వరకూ రెండు కుటుంబాలు మొదట్లో
 బాగా కలిసిపోతాయి.  పదేళ్ళుగా ఈ ఇంట్లో వుంటున్న ఏకరాజు ఇది వరకు  పై పోర్షన్లో  అద్దెకుకున్న వాళ్ళకి  ఎప్పుడూ కారు లేకపోవడంతో, ఇంటి ముందున్న చిన్న కాంపౌండులో తన బైక్ పార్క్ చేసుకుని తనే వాడుకుంటున్నాడు. ఈ కాంపౌండులో ఈశ్వర్ కారు తెచ్చి పెట్టడంతో గేటు లోంచి బైకు వెళ్ళడానికి కూడా ఇరుకైపోతుంది ఏకరాజుకి. దీంతో గొడవపడతాడు.
        
పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న తగాదాలు పెరిగి పెరిగి పెద్దవై బద్ధశత్రువులైపోతారు. ప్రాణాలు తీసేందుకూ వెనుకాడరు. ఇలా ఇద్దరి మధ్య కఠినంగా మారిన సమస్య ఎలా పరిష్కారమైందనేదే స్టోరీ అయిడియా లేదా కాన్సెప్ట్.

కాన్సెప్ట్ సార్ధకత

ఒక కాన్సెప్ట్ లేదా స్టోరీ ఐడియాని బిగ్ బడ్జెట్ కి స్థూలంగా ఆలోచిస్తే, ఉదాహరణకి-  గుంటూరు కారం లో మహేష్ బాబు- ప్రకాష్ రాజ్ ల మధ్య సంతకం గురించి గొడవ లాంటిది. ఏ కాన్సెప్ట్ బలంగా వుండాలన్నా 1. ముందు అది ప్రకటించే కాన్ఫ్లిక్ట్ బలంగా వుండాలి, 2. ఆ కాన్ఫ్లిక్ట్ కి దారి తీసే కారణం ప్రేక్షకుల్ని ఒప్పించేదిగా వుండాలి, 3. ఆ ఒప్పించే కారణంలోంచి కథకి చోదక శక్తిలా సహజమైన భావోద్వేగాలు ప్రజ్వరిల్లాలి. గుంటూరు కారం లో సంతకం గురించిన కాన్ఫ్లిక్ట్ లో ఈ మూడు టూల్స్ లేవు. ఒరిజినల్ గా ఆలోచిస్తే అసలు ఈ కాన్ఫ్లిక్ట్ లో సంతకం ప్రసక్తే రాదు. ఎందుకంటే, మహేష్ బాబు తల్లి రమ్యకృష్ణ ఆమె తండ్రి ప్రకాష్ రాజ్ గుప్పెట్లో బందీ అయిపోయి ఆడించినట్టూ ఆడుతూ  నరకం అనుభవిస్తోంది. అప్పుడు ఆ నరకంలోంచి మహేష్  బాబు ఆమెకి ఎలా విముక్తి కల్గిస్తాడనే ప్రేక్షకుల్ని ఒప్పించే కాన్ఫ్లిక్ట్ తో కథ అవ్వాలి. సంతకం కోసం కాన్ఫ్లిక్ట్ అనేది సినిమాకి చాలని చిల్లర తగాదా అయింది.
       
కానీ పైన చెప్పుకున్నట్టు
, భారీ బడ్జెట్ కి చాలా సౌకర్యాలుంటాయి కాబట్టి, స్థూల దృష్టితో అలా కథ చేసేస్తే సరిపోతుందనుకున్నట్టుంది.  అయితే సినిమా ఒక సంతకం గురించే తీసినా, దీనికైనా సూక్ష్మ దృష్టితో కథనం చేయాలని కూడా అనుకోలేదు. స్థూల దృష్టితో- సంతకం పెట్టు- పెట్టను- సంతకం పెడతావా లేదా- పెట్టనంటే పెట్టను- ఇలా ఇంటర్వెల్ దాకా కథ అక్కడే వుంటూ, అవే సీన్లు రిపీటవుతూ వుంటాయి. సూక్ష్మ దృష్టితో చేసి వుంటే, ఆ సంతకమనే పాయింటు కొత్త మలుపులు తిరుగుతూ కథని విస్తరించుకుంటూ పోయేది. ఒకసారి సంతకం అడిగితే పెట్టనన్నాక- ఇక సంతకం గురించి అడగకుండా, మహేష్ బాబు సీక్రేట్స్ లాగి అల్లరి చేయ వచ్చు, ఇది ఇంకెక్కడికో దారి తీయొచ్చు, ఇందులోంచి ఇంకా కథ లాగితే మహేష్ బాబు ఫ్యూచర్ నే నాశనం చేసే తీరానికి కూడా కథ చేరుకోవచ్చు.  పార్కింగ్ అనే లో- బడ్జెట్ కి సృష్టించిన కాన్ఫ్లిక్ట్ ని ఇలా సూక్ష్మ దృష్టితోనే కథా విస్తరణ చేశాడు.


       అయితే ఈ కాన్సెప్ట్ ని ఏ జానర్ ఎలిమెంట్స్ తో విస్తరిస్తే మార్కెట్ యాస్పెక్ట్ వుంటుంది? ఈ కాన్సెప్ట్ ని సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఎలిమెంట్స్ తో, దానికుండే పేసింగ్ తో  విస్తరిస్తే మార్కెట్ యాస్పెక్ట్ వుంటుందని భావించాడు. ఇక్కడొకటి గమనించాలి- అసలు ముందుగా ఈ కాన్సెప్ట్ సినిమా కథకి పనికొస్తుందా లేదా అని మార్కెట్ యాస్పెక్ట్ దృష్టితో పరిశీలిస్తే, పార్కింగ్ సమస్య లాంటి అల్ప విషయం రెండు గంటల సినిమా కథగా విస్తరించాలంటే కష్టమే. గుంటూరు కారం లో అల్పంగా కనిపిస్తున్న సంతకం పాయింటు లాగా.
       
షార్ట్ ఫిలిం ఐడియాని అలాగే సినిమాగా తీస్తే ఏం జరిగిందో ఉదాహరణలున్నాయి. 2016 లో శర్వానంద్ తో తీసిన
ఎక్స్ ప్రెస్ రాజా లో హీరోయిన్ ఓ చిన్న కుక్క పిల్ల గురించి హీరోతో విడిపోవడం స్టోరీ అయిడియా. షార్ట్ ఫిలిం కి సరిపోయే ఈ స్వల్ప విషయం సినిమాకెలా సరిపోతుంది? ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యురాలు మహువా మోయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ మోయిత్రా పెంచుకుంటున్న కుక్కపిల్లని అడిగితే ఆమె ఇవ్వలేదన్న గొడవ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేదాకా వెళ్ళి- మధ్యవర్తులతో, పారిశ్రామిక వేత్తలతో అనేక మలుపులు తిరిగి- చివరికి ఆమె లోక్ సభ సభ్యత్వపు పాస్ వర్డ్ మరొకరికి ఇచ్చిందన్న క్లయిమాక్స్ కి చేరి, సభ్యత్వమే కోల్పోవడంతో ముగిసింది.

అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ పూర్వం కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు రాహుల్ గాంధీని కలవడానికిపోతే, ఆయన పట్టించుకోకుండా కుక్కకి బిస్కెట్లు తినిపిస్తూ కూర్చున్నాడన్న అవమానంతో బిజెపిలోకి చేరిపోయి ముఖ్యమంత్రి అయిపోయి- రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేస్తూ అస్సాం కొస్తే, కుక్క- బిస్కెట్లు ఇన్సల్టింగ్ సీను మెదిలి పగ సాధించడం మొదలెట్టాడు- రాహుల్ యాత్రకి నానా ఆటంకాలు కల్పిస్తూ, కేసులు పెట్టి అరెస్టు చేయిస్తాననే దాకా పోయాడు. కాకపోతే ఎండింగ్ పెండింగులో పెట్టాడు- ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తానన్నాడు. ఇప్పుడు చేస్తే ఎన్నికల్లో బెడిసి కొడుతుందని.
       
ఇలా స్వల్ప కారణమనుకున్నది పెద్ద సంఘర్షణగా ఎందుకు విస్ఫోటిస్తోంది
? ఇగోల వల్లే. పరస్పరం ఇగోల ప్రకోపం వల్లే యాక్షన్ రియాక్షన్ల సంకుల సమరం మొదలైపోతోంది. ఈ మనస్తత్వాల్ని ముట్టుకోకుండా పైపైన కామెడీలు చేయడం వల్ల ఎక్స్ ప్రెస్ రాజా ఫెయిలైంది. ఇగో అనేది పవర్ఫుల్ టూల్. దాంతో పుట్టే కాన్ఫ్లిక్ట్ అగ్నిపర్వతం బద్ధలవడం లాంటిది. పార్కింగ్ లో పార్కింగ్ దగ్గర గొడవ అనే స్వల్ప కారణం ఇగోల సంఘర్షణ అనే టూల్ ని ప్రయోగించడం వల్లే అంత బలమైన కాన్ఫ్లిక్ట్ ని సృష్టించ గలిగింది.
       
అయితే ఇగోతో రెండు రకాల కథనాలుంటాయి. పుట్టిన ఇగోని మనసులో పెట్టుకుంటే సంఘర్షణకి గ్యాప్ వస్తుంది. దాంతో ఇంకెప్పుడో దానికదే అవకాశం వస్తే అప్పుడు పగదీర్చుకునే మొదటి రకం కథనం (అస్సాం ముఖ్యమంత్రి విషయంలోలాగా)
, ఇది పాసివ్ ఇగో. ఇలాకాకుండా, పుట్టిన వెంటనే ఆగకుండా అంతు చూసే యాక్టివ్ ఇగో రెండో రకం కథనానికి దారి తీస్తుంది (మహువా మోయిత్రా విషయంలోలాగా). ‘పార్కింగ్ కాన్సెప్ట్ విషయంలో దర్శకుడు ఈ రెండో రకమే తీసుకున్నాడు. తీసుకున్న కాన్సెప్ట్ ని వర్కౌటయ్యే మార్కెట్ యాస్పెక్ట్ ఇలా యాక్టివ్ ఇగోలతో కూడిన క్రియేటివ్ యాస్పెక్ట్ తో జోడిస్తేనే వస్తుందని నిర్ణయించినట్టు కనిపిస్తోంది.

ఇప్పుడు క్రియేటివ్ యాస్పెక్ట్ కొస్తే, దీనికి ఏ జానర్ ట్రెండీగా వుంటుంది? ఓటీటీలు ట్రెండ్స్ సెట్ చేస్తున్నాయి కాబట్టి దీనికి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఎలిమెంట్స్ తో కథనం చేశాడు. యాక్టివ్ ఇగోలకి ఇదే వర్కౌటవుతుంది. సీను సీనుకీ మలుపులు తీసుకునే కథనంతో, డైనమిక్స్ తో. వెంట వెంటనే జరిగిపోయే సెటప్స్- పే ఆఫ్స్ తో. అంతకంతకూ పెరిగిపోయే టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ తో, క్యారక్టర్ ఆర్క్స్ తో. కళ్ళు తిప్పి ఏ సీను మిస్సయినా కథ అర్ధం గాని అటెన్షన్ స్పాన్ డిమాండ్ తో.
       
తీసుకున్న కాన్సెప్ట్ కి   దానికవసరమయ్యే టూల్స్ తో మార్కెట్ యాస్పెక్ట్ ని కల్పించాలని ఇటీవల కూడా ఏ సినిమా విషయంలో ఆలోచించారు
? సైంధవ్? నా సామి రంగ? గుంటూరు కారం? ఈగల్? లాల్ సలాం? ఏ సినిమా విషయంలో? మరెందుకు సినిమాలు తీస్తున్నట్టు?
       
ఐతే
పార్కింగ్ లో కాన్సెప్ట్ ని ఇంకా విశాల దృష్టితో చూడాల్సి వుంది. ఇది జరగ లేదు. ఇందులో రెండు ఇగోల సంఘర్షణ ముగింపుకి చేరినప్పుడు, ఇంకా పరిపూర్ణంగా చేరలేదు. ఎందుకంటే న్యాయం శత్రువుని వ్యక్తిగత శత్రువనుకుని శిక్షించదు. ఎందుకు శిక్షిస్తుందంటే, పరివర్తన చెందుతాడని, పాఠాలు నేర్చుకుంటాడని. అదే ఆవేశం వ్యక్తిగత శత్రువనుకుని శిక్షిస్తుంది. నాశనాన్ని చూసి తృప్తి పడుతుంది.
       
ఈ కాన్సెప్ట్ లో హీరో పాత్ర
, సీనియర్ పాత్ర ఇగోలతో తలపడినప్పుడు, సీనియర్ పాత్ర హీరోపాత్రని మార్చడం కోసం పడే సంఘర్షణగా,  హీరో పాత్ర సీనియర్  పాత్ర నాశనం కోసం చేసే ఘర్షణగా పాత్రచిత్రణ లుంటే - ముగింపు పరిపూర్ణంగా, ఆలోచనాత్మకంగా, ప్రయోజనాత్మకంగా వుండేది. న్యాయంతో సీనియర్ పాత్ర, ఆవేశంతో హీరో పాత్ర.  సీనియర్ పాత్ర చివర్లో మెచ్యూర్డ్ ఇగోగా తన ఉద్దేశం బయటపెట్టి వుంటే, కథా లక్షణానికి న్యాయం జరిగేది. కథంటే ఇగో మెచ్యూర్డ్ ఇగోగా ఎదిగినట్టు చూపించడమేగా?
—సికిందర్
(రేపు : యాక్ట్స్ లో ఫ్యాక్ట్స్)