దర్శకత్వం : శ్యామ్ బెనెగల్
తారాగణం: ఆరిఫిన్ షువో, నుస్రత్
ఇమ్రోస్ తిషా, తౌకిర్ అహ్మద్, నుస్రత్
ఫరియా, దీపక్ అంటానీ, రజిత్
కపూర్ తదితరులు
రచన : అతుల్ తివారీ, షమా జైదీ, సంగీతం : శంతనూ మోయిత్రా, ఛాయాగ్రహణం : ఆకాష్ దీప్ పాండే
బ్యానర్స్ : బంగ్లాదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
విడుదల : అక్టోబర్ 27, 2023
***
దాదాపు 14 ఏళ్ళ
తర్వాత 88 ఏళ్ళ విఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ సినిమా వెండి తెరని పావనం
చేసింది. ఈసారి బృహత్ ప్రణాళికతో ఇండో- బంగ్లా ప్రభుత్వాల సంయుక్త నిర్మాణంలో బంగ
బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ జీవిత చరిత్రని తలపెట్టారు. 2008 లోనే ‘పొయెట్ ఆఫ్ పాలిటిక్స్’
పేరుతో బయోపిక్ తీయాలని వేరే నిర్మాతలు అనుకున్నారు. దీనికి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం
వహిస్తారని , అమితాబ్
బచ్చన్ ముజిబుర్ రెహ్మాన్ గా నటిస్తారనీ ప్రచారం జరిగింది. 2010 లో హాలీవుడ్ లో ఇంకో
ప్రతిపాదన తెరపై కొచ్చింది. చివరికి 2021 లో ఇండో- బంగ్లా సంయుక్త నిర్మాణంలో
శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైంది. నిర్మాణం పూర్తి చేసుకుని అక్టోబర్
13న బంగ్లాదేశ్ లో విడుదలై విజయం సాధించాక, అక్టోబర్ 27 న
ఇండియాలో విడుదలైంది. ఈ నేపథ్యంలో బాల్యం నుంచీ మరణం వరకూ ముజిబుర్ రెహ్మాన్
జీవితాన్ని చిత్రించిన ఈ బయోపిక్ ఎలా వుందో తెలుసుకుందాం...
షేక్
ముజిబుర్ రెహ్మాన్ (అరిఫిన్ షువూ) భార్య రేణూ (నుస్రత్
ఇమ్రోజ్ తీషా) దృక్కోణం నుంచి ఈ కథ సాగుతుంది. ముజీబ్ బాల్యం, రాజకీయాల్లో తొలి అడుగులు, పాకిస్తాన్
చారిత్రక నేపథ్యం, తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) పైన పాక్ పాలకుల భాషా వివక్ష, బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్తానీయులు తక్కువ జాతి ముస్లిములుగా పరిగణించడం, ఢాకాకు చెందిన రాజకీయ నాయకుడు హసన్ షాహిద్ సుహ్రావర్ది (అహ్మద్
తౌకీర్) ముజిబుర్
రెహ్మాన్ (ఆరిఫిన్ షువో) తో కలిసి అవామీ లీగ్ పార్టీ
ఏర్పాటు చేయడం, ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం, పాక్ పాలకుల అరాచకాలు, ముజీబ్ ముక్తి వాహిని పేరిట గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి పాక్
సైన్యం మీద దాడులు చేయడం. ఈ పోరాటంలో కోటి మంది శరణార్ధులుగా ఇండియాలో చొరబడడం...
ఇలా 1971 లో ఇండో - పాక్ యుద్ధానికి దారితీసే పరిస్థితులన్నీ కలిసి
వచ్చి, యుద్ధంలో
ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ ని ఓడించి రెండు ముక్కలు చేయడం, దొరికిన ఒక ముక్క పట్టుకుని పాక్ పాలకులు దీనంగా చూస్తూంటే, తూర్పు పాకిస్తాన్ ముజిబుర్ రెహ్మాన్ ప్రధానిగా బంగ్లాదేశ్ గా ఘనంగా అవతరించడం, ఆ తర్వాత 1975 లో సైనిక తిరుగుబాటులో ముజిబుర్ రెహ్మాన్ కుటుంబం సహా
హతమవడంతో ముగుస్తుంది (ఈ సమయంలో ముజిబుర్ కుమార్తె, ప్రస్తుత
ప్రధాని షేక్ హసీనా విదేశాల్లో వున్నారు). ఇదీ ఈ బయోపిక్ కథ.
ఈ మధ్య ఒక రాజకీయ పరిశీలకుడు మన
దేశాన్ని మతదేశంగా మార్చి ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే వేషం, ఒకే జాతిగా ప్రజల మీద రుద్దితే నిలబడదని
విశ్లేషించాడు. ఇది నిజమే అన్నట్టు ముజీబ్ బయోపిక్ చూస్తే అర్ధమవుతుంది. భిన్న
జాతి, సంస్కృతి, భాష వున్న తూర్పు
పాకిస్తాన్ ని, పశ్చిమ పాకిస్తాన్ తో కలిపి మతదేశంగా ఏర్పాటు
చేసి, వాళ్ళ మీద ఉర్దూ భాష రుద్దితే జరిగిన రాద్ధాంతమే యుద్ధంతో
ప్రత్యేక దేశంగా ఏర్పడడం. ఇండియాలో ఇలాటి యుద్ధాలు ఎన్ని జరుగుతాయో చెప్పలేం.
బంగ్లాదేశ్ ని మతపరమైన ప్రాతిపదికన ఏర్పాటు చేయలేదు. కానీ ఆనాడు జిన్నా బెంగాలీ భాషకి ఉర్దూకి వున్నంత ప్రాముఖ్యాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. ఉపఖండ చరిత్రకి సంబంధించిన ఈ వివరాల గురించి తెలియని వారికి, శ్యామ్ బెనెగల్ తీసిన ఈ బయోపిక్ లైవ్ డెమో లాగా వుంటుంది. ముగింపు షాకింగ్ గా వుంటుంది.
అయితే నిడివి రెండు గంటల 45 నిమిషాలు మరీ ఎక్కువ. సెకండాఫ్ లో చాలా చోట్ల విసుగు పుట్టిస్తుంది. తివారీ - జైదీ చేసిన రచన తగిన భావోద్వేగాల్ని ప్రేరేపిస్తుంది. డ్రామా కూడా ఆసక్తికరంగా వున్నప్పటికీ, పొరుగు దేశానికి సంబంధించిన కథ కావడంతో ఇక్కడ మన ప్రేక్షకులకి బంగ్లాదేశ్ సినిమా కొత్త. ప్రధాన పాత్రలు తప్పితే ఇతర పాత్రలతో, నటులతో కనెక్ట్ కావడం కష్టం. చిన్నప్పటినుంచీ ముజిబుర్ రెహ్మాన్ కుటుంబ పరివారంలో ఎంతమంది వుంటారో లెక్కబెట్టడం కూడా కష్టమే.
ఒక ఏరియల్ షాట్, దానికి సమయానుకూలమైన పాట, ఆ పాటకి విజయంతో ప్రస్ఫుటమయ్యే ముజీబ్ మానసిక స్థితి- వీటిని క్యాప్చర్ చేసే మొదటి సన్నివేశమే బెనెగల్ చిత్రీకరణ నైపుణ్యం పట్టు సడలలేదని తెలుపుతుంది.
షేక్ ముజిబుర్ రెహ్మాన్‌గా ఆరిఫిన్ షువూ పూర్తిగా సరిపోయాడు.
హావభావాలు, శరీర భాష, సంభాషణ ముజీబ్ సరీగ్గా బ్యాలెన్స్
అయ్యాయి. అతడిభార్య రేణూగా నుస్రత్ ఇమ్రోస్ తీషా చాలా సహజంగానూ, సుహ్రావర్దిగా తౌకీర్
అహ్మద్ హుసేన్ అద్భుతంగానూ నటించారు. ముజీబ్ కుమార్తె హసీనాగా నుస్రత్ ఫరియా నటించింది. పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోగా రజిత్ కపూర్, మహాత్మా గాంధీగా దీపక్ అంటానీ,
ముజీబ్ హంతకుడు నూర్ చౌదరిగా రోహన్ రాయ్ నటించారు.
శంతనూ మోయిత్రా సంగీతం, అతుల్ తివారీ సాహిత్యం సినిమా మూడ్‌కి అనుగుణంగా వున్నాయి. ఆకాష్‌దీప్ పాండే ఛాయాగ్రహణం క్లాస్ గా వుంది. షామ్ కౌశల్ యాక్షన్, స్టంట్ సీన్స్ రియలిస్టిక్ గా వున్నాయి. శుక్రాచార్య ఘోష్, విష్ణు నిషాద్, నితీష్ రాయ్ ల కళా దర్శకత్వం, అసీమ్ సిన్హా ఎడిటింగ్ తో బాటు హిందీ డబ్బింగ్ బావుంది.
—సికిందర్