రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, November 1, 2023

1373 : రివ్యూ

రచన- దర్శకత్వం : విధూ వినోద్ చోప్రా
తారాగణం : విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, ప్రియాంశూ ఛటర్జీ, సంజయ్ బిష్నోయి, హరీష్ ఖన్నా తదితరులు
కథ : అనురాగ్ పాఠక్, సంగీతం :  శంతనూ మోయిత్రా, ఛాయాగ్రహణం : రంగరాజన్ రామభద్రన్
బ్యానర్ : వినోద్ చోప్రా ఫిలిమ్స్, జీ స్టూడియోస్
నిర్మాతలు : విధూ వినోద్ చోప్రా, యోగేశ్ ఈశ్వర్
విడుదల : అక్టోబర్ 27, 2023
***

        మున్నాభాయ్ ఎంబిబిఎస్, పీకే, త్రీ ఇడియెట్స్ వంటి ప్రసిద్ధ సినిమాల నిర్మాత, 1942-ఏ లవ్ స్టోరీ, పరిందా, మిషన్ కాశ్మీర్ ల వంటి హిట్ సినిమాల దర్శకుడూ విధూ వినోద్ చోప్రా, తాజాగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ‘12th ఫెయిల్ - విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ తీసిన రియలిస్టిక్ సినిమా. ఇందులో ఇటీవల పేరు తెచ్చుకుంటున్న చిన్న సినిమాల హీరో విక్రాంత్ మాస్సే హీరో. మేధా శంకర్ కొత్త హీరోయిన్. ఇలా విద్యపై విద్యార్థులకి ఈ రియలిస్టిక్ సినిమా ద్వారా చూపించిన చదువుల ప్రపంచం ఎలా వుందో చూద్దాం...

కథ

    1997 లో మనోజ్ శర్మ (విక్రాంత్ మాస్సే) మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయ ప్రాంతంలో నివసిస్తూంటాడు. నిజాయితీగల తండ్రి రామ్‌వీర్ శర్మ (హరీష్ ఖన్నా), ప్రేమగల తల్లి పుష్ప (గీతా అగర్వాల్), సోదరుడు కమలేష్ (రాహుల్ కుమార్), సోదరి రజని (పెర్రీ ఛబ్రా), అమ్మమ్మ (సరితా జోషి) లతో కూడిన దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం అతడిది.
       
మనోజ్ కి ఐపీఎస్ అధికారి అవ్వాలని కలలుంటాయి. కానీ
12వ తరగతి పరీక్షల్లో ఫెయిలవుతాడు. ఎందుకంటే బోర్డ్ పరీక్షల్లో ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ చేయించకుండా డీఎస్పీ దుష్యంత్ సింగ్ (ప్రియాంశూ ఛటర్జీ) అడ్డుకున్నాడు. నువ్వు ఐపీఎస్ కావాలంటే ఇలాటి అడ్డమార్గాలు  తొక్కకూడదని డీఎస్పీ మందలించాడు కూడా. తర్వాతి సంవత్సరం థర్డ్ క్లాసులో పాసవుతాడు. ఇక అమ్మమ్మ పొదుపు చేసిన పెన్షన్ డబ్బులు తీసుకుని సివిల్ సర్వీసెస్ పరీక్షలకి ప్రిపేర్ కావడానికి ఢిల్లీకి చేరుకుంటాడు. అతడికి పట్టుదల వుంటుందిగానీ, అందుకు తగ్గ అధ్యయన నైపుణ్యాలు వుండవు. పైగా హిందీ మీడియం చదివాడు. ఉన్నత చదువులపై సరైన అవగాహన  కూడా లేదు. యూపీఎస్సీ, ఐపీఎస్ ప్రొఫైల్ లాంటివి వుంటాయని కూడా తెలియదు. పైగా ఆర్ధిక అసమానతలు, కులతత్వం పొటమరించి వున్నాయి. ఈ నేపథ్యంలో గురువు (అంశుమాన్ పుష్కర్), స్నేహితులతో బాటు, స్నేహితురాలు శ్రద్ధా జోషి (మేధా శంకర్) సహాయంతో సంఘర్షించి తన ఐపీఎస్ కలని ఎలా సాకారం చేసుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ  

    ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్  అధికారి శ్రద్ధా జోషి నిజ జీవిత వృత్తాంతంతో ప్రేరణ పొంది రాసిన ‘12th ఫెయిల్ అన్న నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. నవలా రచయిత అనురాగ్ పాఠక్. బందిపోట్లకి పేరు బడ్డ చాలా వెనుకబడిన చంబల్ గ్రామంనుంచి ఒక హిందీ మీడియం సగటు విద్యార్థి పోలీసు శాఖలోని ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం ఈ కథ చెప్తుంది. 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన మనోజ్‌పై జీవితం, సమాజం, ప్రేమ, స్నేహం విసిరే సవాళ్ళ కథ ఇది.
       
ఇందులో నీతి ఏమిటంటే- ఆర్ధిక అసమానతలు
, అవినీతి, కుల రాజకీయాలున్నప్పటికీ, ఇప్పటికీ మెరిటోక్రాటిక్ (ప్రతిభా స్వామ్యం) మార్గాల ద్వారా యూపీఎస్సీలో విజయం సాధించవచ్చనీ చెప్పడం. ఇంకో సందేశం ఏమిటంటే, మోసగాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చెందరని - ఈ వ్యవస్థలో ఇప్పటికీ చాలా పక్షపాతాలు అలా పాతుకుపోయి వున్నాయనీ- ఇవి మనోజ్ లాంటి కుర్రాళ్ళ జీవితాల్ని కష్టతరం చేస్తున్నాయనీ స్పష్టం చేయడం.  
        
చదువుకోండి, ఆందోళన చేయండి, సంఘటితం కండి, అవినీతి రాజకీయ నాయకులు సమాజంలోని యువత మూర్ఖులుగా వుండాలని, వాళ్ళని అణచివేసి పాలించవచ్చని భావిస్తున్నారనీ కూడా ఈ కథ వెలుగులోకి తెస్తుంది.

ఇదంతా వాస్తవిక కథా చిత్రం శైలిలో చాలా సాఫీగా, సాదాసీదాగా సాగుతుంది. మనోజ్ కి కఠోరంగా పరిశ్రమించడం తెలుసు. కానీ కఠినమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్ని ఎలా క్రాక్ చేయాలో తెలీదు. తెలియక పరీక్షతప్పిన ప్రతీసారీ బాధ పడుతూ కూర్చోక, వెంటనే  రీస్టార్ట్ బటన్ నొక్కి, మళ్ళీ పరీక్షకి సిద్ధమయ్యే అరుదైన పట్టుదలతో వుంటాడు. ఇలా నాలుగుసార్లు జరిగిన తర్వాత, అంతిమంగా ఉత్తీర్ణత సాధించే రహస్యాన్ని తెలుసుకుని, కేటాయించిన సమయంలో డజను 200-పదాల వ్యాసాలు ఎలా రాయాలో నేర్చుకుని పరీక్షని క్రాక్ చేస్తాడు!
       
నిజానికి విద్య గురించి ఇది స్పోర్ట్స్ సినిమా లాంటి థ్రిల్లింగ్ కథ. స్పోర్ట్స్ సినిమాల్లో మెడల్ కొట్టడానికి గెలుపోటముల థ్రిల్
, సస్పెన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కథ ఎలా సాగుతుందో, ఇదే మొదటిసారిగా ఎడ్యుకేషన్ సినిమాకి వర్తింపజేసి రూపకల్పన చేయడం ఇక్కడ ప్రత్యేకత.
        
ఇది ప్రేక్షకుల హృదయాల్ని మెలిదిప్పుతుంది. అదే సమయంలో మధ్యమధ్యలో తేలికపాటి సన్నివేశాలతో అలరిస్తుంది. కథలోని ఎమోషనల్ అండర్ కరెంట్ ఎంత బలంగా వుంటుందో, సరదా సన్నివేశాలతో డ్రామా అంత రంజింపజేస్తుంది. ప్రతీసీనూ ఒక కొత్త విషయంతో వుంటుంది- కథ గురించి గాని, పాత్ర గురించి గాని. డైలాగులు చాలా రియలిస్టిక్‌గా వున్నాయి. అనేక చోట్ల హృదయాల్ని హత్తుకునేలా వున్నాయి.

నటనలు – సాంకేతికాలు

    మనోజ్ శర్మ పాత్ర పోషణలో విక్రాంత్ మాస్సే దాదాపు నూరు శాతం మార్కులు కొట్టేశాడు. అతడి నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ – ఇవన్నీఉన్నతంగా వున్నాయి. అనుభవజ్ఞుడైన విధూ వినోద్ చోప్రా ఇలా నటింపజేశాడు. సినిమా చూసిన తర్వాత చాలా కాలం పాటు ఇది వెంటాడుతుంది. ప్రేమిక శ్రద్ధా జోషిగా మేధా శంకర్‌ కూడా అద్భుతంగా నటించింది.  యూట్యూబ్ లో ఐఏఎస్ క్లాసులు చెప్పే పాపులర్ కోచ్ డాక్టర్ వికాస్ దివ్యకీర్తి కూడా ఇందులో పాఠాలు చెప్తాడు. ఈయన ఇజ్రాయెల్- పాలస్తీనా చరిత్రమీద చేసిన ఆమూలాగ్ర ప్రసంగం యూట్యూబ్ లో ఒక రికార్డు. ఇది నాలుగున్నర గంటలపాటు ఏక బిగిన సాగే ప్రసంగం.
       
ఇందులో సహాయ పాత్రలు లెక్కలేనన్ని వున్నాయి. ఈ నటీనటులందరూ సినిమా మూడ్ ని నిలబెట్టారు.
శంతనూ మోయిత్రా సంగీతం కమర్షియల్ సినిమా సంగీతం కాదు. హిట్ కుర్ర పాటలు ఆశించకూడదు. రంగరాజన్ రామద్రన్ ఛాయాగ్రహణం, హేమంత్ వామ్ కళా దర్శకత్వం రియలిస్టిక్ సినిమా అవసరాల్ని అనుసరించి వున్నాయి.
       
మొత్తం మీద
‘12th ఫెయిల్ హృదయాల్ని హత్తుకునే ఒక సున్నిత కథా చిత్రం. అయితే సరైన ప్రమోషన్ లేకపోవడంతో, పైగా యువతని ఆకర్షించే కమర్షియల్ అప్పీల్ లేకపోవడంతో హిందీలో ఓ మోస్తరు కలెక్షన్ల దగ్గర స్ట్రగుల్ చేస్తోంది. తలుగులో నవంబర్ 4న విడుదలవుతోంది.
—సికిందర్