రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, June 3, 2023

1338 : రివ్యూ!


 

దర్శకత్వం : రాకేష్ ఉప్పలపాటి
తారాగణం : బెల్లంకొండ గణేష్, అవంతికా దాసాని, సముద్రకని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
రచన : కృష్ణ చైతన్య, సంగీతం : మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : అనిత్ కుమార్
నిర్మాత : సతీష్ వర్మ
విడుదల : జూన్ 2, 2023
***

        త సంవత్సరం ‘స్వాతిముత్యం’ అనే ఫ్యామిలీ డ్రామాతో పరిచయమైన బెల్లంకొండ గణేష్ ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చాడు. అల్లరి నరేష్ తో ‘నాంది’ అనే హిట్ తీసిన సతీష్ వర్మ దీనికి నిర్మాత. రాకేష్ ఉప్పలపాటి అనే కొత్త దర్శకుడు దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పూనుకున్నాడు. కొత్త దర్శకుడి సినిమా అనగానే క్రేజ్ వచ్చే పరిస్థితులిప్పుడు లేవు. సినిమాని విడుదల చేశాకే ప్రేక్షకుల్ని మెప్పించి క్రేజ్ ని సృష్టించుకోవాలి. ఇలా క్రేజ్ ని సృష్టించుకోగలిగాడా కొత్త దర్శకుడు? ఇది తెలుసుకుందాం...

కథ

వైజాగ్ లో  సుబ్బారావు (గణేష్) ఒక కాలేజీ స్టూడెంట్. అతడికి ఐ ఫోన్ అంటే పిచ్చి. ఎలాగైనా ఐఫోన్ కి యజమాని కావాలని కష్టపడి 90 వేలు కూడబెట్టి ఐఫోన్ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. ఒకరోజు కాలేజీలో కొట్లాటలు జరిగి పోలీసులు అందరి ఫోన్లు సీజ్ చేస్తారు. అందులోంచి సుబ్బారావు ఐ ఫోన్ పోతుంది. దీంతో పోలీస్ కమీషనర్ వాసుదేవన్ (సముద్రకని) కి ఫిర్యాదు చేస్తాడు. అతను పట్టించుకోక పోవడంతో అతడి కూతురు శృతి (అవంతికా దాసానీ) తో స్నేహం చేసి, ఐ ఫోన్ ని పొందాలనుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో వుండగా ఒక హత్య జరిగి అందులో ఇరుక్కుంటాడు. ఇంతలో తన బ్యాంకు అక్కౌంట్లో కోటీ 75 లక్షలు పడతాయి. ఇప్పుడు తనని హత్య కేసులో ఇరికించిందెవరు? అక్కౌంట్లో డబ్బులు ఎక్కడ్నించి పడ్డాయి? ఐఫోన్ పోవడానికీ హత్యకీ సంబంధమమేమిటి? ఈ కుట్రలోంచి సుబ్బారావు ఎలా బయటపడ్డాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కథ. అయితే దీనికి ఏర్పాటు చేసిన ఐఫోన్, హత్య, అక్కౌంట్లో డబ్బులు అనే నేపథ్యాలు కథతో కనెక్ట్ అవక వీగిపోయాయి. సారమంతా అన్ క్లెయిమ్డ్ బ్యాంక్ అక్కౌంట్ల స్కామ్ తో వుంటుంది. హీరో ఈ స్కామ్ ని ఛేదించి తెలివితేటలతో నేరస్థుల్ని పట్టుకునే థ్రిల్లింగ్ క్లయిమాక్సు తప్ప మిగతాదంతా ఆషామాషీగా వుంటుంది. అంటే కొత్త దర్శకుడి దగ్గర థ్రిల్లింగ్ క్లయిమాక్స్ తప్ప మిగతా కథ లేదన్న మాట. మళ్ళీ ఈ క్లయిమాక్స్ తో కథకిచ్చే ముగింపు వర్కౌట్ కాలేదు.
       
అందుకే ఫస్టాఫ్ ఐఫోన్ పిచ్చితో
, దానికి పేరు పెట్టుకుని పాల్పడే చాదస్తాలతో సాగతీత వ్యవహారంగా వుంటుంది. ఐఫోన్ ని పొందడం కోసం హీరోయిన్ తో సాగించే రోమాన్స్ కూడా సహన పరీక్షే. ఇంటర్వెల్ కి ముందు హత్యతో గానీ కథ ప్రారంభం కాదు.
       
సెకండాఫ్ హీరో హత్య కేసులోంచి బయటపడే – స్టూడెంట్ పవర్ చూపించే కమర్షియల్ ప్రయత్నాలు. ఇదైనా యూత్ అప్పీల్ తో వుండాల్సింది. సస్పెన్స్ థ్రిల్లర్ లో సస్పెన్స్
, థ్రిల్, టెంపో, స్పీడ్, ట్విస్టులు కూడా మర్చిపోతే ఎలా? ఇలా కథ చేసుకోవడంలో ప్రొఫెషనలిజం కొరవడి, విసిగిస్తూ క్లయిమాక్స్ కి చేరి, విశ్వరూపమంతా అప్పుడు చూపించడం! మళ్ళీ దీంతో ముగింపు షరా మామూలు సిల్లీ వ్యవహారమే. ఇలా సినిమా సక్సెస్ అవుతుందా? అన్ క్లెయిమ్డ్ బ్యాంక్ అక్కౌంట్ల స్కామ్ ఎంత మందికి అర్ధమౌతుంది? దీనికెంత బాక్సాఫీసు అప్పీల్ వుంటుంది? ఇది వెబ్ సిరీస్ గా తీయాల్సిన పాయింటు కావచ్చు.

నటనలు- సాంకేతికాలు

సామాన్య స్టూడెంట్ పాత్రలో బెల్లంకొండ గణేష్ సింగిల్ ఎక్స్ ప్రెషన్ తప్ప తన దగ్గర ఇంకేమీ లేదని యువప్రేక్షకులకి హింట్ ఇచ్చాడు. దర్శకుడికి తగ్గ హీరో అన్పించుకున్నాడు. ఇంతకంటే చెప్పుకోవడానికేమీ లేదు. హీరోయిన్ అవంతిక అందచందాలతో యూత్ అప్పీల్ ని కలిగి వుంటుంది- పాత్రకి మాత్రం లాజిక్ వుండదు. పోలీస్ కమీషనర్ గా సముద్రకని కూడా పాత్ర చాలని బాధితుడే. పాత్రమాత్రం కథకి కేంద్ర బిందువుగా ఆసక్తి రేపేదే. పాత్ర పాలన మాత్రం ఎక్కడేసిన గొంగళి. ఇక సునీల్ పాత్ర- సెకండాఫ్ లో తను ప్రవేశించాకే కథలో చలనం వస్తుంది. ఆ తర్వాత తనూ కథా సేదదీరుతాయి. శ్రీకాంత్ అయ్యంగార్ ది కాసేపు హడావిడి.
        
మహతీ స్వర సాగర్ సంగీతంలో పాటలు సినిమా చూస్తున్నంత వరకే ఫర్వాలేదనిపిస్తాయి. అనిత్ కుమార్ కెమెరా వర్క్ గానీ, ప్రొడక్షన్ విలువలుగానీ పొదుపుగా ఖర్చు చేసినట్టు వున్నాయి.

చివరికేమిటి
2021 లో అల్లరి నరేష్ తో నాంది తీసిన నిర్మాత సతీష్ వర్మ, దాన్ని శిక్షాస్మృతి లోని సెక్షన్ 211 చుట్టూ కథగా ప్రచారం చేసి తీశారు. తప్పుడు కేసు పెట్టిన పోలీసుల మీద బాధితుడు ప్రయోగించగల బ్రహ్మాస్త్రం సెక్షన్ 211 అనేలా తీశారు. ఎవర్నో ఇరికించి పోలీసులు కేసు పెడతారుఅతను నిర్దోషిగా విడుదలై వచ్చితన మీద తప్పుడు కేసు పెట్టారని పోలీసుల మీద సెక్షన్ 211 ప్రకారం కేసు పెట్టడం కుదరదు ఈ సినిమాలో చూపించినట్టుగా. చాలా చాలా అరుదైన పరిస్థితుల్లోనే ఇది జరిగింది. అందుకని ఈ సెక్షన్ గురించి కాకుండా, ఈ సెక్షన్ ని అడ్డుపెట్టుకుని అల్లిన రొటీన్ కమర్షియల్ యాక్షన్ కథగా మాత్రమే ఇది బావుండి హిట్టయ్యింది.
        
ప్రస్తుత సినిమాలో అన్ క్లెయిమ్డ్ బ్యాంకు అక్కౌంట్ల  స్కామ్ పాయింటు కూడా బాక్సాఫీసుకి పరాయిదే. అయితే ఈ పరాయి పాయింటుని  అడ్డుపెట్టుకుని అల్లిన రొటీన్ కమర్షియల్ యాక్షన్ కథే సరిగా లేక ఇంకో నాంది కాలేకపోయింది. కథా కథనాల విషయంలో తెరవెనుక ఎవరితో ఏం జరిగినా బాధ్యత వహించాల్సింది కొత్త దర్శకుడు రాకేషే. ఇది తను తీసిన ఫ్లాప్ గా తన ఖాతాలోకి వెళ్తుంది. ఇక క్రేజ్ సృష్టించుకోవడానికి ఆస్కారమే లేదు.
—సికిందర్