రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, December 15, 2022

1265 : న్యూస్


  లండన్లో వరల్డ్ ప్రీమియర్ సందడి. గుంపుగా తరలి వచ్చిన విమర్శకులు. ముక్త కంఠంతో ప్రశంసల వర్షం. చరిత్ర సృష్టించిన 2009 నాటి అవతార్ సీక్వెల్  అవతార్: ది వే ఆఫ్ వాటర్ చాలా సంతృప్తికరంగానూ, సంతోషకరం గానూ వుందని ఫస్ట్ రియాక్షన్ తో విమర్శకులు ఉప్పొంగిపోయారు. 3 గంటల కంటే ఎక్కువ నిడివితో, ఎడతెరిపి లేని విజువల్ ఫీస్ట్ తో, ఫ్రేమ్ రేట్‌తో అతి సృజనాత్మకంగా వున్నట్టు బైట్స్ ఇచ్చారు. బలమైన భావోద్వేగంతో కూడిన అవతార్ మొదటి కథ కంటే మెరుగైన, సంక్లిష్టమైన కథ అనీ, కానీ పాత్రలు కొంచెం ఎక్కువగా వున్నాయనీ, అయినా త్రీడీలో అత్యుత్తమ, అద్భుత విజువల్స్ తో, టెక్నిక్స్ తో దృశ్యవైభవంగా మంత్రముగ్ధుల్ని చేసి తీరుతుందనీ  ఉద్ఘాటించారు.

        యితే ఇది 1990 నాటి సూపర్ హిట్ డ్యాన్సెస్ విత్ వోల్వ్స్ కి కార్బన్ కాపీ అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టారు విమర్శకులు. ఇది 2009 నాటి  అవతార్ విషయంలో జరిగింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా అప్పట్లో కాపీ చేశానని అంగీకరించాడు. అయితే ఆస్కార్-విజేత డ్యాన్సెస్ విత్ వోల్వ్స్ కథ భూమి మీద జరిగితే, అవతార్ కథ అంతరిక్షంలో జరుగుతుందని వివరించాడు.

'అవతార్: ది వే ఆఫ్ వాటర్ అత్యంత అందమైన అనుభవం. పెద్ద స్క్రీన్‌పై త్రీడీ లో చూడాల్సిన అనుభవం. నేను దీన్ని పూర్తిగా ఇష్టపడ్డాను. మళ్ళీ చూడాలనుకుంటున్నాను. సాంకేతిక మాయాజాలం పరంగా ఇది ఒక అద్భుతమైన, మనసుని కదిలించే చలన చిత్ర రాజం అంటూ పెర్రీ నెమిరోఫ్ (కొలైడర్ పత్రిక) పేర్కొన్నాడు.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ చాలా ఇన్క్రెడిబుల్. జేమ్స్ కామెరూన్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక మెట్టు పైనే వుంటాడన్న నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. విజువల్స్ మనసుకు హత్తుకునేలా వున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ఫ్రేములే! కథ విషయానికొస్తే, కొన్ని వివరాల కోసం మళ్ళీ చూడాలనుకుంటున్నాను. ఇది ఒడిదుడుకుల సామూహిక జీవనం, కుటుంబం ఈ రెండిటి శక్తివంతమైన ప్రయాణం. అవతార్ తారాగణం తిరిగి తెరపై కనిపించడం బావుంది. అయితే కొందరు కొత్త నటులు కూడా బాగా చేశారు  అని వివరించాడు.

ఇలాంటి మధురానుభూతి ఎప్పుడూ పొందలేదు. మొదటి అవతార్ కంటే మెరుగ్గా వుంది అని నిక్కీ నోవాక్ (ఫాండాంగో) వ్యాఖ్యానించింది. విజువల్ మాస్టర్‌పీస్. మొదటి దానికంటే ఈ రెండోది చాలా ఉన్నతం. త్రీడీలో వాటర్ వరల్డ్, అక్కడి జీవులు చాలా అధివాస్తవికతతో కూడి  కనిపిస్తాయి. ఇది కామెరూనే తీసిన మాస్టర్ పీస్ టైటానిక్ కి నివాళి అన్నట్టుగా  వుంది అంటూ ఇయాన్ శాండ్‌వెల్ (డిజిటల్‌ స్పై మూవీస్ ఎడిటర్) అభిప్రాయం వెలిబుచ్చాడు.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఉత్కంఠభరి విహంగ వీక్షణంతో కూడిన మాస్టర్‌పీస్. చాలా పలుచని కథ అయినప్పటికీ, పాత్రల అస్తిత్వ పోరాట కథని జేమ్స్ కామెరూన్ భావోద్వేగంతో నిండిన అసాధారణ ప్రతిభతో థ్రిల్లింగ్ యాక్షన్ గా కళ్ళ ముందుంచాడు. చివరి గంట వూపిరి సలపనీయదు! అని సీన్ ఓ కానెల్ (సినిమాబ్లెండ్) ప్రస్తుతించాడు.

జేమ్స్ కామెరూన్‌ కి వ్యతిరేకంగా ఎప్పుడూ పందెం కాయకండి. అవతార్: ది వే ఆఫ్ వాటర్ ప్రతి క్షణం పందెం ఓడించేస్తుంది. అద్భుతమైన విజువల్స్, పాత్రలు, కథ పరస్పర భావోద్వేగ సంబంధాన్ని కలిగి వుంటాయి. చివరి గంటలో కామెరూన్ విజృంభించాడు. బ్లాక్‌బస్టర్ మూవీ మేకర్స్ కిది పాఠ్యగ్రంథం అని ప్రశంసించాడు ఓ కానెల్.  

అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఎపిక్ బ్లాక్‌బస్టర్ - అని జోష్ హోరోవిట్జ్ (ఎంటీవీ న్యూస్) రియాక్ట్ అయ్యాడు. సినిమా మాస్టర్ పీస్! అనేది అమండా సలాస్ (ఫాక్స్ న్యూస్) కామెంట్ - ఇది సినిమాటిక్ మాస్టర్ పీస్! అవతార్ కంటే దీన్ని ఎక్కువగా ఆనందించాను. జీవితంలో ఏవి ముఖ్యమో గుర్తించేలా చేస్తుంది. కుటుంబం, ఇల్లు, ప్రకృతి, మనుగడ - నా టాప్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్! అని మెచ్చుకుంది.

చూస్తే రేపు విడుదలవుతున్న ఈ మెగా వండర్ రివ్యూలు చూడక్కర్లేదన్పిస్తోంది. పైన రివ్యూ లిచ్చేశారు క్రిటిక్స్. ఇక ఆలోచించకుండా థియేటర్ల వైపు ప్రయాణమే. తెలుగు, హిందీ, ఇంగ్లీషు- ఏది కావాలంటే అది. టూడీ, త్రీడీ, ఫోర్ డీ ఎక్స్ ఇలా మూడు ఫార్మాట్స్ లో కావలసిన దాన్ని ఎంచుకోవచ్చు. ఫోర్ డీ ఎక్స్ సౌకర్యం అతి తక్కువ థియేటర్లలో వుంది. బుకింగ్స్ కూడా గత నెలలోనే పూర్తయ్యాయి. వారం తర్వాత కొత్త బ్యాచికి ఓపెన్ అవుతాయి. అవతార్2 సైలెంట్ సునామీ అంటున్నారు. దీని ముందు రేపు శుక్రవారం మూడు చిన్న చిన్న తెలుగు సినిమాలు విడుదల కావడం తొందరపాటు అని ట్రేడ్ వర్గాల మాట.
—సికిందర్