రచన -
దర్శకత్వం
: ప్రదీప్ రంగనాథన్
తారాగణం : ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్,
యోగి బాబు, ఇవానా, రాధికా
శరత్‌కుమార్, రవీనా తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం
: దినేష్ పురుషోత్తమన్
బ్యానర్ : ఎజిఎస్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కల్పతి అఘోరం, కల్పతి గణేష్, కల్పతి సురేష్
తెలుగు పంపిణీ : దిల్ రాజు
విడుదల : నవంబర్ 25, 2022
***
నవంబర్ లో విడుదలై
తమిళంలో హిట్టయిన ‘లవ్ టుడే’ తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల
చేశారు. తమిళంలో ‘కోమలి’ అనే హిట్
తీసిన దర్శకుడు ప్రదీప్ రంగ నాథన్ రెండో ప్రయత్నమిది. ఇందులో తనే హీరోగా నటించాడు.
5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ‘లవ్ టుడే’ రోమాంటిక్ కామెడీ తమిళంలో 70 కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. అంత
కొత్తదనం ఇందులో ఏముంది? నేటి ప్రేమల గురించి ఏమిటి కొత్తగా
చెప్పారు? ఈ విషయాలు పరిశీలిద్దాం...
ప్రదీప్
(ప్రదీప్
రంగనాథన్) కాగ్నిజెంట్‌లో డెవలపర్ గా జాబ్
చేస్తూంటాడు. తల్లి సరస్వతి (రాధిక), అక్క దివ్య (రవీనా రవి) లతో
కలిసి వుంటాడు. దివ్యకి 8 నెలల క్రితం డాక్టర్ యోగి (యోగి బాబు) తో నిశ్చితార్థం జరిగింది. ఇంకో నాల్గు
రోజుల్లో పెళ్ళి వుంది. ఇలా వుండగా, ప్రదీప్ తన కొలీగ్ నిఖిత (ఇవానా)
ని గాఢంగా ప్రేమిస్తూంటాడు. ఆమె కూడా అంతే గాఢంగా ప్రేమిస్తుంది. ఇక పెళ్ళి
చేసుకుందామని ప్రదీప్ వెళ్ళి ఆమె తండ్రి (సత్యరాజ్) ని కలుస్తాడు. ఆ తండ్రి
ఉద్యోగం, కులం, ఆస్తీ అంతస్తులు ఇవేమీ అడగడు. కేవలం ఇద్దరూ
ఫోన్లు మార్చుకుని ఒక రోజు గడిపితే, అప్పటికీ పెళ్ళికి ఓకే
అనుకుంటే తనకూ ఓకే అని చెప్పేస్తాడు. ప్రదీప్ ఫోను నిఖిత కిచ్చి, నిఖిత ఫోను ప్రదీప్ కిచ్చేస్తాడు.
ఈ విచిత్ర కండిషనుతో ఇరుకున పడ్డ
ఇద్దరూ ఎలాటి అనుభవా లెదుర్కొన్నారు? ఒకరి ఫోను ఇంకొకరి
దగ్గరుంటే ఏఏ రహస్యాలు బయటపడ్డాయి? ఏఏ గొడవలు జరిగాయి? ఇవి తట్టుకుని ప్రేమని నిలబెట్టుకున్నారా? పెళ్ళికి
అర్హత సంపాదించుకున్నారా? మధ్యలో ప్రదీప్ అక్క పెళ్ళి గొడవలేమిటి? ఇదీ మిగతా కథ.
ప్రేమించి పెళ్ళి చేసుకున్నంత
మాత్రాన ఆ ప్రేమ నిలబడుతుందని గ్యారంటీ లేదు. ముందే పరీక్ష పెడితే ఏ విషయం
తేలిపోతుంది. సినిమాలు కులాలో అంతస్తులో కలవక పెద్దలు అడ్డుకునే కథలతోనే వచ్చాయి. ఈ
పాత ఫార్ములా కాకుండా, నేటి కాలపు ప్రేమలకి కీలెరిగి
వాతపెట్టే ఆధునిక దృక్పథపు తండ్రి పాత్రతో కొత్త కథ చెప్పాడు దర్శకుడు.
దీనికి కమల్ హాసన్ - సరితలతో కె.
బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’ తో పోల్చ
వచ్చు. 1980 లలోనే బాలచందర్ ముందు కాలపు ప్రేమల్ని నిర్వచించాడు. ఇందులో ఇద్దరి
తల్లిదండ్రులు ప్రేమికులిద్దరూ ఓ
ఏడాదిపాటు కలుసుకోకుండా దూరంగా వుంటే- అప్పుడా తర్వాత కూడా ఇంతే బలంగా పరస్పరం
ప్రేమ ఫీలైతే - పెళ్ళి చేస్తామని పరీక్ష పెడతారు. అప్పట్లో బాల చందర్ తీసిన ఈ
తెలుగు స్ట్రెయిట్ మూవీ పెద్ద సంచలనం. తిరిగి ‘ఏక్ దూజే కే
లియే’ గా కమల్ హాసన్ తోనే హిందీలో తీస్తే అదీ సంచలనం. ఇందులో
ఒక ఏడాది పాటు కమ్యూనికేషన్ లేని దూరాలైతే, ‘లవ్ టుడే’ లో ఒక రోజు పాటు కమ్యూనికేషన్ తో దూరాలు.
ఈ కథని కొత్త రకంగా వుండే సీన్లతో
కొత్త కొత్తగానే చెప్పాడు. ఎక్కడా పాత మూస కన్పించదు. ప్రేమికుల ఒకరి సెల్ ఇంకొకరి
దగ్గరుంటే దాచి పెట్టిన ఏ ఏ విషయాలు బయట పడతాయి, ఎవరెవరు
కాల్స్ చేస్తే ఏఏ సంబంధాలు రట్టవుతాయి, సోషల్ మీడియా యాప్స్
ఇంకేం సంక్షోభాలు సృష్టిస్తాయి - వీటికెలా రియాక్ట్ అవుతారు,
కొట్టుకుంటారు, అసలు ప్రేమల మీదే నమ్మకమెలా పోతుందీ- ప్రేమలు
ఒక బూటకమనీ తెలుసుకునేందుకు మోబైల్స్ ని మించిన మీడియం ఏముందీ వగైరా నవ్విస్తూ ఏడ్పిస్తూ, తీపి చేదుల మిశ్రమంలా చేసి చెప్పాడు. సెల్ ఫోన్స్ ఎంత సామాజిక సేవ
చేస్తాయో ఆవిష్కరించాడు. ఇక ప్రేమ పెళ్ళిళ్ళని ఓకే చేయాలంటే సెల్ ఫోన్లు మార్చి చూడడమే.
అయితే సినిమా స్లోగా నడవడాన్ని
భరించాలి. ఫస్టాఫ్ కామెడీ చేసి, సెకండాఫ్ ఎమోషన్లతో బరువు
పెంచాడు. ఈ బరువు యూత్ ఆడియెన్స్ కి బోరు కొట్టకుండా కథలో గాఢంగా ఇన్వాల్వ్
చేశాడు. ఇలాటివి యూత్ ఎవరికైనా ఎదురు కాగల పరిస్థితులే. వీటన్నిటితో రెండున్నర
గంటలదాకా నిడివి సాగుతుంది. అయితే కేవలం ఇద్దరి ప్రేమికుల కథగా చెప్తే బలం
వుండదని- కమెడియన్ యోగిబాబు డాక్టర్ క్యారక్టర్ తో, హీరో
అక్క పెళ్ళి గొడవల గురించిన కామిక్ సబ్ ప్లాట్ ని సృష్టించాడు. అయితే యోగిబాబు కామెడీ
అంతగా ఏమీ నవ్వించదు. హీరో హీరోయిన్లతో చివరి పదిహేను నిమిషాలు ముగింపు దృశ్యాలు హైలైట్ గానే వుంటాయి. తను తీసిన షార్ట్ ఫిలింనే ఈ సినిమాగా తీశాడు దర్శకుడు.
హీరోగా నటించిన దర్శకుడు ప్రదీప్
అతి సామాన్యుడిగా కన్పించే పాత్రలో గమ్మత్తైన బాడీ లాంగ్వేజ్ తోనే నవ్వొచ్చేలా
వుంటాడు. ఫస్టాఫ్ కామెడీగా నటిస్తూ సెకండాఫ్ లో సీరియస్ గా మారిన పాత్రతో, తన కారణంగా హర్ట్ అయిన హీరోయిన్ తో- ఎమోషనల్ గా మారే దృశ్యాల్లో బలహీన
నటన కనబరుస్తాడు. దర్శకుడుగా మాత్రం ఫర్వాలేదన్పించుకుంటాడు. హీరోయిన్ ఇవానా క్యారక్టర్ బలమైనదే అయినా తను బలమైన నటి కాదు. సెకండాఫ్
లో ఏడ్పు సీన్లకి బాగా కష్టపడాల్సి వచ్చింది. హీరో తల్లిగా రాధికది స్వల్ప పాత్ర.
అయితే ఫన్నీగా వుండే పాత్ర. డాక్టర్ గా
యోగిబాబుకి అంతగా కామెడీ లేదు. హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ మరో మారు ‘ప్రిన్స్’ లో లాగా కథని డ్రైవ్ చేసే పూర్తి స్థాయి
బలమైన పాత్ర- హాస్యంతో కూడిన నటన.
యువన్ శంకర్ రాజా సంగీతం గురించి
చెప్పాలంటే అవి పాటల్లా లేవు, మాటల్లా వున్నాయి. రొటీన్ పాటల
నుంచి ఇదొక రిలీఫ్. ఇక కామెడీ సినిమాకి నేపథ్య సంగీతం ఏముంటుంది. దినేష్ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం తక్కువ
బడ్జెట్ తో తీసిన సాధారణ లొకేషన్స్ లో రిచ్ గానే అన్పించేట్టు వుంది.
ఎప్పుడూ అవే టెంప్లెట్స్ తో- అంటే, అయితే
అపార్ధాలతో విడిపోవడం, లేకపోతే ప్రేమిస్తున్న విషయం పైకి చెప్పలేక లోలోన ఏడుస్తూ వుండడం అనే రెండే ప్రేమ
డ్రామాలతో రొటీన్ గా వస్తున్న ప్రేమ సినిమాల మధ్య ‘లవ్ టుడే’ కొత్త మేకర్స్ కి కనువిప్పు. చేతిలో వుండే టెక్నాలజీతోనే రిలేషన్ షిప్స్
లోపలి స్వరూపాల్ని బయట పెట్టి ఆలోచింప జేస్తూ, ఇంతకి ముందు రాని
కోణంలో ఈ కాలపు ప్రేమ సినిమా ‘లవ్ టుడే’.
సినిమా ప్రారంభంలో, చిన్నప్పుడు హీరో మామిడి పండు రసం పీల్చి, టెంక పాతి
పెట్టే దృశ్యం వుంటుంది. విత్తనం నాటాకా దాని సమయం అది తీసుకుని వృక్షమై ఫలాల్నిస్తుంది.
ఓపిక పట్టాలి. ప్రేమలో కూడా ఇంతే. ప్రేమలో పడ్డాక నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకున్నప్పుడే
దాని ఫలాల్ని పరిపూర్ణంగా అనుభవించొచ్చని దర్శకుడు చెప్పే నీతి.
—సికిందర్