రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

1217 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : అనీష్ ఆర్.కృష్ణ
తారాగణం : నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధికా శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం : మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
బ్యానర్ : ఐరా క్రియేషన్స్
నిర్మాత : ఉషా ముల్పూరి
విడుదల :  సెప్టెంబర్ 23,  2022
***
        హ్యాండ్సమ్ హీరో  నాగ శౌర్య 2017 లో ఛలో తర్వాత నటించిన 6 సినిమాలతో పరాజయాల్ని చవి చూశాక, తిరిగి తన సేఫ్ జోన్ అనుకున్న రోమాంటిక్ కామెడీ కొచ్చాడు. ఇందులో తను పోషించిన బ్రాహ్మణ హీరో పాత్రగురించి మంచి పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. సినిమా కోసం పాదయాత్ర కూడా చేశాడు. సొంత బ్యానర్ లో నిర్మించాడు. దర్శకుడు అనీస్ కృష్ణ అలా ఎలా తర్వాత లవర్’, గాలి సంపత్ అనే రెండు ఫ్లాపులిచ్చి తిరిగి ఈ రోమాంటిక్ కామెడీ ప్రయత్నించాడు. ఇందులో మూడు హిందీ సినిమాల నటి, గాయని షిర్లీ సెటియాని హీరోయిన్ గా తీసుకున్నాడు. సీనియర్ నటి రాధికని తారాగణంలో భాగం చేశాడు. మరి ఇన్ని హంగులు సమకూర్చుకుని ఈసారి ఎలాటి సినిమా ఇచ్చాడు దర్శకు డు? నాగశౌర్యకి  ఈ సారి హిట్టేనా? ఇవి తెలుసుకుందాం...

కథ

కృష్ణా చారి (నాగ శౌర్య) గోదావరి జిల్లా గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి, తల్లి అమృతవల్లి (రాధికా శరత్ కుమార్) ఆదుపాజ్ఞల్లో వుంటాడు. తల్లి నియంత్రణలో ఎంత కుటుంబ సాంప్రదాయాలకి కట్టుబడి వున్నప్పటికీ, జీవితాన్ని ఇంకా పూర్తిస్థాయిలో జీవించే స్వేచ్ఛని కోరుకుంటాడు. అలా హైదరాబాద్ వచ్చి ఒక ఐటీ సంస్థలో టెక్నికల్ ట్రైనీగా చేరతాడు. అక్కడ నార్త్-ఇండియన్ బాస్ వ్రింద (బృందని హిందీలో వ్రింద అంటారు. బృందావన్ ని వ్రిందావన్ అంటారు. ముక్కలు ముక్కలుగా కృష్ణ వ్రింద విహారి అని వున్న సంకర టైటిల్ కనీసం గ్రామటికల్ గా, కృష్ణా వ్రిందా విహారీ గా వుండాలి. అర్ధవంతంగా తెలుగులో చెప్పుకోవాలంటే కృష్ణా బృందా విహారీ) ని చూసి ప్రేమలో పడిపోతాడు.

ఐతే వ్రింద (బృంద) కో సమస్య వుంటుంది. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని అతడ్ని తిరస్కరిస్తుంది. దీన్ని ఇంట్లో మేనేజ్ చేస్తానని చెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. ఇంటికెళ్ళి క్రికెట్ ఆడుతోంటే బాల్ వచ్చి తగలరాని చోట తగులుతుంది. దీంతో డాక్టర్ (వెన్నెల కిషోర్) తో నాటకమాడి తన వికెట్ డౌనైందని, పిల్లలు పుట్టరని చెప్పి తల్లికి షాకిస్తాడు. దీంతో ఎలాగైనా కొడుకు పెళ్ళయితే చాలని సాంప్రదాయ విరుద్ధంగా వున్నా, వ్రిందతో పెళ్ళి జరిపించేస్తుంది తల్లి. ఇలా పెళ్లి చేసుకున్నాక, వ్రింద సమస్యని దాచడానికి ఇంకెన్ని నాటకాలాడాడన్నది మిగతా కథ.

 ఎలా వుంది కథ

పార్టీలో గొడవలున్నా రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర తో సర్దుకు పోగలం గానీ, కథతో గొడవలున్న నాగశౌర్య కథ జోడో అన్నట్టు పాద యాత్ర జరిపితే రాహుల్ ఫలితాలే రావు. రాహుల్ అయితే నడుస్తున్న కాంగ్రెస్ సినిమా లో హీరోగా నటించకుండా తప్పించుకుంటున్నాడు. నాగశౌర్య నటించి ఇరుక్కున్నాడు. సినిమాలో ఇదే కథతో ఇటీవలే నేచురల్ స్టార్ నాని అంటే సుందరానికి నటించేశాడు, ఇదే బ్రాహ్మణ పాత్రతో. రెండిట్లోనూ హీరోయిన్ కి పిల్లలు పుట్టని సమస్యే, అబద్ధాల డ్రామాయే. అంటే ఈ ఇద్దరు దర్శకులూ ఎక్కడ్నించో కథని ఎత్తేసి వుండాలి. దీని కోసం నాగశౌర్య పాదయాత్ర చేశాడు.

ఇలా ఒకే కథ రెండుసార్లు చూసే అవకాశం ప్రేక్షకులకి దక్కుతోంది. కథతో సమస్యేమిటంటే సరైన కాన్ఫ్లిక్ట్ లేదు. దీంతో సెకండాఫ్ కథ ఎటు పోతోందో అర్ధంగాదు. అసలు ఈ నాటకమాడాల్సిన అవసరమే లేదు. ముందు కృష్ణాచారి వ్రిందని పెళ్ళి చేసుకుంటే, పిల్లలు పుట్టని సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఏడాది తర్వాతో రెండేళ్ళకో ఎదురయ్యే సమస్య కావొచ్చు. అప్పుడు కూడా ఇప్పుడే పిల్లలు వద్దని వాయిదాలేసుకుంటూ పోవచ్చు. పెళ్ళి చేసుకోవడానికి ఇప్పటికిప్పుడు ఇంట్లో ఎదురవుతున్న సమస్యే కాదు.

కథకి లాజిక్ లేకపోవడంతో కాన్ఫ్లిక్ట్ కుదర్లేదు. సెకండాఫ్ లో ప్రారంభమయ్యే కథ అర్ధం లేని అబద్ధాలతో, డ్రామాతో నడుస్తుంది. అసలు అబద్ధాలతో నడిచే డ్రామాలు ఎన్నో సినిమాలుగా వచ్చేశాయి. మళ్ళీ అదే పాత నాటకాలు వర్కౌట్ కావు. హీరోయిన్ కి పిల్లలు పుట్టని సమస్యని దాచి పెడితే నాగశౌర్యకి ఎదురయ్యే ప్రధాన సమస్య, సాంప్రదాయ పట్టింపులున్న తల్లిని ఆధునిక నార్త్ అమ్మాయితో పెళ్ళికి ఒప్పించడమే అవ్వాలి.

ఫస్టాఫ్ ప్రారంభంలో తల్లి క్యారక్టర్ ని ఇలాగే ఎస్టాబ్లిష్ చేశారు. కేర్ ఫ్రీ కొడుకుతో సాంప్రదాయాల సంఘర్షణకి దారితీసే ప్రతికూల పాత్రవుతుందన్నట్టుగా. ఇది వదిలేసి తల్లికి కొడుక్కి పిల్లలు పుట్టని డ్రామా తెచ్చి అడ్డేయడంతో, ఆమె కట్టుబాట్లు వదిలేసి, కొడుక్కి పెళ్ళయితే చాలని నార్త్ అమ్మాయి తో పెళ్ళికి రాజీపడి పోతుంది. ముందు ఎస్టాబ్లిష్ చేసిన తల్లి పాత్ర ఇలా వీగిపోవడంతో కథే తేలిపోయింది. ఇంకోటేమిటంటే, అన్ ఫిట్ కొడుక్కి పెళ్ళయితే చాలని రాజీపడిపోయి ఇంకో అమ్మాయి గొంతెలా కోస్తుంది? ఇలాటి అర్ధం లేని పాత్రచిత్రణలతో కుటుంబ ప్రేక్షకులు తరలి రావాలని ఆశలు పెట్టుకుని కుటుంబ సినిమాలు తీస్తారా?

ఫస్టాఫ్ లో తనకి పిల్లలు పుట్టరని హీరోయిన్ చెప్పేముందు- తనకి పెళ్ళీ గీళ్ళీ లాంటివి పడవని, మూడ్ వున్నంత కాలం జాబ్ చేసి, ఆ తర్వాత వరల్డ్ టూరు వేసుకుంటానని చెప్తుంది హీరోతో. ఆమెకున్న పిల్లలు పుట్టని సమస్యతో జీవితాన్ని అలా ఫిక్స్ చేసుకుంది. ఇలా ఎంతో బాక్సాఫీసు అప్పీలుతో కొత్తగా, యూత్ ఫుల్ గా వున్న ఈ పాయింటునే కథగా ముందుకి తీసికెళ్ళకుండా, తన జీవితానికి తగ్గ ప్లానింగ్ తో వున్న అమ్మాయిని తెచ్చి ఇంట్లో అత్తాకోడళ్ళ పాత మూస డ్రామాలో పడేశారు. ఇంతకంటే నాసి రకం ఫ్యామిలీ సినిమా వుంటుందా? ఇంకోటేమిటంటే, కథే ఇలా మారిపోవడంతో ఈ కథలో బ్రాహ్మణ కుటుంబం అవసరమే లేదు.

నటనలు- సాంకేతికాలు   

బ్రాహ్మణ బాడీలాంగ్వేజీ అంటూ నాగశౌర్య ఎంతో ప్రచారం చేసుకున్న విధంగా క్యారక్టర్ ఏమీ లేదు. రెగ్యులర్ హీరో పాత్ర లాగే నటించేశాడు. బ్రాహ్మణ పాత్ర ఎలా వుండాలో ఆలోచించుకుని వుంటే, తల్లి పెంపకంలో అతను పద్యాలూ శ్లోకాలూ పురాణాలూ వేదాలూ వల్లించి వేయగల పాండిత్యంతో వుండేవాడు. కేవలం మందు, సిగరెట్, మాసం ముట్టనంత మాత్రాన బ్రాహ్మణుడైపోడు. రోడ్డు మీద స్వీపర్ ని అపర దేవ కన్యలా వూహించుకుని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో రోమియో అయిపోడు. తర్వాత ఆఫీసులో హీరోయిన్ని చూసి ఇదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కామెడీలేసుకుని చీప్ అయిపోడు. తనదంటూ ఒక దృక్పథంతో వుండాల్సిన వాడు.

ఫస్టాఫ్ హీరోయిన్ని ప్రేమించి
, ప్రేమించేలా చేసుకునే కామెడీల వరకూ యాక్టివ్ పాత్రే. హీరోయిన్ తన సమస్య ముందు పెట్టాక, ఏం చేయాలో తెలీని పాసివ్ పాత్రగా మారిపోయి సెకండాఫ్ కథని దాని ఖర్మానికి వదిలేశాడు. కుటుంబ డ్రామా అనుకుంటే అందులో బలమైన సన్నివేశాల ఆలోచన కూడా చేయలేదు. కాన్ఫ్లిక్టే సరిగా లేనప్పుడు కథా బలమెక్కడుంటుంది. ఫస్టాఫ్ లో గ్రూప్ సాంగ్ ఒక్కటే సినిమాలో బాగున్న పాట. ఇక ఐటీ కంపెనీలో నాగశౌర్య కామెడీలు, ఫైట్ ఏ మాత్రం ఆకట్టుకోవు. ఫైట్ లో షర్టు విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తాడు. జంధ్యం కూడా కన్పిస్తుంది. ఫైటర్ ఆగిపోతాడు. ఏం చూసి ఆగిపోయాడు- జంధ్యం చూశా, సిక్స్ ప్యాక్ చూశా? ఏదో వొక పాయింటే వుండాలి. కథకి సాంప్రదాయాల సంఘర్షణా, పిల్లలు పుట్టని సమస్యా అని ఏదో వొక పాయింటు లేనట్టు- ఇక్కడ కూడా ఇదే. ఏం దర్శకత్వమో ఇది!

హీరోలు సిక్స్ ప్యాక్ చూపించుకుని దంచడం మామూలే. అది హీరోయిజం. కానీ జంధ్యం వున్నప్పుడు సిక్స్ ప్యాక్ చూపించుకుంటే హీరోయిజం దెబ్బతింటుంది. ఫైట్ లో షర్టు చిరిగి సిక్స్ ప్యాక్ తో బాటు జంధ్యం వాటికవే బయటపడితే అప్పుడది ఫైటర్ కి డబుల్ బ్యాంగ్ అవుతుంది. ఇలా కాకుండా హీరోయే షర్టు విప్పి రెండూ చూపించుకుంటే- నాకు జంధ్యముందిరా, నన్నే కొడతావా - అని సెంటిమెంటు అడ్డమేసి తప్పించుకోవడమవుతుంది. ఇక సిక్స్ ప్యాక్ తో పనిలేదు.

దర్శకుడికి చాలా కామెడీ నేర్పు వుందని నాగశౌర్య చెప్పినట్టు ఓ రెండు మూడు చోట్ల ఫక్కున నవ్విస్తాయి డైలాగులు
, అంతే. ఇందులో కామెడీ కింగ్ వెన్నెల కిషోర్ కూడా వృధా అయ్యాడు. సత్య, రాహుల్ రామకృష్ణల కామెడీ కూడా ఫ్లాట్ గా వుంది. ఇక మదర్ పాత్రలో రాధిక ఒక కన్ఫ్యూజుడు పాత్రగా మారింది. కథలో హీరోకి ప్రతిగా వుండాల్సిన ప్రత్యర్ధి పాత్ర ఆమే. ఇది కూడా గుర్తించకుండా దర్శకుడు ఆమెని అయోమయ వ్యక్తిగా తయారు చేశాడు. ఆ వ్రిందా ఏంటిరా నా బొంద? తెలుగులో బృందా అని పిలిచి చావక?’ అని కూడా అనదు.

ఇక హీరోయిన్ షిర్లీ విషయానికి వస్తే ఈమెది కూడా దర్శకుడి చేతిలో బలైపోయిన పాత్రే. మంచి రూపం వుంది
, నటన వుంది. లేనిదల్లా సరైన డెప్త్ వున్న పాత్ర. తన  వ్యంధత్వాన్ని తనే ఫీలవ్వని, ఎమోషన్లు లేని ఫ్లాట్ పాత్ర చిత్రణ. 

మహతీ సాగర్ సంగీతం
, సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం ఓ మోస్తరుగా వున్నాయి. సొంత బ్యానర్లో నిర్మాణానికి బాగానే ఖర్చు పెట్టారు గానీ, వచ్చిన సోకాల్డ్ ఫ్యామిలీ సినిమానే మళ్ళీ అరిగిపోయిన రికార్డులా తీయకుండా వుండాల్సింది. నాగశౌర్య ఇక ఈ ఫ్యామిలీలూ ప్రేమ డ్రామాల దుకాణాలు బంద్ చేసి, యూత్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకోవడం మంచిది.

—సికిందర్