రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, జూన్ 2022, శనివారం

1174 : శనివారం స్పెషల్ ఆర్టికల్

సినిమా చరిత్రలో మూకీల నుంచీ టాకీల మీదుగా వర్ణ చిత్రాల దాకా, సాగిన తన 60 ఏళ్ళ సినిమా ప్రయాణంలో సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ జోసెఫ్ హిచ్ కాక్ మిస్టరీ జోలికి ఏనాడూ పోలేదు. మిస్టరీల జోలికి వెళ్ళి వుంటే ఆయన జగద్విఖ్యాత దర్శకుడయ్యే వాడు కాదేమో. దర్శకత్వం వహించిన 50 సినిమాల్లో ప్రతీదీ జాగ్రత్తగా సస్పెన్స్ సినిమాగానే మల్చి వాటికి శాశ్వతత్వం కల్పించాడు. భావితరాలకి పాఠ్యాంశాలుగా అందించాడు. ప్రేక్షక బాహుళ్యానికి సస్పెన్స్  ఆకట్టుకునేంతగా మిస్టరీ ఆకట్టుకోదు. మిస్టరీలకి ఆదరణ అచ్చులో కథల రూపంలోనూ, నవలల రూపంలోనూ పాఠక ప్రపంచంలోనే. మిస్టరీ జడంగా వుండే కథా ప్రక్రియ, సస్పెన్స్ చలనంలో వుండే కథన ప్రక్రియ. వెండితెర మీద కదిలే బొమ్మల సినిమా చలనం కోరుకుంటుంది. సీను సీనుకీ సంఘటనలు జరుగుతూ వుండాలి. వెండితెర మీద గొలుసు కట్టుగా సంఘటన తర్వాత సంఘటనగా కాల్పనిక కథా క్రమాన్ని వీక్షించడం ప్రేక్షకులకి బయట ఎక్కడా లభించని ఒక గొప్ప అనుభూతి అవుతుంది. ఈ అనుభూతిని చలనశీలమైన సస్పెన్స్ మాత్రమే అందిస్తుంది.

        ల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఒక్క ముక్కలో మిస్టరీ అనేది మేధో ప్రక్రియ అనీ, సస్పెన్స్ భావోద్వేగ ప్రక్రియ అనీ వ్యత్యాసం చెప్పాడు. ఇంకా సరళంగా ఇలా చెప్పాడు : పాత్రలకంటే ప్రేక్షకులకి తక్కువ తెలియడం మిస్టరీ, పాత్రల కంటే ప్రేక్షకులకి ఎక్కువ తెలియడం సస్పెన్స్. అందుకని మిస్టరీ అచ్చులో చదువుకోవడానికి అర్హమైనది, సస్పెన్స్ వెండి తెర మీద వీక్షించడానికి అర్హమైనది. మిస్టరీ ప్రింట్ మీడియా ఆస్తి, సస్పెన్స్ విజువల్ మీడియా సొత్తు. ప్రింట్ మీడియా నుంచి ఇంకే నవల నైనా తీసుకుని సినిమాగా చిత్రానువాదం చేయవచ్చు గానీ, మిస్టరీ నవలని చేయడం కుదరదు. అందుకే ఎన్నో మిస్టరీ సినిమాలు పరాజయాల మూట గట్టుకున్నాయి.

హిచ్ కాక్ ప్రకారం, హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారన్న ప్రశ్నమిస్టరీ కథ అవుతుంది. ఇందులో జరిగిన హత్యని చూపిస్తారు, హంతకుణ్ణి చూపించరు. అనుమానితుల్ని చూపిస్తారు. ఇలా ఎవరు హత్య చేశారనే సమాచారాన్ని దాచడం వల్ల ప్రేక్షకులతో భావోద్వేగపరమైన బంధం తెగిపోతుంది. కథలో పాలు పంచుకునే నాటకీయత అనుభవం కాదు. హత్య ఎవరు చేశారో దర్శకుడు చూపించలేదు కాబట్టి మనకి తెలీదు. కేవలం అనుమానితుల్ని మాత్రమే చూపిస్తూ కుతూహలం మాత్రమే కల్గిస్తాడు దర్శకుడు. ఇందుకు మన ఆలోచనలకి పదును పెడతాడు. కానీ ప్రేక్షకులు మేధోపరమైన మానసిక శ్రమ కోరుకోరు. సినిమా అంటే మేధోమధనం కాదు, వినోద సాధనం. మిస్టరీలో వినోదం పాలు లేదు.

        సస్పెన్స్ ఇలా కాదు. ఇది భావోద్వేగ ప్రక్రియ. వినోద సాధనం. ఇది ప్రేక్షకుల నుంచి సమాచారాన్ని దాచదు. ప్రేక్షకులకి సమాచారాన్ని అందిస్తూ, కథలో పాలుపంచుకునేలా చేస్తూ క్రియాశీలంగా వుంటుంది. హిచ్ కాక్ ఒకటే చెప్తాడు : ప్రేక్షకులకి సమాచారాన్ని అందించినప్పుడే  సస్పెన్సుని సృష్టించడం సాధ్యమవుతుందని. ఇదెలాగా అంటే, హత్య ఎవరు చేశారో చూపించేసి, అంటే ప్రేక్షకులకి సమాచారమిచ్చేసి, అతను ఎలా పట్టుబడతాడ నే ప్రక్రియని కథనం చేయడం లోంచి సస్పెన్స్ ని సృష్టిస్తారన్న మాటఅంటే ఇక్కడ కథనం చలనంలో (యాక్షన్) లో వుంటుందన్న మాట. ఈ యాక్షనే నాటకీయత, అందులోంచే భావోద్వేగం, భావోద్వేగం లోంచి వినోదమూ.

        మళ్ళీ సస్పెన్సుకీ, సర్ప్రైజ్ కీ తేడా గుర్తించాలంటాడు హిచ్ కాక్. సర్ప్రైజ్ ని సస్పెన్స్ అనుకునే ప్రమాదం వుందంటాడు. దీన్ని ఇలా వివరిస్తాడు : ఓ నలుగురు వ్యక్తులు టేబుల్ చుట్టూ కూర్చుని బేస్ బాల్ గురించో, మరి దేని గురించో మాట్లాడుకుంటున్నారు. ఐదు నిమిషాలు గడిచిపోయాయి. అప్పుడు హఠాత్తుగా టేబుల్ కింద బాంబు పేలి నల్గురూ తునా తునకలై పోయారు... ఈ సంఘటన లోంచి ప్రేక్షకులు పొందేదేమిటి? ఓ పది సెకన్ల పాటు షాక్ మాత్రమే, అంతే.

        ఇదే సంఘటనని ఇప్పుడిలా చూద్దాం: కూర్చుని మాట్లాడుకుంటున్నఆ నల్గురు వ్యక్తుల టబుల్ కింద ప్రేక్షకులకి బాంబు కన్పిస్తోంది. అది ఐదు నిమిషాల్లో పేలబోతోందని తెలుస్తోంది...ఇలా ఇప్పుడు ప్రేక్షకుల భావోద్వేగాలన్నీ వేరుగా వుంటాయి. బాంబుని చూపించి అది అయిదు నిమిషాల్లో పేలబోతోందని సమాచార మిచ్చాం కాబట్టి. అంటే టేబుల్ కింద బాంబు వుందని ఆ వ్యక్తులకు తెలీదు, ప్రేక్షకులకి తెలుసు. కింద బాంబు వుంటే పైన వాళ్ళు బేస్ బాల్ గురించి మాట్లాడుకోవడం నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితిని కూడా సృష్టిస్తుంది. ఆ వ్యక్తుల్ని (పాత్రల్ని) ప్రేక్షకులు ఇష్టపడుతూ కూడా వుంటే, ఆ బాంబు పేలొద్దు దేవుడా అని వేడుకుంటూ కూడా వుంటారు. ఒరేయ్, మీరు మాటలాపి కింద బాంబుంది చూసుకోండ్రా అని కింది క్లాసు నుంచి ఎవరో ఒకరు అరిచినా అరుస్తారు.

        ఇదీ పది సెకన్ల షాకిచ్చే సర్ప్రైజ్ కీ, పట్టి కుదిపేసే సస్పెన్స్ కీ వున్న తేడా. ఇప్పుడు పై సస్పెన్స్ సంఘటనలో బాంబు పేలాలా వద్దా అన్నది ప్రశ్న. పేలితే ఏమవుతుంది? ప్రేక్షకులు వూహించిందే జరిగినట్టవుతుంది. ప్రేక్షకులు వూహించినట్టే జరిగితే థ్రిల్ ఏముంటుంది? హిచ్ కాక్ దీన్ని ఇష్టపడడు. మేధో శ్రమ ప్రేక్షకుల కివ్వకూడదు గానీ, ఆ మేధో పరిశ్రమేదో దర్శకుడు పడాలి. మేధో మధనంతో  ప్రేక్షకులు వూహించే దానికి భిన్నమైన ముగింపు నివ్వాలి. అంటే ఎందుకో బాంబు పేల కూడదు, లేదా వాళ్ళు ఆ బాంబుని చూసి పారిపోవాలి, ఇంకా లేదా ఓ దొంగ అదేదో అనుకుని జేబులో వేసుకుని వెళ్లిపోవాలి...ఇలా ముగింపు వూహించని ట్విస్టుతో వుంటే, సస్పెన్సుతో కూడిన ఈ సంఘటన కలకాలం గుర్తుంటుంది. సస్పెన్సులో రక్తమాంసాలతో కూడిన ఇంత విషయ సారమున్నప్పుడు, సర్ప్రైజ్ జోలికి వెళ్ళలేదు హిచ్ కాక్. సస్పెన్సునే మధించాడు, ఆరాధించాడు, 50 ఆణిముత్యాల్ని అందించాడు.

దృశ్యాల్లో సస్పెన్స్

హిచ్ కాక్ సస్పెన్స్ కి ఆయన తీసిన ఫ్రెంజీ’ (1972) లో దృశ్యం చూద్దాం : ఇందులో బారీ ఫాస్టర్ లండన్ లో సీరియల్ హంతకుడు. ఒకమ్మాయిని వురి తీసి చంపి, సంచీలో మూటగట్టి బంగాళా దుంపల లోడ్ తో వున్న ట్రక్కు ఎక్కిస్తాడు. ఇలా బంగాళా దుంపల బస్తాల మధ్య శవమున్న సంచీని ఎక్కించడంలోనే సస్పెన్సుకి రంగం సిద్ధమైంది. అయితే అతను శవాన్ని వదిలించుకున్నాననే రిలీఫ్ తో డ్రింక్ తీసుకోవడానికి ఫ్లాట్ కి తిరిగి వచ్చినప్పుడు గానీ సస్పెన్సు ప్రారంభం కాదు. అప్పుడు గమనిస్తాడు తను ధరించే పచ్చ పతకం లేకపోవడం. దాని మీద తనని పట్టిచ్చే తన పేరులోని చివరి అక్షరముంది. వెంటనే ట్రక్కు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ్నుంచి మొదలవుతుంది సస్పెన్సు అమలవడం, దాంతో పాటూ భావోద్వేగాలు పెల్లుబుకడం. పతకం కోసం అతను పడే యాతన చూసి ఇలాగే శాస్తి జరగాలన్న పాయిజిటివ్ ఎమోషన్ ఒకవైపు, మరో వైపు అతను ఈ గండం దాటాలన్న ఆతృతతో కూడిన నెగెటివ్ ఎమోషన్- ఈ రెండిటి డోలాయమానంలో  పడిపోతారు ప్రేక్షకులు.

        అతను ట్రక్కు దగ్గరికి తిరిగి వచ్చి శవమున్న సంచీలో పతకం పడిపోయిందేమో
నని వెతకాలనుకునేలోగా, డ్రైవర్లు వచ్చేసి ట్రక్కు బయల్దేర దీస్తారు. ఇక మొదలవుతుంది అతడి యాతన. వెనుక వచ్చే కార్లలో వ్యక్తుల దృష్టిలో పడకుండా దాక్కుంటూ వుండడం, వచ్చే తుమ్ముల్ని బలవంతంగా ఆపుకుంటూ వుండడం, బంగాళా దుంప బస్తా ఒకటి జారి కింద పడిపోతే బిక్కచచ్చి పోవడం, చివరికెలాగో సంచీ విప్పి శవాన్ని కెలకడం, ఆ పతకం శవం చేతిలో వుండడం, కొయ్యబారిన చేతివేళ్ళ మధ్య గట్టిగా ఇరుక్కున్న పతకం కోసం... ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఈ సస్పెన్స్ దృశ్యం. ఇందులో పతకంతో ప్రేక్షకులకి ముందే తగిన సమాచారమివ్వడం వలన భావోద్వేగాలని ఎలా సృష్టించాడో గమనించవచ్చు.

ది మ్యాన్ హూ న్యూ టూ మచ్లో ఇంకో దృశ్యం. 1934 లో తను తీసిన ఈ చలన చిత్రాన్ని 1956 లో తనే రీమేక్ చేశాడు హిచ్ కాక్. ఇందులో ప్రధాన మంత్రి మీద హత్యా ప్రయత్న దృశ్యం. ఈ దృశ్యం ఆడిటోరియంలో జరుగుతుంది. ఆడిటోరియంలో సంగీత కార్యక్రమం జరుగుతూంటుంది. ఈ కార్యక్రామానికి హాజరయ్యే ప్రధానిని చంపేందుకు హంతుణ్ణి పంపిస్తారు కుట్ర దారులు. ఆర్కెస్ట్రాలో పాటకి సింబాల్స్ వాయించినప్పుడు ఆ శబ్దంలో కలిసి పోయేలా తుపాకీ పేల్చాలి.

        ఈ సమాచారాన్ని ప్రేక్షకులకి ముందే అందించి సస్పెన్సు ని ప్రారంభిస్తాడు హిచ్ కాక్. కనుక ఏ క్షణంలో ఏం జరగబోతోందో హంతకుడికీ, కార్యక్రమానికి హాజరైన ఒక ప్రేక్షకురాలికీ, సినిమా చూసే ప్రేక్షకులకీ తప్ప, ఈ దృశ్యంలో పోలీసులు సహా ఎవరికీ తెలీదు. ఇక సస్పెన్సుని పెంచి పోషించే షాట్స్ అన్నీ వేస్తాడు హిచ్ కాక్. పాట ఎప్పుడు ముగుస్తుందో, ఆ ముగిసినప్పుడు సరీగ్గా సింబాల్స్ ఎప్పుడు వాయిస్తారో టైమింగ్ కచ్చితంగా తలుసు హంతకుడికి.

        కాచుకుని సరీగ్గా పాట ముగిసి సైంబాల్స్ మోగించగానే తుపాకీ పేల్చేస్తాడు. ఇంత వరకూ పథకం నిర్దుష్టంగా అమలై పోతుంది. అయితే ఆ పేల్చినప్పుడు అనూహ్యంగా చేయి తొణుకుతుంది. కారణమేమిటంటే సింబాల్స్ మోగించిన క్షణాన్నే ఒక్కసారిగా కేక వెలువడ్డం. ఈ హత్యా పథకమంతా ముందే తెలిసిన ప్రేక్షకురాలు దీన్ని విఫలం చేయడానికి కేక పెట్టేస్తుంది. దీంతో హంతకుడి చేయి తొణికి పేల్చిన తూటా గురి తప్పి ప్రధాని మోచేయి పైన తగుల్తుంది. పారిపోలేక హంతకుడు దొరికి పోతాడు.

        ఇలా దృశ్యంలో ఏం జరగబోతోందో ప్రేక్షకులకి ముందే సమాచార మివ్వడం వల్ల ఈ సస్పెన్సు రక్తి కట్టింది. ప్రేక్షకులకి సమాచార మివ్వకపోతే, హంతకుడు పేల్చిన తూటాకీ పది సెకన్ల షాక్ తో జీవం లేని సర్ప్రైజ్ మాత్రమే డొల్లగా అనుభవమయ్యేది ఈ దృశ్యంతో
      
 ‘నార్త్ బై నార్త్ వెస్ట్’ (1959) లో ఇంకో దృశ్యం. ఇందులో కెరీ గ్రాంట్ ఏకాంతంగా వున్న రోడ్డు మీద ఎవరి కోసమో ఎదురు చూస్తూంటాడు. కొంత సేపు చూసి వచ్చే వాహనాలని ఆపే ప్రయత్నం చేస్తాడు. వాహనాలు ఆగకపోయే సరికి ఆందోళన పడతాడు. కనుచూపు మేర ఎవరూ కనిపించని నిర్జన ప్రదేశమది. పట్టపగలైనా ఒంటరిగా వుండాలంటే భయం కల్గించే ఎడారిలాంటి ప్రాంతం. ఈ మిస్టీరియస్ వాతావరాణాన్ని ముందుగా సృష్టించి, అప్పుడు ప్రమాదాన్ని ప్రవేశ పెడతాడు హిచ్ కాక్.

        ఒక హెలికాప్టర్ దూసుకొస్తుంది. చెయ్యూపుతూ దాన్ని ఆపాలనుకుంటాడు. అది ప్రమాదకరంగా తల మీద నుంచి దూసుకెళ్తుంది. భయంతో వంగి పోతాడు. చుట్టూ తిరిగి  మళ్ళీ మీది కొస్తుంది. ఇక శత్రువులు అతణ్ణి చంపడానికి వచ్చేశారని అర్ధమైపోతుంది. తప్పించుకునే అవకాశం కనిపించదు. నేల మీద పడుకుని రెండు సార్లు ప్రాణాలు దక్కించుకుంటాడు. అప్పుడు రోడ్డవతల కన్పిస్తున్న చెరకు పంట పొలాల్లోకి పరిగెడతాడు. ఆ మొక్కల మధ్య కనిపించకుండా దాక్కుంటాడు. హెలికాప్టర్ ఓ రౌండేసి రెండో రౌండు మందు జల్లుకుంటూ వచ్చేస్తుంది. అది పొలాల మీద మందు జల్లే హెలికాప్టర్. ఆ మందు తప్పించుకుని రోడ్డు మీద పడతాడు. అప్పుడే ఓ ఆయిల్ ట్యాంకర్ వస్తూంటుంది. దాని ముందుకు తెగించి దూకి ఆపేస్తాడు. ట్యాంకర్ వెనుక నుంచి అతడి మీదికి దూసుకొస్తున్న హెలీకాప్టర్ ట్యాంకర్ తగిలి పేలిపోతుంది.

        పూర్తిగా ఉద్రిక్త పూరిత దృశ్యం. అడుగడుగునా సస్పెన్సుని పుట్టిస్తూ సాగే సంఘటన. పూర్తి స్థాయి స్రీన్ ప్లేల కున్నట్టుగానే, ఆ స్క్రీన్ ప్లే లోపలా దృశ్యాలు బిగినింగ్ - మిడిల్ -  ఎండ్ అనే నిర్మాణంలో వుంటాయి. పై దృశ్యంలో కెరీ గ్రాంట్ రోడ్డు మీద వేచి వుండడం బిగినింగ్, అతణ్ణి చంపడానికి హెలికాప్టర్ రావడంతో ప్రాణాలు రక్షించుకుంటూ అతను సంఘర్షించడం మిడిల్, హెలికాప్టర్ ట్యాంకర్ కి తగిలి పేలిపోవడం ఎండ్. హిచ్ కాక్ ఏ సస్పెన్స్ దృశ్యం చూసినా ఈ నిర్మాణంలోనే వుంటుంది. సాధారణ స్థితి, సంక్షోభం పరిష్కారమనే క్రమంలో నిర్మాణం.

ముగింపులో ట్విస్టు

హిచ్ కాక్ రూపొందించే దృశ్యాల ముగింపులు వూహకందనివిగా వుంటాయి. పైన పేర్కొన్న టేబుల్ కింద బాంబు ఉదాహరణ లాగా, ప్రేక్షకులు వూహించే ముగింపు నివ్వడు. ప్రేక్షకుల వూహల్ని ఉల్టా పల్టా చేసేసే ట్విస్టు తో ముగిస్తాడు. దీన్ని సబెటా (Saboteur- విధ్వంసకుడు - 1942) లో చూడవచ్చు. ఇందులో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద చిత్రీకరించిన క్లయిమాక్స్ దృశ్యంలో, నార్మన్‌లాయిడ్ కి రాబర్ట్ కమ్మింగ్స్ పిస్తోలు గురిపెట్టి వుంటాడు. ఇక నార్మన్ పని అయిపోయిందనిపిస్తుంది. పిస్తోలు గురిపెట్టిన్న కమ్మింగ్స్, మాట్లాడడం ప్రారంభించేసరికి కంగారుపడ్డ నార్మన్‌ తూలి వెనక్కి అంచు మీద పడిపోతాడు.

సరళ కథలు – సూటి కథనాలు  
          ప్రేక్షకులు తెరమీద వీక్షించే సస్పెన్సులో భావోద్వేగ పూరితంగా పాలు పంచుకునేందుకు కథ తేలికగా, సరళంగా వుంటూ, కథనం సూటిగా వుండేట్టు జాగ్రత్త తీసుకుంటాడు హిచ్ కాక్. కథ తికమక పెడితే, ఫ్లాష్ బ్యాకులతో కథనం ముందుకూ వెనక్కీ పోతే, కథనంలో ఎక్కువ విషయాలు జ్ణాపకం వుంచుకోవాల్సి వస్తే, ఆ సస్పెన్స్ ఆకట్టుకునే వీలుండదు. తికమక నుంచీ, మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల నుంచీ, ఇంకే రకమైన అడ్డంకుల నుంచీ సస్పెన్సుకి రూటు క్లియర్ చేయాల్సి వుంటుంది. సస్పెన్సుకి రాజ మార్గమేసి, ఎర్ర తివాచీ పర్చడానికి కథతో, కథనాలతో ఎలాటి టెక్నిక్కులకి పాల్పడడు హిచ్ కాక్. కథ సులభంగా అర్ధమవ్వాలి. అందుకని అతడి సస్పెన్స్ స్క్రీన్ ప్లేలు బిగినింగ్ - మిడిల్ - ఎండ్ వరస క్రమంలో లీనియర్ కథనాలతో స్వచ్ఛంగా వుంటాయి.

          సస్పెన్సుతో ఆరు దశాబ్దాల హిచ్ కాక్ ప్రయాణంలో ఫిల్మ్ ఎడిటర్ అయిన ఆయన సతీమణి అల్మా రివెల్ పోషించిన పాత్ర కూడా అసమానమైనది. హిచ్ కాక్ ఏఏఫ్ఐ లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్నప్పుడు, ఈ అవార్డు సతీమణి అల్మాకి కూడా చెందుతుందని ప్రకటించి ఆమెపట్ల కృతజ్ణతని చాటుకున్నాడు.

        ఈ సస్పెన్సు మహారాజూ రాణీలని ప్రపంచంలో సస్పెన్స్ వున్నంత కాలం గుర్తుంచుకుంటారు ప్రేక్షకులు. భావి దర్శకులూ ఆయన్నుంచి అమరమైన పాఠాలు తప్పక నేర్చుకుంటూ వుంటారు.

—సికిందర్