రచన - దర్శకత్వం : ప్రదీప్ బి అట్లూరి
తారాగణం : విక్రమ్ సహిదేవ్, సౌమికా పాండియన్, రిషికా ఖన్నా, వినీత్ బవిశెట్టి, స్నేహల్, తాగుబోతు రమేష్, జీవా తదితరులు
సంగీతం : అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం : అనీష్ తరుణ్ కుమార్
బ్యానర్ : రామలక్ష్మి సినీ
క్రియేషన్స్
నిర్మాతలు : శిరీషా లగడపాటి, శ్రీధర్ లగడపాటి
విడుదల : ఫిబ్రవరి 18, 2022
***
లగడపాటి
శ్రీధర్ 2005 లో ‘ఎవడి గోల వాడిదే’ నుంచి 2018 లో ‘నా పేరు సూర్య’ వరకూ 7 సినిమాల నిర్మాత. కుమారుడు
విక్రమ్ ని నటుడుగా ప్రవేశపెట్టి రెండు సినిమాల్లో (వకీల్ సాబ్, రౌడీ బాయ్స్) నటింపజేశాక, హీరోగా ప్రమోట్ చేస్తూ
ఇప్పుడు ‘వర్జిన్ స్టోరీ’ నిర్మించారు.
అట్లూరి ప్రదీప్ ని దర్శకుడుగా
పరిచయం చేశారు. ప్రదీప్ హిందీలో ఒక టీవీ సిరీస్ కీ,
రెండు హిందీ సినిమాలకీ రచయితగా పనిచేసి, ‘క్వికీ’ అనే ఓ హిందీ సినిమాకి దర్శకత్వం చేశాడు. ‘వర్జిన్ స్టోరీ’ తో దర్శకుడుగా తెలుగు ప్రేక్షకుల
ముందు కొచ్చాడు.
ఇదివరకు మల్టీ
ప్లెక్స్ సినిమాలనేవి వచ్చేవి. ఇవి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆడేవి కావు.
ఇప్పుడు ఓటీటీ వచ్చాక మల్టీ ప్లెక్సుల్లో కూడా ఆడని సినిమాలు వస్తున్నాయి. రేపు ఓటీటీలో
కూడా ఆడని సెల్ ఫోన్ సినిమా లొస్తాయేమో. ఆ తర్వాత మైక్రో స్కోపులో చూడగల్గే
సినిమాలు. ఇంకా తర్వాత ఎక్కడా ఆచూకీ దొరకని సినిమాలు - చరిత్ర పరి సమాప్తం.
ఇకప్పుడు తిరిగి నాటకాలూ వీధి నాటకాలూ బుర్ర కథలూ షురూ.
మన వారసులకి దీనికి సిద్ధంచేస్తూ
ఇప్పుడే ఓ బుర్ర కథ తీశారు. సినిమాగా ఇది 1 - 1.5 రేటింగ్ సంపాదిస్తే,
బుర్ర కథగా ప్రదర్శిస్తే 10/10 రికార్డ్ రేటింగ్
గ్యారంటీగా సాధిస్తుందని చెప్పొచ్చు. చిన్న సినిమాలు ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే
అని థియేటర్లకి పోవడం లేదు కొమ్ములు తిరిగిన ప్రేక్షకులు. ఇక పైన బుర్ర కథగా వస్తే
చూడొచ్చులే అనుకోవచ్చేమో. అయితే ‘వర్జిన్ స్టోరీ’ బుర్ర కథనా, బుర్ర లేని కథనా తెలుసుకోవాల్సిన అవసరమెంతో
వుంది...
ప్రియాంశీ (సౌమికా పాండియన్) తానెంతగానో ప్రేమిస్తున్న బాయ్ ఫ్రెండ్ మోసం
చేస్తున్నాడని తెలుసుకుంటుంది. అతడికి బ్రేకప్ చెప్పేసి బాధలో వుంటుంది. ఆమెకో
ఫ్రెండ్ మీనాక్షీ (రిషికా ఖన్నా) వుంటుంది. ఈ బాధలోంచి బయటపడాలంటే, బాయ్
ఫ్రెండ్ మీద పగదీర్చుకోవాలంటే, ఒన్ నైట్ స్టాండ్ గా తెలియని
వాడితో ఒక రాత్రి గడిపెయ్య మంటుంది. ప్రియాంశీ ఒప్పుకుంటుంది.
ఇద్దరూ పబ్ కెళ్తారు. పబ్ లో విక్రమ్ (విక్రమ్
సహిదేవ్) ని చూసి
ట్రై చేద్దామనుకుంటుంది. విక్రమ్ ఇంకా వర్జిన్. వర్జీనిటీ కోల్పోవాలని ఉవ్వీళ్ళూరుతూంటాడు. ప్రియాంశీ అడగడంతో ఒప్పేసుకుంటాడు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు
తెలుసుకోకుండా ఈ రాత్రి గడిపేసి వెళ్ళి పోవాలనుకుంటారు. గడపడానికి ఒక చోటు కావాలి.
ఆ చోటు ఎక్కడా దొరకదు. ప్రతీ చోటా ఏదో ఆటంకం ఎదురవుతూంటుంది. చివరికేమైంది?
అనువైన చోటు దొరికిందా? అనుకున్నట్టు గడిపారా? ఇదీ మిగతా కథ.
ఇవ్వాళ సినిమా కథనేది ఒన్ నైట్
స్టాండే. ఒన్ షోతో మర్చిపోయేంత. రాశామా, తీశామా, డబ్బులు పంచుకుని ఓ షోతో ఇంటికెళ్ళి పోయామా, ఇంతే. ఫటా
ఫట్ యూజ్ అండ్ థ్రో ఎసైన్ మెంట్, బస్టాండ్.
ఈ కథతో - హేపీగా వుండాలంటే ఒన్ నైట్
స్టాండ్ కాదు, ఒన్ లైఫ్ స్టాండ్ కావాలని చెప్పదల్చారు. అసలు
చెప్పాల్సింది- లైఫ్ అంటే ఎవడి మీదో పగతో ఇంకెవడితోనో పడుకుని వర్జీనిటీ కోల్పోవడం
కాదని - దారి తప్పిన హీరోయిన్ పాత్రకి చెప్పాలి. ఏం చెప్పాలో తెలియక పోతే ఇలాటి కథ
ఎందుకు రాయడం, తీయడం.
అందుకని మొదట్నుంచీ ఈ కథ కథలా
సాగదు. కాన్సెప్ట్ తెలియనప్పుడు కథెలా
సాగుతుంది. దీనికి మల్లాది నవలతో పోలిక తెస్తున్నారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి
నవల ‘పెద్దలకు మాత్రమే´ఆధారంగా 1985 లో జంధ్యాల ‘శ్రీవారి
శోభనం’ తీశారు. నరేష్, అనితారెడ్డి, మనోచిత్ర నటీనటులు. ఇందులో పెళ్ళయిన హీరోకి శోభనం అంటే భయం. ఇందుకు
మార్గరెట్ అనే అమ్మాయి హెల్ప్ తీసుకుంటాడు శోభనం నేర్చుకునేందుకు. ఈ
నేర్చుకోవడానికి అనేక ఆటంకా లెదురవు తూంటాయి కామెడీగా. చివరికి ఇలా భార్యని మోసం
చేయకూడదని తెలుసుకుని, తన మానసిక భయాల్ని మార్గరెట్ చేత కౌన్సెలింగ్
తో తొలగించుకుని, భార్య దగ్గరి కెళ్ళిపోతాడు.
1985 కాలంలో ఇది ఒన్ నైట్ స్టాండ్
కథ కాదు. పైగా పెళ్ళయిన వాడు హీరో. కేవలం సెక్స్ కి ఆటంకా లెదురవడమనే కామెడీ
ట్రాక్ తప్పితే, ‘వర్జిన్ స్టోరీ’ కి పోలిక లేదు. ఈ స్టోరీ వేరు- ఈ కాలపు స్టోరీని స్టోరీ కాని స్టోరీగా
తీశారు.
2016 లో సన్నీ లియోన్, తనూజ్ విర్వాణీ, నైరా బెనర్జీ లతో ‘ఒన్ నైట్ స్టాండ్’ తీశారు హిందీలో. భవానీ అయ్యర్
రచనకి జాస్మిన్ మోజెస్ డిసౌజా దర్శకత్వం. ఇందులో కావాలని ఒన్ నైట్ స్టాండ్ కి పాల్పడరు
హీరో హీరోయిన్లు (తనూజ్- లియోన్). అనుకోకుండా జరిగి పోతుంది. ఆ తర్వాత హీరో ఆమె
వెంట పడతాడు భార్యని పట్టించుకో కుండా. పెళ్ళయిన హీరోయిన్ తిప్పి కొడుతుంది. హీరో అబ్సెషన్
వల్ల ఇరు వైపులా కాపురాలు కూలే పరిస్థితి ఏర్పడుతుంది.
ఒన్ నైట్ స్టాండ్ లాంటి సింగిల్
సెక్సువల్ ఎన్ కౌంటర్ మానసిక సమస్యల్ని తెచ్చి పెడుతుందని నిపుణులు
హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైనదని కూడా అంటున్నారు. అసలు ‘వర్జిన్
స్టోరీ’ కథతో ఏ నీతీ చెప్పనవసరం లేదు. కథని కథలా చెప్పి
రక్షిస్తే చాలు. కథకి బేసిక్స్ కూడా చూసుకోకుంటే తెల్ల కాగితాల మీదే కదా పెట్టుబడి
పెడతారు.
‘రౌడీబాయ్స్’ లో నెగెటివ్ పాత్ర వేసిన విక్రమ్ నటించగలడని నిరూపించుకున్నాడు.
గ్లామరుంది, షేపుంది, ఎక్స్ ప్రెషన్స్
వున్నాయి. నిలదొక్కుకోవడానికి కంటెంట్ కావాలి. ఇది లోపించిందిప్పుడు. ఎక్కడా మొహంలో
పలికించడానికి సీన్లలో ఎమోషన్లే లేవు. ఎమోషన్స్ అంటే సీరియస్ నెస్ అనే కాదు, కామెడీ కూడా ఎమోషనే. ఇది కూడా పలికించడానికి కామెడీ సైతం తీయలేక పోయాడు
దర్శకుడు ఈ కామెడీ అనుకుని తీసిన కథలో.
ఇక ప్రతీ సీనులో హీరోయిన్ తోనే
వున్నా, ఆమెతో సెక్సువల్- రోమాంటిక్ టెన్షనే లేదు. ఫీలింగ్సే
లేవు. హీరోయిన్ తో గడపడానికి ఏ చోటు చూసుకోవాలన్న గణితమే తప్ప, రసాయనమే లేదు ఆమెతో. తను వర్జిన్, ఇంకా
వర్జినేమిటని ఫ్రెండ్స్ ఆటలు పట్టిస్తూ లూజర్ అనడం. అలాంటిది తను హీరోయిన్ తో
విన్నర్ అవడానికింత అవకాశమొచ్చాక, ఆ వర్జీనిటీ కోల్పోయే తొలి
అనుభవపు ఎక్సైట్ మెంటేమీ కన్పించక పోతే, కథనమేం నడుస్తుంది. లగడపాటి విక్రమ్ సాహిదేవ్ పాత్రగా ఈ కథ నడపలేకపోయాడు. తెలిసో తెలీకో ఓ పాసివ్
పాత్ర ఒప్పుకుని నొప్పించాడు ప్రేక్షకుల్ని.
‘వయ్యారి ఓ
వయ్యారీ నీ వూహాల్లోనే సవారీ’ అన్న హీరో క్యారక్టర్ ని
తెలిపే టైటిల్ సాంగ్ లో, సాహిత్యం ప్రకారం హీరో క్యారక్టరే
వుండదు. ‘నా ఫ్యూజు లెగిరి పోయే నీ అందం చూడగానే’ (బూజు కూడా తొలగలేదు క్యారక్టర్ కి)… ‘రివ్వు మన్నది ప్రాణం తూనీగ లాగా’ (మన్ను తిన్న
పాముతోనా?)…’నువ్వు నేను కలుపుకున్న చూపులు-నచ్చి నచ్చి
పంచుకున్న మాటలు’ (చూపుల్లేవు,
మాటల్లేవు)... ‘కొత్తగా కొత్తగా
రెక్కలొచ్చెనా’ (రెక్కలొచ్చి వుంటే కథ హిట్టయ్యేది)... ‘ఓ వయ్యారీ వయ్యారీ మనసంతా నీదే కచేరీ’ (మనసంతా, బుర్రంతా ఖాళీ- ఏమీ లేదు). కవి
రాసిన ఏ లైను లాగా క్యారక్టర్ లేదు.
ఇక హీరోయిన్ సౌమికా పాండియన్ డిటో. నో
క్యారక్టర్, నో యాక్టింగ్. మాజీ లవర్ మీద పగదీర్చుకోవడానికి
ఒన్ నైట్ స్టాండ్ గా దిగాక, ఆ రివెంజీ ఫీలింగుని, ఆ
ఆత్మ వినాశక కసినీ చూపించదు. ప్రేమ సినిమాల్లో లవ్ లో పడ్డ హీరోయిన్ లాగే
వుంటుంది. అసలు మాజీ లవర్ మీద పగ దీర్చుకోవడం ఇలా ఎలా జరుగుతుంది. ప్రేమ సినిమాల్లో లవర్ ని
బాధించడానికి అతడి కళ్ళ ముందే ఇంకో లవర్ తో తిరగడం వుంటుంది. అలా మాజీ లవర్ చూసేలా
ఇంకొకడితో సెక్స్ చేస్తే మాజీ లవర్ మీద పగ
దీర్చుకోవడంగా వుండొచ్చు. అతడికి దూరంగా ఏం చేస్తే అతడికేంటి? ఈ పగ సాధించి కూడా ఏం సాధిద్దామని? ఎవడితోనో
వర్జీనిటీని డ్రైనేజిలో పారేసుకుని ఆనక ఏడ్వడమా? పైగా ఆ మాజీ
లవర్ చివరి దాకా కనపడడు కూడా. ఏమిటో ఈ సినిమా!
ఒన్ నైట్ స్టాండ్ గా పగ దీర్చుకోమనే
మీనాక్షీ అనే పిచ్చిదీ (రిషికా ఖన్నా) ఇంకో వైపు. వాళ్ళ కెక్కడా చోటు దొరక్క పోతే
తన రూమ్ కే తీసుకెళ్ళి శుభకార్యం
జరిపించొచ్చుగా? ఇక ఒక సబ్ ప్లాట్ గా కామెడీ ట్రాక్ వుంది. మీకీ
నాకీ భాషతో ఆటో డ్రైవర్- అరవ తెలుగు భాషతో అమ్మమ్మ క్యారక్టర్లతో. వీళ్ళ లౌడ్ కామెడీకి
నవ్వే రాక పోగా టార్చర్ పెట్టేస్తుంది. తాగుబోతు రమేష్ కానిస్టేబుల్ గా వచ్చే
కామెడీ, రఘు కారుమంచి కామెడీ కూడా టార్చరే. ఇక అడపాడపా గే, లెస్బియన్, అన్ సెక్స్ క్యారక్టర్లతో కామెడీ చెప్పాల్సిన
పనిలేదు.
సంగీతం,
సాహిత్యం పైన చెప్పుకున్న విధంగా అన్యాయమై పోయినా,
ప్రొడక్షన్ విలువలు రిచ్ గానే వున్నాయి లగడపాటి రేంజిలో. కాస్ట్యూమ్స్, మేకప్, కళా దర్శకత్వపు విభాగాలూ బాగా పని చేశాయి.
స్టయిలిష్ లుక్ కోసం పాటుబడిన దర్శకత్వం ఫర్వాలేదు గానీ, చేతిలో
కథా కథనాల దస్తావేజే బాగా లేదు.
అవార్డుల కమిటీయో, రివ్యూలు రాసేవాళ్ళో దీన్ని చివరిదాకా చూడక తప్పదేమోగానీ, ఈ పనీ పాటలు లేనివాళ్ళు చివరి దాకా కొన వూపిరితో
వుండలేరు. చాలా ప్రాణయామం చేసి వుండాలి. కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్ళు అసలే పనికి
రారు.
ఇది ఒక రాత్రంతా జరిగే కథ. పదేపదే
పబ్ సీన్లు, అక్కడి హంగామా 7 సార్లు, ఓ
6 సార్లు వచ్చే సెక్స్ కోసం ప్రయత్నించే లొకేషన్లు, ఇతర రోడ్
సీన్లూ వగైరా. హీరోయిన్ ఇలా చోటు కోసం వూరు మీద పడి తిరగడ మెందుకో అర్ధం గాదు.
రాత్రికి రాత్రే పేరెంట్స్ ఫ్లయిట్ ఎక్కి ఎక్కడికో వెళ్ళి పోయారుగా? ఈ వెళ్ళి పోవడం హీరోయిన్ రాత్రంతా బయట తిరగడాని కన్నట్టుగా సృష్టించాడేమో
కథకుడు- కానీ పేరెంట్స్ ని అలా పంపేశాక ఆమె బయట ఎక్కడికీ తిరగనవసరం లేకుండా, ఏంచక్కా ఇంట్లో కూర్చుని - టిండర్ లోనో, గ్రిండర్
లోనో యాప్ లో హుకప్ అయి- అతడ్ని ఇంటికే రమ్మంటే సరిపోతుందిగా?
ఓ పాతిక నిమిషాల రన్ టైంలో, పబ్ లో హీరోతో హీరోయిన్ ఒన్ నైట్ స్టాండ్ గా కనెక్ట్ అయ్యాక, మిడిల్ ప్రారంభమవుతుంది. ఈ కథకి బిగినింగ్, మిడిల్, ఎండ్ మూడూ వున్నాయి. లేనిది వీటితో ఏం చేయాలన్నదే.
హీరోయిన్ వేరొకడి మీద ప్రతీకారంగా
హీరోతో ఓ రాత్రి పడుకోవాలనుకుంది. దీనికి పణంగా ఏం పెడుతోందో తెలీదు. ‘శ్రీవారి శోభనం’ లో వైవాహిక జీవితాన్ని పణంగా పెట్టి
వేరే అమ్మాయితో తిరుగుతాడు హీరో. ‘ఒన్ నైట్ స్టాండ్’ హిందీలో ఇద్దరూ తమ వైవాహిక జీవితాల్ని పణంగా పెట్టేస్తారు. ప్రస్తుత
సినిమాలో హీరోయిన్ కనీసం కన్యాత్వాన్నైనా పణంగా పెడుతున్న సబ్ టెక్స్ట్ ని
ప్రేక్షకుల అవసరార్ధం, ఆదుర్దా కోసం సృష్టించలేదు కథకుడు.
ఏదీ పణంగా లేక పోవడతో కాన్ఫ్లిక్ట్ లేకుండా పోయింది. కాన్ఫ్లిక్ట్ లేని కథగా సోదిలా
మారింది.
ఇటు లూజర్ స్టేటస్ తో వున్న హీరోకీ, ఈ రాత్రి వర్జీనిటీ వదులుకుని తొలి అనుభవమనే విన్నింగ్ సిట్యూయేషన్ని
ఎంజాయ్ చేయాలన్న సోయి లేకుండా పోయింది. అంత క్లోజ్ గా మూవ్ అవుతున్న హీరోయిన్ తో
ఎరోటిక్ ఫీలింగ్ గానీ, రోమాంటిక్ సస్పెన్స్ గానీ, ఎక్సైట్ మెంట్ గానీ, ఎక్కడా చోటు దొరక్కపోతే రోడ్డు
మీదే కానిచ్చేయాలన్న తెగింపూ తొందరపాటు
గానీ లేకుండా పోయింది. ఇద్దరివీ రక్త మాంసాల్లేని పాత్ర చిత్రణలయ్యాయి.
ఫలితంగా ఒక్కో చోటుకి వెళ్ళడం, అక్కడేదో సిల్లీగా కుదరక పోవడమనే కామెడీ సీన్లే రిపీటవుతూ వుంటాయి
ఫస్టాఫ్ సెకండాఫ్ రెండిట్లో. కథ డెవలప్ కాదు, ఇంకో
స్థాయికీ వెళ్ళదు. జరగాల్సింది పదేపదే ఆ
చోట్లలో పడుకోడానికి వీల్లేని కామెడీలు
కాదు- జరగాల్సింది పడుకుని ఫోర్ ప్లే దాకా
వెళ్ళే - ఇక ఇంటర్ కోర్సు ప్రారంభమయ్యే పీక్ లో డిస్టర్బెన్స్. ఇంటర్ కోర్సు డిస్టర్బ్
అయ్యే ఎరోటిక్ సస్పెన్స్, టెన్షన్ కావాలి వేడి పుట్టిస్తూ.
లేకపోతే చేతకాని పాత మూస సీన్లు - ఆ
పేరుతో అర్ధం లేని, విషయం లేని కామెడీలూ కాదు ఈ మోడరన్ కథకి కావాల్సింది.
దీన్ని బుర్ర కథ చెపుతున్నట్టు తీయడమూ కాదు. బుర్రకథల్ని తక్కువ చేయడం లేదు. బుర్ర
కథ దానికది ఒక సారస్వత వారసత్వ సంపద. బుర్ర కథని సినిమాలాగా చెప్పరు, సినిమాని బుర్ర కథలా తీయడమేమిటి?
—సికిందర్