రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 14, 2021

1052 : రివ్యూ + స్క్రీన్ ప్లే సంగతులు


 సార్పట్ట (తమిళం)

రచన - దర్శకత్వం: పా. రంజిత్‌
తారాగణం : ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమా కుమార్‌, సంచనా నటరాజన్‌, జాన్‌ కొక్కెన్‌, జాన్ విజయ్, కలైరాసన్‌, సంతోష్ ప్రతాప్‌, షబీర్ కలరక్కల్ తదితరులు
 సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, ఛాయాగ్రహణం : మురళి.జి, కూర్పు: సెల్వ ఆర్‌.కె.
కళ:  టి.రామలింగం, పోరాటాలు : అన్బరీవ్‌ 
నిర్మాత: షణ్ముగమ్‌ దక్షణ్‌రాజ్‌; 
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌
***

        స్పోర్ట్స్ సినిమాలు కాల్పనికంగా అనేకం వస్తూంటాయి. బయోపిక్స్ గా, చారిత్రకంగా, వచ్చినప్పుడు ఒక ఆసక్తిని రేకెత్తిస్తూంటాయి. రెండు చారిత్రక నేపథ్యపు పరంపరల బాహాబాహీ బాక్సింగ్ క్రీడగా - కాల్పనిక చరిత్రగా వచ్చినప్పుడు కాస్త ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి. ఒకప్పుడు మద్రాసు బ్రిటిషిండియాలో  భాగం కాబట్టి పాశ్చాత్య ధోరణుల్ని ఆహ్వానించడానికి మద్రాసీలకి అభ్యంతరముండేది కాదని చెప్తున్నారు. బాక్సింగ్ ని అలా సొంత క్రీడగా మార్చుకున్న చరిత్ర మద్రాసుది. మద్రాసు చెన్నై అయింది.  అయితే  అప్పుడప్పుడు పీరియెడ్ సినిమాల పేరుతో మద్రాసు కథల్ని తవ్వి తీస్తూ చెన్నైకి అందిస్తూనే వున్నారు తమిళ దర్శకులు. దర్శకుడు పా రంజిత్ కూడా హీరో ఆర్యతో ఈ పనే చేశాడు. బాక్సింగ్ కి పేరెన్నిక గన్న ఉత్తర మద్రాసు బాక్సింగ్ పరంపరల నేపథ్యంతో ఆధిపత్య పోరుగా సార్పట్టా  పరంబరై తీశాడు. సార్పట్టా పరంపర దీని తెలుగు వెర్షన్. ఏమిటీ సార్పట్టా పరంపర, ఈ పరంపర చరిత్ర కెంత వరకు న్యాయం చేశాడు, స్పోర్ట్స్ సినిమాల్లో ఇదెలా ప్రత్యేకమయిందీ మొదలైనవి పరిశీలిద్దాం...

కథ


        1970 లలో సమర (ఆర్య) ఉత్తర మద్రాసులోని హార్బర్ లో కూలీగా పనిచేస్తూంటాడు. చిన్నప్పట్నుంచీ మనసంతా బాక్సింగ్ మీదే వుంటుంది. బాక్సరైన తండ్రి లాగా ఎదగాలని బలమైన కోరిక అతడిది. కానీ బాక్సరైన తండ్రి నేరాలవైపు మొగ్గి జీవితం పాడు చేసుకోవడంతో, సమర తల్లి భాగ్యం (అనుపమా కుమార్) బాక్సింగ్ అంటే ద్వేషం పెంచుకుని వుంటుంది. సమర బాక్సింగ్ పోటీలు చూడడానికి వెళ్ళినా పట్టుకుని విపరీతంగా కొడుతుంది. ఐనా సమర పోటీలు చూడ్డానికి వెళ్ళడం మాత్రం మానడు. ఇంకోవైపు కుటుంబ మిత్రుడు కెవిన్ అలియాస్ డాడీ (జాన్ విజయ్) బాక్సింగ్ లోకి దిగమని సమరని ఒకటే రెచ్చగొడుతూంటాడు.

        ఆ ఏరియాలో ప్రధానంగా సార్పట్టా పరంపరకి చెందిన కోచ్ రంగయ్య (పశుపతి), ఎదుటి ఇడియప్ప పరంపర మీద విజయం కోసం విఫల యత్నాలు చేస్తూంటాడు. ఇతను డీఎంకే పార్టీ అభిమాని. ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని ఆరాధిస్తాడు. అయితే ఇడియప్ప పరంపరకి చెందిన బాక్సర్ వేటపులి (జాన్ కొక్కెన్) ని ఓడించడం రంగయ్య బాక్సర్ల వల్ల గావడం లేదు. ఇడియప్ప పరంపర రంగయ్యకి ఇంకొక్క అవకాశం ఇస్తుంది. ఇంకోసారి ఓడిపోతే శాశ్వతంగా సార్పట్టా పరంపర రంగంలోంచి తప్పుకోవాలని షరతు విధిస్తుంది.

        ఇంతలో 1975 లో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తుంది. అంటే బాక్సింగ్ కి అవకాశముండదు. అయితే కరుణానిధి ఎమర్జెన్సీని వ్యతిరేకించడంతో ఉత్తర మద్రాసు బాక్సింగ్ కి ఢోకా వుండదు. దీంతో కోచ్ రంగయ్య ఇడియప్ప పరంపరతో చావో రేవో తేల్చుకోవడానికి రంగంలోకి దిగుతాడు.

        ఇప్పుడు బాక్సింగ్ కి దూరంగా వుంటున్న సమర, ఇడియప్ప బాక్సరైన  వేట పులిని ఓడించడానికి రంగంలో కెలా దిగాడు, దాంతో ఎదుర్కొన్న పరిణామాలేమిటి, ఆ అడ్డంకుల్ని అధిగమించి వేట పులినెలా మట్టి కరిపిస్తూ, సార్పట్టాకి విజయం కట్ట బెట్టాడన్నది మిగతా కథ.  

 ఎలావుంది కథ

    ముందుగా ఇది కథ కాదని, గాథ అనీ గుర్తించాల్సి వుంటుంది. గాథ ఎలా అయిందో తర్వాత చూద్దాం. సార్పట్టా అంటే నాల్గు పట్టా కత్తులని అర్ధం. ఉర్దూలో చార్ పట్టా తమిళంలో సార్పట్టా,అయిందని సమాచారమిచ్చారు. ఈ పేరు బాబూ భాయ్ పరంపర నుంచి వచ్చింది. సినిమాలో చూపించినట్టు సార్పట్టా పరంపర, ఇడియప్ప పరంపర అంటూ ఉత్తర మద్రాసులో రెండే బాక్సింగ్ పరంపరలు కాకుండా ఇంకా చాలా వుండేవి. ఇవి వంశాలకి చెందిన పరంపరలు కావు, గురుశిష్యులకి చెందిన పరంపరలు. ఇడియప్ప పరంపర అంటే పిడుగులా మెరుపు దాడి చేసే వాళ్ళని అర్ధం.

        1930 లలో సార్పట్టా పరంపరని ప్రారంభించింది కితేరి ముత్తు అనే అతను. అయితే తన తాత గారైన ఈయన పేరు సినిమాలో ఎక్కడా చెప్పలేదనీ, ఉత్తర మద్రాసు బాక్సింగ్ చరిత్రని వక్రీకరించారనీ పెద్ద మనవడు జాన్సన్ ముత్తు ఆరోపణ. పైగా 1942 లో బ్రిటిష్ బాక్సర్ టెరి ని తన తాత ఓడిస్తే, సినిమాలో రంగన్ వడియార్ ఓడించినట్టు హీరో ఆర్య పాత్రతో అన్పించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు. టెరిని ఓడించిన తన తాత గార్ని ద్రవిడ వీరన్ బిరుదుతో ఘనంగా సన్మానించారనీ గుర్తు చేశాడు జాన్సన్. ఇతడి తమ్ముడు స్టీవెన్ ముత్తు చెన్నైలో బాక్సింగ్ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఆనాడు ఈ పరంపరలు బాక్సింగ్ క్లబ్బులేనని స్టీవెన్ వివరణ.

        అలాగే ఎమ్జీఆర్ గురించి కూడా తప్పుడు సమాచారమిచ్చారన్నాడు జాన్సన్. సినిమాలో ఎమ్జీఆర్ బాక్సింగ్ ని ప్రోత్సహించ లేదనట్టుగా చూపించారనీ, కానీ ఎమ్జీఆర్ బాక్సింగ్ ని ప్రోత్సహించడమే గాక, మహ్మదాలీ వంటి అంతర్జాతీయ బాక్సర్స్ ని మద్రాసుకి రప్పించి స్థానిక బాక్సర్స్ తో ఈవెంట్స్ జరిపించారనీ జాన్సన్ వివరించాడు. ఎమ్జీఆర్ సార్పట్టా పరంపర ఫ్యాన్ కూడాననీ, తను నటించిన కావల్ కారన్ లో తను సార్పట్టా పరంపరకి చెందిన వాణ్ణని డైలాగు కూడా చెప్పారని జాన్సన్ చెప్పాడు. సార్పట్టా పరంపర కులాలకి, మతాలకి, రాజకీయాలకీ అతీతమని కూడా చెప్పాడు.

     ఉత్తర మద్రాసులో ఆనాటి ఈ పరంపరలు శ్రామిక వర్గాల క్రీడాభినివేశానికి ప్రతీకలు. కానీ సార్పట్టా కి కులమతాలు, రాజకీయాలూ లేవని జాన్సన్ చరిత్ర విప్పితే, సినిమాలో చరిత్రని కప్పి రాజకీయాల్ని ఆపాదించారు. అధికారంలో వున్న ముఖ్యమంత్రి కరుణానిధి కి సార్పట్టా మద్దతుగా వుండేదన్నట్టు చూపించారు. ఇలా చూపించడానికి కారణం 1975-77 ల మధ్య ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఈ సినిమా గాథా కాలంగా తీసుకోవడమే. ఇందువల్ల ఈ గాథకి ఎమర్జెన్సీ నేపథ్యం అతకకుండా పోయింది.

        1975 లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా వున్న కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో 1976 జనవరిలో కరుణానిధి ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. డీఎంకే పార్టీ నాయకుల్ని జైళ్ళల్లో కుక్కింది. నేటి ముఖ్య మంత్రి ఎంకె స్టాలిన్, మురసోలి మారన్ వంటి నాయకులెందరో జైళ్ళల్లో చిత్రహింసలకి గురయ్యారు. అప్పుడు డీఎంకే లో వున్న ఎమ్జీఆర్ పార్టీని చీల్చి ఏఐఏడీఎంకే పార్టీ స్థాపించి, 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీని సమర్ధిస్తూ ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.

        ఎమర్జెన్సీ కాలంలో ఈ రాజకీయ పరిణామాల్ని సినిమాకి వాడుకుంటూ, రాజకీయాలతో సంబంధం లేని సార్పట్టా పరంపరకి రాజకీయ రంగులు పులిమినట్టు అర్ధమవుతోంది. ఇంతకీ ఎమర్జెన్సీ నేపథ్యం సినిమాకి ఉపయోగపడింది కూడా పెద్దగా ఏం లేదు- కేవలం కరుణానిధి ప్రభుత్వం పడిపోయాక జరిగిన అరెస్టులు, అందులో కోచ్ రంగయ్య జైలు కెళ్ళడం వంటి గాథని ప్రభావితం చెయ్యని రెండు సన్నివేశాలు చూపించడం మినహా.

        ఇదీ సార్పట్టా పరంపర చరిత్రకి, దీనికి ఎమర్జెన్సీ నేపథ్యానికీ న్యాయం చేకూర్చిన విధం. ఇవి శ్రామిక వర్గాల పరంపరలు. పరస్పరం శ్రామిక వర్గాలు తలపడే ఈ బాక్సింగ్ పోటీలు వాళ్ళ మధ్య ఒక సెలబ్రేషనే తప్ప, పై వర్గాల అణిచివేతల తాలూకు సంఘర్షణలు ఇక్కడ చిత్రించేందుకు అవకాశంలేదు, చిత్రించ లేదు కూడా.

నటనలు- సాంకేతికాలు

     ఆర్య పోషించిన సమర పాత్ర స్పోర్ట్స్ సినిమా టెంప్లెట్ పాత్రే. స్పోర్ట్స్ సినిమాలు ఒక టెంప్లెట్ లోనే వుంటాయి. క్రీడలో రాణించాలని తపన, శిక్షణ, క్రీడలో ఓటమి, తిరిగి సంఘర్షణ, ఆత్మవిశ్వాసం,  చివరికి విజయం- ఇదే వరసలో వుంటాయి కాబట్టి ఆర్య పాత్ర కూడా ఇలాటి రొటీనే. కాకపోతే ఇది పాసివ్ పాత్ర. పాత్ర ప్రకారం కథ అనుకోవాల్సింది అనుకోకుండా, కథ ప్రకారం పాత్ర అనుకున్నారు కాబట్టి, కథానాయకత్వం లోపించి కథ గాకుండా ఈ సినిమా గాథ అయింది.

        పీరియెడ్ లుక్ తో ఆర్య పోషించిన సమర అనే పాత్ర మేకోవర్ కోసం, కండ పుష్టి కోసం తీసుకున్న కఠిన ట్రైనింగ్ కి నిలువెత్తు సాక్షిగా వుంటాడు. ఈ కఠిన ట్రైనింగ్ తో బాక్సింగ్ దృశ్యాల్ని రసవత్తరం చేశాడు. సమర బాక్సింగ్ పాత్రకి ఆనాటి వరల్డ్ ఛాంపియన్ మహ్మదాలీని మోడల్ గా తీసుకున్నట్టు దర్శకుడు వెల్లడించాడు. అయితే స్పీడ్ పంచ్ కి ప్రసిద్ధుడైన మహ్మదాలీ అతి సునాయాసంగా, పెద్దగా కష్టపడకుండానే, ప్రత్యర్ధిని ఔట్ చేసేసే నైపుణ్యంతో వుంటాడు. సాత్వికంగా అన్పించే ఈ సింపుల్ ట్రిక్ మాస్ సినిమాకి వర్కౌట్ కాదని ఆర్యతో హోరాహోరీ, రక్తసిక్త బాక్సింగ్ కి తెరతీశారు. ఆర్య మీద మొత్తం మూడు ఈవెంట్లు చిత్రీకరించారు.

        పై ఔటర్ స్ట్రగుల్ కి ఇన్నర్ స్ట్రగుల్నీ జత చేశారు : బాక్సింగ్ ని ద్వేషించే తల్లితో సంఘర్షణ, తాగుడు మరిగాక భార్యతో సంఘర్షణ. ఇలా ఇన్నర్, ఔటర్ స్ట్రగుల్స్ తో పరిపూర్ణ పాత్ర అన్పించే ప్రయత్నం చేశారు. ఈ స్ట్రగుల్స్ ని ఆర్య శక్తి వంచన లేకుండా పోషించాడు. అయితే ఇంత మాస్ కమర్షియల్ లో ఆర్య పాత్రకి ఎంటర్ టైనింగ్ పార్శ్వాన్ని కల్పించలేదు. ఏ పాత్రకీ కల్పించ లేదు కాబట్టి, సినిమాలో కామెడీ, వినోదం లాంటివి కన్పించవు.

        తల్లి పాత్రలో అనుపమా కుమార్, భార్య పాత్రలో దుషారా విజయన్ లకి సంఘర్షించడానికి రొటీన్ పాయింట్లే కావడంతో ఫార్ములా పాత్రలుగానే వుంటాయి. ఆర్య ప్రత్యర్ధి పాత్రలో వేట పులిగా జాన్ కొక్కెన్ కవ్వింపు ఎక్స్ ప్రెషన్స్ బావున్నాయి. ఈ బాక్సింగ్ పాత్రకి మైక్ టైసన్ ని మోడల్ గా తీసుకున్నట్టు చెప్పుకున్నారు. దీనికి కూడా వయొలెన్స్ ని జోడించి సినిమాటిక్ గా మార్చేశారు. ఇక ఇంకో బాక్సింగ్ పాత్రలో డాన్సింగ్ రోజ్ గా షబీర్ కలరక్కల్ నటించాడు. నిజానికిది ఆనాటి పాపులరైన డాన్సింగ్ మోహన్, డాన్సింగ్ ఎలుమలై వంటి రియల్ ఫైటర్స్ ఆధారంగా రూపొందించిన పాత్ర అని మనకి సమాచారమందుతోంది.

        ఈ బాక్సింగ్ కి యాక్షన్ కొరియోగ్రఫీ అన్బరీవ్ నిర్వహించాడు. 2015 లో హిందీలో వచ్చిన 'బ్రదర్స్' లో బాక్సింగ్ కి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో ఫ్యూజన్ చేసి బాక్సింగ్ టెంప్లెట్ ఇన్నోవేట్ చేశారు. మారిన కాలానికి సార్పట్టా వాస్తవిక పీరియెడ్ తో ఈ ప్రయోగం చేసే అవకాశం లేక, రెగ్యులర్ కమర్షియన్ బాక్సింగ్ నే చూపించారు. గొప్ప కోసం రూల్స్ జోలికి పోకుండా, సాంకేతిక భాష వాడకుండా, కామెంటరీ కూడా మాస్ భాషలో చెప్పిస్తూ, దేశవాళీ ఆటగానే చూపించడం మాత్రం కొత్తదనమే.

        మురళి ఛాయాగ్రహణం, గ్రేడింగ్, పీరియడ్ లుక్ ని తెస్తే, ఇతర కూర్పు, కళాదర్శకత్వం, వస్త్రాలంకరణ, కేశాలంకరణ మొదలైన సాంకేతిక విభాగాల పని తీరు ఉన్నత స్థాయిలోనే వున్నాయి. స్క్రిప్టు మాత్రం పోటీ పడలేదు.

చివరికేమిటి
     ఇండిపెండెంట్, రియలిస్టిక్ జానర్ కథనాలు ఈ రెండు స్కూల్స్ నుంచి వచ్చిన మేకర్లు కమర్షియల్ సినిమాలకి- అందునా బిగ్ బడ్జెట్  మూవీస్ కి చేస్తూంటారు. తమిళంలో 'మండేలా'తో ఎం. అశ్విన్, 'సార్పట్టా'లో పా రంజిత్ ఇదే చేశారు. కమర్షియల్ స్క్రిప్ట్ రైటర్స్ ని మొనటానీ పంజరంలోంచి బయటికి తీయించే కథన కలాపం 'మండేలా' లో వున్నట్టు, సార్పట్టా లోనూ  వుంది. అంటే బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్) విభాగంలో అన్నమాట.

        బిగినింగ్ అంటే ఏమిటి? ప్రధాన పాత్ర సహా కొన్ని కీలక పాత్రల్ని పరిచయం చేసి, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసి, దాంతో బిగినింగ్ ని ముగిస్తూ, అప్పుడు వచ్చే ప్లాట్ పాయింట్ వన్లో ప్రధాన పాత్రని సమస్యలో పడేసి, ఆ సమస్యలోంచి బయటపడాలన్న గోల్ ని ఏర్పాటు చేయడమేగా? ప్రతీ సినిమాలో మార్పు లేకుండా హీరో కిదే తంతుగా?

        స్ట్రక్చరనేది దాని చట్రంతో అది శాశ్వతమే. ఎన్ని యుగాలు గడిచినా ఈ చట్రం చట్రమే, మారదు. మార్చాలని  క్రియేటివిటీకి పాల్పడితే కాళ్ళో, మొండెమో, తలకాయో లేని వికృత కథ చేతికొస్తుంది. కనుక బిగినింగ్- మిడిల్- ఎండ్- ఈ మూడిట్లో దేన్నీ తీసేసే క్రియేటివిటీకి పాల్పడ లేరు. పాల్పడగల్గేది ఆ చట్రమనే ఏర్పాటు లోపల చేసుకునే కథనంతో క్రియేటివిటీ మాత్రమే.

        కానీ - మీరు చట్రంలో వున్నప్పుడు చట్రాన్ని చూడలేరన్నాడు సీడ్ ఫీల్డ్. నిజమే, దీంతోనే వస్తోంది చిక్కంతా. లోపల కూర్చుంటే చట్రమే ఫీలవలేరు. కథనమే కనిపిస్తూంటుంది-  చూసిన సినిమాల్లోని రొటీన్ కథనం. బయట నుంచి చట్రాన్ని చూడగల్గితే ఆ చట్రమే కథనానికి కొత్త ఐడియాలిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోకుండా శాశ్వతమైన స్ట్రక్చరనే చట్రం లాగే, కథనాన్ని కూడా శిలాశాసనంలాగా పర్మనెంట్ ఆకారంతో చెక్కి పడేస్తూ పోతే, సినిమాలేమౌతాయి? చూసిందే చూడరా... అన్నట్టు తయారవుతాయి.

        ప్రతీ సినిమాలో హీరోయే ప్లాట్ పాయింట్ వన్లో సమస్యలో ఎందుకు పడాలి? గోల్ హీరోకే ఎందుకేర్పడాలి? తిరగేసి ఆలోచించ లేరా? విలన్సే సమస్యలో పడి, ప్లాట్ పాయింట్ వన్ గోల్ అనేది విలన్స్ కే ఏర్పడ కూడదా? మరి హీరో ఏమవుతాడు? ఏమీ కాడు, ఆగుతాడు. ఈ ఆపడమేగా క్రియేటివిటీ అంటే? మొన్న తమిళ మండేలా లో ఇదే చూశాం. ఇప్పుడు సార్పట్టా తమిళంలోనూ ఇదే చూస్తున్నాం.

    విలన్లయిన అన్నదమ్ములు ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు పోటీకి దిగడాన్ని ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంగా వుంటుంది మండేలా లో. ఇంతవరకూ ఈ బిగినింగ్ విభాగమంతా కథనం అన్నదమ్ముల మీదే వుంటుంది. బలహీనుడైన హీరో మండేలా అలా వెయిటింగ్ లో వుంటాడు. ఈ బిగినింగ్ విభాగమంతా బలహీనుడైన మండేలా మీద గాక, బలమైన విలన్లయిన అన్నదమ్ముల  మీద వాళ్ళ తగాదాలకి సంబంధించిన కథనం చేసి, వాళ్ళ మధ్యే వాళ్ళ కేర్పడే గోల్స్ తో ప్లాట్ పాయింట్ వన్ కి చేర్చాడు.ఈ విలన్ల గొడవతో సంబంధం లేకుండా మండేలాని బార్బర్ జీవితానికి పరిమితం చేశాడు. మరిప్పుడు ప్లాట్ పాయింట్ వన్ విలన్ల చేతి కెళ్ళిపోయాక మండేలా చేసేదేమిటి? దే సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది మిడిల్ (సెకండ్ యాక్ట్) లో.  

        ఇదే బిగినింగ్ కథనాన్ని సార్పట్టా లో కూడా చూడొచ్చు. ఇందులో హీరో ఆర్య బిగినింగ్ విభాగంలో మండేలా లాగే బలహీన క్యారక్టర్. మండేలా బార్బర్ అయితే ఆర్య హార్బర్ కూలీ. ఒకవైపు బాక్సింగ్ ఈవెంట్స్ భారే యెత్తున జరుగుతున్నా తల్లి భయంతో బాక్సింగ్ జోలికి పోకుండా, ఈవెంట్స్ చూస్తూ ఖాళీగా గడిపేస్తూంటాడు ఆర్య. మూస కమర్షియల్స్ లో హీరోనిలా ఖాళీగా చూపించే ధైర్యం చేయలేరు, స్ట్రక్చర్ గురించి తెలీక.

        బిగినింగ్ ప్రారంభంలో ఇరవై రెండు నిమిషాల సుదీర్ఘ నిడివితో సార్పట్టా - ఇడియప్ప పరంపరల మధ్య ఈవెంట్స్ ఒకే సీనుగా, ఒకే ఎపిసోడ్ గా వుంటాయి. బిగినింగ్ మొదలవగానే ఇలా ఇరవై రెండు నిమిషాల ఒకే సుదీర్ఘ సీనుతో కథనం చేయడం కొత్తగా అన్పించే క్రియేటివిటీ కాక ఏమిటి.

        ఈ ఈవెంట్స్ ని పని లేకుండా కేవలం ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేస్తూంటాడు ఆర్య. ఇదే మోనాటనీని వదిలించుకున్న ఇన్నోవేషన్. దీని తర్వాత పది నిమిషాలకి సార్పట్టా - ఇడియప్ప పరంపరల మధ్య ప్లాట్ పాయిట్ వన్ తో బిగినింగ్ ముగుస్తుంది. ఈ రెండు పరంపరల మధ్య ఫైనల్ షో డౌన్ గా, ఇడియప్ప పరంపర సార్పట్టాకి చివరి అవకాశ మివ్వడం సమస్య నేర్పాటు చేస్తుంది. అంటే ఇక సార్పట్టా కి చెందిన కోచ్ పశుపతికి,  ఇడియప్పని ఎట్టి పరిస్థితిలో ఓడించాలన్న గోల్ ఏర్పడడం...

(మిగతా రేపు)
సికిందర్