అప్పట్లో ఆంధ్రభూమి వెన్నెల్లో రివ్యూలు చూసి విజయవాడ నుంచి ఉత్తరం రాసి వచ్చేశాడు. అప్పట్నుంచీ సినిమాలే జీవితంగా బ్రతికాడు. నవతరంగం వెబ్ సైట్ కి సమీక్షలు రాసేవాడు. సినిమా జ్ఞానాన్ని బాగా పెంచుకున్నాడు. అంతలో అదృశ్యమై పోయాడు. పదేళ్ళ తర్వాత పిడుగురాళ్ళ నుంచి ఫోన్ చేసి, నిర్మాత దొరికాడని, కథ చేసి పెట్టాలని కోరాడు. మళ్ళీ అదృశ్యమైపోయాడు. గత జనవరిలో విజయవాడ నుంచి ఫోన్ చేసి, ఫిబ్రవరిలో విజయవాడలో ఫిలిం స్కూలు పెడుతున్నానని, వచ్చి క్లాసు చెప్పాలని కోరాడు. ఆ ఫిలిం స్కూలు కోసం ఎదురు చూస్తూంటే శాశ్వతంగా అదృశ్యమైపోయాడు. పదేళ్ళుగా బాధిస్తున్న కిడ్నీ సమస్య చివరికి ప్రాణాల్ని కోరింది. ఆదిత్య చౌదరి ముల్పూరి కోరికల్ని మాత్రం అలాగే వదిలేసి తీసికెళ్ళిపోయింది....