రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, ఏప్రిల్ 2021, గురువారం


       సైకాలజీ, సినిమా కథ వేర్వేరు ప్రక్రియలు. సైకాలజీ ఆధారంగా సినిమాలు తీస్తే  సినిమాలు ఇంకో రూపంలోకి మారతాయి. శివ నే తీసుకుని సైకాలజీ ఆధారంగా తీస్తే ఇంకోలా వుంటుంది. ఇదెలాగో తర్వాత చూద్దాం. ముందు జీవితంలో సమస్య ఏదైనా ఎదురైతే, ఆ సమస్యని అక్కడితో మర్చిపొమ్మంటుంది సైకాలజీ. మర్చిపోయి పరిష్కారం మీదికెళ్ళి పొమ్మంటుంది. సమస్య వస్తే దానికి కౌంటర్ గా పరిష్కారాన్ని పెట్టాలి. ఇలా గాకుండా సమస్య గురించే ఆలోచిస్తూ, ఆందోళన చెందుతూ వుంటే, సమస్యతోనే వుండిపోతారు. దీంతో ఆ సమస్య మరిన్ని సమస్యలకి దారితీస్తుంది. ఇంకేవో బాధలు చుట్టు ముడతాయి, మైండ్ చెడుతుంది, మానసిక సమస్యలొస్తాయి. అన్నం సయించదు, నిద్రపట్టదు. ఇక అసహనం కోపం అరుపులూ వగైరా ఆడియో విజువల్ ఎఫెక్ట్సు, హాస్పిటల్ బెడ్ అదనపు హంగులు- ఇదంతా అవసరమా? ఇదంతా లో- వైబ్రేషన్ యాక్టివిటీ. ఈ లో- వైబ్రేషన్స్ ని చుట్టూ వున్న వాళ్ళకి కూడా అంటించేస్తారు. కనుక ఏం చేయాలంటే, సమస్యతో ఫలానా ఈ పరిస్థితి వచ్చింది సరే, ఇక దాన్ని వదిలేసి, ఇలా కాక ఏ పరిస్థితి వుంటే బావుంటుందని కోరుకుంటున్నారో - ఆ పరిస్థితిని విజువలైజ్ చేసుకుని, వెంటనే దాని సాధనకి యాక్షన్లోకి దిగి పొమ్మంటుంది సైకాలజీ. ఇది హై వైబ్రేషన్ యాక్టివిటీ. మైండ్ అనేది ముందుకెళ్ళే యాక్షన్ కోసమే తప్ప, జడంగా వుండే బాధ కోసం కాదు, దాంతో మానసిక, శారీరక అనారోగ్యాలు తెచ్చుకోవడం కోసం కాదు.  

        అందుకని మైండ్ ని ఎలా ట్రైనప్ చేసుకోవాలంటే, సమస్య ఎదురైనప్పుడు ఫ్లాష్ లా దాని మారు దృశ్యం (పరిష్కారం) విజువలైజ్ అయిపోవాలి. విజువలైజ్ ఎందుకంటే, మైండ్ కి ఒక థాట్ వచ్చిందంటే ఇంకో థాట్ మీదికి వెళ్లిపోతుంది. నిమిషానికి 260 థాట్స్ వస్తాయి మైండ్ కి. అంత బిజీగా వుంటుంది. అందుకని సమస్యకి పరిష్కారంగా ఒక థాట్ వచ్చిందంటే, వెంటనే దాన్ని విజువలైజ్ చేసుకుంటే, మైండ్ ఆ విజువలైజ్ అయిన దృశ్యం మీద ఆగిపోతుంది. ఇక ఆ దృశ్యాన్ని ఓన్ చేసుకుని, దాన్ని సాధించే వైబ్రేషన్స్ ప్రసారం చేస్తూ ముందుకు సాగిపోతుంది. సమస్యకి పరిష్కారంగా కోరుకుంటున్న దృశ్యాన్ని కళ్ళు మూసుకుని  మైండ్ లో మైండ్ కి చూపించాలి. చూపిస్తే ఆ పరిష్కారాన్ని నిజం చేసే పని మైండ్ చూసుకుంటుంది.
***
        ఇప్పుడు సినిమా కథలో ఏం జరుగుతుందో చూద్దాం. హీరో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గరి కొస్తాడు. అక్కడ సమస్య ఎదురవుతుంది. దాంతో పోరాటం మొదలెడతాడు. పోరాడుతూ పోరాడుతూ పోరాడుతూ పోయి పోయీ, చివరాఖరికి ఎక్కడో సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర, పరిష్కారం కనిపెడతాడు. ఇది ఒక రోజు నుంచి కొన్ని సంవత్సరాల కథగా వుండొచ్చు. అంటే అంత కాలం సమస్యనే పట్టుకుని మధన పడుతున్నాడన్న మాట. పరిష్కారం ఆలోచించాలని తట్టడమే లేదు ప్లాట్ పాయింట్ టూ కి వచ్చేదాకా. ఈ క్రమంలో చాలా నష్టాలు కూడా చవి చూస్తాడు.

        దీన్ని శివ  అనే యాక్షన్ లో చూద్దాం : ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నాగార్జున జేడీని కొట్టి పడేశాక, అది మాఫియా భవానీతో సమస్యకి దారి తీస్తుంది. ఇక ఆ భవానీతో  పోరాడీ పోరాడీ, సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర, భవానీతో సమస్యకి పరిష్కారంగా భావానీ అనుచరుడు గణేష్ ని పట్టుకుంటాడు. ఈ పోరాటంలో ఒక మిత్రుణ్ణీ, అన్న కుమార్తెనీ కోల్పతాడు.

        దీనికి పైన చెప్పుకున్న సైకాలజీ ఆధారంగా చేస్తే? అప్పుడు ప్లాట్ పాయింట్ వన్ లో నాగార్జున జేడీని కొట్టాక, భవానీతో ఎదురైన సమస్యకి వెంటనే పరిష్కారం ఆలోచిస్తాడు. దాన్ని విజువలైజ్ చేసుకుంటాడు. బిగ్ పిక్చర్ ని చూస్తాడు. సమస్య పట్టుకుని, సమస్యతోనే వుండిపోయి, భవానీతో పిన్ టు పిన్ పోరాటం చేయడు. దూర దృష్టితో బిగ్ పిక్చర్ ని చూస్తాడు. మొత్తం నగరానికి భవానీ సమస్యని  వదిలించే పిక్చర్. దీనికి అతడి మూలాల్ని పెకిలించి వేసే నిర్ణయం. ఇందుకు గణేష్ నే పట్టుకోవాలన్న గోల్.

        అంటే సినిమాలో చూపించినట్టు ప్లాట్ పాయింట్ టూ దగ్గర, గణేష్ ని పట్టుకునే పరిష్కార మార్గమేదో ఇప్పుడే ఆలోచిస్తాడన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యకి కారణమైన జేడీని కొట్టిన సంఘటనని ఇక మనసులోంచి తుడిచేసి, గణేష్ ని పట్టుకునే పరిష్కారాన్ని విజువలైజ్ చేసుకుంటాడన్న మాట. సింపుల్ గా చెప్పాలంటే తాత్కాలికమైన ప్రెజెంట్ కోసం గాక, శాశ్వతమైన ఫ్యూచర్ కోసం ప్రయాణం సాగిస్తాడన్న మాట.
***
        నిజానికి శివ సెకండాఫ్ రెండో సీన్లో మిత్రుణ్ణి కోల్పోపోయిన నేపథ్యంలో నాగార్జున అంటాడు : "నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది. మల్లిని చంపాడన్న కోపంతో నేను భవానీని చంపితే, వ్యక్తిగతంగా నా పగ తీర్చుకోవడమే తప్ప, ఇంకేమీ జరగదు. ఈ భవానీ కాకపోతే రేపు గణేష్ భవానీ అవుతాడు, లేకపోతే ఇంకొకడు. దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు, అలాటి గూండాల్ని పుట్టిస్తున్న వ్యవస్థని నాశనం చెయ్యాలి- గెలుస్తానో లేదో తెలీదు, కానీ ప్రయత్నిస్తాను" అని.

         వ్యవస్థని నాశనం చేయాలన్న బిగ్ పిక్చర్ ని ఆలస్యంగా ఇప్పుడు చూశాడు. దీన్ని సాధించే మార్గాన్ని ప్లాట్ పాయింట్ టూలో కనుక్కున్నాడు. సైకాలజీతో విభేదించి సినిమా కథల్లో పరిష్కారం ఆలస్యంగా ప్లాట్ పాయిట్ టూ దగ్గరే ఎందుకుంటుంది? ఎందుకంటే సినిమా కథలు స్పిరిచ్యువల్ జర్నీలు. ఇంకే మాధ్యమంలో కథలైనా స్పిరిచ్యువల్ జర్నీలే. స్పిరిచ్యువల్ జర్నీ అంటే మానసిక లోకపు మధనం. ప్రపంచ పురాణాల్లో కథలన్నీ  మానసిక లోకపు మధనాలే. కథలు మనిషి స్వాస్థ్యం కోసం - అంటే మానసిక శారీరక ఆరోగ్యాల కోసం మానసిక లోకపు మధనాలుగానే వుంటాయని పురాణాలు నిర్ణయించాయి. 
.
        ఇప్పుడు కూడా ఎవరు ఏ కథ రాయాలన్నా తెలియకుండా మానసిక లోకపు మధనాన్నే రాసేస్తారు. దీన్నుంచి తప్పించుకోలేరు. కథంటే మానసిక లోకం. ఏమిటా మానసిక లోకం? ఒక వెలుపలి మనసు, ఒక అంతరాత్మ, మధ్యలో అహం. ఈ మూడూ లేకుండా మానవ జాతి లేదు.

        సరే, అప్పుడు మానసిక లోకంలో అంతర్భాగంగా వుండే వెలుపలి మనసు, అంతరాత్మ, అహం - ఈ మూడూ కాన్షస్ మైండ్, సబ్ కాన్షస్ మైండ్, ఇగో లన్నమాట. అప్పుడు పురాణాల్లో, ఇతర కథల్లో, ఇవి 1. బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్- కాన్షస్ మైండ్ అంటే వెలుపలి మనసు), 2. మిడిల్ (సెకండ్ యాక్ట్ - సబ్ కాన్షస్ మైండ్ అంటే అంతరాత్మ), 3. ఎండ్ (థర్డ్ యాక్ట్ - మోక్షం) గా వుంటున్నాయి. ఇక ఇగో (అహం) పురాణాల్లో స్పిరిచ్యువల్ జర్నీ చేసే పురాణ పురుషుడుగా, ఇతర కథల్లో కథానాయకుడుగా, సినిమాల్లో హీరోగా వుంటున్నారు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పరమార్ధం ఇదన్న మాట.

        ఇప్పుడు ఈ నిర్మాణంతో వున్న మానసిక లోకంలో ఏం జరుగుతుంది? వెలుపలి మనసులో వుండే ఇగో, అంతరాత్మలో ఎంటరై, జీవితాన్ని మధిస్తుంది. తన సమస్యకి  పరిష్కారాన్ని అంతరాత్మ నుంచి అంది పుచ్చుకుని, మధనాన్ని ముగిస్తుంది. స్క్రీన్ ప్లేలో దీన్నిలా చూస్తాం : బిగినింగ్ (వెలుపలి మనసు) లో వుండే హీరో, ప్లాట్ పాయింట్ వన్ అనే గడప తొక్కి, సమస్యని తీసుకుని, మిడిల్ (అంతరాత్మ) లోకి ఎంటరై, సంఘర్షణ చేసి, పరిష్కారంతో ప్లాట్ పాయింట్ టూ అనే వెనుక గడప తొక్కి, ఎండ్ లోకి అడుగుపెట్టి  విజయం సాధించడం.

        రాముడు అయోధ్యలో వుండడం బిగినింగ్, అడవుల కెళ్ళడం మిడిల్, రావణుణ్ణి సంహరించడం ఎండ్. అంటే మిడిల్లో పాత్ర ఎందులోనైతే ప్రవేశిస్తుందో, ఆ మిడిల్ అంతా సబ్ కాన్షస్ (అంతరాత్మ) వరల్డే. ప్రేమికుల మధ్య సమస్య వచ్చిందంటే, ఆ సమస్య వాళ్ళు మధించాల్సిన సబ్ కాన్షస్ వరల్డ్. పోలీసు హంతకుణ్ణి పట్టుకోవాలంటే ఆ వేట అంతా సబ్ కాన్షస్ వరల్డ్. ఒక్కడు లో మహేష్ బాబు భూమికని తెచ్చి గదిలో దాచాడంటే, ఆ గది సబ్ కాన్షస్ వరల్డ్. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కోర్టులో కేసు పోరాడుతున్నాడంటే ఆ కోర్టు సబ్ కాన్షస్ వరల్డ్. హార్రర్ సినిమాల్లో భూత్ బంగళా సబ్ కాన్షస్ వరల్డ్. పాత్ర వుంటున్న సాధారణ ప్రపంచం లోంచి, ఏ అసాధారణ లోకంలోకి ఎంటరైనా, అది సబ్ కాన్షస్ వరల్డే అవుతుంది.

        ఈ అంతరాత్మ లేదా సబ్ కాన్షస్ వరల్డ్ లో పాత్ర సమస్యతో పోరాటం చేస్తుంది. సమస్య రూపంలో అంతరాత్మ పాత్రకి పరీక్షలు పెడుతుంది. ఈ పరీక్షలు నెగ్గే ఉపాయాలూ అందిస్తుంది. ఈ పరీక్షలతో పాత్ర పడుతూ లేస్తూ ప్రయాణిస్తూంటుంది. ఇదే హీరోస్ జర్నీ అయింది. జీవితం గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలే ఈ జర్నీ. తెలుసుకున్న తర్వాత సమస్యలోంచి బయట పడే పరిష్కార మార్గం లేదా అమృత భాండం అంతరాత్మ అందిస్తుంది. ఈ పడుతూ లేస్తూ చేసే జర్నీలో ఒక్కో మజిలీ వుంటుంది. ఒక్కో మజిలీలో ఒక్కో సత్యాన్ని తెలుసుకుంటుంది పాత్ర.

        ఇందుకే సుఖాంతమో దుఖాంతమో జర్నీ చివర పరిష్కార మార్గంతో కథలన్నీ స్పిరిచ్యువల్ జర్నీలే. హాలీవుడ్ తీసినా ఇంతే. ఇందుకే శివ లో నాగార్జునకి ప్లాట్ పాయింట్ టూ దగ్గర మాత్రమే పరిష్కారం దొరికింది. ఇందుకే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, సమస్యతో బాటు బిగ్ పిక్చర్ ని చూసే పరిష్కార మార్గం అందక, పరీక్షలెదుర్కొంటున్న జర్నీలో భాగంగా, ఆలస్యంగా - సెకండాఫ్ సెకండ్ సీను మజిలీలో - ఇక వ్యవస్థని నాశనం చేయాలన్న బిగ్ పిక్చర్ ని చూడగలిగాడు నాగార్జున.
***
    ఇలా అంతరాత్మని తెలుసుకునే జర్నీగా స్పిరిచ్యువల్ కథలుంటాయి. కానీ సైకాలజీ ప్రకారం చూస్తే, కథకి అంతరాత్మని తెలుసుకునే స్పిరిచ్యువల్ జర్నీ అనేది  వుండదు. రోగం, దానికి తక్షణ ట్రీట్మెంట్ అన్న ప్రక్రియగానే వుంటుంది. వెళ్ళి ధ్యానం చేసి నీ అంతరాత్మని తెలుసుకొమ్మని సైకియాట్రిస్టు పంపడు. కనుక సైకాలజీ ప్రకారం చూస్తే,  శివ లో నాగార్జున భవానీతో రోగాన్ని చూస్తాడు. ఆ రోగానికి కారణమైన వ్యవస్థ మూలాల్ని నిర్మూలించడానికి గణేష్ ని పట్టుకునే ట్రీట్ మెంట్ ప్రారంభిస్తాడు. ఇలా కథ మారిపోతుంది. మరి శివ లో వున్న ప్లాట్ పాయింట్ టూ నుంచి గణేష్ ని ఇవతలికి లాగేస్తే, సైకాలజీ ప్రకారం ప్లాట్ పాయింట్ టూలో ఏం జరుగుతుంది? ఇది కథ చేస్తూంటే తెలుస్తుంది.

        సరే, మరి త్రీయాక్ట్స్ స్పిరిచ్యువల్ జర్నీ స్క్రీన్ ప్లేని ఇలా మార్చడం ఎంతవరకు సబబు? అసలిప్పుడున్న త్రీయాక్ట్స్ స్పిరిచ్యువల్ జర్నీ స్క్రీన్ ప్లే ఒకప్పుడు లేదు. పురాణాల్లోంచి వచ్చిన మోనోమిత్ (స్పిరిచ్యువల్ జర్నీ) స్క్రీన్ ప్లేల్లో 18 మజిలీలు వుండేవి. దీన్ని సీడ్ ఫీల్డ్ 5 కి కుదించి స్పీడు పెంచాడు. అంతమాత్రాన స్క్రీన్ ప్లేలు కథతో సైకోథెరఫీ చేసే మోతాదు ఏమీ తగ్గలేదు. సైకాలజీ ప్రకారం కథ చేసినా సైకో థెరఫీతోనే వుంటుంది. అంటే స్పిరిచ్యువల్ జర్నీ వుంటుంది. కాకపోతే ఈ స్పిరిచువల్ జర్నీ సమస్యతో వుండదు, రివర్స్ లో నేరుగా పరిష్కారంతో వుంటుంది.  
***
        సైకాలజీ ప్రకారం వున్న ఒక కథ చూద్దాం. నాగార్జున నటించిన మన్మథుడు 2 లో నాగార్జున సమస్య వాళ్ళమ్మ లక్ష్మి పెట్టిన మూడునెలల్లో పెళ్ళి చేసుకోవాలన్న డెడ్ లైన్. పెళ్ళి ఇష్టం లేని నాగార్జున దీన్నుంచి తప్పించుకోవడానికి మార్గం (పరిష్కారం) ఆలోచించి, రకుల్ ప్రీత్ సింగ్ తో కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. దాని ప్రకారం ఆమె పెళ్ళికి ఒప్పుకున్నట్టు నటించి, తీరా పెళ్ళి సమయంలో లేకుండా ఉడాయిస్తే, వాళ్ళమ్మ మళ్ళీ పెళ్ళి మాటెత్తదని ప్లాను. ఇలా సమస్యకి వెంటనే పరిష్కారం కనుక్కుని రంగంలోకి దిగుతాడు నాగార్జున. ఇది ఫెయిలైతే ప్లాన్ బి ఆలోచిస్తాడు. ఇలా ట్రయల్స్ వేస్తాడు. ఈ ట్రయల్స్ లో ప్రత్యర్ధి పాత్ర లక్ష్మి గల్లంతయి కథ విఫలమవడం వేరే విషయం. ట్రయల్స్ తో నాగార్జున చేసేది స్పిరిచ్యువల్ జర్నీయే. ఈ అర్ధాన్ని పట్టుకుని కథ చేసి వుండాల్సింది.

        స్పిరిచ్యువల్ జర్నీలే సినిమా కథలు. చదువుకోకుండా ఆవారాగా తిరిగే హీరో వుంటాడు. అతడితో ఇంట్లో గొడవ. అతను మారడు. అతణ్ణి ఇంట్లోంచి వెళ్ళి పొమ్మనడమో లేదా అతనే వెళ్ళి పోవడమో జరిగి, ఇక స్పిరిచ్యువల్ జర్నీ చేస్తాడు. మంచి చెడ్డలు తెలుసుకుని మారిన మనిషిగా తిరిగొస్తాడు.

        సైకాలజీ కథ - ఆవారా హీరోని ఇంట్లో ఏమీ అనరు. బాగా చదువుకుంటున్నాడు, బయటి తిళ్ళు తినడం లేదు, తాగి ఇంటికి రావడం లేదు, టైముకి కాలేజీకి వెళ్తున్నాడు, టైముకి ఇంటికే వస్తున్నాడు - ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ తో మనస్సులోనే ఆశీర్వదిస్తూంటారు. అతడిలో మార్పు కనబడతూంటుంది. ఆశీర్వాదానికుండే వైబ్రేషన్స్ అత్యంత శక్తివంతమైనవి. అందుకే గ్లాడ్ బ్లెస్ యూ అంటారు.

సికిందర్