రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, April 14, 2021

1035 : స్క్రీన్ ప్లే సంగతులు


 

        గాది శుభాకాంక్షలు. సినిమాలెలా వుండాలో థియేటర్లు నిర్ణయించడంతో ఒక మూసలో కమర్షియల్ సినిమాలదే రాజ్యమైంది. దీంతో ఆర్ట్, రియలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలనే ఇతర క్రియేటివ్ వ్యాపకాలకి ప్రదర్శనా రంగంలో చోటు లేకుండా పోయింది. గత రెండు దశాబ్దాలుగా మరీ థియేటర్లు ప్రేక్షకులంటే మూస ప్రేక్షకులేనని ముద్రవేసి, సినిమాలంటే మూస కమర్షియల్ సినిమాలేనని చెప్పడం వల్ల, మూసేతర సినిమాలు తీయాలనుకునే మేకర్స్ కి ప్రేక్షకులు కరువై పోయారు. దీంతో కె ఎన్ టీ శాస్త్రీలు, రాజేష్ టచ్ రివర్లు ఆర్ట్ సినిమాలతో ఫిలిమ్ ఫెస్టివల్స్ కి పరిమితమవాల్సి వచ్చింది. డాక్టర్ డి రామానాయుడు కూడా కమర్షియల్ సినిమాలు తీస్తూ మధ్య మధ్యలో అవార్డు సినిమా తీస్తాననేవారు. ఇదేదో మనకి సంబంధించింది కాదులే అనుకునే వాళ్ళు ప్రేక్షకులు. ఆర్ట్ సినిమా అంటే ప్రేక్షకులకి అంటరాని సినిమాగా అభిప్రాయం కల్గించారు. కోవిడ్ తో మనుషులే అంటరాని వాళ్ళయి, లాక్ డౌన్ తో థియేటర్లే మూతబడి, అవ్వాల్సిందంతా అయింది. లాక్ డౌన్ తో తెలుగు జాతి సామూహికంగా ఇళ్ళల్లో బందీ అయి, ఓటీటీల్లో నిర్బంధంగా సినిమాలు చూస్తున్నాక, ఆ ఓటీటీల్లో జీవితాలకి దగ్గరగా వుంటున్న వివిధ ఆర్ట్ -రియలిస్టిక్- ఇండిపెడెంట్ సినిమాల విలువ తెలిసి వచ్చింది. వచ్చాక వరస మారి చిన్న మూసకి ఎసరు వచ్చింది. చిన్న మూస ఒక ముంగిస.

        ప్పుడిక థియేటర్లకీ స్వేచ్ఛ లభించి, మూస తో బాటూ మూసేతర సినిమాలూ ప్రదర్శించుకునే అవకాశం చిక్కింది. అయితే మూసేతర రియాలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలనేవి దాదాపూ చిన్న సినిమాలుగానే వుంటాయి. తెలుగులో నూటికి 90 శాతం  చిన్న సినిమాలే ఉత్పత్తి అవుతున్నాయి, అట్టర్ ఫ్లాప్ కూడా అవుతున్నాయి. అందుకని  వీటి బాగోగుల గురించే పదే పదే చెప్పుకునేది. ఇంత కాలం చిన్న మేకర్లు చిన్న మూసలు తీస్తూ మూసకి మూసన్నర మోసపోయారు. పెద్ద మూసని స్టార్ కాపాడతాడు. చిన్న మూసని ఎవరూ కాపాడ లేరు. అయినా కూడా పెద్ద కమర్షియల్ మూసలకి భావ దాస్యం చేస్తూ, చిన్న మూస అంటే పెద్ద మూసగానే తీయాలేమో ననుకుని తీస్తూ, ఏడాదికి 100 మంది చొప్పున కొత్త మూస మేకర్లు రావడం, ఫ్లాప్ చేసుకుని వెళ్లిపోవడం.

      ఐనా కూడా ఇప్పుడింకా పద్ధతి మార్చుకుని రియలిస్టిక్, ఇండిపెండెంట్ సినిమాలకి చిన్న మేకర్ సిద్ధం కాకపోతే - పూర్వంలాగే థియేటర్ కి ఎలాగూ పనికి రాడు, ఇప్పుడు ఓటీటీకి కూడా దూరమవాల్సి వస్తుంది. గత వారం ఇంకొకటి గమనించాం. తెలుగు వాడైన ప్రభాస్ పానిండియా మూవీస్ తో ఆలిండియా స్థాయిలో తెలుగుకి కొత్త గుర్తింపు తెస్తున్నప్పుడు, ఈ అవకాశంతో చిన్న సినిమాలైనా పానిండియా కంటెంట్ తో తీసి -మార్కెట్ పెంచుకో వచ్చని గత వారం వ్యాసంలో రాశాం. ఇలాటివి గమనించాల్సినవి వున్నాయి.       

ఎవరు గమనిస్తున్నారు
, ఎవరూ గమనించడం లేదు. పరిస్థితి ఎప్పట్లాగే వుంది. లాక్ డౌన్ కి ముందు తలపెట్టిన చిన్న మూసలు ఇప్పుడెలాగూ విడుదలవుతాయి, అవుతున్నాయి. ఈ పోగు పడిన బ్యాక్ లాగ్ ని అర్ధం జేసుకోవచ్చు. కానీ లాక్ డౌన్ తర్వాత మారిన సినేరియాలో కూడా అవే చిన్న మూసలు ఇంకా ప్రారంభిస్తున్నారంటే, ఇక ఫ్రెష్ గా మారేది లేదన్న మాట.

        లిస్టు సేకరిస్తే కనీసం ఇప్పటికి ఓ ముప్ఫై చిన్న మూసలే తీస్తున్నట్టు తేలింది. కొందరు రియలిస్టిక్ ఔత్సాహికులు తాము విన్న, కన్న చిన్న మూస తయారీ దృశ్యాలు చెప్పుకుని వాపోతున్నారు. నిన్న ఉగాదికి ఒక రియలిస్టిక్ ఔత్సాహికుడు ప్రారంభమవుతున్న రెండు చిన్న మూసల గురించి చెప్పుకుని, వీటికేనా ఉగాది, మాకు లేదాని వాపోయాడు. నిన్ననే ఔట్ డోర్ లొకేషన్లో వున్న ఒక సీనియర్ అసోసియేట్ ఫోన్ చేసి, లొకేషన్లో పరిచయమైన ఒక ఔత్సాహిక నిర్మాత ఎంత చెప్పినా మూస గురించే ఐడియాలు చెప్తున్నాడని అప్డేట్స్ ఇచ్చాడు. అంటే మేకర్స్ ఒకరే మారితే లాభం లేదనేది కూడా ఒక వాస్తవమే.

***

      మండేలా సంక్షిప్త స్క్రీన్ ప్లే సంగతులకి ఈ ఉపోద్ఘాతం అవసరమవుతోంది. పర్యావరణం తెలుసుకోకుండా స్క్రీన్ ప్లే సంగతుల పరమార్ధం అర్ధంగాదు. ఓటీటీలతో పర్యావరణం మారింది. ఆ పర్యావరణంలో తెలుగు ప్రేక్షకులున్నారు, తెలుగు మేకర్స్ కూడా వుంటే బావుంటుంది. లేదంటే పర్యావరణ కాలుష్య కారకులవుతారు. మళ్ళీ చిన్న సినిమాలకి అంధకారమే సృష్టిస్తారు. అనేకులు ఈ పర్యావరణాన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ సీజన్ అనుకుంటున్నారు. వీటిని రియలిస్టిక్ గా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా మూస ఫార్ములాలుగానే వుంటున్నాయని తెలుసుకోవాలి. రియలిస్టిక్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్సే కాదు, సీరియస్ రాజకీయ, సామాజిక సమస్యలే కాదు; ప్రేమ, కుటుంబం, హాస్యం లాంటివి కూడా రియలిస్టిక్సే అవుతాయి. కాకపోతే వీటికి మూసని వదిలించి రియలిస్టిక్ జానర్ మర్యాదలు కూర్చాలి.

        ఈ రియలిస్టిక్ జానర్ మర్యాదలు నిజ జీవితం లోంచి వస్తాయి. మంచి జ్ఞాపక  శక్తితో మంచి కల్పనా శక్తి వస్తుందంటాడు అకిరా కురసావా. జ్ఞాపక శక్తి లోక జ్ఞానంతో  పెరుగుతుంది. వివిధ రంగాలకి సంబంధించిన జీకేతో ఎంత మెమరీ బ్యాంకు వుంటే అంత కల్పనా శక్తి పెరుగుతుంది. ఉదాహరణకి మండేలా లో పోస్టాఫీసు సీనులో వెనుక గుమ్మం లేకపోవడం, ముందు తలుపు వూడిపోవడం, ఈ రెండిటిలో మండేలా పాత్ర రీత్యా ఒక అనుమానం, ఒక భయం పైకి కనిపించి నవ్విస్తాయి. అనుమానం - బార్బర్ గా తను ఇళ్ళల్లోకి వెనుక గుమ్మం లొంచే వెళ్ళాలి కనుక, పోస్టాఫీసులోకి కూడా వెనుకనుంచే వెళ్ళాలనుకుని, వెనుక గొడకేసి అలా అనుమానంగా చూడడం.

        భయం - ముందు తలుపు వూడి పడగానే ఇక్కడ డబ్బులు దాస్తే వుంటాయా అని భయపడతాడు. ఇవి పైకి నవ్వించినా, ఒక అంతరార్ధం ఈ నవ్వుకి బేస్ వేసింది. పోస్టాఫీసుల్లో డిపాజిట్లు రిస్కులో వున్నాయనేది ఒక యదార్ధం. వెనుక నుంచి దొంగలు పడకుండా కట్టుదిట్టంగా వున్నా, ముందునుంచి దర్జాగా నిధులు తరలి పోతున్నాయి- ఎక్కడికి? దివాలా తీసిన ఎఫ్సీఐ కి. ఈ నిధులు మౌలిక సదుపాయాలకీ,ఇతర రాబడి నిచ్చే పెట్టుబడులకీ వెళ్ళాల్సినవి. ఈ పోస్టాఫీసు సీను వెనుక తెలియకుండా ఇంత వాస్తవముంది.

        ఇంకో సీను కూడా వుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నదమ్ముల్ని గెలిస్తే ఏం చేస్తారని అడిగితే, ప్రతి ఒక్కరి అక్కౌంట్ లో 15 వేలు వేస్తాననని అన్న అంటాడు, 20 వేలు వేస్తానని తమ్ముడు అంటాడు. ఈ సెటైర్ ఎక్కడ్నించి వచ్చిందో తెలిసిందే.

        ఇంకో సీనులో మెండేలా ఓటు కోసం వేలం పాడతారు అన్నదమ్ములు. ఇది పెరిగి పెరిగి 50 లక్షల దాకా పోతుంది. అప్పుడు ఎన్నికల అధికారి వచ్చి, నామినేషన్లతో బాటు వేసిన అఫిడవిట్లని చూపిస్తూ - ఇందులో మీ ఆస్తి 50 వేలని రాశారు, 50 లక్షలు ఎక్కడ్నించీ వచ్చాయనీ పట్టుకుంటాడు. ఇలా లోక వ్యవహారాలు రిఫ్లెక్ట్ అయ్యే, ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే కామెడీ. రియలిస్టిక్ జానర్ మర్యాద. ఇది లోక జ్ఞానంతోనే వస్తుంది.

***

      అయితే - అయితే - ఈ పర్యావరణానికి స్ట్రక్చర్ లో వున్న సినిమాలే అవసరం. సీను మారింది కదాని లాక్ డౌన్ లో పుట్టిన రియలిస్టిక్, ఇండిపెండెంట్లని కూడా అలవాటైన అదే మూసలో స్ట్రక్చర్ లేకుండా తీస్తే మళ్ళీ మొదటి కొస్తారు. ఈ మధ్య ఒక రియలిస్టిక్ స్క్రిప్టుతో ఇదే జరిగింది. రాసుకున్న 70 సీన్లలో 13 సీన్లే ప్రధాన కథ వుందని తెలుసుకోకుండా షూటింగు కెళ్ళి పోతున్నారు! హీరోహీరోయిన్లని బుక్ చేసుకునేప్పుడైనా ఎన్ని సీన్లున్నాయో చూసుకోలేదా అంటే, షాకులోంచి తేరుకో లేక సమాధానం లేదు. ఇంకా ఇలాటి విచిత్రాలున్నాయి. స్ట్రక్చర్ తో చేస్తే ఏదెలా వస్తోందో తెలుస్తూంటుంది, ఎక్కడెక్కడ ఏది రాకపోయినా వివిధ టూల్స్ తో సరిదిద్దుకోమని హెచ్చరిస్తూంటుంది. మూసకేం టూల్స్ వుంటాయి. మూస పనిముట్లు లేని గోస.

        కనుక స్ట్రక్చర్ సహిత స్టోరీ రైటింగ్ - కాదు, స్టోరీ మేకింగ్ అనాలి - ఇష్టపడని క్లబ్ ని అలా వుంచి, స్ట్రక్చర్ క్లబ్ లో మాట్లాడుకుంటే, మారిన సినేరియాలో రియలిస్టిక్స్ ని మళ్ళీ అవే పనీ పాటా లేని, పనిముట్లు లేని మూసలుగా తీస్తే లాభం లేదు. దేనికైనా త్రీయాక్ట్ స్ట్రక్చర్ వాడాల్సిందే. 50 లక్షల సినిమా స్క్రీన్ ప్లే అన్నాకూడా త్రీయాక్ట్ స్ట్రక్చరే గతి. లేకపోతే పైన చెప్పుకున్న Friday the 13th లాంటి భయపెట్టే సంగతి పదమూడు సీన్లతో.

***

    ఐతే- ఐతే-  త్రీయాక్ట్ స్ట్రక్చర్ తో ఒప్పుకు తీరాల్సిన నిజం ఒకటుంది. ఇది కూడా ఒక మూసే. స్ట్రక్చర్ పరంగా పరమ మూస. ఎలాగంటే, అదే ఫస్ట్ యాక్ట్, ఫలానా చోట అదే ప్లాట్ పాయింట్ వన్, అదే సెకండ్ యాక్ట్, ఫలానా చోట అదే ప్లాట్ పాయింట్ టూ, అదే థర్డ్ యాక్ట్... అనే ఈ యూనివర్సల్ స్ట్రక్చర్ ని ఇలాగే ఒక టెంప్లెట్ లా వాడుకుంటూ, పదేపదే అదే మోడల్ కథలు. ఇలా ఒక మోడల్లోనే ఏళ్ళ తరబడి సినిమాలొస్తున్నాయి హాలీవుడ్ నుంచి కూడా.

        కమర్షియల్ సినిమాలకిది తప్పదు. స్టార్స్ తో మరీ తప్పదు. ప్రయోగాలు చేయలేరు. కానీ రియలిస్టిక్స్ తో స్వేచ్ఛ వుంది. ఇక్కడ స్టార్స్ వుండరు. ఇప్పుడు రియలిస్టిక్ కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమానే కాబట్టి స్వేచ్ఛకి ఆంక్షల్లేవు. త్రీయాక్ట్ స్ట్రక్చర్ అనివార్య పరిస్థితి. ఇది వినా కథా నిర్మాణం లేదు సినిమాలకి. ఐతే ఈ స్ట్రక్చర్ ని పట్టుకుని క్రియేటివ్ పరికల్పనలని మర్చి పోవడం వల్లే స్ట్రక్చర్ మూస అయింది. స్ట్రక్చర్ ని ఫాలో అవుతూనే, ఆ సురక్షిత స్ట్రక్చర్ లోపల కథనంతో క్రియేటివ్ ప్రయోగాలు చేయక పోవడం వల్లే త్రీయాక్ట్ స్ట్రక్చర్ నిర్మాణాత్మక మూస అయింది. ఈ ప్రయోగాలు చేసుకునే స్వేచ్ఛ రియలిస్టిక్స్ తో కచ్ఛితంగా వుంది. ఇదే హిట్టయిన  పింక్ చెప్పింది (తెలుగు రీమేక్ లో కాదు), ఇదే హిట్టయిన మండేలా ఇప్పుడు చెప్తోంది...

***

    ఈ కొత్త తమిళ దర్శకుడు మండేలా అనే రియలిస్టిక్ తో రాత కనబడే సినిమా తీశాడు. రియలిస్టిక్స్ లో కూడా రాత కనపడక, తీత మాత్రమే కనబడే వొట్టి పోయిన సినిమాలు తీసేవాళ్ళే ఎక్కువ. మండేలా లో స్టార్ట్ టు ఫినిష్ ఆధునిక రాతే. అంత ఆధునిక రాత వల్ల ఇంత అందమైన సినిమా అయింది. అది కూడా స్ట్రక్చర్ తెలిసిన రాత. స్ట్రక్చర్ లోపల కథనంతో ప్రయోగం ఎలా చేయాలో తెలిసిన రాత. ఏమిటా ప్రయోగం ఎవరైనా కనిపెట్టారా?

        మండేలా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో 30 నిమిషాల్లో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇది స్ట్రక్చర్ సమయ పాలనే. ఐతే ఇది రొటీనే. కొత్తేం లేదు. మరి రొటీన్ కాని కొత్తేమిటి? ఈ ప్లాట్ పాయింట్ వన్ రివర్సై  హీరో మండేలా మీద లేక పోవడమే కొత్త. ఇది గమనించాల్సిన విషయం. హీరో మీదే ప్లాట్ పాయింట్ వన్ వుండడం సర్వసాధారణం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకే సమస్య ఎదురవడం, హీరోకే గోల్ ఏర్పడడం రొటీనే. ఈ రొటీన్ తోనే ఒకే మోడల్ కథలు వస్తూంటాయి.

        దీన్ని రివర్స్ చేసి హీరో మీద గాక విలన్ల మీద పెట్టాడు దర్శకుడు. ఇదే స్టార్ మీద కాక విలన్ మీద పెడితే స్టార్ డీలా అయిపోయి కన్పిస్తాడు. స్టార్ లేని రియలిస్టిక్ లో ఇలాంటప్పుడు హీరో ఆసక్తి కల్గిస్తాడు. ప్లాట్ పాయింట్ వన్ నుంచి పలాయనంలో వున్న ఈ రియలిస్టిక్ హీరో ఇప్పుడేం చేస్తాడన్న ఆసక్తి. తన ప్లాట్ పాయింట్ వన్ ని విలన్లు కబ్జా చేశారు. ఇప్పుడు స్ట్రక్చర్ లో తానేం క్లెయిమ్ చేస్తాడు? ఏ తురుపు ముక్క ప్రయోగించి ప్లాట్ పాయింట్ వన్ కాకపోయినా, స్ట్రక్చర్లో తనకంటూ ఓ కీలక స్థానాన్ని క్లెయిమ్ చేస్తాడు? స్ట్రక్చర్ తో ఆసక్తికర క్రియేటివిటీ.  

        విలన్లయిన అన్నదమ్ములు ఎన్నికల్లో ఒకరిమీద ఒకరు పోటీకి దిగడాన్ని ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంగా చేశాడు. కథ కోసం ఇక్కడ క్లిక్ చేసి రివ్యూ చూడండి. ఇంతవరకూ ఈ బిగినింగ్ విభాగమంతా కథనం అన్నదమ్ముల మీదే వుంచాడు. హీరో అయిన మండేలాని పట్టించుకోలేదు. ఈ బిగినింగ్ విభాగమంతా బలహీనుడైన మండేలా మీద గాక, బలవంతుల మీద వాళ్ళ తగాదాలకి సంబంధించిన కథనం చేసి, ప్లాట్ పాయింట్ వన్ కి చేర్చాడు. ఈ విలన్ల గొడవతో సంబంధం లేకుండా మండేలాని బార్బర్ జీవితానికి పరిమితం చేశాడు.

        అలాగని మండేలాని పాసివ్ చేయలేదు. అతడికి తండ్రి కల సెలూన్ నిర్మించాలన్న గోల్ పెట్టి, యాక్టివ్ పాత్రగానే చేశాడు. ఇది గమనించాలి. టూల్స్ తో స్ట్రక్చర్ లో వుంటే ఫ్లాపయ్యే పాసివ్ హీరో క్యారక్టర్లు తయారు కావు. పనిముట్లు లేని మూసలోనే ఇలాటివి తయారవుతాయి. మరిప్పుడు ప్లాట్ పాయింట్ వన్ విలన్ల చేతి కెళ్ళిపోయాక మండేలా చేసేదేమిటి? ఇది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఆ మాటకొస్తే ఈ సినిమా చివరంటా మండేలా సస్పెన్స్ తో కూడిన క్యారెక్టరే. ఏం చేస్తాడో తెలియదు, చేసినప్పుడే తెలుస్తుంది.

        విలన్ల గోల్ కి ఒక్క ఓటు కావాలి. మండేలా గోల్ కి సెలూన్ నిర్మించుకోవాలి. ఒక ఒరలో రెండు కత్తుల్లాంటి ఇదేం కథ? ఏ కథ ఏ కథగా మారుతుంది? విలన్ల ఓటు కథ మండేలా సెలూన్ కథగా మారుతుందా? మండేలా సెలూన్ కథ విలన్ల ఓటు కథగా మారిపోతుందా?

***

    విలన్లతో ప్లాట్ పాయింట్ వన్ తర్వాత ప్రారంభమయ్యే సెకండ్ యాక్ట్ లో విలన్లతో, మండేలాతో విడివిడిగా వాళ్ళ వాళ్ళ సెకండ్ యాక్ట్ బిజినెస్సే వుంటుంది. సెకండాఫ్ బిజినెస్ అంటే గోల్ కోసం సంఘర్షణ. ఒక అదనపు ఓటు ఎలా పొందాలన్న గోల్ తో విలన్ల విడివిడి సంఘర్షణ, మరో వైపు- సెలూన్ కోసం డబ్బు పొదుపు చేసే గోల్ తో మండేలా వేరే సంఘర్షణ. కొంపా గోడూ లేని తన దగ్గర కొందరు డబ్బు కొట్టేస్తే, మిగిలిన డబ్బు దాచుకోవడానికి పోస్టాఫీసులో ఖాతా తెరవడానికి పోవడం, అక్కడ తన పేరేమిటో తనకి తెలియక పోతే తెలుసుకు రమ్మని పోస్ట్ మాస్టర్ పంపడం, తన పేరు తెలుసు కోవడానికి వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ మండేలా హిలేరియస్ గా స్ట్రగుల్ చేయడం...ఇలా చివరికి పోస్ట్ మాస్టరే నెల్సన్ మండేలా అని పేరు పెట్టడంతో - ఆ పేరుతో ఆధార్ కార్డు తెచ్చుకుని ఖాతా తెరవడం, ఆధార్ కార్డు రావడంతో ఓటరు ఐడీ కార్డు కూడా వచ్చి- ఒక అదనపు ఓటరు కోసం చూస్తున్న అన్నదమ్ములకి ఇంటర్వెల్లో చిక్కడం!

        వెర్రి బాగుల వాడు అయిన తను తెలియకుండానే వెళ్ళి వెళ్ళి సంబంధం లేని కథలో ఓటరు కార్డుతో విలన్లకి చిక్కి కింగ్ అయిపోవడం, వాళ్ళ కథలో తన స్థానమేమిటో స్ట్రక్చరల్ గా క్లెయిమ్ చేసుకుని పాగా వేయడం!
***
        స్ట్రక్చర్ తో రియలిస్టిక్ కథకి ప్రయోగమిది. స్ట్రక్చర్ తెలియకపోతే ఎలా ప్రయోగాలు చేయాలో తెలీదు. కాబట్టి ఇప్పటికైనా అకారణంగా స్ట్రక్చర్ ని వ్యతిరేకించే తెలుగు మేకర్స్, పర్యావరణానికి న్యాయం చేయడం కోసం పునరాలోచన చేసుకోవాలి. ఇతర భాషల మేకర్స్ కి తీసిపోకుండా ఎదగాలి.

సికిందర్