రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, ఏప్రిల్ 2021, శుక్రవారం

1034 : రివ్యూ


మండేలా (తమిళం)
దర్శకత్వం : మడోన్ అశ్విన్
తారాగణం : యోగి బాబు
, షీలా రాజ్ కుమార్, సంగిలీ మురుగన్, జీఎం సుందర్, కణ్ణ రవి తదితరులు
రచన : మడోన్ అశ్విన్
, సుమన్ కుమార్ (కంటెంట్ హెడ్), సంగీతం : భరత్ శంకర్,
ఛాయాగ్రహణం : విధు అయ్యన్న
బ్యానర్స్ : వైనాట్ స్టూడియోస్
, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, ఓపెన్ విండో ప్రొడక్షన్స్, విష్ బెర్రీ
నిర్మాతలు : బాలాజీ మోహన్
, చక్రవర్తి రామచంద్ర, శశికాంత్
విడుదల : నెట్ ఫ్లిక్స్
, ఏప్రెల్ 5, 2021

***  

            మొన్న6 వతేదీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఈవీఎం లని గాడిదల మీద తరలిస్తున్నప్పుడు, ముందు రోజు విడుదలైన మండేలా లో గాడిద ని చూసి వుండరు. ఈ సినిమాలో హీరోని గాడిదా అనే పిలుస్తూంటారు. సరీగ్గా తమిళ నాడు పోలింగ్ కి ముందు రోజు, ఈ గాడిద తిరగబడి ఓటుకి నోటు, తాయిలం, కులం, మతం కాదని ఓటేస్తూ, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నయా ఓటింగ్ మోడల్ చూపిస్తే, పోలింగ్ రోజున ఎంత వరకూ ఇది  ప్రజల్లోకి వెళ్ళిందో తెలీదు.

        కానీ ఓటింగ్ పరంగా ఒక వినూత్న ఐడియాతో  మండేలా జాతీయ మీడియా కొనియాడుతున్న ఒక అర్ధవంతమైన పానిండియా అప్పీలున్న కంటెంట్ గల మూవీ. తమిళ టాప్ కమెడియన్ యోగిబాబుతో, కొత్త దర్శకుడు మడోన్ అశ్విన్ చేసిన కొత్త కమర్షియల్ ప్రయోగమిది. దీన్ని నిర్మాతలతో పూర్వ వివాదం కారణంగా చూపుతూ తమిళ బయ్యర్లు బాయ్ కాట్ చేయడం విషాదం. తెలుగు డబ్బింగ్ తో థియేటర్లలోకి వస్తే ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృత మవుతుంది తెలుగు ప్రేక్షకులకి. తెలుగులో పానిండియా కంటెంట్ గల మూవీలేని కొరత ఇలాగైనా తీరుతుంది.

కథ
    తమిళనాడులో సూరం కుడి అనే గ్రామం. పెరియావర్ (సంగిలీ మురుగన్) ఇక్కడి పంచాయితీ సర్పంచ్. ఇతను రామస్వామి పెరియార్ అభిమాని. ఇతడి కిద్దరు వేర్వేరు కులాల భార్యలు. వాళ్ళకిద్దరు కొడుకులు రత్నం (జీఎం సుందర్), మది (కణ్ణ రవి). వీళ్ళిద్దరికీ పడదు. గ్రామాన్ని ఉత్తర గ్రామం, దక్షిణ గ్రామంగా విభజించి, ఉత్తరం ఒక కులం, దక్షిణం ఒక కులంగా కులాధిక్య పోరాటాలు చేస్తూంటారు. ఒకరు చేసిన అభివృద్ధిని ఓర్వలేక ఇంకొకరు ధ్వంసం చేస్తూంటారు. ఉత్తర కులం నాయకుడు రత్నం, దక్షిణ కుల నాయకుడు మది. వీళ్ళ తల్లులు కొడుకులతో కులాలుగా విడిపోయి వుంటారు. కానీ కోడళ్ళుగా కలిసి సీరియళ్ళు చూస్తూంటారు.

        తండ్రి పెరియావర్ పంచాయితీ కొచ్చే ఏ పనులు ఏ కొడుక్కి అప్పజెప్పినా, రెండో కొడుకు ధ్వంసం చేస్తాడని, జనం కూడా ఈ ధ్వంస రచనలో పాల్గొంటూ అభివృద్ధి అనేదే కళ్ళజూడరనీ కారణంగా చూపుతూ, పంచాయితీ పనులు వేరే కాంట్రాక్టర్స్ కి అప్పగిస్తూంటాడు. ఈ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ కట్టేందుకు పెరియావర్ సంతకం పెట్టాలి. పెడితే 30 కోట్లు వస్తాయి. కానీ ఫ్యాక్టరీ కడితే కొడుకులు కొట్లాడుకుని ధ్వంసం చేస్తారనీ, జనం కూడా పీకి పంది రేస్తారనీ సంతకం పెట్టడు పెరియావర్. ఇలాటి పరిస్థితుల్లో పంచాయితీ ఎన్నికలొస్తాయి. మంచాన పడ్డ పెరియావర్ ఎన్నికలో పోటీ చేసేందుకు వారసుణ్ణి నిర్ణయించలేక, ఇద్దర్నీ గెటవుట్ అంటాడు. ఇద్దరూ వెళ్ళిపోయి పోటాపోటీగా నామినేషన్లు వేస్తారు.

             వూరు మొత్తం కలిపి 700 ఓట్లు. ఉత్తరం 350, దక్షిణం 350. అన్నదమ్ముల్లో ఏ వొకరు గెలవాలన్నా ఇంకొక్క ఓటు అవసరం (2 ఓట్ల తేడాతో ఎబి వాజపాయ్ ప్రభుత్వం కూలిపోయిన లాటి పరిస్థితి). వూళ్ళో ఆ ఒక్క అదనపు ఓటరు లేక, ఎదుటి వర్గంలో ఓ ఇద్దరు ఓటర్లని తగ్గించేందుకు హత్యా ప్రయత్నాలు కూడా చేస్తారు.

           దీనికంతటికీ దూరంగా వూళ్ళోనే ఒక బార్బర్ (యోగి బాబు) జీవిస్తూ వుంటాడు. మర్రి చెట్టు కింద ఓపెన్ క్షౌర శాల పెట్టుకుని, చెట్టుకి ఉయ్యాల కట్టుకుని, అందులో పడి రేడియో వింటూ నిద్ర్ర పోతూ వుంటాడెప్పుడూ. తల్లిదండ్రులేం పేరు పెట్టారో అతడికి గుర్తు లేదు. వూళ్ళో నోటికొచ్చిన తిట్టుతో తనని పిలుస్తోంటే అసలు పేరు మర్చిపోయాడు. నోరు సరిగా మూసుకోక, చూస్తే చిరునవ్వు నవ్వుతున్నట్టు కన్పిస్తాడు కాబట్టి, కొందరు స్మైల్ అని పిలుస్తారు. వూళ్ళో అతణ్ణి పిలిచే ఫేమస్ పేరు మాత్రం గాడిద. క్షవరం చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వరు. అన్నం అడుక్కుని తింటూ వుంటాడు. ఇళ్ళల్లోకి ముందు గుమ్మం నుంచి రానివ్వరు. వెనుక గుమ్మంలోంచి రావాలి. క్షవరమే కాకుండా టాయిలెట్స్ కడిగే పని కూడా చేయించుకుంటారు. 

            ఇవన్నీ మౌనంగా భరిస్తూ ఒకే ఒక కల కోసం జీవిస్తూంటాడు. తండ్రి ఈ వూళ్ళో ఒక సెలూన్ నిర్మించాలనుకున్నాడు. ఇది నిజం చేయాలని పోస్టాఫీసులో డబ్బు దాస్తూంటాడు. పోస్టాఫీసులో మొదట ఐడీ కార్డు లేక ఖాతా తెరిచే పరిస్థితి వుండదు. పేరే లేకపోతే ఐడీ కార్డు కూడా రాదు. కొత్త పోస్ట్ మాస్టర్ తెన్మోళీ (షీలా రాజ్ కుమార్) బాగా ఆలోచించి, అతడికి నెల్సన్ మండేలా అని పేరు పెడుతుంది. వెళ్ళి ఆ పేరుతో ఆధార్  కార్డు తెచ్చుకో మంటుంది. అలా ఖాతా ఓపెన్ అవుతుంది. ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీ కార్డు కూడా రావడంతో వూళ్ళో సంచలనం రేగుతుంది. గాడిద మండేలా అవడమే గాక, ఓటరు ఐడీ కార్డు వచ్చింది...

        దీంతో ఇప్పుడు మండేలా వీఐపీ అయిపోతాడు ఎన్నికలో ఒక్క ఓటు కోసం ప్రయత్నిస్తున్న అన్నదమ్ములకి. ఓటు కోసం మండేలాని అందలా లెక్కించడమే గాక, తొక్కేస్తారు ఎవరికి వేస్తాడో చెప్పలేక పోతూంటే. ఇలా ఈ అన్నదమ్ముల మధ్య చిక్కుకున్న మండేలా తన ఏకైక ప్రజాస్వామిక హక్కుతో ఏ నిర్ణయం తీసుకున్నాడు? దీనికి ఎన్ని ప్రమాదా లేదుర్కొన్నాడు? చివరికి తన ఓటు హక్కుతో వ్యూహాత్మకంగా, ప్రత్యర్ధులు దిమ్మెరబోయేలా మాస్టర్ స్ట్రోక్ ఎలా ఇచ్చాడు? ... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

   ఎన్నికల్లో కుల మతాలు, డబ్బూ బహుమతులూ ఎరగా వేసి ఓట్లు కొల్లగొట్టుకునే కన్స్యూమరిజం రాజకీయం కొత్తదేం కాదు. ఓటర్లంటే ఫ్రీబీలకి ఆశపడే కస్టమర్లు. ఈ బహుమతులు ప్రకటించడంలో తమిళ పార్టీలు ముందున్నాయి. మా పార్టీని గెలిపిస్తే వాషింగ్ మెషీన్ తో బాటు, కేబుల్ టీవీ కనెక్షన్ ఫ్రీగా ఇస్తామని ఒక పార్టీ అంటే, ఇంకో పార్టీ ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకి టాబ్లెట్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. గృహిణులకి వెయ్యి రూపాయలిస్తామని ఒక పార్టీ అంటే, 1500 ఇస్తామని ఇంకో పార్టీ పోటీ పడింది. జయలలిత ప్రారంభించిన జాతర ఇది. ప్రభుత్వ ఖర్చుతో ఈ బహుమతులు.

        కుల మత భావాలు రెచ్చగొట్టడం సపరేట్ సెక్షన్. దీనికి పార్టీలు పెట్టుకునే ఖర్చుంటుంది. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కో ర్యాలీ నిర్వహణకి పది కోట్లు ఖర్చు పెడుతున్నాయి పార్టీలు. ఈ ఎన్నికల ప్రచార వ్యయం అన్ని పార్టీలకీ కలిపి లెక్కకడితే, ఈ ఖర్చుతో ఒక ఏడాది పాటు దేశ ప్రజలకి రేషన్ సరఫరా చేయ వచ్చు ప్లస్ దేశవ్యాఫంగా బడి పిల్లలకి ఏడాది పాటు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వొచ్చు ప్లస్ దేశవ్యాప్తంగా పేదలకి ఏడాది పాటు ఉపాధి హామీ పథకం నిర్వహించ వచ్చు...ఈ మూడు పథకాలకి ప్రభుత్వాల దగ్గర డబ్బులేదు. కానీ ఎన్నికల్లో పార్టీల దగ్గర ఈ మూడు పథకాలంత డబ్బుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 107 దేశాల్లో, దేశం 94 వ స్థానానికి పడిపోయి ఆకలి రాజ్యంగా అలమటిస్తోంది. పార్టీలు మాత్రం అపర కుబేర పార్టీలుగా వున్నాయి. ప్రభుత్వం పేదది, ప్రజలు పేదలు, పార్టీలు అల్ట్రా రిచ్. ఎన్నికల్లో పార్టీల హోరాహోరీ పోరాటాలన్నీ ప్రభుత్వ ఖజానా కోసమే.

       
ఇక్కడ 1970 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు నటించి నిర్మించిన 'మరో ప్రపంచం' ప్రయోగాత్మకాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కాలం కంటే ముందూహించి తీసిన ఈ ప్రయోగాత్మకంలో, చూపించిన సంఘటనలన్నీ ఆ తర్వాతి కాలంలో జరుగుతూ వచ్చినవే. ముఖ్యంగా అక్కినేని పలికే డైలాగు - ఉపన్యాసాలలో తప్ప ఆంతరంగిక సంభాషణల్లో దేశం, ప్రజలూ అన్న మాటలు ఒక్కసారైనా అనే నాయకుడు ఒక్కడైనా వున్నాడేమో గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండిఅన్నది ఇవాళ్టి నాయకులకీ వర్తిస్తుంది. ఆంతరంగిక సంభాషణల్లో దేశం గురించీ, ప్రజల గురించీ మాట్లాడుకో గల్గితే ఎన్నికల వ్యవస్థ ఇలా వుండదేమో!

        మీరిచ్చే బహుమతులు కాదు, మేం ఓటేయాలంటే ముందు మౌలిక సదుపాయాలు కల్పించండి అని గ్రామాలు ఎదురు బేరం పెడితే, ర్యాలీలు జరగవు. ఆ ఖర్చుతో గ్రామాలు బాగుపడతాయి. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కొరత నెదుర్కొంటున్నది గ్రామీణులే. ఇదే ఈ కథలో చూపించారు. అయితే సినిమా కథ కాబట్టి గేమ్ గా చూపించి రక్తి కట్టించాలనుకున్నారు. మండేలా ఓటు కోసం నాయకులు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించింతర్వాత, గ్రామప్రజలు ఓటెయ్యకుండా మొండి చేయి చూపడమన్నది అన్యాయమే. అయితే పార్టీల్ని ఇలా డబుల్ క్రాస్ చేస్తే తప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ప్రజా పాలన చెయ్యవేమో.

నటనలు - సాంకేతికాలు
     తమిళంలో ఇప్పుడు టాప్ కమెడియన్ అయిన యోగి బాబుది కమర్షియల్ సినిమాల్లో మోటు కామెడీయే. అయితే మండేలా లో అతను సమూలంగా రూపాంతరం చెందాడు. కమెడియన్ ఇమేజిని, ఆ ఫేసునీ పూర్తిగా చెరిపెసుకుని, ఇప్పుడే వెండి తెరకి కొత్తగా పరిచయమవుతున్న ఆర్టిస్టుగా బార్బర్ రూపంలో వచ్చాడు. హావభావాల్లో ఏ యాంగిల్లోనూ మనకి తెలిసిన యోగిబాబు అనేవాడు కన్పించక పోవడమన్నది నటనలో అతను తాకిన ఉన్నత శిఖరం.

        ఈ రూపాంతరానికి ఆధారం పాత్రచిత్రణే. పైకి బార్బర్ గా పాత్ర చిత్రణ సరే, పాత్ర అంతర్గత కారణాలు అతడి ప్రవర్తనని నిర్ణయించాయి. అంతర్గత కారణం సెలూన్ నిర్మించాలన్న తండ్రి కలని నిజం చేయాలన్న ఆలోచన. కలలున్నప్పుడు అశాంతిని తెచ్చుకోకూడదన్న అర్ధంలో ఈ పాత్ర తీరు. అందుకే వూళ్ళో తనని ఎంత తక్కువ కులం వాడిగా చూసినా, కించపర్చినా, కిమ్మనక శాంతంగా కల కోసం పని చేసుకు పోతాడు.         

    కుల, మత, ప్రాంతీయ తత్వాలు భూమ్మీద మనుషులున్నంత కాలం వుండేవే. ఎక్కడికీ పోవు. ఉద్యమాలతో హాహాకారాలు చేస్తే ఆయాసమే మిగులుతుంది. ఇవి తనని తొక్కే స్తున్నాయని కులం కార్డో, మతం కార్డో, ప్రాంతం కార్డో ప్రయోగించి వీధికెక్కి ఏమీ లాభం లేదు. అప్పుడా కార్డూ వుండదు, దాంతో కలలూ వుండవు. కాసేపు మీడియాలో కేకలు తప్ప. ఈ కుల మత ప్రాంతీయ తత్వాల మధ్య నుంచి దారి చేసుకుంటూ కలల సాఫల్యతకి కృషి చేసుకు పోవడమే మార్గం. ఇదే నేర్పు తున్నాడు బార్బర్ మండేలాగా యోగిబాబు. ఇందుకే అతడి పాత్ర అణిగి మణిగి వుండే క్యారక్టర్ గా కన్పించడం. వూళ్ళో అగ్రకులాల పట్ల ఎంత జాగ్రత్తగా వుంటాడంటే, పోస్ట్ మాస్టర్ తెన్మోళీ  నెల్సన్ మండేలా అని పేరు పెడితే, అది అగ్రకులం పేరేమోనని భయపడతాడు.

       తన నిమ్న కుల ఆత్మ న్యూనతా భావాన్ని మర్చిపోవడానికి, మర్రి చెట్టుకి పైన ఉయ్యాల కట్టుకుని, ఉయ్యాల్లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో తను పైన స్వర్గంలో వున్నట్టు ఫీలవుతూ, కమ్మగా నిద్రపోతాడు. తన నిమ్న కుల స్థానంతో ఎంత విధేయంగా వుంటాడంటే, పోస్టాఫీసు కెళ్ళి పక్క గోడ చూస్తూ, వెనుక గుమ్మం లేదే అనుకుంటాడు. ఇళ్ళల్లోకి వెనుక గుమ్మంలోంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడా అదే అనుకుంటాడు.         

         పోస్టాఫీసులోకి వెళ్తూంటే తలుపు వూడి పడుతుంది. ఇక్కడ డబ్బులు దాస్తే వుంటాయా అని భయపడతాడు. డబ్బులు జమచేసి వెళ్తూ తలుపు గట్టిదనాన్ని మళ్ళీ పరీక్షిస్తాడు. ఈ చర్యలు పాత్ర తీరు రీత్యా హాస్యం పుట్టించినా, వెనుక గుమ్మం, ముందు తలుపు ప్రస్తావనలతో  చాలా సింబాలిజం వుంది. పోస్టాఫీసుల్లో  డిపాజిట్లు రిస్కులో వున్నాయని గత సంవత్సరం మీడియా రిపోర్టులు వచ్చాయి కూడా. ఎలాగన్నది వేరే విషయం.

        ఓటరు ఐడీ కార్డు వచ్చాక అతడి క్యారక్టర్ ని మార్చేస్తారు ఎన్నికల్లో పోటీ పడుతున్న అన్నదమ్ములు. తనని రాజాలా చూసుకోవడం చేస్తూంటే యోగిబాబు మరింత డిగ్నిటీ తో నటించి క్యారక్టర్ కి ఇంకో లెవెల్ కి తీసికెళ్తాడు. మళ్ళీ యధాస్థితి కొచ్చి పూర్వపు బార్బర్ అయిపోతాడు. చివరికి ఓటింగ్ చేసేప్పుడు కింగ్ అయిపోతాడు. ఎక్కడా ఎదిరించకుండా, ఒక్క మాట అనకుండా, ఓటు పవర్ తో ఓడించేస్తాడు. యోగి బాబుకి ఐడీ కార్డు వచ్చినప్పట్నుంచీ, ముగింపు షాట్ వరకూ ఏం చేయబోతున్నాడో ఎడతెగని ఒక సస్పెన్స్ తో అతడి క్యారక్టర్ కొనసాగుతుంది.

       అతడికి రేఖామాత్రంగా తెన్మోళీతో ప్రేమ కూడా వుంటుంది. అయితే మొదట అలా అన్పించదు. ఆమె కూడా ప్రేమిస్తున్నట్టు అన్పించదు. ఈ సినిమాలో ఎక్కడా ఏ పాత్రా  అరిచి మాట్లాడదు. కూల్ గా మాట్లాడతాయి. ఈ ఆడియో లెవెల్ ఇలాగే కూల్ గా మెయింటెయిన్ అవుతున్నది కాస్తా, ఒక విషయంలో తెన్మోళీ ఓవర్ గా అరిచి అతడ్ని తిడుతుంది. ఉన్నట్టుండి ఈ హై వాల్యూమ్ మన మూడ్ చెడగొడుతుంది. కానీ చూస్తే ఆ అరుపులు ఆమె ప్రేమని రివీల్ చేస్తున్నాయని మనకూ యోగిబాబుకీ ఇప్పుడే రహస్యం బోధపడుతుంది.

        దీనికి చాలా ముందు అద్దంలో ఆమె చూసుకుంటూ, నెరసిన వెంట్రుక దాస్తూంటే, యోగిబాబు ఓర కంట గమనిస్తాడు. ప్రేమ రివీలయ్యాక మళ్ళీ ఆమె అద్దంలో చూసుకుంటూంటే, ఆమె నెరసిన వెంట్రుకని యోగి తనే దాస్తాడు. చాలా టచింగ్ సీన్. తెన్మోళీ పాత్రలో షీలా రాజ్ కుమార్ బావుంటుంది. మేజర్ పాత్రలతో బాటు చాలా మైనర్ పాత్రలకీ డెటెయిలింగ్ చేస్తాడు దర్శకుడు. గెలిచే ఓటు కోసం ప్రత్యర్ధులు సినిమాటిక్ గా కాకుండా రియల్ లైఫ్ లో ఏమేం ఎత్తుగడలు వేస్తారో కూడా డెటెయిలింగ్ చేస్తూ కథ నడిపాడు. ఇదే కథనానికి బలాన్నిచ్చింది.

     టెక్నికల్ గా ఒక రిధమ్, ఒక విజువల్ క్రాఫ్ట్  కన్పిస్తాయి. సెటైర్ గా వుండే సీన్స్ కి ఆ ఫీల్ నిస్తూ, సాఫ్ట్ విజువల్స్ చూపిస్తూ ఆకస్మిక కట్స్ ఇస్తాడు. ప్రత్యర్ధుల సీరియస్ సీన్లు వచ్చేసరికి డార్క్ లైటింగ్ ఉపయోగిస్తూ, ఎమోషన్లు హైలైట్ అయ్యే క్యారక్టర్ ఫ్రేమింగ్ ఇస్తాడు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సెటైరికల్ గా, లైట్ మ్యూజిక్ తో ఇచ్చాడు. అయితే ముగింపే ఒకే షాట్ తో మరీ ఇంటలెక్చువల్ గా వుంది. దీన్ని పెంచి డ్రమటైజ్ చేసి వుంటే సామాన్యులకి బాగా అర్ధమయ్యేది. జాలి పుట్టించే సున్నిత హాస్యంతో ఒక పెద్ద రాజకీయ సమస్యనే, కుల సమస్యనే, ఎవర్నీ నొప్పించకుండా ఆలోచింప జేసే చిత్రీకరణలతో ఆశ్చర్యపర్చే ప్రతిభ కనబర్చాడు కొత్త తమిళ దర్శకుడు. దీన్ని యోగిబాబు హిమాలయాలకి తాటించాడు.  

సికిందర్  

(ఆదివారం మండేలా మూవీ నోట్స్.
ఆదివారం వెలువడే Q&A కి కొంతకాలం విరామం)