రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 9, 2021

'వకీల్ సాబ్' విడుదల సందర్భంగా పునశ్చరణ

 

Thursday, October 13, 2016

రివ్యూ!

దర్శకత్వం : అనిరుద్ధ రాయ్ చౌధురి

తారాగణం : అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తీ కుల్హరీ, ఆండ్రియా తరియంగ్,  అనంగ్ బేడీ, ధృతిమన్ ఛటర్జీ, పీయూష్ మిశ్రా, మమతా శంకర్ తదితరులు
కథ : అనిరుద్ధ  రాయ్ చౌధురి, షూజిత్ సర్కార్, రీతేష్ షా , స్క్రీన్ ప్లే- మాటలు : రీతేష్ షా
సంగీతం : శంతను మొయిత్రా, ఫైజా ముజాహిద్, అనుపమ్  రాయ్, ఛాయాగ్రహణం : అభీక్ ముఖోపాధ్యాయ్
బ్యానర్ : రశ్మీ టెలి ఫిలిమ్స్ లిమిటెడ్
నిర్మాతలు : రశ్మీ శర్మ, షూజిత్ సర్కార్
విడుదల : సెప్టెంబర్ 16, 20016
***
       బెంగాలీ దర్శకులు కమర్షియల్ సినిమాల్నే వాస్తవికతకి దగ్గరగా భిన్నకోణాల్లో తెరకెక్కిస్తూ  హిందీలోకి వస్తారు. మర్డర్, గ్యాంగ్ స్టర్, బర్ఫీ, కహానీ, విక్కీ డోనర్...ఇంకా  గతంలో కెళ్తే  దోస్తీ, చిత్ చోర్, గోల్ మాల్, కటీ పతంగ్  వంటి హిట్స్ తో  ప్రత్యేక ముద్ర వేస్తారు. బాలీవుడ్ ఎప్పుడూ బెంగాలీ దర్శకులతో కిటకిట లాడుతూ వుంటుంది. బాలీవుడ్ అనేకంటే ‘బెలీవుడ్’  అనుకునేంతగా పాగా వేసి కూర్చున్నారు. బెంగాలీలు సాహితీ ప్రియులవడం చేత కూడా స్వాభావికంగానే వాళ్ళ కళాపోషణ ఉత్తమాభిరుచులకి పట్టం గడుతూంటుంది. లపాకీ సినిమాలూ ఇడ్లీ సినిమాలూ తీసే మోజు వాళ్లకి లేదు. వాళ్ళ  బెంగాలీ ఫిష్ కర్రీనే ఎన్నిరకాలుగా వండొచ్చో ఒక్కొక్కళ్ళూ ఒక్కో విధంగా రుచి చూపించేసి  ఔరా అన్పిస్తారు. తాజాగా మరో బెంగాలీ దర్శకుడు హిందీలోకి రంగ ప్రవేశం చేశాడు. చేస్తూనే నాటక అంకాన్ని సినిమాకి జోడించి క్యాబేజీ ఫిష్ వండేశాడు. ఇక దేశవ్యాప్తంగా మిగతా హిందీ సినిమాల్ని పక్కన పెట్టేసి దీన్నే నంజుకుంటున్నారు జనాలు. 

          ర్శకుడు అనిరుద్ధ రాయ్ చౌధురిని హిందీలోకి రప్పిస్తూ మరో బెంగాలీ దర్శకుడు షూజిత్ సర్కార్ (విక్కీ డోనర్, పీకూ) నిర్మాతగా మారి,  ‘పింక్’ తీసినప్పుడు అదొక జాతీయ నినాదమయిందివ్వాళ. అమితాబ్ బచ్చన్, తాప్సీ, మరో ఇద్దరు నటీమణుల్ని కలుపుకుని యువతరపు కొత్త పోకడల్ని – చట్టాలతో వాళ్ళ అనుభవాల్ని బయటపెట్టే పవర్ఫుల్ వినోదసాధనమయ్యింది. మనమెప్పుడూ ఇప్పటి యూత్ సినిమాలంటే ఒకప్పటి ఉబుసుపోక ప్రేమ కథలు కాదనీ, వాళ్ళ వాళ్ళ విశృంఖలత్వాలతో యూత్ చేసుకునే ప్రయోగాల్నీ, దాంతో తెచ్చుకునే ప్రమాదాల్నీ తెలియజెప్పే ఫ్రెష్- న్యూజనరేషన్ రియాలిస్టిక్ ఫిక్షన్ అనీ చెప్పుకుంటూ వచ్చాం. ఈ కోవలో 2011 లో బిజోయ్ నంబియార్ ‘షైతాన్’ తీసి మెప్పించాడు. 2005 లో కృష్ణవంశీ ‘డేంజర్’ తో పాక్షికంగానే ప్రయత్నించాడు. గత సంవత్సరమే నవదీప్ సింగ్ ‘ఎన్ హెచ్- 10’ తో  దృష్టి నాకర్షించాడు. ఇప్పుడు ‘పింక్’ తో అనిరుద్ధ రాయ్ చౌధురి అలాటి జీవనశైలులు ఏ దారిపట్టిపోతాయో చెబుతూనే, అంతమాత్రాన న్యాయం పొందడానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదని యువతులకి ధైర్యం నూరిపోశాడు నూరుపాళ్ళూ. 

కథ *
       మీనల్ అరోరా (తాప్సీ) ఫలక్ అలీ (కీర్తీ కుల్హరీ)  ఆండ్రియా (ఆండ్రియా తరియంగ్) అనే ముగ్గురు ఢిల్లీలోని ఒక ఫ్లాట్ లో నివసిస్తూ జాబ్స్ చేస్తూంటారు. ఒకరాత్రి  సూరజ్ కుంద్ లోని  ఓ రిసార్ట్స్ లో జరుగుతున్న  ప్రోగ్రాంకి వెళ్తారు. అక్కడ రాజ్ వీర్ (అనంగ్ బేడీ) తన ఫ్రెండ్స్ తో వుంటాడు.  రాజ్ వీర్ మీనల్ కి తెలుసు. అక్కడ వాళ్ళతో కలిసి డ్రింక్ చేస్తారు ముగ్గురూ. ఈ అవకాశంతో వాళ్ళని అనుభవించాలని చూస్తారు రాజ్ వీర్ అతడి ఫ్రెండ్స్ ముగ్గురూ. మీనల్ ‘నో’  అన్నా రాజ్ వీర్ వూరుకోక మిస్ బిహేవ్ చేస్తాడు. దీంతో బాటిలెత్తి అతడి తలకాయ బద్దలు కొడుతుంది. తీవ్రంగా గాయపడ్డ అతణ్ణి వదలేసి పారిపోతారు మీనల్, ఫలక్, ఆండ్రియా. 

        ఇక  పరిణామాలు వూహించుకుని బిక్కు బిక్కుమంటూంటారు ముగ్గురూ. బాగా పవర్ఫుల్ రాజకీయనాయకుడి కొడుకైన రాజ్ వీర్, మీనల్ మీద పగ దీర్చుకోవాలనుకుంటాడు. ఆమెతో సహా ఫలక్ నీ, ఆండ్రియానీ ఫ్లాట్లోంచి సాగనంపేయాలని ఓనర్ ని బెదిరిస్తాడు. ఫలక్ మధ్యవర్తిత్వం వహించి  మీనల్ చేత రాజ్ వీర్ కి సారీ చెప్పించాలని ప్రయత్నిస్తుంది. సారీ చెప్పేందుకు మీనల్ ఒప్పుకోదు. ఎదుటి బంగళాలో రిటైర్డ్ లాయర్ దీపక్ సెహగల్ (అమితాబ్ బచ్చన్) వుంటాడు. ఇతను ఈ అమ్మాయిలేదో సమస్యలో పడ్డారని అనుమానిస్తాడు. అతడి కళ్ళముందే రాజ్ వీర్ మీనల్ ని కిడ్నాప్ చేసి తీసికెళ్ళి పోతాడు. వెంటనే దీపక్ పోలీసులకి సమాచారం అందించినా ఆ కారు దొరకదు. ప్రయాణిస్తున్న కార్లో ఫ్రెండ్స్ తో కలిసి రాజ్ వీర్ మీనల్ ని లైంగికంగా వేధించి వదిలేస్తాడు. ఇక మీనల్ కి పోలీసులని ఆశ్రయించక తప్పదు. ఈ లేడీ ఎస్సై  రాజ్ వీర్ తండ్రికి సమాచారం అందివ్వడంతో రాజ్ వీర్ తండ్రి మీనల్ మీద ఎదురు కేసు పెట్టిస్తాడు- రాజ్ వీర్ మీద మీనల్ హత్యాయత్నం చేసిందన్న ఆరోపణతో. మీనల్ అరెస్టయి జైలు కెళ్తుంది.  ఇక వుండలేక లాయర్ దీపక్ ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ఈ కేసు చేపట్టడానికి ముందుకొస్తాడు. ఇక్కడ్నించీ కోర్టులో ఈ కేసు ఎలాగెలా నడిచిందీ, అమ్మాయిలు బోనెక్కితే ఎలాటి చేదు అనుభవాలు ఎదురవుతాయి- అన్నది మిగతా కథ.

భావోద్వేగాల ఉప్పెన 
      టాలెంటెడ్  నటిగా తాప్సీ ఈ సినిమాతో  బాగా ఎస్టాబ్లిష్ అయినట్టే. ఇప్పట్నించే ఆమెకి అవార్డుల పంటని వూహించుకోవచ్చు. బాధిత పాత్రని బలమైన భావోద్వేగాలతో, కటువైన మాటలతో సహజాతిసహజంగా పోషించింది. కోర్టు దృశ్యాల్లో ఇబ్బంది కల్గించే సందర్భాల్లో ప్రతిస్పందనల్ని పొల్లు పోకుండా ప్రకటించడంలో కనబర్చిన  నేర్పే నటిగా ఆమెని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్ కి ఓ కిరీటం.
        మరోసారి అమితాబ్ బచ్చన్ తన విలువేంటో రుజువు చేసుకున్నాడు. బైపోలార్ డిజార్డర్ తో మానసికంగా, వాతావరణ కాలుష్యంతో శారీరకంగా  సతమతమయ్యే వృద్ధ లాయర్ పాత్రలో ఇప్పటికీ తన అభినయ చాతుర్యానికి బాక్సాఫీసు అప్పీల్ వుంటుందని విరగబడి ఆడుతున్న ఈ సినిమా సక్సెస్ తోనే నిరూపించాడు. 

        కీర్తీ, ఆండ్రియా ఇద్దరూ కూడా డీసెంట్ గా నటించారు. రాజ్ వీర్ పాత్రలో కళ్ళల్లో దుష్టత్వం నింపుకుని సైలెంట్ విలన్ గా అనంగ్ బేడీ నటిస్తే, ప్రాసిక్యూటర్ గా మరోసారి పీ యూష్ మిశ్రా తన బ్రాండ్ డైలాగ్ డెలివరీ తో సన్నివేశాల్ని రక్తి కట్టించాడు. ఉర్దూ పిచ్చిగల పోలీసు అధికారిగా ‘హేపీ భాగ్ జాయేగీ’ లో చేసిన  డైలాగుల మాయాజాలం ఎలాంటిదో మొన్నే చూశాం. జడ్జి పాత్రలో ధృతిమన్ ఛటర్జీ కమర్షియల్  సినిమాల ‘ఆర్డర్ ఆర్డర్’ బాపతు అరుపుల, బల్ల మీద సుత్తిమోతల ఫార్ములా జడ్జీలనుంచి ఎంతో  రిలీఫ్. 

         ‘హేపీ భాగ్ జాయేగీ’ సెకండాఫ్ లో హీరో,  అతడి తండ్రీ జరిపే సుదీర్ఘ సంభాషణ గల దృశ్యం టీవీ సీరియల్ లాగా కన్పిస్తుంది. సహజత్వం ఒక్కోసారి ఇలాటి బారిన పడుతూంటుంది. కానీ  ‘పింక్’ సహజత్వం సినిమాకే హైలైట్ గా వుంటుంది. కోర్టు ఇంటీరియర్ కూడా సెట్ వేసి నట్టుండదు. పాటలు, వాటి చిత్రీకరణా కళాత్మకంగా వున్నాయి. కెమెరా వర్క్, సంగీతం న్యూయేజ్ మూవీస్  ట్రెండ్ లో  వున్నాయి.

మైండ్ సెట్స్- మైండ్ గేమ్స్ 
       థగా చూస్తే ఈ కేసు అత్యంత సాధారణ నేర సంఘటన. ఒకమ్మాయి ఒకబ్బాయి తల బద్దలు కొట్టింది. కోర్టుకి కావాల్సింది దీనికి  సాక్ష్యాలేగానీ, నిందితురాలి  క్యారక్టర్ కాదు, సెంటి మెంట్లు కాదు. నిందితురాలు ఎప్పుడు కన్యాత్వం పోగొట్టుకుంది, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగిందీ కోర్టుకి అక్కర్లేదు. బాధితుణ్ణి  కొట్టిందా లేదా అన్నదే పాయింటు. ఆత్మరక్షణ చేసుకుంటూ కొట్టి వుంటే అది నిరూపించాలి, అంతే. 

        ఇదే గనుక కథగా నడిపివుంటే- ఈ పరిధిలోనే కాన్సెప్ట్ పెట్టుకుంటే-  ఈ సినిమా ఇంత సంచలనాత్మకం అయ్యేది కాదు- ‘రుస్తుం’ లాగా ఓ రొటీన్ కోర్టు రూమ్ క్రైం డ్రామా అయ్యేది. దీన్నొక సామాజిక రుగ్మతల కడిగివేతగా సంకల్పించారు కాబట్టే-  అసలీ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో వాటి  మూలాల్ని  ఎత్తి చూపించి హె చ్చరించాలనుకున్నారు. అప్పుడే కథా ప్రయోజనం నెరవేరుతుంది. కనుక  ప్రొసీజర్ ప్రకారం సాక్ష్యాల్ని పరిశీలిస్తూనే, మనస్తత్వాల మదింపూ చేశారు. ఈ మనస్తత్వాల మదింపు ల్లోంచి ఇలాటి సంఘటనల మూలాల్ని బయట పెట్టారు. అబ్బాయిల్ని ఎండగట్టారు. అలాగని ఈ సినిమా చూసి అబ్బాయిలు మారిపోతారని కాదు- ఇంకా డోనాల్డ్ ట్రంప్ ని ఆదర్శంగా తీసుకుంటామనొచ్చు. తమకి డోనాల్డ్ ట్రంపే వుండగా ఈ డొక్కు సినిమాలేం  చేస్తాయని కూడా అనుకోవచ్చు. డోనాల్డ్ ట్రంప్ కి ఈ సినిమా చూపిస్తే తన పరువు తీయడానికే  ఈ సినిమా తీశారని చిందులు కూడా వేయవచ్చు. 


         కానీ ఒక లాజిక్ కూడా వుంది. లాజిక్ లేకుండా మనస్తత్వాల ముచ్చట్లు పెట్టుకుంటే అదొక కళా రూపం కాదు, సినిమా అన్పించుకోదు. కథని వదిలేసి నీతి బోధలు చేయడం అవుతుంది. ఇలా చేయడానికి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయనవసరం లేదు. సోదంతా నింపి ఆడియో సీడీలు విడుదల చేస్తే సరిపోతుంది. లాజిక్ ఏమిటంటే, స్థూల దృష్టికి నిందితురాలు నేరం చేసిందనే  రుజువవుతోంది సాక్ష్యాధారాల ఆధారంగా. ఆమె జైలుకెళ్ళే పనే. కథ ఇలా ముగిసిపోతే డోనాల్డ్ ట్రంప్ కూడా ఒప్పుకోడు. కానీ ఆ నేరం ఏ పరిస్థితుల్లో చేసిందో నిరూపిస్తే లాయర్ దీపక్ ఆమెని రక్షించుకోగలడు. ఆత్మరక్షణ అనే ఒకే  ఒక్క ఆధారం దీనికి వుంది. ఆత్మరక్షణకే  బాధితుణ్ణి  కొట్టినట్టు నిరూపిస్తే ఆమె బయట పడిపోతుంది. ఆడదానికి ఆత్మరక్షణ అంటే  శీల రక్షణే. కాబట్టే పనిగట్టుకుని మీనల్ శీలం మీదికి పోతాడు లాయర్ దీపక్.

        అయితే దీనికంటే ముందు బాధితుడూ అతడి ఫ్రెండ్స్ మోటివ్స్ ని తేటతెల్లం చేస్తాడు.  మైండ్ సెట్స్ ని మైండ్ గేమ్స్ తోనే గెలవాలేమో.  అబ్బాయిల మైండ్ సెట్స్ కోర్టు వెలుపల నేర సంఘటనని సృష్టిస్తే, కోర్టు లోపల లాయర్ దీపక్ ఆడే మైండ్ గేమ్స్ వాళ్ళ మైండ్ సెట్స్ లోని డొల్ల తనాన్ని బట్టబయలు చేస్తాయి. కోర్టులో అబ్బాయిల సాక్ష్యాల్లో వెల్లడయ్యే అమ్మాయిల పట్ల వాళ్ళ  మైండ్ సెట్స్ ని,  అమ్మాయిలకి ఒక్కో నీతి సూత్రంగా మార్చి వ్యంగ బాణాలు  విసురుతూంటాడు లాయర్ దీపక్ : 

       అమ్మాయిలు డ్రింక్ చేస్తే- వాళ్ళ క్యారక్టర్ మంచిది కాదని అర్ధమన్న మాట. అదే అబ్బాయిలు డ్రింక్ చేస్తే కేవలం ఆరోగ్యానికి హానికరమన్న మాట!
        అమ్మాయి రాక్  షో  కెళ్తే అది హింట్ ఇస్తున్నట్టు అర్ధమన్న మాట. అదే గుడి కెళ్తే, లైబ్రరీ కెళ్తే, అమ్మాయి అలాంటిది కాదన్న మాట. అమ్మాయిల క్యారక్టర్ ని వాళ్ళు  వెళ్ళిన  స్థలం నిర్ణయిస్తుందన్న మాట!

        ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయితోనూ ఎక్కడికీ వొంటరిగా వెళ్ళ రాదు. వెళ్లిందంటే ఇష్టపడే వెళ్ళిందనీ, తనని టచ్ చేసే పూర్తి  లైసెన్సు అబ్బాయికి ఇచ్చేసిందనీ అర్ధం జేసుకుంటారన్న మాట!

        రాత్రి పూట అమ్మాయిలు రోడ్డు మీద పోతూంటే వాహనాలు స్లో అవుతాయి,  అద్దాలు కిందికి దిగిపోతాయి. పగటి పూట ఇంత  గొప్ప సేవా భావం ఎందుకుండదో
  ఎవరికీ!

        నగరాల్లో అమ్మాయిలు ఒంటరిగా ఉండరాదు- అబ్బాయిలు వుండ వచ్చు, కానీ  అమ్మాయిలు ఉండరాదు. ఎందుకంటే ఒంటరిగా, ఇండిపెండెంట్ గా వుండే అమ్మాయిలు అబ్బాయిల్నితెగ కన్ఫ్యూజ్ చేసేస్తారు మరి! 

        చివరికో పీకుడు పీకుతాడు :
        ఒకవేళ అమ్మాయి అబ్బాయితో డ్రింక్ కో,  డిన్నర్ కో వెళ్లిందంటే తన సొంత ఛాయిస్ తో వెళ్తుంది- తను అవైలబుల్ అని బోర్డు పెట్టుకుని వెళ్ళదురా శుంఠా అని! 

        జడ్జి అభ్యంతరం చెప్తున్నా బాణా లేస్తాడు అబ్బాయిల మీద దీపక్. ఇక మీనల్ కన్యాత్వాన్ని ప్రశ్నించే  సరికి గగ్గోలు లేచిపోతుంది. కానీ ఇదే గగ్గోలు బాదితుడూ అతడి ఫ్రెండ్స్,  మీనల్ - ఆమె స్నేహితురాళ్ళ శీలం గురించి అన్నప్పుడు పుట్టదు. దీపక్ వ్యూ హం ఒక్కటే- విచారణని ఆత్మరక్షణ కోణంలోకి మళ్ళించడం. తను పంతొమ్మిదో ఏట కన్యాత్వాన్ని కోల్పోయినట్టు ఒప్పుకుంటుంది మీనల్. ఆ తర్వాత ప్రశ్నలకి, కొందరు బాయ్ ఫ్రెండ్స్ తో కూడా తిరిగినట్టు ఒప్పుకుంటుంది. మరింకేం- ఆమె ఇలాంటిది కాబట్టే బాధితుడు చొరవ తీసుకున్నాడని బాధితుడి పక్షం అర్ధం వచ్చేసింది. కానీ...కానీ...

        మీనల్  అలాంటిదైనంత మాత్రాన ఆమెని వాడేసుకునే హక్కుండదు ఆమె ఒప్పుకోకపోతే- మీనల్ వాడికి నో చెప్పేసింది. అయినా బలవంత పెట్టాడు. దీంతో తలబద్దలు కొట్టింది.

        ఇప్పుడంటాడు లాయర్ దీపక్- ‘ఈ అబ్బాయిలు ‘నో’ అనే మాటకి అర్ధం ‘నో’ అనే ఉంటుందని అర్ధం జేసుకు చావాలి. అలా ‘నో’ అన్న అమ్మాయి పరిచయస్థురాలైనా, ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, సెక్స్ వర్కర్ అయినా, సొంత భార్య అయినా- కచ్చితంగా ‘నో’ అన్నట్టే అర్ధం. అప్పుడా వెధవ గట్టిగా నోర్మూసుకోవాలి!’ అని.
        
కేసు రివర్స్ అయి బాధితుడూ వాడి భాగస్థులూ జైల్లో పడతారు.

నాటకాంకం
     ఇక ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ విషయం చూద్దాం. స్క్రీన్ ప్లే రాయడమంటేనే తీసివేత- తీసివేత- తీసివేతల ఎడతెగని తంతు. ఈ డైలాగు ఎందుకుండాలి, ఈ సీను ఎందుకుండాలి, ఈ షాటు ఎందుకుండాలీ, వీడెందుకిలా నవ్వాలీ, ఇదెందుకలా చూడాలీ అని వీలైనంత తగ్గించడం గురించే, వేటు వేయడం గురించే ఆలోచించే తంతు అనవసరమనిపిస్తే.  తీసివేయగా తగ్గించగా చెత్తంతా పోగా, మిగిలిన పేజీల్ని అందంగా చెక్కే, పాలిష్ పట్టే హస్తకళే స్క్రీన్ ప్లే రాత. ఏ స్క్రీన్ ప్లే అయినా పేషంట్ గానే జన్మెత్తుతుంది, నిర్మొహమాటంగా చికిత్స చేస్తే తప్ప బతికి సినిమాకి పనికి రాదు.
        ఒకసారి 
పైన చెప్పుకున్నఈ సినిమా కథా సంగ్రహాన్ని స్క్రీన్ ప్లే పరంగా ఇలా విడగొడదాం :
          
బిగినింగ్ :
          
మీనల్ అరోరా (తాప్సీ) ఫలక్ అలీ (కీర్తీ కుల్హరీ)  ఆండ్రియా (ఆండ్రియా తరియంగ్) అనే ముగ్గురు ఢిల్లీలోని ఒక ఫ్లాట్ లో నివసిస్తూ జాబ్స్ చేస్తూంటారు. ఒకరాత్రి  సూరజ్ కుంద్ లోని  ఓ రిసార్ట్స్ లో జరుగుతున్న  ప్రోగ్రాంకి వెళ్తారు. అక్కడ రాజ్ వీర్ (అనంగ్ బేడీ) తన ఫ్రెండ్స్ తో వుంటాడు.  రాజ్ వీర్ మీనల్ కి తెలుసు. అక్కడ వాళ్ళతో కలిసి డ్రింక్ చేస్తారు ముగ్గురూ. ఈ అవకాశంతో వాళ్ళని అనుభవించాలని చూస్తారు రాజ్ వీర్ అతడి ఫ్రెండ్స్ ముగ్గురూ. మీనల్ ‘నో’  అన్నా రాజ్ వీర్ వూరుకోక మిస్ బిహేవ్ చేస్తాడు. దీంతో బాటిలెత్తి అతడి తలకాయ బద్దలు కొడుతుంది. తీవ్రంగా గాయపడ్డ అతణ్ణి వదిలేసి పారిపోతారు మీనల్, ఫలక్, ఆండ్రియా.
        
మిడిల్ :
        ఇక  పరిణామాలు వూహించుకుని బిక్కు బిక్కుమంటూంటారు ముగ్గురూ. బాగా పవర్ఫుల్ రాజకీయనాయకుడి కొడుకైన రాజ్ వీర్, మీనల్ మీద పగ దీర్చుకోవాలను
కుంటాడు. ఆమెతో సహా ఫలక్ నీ, ఆండ్రియానీ ఫ్లాట్లోంచి సాగనంపేయాలని ఓనర్ ని బెదిరిస్తాడు. ఫలక్ మధ్యవర్తిత్వం వహించి  మీనల్ చేత రాజ్ వీర్ కి సారీ చెప్పించాలని ప్రయత్నిస్తుంది. సారీ చెప్పేందుకు మీనల్ ఒప్పుకోదు. ఎదుటి బంగళాలో రిటైర్డ్ లాయర్ దీపక్ సెహగల్ (అమితాబ్ బచ్చన్) వుంటాడు. ఇతను ఈ అమ్మాయిలేదో సమస్యలో పడ్డారని అనుమానిస్తాడు. అతడి కళ్ళముందే రాజ్ వీర్ మీనల్ ని కిడ్నాప్ చేసి తీసికెళ్ళి పోతాడు. వెంటనే దీపక్ పోలీసులకి సమాచారం అందించినా ఆ కారు దొరకదు. ప్రయాణిస్తున్న కార్లో ఫ్రెండ్స్ తో కలిసి రాజ్ వీర్ మీనల్ ని లైంగికంగా వేధించి వదిలేస్తాడు. ఇక మీనల్ కి పోలీసులని ఆశ్రయించక తప్పదు. ఈ లేడీ ఎస్సై  రాజ్ వీర్ తండ్రికి సమాచారం అందివ్వడంతో రాజ్ వీర్ తండ్రి మీనల్ మీద ఎదురు కేసు పెట్టిస్తాడు- రాజ్ వీర్ మీద మీనల్ హత్యాయత్నం చేసిందన్న ఆరోపణతో. మీనల్ అరెస్టయి జైలు కెళ్తుంది.  ఇక వుండలేక లాయర్ దీపక్ ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ఈ కేసు చేపట్టడానికి ముందుకొస్తాడు. ఇక్కడ్నించీ కోర్టులో ఈ కేసు ఎలాగెలా నడిచిందీ, అమ్మాయిలు బోనెక్కితే ఎలాటి చేదు అనుభవాలు ఎదురవుతాయి-
          
ఇక ఎండ్ వచ్చేసి- కన్యాత్వం పాయింటు మీద నడిచి ముగుస్తుంది. బిగినింగ్ విభాగానికి ముగింపు హీరోయిన్లు రాజ్ వీర్ ని  కొట్టి పారిపోవడం అనే ప్లాట్ పాయింట్ -1 ఘట్టం అన్నమాట. ఇక మిడిల్ కి ముగింపు – అవును, మేం డబ్బుతీసుకున్నామని కోర్టులో ఫలక్ పాత్ర గొంతు చించుకుని తనకుతానే కేసు ఓడిపోయేఘట్టాన్ని సృష్టించుకోవడం. ఇది ప్లాట్ పాయింట్- 2 ఘట్టం అన్నమాట. 

        బాగానే వుంది, అయితే పైన చెప్పుకున్న బిగినింగ్ విభాగం సినిమాలో లేనేలేదు. బిగినింగే లేదు, బిగినింగ్ అస్సలు లేదు! బిగినింగ్ లేకుండా మిడిల్, ఎండ్ లతోనే సినిమా నడిచి ముగుస్తుంది.  సినిమా ప్రారంభమే మిడిల్ ప్రారంభంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఎండ్ కి వెళ్ళిపోతుంది, అంతే. మరి బిగినింగ్ ఎందుకు లేదు, అదేమైనట్టు? అసలు బిగినింగ్ లేకుండా ఏ సినిమా ఏ స్క్రీన్ ప్లే ప్రపంచంలోనే  లేదు. బిగినింగ్ స్థానం మారవచ్చు. మిడిల్ తో మొదలయ్యే కథలో ఫ్లాష్ బ్యాక్ గా బిగినింగ్ రావచ్చు. ఇలాటి సినిమాలు చాలా వున్నాయి. హాలీవుడ్ కాదుకదా, అసలే స్క్రీన్ ప్లే స్ట్రక్చరూ పట్టని యూరోపియన్ సినిమాలు కూడా బిగినింగ్ లేకుండా లేవు. బిగినింగ్ లేకుండా కథ చేయవచ్చన్న వూహే ఎవ్వరికీ రాదు. 

        మరి బిగినింగ్ లేకపోతే,  పైన కథా సంగ్రహమంటూ చెప్పుకున్న స్క్రీన్ ప్లేలో  బిగినింగ్ అంటూ చెప్పుకున్న కథ ఎక్కడ్నించీ వచ్చింది? అది వున్నందుకే కదా మిడిల్ మొదలైంది. అది లేకపోతే మిడిల్ ఎలా మొదలైంది?  

        బిగినింగ్ వుంది- పైన చెప్పుకున్నట్టే  అంతా వుంది. అయితే తీసివేత కార్యక్రమంలో ఎగిరిపోయింది. ఒక పెద్ద కత్తి తీసుకుని గట్టి వేటు వేస్తె ముక్క తెగి అరేబియా సముద్రంలో పడింది. దరిద్రం వదిలింది. ఒక డైలాగు కాదు, ఒక సీను కాదు, ఒక షాటూ కాదు, ఒకడి నవ్వూ కాదు, ఒకత్తి చూపూ కాదు- ఏకంగా  బిగినింగ్ అంతా కట్టకట్టి అనవసరమని లేపేశారు. చాలా తెగింపు, చాలా మేజర్ ఆపరేషన్. 

        క్లుప్తతే కళకి ఆభరణం. ఈ క్లుప్తీ కరణలో ఇంకోటి కూడా వుంది : మాటగా చెబితే అర్ధమయ్యే దాన్ని బొమ్మగా చూపనవసరం లేదు, బొమ్మగా చూపిస్తే అర్ధమై పోయే దాన్ని మాటగా చెప్పనవసరంలేదు. ఏ  స్టోరీ ఈజ్ టోల్డ్ ఇన్ పిక్చర్స్-  అన్నాడు సిడ్ ఫీల్డ్ డైలాగుల ప్రాధాన్యం తగ్గించుకోమంటూ. కానీ బిగినింగే లేకపోతే పిక్చర్స్ కూడా ఎక్కడివి? ముందు కాలంలో ‘పింక్’ అనేది వచ్చి ఈ ప్రశ్న వేస్తుందని వూహించి వుండడు. 

        మాటతో చెబితే పోయేదానికి చాట భారతం  చూపించనవసరం లేదని  ఫ్లాష్ బ్యాక్స్ గురించి రూలుంది. అదే ఫ్లాష్ బ్యాక్ రూలుని  మొత్తం బిగినింగ్ విభాగానికే వర్తింప జేస్తే? బిగినింగ్ విభాగమంతా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. క్లుప్తతకి- తీసివేతకి ఇంతకంటే సులువు వుందా?

       ఈ సినిమా రాత్రిపూట గాయపడ్డ  రాజ్ వీర్ ని నేస్తాలు హడావిడిగా కార్లో హాస్పిటల్ కి తీసుకుపోతూండగా, అవతల ఇంకో చోట  ఆందోళనతో హీరోయిన్లు ముగ్గురూ క్యాబ్ ఎక్కి పారిపోతూండగా మొదలవుతుంది. వాళ్ళు హాస్పిటల్ కి పోతారు, వీళ్ళు ఫ్లాట్ కి వచ్చేస్తారు. ఏదో జరిగింది. ఏం జరిగిందనేది పెద్ద సస్పెన్స్. ఈ దృశ్యాలన్నీ మిడిల్ కి చెందినవి. ఎక్కడో ఏదో సంఘటన జరిగి వీళ్ళిలా వచ్చేశారంటే- హాఫ్ వేలో సినిమా మొదలైందంటే - అప్పటికే బిగినింగ్ అయిపోయిందన్న మాట. ఏదో జరిగి వుండడం అనేదే ప్లాట్ పాయింట్ -1 ఘట్టం. ఈ ఘట్టం మనకి చూపించకుండా ఈ ఘట్టం తర్వాత పరారీ నుంచి ఎత్తుకున్నారు కథని. అంటే మిడిల్ నుంచీ కథ ఎత్తుకున్నారు. సర్వసాధారణంగా ఇలాంటప్పుడు ఒక్కటే జరుగుతుంది- కాస్సేపు సస్పెన్స్ ని  పోషించినట్టు పోషించి,  సందు చూసుకుని ఆ బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ గా వేసేసి,  మొత్తం చూపించేస్తారు ఏం జరిగిందో. 

        ఇలా కాకుండా ఓపెనింగ్ బ్యాంగ్ అని ఇంకా ఒక ఫ్యాషన్ పెట్టుకున్నట్టయితే,  ఆ ఘట్టంతోనే సినిమా ఓపెన్ చేసి బ్యాంగ్ ఇచ్చి- తర్వాతి మొక్కుబడి తంతుగా టైటిల్స్ మొదలెడతారు. ఇంకా అంబాసిడర్ కార్లలాగా తిరుగుతున్న ఈ రెండిటినీ (ఫ్లాష్ బ్యాక్, ఓపెనింగ్ బ్యాంగ్) కాలుష్య నియంత్రణ చట్టం కింద కాలం చెల్లిన డొక్కు బళ్ళుగా ప్రకటించి, వేటు వేసిందే ‘పింక్’ పంథా. 

        ఈ సృష్టిలో మనం మిడిల్ లో వున్నాం, ఎండ్ చూస్తాం, సృష్టి ఎలా మొదలయ్యిందో మనం చూళ్ళేదు. వాళ్ళూ వీళ్ళూ చెప్పగా వింటున్నాం.  సినిమాలో బిగినింగ్ ని మాత్రం చూడాలన్న కోరిక ఎందుకు పెట్టుకోవాలి. పాత్రలే చెప్పుకుంటున్నది వింటే సరిపోదా?

        మిడిల్ తో ప్రారంభించి - మిడిల్ బిజినెస్ తాలూకు సంఘర్షణంతా చూపించుకొస్తూ- సెకండాఫ్ లో కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమైనప్పుడు- అసలేం జరిగిందో (బిగినింగ్) ఆయా సాక్షుల, వైరి పక్షాల వాంగ్మూలాల్లో బయటపడ్డం మొదలవుతుంది. ఎప్పుడూ కూడా ఏ సాక్షీ అసలేం జరిగిందంటే అనగానే- ఒక బిట్ ఏదో ఫ్లాష్ బ్యాక్ గా వేస్తూ చూపించడం కూడా చేయలేదు. ఇప్పుడు కూడా జరిగిన సంఘటన దృశ్య పరంగా అస్సలు చూపించలేదు. కోర్టు విచారణలో పాత్రల మాటల ద్వారానే మనం వూహించుకోవాలి, అర్ధం జేసుకోవాలి. ప్రేక్షకులతో ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ అంటారు దీన్ని. ఒక్కసారి ప్రాసిక్యూటర్ సీసీ టీవీ ఫుటేజీ వేస్తాడు కోర్టులో. అప్పుడు కూడా ఆ రిసార్ట్స్ రూమ్స్ బయట హీరోయిన్లు ముగ్గురి అనుమానాస్పద కదలికలే చూపించి అర్ధాలు తీయడం మొదలెడతాడే తప్ప- రూమ్స్ లోపలేం జరిగిందో చూపించడు. ఎందుకంటే రూమ్స్ లోపల సీసీ కెమెరాలు పెట్టరని మనకి తెలిసిందే. వాస్తవంగా చూసినా  ఒక సంఘటన జరిగి కేసు నడిస్తే,  ఆ సంఘటనలో పాల్గొన్న వ్యక్తులు తప్ప మనం గానీ, పోలీసులు గానీ, కోర్టుగానీ దాన్ని చూసి వుండే అవకాశం ఎలా వుండదో,  అదే వాస్తవిక ధోరణితో కథని నడిపారు. 

        రెండోది, ఏం జరిగిందో మనకి అర్ధమైపోతూంటే ఇంకా దృశ్య రూపం అక్కర్లేదు. మాటగా చెబితే అర్ధమయ్యే దానికి బొమ్మ చూపించనవసరం లేదు. 

        ఇందుకే దృశ్యపరమైన బిగినింగ్ అప్రస్తుతమై పోయింది. కోర్టు భాషలో చెప్పాలంటే ఇమ్మెటీరియల్ ఐపోయింది. ఇది స్టేజి నాటక విధానం. ఇదే కథని స్టేజి నాటకంగా వేస్తే  మొదటి రంగం అవసరం లేకుండా తర్వాతి రెండు రంగాల్లో చూపించేస్తారు. మొదటి రంగం రిసార్ట్స్ సంఘటన అయితే అదెలాగూ స్టేజీ మీద చూపించడం కష్టం కాబట్టి దాన్ని పరిహరించి, నేరుగా ఈ సినిమాలోలాగే పాత్రల పరారీతో రెండో రంగంగా ప్రారంభించి, రెండో రంగం బిజినెస్ గా ఆ సంఘర్షణ అంతా తెర దించకుండా ఆ ఒక్క రంగం లోనే నడిపి- అప్పుడు తెరదించి,  మూడో రంగంగా  కోర్టు సెట్ తో కేసు విచారణ ప్రారంభించి ముగిస్తారు ఈ సినిమాలో లాగే. 

        ఇలా నాటకాల్లో మొదటి  అంకాన్ని పరిహరించినట్టు, సినిమాలోనూ బిగినింగ్ విభాగాన్ని దృశ్యంగా తీసేసి, దాని విశేషాల్ని మిడిల్ బిజినెస్ లో భాగంగా పాత్రల చేత పలికిస్తూ వచ్చారు. ఏమైనా తేడా వచ్చిందా ఆస్వాదనలో? ఏమీ రాలేదు. 


        ఈ కథలో బిగినింగ్ వుంది. కాకపోతే  మిడిల్- ఎండ్ విభాగాల్లో మాటల రూపంలో దాగి వుంది. కాఫీలో పంచదార వుంది. అయితే కలపలేదు, తాగుతూంటే మెల్లగా కరుగుతూంటుందిగా. ఇదే ఈ స్క్రీన్ ప్లేతో చేసిన అపూర్వ ప్రయోగం. దీంతో మొత్తం సినిమాకే ఒక కొత్త కళ  వచ్చింది. రూల్స్ అందరూ పాటిస్తారు. రూల్స్ ని బ్రేక్ చేసే రెబల్స్ కావాలంటే కూడా బెడిసి కొట్టకుండా ఒడిసిపట్టే  నేర్పు తెలిసి వుండాలి. అనిరుద్ధ  రాయ్ చౌధురి, షూజిత్ సర్కార్, రీతేష్ షా త్రయం ఈ  జిమ్నా(సిన్మా) స్టిక్స్ లో ఆరితేరిపోయారు.


-సికిందర్
http://www.cinemabazaar.in