‘కాక్ టైల్’ (తమిళం)
రచన, దర్శకత్వం: ఆర్ ఏ విజయ మురుగన్
తారాగణం: యోగిబాబు, రేష్మీ గోపీనాథ్, మిథున్ మహేశ్వరన్, బాలా, కవిన్, సాయాజీ షిండే తదితరులు
సంగీతం: సాయి భాస్కర్, ఛాయాగ్రహణం: ఆర్ జే రవీన్
నిర్మాత: పిజి ముత్తయ్య, ఎం. దీపా
విడుదల: జీ5
***
తమిళంలో పొన్మంగళ్ వందాళ్,
పెంగ్విన్ అనే రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ డైరెక్ట్ ఓటీటీ విడుదలల తర్వాత, కమెడియన్
యోగిబాబుతో ‘కాక్ టైల్’ విడుదలైంది. ఇది
కూడా మొదటి రెండిటిలాగే కొత్త దర్శకుల సినిమాల జాబితాలో ఓటీటీ కొచ్చి ఔటై పోయింది.
కొత్త దర్శకుడు విజయ మురుగన్ అట్టర్ ఫ్లాప్ చేయడంలో కొత్త పుంతలు తొక్కాడు. కొత్త
దర్శకుడికి ఇంత పాత కాలపు చీకేసిన సినిమా తీయాలన్న బ్రహ్మాండమైన అయిడియా ఎలా
వచ్చిందో తెలీదు. కమెడియన్ గా తమిళంలో ఇప్పుడు డిమాండ్ లో వున్న యోగిబాబుని బలవంతంగా
వాడుకుని, బలవంతంగా నవ్వించాలని విశ్వప్రయత్నం చేశాడు. యోగిబాబు షూటింగులో
డైలాగులు చెప్పలేదనీ, డబ్బింగులోనే చెప్పాడనీ తెర వెనుక సంగతులు. ఇందుకేనేమో ఫేసు
ఒకలాగా, డైలాగులు ఇంకోలాగా పలికాయి. మనవి ఫూల్స్ అయిన ఫేసులయ్యాయి. ఈ ఫూలిష్
కథేమిటో చూద్దాం...
కథ
కథ
450 ఏళ్ల చోళుల కాలం నాటి
పురాతన మురుగన్ దైవ విగ్రహం మ్యూజియం నుంచి చోరీ అవుతుంది. ఇన్స్ పెక్టర్
రాజమాణిక్యం (సాయాజీ షిండే) కేసు టేకప్ చేస్తాడు. అలాటి నకిలీ విగ్రహం మీడియాకి
చూపించి, విగ్రహాన్నిసాధించామని మీడియాకి చెప్తాడు. దీని వల్ల అసలు విగ్రహాన్ని
చోరీ చేసిన దొంగలు తమ దగ్గరున్నది నకిలీ విగ్రహమనుకుని అమ్మేయడానికి ప్రయత్నిస్తారనీ,
అప్పుడు పట్టుకోవచ్చనీ ప్లాను.
యోగిబాబు జంతువుల సెలూన్
నడుపుతూంటాడు. అతడికి మిథున్ మహేశ్వరన్, బాలా, కవిన్ ఫ్రెండ్స్ గా వుంటారు. మిథున్
మహేశ్వరన్ ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం కూతురు రేష్మీ గోపీనాథ్ ని ప్రేమిస్తూంటాడు. ఒక
రోజు నల్గురూ తాగి పార్టీ చేసుకుని పడుకుంటే తెల్లారి అమ్మాయి శవం వుంటుంది. ఈ శవం
ఎలా వచ్చిందో, ఈ అమ్మాయి ఎవరో తెలీక భయపడతారు.
ఒకవైపు విగ్రహాన్ని అమ్మేద్దామని ప్రయత్నిస్తూ దొంగలు, ఇంకోవైపు శవాన్ని వదిలించు కోవాలని ఈ నల్గురూ. ఈ రెండు గ్రూపులు ఎక్కడ ఎదురెదురయ్యాయి? ఎదురైతే ఏం జరిగింది? ఇన్స్ పెక్టర్ రాజమాణిక్యం ప్లాను పారిందా? విగ్రహం దొరికిందా? శవం కేసులోంచి నల్గురూ ఎలా బయట పడ్డారు? ఇదీ మిగతా కథ.
నటనలు - సాంకేతికాలు
ముందుగానే చెప్పుకున్నట్టు యోగిబాబు
ఫేసొకటి డైలాగొకటిగా నటించిన ఫూలిష్ పాత్ర. కలవని ఫేసూ డైలాగులతో బ్యాడ్ కాక్
టైల్. రజనీకాంత్ ‘దర్బార్’ లో తను చాలా నయం. ఇప్పుడు ఈ సినిమాతో హీరోగా శ్రద్ధగానీ
ఆసక్తిగానీ లేనట్టు నటించాడు మాస్ కూడా
చూడలేని నటన. ఒక్క డైలాగూ నవ్వు పుట్టించదు. పైగా అర్ధం పర్ధం లేని మైండ్ లెస్
కామెడీ సీన్లు కావడంతో అట్టర్ ఫ్లాపయ్యాడు.
బక్కగా
వుండే టీవీ కమెడియన్ బాలాది భరించలేని చీప్ కామెడీ. ఓవరాక్షన్ కూడా. మిథున్
మహేశ్వరన్ కి కామెడీ రాదు, సాయాజీ షిండేకి ఈ సినిమా ఎలా పోయినా పట్టింపు లేదు.
హీరోయిన్ రేష్మీ గోపీనాథ్ ఎప్పుడు కనిపిస్తుందో తెలీదు. కన్పించినప్పుడు ఎందుకీ
రోమాంటిక్ సీన్లు అన్నట్టు ఆమెకే చీదర. పోతే ఇంకో స్టార్ కూడా వుంది. టైటిల్ కోసం
పట్టుకొచ్చిన పక్షి. కాక్ టైల్ అనే ఆస్ట్రేలియా పక్షి. ఇది పైన కూర్చుని
యోగిబాబుని చూస్తూ వుంటుంది తప్ప వీళ్ళ సంగతేమిటో చూద్దామనుకోదు. కాక్ టైల్స్
చిలకల్లా మాట్లాడతాయి. అలా కూడా మాట్లాడించాలనుకోడు దర్శకుడు. ఈ ఆస్ట్రేలియన్ పక్షిని
cockatiel అంటారు.
వీలయినంత పాత కాలపు దర్శకత్వం చేశాడు కొత్త దర్శకుడు. సాంకేతిక విలువలకి విలువలేదు. రైటింగ్ లో గానీ, టేకింగ్ లో గానీ కొత్తదనం లేదు. ఉన్న రెండు పాటలు నీరసం.
కథా కథనాలు
పాత కాలపు అరిగిపోయిన కామెడీ కథ.
విగ్రహం దొంగలు -శవంతో ఫ్రెండ్స్ అన్న డై నమిక్స్ వున్న కథని అర్ధంపర్ధం లేని
కామెడీలతో చుట్టేశాడు. విగ్రహం కథ మళ్ళీ క్లయిమాక్స్ లో తప్ప గుర్తుకు రాదు. శవంతో
కథతో సస్పెన్స్, థ్రిల్స్ వుండవు. గతంలో మైండ్ లెస్ కామెడీలు చాలా వచ్చాయి. రోహిత్
శెట్టి తీసిన ‘గోల్ మాల్’ సిరీస్ సహా. అవి లాజిక్ ని వదిలేసి నవ్వించడంలో సక్సెస్ అయ్యాయి.
‘కాక్ టైల్’ లో లాజిక్ లేదు, నవ్వులేదు.