రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, మే 2020, గురువారం

938 : స్క్రీన్ ప్లే సంగతులు



     విషయం 4. డాక్యుమెంట్ ఎగ్జామినర్ చిత్రపటం, లెటర్ దగ్గరి పోలికలతో వున్నాయని వీడియో ప్రొజెక్షన్ లో చూపిస్తాడు. అయినా ఖచ్చితంగా చెప్పలేమని షిండే అంటాడు. విక్రం షీలా ఇంట్లో సోదాలు నిర్వహిస్తాడు. ఏమీ దొరకదు. విక్రం బయటికొస్తూంటే షీలా వాడుతున్న రెండో కారు కనబడుతుంది. అది బ్లూ సెడాన్ కారు. లోపల చెక్ చేస్తే దొరికిన లెటర్ లాంటివే శాంపిల్స్ దొరుకుతాయి. షీలాని అరెస్ట్ చేస్తాడు. ఇంటరాగేషన్లో ఆమె తనకేమీ తెలియదని చెప్తుంది. పాలీగ్రాఫ్ టెస్టుకి ఆదేశిస్తాడు విక్రం. గెస్ట్ హౌస్ మడ్ శాంపిల్స్ తో అనుమానితుల శాంపిల్స్ కలవలేదని రోహిత్ అంటాడు. ఫోరెన్సిక్స్ వాళ్ళని పిలిపించి షీలా షూస్, కారు చెక్ చేయించమంటాడు విక్రం. ఇబ్రహీం షీలా కారుని గుర్తుపడతాడేమో చూడమంటాడు. 
    
        వివరణ : ఉత్తుత్తి లెటర్ తో ఇంకా సీన్లు నడుస్తున్నాయి. ఇంటర్వెల్ ఉత్తదే అని తేలిపోయినట్టు, ఈ లెటర్ తో నడుస్తున్న ఈ సీన్లు కూడా ఉత్తవే అని తేలే మరో నిరాశని కూడా చవి చూడబోతున్నారు ప్రేక్షకులు. మెయిన్ ప్లాట్ వదిలేసి, సబ్ ప్లాట్ క్యారక్టర్ తో ఇన్ని సీన్లు వృధా చేస్తున్నాడు కథకుడు. చిత్రపటం, లెటర్ ఒకరి చేతి వ్రాతేనని మామూలు కంటికి తెలిసిపోతూండగా, ఇంకేంటి పరిశోధన? రెండిటి స్ట్రోక్స్ ని ప్రొజెక్షన్ వేసి మాన్యువల్ కంపారిజన్ చేసి చెప్పడం. స్ట్రోక్స్ ఎక్కడ కలుస్తున్నాయి, ఎక్కడ కలవడం లేదని మార్కింగ్స్ లేకుండానే అనుకోవడం. చివరికి చిత్రపటం, లెటర్ ఒకటేనని చెప్పలేమని షిండే తీర్పు. సింపుల్ గా సాఫ్ట్ వేర్ రన్ చేస్తే ఒక్క నిమిషంలో రెండూ ఒకటేనని చెప్పేస్తుంది నూరు శాతం పాజిటివ్ మార్కింగ్స్ సహా! కానీ షిండే అలా చెప్తేనే ఈ వంకతో విక్రం షీలా ఇంటికెళ్ళే సీను రాసుకో గల్గుతాడు కథకుడు. ఆ సీను పెట్టుకోవడం కోసం ఈ సీను ఇలా చెడగొట్టడం. 

          ఇక షీలా ఇంట్లో దేనికోసం సోదాలు చేశాడో తెలీదు. షీలా అడిగితే, ప్రీతి నీతో ఎక్కువ సమయం గడుపుతుంది కదా అందుకని - అన్నాడు. కానీ ప్రీతి గురించి ఆధారాలేమైనా దొరికితే వాటిని ఆమె అదృశ్యమైన సమయంతోనే ఎలా కనెక్ట్ చేస్తాడు. ప్రీతి కనబడకుండా పోయిన సమయంలో నేను నా కూతుర్ని కలవడానికి వెళ్ళానని కథకుడు రాసిన వెనుకటి సీన్లో చెప్పాను కదయ్యా, ఇంతకీ నా ఎలిబీ చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకుని ఈ సీను పెట్టుకోవడం నీకు అవసరమా కాదా ఆలోచించు - అని షీలా కూడా అనదు పాపం. భర్త లేకపోవడం చూసి అందరిలాగే విక్రం కూడా టార్చర్ పెడుతున్నట్టున్నాడు పద్ధతైన ఇన్వెస్టిగేషన్ మానేసి. ‘చూడమ్మా, నీ పట్ల మీ గేటెడ్ కమ్యూనిటీ గుంపు ఫీలింగ్స్ తో నాకు పనిలేదు. నేను వాట్సాప్ యూనివర్సిటీ నుంచో, ఫేస్బుక్ నుంచో ప్రభావితుడ్నై రాలేదు. లేడీస్ ని ప్రొటెక్ట్ చేసే ‘హిట్’ నుంచి నేనొచ్చాను. మా ‘హిట్’ లో మా మెంటల్ కొట్లాటలేవో మాకుంటాయి. ఆ టెన్షన్ కూడా నీ మీద రుద్దను. నాకో ఫ్లాష్ బ్యాకుంది. నాకో చెల్లెలుండేది. దుర్మార్గుడు బలిగొన్నాడు. అలాటి దుర్మార్గుడిగా నీతో నేను ప్రవర్తించ లేను. మనం విన్- విన్ పొజిషన్లో మ్యాటర్ మాట్లాడుకుందామా’ - అని వుంటే, ఆమె భళ్ళున ఏడ్చేసి నిజం చేప్పేసేది. రసవిహీన ఇన్ఫర్మేషనే తప్ప మానవత్వమున్న డ్రామా లేకపోతే కష్టం. 

        ఇంత టార్గెట్ చేస్తున్న షీలా సెల్ ఫోన్ కూడా చెక్ చేయడు ప్రీతితో కాల్స్ గురించి, మెసేజెస్ గురించీ. షీలా గూగుల్ మ్యాప్ టైం లైన్ చెక్ చేస్తే ఆ రోజు ఏ సమయంలో ఎక్కడుందో కూడా తెలిసిపోతుంది. ఇంకోటేమిటంటే, తనూ ప్రీతీ కలిసి ఆన్ లైన్లో ఏదో నిర్వహిస్తున్నట్టు వెనకటి సీన్లో చెప్పింది షీలా. ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ కూడా చెక్ చేయడు. అసలు షీలా ప్రీతిని కిడ్నాప్ చేయడానికీ, చంపడానికీ మోటివ్ ఏమైవుంటుందో కూడా ప్రాథమిక కోణంలో దర్యాప్తు చెయ్యడు. మోటివ్ రుజువు కాకపోతే కేసు నిలబడదని తెలుసుకోడు. 

       ఇక షీలా ఇంట్లోనే బ్లూ సెడాన్ కారుని పట్టుకున్నాడు. షీలాకి బ్లూ సెడాన్ కారుందా? ఈ విషయం గేటెడ్ కమ్యూనిటీలో ఎవరికీ తెలీదా? పక్కనే ప్రీతి పేరెంట్స్ కి కూడా తెలీదా? ఆ రోజు ప్రీతి అదృశ్యమైన రోజున, ఆ స్పాట్ కి ప్రీతి ఫాదర్ మోహన్ వచ్చినప్పుడు, ప్రీతి బ్లూ సెడాన్ కారులో తొంగి మాట్లాడడం చూశానని ఎస్సై ఇబ్రహీం చెప్పాడే? అప్పుడు అది షీలా కారు కావచ్చని మోహన్ కి అన్పించ లేదా?

        సరే, ఈ కారు మొన్న ఇంట్లో కన్పించలేదే- అని ఇప్పుడు విక్రం అడిగితే, సర్వీసింగ్ కి ఇచ్చానని అంది షీలా. కారులోపల చెక్ చేసి అలాటివే లెటర్స్ పట్టుకుని, ఆమెని అరెస్ట్ చేసేశాడు విక్రం. లెటర్ తో లాబ్ లోనే కావాలని తేల్చకుండా వదిలేసిన విషయం, ఇప్పుడిలా తేల్చాడు. ప్రశ్నేమిటంటే, రెండు మూడు రోజులుగా తనింతగా పోలీసుల దృష్టిలో వుంటే, ఆ లెటర్స్ కారులోనే ఎందుకు వదిలేసింది? కారు సర్వీసింగ్ కి ఇచ్చి ఇవ్వాళే తెచ్చుకున్నప్పుడు, ఇవ్వాళే కార్లో తాజాగా లెటర్స్ పెట్టినట్టా?

        అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ మొదలెట్టాడు. ఎవరి శవం గురించీ తనకేమీ తెలీదని మొత్తుకుంది. వెంటనే విక్రం పాలీగ్రాఫ్ టెస్టుకి ఆదేశించేశాడు. ఏమేం ఇన్వెస్టిగేషన్ అప్లికేషన్స్ వుంటాయో, వాటికోసం సీన్లు కల్పించి, అవన్నీ కథలో జొప్పించేయాలనుకుంటున్నాడు. షీలా అంగీకారం లేకుండా పాలీగ్రాఫ్ టెస్టు కుదరదని రోహిత్ అంటే, తను మేనేజ్ చేస్తానన్నాడు. రేపు కోర్టులో మానిప్యులేట్ చేసిన ఎవిడెన్స్ పెడతాడన్న మాట. దీనికి చీఫ్ కూడా ఒప్పుకున్నాడు. ఇక గెస్ట్ హౌస్ మడ్ శాంపిల్స్ తో అనుమానితుల శాంపిల్స్ కలవలేదని రోహిత్ అన్నాడు. అక్కడ శవమే లేకపోతే అనుమానితుల మడ్ శాంపిల్స్ దేనికి  ? ఫోరెన్సిక్స్ వాళ్ళని పిలిపించి షీలా షూస్, కారు చెక్ చేయించమన్నాడు విక్రం. ఆమె కారు సర్వీసింగ్ కిచ్చి వాష్ చేసి పారేశాక ఇంకేం చెక్ చేస్తారు? ప్రీతి వేలిముద్రలు, నేహా వేలిముద్రలు వున్నట్టయితే అవి కూడా దొరకవు. అక్కడ శవమే లేకపోతే ఇంకా షీలా షూస్ లో ఏం చూస్తారు? చెప్పిన చోట శవమే లేదంటే అది హోక్స్ లెటరని తేలిపోవడం లేదా? ఇక ఇబ్రహీం షీలా కారుని గుర్తుపడతాడేమో చూడమన్నాడు విక్రం. మీ ఇంటి పక్కనే కారుంటే నువ్వెందుకు చెప్పలేదని ప్రీతి ఫాదర్ ని నిలదీయాలి కదా విక్రం?

(ఇంకా వుంది)

సికిందర్