ఈ రోజుల్లో యూత్ కి వీణ
కావాలా, గిటార్ కావాలా అంటే గిటారే కావాలంటారు. యూతే కాదు, అన్న ప్రాసన రోజున
బుజ్జి బాబు ముందు వీణ ఒక పక్క, గిటార్ ఇంకో పక్కన పెడితే వాడు చిన్ని చేతులతో
గిటార్నే యూత్ అప్పీల్ తో వదలకుండా పట్టుకునే రోజులివి. కానీ కొందరు కొత్తగా వచ్చే
దర్శకులు కాలం మారలేదని, అస్సలు మారబోదని భీష్మించుకుని, ఇంకా వీణే వాయిస్తూ తదాత్మ్యం చెందుతున్నారు. చుట్టూ
యువప్రేక్షకులు యూతో రామచంద్రా అని అలమటించడాల మంటలు రేపుతున్నా ఫిడేలు కూడా
వాయిస్తూ కూర్చుంటున్నారు. వీణ సినిమాలు పోయి గిటార్ సినిమా లొచ్చినట్టు ఆ మార్కెట్టే
తెలియడం లేదు. వీణ సినిమాలంటే ఏడ్పించే రోమాంటిక్ డ్రామాలనీ, గిటార్ సినిమాలంటే హుషారెక్కించే
రోమాంటిక్ కామెడీలనీ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ బ్లాగులో చెప్పుకుంటూనే వున్నాం. కానీ
నిర్మాత దిల్ రాజుకి కూడా వీణ ప్రేమలకే ప్రియమైన మార్కెట్ వుందని గట్టి నమ్మకం. యంగ్
హీరో రాజ్ తరుణ్ కి ‘వీణ లోనా గిటారు లోనా ఎక్కడున్నది నాదము’ అని ఇంకా అయోమయం. ఇక
కొత్త దర్శకుడు జీఆర్ కృష్ణకైతే, టర్కిష్ డ్రామాలోనే యూత్ కి కావాల్సిన దమ్మారో
దమ్ అంతా వుందని ప్రబల విశ్వాసం.
ఈ టర్కీ రోమాంటిక్ డ్రామా - ‘ఆస్క్ టెసా ఫ్లీరీ సెవెర్’ (ఇంగ్లీషు టైటిల్ : లవ్ లైక్స్ కోయిన్సిడెన్సెస్) ట్రాజడీ కూడా! ఇందులో చూపించిన కథాకాలం 1977 నుంచి పాతికేళ్ళు అంటే 2002 వరకూ. 1977 లో పుట్టిన హీరోహీరోయిన్లు, పాతికేళ్ళ తర్వాత 2002 లో కలుసుకున్నప్పటి కథ అన్నమాట. దీన్ని నిర్మించి విడుదల చేసింది 2011 లో. పదేళ్ళ తర్వాత తెలుగులో రీమేక్ చేశారు. రీమేక్ నే కాదు, కొత్తగా వస్తున్న డైరెక్టర్ ట్రాజడీని కూడా పక్కనబెట్టాలన్ననీతి కూడా ఇందులో వుంది. ఐతే తెలుగులో ఈ కథాకాలం 1993 నుంచీ డిజిటల్ యుగంలో వుంది. ఒరిజినల్ కథాకాలం ఇంకా డిజిటల్ కాని ఎనలాగ్ యుగంలో వుంది, 2002 లో సెల్ ఫోన్లు మినహాయించి. రిమేక్ కథాకాలంలో ఒరిజినల్లో వున్న ఒక మిస్టీరియస్ క్రియేషన్ ని మిస్ చేసుకుని చిత్రీకరణ తేలిపోయేలా చేసుకున్నారు. ఇదేమిటో తర్వాత చూద్దాం.
ఈ
ట్రాజడీ రీమేకులో పాయింటునే తీసుకుని కథనాన్ని మార్చినా తెలుగులో న్యాయం చేయగలమా
అంటే పాయింటే ముగింపుని ట్రాజడీ చేసే పాయింటు అయింది. ఇటీవల హీరోయిన్ లేకపోయినా,
వున్నా ప్రేమ లేకపోయినా రెండు మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయి గనుక ట్రాజడీని కూడా
ప్రేక్షకులు ఆదరిస్తారనుకోవడానికి ఆ సక్సెస్ అయిన సినిమాలు ప్రేమ సినిమాలు కావు,
సస్పెన్స్ థ్రిల్లర్స్.
ఈ టర్కీ ట్రాజడీని హక్కులు కొని అధికారికంగా రీమేక్ చేయడానికి ఈ కథలో ముగింపుతో బాటు, కథనంలో కోయిన్సిడెన్సులు ఆకర్షించి వుండాలి. టైటిల్ కూడా ‘లవ్ లైక్స్ కోయిన్సిడెన్సెస్’ అంటూ ప్రమాదాలంటే ప్రేమకి రొంబ ఇష్టమన్నట్టు ఆకర్షించడానికి బలిష్టంగా వుంది. కానీ ముగింపులో వచ్చే కోయిన్సిడెన్సుని కన్విన్స్ చేయడానికే మొదట్నుంచీ కోయిన్సిడెన్సు లతో ప్రేమికులకి యాక్సిడెంట్లు చేయించారని ఒరిజినల్లో కథకుడి ఆంతర్యాన్ని గ్రహించి వుంటే, ఈ రీమేక్ కి బాక్సాఫీసు దగ్గర జరిగే యాక్సిడెంట్ ని నివారించే వాళ్లేమో. ఈ కోయిన్సిడెన్సుల్ని ప్రేమకే ఆపాదిస్తూ టైటిల్ గా పెట్టుకున్నాడు టర్కీ దర్శకుడు. కానీ ఇది రైటర్ కథా సౌలభ్యం కోసం పాల్పడ్డ ‘రైటర్స్ కన్వీనియెన్స్’ అవుతుంది. స్క్రీన్ ప్లే ట్యూటర్ స్కాట్ మేయర్స్ ప్రకారం, కథలో మొదటి సంఘటన కోయిన్సిడెన్సు (విధి) అని సరిపెట్టుకోవచ్చు ప్రేక్షకులు. అలాటిదే రెండో సంఘటనని కోయిన్సిడెన్సుగా సరి పెట్టుకోలేరు ప్రేక్షకులు- కథా సౌలభ్యం కోసం ‘రైటర్స్ కన్వీనియెన్స్’ అనుకుంటారు. మూడోసారి కూడా ఇదే జరిగితే ఇక చెప్పక్కర్లేదు – ప్రమాదాలతో మాటిమాటికీ విధి అంటే చిరాకేస్తుంది. కథనాన్ని విధి మీదికి నేట్టేసే ఈజీ సొల్యూషన్ గా కథ నడపడం రైటర్ కి క్షంతవ్యం కాదంటాడు సిడ్ ఫీల్డ్ కూడా.
ఈ టర్కీ ట్రాజడీని దర్శకుడు మూడు కాకుండా, రెండు ప్రమాదాలతో, అదీ ఒకేసారి జరిగేలా - ‘రోమాంటిక్ సస్పెన్స్’ గా తీసి వుండాల్సింది. ఇది టాలీవుడ్ కి అత్యవసరం. ఎందుకంటే, కథా కథనాల్లో ఏ మాత్రం లోటుపాట్లు ఆలోచించకుండా, కనపడింది కనపడినట్టు రీమేక్ చేసేసే వాళ్ళున్నారు గనుక. వాళ్ళకి కన్వీనియెంట్ గా వుండేందుకు అత్యవసరమే. మరి రెండు ప్రమాదాలు రైటర్స్ కన్వీనియెన్సే కదా, ఎలా? అదెలాగో ‘కాసాబ్లాంకా’ ఉదాహరణగా స్కాట్ మేయర్సే చెప్పాడు. దీని వివరాల్లోకి వ్యాసం ముగింపులో వెళ్దాం. ముందు క్లుప్తంగా కథ చెప్పుకుందాం...
కథ
1993
లో రెండు కార్లు గుద్దుకుని వాటిలో వున్న ఇద్దరు గర్భిణులు ఒకే ఆస్పత్రిలో ఇద్దర్నికంటారు.
పాతికేళ్ళు గడిచిపోతాయి. మహి (రాజ్ తరుణ్) ఫోటోగ్రాఫర్ గా కృషి చేస్తూంటాడు. వర్ష (పాండే) సినిమా హీరోయిన్
నవ్వాలని ప్రయత్నాలు చేస్తూంటుంది. మహి ఏర్పాటు చేసిన ఓ ఫోటో ఎగ్జిబిషన్ లో ఆమె తన
చిన్నప్పటి ఫోటో చూసుకుని మహిని అడుగుతుంది. ఫోటో గ్రాఫరైన తన తండ్రి తీసిన ఫోటో అదని,
అప్పట్లో ఊటీలో వుండే వాళ్ళమని చెప్తాడు. ఆ ఫోటోలో వున్నది తానేనని ఆమె చెప్పేసరికి
ఆశ్చర్యపోతాడు. అలా చిన్నప్పుడు విడిపోయిన ఇద్దరూ ఒకటై మీటవుతూంటారు. చిన్నప్పుడు
పరస్పరం సైకిళ్ళు గుద్దుకుని ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడామెకి రాహుల్ అనే బాయ్ ఫ్రెండ్ వుంటాడు. ఇటు మహికి
చిన్నప్పట్నుంచీ గుండె సంబంధమైన సమస్య వుంటుంది. ఆమెకి ఫోటో షూట్ లు చేస్తూ
సినిమాకి ఎంపికయ్యేందుకు తోడ్పడతాడు. ఆమె ఊటీ బయల్దేరుతుంది. అతను డాక్టర్
చికిత్సకి రమ్మన్నా వినకుండా ఊటీ వెళ్ళిపోతాడు. ఊటీలో ఆమె అతడితో ప్రేమలో
పడుతుంది. అతను ప్రేమించలేక పోతాడు. ఒక రోజు జబ్బు ముదిరి పడిపోతాడు. హాస్పిటల్లో
మృత్యు ముఖంలో వుంటాడు. ఇది తెలుసుకుని ఆమె వస్తూ యాక్సిడెంట్ కి గురై బ్రెయిన్ డెడ్
అవుతుంది. ఆమె గుండె అతడికి మార్చి అతణ్ణి బ్రతికిస్తారు డాక్టర్లు. ఆమె లేకపోయినా
ఆమె తనలోనే వుందనీ, ఇద్దరి లోకం ఒకటేననీ ముగుస్తుంది సినిమా.
జబ్బుకి రియాలిస్టిక్ ఫిక్షన్?
నిన్ను
నేను వెతుక్కుంటున్నప్పుడు నన్ను నేను కోల్పోతాను
నేను నిన్ను కనుగొన్నప్పుడు నాలోంచి నేను తొలగిపోతాను
ఈ వీడ్కోలు ఒక వింత - నువ్వే నాలో వున్నప్పుడు
నేనెంత దూరం వెళ్ళినా నాతోనే కదా నువ్వుంటావు...
నేను నిన్ను కనుగొన్నప్పుడు నాలోంచి నేను తొలగిపోతాను
ఈ వీడ్కోలు ఒక వింత - నువ్వే నాలో వున్నప్పుడు
నేనెంత దూరం వెళ్ళినా నాతోనే కదా నువ్వుంటావు...
ఇలా కవితాత్మకంగా ముగిస్తాడు టర్కీ దర్శకుడు. కథ అర్ధవంతంగా ముగిస్తే కవిత్వం కదిలించ
వచ్చు. రెండు పాసివ్ పాత్రల్ని(ట్రాజడీలలో పాసివ్ పాత్రలే వుంటాయి, ఇవి కమర్షియల్
ఉపయోగాలకి సుదూరంగా ఎక్కడో... వుంటాయి) కథకుడే నడిపిస్తే అతడి బుద్ధి కొద్దీ ముగింపు
వుంటుంది. ఆ కవిత్వాలు కథ లోంచి, పాత్రల్లోంచి ప్రవహించక తన బుద్ధికి తనే కీర్తి
గానాలు చేస్తున్నట్టు వుంటుంది. దీంతో కదిలించే మాటలా వుంచి వికటిస్తుంది.
జబ్బు ట్రాజడీలు జబ్బులంత పాతవి. క్యాన్సర్ జబ్బులు, గుండె జబ్బులు, ఇవి పాతబడి నోరు తిరగని సైంటిఫిక్ పేర్ల జబ్బులూ, ఇవన్నీ ప్రేమ కథలకి ఒకప్పుడు సక్సెస్ ఫార్ములాలు. ఇప్పుడు కాదు. అయినా ఇప్పటి గ్లోబల్ యూత్ గా కదం తొక్కుతున్న యువ ప్రేక్షకుల కోసం తీయాలంటే చాలా రిస్కు వుంటుంది. చాలా క్రియేటివ్ పవర్స్ కూడా అవసరం. అమెరికన్ సాహిత్యంలో యువ పాఠకుల కోసం ఇప్పుడొస్తున్నవి అవే రొటీన్ ప్రేమ నవలలు కాదు. రియాలిస్టిక్ ఫిక్షన్ అనే కొత్త జానర్ నవలలు. ఈ జానర్లో కమింగ్ ఆఫ్ ఏజ్ నవలగా వచ్చి సంచలనం సృష్టించిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ గురించి తెలిసే వుంటుంది. దీన్ని హాలీవుడ్ మూవీగా తీస్తే చాలా పెద్ద హిట్టయింది. దీన్నే హిందీలో ‘దిల్ బేచారా’ గా తీస్తున్నారు. వచ్చే మే లో విడుదలవుతుంది. ఇది ఇద్దరు టీనేజర్ల ప్రేమ కథ. ఆమెకి థైరాయిడ్ క్యాన్సర్, అతడికి లెగ్ క్యాన్సర్. దీని మార్కెట్ - క్రియేటివ్ యాస్పెక్ట్స్ ఏమిటి? హాస్య రసం, వినోదం, యూత్ లాంగ్వేజ్, బలమైన పాత్రలు, క్యాన్సర్ కి, ప్రేమకి యువ దృష్టితో కొత్త భాష్యం!
ఈ లక్షణాలు తెలుగు రీమేక్ కి వున్నాయా? లేవు. రాజ్ తరుణ్ గుండె జబ్బు పాత్ర ఫస్టాఫ్ నుంచీ విషాదమే. టర్కీ దర్శకుణ్ణి ఇప్పటి తెలుగుకి అక్షరాలా ఫాలో అయిపోయారు. యూరప్ భూభాగంతో తో కలిసి వుండే టర్కీ దేశపు సినిమాలు నిజానికి వరల్డ్ మూవీస్ వర్గానికి చెందుతాయి. వరల్డ్ మూవీస్ అంటేనే ఆర్ట్ మూవీస్. వాటి జోలికి పోయి రీమేక్స్ చేయకూడదని చాలా సార్లు చెప్పుకున్నాం. అవి కమర్షియల్ సినిమాల కథలుగా వుండవు, మనకి కమర్షియల్ ప్రదర్శనలకి పనికి రాని, స్ట్రక్చర్ లేని ‘గాథ’ లుగా వుంటాయని పదేపదే చెప్పుకున్నాం. అయినా వాటిని రీమేకులు చేసి చేతులు కాల్చుకుంటున్నారంటే ఏమనాలి. వరల్డ్ మూవీస్ కమర్షియల్ సినిమాలే ఐతే హాలీవుడ్ సినిమాల్లాగా మనదేశంలో ఎందుకు విడుదల కావడం లేదు? ఈ సింపుల్ లాజిక్ ని అర్ధం జేసుకుంటే చాలు. వరల్డ్ మూవీస్ యూరో మూవీస్, హాలీవుడ్ మూవీస్ డాలర్ మూవీస్. యూరోలు కావాలా, డాలర్లు కావాలా? కాబటి హాలీవుడ్ మూవీల మీద చేయేస్తే మేలు.
నాల్గు మైనస్ లు
కాబట్టి యూరో నుంచి తెలుగు రూపాయల్లోకి రీమేక్ చేసిన ఈ గుండె జబ్బు సినిమా 1. పాసివ్ పాత్రలతో, 2. స్ట్రక్చర్ లేని, 3. గాథ; పైగా 4. ట్రాజడీ. థియేటర్లో ఆడాలనుకునే ఒక తెలుగు సినిమా మీద ఇన్ని రకాల దౌర్జన్యాలా? ఈ నాల్గూ సినిమా విజయాన్ని అడ్డుకుంటూ తిష్ట వేసిన దుష్ట చతుష్టయం. సినిమాలకి సంబంధించినంత వరకూ గాథలనేవి మేడి పండులు, వాటి పొట్ట విప్పి చూస్తే పురుగులుండు. ఇలా ఈ రీమేకులో వొరిజినల్లో లాగా, ఫస్టాఫ్ లోనే గుండె జబ్బు విషయం ఓపెన్ చేయడం వల్ల సాంతం విషాదభరితమై పోయింది. రాజ్ తరుణ్ యువ పాత్రకి యూత్ అప్పీల్ లేక నీరసంగా, భారంగా వుండిపోతాడు. తను ఈ సినిమాని నిలబెట్టాల్సిన కథానాయకుడనే విషయమే మర్చిపోతాడు.
ఒరిజినల్లో
ఒక క్రాఫ్ట్ ని ఒప్పుకోవచ్చు : హీరో హీరోయిన్ల చిన్నప్పటి మల్టీపుల్ ఫ్లాష్
బ్యాకుల క్రాఫ్ట్. ఈ ఫ్లాష్ బ్యాకులు బాల్యంలా చాలా ఇన్నోసెన్స్ తో వుంటాయి.
తెలుగులో ఈ ఫీల్ ని పట్టుకోలేకపోయారు. పైగా బాల్యపు సీన్లని పొడిగించారు. బాల హీరోయిన్
తాతతో రిహార్సల్ చేసే సీను లాంటివి. హద్దులు దాటి ఇదేమీ వర్కౌట్ కాలేదు, పైగా
ఇన్నోసెన్స్ కి హానిచేశాయి. డబ్బింగ్ లో ఈ డైలాగులు ఒరిజినల్లో లాగా మంద్రస్థాయిలో
లేకుండా గోలగా వున్నాయి - ఈ ఫ్లాష్ బ్యాకులు లేకపోతేనే బావుండేదన్పించేలా. ఒరిజినల్లో
వున్న బ్యూటీ ఎలాంటిదంటే, బాల్యపు ఫ్లాష్ బ్యాక్ వస్తోందంటేనే ఆసక్తిగా చూసేలా
చేస్తాయి. బాలల సినిమాలు పెద్దల
సినిమాల్లా వుండవు కదా, అలాగే బాలల ఫ్లాష్ బ్యాకులు మిగతా సినిమాలా కలిపేసి
వుండకూడదు.
ఒరిజినల్లో కనీసం ఫస్టాఫ్ కథనంలో
ఆసక్తి వుంది. మొదటి ఇరవై నిమిషాల కథనం ఒక ఎజెండాతో సీక్వెన్స్ గా వుంటుంది.
ప్రారంభంలో కారు ప్రమాదాలు జరిగి హీరోహీరోయిన్లు పుట్టాక, వెంటనే టైటిల్స్ డార్క్
రూమ్ లో నెగెటివ్ లు డెవలప్ చేస్తున్న దృశ్యాలు ప్రారంభమవుతాయి. ఇక్కడే పైన
ప్రస్తావించిన మిస్టీరియస్ క్రియేషన్ వస్తుంది. టైటిల్స్ పూర్తయ్యేవరకూ డార్క్
రూమ్ లో నెగెటివ్ (ఫోటోల) డెవలప్ మెంట్ ప్రక్రియలే. ఎవరు డెవలప్ చేస్తున్నారు,
ఇప్పుడెందుకు డెవలప్ చేస్తున్నారనే మిస్టరీ. ఈ మిస్టరీతోనే టైటిల్స్ పూర్తయి హీరోయిన్
తెరపైకొస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్నవస్తుంది. నెగెటివ్ డెవలప్ మెంట్స్ కి ఈమెతో
సంబంధముందా, ఎలా? సంబంధం లేదనిపిస్తుంది. ఇంతలో హీరో తెరపై కొస్తాడు ఫోటోగ్రాఫర్
గా. ఇప్పుడు గానీ మిస్టరీ వీడిపోదు. ఇతను డిజిటల్ ఫోటోగ్రఫీ లేని ఫిల్ముల కాలంలో
1977 లో పుట్టాడు, పెరిగాడు, ప్రస్తుతకాలం 2002 లో ఫోటోగ్రాఫర్ గా ఫిల్ము లే
వాడుతున్నాడు. ఎందుకంటే అప్పటికింకా డిజిటల్ కెమెరాలు రాలేదు. ఇదీ టైటిల్స్ లో
కూడా కథ చెబుతూ అతణ్ణి ఫోటోగ్రాఫర్ గా ఎస్టాబ్లిష్ చేసిన విధం.
ఈ
బిట్ సీన్స్ లో పరస్పరం వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్ వుంటుంది. ఫోటోగ్రాఫర్ గా అతను ఒక
మ్యాగజైన్ తో డీల్ కుదుర్చుకుంటున్న డెవలప్ మెంట్, సినిమా యాక్టర్ గా ఆమె ఆడిషన్స్
వగైరా హాజరవుతున్న క్రమం. మధ్యమధ్యలో పరస్పరం పేరెంట్స్ ని కూడా చూపిస్తూ వాళ్ళతో
ఇంటరాక్ట్ అవుతున్న దృశ్యాలు. ఈ క్రమంలో ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఒక బిట్. అసలు హీరో
హీరోయిన్లు కలుసుకునే పాయింటాఫ్ ఎటాక్ సీను ఎప్పుడొస్తుందాని చూస్తూంటే, ఏడో
నిమిషంలో ఆమె బాయ్ ఫ్రెండ్ తో యాంటీ సీనుతో ఒక కుదుపు. పన్నెండో నిమిషంలో ఫోటో
ఎగ్జిబిషన్ దగ్గర ఆమె తన ఫోటో చూసుకునే మలుపు. పన్నెండో నిమిషంలో రానేవస్తుంది పాయింటాఫ్
ఎటాక్ సీను - హీరోతో మిలాఖత్.
ఇలా ఈ పన్నెండు నిమిషాల్లో హీరో హీరోయిన్లని, ఇతర పాత్రల్నీచక చకా పరిచయం చేసేశారు. తెలుగులో ఈ ఎజెండాని అర్ధం జేసుకోనట్టుంది. హీరోతో ఒక సీను, హీరోయిన్ తో ఇంకో సీనూ బారెడు సీన్లు గా, నిదానంగా వేసుకుంటూ పోయేసరికి అర్ధం లేకుండా పోయింది. ఇంటర్ కట్స్ లో సీన్లంటనే సముచిత వేగంతో వాటిని రెంటినీ కలిపి ఒక పతాక సన్నివేశానికి చేర్చడం. ఇది జరగనప్పుడు ఇంటర్ కట్స్ కి అర్ధమే లేకుండా పోతుంది. కథనం మీద ఆసక్తి కూడా పోతుంది.
చేజార్చుకున్న తురుపు ముక్కలు
ఒరిజినల్లోనే
కథలో గానీ, పాత్రలో గానీ సస్పెన్స్ అనేదే లేకుండా అంతా విప్పి చూపిస్తూ
వెళ్ళిపోయారు. దర్శకుడు గుప్పెట్లో ఏదీ వుంచుకోలేదు తురుపు ముక్కల్లా ప్రయోగించడానికి. ఫస్టాఫ్ లో పైన చెప్పుకున్న
సీక్వెన్స్ తర్వాత, ఇంకేమీ లేదు కథగా చెప్పుకోవడానికి. ఎప్పుడైతే హీరోకి గుండె
సమస్య అని ఫస్టాఫ్ లోనే చెప్పేశారో, ఇక సినిమా వినోదాత్మక విలువ నాశనమైంది. పక్కా
కమర్షియల్ సినిమాల్లో ఇలాటిది వినోదానికి భంగం కలక్కుండా సమయం చూసి రివీల్
చేస్తారు. కానీ ప్రస్తుత ట్రాజడీ వరల్డ్ మూవీ కథ కాబట్టి స్ట్రక్చర్ వుండదు. ఏది
ఎప్పుడెలా తోస్తే అప్పుడలా ప్రేక్షకుల మీద పారేస్తూ పోవడమే. ఇలా వీడికి గుండె
ప్రాబ్లమని ఫస్టాఫ్ లోనే చెప్పేసి తాంబూలా లిచ్చేశాం, ఇక తన్నుకు చావండని చెప్పేయడమే.
ఇక ఈ సినిమా చూడలేక గిలగిల తన్నుకోవడమే.
రాజ్ తరుణ్ తో ఒక రకమైన యాతన కాదు ఈ సినిమా చూడాలంటే. సినిమా సాంతం శాడ్ మూడే. కొత్త మీసాల యూత్ కత్తి ఎలా భరిస్తాడు వంగిపోయిన రాజ్ తరుణ్ ని? ఆగదూ ఆగదూ ఆగితే సాగదని అప్పుడే వంగి పోవడాలా గుండె పట్టుకుని? ఇదిలా వుంటే, ప్లాట్ పాయింట్స్ ఎక్కడున్నాయో కన్పించవు. గాథ కాబట్టి. ముగింపులో చివరి యాక్సిడెంట్ దాకా ఒకే బిగినింగ్. మిడిల్ లేదు. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. బిగినింగ్ తర్వాత ఎండ్ వచ్చేస్తుంది మధ్యలో మిడిల్ రాదు. క్యారక్టర్ కి గోల్ లేదు, సంఘర్షణా లేదు. ఇది గాథల లక్షణమే. కథైతే రెండు ప్లాట్ పాయింట్స్, మొదటి ప్లాట్ పాయింట్ దగ్గర గోల్, ఆ తర్వాత సంఘర్షణతో మిడిల్, రెండో ప్లాట్ పాయింట్ దగ్గర పరిష్కారమూ, తర్వాత ముగింపుతో ఒక స్ట్రక్చర్ గా వుంటాయి. కథని నాల్గు డబ్బులొచ్చే సినిమాగా నిలబెడతాయి. ఇలా చెప్పడం కొత్త డైరెక్టర్ ని చిన్నబుచ్చడానికి కాదు, వరల్డ్ మూవీస్ బండారం విప్పడానికే. ఇంకా దర్శకులు ఇది గమనించకుండా వరల్డ్ మూవీసే రీమేక్ చేస్తే, కాపీలు చేస్తే వాళ్ళిష్టం.
గుండె జబ్బని మొదటే ఎందుకు చెప్పడం? చివర్లో చెప్పొచ్చుగా? గుండె జబ్బుని దాచుకుని హీరో పైకి నవ్వుతూ ఎంజాయ్ చేయొచ్చుగా? ‘మిలి’ లో ఆడుతూ పాడుతూ వుండే జయబాధురి పాత్ర నిజానికి క్యాన్సర్ బాధితురాలని చివర్లో షాకిస్తుంది గా? ఈలోగా చక్కబెట్టాల్సిన జీవితాల్ని చక్కబెట్టేస్తుందిగా? బాధని దాచుకుని సకార్యాలు చేసేపాత్ర కథానాయక / నాయిక పాత్రవుతుంది. ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ లో హీరో హీరోయిన్ల క్యాన్సర్ పాత్రలేమిటి?
గుండె జబ్బుని తురుపు ముక్కగా వాడుకుని వుంటే, అదే సమయంలో కోయిన్సిడెన్సుల యాక్సిడెంటుల్ని ఇంకో తురుపు ముక్కగా ముగింపులోనే ప్రయోగించి వుంటే, కనీస భద్రత వుండేది ఈ రీమేక్ కి. ఇంకోటేమిటంటే, తెలుగులో ఫస్టాఫ్ లోనే హీరోయిన్ పాత్ర సినిమా హీరోయిన్ అయిపోయినట్టు చూపించే పొరపాటు చేశారు. ఈ విషయంలో రీమేక్ నయం. అందులో క్లయిమాక్స్ లోనే ఆమె స్టేజి నటి అవుతుంది. స్టేజి మీద నటిస్తూండగా హీరో హాస్పిటల్లో వున్నాడని వార్త వస్తుంది. హుటాహుటీన బయల్దేరుతూ యాక్సిడెంట్ పాలవుతుంది. ఇంతలోనే నటి అయి, ఇంతలోనే చనిపోవడం ఎంత బాధాకర అనుభవంగా వుంటుంది ప్రేక్షకులకి. ఇదే తెలుగులో చూపించినట్టు, ఎప్పుడో ఫస్టాఫ్ లో సినిమా హీరోయిన్ అయిన హీరోయిన్, ఇంకెప్పుడో క్లయిమాక్స్ లో యాక్సిడెంట్ అయితే ఈ ఎడం అలాటి బాధాకర అనుభవాన్నిస్తుందా? కొన్ని సెటప్స్ వెంటనే పే ఆఫ్ అయితేనే దాని ఎఫెక్ట్ వుంటుంది. రస పోషణ ఇలాటి డైనమిక్స్ తోనే జరుగుతుంది.
హీరోయిన్ ఊటీ బయల్దేరడం, డాక్టర్ అపాయింట్ మెంట్ ని కాదని హీరోకూడా బయల్దేరడం ఇంటర్వెల్. ఇది గాథ కాబట్టి నాన్ కమర్షియల్ ఇంటర్వెల్ ఇంతే.
పరిష్కారమేమిటి?
ఈ
గాథ సెకండాఫ్ ముగింపు మాత్రం చెప్పుకుందాం. పాత్రకి గోల్ లేకపోతే సెకండాఫ్ లో చెప్పుకోవడానికి
విషయ మేముంటుంది. ముగింపులో హీరో జబ్బు పెరిగి హాస్పిటల్లో చేరతాడు. హీరోయిన్ కి ఇది
తెలిసి వస్తూంటే కారు యాక్సిడెంట్ అవుతుంది. ఇది మూడో యాక్సిడెంట్. మొదటిది
పుట్టడం పుట్టడం కార్లు గుద్దుకుని పుట్టారు. తర్వాత చిన్నప్పుడు సైకిళ్ళు
గుద్దుకుని పరిచయమయ్యారు. ఇప్పుడు ఇంకోసారి గుద్దుకుని హీరోయిన్ బ్రెయిన్ డెడ్డే
ఐపోయింది!
ఇవన్నీ
కోయిన్సిడెన్సులని చెప్పడం. ఇన్ని కోయిన్సిడెన్సులు చూపించడం. మొదటిసారి విధి
అనుకుంటే, రెండోసారి రైటర్స్ కన్వీనియెన్స్ అయితే, మూడోసారి...?? ఇక్కడే స్కాట్
మేయర్స్ ఎంటరవుతాడు. తను నిర్వహించిన ఒక మాస్టర్ క్లాసులో టాప్ డైరెక్టర్ ఆరన్
సార్కిన్ బోధించిన విషయం చెప్తాడు : ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘కాసాబ్లాంకా’ (1942) లో
ఒకే ఒక్క కోయిన్సిడెన్సు వుంటుంది. ఆ ఒకటి కూడా బ్యాడ్ కోయిన్సిడెన్సు అయి ఒప్పించేలా
అన్పించదు.
ఇందులో హీరో (హంప్రీ బోగార్ట్) తనని హీరోయిన్ (ఇంగ్రిడ్ బెర్గ్ మన్) వదిలేసి వెళ్ళిపోయాక, కాసాబ్లాంకాలో నైట్ క్లబ్ నడుపుకుంటూంటాడు. అక్కడికి హీరోయిన్ వస్తుంది - కాకతాళీయంగా వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా కాకతాళీయం అవుతుంది? ఆమె కాసాబ్లాంకాకే ఎందుకు రావాలి, ఇంకో నగరానికి వెళ్ళ కూడదా? వచ్చిందే అనుకుందాం, ఈ నైట్ క్లబ్ కే ఎందుకు రావాలి? ఇంకో నైట్ క్లబ్ కెళ్ళ కూడదా?
ఆమె రావాలని హీరో కూడా కోరుకోవడం లేదు. అయితే కోరుకోక పోవడమే ఈ సీనుని పాక్షికంగా జస్టిఫై చేస్తోంది. ఆమెతో తనకున్న గతాన్ని ఎవాయిడ్ చేస్తున్నాడు గనుకే ఆమె రావాలని కోరుకోవడం లేదు. కానీ ఆ గతాన్ని డీల్ చేయాల్సిందే, దాన్నుంచి తప్పించుకోలేడు. . అందువల్ల ఆమె రాక తన కవసరమే. విధి ఇలా పరీక్షిస్తోంటే ఈ విధిలీలని ఆమోదించాల్సిందే.
సార్కిన్ ఈ ఆమోదాన్ని పాత్ర స్వగతంలో డైలాగు రూపంలో వ్యక్తం చేయాలంటాడు. అప్పుడు రైటర్స్ కన్వీనియెన్స్ అపవాదు తప్పుతుందంటాడు. ఇంతకి మించి ఇంకేమీ లేదు. అంటే ఒక కోయిన్సిడెన్స్ కే ఇంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరముంటే, రెండో కోయిన్సిడెన్స్ కూడా వుంటే? అది అసహజమే. దానికి సహజత్వాన్ని తీసుకు రావడం కుదరదు. మంచి కథా లక్షణం కాదు. మూడోది కూడా వుంటే ఇంకా నాన్సెన్స్.
‘ఇద్దరి లోకం ఒకటే’ లో మూడున్నాయి : కార్లు గుద్దుకుని పుట్టడం, సైకిళ్ళు గుద్దుకుని ఫ్రెండ్స్ అవడం, మళ్ళీ కార్లు గుద్దుకుని బ్రెయిన్ డెడ్ అవడం. ఇలా వుంటే ఇది కామెడీ కూడా అయిపోయే ప్రమాదముంది. ఒక సీరియస్ గా సృష్టించిన కోయిన్సిడెన్స్ కామెడీయే అయింది. సందీప్ కిషన్ నటించిన తమిళ రీమేక్ ‘రన్’ అనే ఇండిపెండెంట్ సినిమా మధ్యలో విలన్ ఆటో గుద్దుకుని ఠపీమని చచ్చిపోతాడు!
అందుకని కోయిన్సిడెన్స్ ఒక్కటే వుండాలి, అదీ బలంగా వుండాలని స్కాట్ మేయర్స్ అంటాడు. మనకి తోచినంతవరకూ ‘ఇద్దరి లోకం ఒకటే’ పరిష్కారం - మొదటి రెండు ప్రమాదాలు తీసేసి చివరి ఒక్క ప్రమాదాన్ని వర్కౌట్ చేయాలి. అతడి గుండె జబ్బు విషయం సెకండాఫ్ లోనే ప్రేక్షకులకి రివీలై, హీరోయిన్ కి రహస్యంగా వుంటుంది. ఇక తప్పనిసరిగా ప్రేమలో కమిటవాల్సి వచ్చేసరికి, కారు యాక్సిడెంట్ చేస్తాడు. అతడి కోసం ఆమె వచ్చేస్తూ యాక్సిడెంట్ అయి బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆమె గుండె అతడికి అమరుస్తారు. చావాలనుకున్న వాడు బతకాల్సి వచ్చింది. ఆమె బతికించింది. మొదటిది అతను కావాలని చేసిన యాక్సిడెంట్, ఎవ్వరూ వూహించని రెండోది విధి లీల. దట్స్ ఐరనీ, ట్విస్ట్ ఎండింగ్. ఓ హెన్రీ స్టయిల్.
-సికిందర్