రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఏప్రిల్ 2019, ఆదివారం

811 : స్క్రీన్ ప్లే అప్డేట్స్



          కప్పటి ప్రేమలు ఇప్పుడు వెండితెర మీంచి అదృశ్యమై పోయాయి. ఒకప్పుడు ప్రేమికుడు ప్రేయసిని వెతుక్కుంటూ సుదీర్ఘ అన్వేషణ కొడిగడితే, చేతిలో ఆమె  తాలూకు ఏదైనా గుర్తో, బొగ్గుతో గీసిన బొమ్మో, చిన్నప్పడు కలిసి తిరిగిన జ్ఞాపకాలో వుండేవి. మరిప్పుడు? ముప్పయి సెకన్లలో ఫేస్ బుక్ తో  ప్రేమ కథంతా ఫినిష్!
          సోషల్ మీడియాతో బాటు నేటి టెక్నాలజీ రోమాంటిక్ కామెడీలని పూర్తిగా చెడగొట్టాయి. ఇప్పుడు ఇద్దరు అపరిచయస్థుల మధ్య ఒక నమ్మదగ్గ, ఒరిజినల్ ప్రేమ కథని సృష్టించడం అసాధ్యమైపోతోంది. ఎందుకంటే అపరిచయస్థులనే పదానికే ఇప్పుడు స్థానం లేకుండా పోయింది. కోర్టింగ్, డేటింగ్ అనేవే లేకుండా పోయాయి. కలుసుకున్న మొదటి  క్షణంలోనే తాము విడదీయరాని జంట అనేసుకుంటున్నారు. అలాగని 1950 లనాటి పాత్రలతో కథ ఆలోచించలేం. రోడ్డు మీద ముక్కూ మొహం తెలియని అమ్మాయిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకున్న కుర్రాడు కూడా ఇంటికెళ్ళి గూగుల్ చేసి తీర్తాడు. ఆమె ఫేస్ బుక్ పేజీ చూస్తాడు. ఆమె మై స్పేస్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ చూస్తాడు. బ్లాగ్ వుంటే అదీ  చూస్తాడు. ట్విట్టర్ ఎక్కౌంట్ చూస్తాడు. జీపీఎస్ లొకేషన్ లో ఆమె ఎక్కడుంటుందో కూడా తెలుసుకుంటాడు. ఐదు నిమిషాల్లో ఇవన్నీ ఫినిష్ చేస్తాడు. ఇదంతా ఆమె ఎవరో తెలుసుకోవడం కోసం, కాపుకాసి ఆమెని వెంబడిస్తూ వుండడంలోని ఒకప్పటి ఆనందాన్ని చంపేస్తోందా లేదా? కొన్ని అతిపెద్ద రోమాంటిక్ కామెడీలు ఈ కింది ఏదో ఒక అంశాన్నో, సెటప్ నో ఆధారం చేసుకుని వున్నాయి: 

          1.  తప్పిపోయిన ప్రేమించిన వ్యక్తిని, లేదా చిన్నప్పటి నేస్తాన్ని అన్వేషించడం.
          2. ప్రేమిస్తున్న వ్యక్తికి సమయం మించిపోయేలోగా ప్రేమని తెలపడం.
          3. ప్రేమిస్తున్న వ్యక్తి తాలూకు స్నేహితులకి, లేదా కుటుంబ సభ్యులకి దగ్గర కావడం.
          4. దూర తీరాల్నిఅధిగమించడం
          5. తన కళ్ళెదుటున్న లవర్స్  సరి జోడీ కాదని విడగొట్టే ప్రయత్నం చేయడం.
          6, తనెవరో  ఆమెకి తెలియక పోయినా ఆమె దృష్టిలో పడే ప్రయత్నం చేయడం.
          7.  ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని, ఆ ఇష్టాయిష్టాలు నటిస్తూ కామన్ టేస్టులున్నట్టు ఆమెని నమ్మించడం.  
          8. తను అబద్ధం ఆడడనీ, చీట్ చేయడనీ అడక్కపోయినా ప్రూవ్ చేసుకోవడం.
          9. బెస్ట్ ఫ్రెండ్స్ టచ్ లో లేకుండాపోయి, జీవితంలో మరెప్పుడో కలుసుకుని ఒకటవడం.
          10. ప్రేమిస్తున్న వ్యక్తిని వెతికే పనిలో పడడం.
         పై కాన్సెప్ట్స్ తో ఒకప్పుడు ఎంత పెద్ద స్క్రిప్టు నయినా రాసేయొచ్చు. ఇప్పుడు రాస్తే మూడు పేజీల్లో,  కొన్ని నిమిషాల్లో ముగిసిపోతుంది ప్రేమ కథ. మంచి ప్రేమ కథ కాలానికతీతమైనది. కానీ ఈ రోజుల్లో ప్రేమికుల చేతుల్లో సెల్ ఫోన్సే లేనట్టు చూపిస్తే ఏం నమ్మదగ్గదిగా వుంటుంది ప్రేమ కథ? హేరీని ఇప్పుడు గనుక చూపిస్తే సాలీని మ్యాచ్ డాట్ కాంలో కలుసుకుంటాడు. స్టీవ్ మార్టిన్  పొదల్లో కూర్చుని పక్క వాడితో గుసగుస లాడుతూ మెగ్ కి లైనేయడు, ఇంకొకరి ఫోన్ నుంచి టెక్స్ట్ మెసేజి పంపుతాడు. స్కైఇంటి ముందు జాన్ కసక్ మోగుతున్న పెద్ద టేప్ రికార్డర్ నెత్తి మీద పెట్టుకుని ఇప్పుడు నిలబడడు. ఆమె కిటికీ లోని ఐ ఫోన్ ని విసిరి,  ‘ట్రాక్ – 4!’  అని అరుస్తాడు, 

          అప్పట్లో ‘స్లీప్ లెస్ ఇన్ సియటిల్’ ఎందుకు వర్కౌట్ అయిందంటే, ఆ లవర్స్ చెరొక దూర ప్రాంతంలో వుంటారు,  ఒక రేడియో షోతో కాంటాక్ట్ అవుతారు. కాలం, దూరం ఎంత ఎడంగా వుంటే అంత ఉత్కంఠ రేకెత్తిస్తుంది రోమాన్స్. టెక్నాలజీ అరచేతిలోకి వచ్చాక ఇది సాధ్యం కావడం లేదు. దూర సంబంధాలు పదేళ్ళ క్రితం కంటే ఇప్పుడు సులభతర మైపోయాయి. ఇటీవల ‘గోయింగ్ ది డిస్టెన్స్’ లో ప్రేమికుల మధ్య దూరాభారం వర్కౌట్ అవడానికి, ఆ రిలేషన్ షిప్ దృఢమవడానికీ ఫోన్ సెక్స్ చూపించారు. ఇది సహజమేనా వెబ్ కెమెరా లొచ్చాక? కంప్యూటర్లకి వెబ్ కామ్స్ వున్నాయి, స్కైప్ వుంది. సెక్స్టింగ్ వెబ్ సైట్స్ కూడా వున్నాయి. తమ పేరెంట్స్ కంటే ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటున్న పద్నాల్గేళ్ళ టీనేజర్స్ వుంటున్నాక, ప్రతి రెండు రిలేషన్ షిప్స్ లో ఒకటి విడాకులవుతున్నాక, ప్రతీ నాల్గు రిలేషన్ షిప్స్ లో ఒకటి ఆన్ లైన్లో మొదలవుతున్నాక, ఇంకా పాతికేళ్ళ అందమైన వర్జిన్ ని చూపించడం, టెక్నాలజీతో సంబంధంలేని  ప్రేమలు చూపించడమూ హాస్యాస్పదంగా వుంటుంది. 

         
అంటే దీనర్ధం నిజమైన ప్రేమలు, రోమాంటిక్ కామెడీలు నశించి పోయాయని కాదు. ప్రేమికులకి లంకె వేయడాన్ని, నేపధ్యాలు చూపించడాన్ని ఇప్పుడు మరింత  క్రియేటివిటీతో చేయాలి. 50 ఏళ్ళు దాటిన ప్రేమలు చూపించినప్పుడు టెక్నాలజీ పాత్ర లేకపోయినా విశ్వసనీయత చెక్కుచెదరదు. రోమాంటిక్ కామెడీలు వాటికవే ఫాంటసీ ఎలిమెంట్ ని కలిగివుంటాయి. అవి అద్భుతమైన స్వప్న జగత్తులు. వాటి ఈక్వేషన్ చాలా సింపుల్ గా వుంటుంది – పరిస్థితి ప్లస్ మ్యాజిక్ ప్లస్ గుడ్ లుక్స్ మైనస్ అవాంతరాలు ఈజిక్వల్ టు సుఖాంత ప్రేమ. 

          ప్రేక్షకులు కాసేపు సమస్యల్ని మర్చిపోవడానికి సినిమా కెళ్తారు. అయితే సినిమాలో సృష్టించే కథా ప్రపంచం వాళ్ళు సంలీనమయ్యేట్టు వుండాలి. ఎంత తీసినా రోమాంటిక్ కామెడీలు వాస్తవాల పునాదుల  మీద వుండాల్సిందే. పాత్రలు కంప్యూటర్లే వాడక పోతే, సెల్ ఫోన్లే ముట్టుకోకపోతే అది వాస్తవికంగా వుండదు.

డానీ మానుస్
(స్క్రిప్ట్ కన్సల్టెంట్)