రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఏప్రిల్ 2019, ఆదివారం

810 : టిప్స్





 (17 - 30) 

  17. మల్టీ ప్లెక్స్ సినిమాల స్క్రీన్ ప్లే లకి ఓ స్ట్రక్చర్ అంటూ వుండదు. ఈ సినిమాలు తీసే కొత్త దర్శకులు ఇదో కొత్త ధోరణి అనుకుంటూ ఇష్టానుసారం కథలల్లుకుంటున్నారు.. లైటర్ వీన్ కథలు, బలహీనమైన పాయింట్లు, వెన్నెముక లేని ప్లాట్ లైన్లూ వీరి ప్రత్యేకత. కొన్ని సినిమాల నుద్దేశించి కాలక్షేప బఠాణీ లంటూంటాం...వాటిల్లో కూడా కథ ఎంతైనా కొంత బలంగానే వుంటుంది. కానీ మల్టీప్లెక్స్ సినిమాలు అంతకన్నా బలం లేని కథలతో పాప్ కార్న్ సినిమాలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఇంతే గాకుండాఈ కథలకి ఒక ప్రధాన పాత్ర, దాని చుట్టూ కథ నడపడం అనే బాదరబందీ కూడా  వుండదు. దీనికి చక్కటి ఉదాహరణ- బ్యాండ్ బాజా బరాత్’, దీని రీమేక్ ఆహా కల్యాణం’.
          18. ఒక స్టార్ ని చూపించే విధానంలో ఎక్కడా లోపం జరక్కుండా చూసుకోవడం రచయిత బాధ్యతే. ఉదాహరణకు కొరియర్ బాయ్ కళ్యాణ్ లో   ఎక్కడో బుఖారెస్ట్ లో విలన్ కి ఏంతో  అట్టహాసంగా బిల్డప్ ఇస్తూ సీన్లు సృష్టించారు, కానీ అదే ఫారిన్ కంట్రీలో స్టార్ అయిన నితిన్ మీద అలాటి సీన్లు లేవు. కమర్షియల్ సినిమా లెక్కలు ఇలా వుండవు. గతంలో ఒకసారి తమిళ స్టార్ ఎమ్జీఆర్ ఒక సినిమాలో విలన్ చేతిలో పదిహేను సార్లు ఏకబిగిన కొరడా దెబ్బలు తిని, తిరిగి అదే కొరడాతో ఆ విలన్ ని కొట్టినప్పుడు తక్కువ కొట్టారు. ఇది గుర్తు చేసుకుని మర్నాడు మళ్ళీ అదే సీను షూటింగు పెట్టించి, పాతిక సార్లు ఛెళ్ళు ఛెళ్ళు మన్పించారు ఎమ్జీఆర్  ఆ విలన్ వొళ్ళంతా. లేకపోతే  విలన్ ఎన్నిసార్లు కొట్టాడు, తమ ప్రియతమ పురచ్చి తలైవార్ ఇంకెన్ని  కొట్టాడూ అని అభిమానులు లెక్కెట్టు కుంటారని తర్వాత వివరణ ఇచ్చారు కమర్షియల్ సినిమా లెక్కల్లో పండిపోయిన ఎమ్జీఆర్!
          19. ఎండ్ సస్పెన్స్ కథలతో వుండే రిస్క్ ఏమిటంటే, విడులైన మార్నింగ్ షో వరకే వాటి సస్పెన్స్ వుంటుంది. ఆ తర్వాత  గుట్టు రట్టయి పోతుంది. కథని బట్టి  చివరికి ఫలానా పాత్ర హంతకుడనో, పాత్రలు చనిపోయినట్టు నటించి డ్రామా ఆడాయనో, ఫలానా  పాత్ర అసలు బతికి లేదనో టాక్ బయటికొచ్చేసి తర్వాతి ఆటలకి  సస్పెన్స్ వుండదు. అప్పుడు తెలిసిపోయిన రహస్యంతో (spoiler) ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేయడం కనా కష్టమైపోతుంది. కమర్షియల్ సినిమా అంటేనే రాబడి లెక్కలు. రాబడికి విఘాతం కల్గించే ఇలాటి  ఆత్మహత్యా సదృశ్య ఆలోచనలు  చేస్తున్నారంటే-  కథకి  ఏది రాబడి, ఏది కాదు అనే వడపోత పట్టనందువల్లే.  ఫలానా పాత్ర హంతకుడైతే హత్య చేస్తున్నప్పుడే ఆ పాత్రని ఓపెన్ చేసెయ్యాలి; పాత్రలు చనిపోయినట్టు నటిస్తూ డ్రామా ఆడాలనుకుంటే,  దాన్ని ఇతర పాత్రలకి దాచి పెట్టి ప్రేక్షకులకి  చెప్పేయాలి; ఓ  పాత్ర అసలు బతికి లేదని ఇతర పాత్రలనుకుంటూ వుంటే, బతికే వుందని ప్రేక్షకులకి చూపించెయ్యాలి. అప్పుడు ఎండ్ సస్పెన్స్ అనే  ‘మార్నింగ్ షో మురిపెం’  గండం కాస్తా తప్పి, ‘సీన్ – టు- సీన్ సస్పెన్స్’ అనే  ఎండ్ సస్పెన్స్ లో  వుండని గే మ్ మొదలవుతుంది. ఇలాటి సినిమాల్ని ఇదే నిలబెడుతుంది. ప్రింట్ మీడియాకి ఎండ్ సస్పెన్స్ కథలు రాసుకోవచ్చు, విజువల్ మీడియాకి  ‘సీన్ – టు- సీన్ సస్పెన్స్’  కథలే పనికొస్తాయని ఇకనైనా అర్ధం జేసుకోగల్గాలి.  మొదట్నించీ ఈ బ్లాగులో  ఇదే  మొత్తుకుంటున్నా,  తగుదునమ్మా అని  మళ్ళీ ‘రోజులు మారాయి’  కూడా అలాగే వచ్చి అట్టర్నర ఫ్లాపయ్యింది!
          20. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే ఎలా వుంటుంది? ఒక అప్పారావుకి సుబ్బారావ్ ఫోన్ చేసి, ఒరే నీతో అర్జెంటు పనుంది వస్తున్నాన్రా - అని చెప్పి వచ్చాడనుకుందాం. అలా వచ్చిన సుబ్బారావు వచ్చిన ఆ అర్జెంటు పనేంటో చెప్పకుండా గంటల తరబడి పిచ్చాపాటీ  మాట్లాడుతోంటే అప్పారావ్ కి ఎలా వుంటుంది ? ఓపిక నశిస్తుంది. సుబ్బారావు వచ్చిన పనేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా తగ్గుతుంది. అప్పుడు ఓ రెండు గంటలు గడిచిపోయాక,  సుబ్బారావు చల్లగా - ఓ యాభై వుంటే కొట్టు గురూ - అన్నాడనుకుందాం, అప్పారావ్ రియాక్షన్  ఎలా వుంటుంది?  ఓ యాభై కోసం వచ్చి సంబంధం లేని ఇంత ముష్టి నస పెడతాడా- అని లాగి కొట్టాలనిపిస్తుంది. ఇలాగే వుంటుంది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటే కూడా... కథ పాయింటేమిటో రెండు గంటల దాకా చెప్పే ఆలోచనే చెయ్యక, ఉపోద్ఘాతమే నడిపేస్తున్నామని తెలుసుకోకపోవడంచల్లకొచ్చి ముంత దాచకూడదు, చెప్పడానికొచ్చి కథ దాచకూడదు.
          21. జానర్ మిస్ మ్యాచ్. ఇప్పుడు అమెరికన్ పాపులర్ సాహిత్యంలో యూత్ ని దృష్టిలో పెట్టుకుని, రియలిస్టిక్ ఫిక్షన్ అనే కొత్త జానర్ పరిచయమౌతోంది. ఇందులో మిల్స్ అండ్ బూన్స్ టైపు సాఫ్ట్ రోమాన్స్ కి తావుండదు. తియ్యటి కలల ప్రపంచంలో స్వైర విహారం వుండదు. అలాటి చాప్టర్లు చొరబడితే పబ్లిషర్ ఆ వర్క్ ని తిరస్కరిస్తాడు. జానర్ స్పష్టత కి అక్కడ సాహిత్యంలోనే కాదు, సినిమాల్లోనూ కట్టుబడి వుంటారు. కానీ మనం మాత్రం నవరసాల పోషణ అనే శాస్త్రాన్ని ప్రపంచానికి  ఇచ్చికూడా-వాటిని పట్టించుకోకుండా సొంత పైత్యాల్ని రుద్దుతూంటాం. 
          22. *కథా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో కథానాయకుడనే వాడికి తెలియకపోతే అతనొక  కథానాయకుడే కాదు. 
         
*యాక్టివ్ పాత్రతో కమర్షియల్ సినిమా సహజత్వంతో  తీయడం నూటికి ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతోంది టాలీవుడ్ లో మిగిలినవన్నీ పాసివ్ హీరో పాత్రలతో కమర్షియల్ అనుకుని పొరబడి తీస్తున్న ఆర్ట్ సినిమాల్లాంటివే!
         
*మాస్ సినిమా హీరో పాత్ర, ప్రేమ సినిమా హీరో పాత్ర, సస్పెన్స్ థ్రిల్లర్ హీరో పాత్ర...అన్నీ ఒకలాగే ఉంటాయా? పేరుకే సినిమాలు వేర్వేరు, అన్నిట్లో హీరో పాత్ర అదే క్లాస్- మాస్- లవ్- హార్రర్ – థ్రిల్లర్ సినిమాలన్నిటికీ  కలిపి ఒకే గాటన కట్టి చూపించే తెలుగు మూస హీరో పాత్రతోనే సినిమాలుంటున్నాయి.
          23. స్క్రీన్ ప్లే లో హీరోకి ఏర్పాటు చేసే గోల్ ఒకే మాట ఒకే బాణం అన్న తీరులో ఉండాల్సిన అవసరంలేదన్నట్టు పాత్రచిత్రణ లుంటున్నాయి.  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఒక గోల్ ని ఏర్పాటు చేసినట్టు అన్పించాక, దానికి కట్టుబడి ఉండక,  ఇంటర్వెల్లో ఇంకో గోల్ ని ముందుకు తేవడం వల్ల కథనానికి స్థిరత్వం లేకపోవడమే కాదు, అది ఎపిసోడ్ల మాదిరిగా సాగడమే కాదు, అసలు హీరో ఏం కోరుకుంటున్నాడో అర్ధంగాని పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. ‘కంచెప్రత్యక్ష  కథలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, మొదట బందీలైన తన దళాన్ని విడిపించుకోవడమే  గోల్ గా  ప్రకటించుకున్న హీరో, తీరా ఇంటర్వెల్ దగ్గర, పసి పిల్లని కాపాడే గోల్ గా మార్చుకుంటాడు. ‘షేర్లో త్వరగానే  ఏర్పాటు చేసిన ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, హీరోయిన్ని పెళ్ళాడతానని సవాలు చేసే  ఛోటా విలన్ కి, అదేదో తనే  పెళ్ళాడి చూపించకుండా, ఇంటర్వెల్ దగ్గర ఆ ఛోటా విలన్ కమీషనర్ తో ఇంకో ఎత్తుగడ వేస్తే, దానికి విరుగుడుగా కమీషనర్ తో హీరో ఇంకో గోల్ కి సిద్ధమౌతాడు. కథంటే హీరో కోరికే. అతనేం కోరుకుంటున్నాడో స్పష్టత నివ్వకపోతే కథేమిటో ప్రేక్షకులకి అర్ధంగాదు.
          23. రియలిస్టిక్ ఫిక్షన్ ఇప్పుడు అమెరికాలో యువపాఠకుల్ని పట్టి ఊపేస్తున్న సరికొత్త కాల్పనిక కథా స్రవంతి. కాలక్షేప కాల్పనిక సాహిత్యంతో విసుగెత్తి పోయిన యువపాఠక ప్రపంచంలో ఈ కొత్త జానర్ విపరీతమైన క్రేజ్ సృష్టిస్తోంది. ఇదే జానర్ తో  సినిమాలు కూడా తీస్తున్నారు. జాన్ గ్రీన్ రాసిన  ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్అన్న హిట్ నవల ఇదే పేరుతో  సినిమాగా విడుదలై  ప్రేక్షకుల, విమర్శకుల  ప్రశంసలు పొంది గొప్ప హిట్టయ్యింది. తెలుగులో  ఈ జానర్ ని ఎందుకు ప్రయత్నించకూడదు- రియలిస్టిక్ ఫిక్షన్ తెలుగు సినిమాలకి యూత్ ని ఆకర్షించే సరికొత్త సమ్మో హనాస్త్రమే కాగలదు.
          24. ప్లాట్ పాయింట్ -2 రహస్యం నిజానికి ప్లాట్ పాయింట్ -1 లోనే దాగి వుంటుంది. అందుకే ప్రాబ్లం సెటప్ బలంగా లేకపోతే  కథ ముగింపు కూడా బలహీనంగా వుంటుందనేది. సెటప్ చేసిన ప్రాబ్లం కి పరిష్కారం కనుగొనే ఘట్టమే ప్లాట్ పాయింట్-2.  ఇక్కడ్నించీ ప్రారంభమయ్యేదే క్లయిమాక్స్,  అంటే ఎండ్ విభాగం. ప్రీ క్లయిమాక్స్ అనే పదాన్ని తెలుగులోనే విరివిగా వాడేస్తూంటారు. దీన్ని వివరించమంటే ఎవరూ వివరించలేరు. డిక్షనరీలో ఈ పదానికి అర్ధం పర్యావరణానికి సంబంధించి వుంటుంది. నెట్ లో సెర్చ్ చేసినా - మహేష్ బాబు ప్రీ క్లయిమాక్స్ సీన్ అనో,  బాలకృష్ణ ప్రీ క్లయిమాక్స్ ఫైట్ అనో  కేవలం తెలుగు సినిమాలకి సంబంధించే రిజల్ట్స్ వస్తాయి. తెలుగులో ఈ పదాన్ని ఎవరు ఎప్పుడు ఎలా పుట్టించారో ఎవరైనా రీసెర్చి చేయాలి.  సినిమాల్లో వుండేది క్లయిమాక్స్ మాత్రమే - అది ప్లాట్ పాయింట్-2 దగ్గర్నుంచీ ప్రారంభమవుతుంది. ఒకవేళ ప్రీ క్లయిమాక్స్ నే నిర్వచించాల్సి వస్తే,  అది ప్లాట్ పాయింట్ -2 కి ముందు వచ్చే పించ్ -2 అని చెప్పుకోవాల్సి వుంటుంది.  కానీ పించ్ -2  ని దృష్టిలో పెట్టుకుని  ప్రీ క్లయిమాక్స్ అని అంటున్నారా అంటే,  పించ్-2  ని అందరూ గుర్తించడమే కష్టం- ఎంతో స్క్రీన్ ప్లే పరిజ్ఞానం వుంటే తప్ప. కాబట్టి స్పష్టత లేని పదజాలాలు పెట్టుకుని ప్లాట్ పాయింట్-2 ని  ఆలోచిస్తే అది క్లయిమాక్స్ నే  దెబ్బ తీయవచ్చు.
          25. ఫ్లాష్ బ్యాక్ అనేది కథ మీద ఫోకస్ ని దెబ్బతీస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లేని స్ట్రెయిట్ నేరేషన్ సినిమాల్లో సెకండాఫ్ లో ఎక్కడోచోట కథ డల్ అవుతున్న మాట నిజమే. దీనికి పరిష్కారం ఫ్లాష్ బ్యాక్ కాదు. దాదాపు పాత్రకో ఫ్లాష్ బ్యాక్ చొప్పున వున్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో సెకండాఫ్ అరగంట గడిచాక, రౌడీలని మంచివాళ్ళుగా హీరో ప్రవేశ పెట్టినప్పుడు, అమాంతం కథ డౌన్ అయిపోయి, విషయం  కోసం తడుముకుంటున్నట్టు  తయారవుతుంది. సెకండాఫ్ లో ఒక అనూహ్య సంఘటనో, లేదా కథని మలుపు తిప్పే ఓ కొత్త పాత్ర ఎంటర్ కాకపోవడమో ఇలా జరగడానికి కారణమని తను గమనించినట్టు దర్శకుడు దేవ కట్టా ఒకసారి చెప్పారు.   
          26. వన్ లైన్ ఆర్డర్ ని కాగితాల మీద రాస్తూంటారు. ఆర్డర్ లో ఎక్కడయినా సీను  మార్చాల్సివస్తే, అక్కడ కొట్టి వేసి మళ్ళీ అక్కడే ఇరికించి రాసుకోవడం, మొత్తం సీనే ఎత్తేయాలన్నా అక్కడ కొట్టేయడం వల్ల గజిబిజిగా తయారవుతాయి పేజీలు. వాటిని మళ్ళీ మళ్ళీ ఫేర్ చేసుకుంటూ కూర్చోవడం వృధా శ్రమ. దీనికంటే ఆర్డర్ ని కార్డుల మీద రాసుకుంటే  ఈ గజిబిజి గందరగోళం వుండదు. ఒక్కో సీను ఒక్కో కార్డు మీద నంబరు వేసి రాసుకుంటే, తర్వాతెప్పుడైనా ఓ సీను మార్చాల్సి వచ్చినా, పూర్తిగా ఎత్తేయాలనుకున్నా ఆ కార్డు తీసేసి మరో కార్దు మీద అదే నంబర్ వేసి ఫ్రెష్ సీను రాసుకుని ఆ స్థానంలో పెట్టేస్తే పోతుంది. ఇలా  ఏ క్షణంలోనైనా అప్డేట్ అయిన ఫ్రెష్ ఆర్డరే  స్పష్టంగా చేతిలో వుంటుంది.  ఇంకా ఒక్కో ఎలిమెంట్ ని ఒక్కో రంగు కార్డు మీద రాసుకుంటే- లవ్ సీన్లకి ఓ రంగు కార్డులు,  కామెడీకి ఇంకో రంగు కార్డులు, యాక్షన్ కి ఇంకో రంగు కార్డులు.. ఇలా కేటాయించుకుంటే, వాటిని వరుసగా కింద పర్చుకుని చూసుకున్నప్పుడు, కథ ఎలా రన్ అవుతోందో స్పష్టంగా తెలిసిపోతుంది... ఆల్ ది బెస్ట్!
          27. ముగింపు తెలియకుండా కథ ప్రారంభించ కూడదు. అలాగే అనుకున్న కథలో మొదటి మూల స్థంభం (ప్లాట్ పాయింట్ -1), రెండవ మూల స్థంభం (ప్లాట్ పాయింట్ -2), వీటి మధ్య విశ్రాంతి ఘట్టమూ  నిర్ణయించుకోకుండా రాయడం మొదలు పెట్టకూడదు. నిర్మాణాత్మకంగా కథనం చేయడానికి ఈ ముగింపూ- మూల స్థంభాలు రెండూ-  విశ్రాంతి ఘట్టమూ-  అనేవి నాలుగూ గైడ్ పోస్టులుగా వుంటాయి. ఒక మజిలీ నుంచి ఇంకో మజిలీకి కథనం ఎటు వైపు పోతోందో  తెలుస్తూంటుంది.
          28. వన్ లైన్ ఆర్డర్ ని విస్తరించి ట్రీట్ మెంట్ రాస్తున్నప్పుడు ఆ సీన్లో విషయం అరకొరగా రాసేస్తూంటారు. వన్ లైన్ ఆర్డర్ ని ఓ నాల్గు లైన్లు పెంచి రాసుకున్నట్టు వుంటుందది. ట్రీట్ మెంట్ ( స్క్రీన్ ప్లే) అంటే అదికాదు. తెర మీద ఏ సీను ఎలా ఓపెనవ్వాలో, ఎలా నడిచి, ఎలా ముగియాలో; ఇంకా ఆ సీన్లో వుండే సమస్త విషయాలూ జోడించి, కీ డైలాగ్స్  సహా పరిపూర్ణంగా రాసుకున్నప్పుడే, అది ట్రీట్ మెంట్  రాయడమనే దశ అన్పించుకుంటుంది. అప్పుడే డైలాగు రచయితా  అదుపులో వుంటాడు.
          29. కథల్లో ప్రధాన పాత్రకి ఎప్పుడూ పొంచి వుండే ప్రమాదం పాసివ్ రుగ్మత. ప్రధాన పాత్ర కర్త (యాక్టివ్) గానే వుండాలి తప్ప కర్మ (పాసివ్ ) స్థానానికి జారిపోకూడదు. ప్రధాన పాత్ర తప్పిపోయిన చెల్లెలి కోసం వెతుకుతున్నప్పుడు తనే ఆరాలు తీస్తూ అన్వేషించడం కర్త స్థానం అవుతుంది. ఇలాకాక ఎటు తప్పిపోయిందోనని ఆందోళన చెందుతూంటే, ఎవరెవరో సమాచారమిస్తూంటే ఆ మార్గానపడి  పోవడం కర్మ స్థానం అవుతుంది. ఈ తేడా తెలుసుకుంటే పాసివ్ రుగ్మతకి  దూరంగా ఉండొచ్చు
          30. సినిమా డైలాగుల్లో వాడే పదాలు పేలవమైపోయాయి. అయినా ప్రతీ సినిమాలో అవే వాడేస్తున్నారు. ఎవరో ఎప్పుడో ప్రారంభించారని తిరగమోతగా వాటినే వాడేస్తూపోవడంతో తేడాలేకుండా పోతోంది. సినిమాల శబ్ద సౌందర్యం ఒక్కో సినిమాకి  ఒక్కో కొత్త కథా ప్రపంచమైనప్పుడు, అది  ఒక్కో కొత్త శబ్ద సౌందర్యాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రతీ సినిమాలో మామా, నీ అయ్య, క్లారిటీ, బొంగెం కాదూ, మైండ్ దొబ్బిందా లాంటి పదాలెన్నో అన్ని  కథా ప్రపంచాలకీ రొడ్డ కొట్టుడుగా ఒకర్ని చూసి ఒకరు వాడేస్తున్నారు.  

(మరికొన్ని ఇంకోసారి)
సికిందర్