రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, January 16, 2018

586 : సందేహాలు - సమాధానాలు



‘అజ్ఞాతవాసి’  పైన పాతిక ప్రశ్న లొచ్చాయి. కథా కథనాలు, పాత్ర చిత్రణలు వగైరాల గురించి, పండగ సినిమాకి ఇంతకంటే ఎక్కువ క్వాలిటీ అవసరం లేదనడం దాని గురించి, పండగ అని చెప్పి ప్రేక్షకులు ఎలాటి సినిమానైనా చూసేస్తారనడం దాని గురించి, డబ్బు గడిస్తే కళకి దూరమవుతారనడం దాని గురించీ ... ఇలా ప్రశ్నలొచ్చాయి. కొన్ని ఘాటుగానే వచ్చాయి. విడివిడిగా వాటికి సమాధానమివ్వడంకంటే,  వచ్చిన వాటిని పై 4 వర్గాలుగా విడగొట్టి,  సమాధానమిస్తే సరిపోతుందని భావించాం. 

       మొదట కథాకథాలు, పాత్ర చిత్రణలు : స్క్రీన్ ప్లే సంగతులు అడిగారు. అవతల కోడి పందాలు జరుగుతూంటే, ఈ కథ కాపీ కథ అని ప్రపంచం మొత్తం ఇటు టర్న్ అయి కోడై కూస్తున్నాక,  ఇంకా దీన్ని విశ్లేషించుకోవడం హాస్యాస్పదం. చేసిన కాపీ చర్యని ఆమోదించి నట్టవుతుంది. అందుకనే స్క్రీన్ ప్లే సంగతులు జోలికి పోలేదు, పోదల్చుకోలేదు. అంతేగాకుండా, ఈ మధ్య టెంప్లెట్ సినిమాల స్క్రీన్ ప్లే సంగతుల జోలికి మనం పోవడం లేదు. ఏముంటుంది వాటి గురించి ఇంకా రాయడానికి. అవే రాతలు రాయడం, తెలిసిన అవే అవలక్షణాలు  పాఠకులు చదువుకోవడం అర్ధం లేని వ్యవహారం. ఒక క్రిమినల్ యాక్టివిటీ, హీరో ఫైట్, ఆ విజయంతో ఒక గ్రూప్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, ఇక టీజింగ్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ కొనసాగింపు, హీరోయిన్ లవ్ లో పడగానే ఒక డ్యూయెట్, ఇలా మూడు పాటల కోటా పూర్తయ్యాక విలన్ ఎంట్రీ, విలన్తో ఇంటర్వెల్ సీను, ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ సంగతి వదిలేసి విలన్ తో పోరాటం, బ్లాక్ కాస్ట్యూమ్స్ వేసుకుని కొండ కోనల్లో హీరోయిన్ తో ఒక మెలోడీ సాంగ్, విలన్తో పోరాటం, మరో డ్యూయెట్, విలన్ తో మళ్ళీ పోరాటం, జానపద డ్రెస్సు వేసుకుని హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్....ఈ విధంగా ఒక నాటకం వేస్తున్నట్టుగా టెంప్లెట్ లో వుంటున్న అవే స్టార్ సినిమాల గురించి విశ్లేషణలు దేనికి. 

          హిట్టయినా, ఫ్లాపయినా  ఎప్పుడో ఒక ‘హలో’ లాంటి టెంప్లెట్టేతర సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు. ఎంతో కొంత వాటిలో నేర్చుకోవాల్సిన కొత్త సంగతులుంటాయి. ఒకే టెంప్లెట్ లో వుండే స్టార్ సినిమాల్లోంచి ఏం నేర్చుకుంటారు రైటర్లు, డైరెక్టర్లు. అందుకే రచన, దర్శకత్వ ప్రయత్నాల్లో వుంటున్న వాళ్లకి టెంప్లెట్ సినిమాలు చూడవద్దనే ఈ వ్యాసకర్త చెప్తూం టాడు. చూసి చెడిపోవడం తప్ప ఉపయోగం లేదు. ఇలాగే  తీసే మోజుంటే చూసుకోవచ్చు.

          ఇలా కాపీ కథ ‘అజ్ఞాతవాసి’ కూడా టెంప్లెట్ సినిమానే. ఇది కాపీ చేసి వుండకపో
యినా, టెంప్లెట్ సినిమా కాబట్టి దీని స్క్రీన్ ప్లే సంగతులు అప్పుడూ అవసరముండక పోయేవి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. టాప్  దర్శకులైనంత మాత్రాన వాళ్ళ సినిమాలతో భావిదర్శకులకి మార్గదర్శకులవ్వాలని లేదు. ఇన్ స్పైర్ చేయాలనీ లేదు. ఆ రోజులెప్పుడో పోయాయి. టెంప్లెట్ డైరెక్టర్లు వర్ధమాన డైరెక్టర్లు నేర్చుకోవడానికి కొత్త విషయాలేమీ ఇవ్వరు – ఉమ్మడి మూస తప్ప, సమిష్టి వేస్ట్ తప్ప. 

          ఐతే కాపీ ఐనప్పటికీ దర్శకుడు త్రివిక్రమ్ ని సంప్రదించాలనుకున్నాడు ఈ వ్యాసకర్త. సంప్రదించి ఈ పాటి టాలీవుడ్ లోనే దొరికే  రొటీన్ పాయింటుని ఎక్కడో పరాయిదేశం నుంచి ఎందుకు స్వీకరించాల్సి  వచ్చిందో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఆయన గురించి  తెలిసిందే. తనేం ఏం రాస్తారో,  ఏం తీస్తారో ఎవరికీ  తెలియనివ్వరు. ఎవరైనా జోక్యం చేసుకున్నా, అలాకాదు ఇలాగని చెప్పినా సహించరు. స్టోరీ సిట్టింగ్స్, డిస్కషన్స్ ఏవీ వుండవు. తన వర్క్ గురించి ఎవర్నీ అడగనివ్వరు. కాబట్టి సంప్రదించే ప్రయత్నం వృధా అనుకుని వూరుకోవాల్సి వచ్చింది. 

          కానీ ఒక సీనియర్ కో- డైరెక్టర్ చెప్పిన ప్రకారం, సర్కిల్స్ లో ఏమనుకుంటున్నారంటే, పవన్ – త్రివిక్రమ్ ఇద్దరూ పెద్ద తప్పు చేశారని. ఇప్పుడు పవన్ రాజకీయ ఆకాంక్షలతో ప్రజల్లో ఆసక్తి రేపుతున్నప్పుడు, రివర్స్ లో మళ్ళీ అవే నడుం వూపడాలు, అమ్మాయిలతో అచిబుచ్చి లాడుకోవడాలు చూపించి ఘోరమైన తప్పు చేశారని. ఇలాటి రాజకీయ ప్రవేశ సందర్భంలో ఎన్టీఆర్ ఎలాటి సినిమాలతో ప్రజల్లోకి వెళ్ళారో గుర్తు చేసుకోవాలన్నారు. 

          2. పండగ సినిమాకి ఇంతకంటే ఎక్కువ క్వాలిటీ అవసరం లేదని రివ్యూలో రాయడం గురించి : చూసిన టెంప్లెట్ సినిమాలే మళ్ళీ చూసి ప్రేక్షకులు హిట్ చేస్తున్నప్పుడు, పండగ సినిమా అదే క్వాలిటీలో వుంటే ఎందుకు చూడరు. పండగ సినిమాకి క్వాలిటీ అక్కర్లేదని పనిగట్టుకుని ఎవరూ నాసి సినిమాలు తీయరు. రొటీన్ గా తీస్తున్న సినిమాలే పండక్కీ  వస్తాయి. ఇవి ఇతర రోజుల్లో ఆడవచ్చు, ఆడకపోవచ్చు. కానీ పండగ రోజులు వేరు. పండక్కి విడుదలైన పెద్ద సినిమాలు చూడ్డం సరదా. ఆ మూడ్ లో ఇంకా ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి క్వాలిటీ లేకపోయినా ఆడేస్తాయి. అయితే ‘అజ్ఞాతవాసి’  రెండో రోజుకే పడిపోయింది. ఎక్కడ? ఆన్ లైన్ బుకింగ్స్ లేని సెంటర్లలో. ఆన్ లైన్ బుకింగ్స్  వున్న సెంటర్లలో నాల్గు రోజులకి అన్ని ఆటలూ హౌస్ ఫుల్స్ అయిపోయాయి. లేని చోట్ల సినిమా దెబ్బ తింది. అయితే ఒక వూరట ఏమిటంటే, 26 వ తేదీ వరకూ కొత్త సినిమాల్లేవు. ఈ పదిరోజులు ‘అజ్ఞాతవాసి’,  ‘జై సింహా’ లే చూడాలి. ఐనప్పటికీ నష్టమే తప్పకపోవచ్చు. విషయమేమిటంటే, ‘అజ్ఞాతవాసి’ కి నూట ఇరవై కోట్ల బడ్జెట్ ఎవరు పెట్టమన్నారు. నూట యాభై కోట్లకి బయ్యర్ల మీద భారం ఎవరు వేయమన్నారు. నూట ఇరవై కోట్లతో నిజానికి ఎలాటి సినిమా అందించవచ్చు? గ్రాఫిక్స్ తో అద్భుతమైన ఫాంటసీ తీసి అలరించవచ్చు. రొటీన్ పాత మూస సినిమాకి ఇంత బడ్జెట్ దేనికి? ఇందులో సగం హీరో, దర్శకుడూ తీసుకోవడం దేనికి? వాళ్ళు పండగ చేసుకుంటే సరిపోయిందా? 

          క్వాలిటీ లేకపోయినా పండగ సినిమా అని చూస్తారు గానీ, ఓవర్ బడ్జెట్ చేసుకుంటే లేని ప్రేక్షకులు ఎక్కడ్నించి తెచ్చి బాక్సాఫీసు నింపుతారు. అత్యధిక ధరకి కొన్న ఓవర్సీస్ లో కూడా ఇంకా నాల్గు కోట్ల లోటుతో వుంది. 

          పండగ సినిమా ఎలా వున్నా అడేస్తుందని అనడం క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని అనడమే, ఓవర్ బడ్జెట్ ని కాదు. క్వాలిటీ అంతంత మాత్రంగా వున్న, ‘జైసింహా’ కి ఓవర్ బడ్జెట్ బాధ లేదు. ఇది ‘ఏ’ సెంటర్స్ లో ఆడకపోయినా బి, సి సెంటర్స్ లో ఆడేస్తోంది. 26 వరకూ దీనికి ఆడిందే ఆట.

          3. పండగ అని చెప్పి ప్రేక్షకులు ఎలాటి సినిమానైనా చూసేస్తారని రివ్యూలో రాయడం గురించి : 10 కోట్ల తెలుగు జనాభాలో 9 కోట్ల మంది అసలు సినిమాలే చూడక పోవచ్చు. మిగిలిన కోటి మందిలోనే చూసుకోవాలి. ఈ కోటిలో ఫ్లాప్ టాక్ వచ్చిందని, ఎలాపడితే అలా  తీస్తే ఎవడు చూస్తాడని 50 లక్షల మంది ఆత్మగౌరవానికి పోయి చూడకపోయినా, 50 కోట్లు కలెక్షన్లు వస్తున్నాయిగా.  అంటే మిగిలిన  50 లక్షల మంది ఆత్మగౌరవం చంపుకుని చూస్తున్నట్టేగా.
ఒక పేరు రాయని పాఠకుడు ఇలా తెలిపారు : సామాన్య జనానికి కావలసింది ఎంటర్ టైన్మెంట్. వాళ్లకి రివ్యూలతో పని లేదు. వాళ్ళు పండగ హిట్ ఇచ్చేస్తారు లెండి పవన్ కళ్యాణ్ కి –అని.

          4. డబ్బు గడిస్తే కళకి దూరమవుతారంటూ రివ్యూలో రాయడం గురించి : దీనికి అంత బాధపడిపోవడమెందుకో అర్ధం కాదు. అందరూ ఇంతేనని రాయలేదు. అందరూ వందల కోట్లు గడించిన రాజూ హిరానీలూ,  రాజమౌళీలూ కాలేరని రాశాం. వాళ్లకి డబ్బు డబ్బే, కళ కళే. డబ్బు సుఖం మరిగి ఎలా తీసినా  నడిచిపోతుందనుకోరు. ఇలా స్థితప్రజ్ఞులు కాని వాళ్ళు, స్టోరీ డిస్కషన్స్ చేస్తూంటే వచ్చే డబ్బుతో ఏ కారు కొనాలి, ఫలానా కారు బాగా లేదట, ఎవర్ని సంప్రదించాలి – లక్ష్మి (అంటే వాళ్ళావిడ) – టీవీలో వస్తున్న హోండా జాజ్ కొందామంటోందే, కొందామా? - ఇలా డిస్కషన్స్ లో అబ్సెంట్ మైండెడ్ అయిపోతూంటే ఇంకేం కళా ప్రదర్శన వుంటుంది.


సికిందర్