దర్శకత్వం: అలీ అబ్బాస్ జాఫర్
తారాగణం: సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్, అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగే, సజ్జాద్ డెల్ ప్ఫ్రూజ్, గిరీష్ కర్నాడ్, పరేష్ రావల్, కుముద్ మిశ్రా, అంగద్ బేడి, నవాబ్ షా తదితరులు
కథ: అలీ అబ్బాస్ జాఫర్, నీలేశ్ మిశ్రా, స్క్రీన్ ప్లే –మాటలు : అలీ అబ్బాస్ జాఫర్
సినిమాటోగ్రఫీ: మార్చిన్ లస్కావీస్ , సంగీతం: విశాల్-శేఖర్, జులియస్ పాకియమ్
బ్యానర్ : యశ్రాజ్ ఫిల్మ్స్
విడుదల : 22 డిసెంబర్, 2017
***
2012 లో సల్మాన్ ఖాన్,
కత్రినా కైఫ్ లతో ‘ఏక్ థా టైగర్’ (ఒక టైగర్ వుండేవాడు)
విడుదలైంది. దీనికి ‘భజరంగీ భాయ్ జాన్’ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకుడు. ఇందులో సల్మాన్, కత్రినాలు భారత ‘రా’, పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లుగా ప్రేమలో పడి దేశం కంటే ప్రేమే ముఖ్యమని అదృశ్యమైపోతారు. ఇప్పుడు 2017 లో దీని సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ (టైగర్ బతికే వున్నాడు) లో తిరిగి వీళ్ళిద్దరూ తమ రెండు దేశాల తరపున జాయింట్ ఆపరేషన్ లో పాల్గొంటారు. దీని దర్శకుడు ‘సుల్తాన్’ ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్. రెండిటి నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్సే. మొదటిది కాల్పనిక గూఢచార కథయితే, ఈ రెండో దానికి యదార్ధ ఘటన ఆధారమన్నారు. ఏమిటా యదార్ధ ఘటన? ఎక్కడ జరిగింది? దాన్నెలా తెరకెక్కించారు? ఒకసారి చూద్దాం...
విడుదలైంది. దీనికి ‘భజరంగీ భాయ్ జాన్’ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకుడు. ఇందులో సల్మాన్, కత్రినాలు భారత ‘రా’, పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లుగా ప్రేమలో పడి దేశం కంటే ప్రేమే ముఖ్యమని అదృశ్యమైపోతారు. ఇప్పుడు 2017 లో దీని సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ (టైగర్ బతికే వున్నాడు) లో తిరిగి వీళ్ళిద్దరూ తమ రెండు దేశాల తరపున జాయింట్ ఆపరేషన్ లో పాల్గొంటారు. దీని దర్శకుడు ‘సుల్తాన్’ ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్. రెండిటి నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్సే. మొదటిది కాల్పనిక గూఢచార కథయితే, ఈ రెండో దానికి యదార్ధ ఘటన ఆధారమన్నారు. ఏమిటా యదార్ధ ఘటన? ఎక్కడ జరిగింది? దాన్నెలా తెరకెక్కించారు? ఒకసారి చూద్దాం...
కథ
ప్రేమలో
పడి పెళ్ళిచేసుకుని, కొడుకుని కని, ఆస్ట్రియా
లోని ఆల్ప్స్ మంచుపర్వత శ్రేణుల్లో అజ్ఞాతంగా జీవిస్తున్న మాజీ ఇండో- పాక్ ఏజంట్లు టైగర్
అలియాస్ అవినాష్ సింగ్ రాథోడ్ (సల్మాన్), జోయా
(కత్రినా) ల కోసం ‘రా’ (రీసర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్ - భారత గూఢచార సంస్థ) చీఫ్ షెనాయ్
(గిరీష్ కర్నాడ్) వెతుకుతూంటాడు. ఇరాక్ లోని టిక్రిట్ లో అబూ ఉస్మాన్ (సజ్జాద్ డెల్ ఫ్రూజ్) అనే అతను
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్సీ
నాయకుడుగా ఎదిగాడు. అమెరికన్లు ఆగ్రహించి అతడి మీదా అతడి దళం మీదా వైమానిక దాడులు జరిపితే, గాయపడి ఒక ఆస్పత్రి బస్సెక్కేశాడు. ఆ
బస్సుల్లో నర్సులున్నారు. వాళ్ళని ఆస్పత్రికి తీసికెళ్ళి బందీలుగా పెట్టుకుని,
సురక్షితంగా మకాం పెట్టాడు. అమెరికన్లు వెనుదీయక ఆస్పత్రి మీద దాడికీ సిద్ధమయ్యారు. దీనికి వారంరోజులే టైముంది.
దీంతో ఇండియాలో ‘రా’ చీఫ్ షెనాయ్ అప్రమత్తమయ్యాడు. ఆ నర్సుల్లో పాతికమంది భారత నర్సులే గాక, పదిహేను మంది పాక్ నర్సులు కూడా వున్నారు. ఈ సమయంలో రాజకీయం కాక మానవత్వమే ముఖ్యమని – వాళ్ళందర్నీ ప్రాణాలతో కాపాడాలని సమాయత్తమయ్యాడు. కానీ శత్రు దుర్బేధ్యమైన టిక్రిట్ లో ప్రవేశించే సాహసం చేయగల మొనగాడెవడూ లేడు - ఒక్క టైగర్ తప్ప. ఆఘమేఘాల మీద ఆ టైగర్ని వెతకడం ప్రారంభించాడు...ఈ నేపధ్యంలోనే ఆల్ప్స్ లో పండంటి కాపురం చేసుకుంటున్నటైగర్ దొరుకుతాడు. నీ దుంపతెగ రారా అంటే, కచ్చితంగా రానంటాడు. భార్య జోయా నచ్చజెప్పి పంపుతుంది.
‘రా’ చీఫ్ ఇచ్చే టీముని కాదని, ఒక షార్ప్ షూటర్, ఒక టెక్కీ, ఒక బాంబ్ డిఫ్యూజర్ లతో తన సొంత టీముని ఏర్పాటు చేసుకుని బయల్దేరతాడు. ఇక టైగర్ టిక్రిట్ లోకి ఎలా ప్రవేశించాడు, అక్కడెదురైన ప్రమాదాలేమిటి, టిక్రిట్ లో జొరబడ్డాక ఆస్పత్రిలోకి ఎలా చొరబాటు చేశాడు, ఈ ఆపరేషన్ మధ్యలో పాక్ తరపున జోయా ఎలా వచ్చి తోడ్పడింది, ఆమెతో కలిసి నర్సుల్ని టైగర్ ఎలా బంధవిముక్తుల్ని చేశాడూ అన్నది మిగతా కథ.
ఎలావుంది కథ
దీని
మీద మలయాళంలో తీసిన ‘టేకాఫ్’ గత మార్చిలోనే విడుదలయింది. దీన్ని యదార్థ సంఘటనలాగే తీశారు. కాకపోతే ఫస్టాఫ్ వరకూ అక్కడి కెళ్ళిన నర్సుల
జీవితాల్లో కుటుంబపరమైన సమస్యలు చూపించారు. ఆతర్వాత ఐసిస్ పాల్పడిన అపహరణ – విడుదల
వగైరా యధాతధంగా చూపించారు. అయితే నర్సుల్ని విడుదల చేయించడంలో భారత ప్రభుత్వ
పాత్రకంటే అక్కడి మలయాళీ బిజినెస్ మాన్ పాత్రవుందని వార్తలొచ్చాయి. దీన్ని అప్పటి
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ ధృవీకరించారు కూడా. కానీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్
ఖండించారు. ఇలాటి బందీల, లేదా సంక్షోభంలో ఇరుక్కున్న సమూహాల తరలింపు ఉదంతాల్లో అదేమిటోగానీ బిజినెస్ మాన్లే భుజానవేసుకునే వైనాలు
కనపడుతున్నాయి. ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘హోటల్ రువాండా’ ల తర్వాత ‘ఏర్ లిఫ్ట్’,
ఇప్పుడు ‘టేకాఫ్’ అనే ఇండియన్ సినిమాలు. కువైట్ సంక్షోభంలో మలయాళీ బిజినెస్ మాన్
ని హీరోగా చూపిస్తూ ‘ఏర్ లిఫ్ట్’ తీసినట్టే, ‘టేకాఫ్’ లోనూ మలయాళీ బిజినెస్ మాన్ నే ప్రధానపాత్రగా
చూపించారు. రెండూ వివాదాస్పదమయ్యాయి. కాకపోతే మొదటి దాని విషయంలో దర్శకుడు క్షమాపణ
చెప్పుకున్నాడు.
ప్రస్తుత
కథలో ‘ఇరాక్ లో భారత నర్సుల అపహరణ’ అనే వార్తని ఐడియాగా తీసుకుని, స్పై థ్రిల్లర్
గా యాక్షన్ కథ అల్లారు. ట్విస్టుగా పాక్ నర్సుల్ని కూడా చేర్చారు. ఇసిస్ బదులు
ఐఎస్సీ అన్నారు. ఇరాక్ బదులు అబుదాభీ, మొరాకో లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ స్పై
జానర్ కథని ‘దంగల్’ కోవలో హాస్యభరితం చేశారు. కష్టాల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో,
అన్నిటా పాత్రలు ఫన్నీగా మాట్లాడి తెగ నవ్వించడమనే
వినోదాత్మక విలువని చక్కగా ఉపయోగించుకున్నారు. ఇటీవల ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియెస్ – 8’ లో హీ -
మాన్ హీరోల విట్టీ డైలాగ్ పవర్ ఎలా మాస్ చేత కేరింతలు కొట్టించుకుందో, ప్రేక్షకులతో అవే దృశ్యాలు ప్రస్తుతం థియేటర్లలో కన్పిస్తున్నాయి.
ఎవరెలా చేశారు
సల్మాన్ ఖాన్ ని చూపించి ఎలా చప్పట్లు కొట్టించాలో, ఎలా ఈలలు
వేయించాలో ఆ విన్యాసాలన్నీ ప్రదర్శించారు. ఆ డైలగులన్నీ పలికించారు. మంచు కొండల్లో
సల్మాన్ ఎంట్రీలో చెయ్యి చూపిస్తే ఈలలు, కాలు చూపిస్తే ఈలలు, తోడేళ్ళతో పోరాటం
చూపిస్తే కేరింతలు – అందరూ వేటాడగలరు, టైగర్ లా వేటాడలేరు - అని డైలాగు కొట్టిస్తే చప్పట్లూ ఈలలూ.
ఎడారిలో క్వాడ్ బైక్ మీద దూసుకొస్తూంటే, ఇరాక్ వీధుల్లో గుర్రపు స్వారీ చేస్తూంటే,
ఒక పెద్ద మెషీన్ గన్ మోసుకొస్తూంటే, షర్టు విప్పి కండలు చూపిస్తే...ఒకటేమిటి,
అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు. విచిత్రమేమిటంటే ఇవన్నీ పక్కా లోకల్ మాస్ గా
వుంటూనే ఇంటర్నేషనల్ సినిమాలా అన్పించడం. సల్మాన్ డైలాగులు పలికే తీరువల్ల డైలాగ్
రైటర్ల పని సులువై పోతుంది - పై వాడు నిన్ను క్షమిస్తాడో లేదో, నా పని నిన్ను పై
వాడి దగ్గరకి పంపించడం (పాత డైలాగే)... మన పని కేవలం నర్సుల్ని రక్షించడమే కాదు -
శాంతి కోసం మనం నిలబడ్డామని ప్రపంచానికి చూపించడం కూడా... నీకు దమ్ముంటే నన్నాపి
చూడరా ఉస్మాన్ (పాత మూస డైలాగు)... దేశ ప్రతిష్టకే సవాలు (టెంప్లెట్ డైలాగు)...ఇలా
రాసేస్తే సరిపోతుంది, వాటి ఎఫెక్టు సంగతి సల్మాన్ చూసుకుంటాడు. అయితే చాలాసార్లు
తగ్గాల్సిన చోట్ల తగ్గి, ఇతర పాత్రల బలిమికి అవకాశం కూడా ఇచ్చాడు.
ఈ
స్పై థ్రిల్లర్ లో జోసెఫ్ క్యాంప్ బెల్ మిథికల్
స్ట్రక్చర్ తో బాటు, జేమ్స్ బానెట్ పాత్రల పొందిక కన్పిస్తాయి. ఒకప్పటి కొన్ని
పాత్రలు కనుమరుగైపోయాయి. అలాటి ఒక పాత్ర హీరోయిన్ కత్రినా కైఫ్ పాత్ర. ఇది
వెనుకాడే హీరోపాత్రని ముందుకు తోసే ‘థ్రెషోల్డ్ క్యారక్టర్’. జేమ్స్ బానెట్ ప్రకారం మన మానసికలోకంలో జడప్రాయమైన
అవస్థ వుంటే దాన్ని విడుదల చేసే కవాటం లాంటిది ఇది. కత్రినా పాత్ర కథలో ఈ పని
చూసుకుంటుంది. ఆమె ఎంట్రీ సీను సూపర్ మార్కెట్ లో వుంటుంది. అక్కడ జొరబడిన ముగ్గురు దొంగల్ని సీసీ కెమెరా ఒక
చుట్టు తిరిగే లోపు కొట్టి పడేస్తుంది.
‘దిసీజ్ విమెన్ ఎంపవర్ మెంట్’ అని ఓనర్ మెచ్చుకుంటుంది ( అంటే విమెన్ ఎంపవర్ మెంటుకి
తన్నాలనా? తంతే తప్ప మగలోకం దారికి రాదనేమో).
కత్రినాకి ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ వున్నాయి. సల్మాన్ తన టీముతో అపాయంలో వుండీ స్తబ్దుగా వుంటే, హెడ్ లైట్లు పడతాయి – ఆఁ ... వచ్చేసిందిరో మీ వదిన – అంటాడు సల్మాన్. ఆమె వచ్చేసి ఫటా ఫటా లేపెస్తుంది టెర్రరిస్టుల్ని. కథంటే ఓడిడుకుల మన మానసిక స్థితే. వివిధ పరిస్థితులకి లోనయ్యే స్థితుల్ని చూపిస్తూ పాత్రలతో చక్క దిద్దుతూంటారు.
ఈ టీముతో సంబంధం లేకుండా కత్రినా సొంతంగా వేరే ఆపరేషన్ ఒకటి చేస్తుంది కథకి అడ్డం వస్తూ. మెడికల్ కాలేజీ అమ్మాయిల్ని చదవకుండా ఎత్తుకొచ్చి, రేపులు చేస్తూ చాకిరీ చేయించుకుంటూ వుంటారు ఐఎస్సీ ఉగ్రవాదులు. వాళ్ళతో సోలోగా స్వోర్డ్ ఫైట్ చేసి అమ్మాయిల్ని విడిపిస్తుంది కత్రినా. ఒకవైపు కథకి నర్సుల్ని విడిపించే పాయింటు వుండగా మళ్ళీ ఇదెందుకు సృష్టించారో అర్ధం గాదు. కత్రినా యాక్షన్ సీన్లు డబల్ ధమకాలా ప్రేక్షకుల చేత కేరింతలు పెట్టించేవే.
వెండి
తెర మీద నుంచి ఇంకో కనుమరుగైపోయిన జేమ్స్ బానెట్ చెప్పిన పాత్ర - ట్రిక్ స్టర్. అంటే
మాయగాడు. మన మనసుకి మనతో ట్రిక్కుల్ని
ప్లే చేసే గుణం వుంటుంది. ఆ మాయలో మనం పక్కదోవ పట్టిపోతాం. ఆ కాసేపు, లేదా ఎంత కాలమైనా ఆడుకుని తిరిగి మనల్ని
ట్రాకులో పెడుతుంది మన మనసు మనల్ని. ఈ పాత్రే
పరేష్ రావల్ అద్భుతంగా పోషించిన ఫిర్దోస్ అలియాస్ తోబాఁ ( అరబిక్ లోపాము). ఇతను
పాతికేళ్ళ క్రితం ఇరాక్ లో స్థిరపడి యజమానులకి, అధికారులకీ తొత్తులా వుంటూ కార్మికుల
మీద పడి బతుకుతూంటాడు. హీరో టీముని ముప్పు తిప్పలు పెడతాడు. చివరికి నీతి వైపు నిల్చి సహాయపడతాడు. పరేష్ రావల్
మ్యానరిజమ్స్, మాట తీరూ, నటనా ఎంతో కన్నింగ్ గానూ ఫన్నీగానూ వుంటాయి. ఇలాటి పాత్రనే ‘మ్యాడ్ మాక్స్ టూ’ లో బ్రూస్
స్పెన్స్ పోషించడాన్ని చూడొచ్చు. కొంచెం తేడాతో ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో
నాగభూషణాన్ని కూడా చూడొచ్చు. ఆరుద్ర లాంటి ఆనాటి రచయితలకి ఇది బాగా తెల్సు.
ఐఎస్సీ
లీడర్ గా ఇరానియన్ నటుడు సజ్జాద్ డల్ఫ్రోజ్ నటించాడు. ఈ లోకంలో ఒకటే మతముంది, మానవత్వం - అనే కలికాలంలో ప్రాక్టికల్ గా
పనిచెయ్యని ఐడియాలజీతో హీరోకి పేలవమైన రొటీన్ డైలాగే వుంటుంది. దీనికంటే కళ్ళు తెరిపించే డైలాగు
సజ్జాద్ పలుకుతాడు – ఈ ఆయుధాలు, ఈ డబ్బు ఎక్కడ్నించి వస్తున్నాయి? ఉగ్రవాదం ఒక
బిజినెస్, దీంట్లో లోకమంతా కలిసి వుంది – అని. ఉగ్రవాదం అనే కాష్టంలో ఎవరి లాభం కోసం వాళ్ళు
ఆజ్యం పోస్తున్నారనే అర్ధంలో. సజ్జాద్ ని ఖాకీ యూనిఫాంలో గడ్డంతో, ఎర్ర టోపీతో
చూపిస్తే కల్నల్ గడాఫీ, ఫిడెల్ కాస్ట్రో,
కమ్యూనిజంలని కలగలిపి చూపినట్టుంది. ఈ
మిక్స్చర్ పోట్లంతో ఐసిస్ కి ఏమైనా మెసేజి బహుమానంగా ఇవ్వాలనుకున్నారేమో తెలీదు.
ఇక హీరో టీం మెంబర్లుగా కుముద్ మిశ్రా, అంగద్ బేడీ, నవాబ్ షా కన్పిస్తారు. పాకిస్తాన్ ఐఎస్సై టీం లీడర్ గా సుదీప్ కన్పిస్తాడు. ఈ రెండు టీముల్లో తెలిసిన క్రేజీ స్టార్లుంటే ఇంకా మజా వచ్చేది. ఐఎస్సై టీములో తర్వాత మాజీ ఏజెంట్ కత్రినా వచ్చి కలుస్తుంది. ఇరు దేశాల నర్సులు బందీలై వున్నా, రెండు దేశాల టీములు కలిసి పనిచేయడం అంత వాస్తవికంగా అన్పించదు. శాంతి కోసం పనిచేద్దాం రమ్మంటే పాక్ వచ్చే అవకాశంలేదు. తమ నర్సులకోసం పాక్ ఆపరేషన్ నిర్వహించే అవసరమే రాకపోవచ్చు. ఐసిస్ కి కాశ్మీర్ లోకి ఆహ్వానం పలుకుతున్న పాక్ తో - ఐసిస్ భాయ్ భాయే కాబట్టి – మీరు పట్టుకున్న వాళ్ళల్లో మా అమ్మాయిలున్నార్రా బాబూ వదిలిపెట్టండంటే సరిపోతుంది. కానీ సినిమాలో ఉగ్రవాది ఒక పాక్ నర్సుని కాల్చేసినట్టు చూపించారు.
గూఢచార
సినిమా అనగానే దేశభక్తి ధారాళంగా ప్రవహించేలా చిత్రీకరిస్తారు ( దేశాన్ని రక్షించే
సైన్యం ఎక్కడో సైలెంట్ గా వుంటుంది - మిగతా అన్ని రంగాలూ వర్గాలూ దేశభక్తిని
పులుముకుని, ఫ్రీగా దేశభక్తిని అనుభవిస్తూ చిందులేస్తూంటాయి). హాలీవుడ్ సినిమాల్లో ఈ
జానరేతర దేశభక్తి ఎలిమెంట్ కన్పించదు. ఇండో- పాక్ టీములు వాళ్ళ వాళ్ళ జెండాలు
దాచుకుని తెచ్చుకోవడం, స్నేహపూర్వకంగా ఎవరి దేశభక్తిని వాళ్ళు ప్రదర్శించుకోవడం, చివరికి
ఇండియా మెంబరు చనిపోతూ పాక్ మెంబర్ కి తన జెండా ఇచ్చి మోయించడం...ఆఖరికి శుభం సీనులో నర్సులున్న బస్సుకి రెండు దేశాల
జెండాలూ రెపరెప లాడడం సిల్లీగానే వుంటుంది.
నర్సులు భుక్తి కోసం వెళ్ళారా, లేక దేశభక్తితో దేశం కోసం వెళ్ళారా?
దేశభక్తి కాకుండా, ఇలాంటప్పుడు వాస్తవంగా ఏం జరుగవచ్చో అది చూపిస్తే ఈ స్పై జానర్ మర్యాద నిలబడేది. ‘రా’ ఏజెంట్ నేతృత్వంలో ఐఎస్సై ఏజెంట్లు పనిచేయడం వింతే. నిజానికి వాళ్ళు కలవకుండా సపరేట్ ఆపరేషన్ నిర్వహించి, క్రెడిట్ తాము కొట్టెయ్యాలని ‘రా’ ఏజెంట్లకి అడ్డుతగులుతూండాలి. వాళ్ళ మీద హత్యాప్రయత్నాలు కూడా చెయ్యాలి. వాళ్ళ తీరు వల్ల నర్సుల ప్రాణాలకే ఎసరు రావాలి. హీరోకి అటు ఐఎస్సీతో బహిర్గతంగా ఫిజికల్ యాక్షనే కాకుండా, ఇటు ఐఎస్సై ఏజెంట్లతో అంతర్గతంగా ఎమోషనల్ యాక్షన్ కూడా వుండాల్సింది. అప్పుడే పాత్రకి ద్వంద్వాలేర్పడి పాత్రచిత్రణ కరెక్టుగా వుండి, మరింత ఎఫెక్టివ్ గా మారే అవకాశంవుండేది. ఇది లేకపోవడంతో ఫ్లాట్ గా, ఏకోన్ముఖంగా యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది హీరో పాత్ర. ఈ ద్వంద్వాలుంటే హీరో భార్యగా, ఐఎస్సై ఏజెంటుగా హీరోయిన్ పాత్ర కూడా మానసిక సంఘర్షణకి లోనై, ద్వంద్వాలు ఏర్పాటై ఎంతో రక్తికట్టించేది. చివరికి సమన్వయ కర్త తనే అయ్యేది - పైన చెప్పుకున్నట్టు ఒక థ్రెషోల్డ్ పాత్రగా. పాత్ర స్వభావాన్ని మొదట్లో చూపించి తర్వాత మర్చిపోతే ఎట్లా? ఒకే ఆపరేషన్ గురించి రెండు దేశాల ఏజెంట్లు ఘర్షణపడే ఎజెండా అవసరం ఈ కథకి. దీంట్లోకి దేశభక్తి కోణం రానవసరం లేదు. కథలో దాని పాత్ర సబ్ టెక్స్ట్ గా మాత్రమే, ఆ ఫీల్ ని ఆడియెన్సు చూసుకుంటారు.
నర్సు పాత్రల్లో అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగేలు ప్రధానంగా కన్పిస్తారు. ‘రా’ చీఫ్ గా గిరీష్ కర్నాడ్ ఆదేశాలిస్తూ వుండే పాత్ర. మేకింగ్ ఉన్నత ప్రమాణాలతో వుంది (నూట యాభై కోట్లు అంటున్నారు, యశ్ రాజ్ ఫిలిమ్స్ కి ఇదే తొలి ఖరీదైన ప్రొడక్షనట). పోలెండ్ ఛాయాగ్రాహకుడు మార్చిన్ లస్కావీస్ కెమెరా వర్క్ ఒక కళా ప్రయోగం. దీనికి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టామ్ స్టూథర్స్ సమకూర్చిన యాక్షన్ దృశ్యాలు స్టన్నింగ్ గా వున్నాయి. నిడివి రెండు గంటలా 40 నిమిషాలనేది ఎక్కువే.
చివరికేమిటి
హాస్యం
ఈ స్పై థ్రిల్లర్ని అపహాస్యం పాలుకాకుండా కాపాడింది. హాస్యం లేకుండా సీరియస్ మూడ్
లో చూడాలంటే భరించే కాలం కాదిది. ఈ రోజుల్లో – పెరిగిపోతున్న వివిధ దృశ్య
మాధ్యమాలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో - సినిమాలకి ఏదో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింటు (యూఎస్పీ) వుండాల్సిందే.
ఆ యూఎస్పీని ప్రధానంగా చేసుకుని సినిమాలు తీసి ప్రేక్షకుల్ని ఆకర్షించాల్సిందే. ఆ యూఎస్పీయే ఈ స్పై
థ్రిల్లర్ కి హాస్యమనే షుగర్ కోటింగ్. సినిమాలంటే
కేవలం క్రియేటివ్ యాస్పెక్ట్ తో తీసేది కాదు, మార్కెట్ యాస్పెక్ట్ నికూడా
కలుపుకోకపోతే తీసి దండగ. టాలీవుడ్ లో ఈ మార్కెట్ యాస్పెక్ట్ ఇంకా అలవడాల్సి వుంది.
వుంటే లో కేటగిరీలో కాలం చెల్లిన పద్ధతిలో వుండకుండా హిందీ, హాలీవుడ్ సినిమాలు
చూసి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా వుంది.
‘దంగల్’ లాంటి సీరియస్ కాన్సెప్ట్ ని హాస్యయుతమైన పాత్రలతో వినోదాత్మకం చేయపోతే వెంటనే ఫ్లాపయ్యేది. ఆ పాత్రలుకూడా ఎవరికీ గుర్తుండేవి కాదు. పాత్రలు కామెడీ చేయడం పాత పధ్ధతి, హాస్యంగా మాట్లాడ్డం ఇప్పటి పధ్ధతి. కథలు సీరియస్ గానే వుంటాయి, పాత్రలు ఛలోక్తుతో రియాక్ట్ అవుతూంటాయి. కష్టాల్ని, పనిని ఆటలాగా తీసుకోవడమే వీటి కార్యాచరణ. ఇలా ఇవి మనల్ని ఎలా జీవించాలో కూడా నేర్పుతాయి.
ప్రస్తుత స్పై థ్రిల్లర్ లో పాత్ర చావుతప్పి కన్ను లొట్టబోయి బయట పడి - యమ రాజ్ టచ్ కర్కే నికల్ గయా ( యముడు టచ్ చేసి వెళ్ళిపోయాడు) - అంటే అంత సీరియస్ సీనులో ప్రేక్షకులు ఘోల్లున నవ్వకుండా వుంటారా? ఎంట్రీ సీన్లో సల్మాన్ కొడుకుతో తోడేళ్ళతో తలపడే యాక్షన్ ఎపిసోడ్ ఎంత గుర్పాటు కల్గిస్తుందో, ఫన్నీ డైలాగులతో అంత రిలీఫ్ నిస్తూంటుంది – ఇంజెక్షన్ ఇస్తూ డాక్టర్ కబుర్లలో పెట్టినట్టు. ఈ ఎపిసోడ్ లో కొడుకు భయపడిపోయి కేకలు పెట్టేట్టుగా, సల్మాన్ వాణ్ణి కాపాడేట్టుగా – పిచ్చిగా ఫాదర్ సెంటి మెంటు, చైల్డ్ సెంటిమెంటు అంటూ వెలగబెట్టకుండా - చైల్డ్ ఎంపవర్ మెంట్ ని చూపించడం బావుంటుంది ఇద్దరి ఫన్నీ డైలాగ్స్ తో. తను తోడేళ్ళ గుంపుని ఎదుర్కొంటూనే, వాడికి తప్పించుకునే కళలు నేర్పుతూంటాడు. తప్పించుకుంటున్న వాడి వెంట తోడేళ్ళు పడ్డా కేకలు వేయడు. ఈ ఎపిసోడ్ లో సల్మాన్ ఒక్క తోడేలుని కూడా చంపకుండా, మీద పడేటప్పుడు పక్కకి తప్పుకోవడం, వాటిని పక్క దోవ పట్టించడం లాంటి ట్రిక్కులు ప్లే చేస్తాడు. హాస్యాన్ని యూఎస్పీ అస్త్రం చేసుకుని ప్రయోగించడమే దీని ఘన విజయానికి కారణం.
ఇక
స్పై జానర్ కథలో హీరో పాత్ర ప్రయాణం భిన్నంగా వుంటుంది. పరిష్కరించాల్సిన సమస్య అతడికి
వ్యక్తి గతంగా ఎదురుకాదు. ఎక్కడో ఏదో సమస్య ముందే ఏర్పాటయి వుంటుంది. ఎక్కడ ఎంజాయ్
చేస్తున్నాడో వెతికి పట్టుకొచ్చి అతణ్ణి ఆ
సమస్యలోకి తోస్తారు.
జేమ్స్ బాండ్ లాంటి స్పై జానర్ హీరో పాత్రకి సొంత బాధలుండవు. కవిలాగా
ప్రపంచ బాధే తన బాధ. ఆ ప్రపంచ బాధలు
తీర్చడమే తనకొచ్చిన బాధ. ఇదంతా స్పై జానర్ కొక టెంప్లెట్. ఈ టెంప్లెట్ లోనే ఈ
కథలుంటాయి. కాకపోతే స్పై సినిమాలు ఎప్పుడో గానీ రావు గనుక ప్రేక్షకులకి అదేపనిగా విసుగు పుట్టించవు,
బతికిపోతారు. ఇలాకాక, టాలీవుడ్ సినిమాలు
వారంవారం టెంప్లెట్ అనే ఒకే టెంపుల్ లో
గంట వాయించుకుంటూ బిలబిలమంటూ అలాగే వచ్చే స్తూంటే, విసుగు సూచీ వసూళ్ళ సూచీ కంటే బాగా పై
స్థాయిలోనే ఎగదన్ని వుంటోంది. మార్కెట్ యాస్పెక్ట్ అంటే మనకి అర్ధంగాని అరబ్బీ పదం
కదా. అందుకే ఎవరో ఆకతాయిలు తప్ప, ప్రేక్షకులు బతికివుండే అవకాశం బొత్తిగా లభించడం లేదు.
దర్శకుడు అలీఅబ్బాస్ జాఫర్, నీలేష్ మిశ్రాలు కలిసి ఈ కథ రాశారు. ఐదేళ్ళ క్రితం ‘ఏక్ థా టైగర్’ తర్వాత ఈ సీక్వెల్ తో నీలేష్ కిది రెండో అవకాశం. తీవ్రవాద / ఉగ్రవాద డెస్కు జర్నలిస్టుగా క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవముంది. దీనివల్ల కథ ఆపరేటింగ్ పార్టు ఆథెంటిగ్గా వచ్చింది. అబ్బాస్ సమకూర్చుకున్న స్క్రీన్ ప్లేలో జోసెప్ క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ కన్పిస్తుంది. అంటే పురాణ కథల కథాక్రమం కనపడుతుంది (పై పటం చూడండి). ఆన్ని మతాల పురాణాల్లోంచి జోసెప్ క్యాంప్ బెల్ కనుగొన్న మిథికల్ స్ట్రక్చర్, ‘స్టార్ వార్స్’ మొదలుకొని ఎన్నో హాలీవుడ్ సినిమాలకి ఒక గైడ్ లా వుంటోంది.
ఈ స్ట్రక్చర్ లో పై పటంలో కన్పించే దశలన్నీ ఈ స్పై థ్రిల్లర్ లో కన్పిస్తాయి. స్ట్రక్చర్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ స్క్రీన్ ప్లే ని ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే స్పై జానర్ కథల్లో ప్లాట్ పాయింట్ వన్ సమస్య తలెత్తినప్పుడు రాదు, ఆ సమస్య ని హీరో చేపట్టినప్పుడే వస్తుంది. ఐఎస్సీ నాయకుడి మీద అమెరికా వైమానిక దాడులు, అతను నర్సుల్ని బందీలుగా పట్టుకోవడం, ‘రా’ చీఫ్ కి సమాచారం తెలియడం, ఇలా ఇది బిగినింగ్ విభాగంలో ముందే ఏర్పాటయిన సమస్యే. కానీ ఇదే ప్లాట్ పాయింట్ వన్ మాత్రం కాదు . ఇప్పుడు హీరో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో చూపించి, ‘రా’ చీఫ్ వెళ్లి సమస్య చెప్పాక, నర్సుల్ని విడిపించడానికి హీరో అంగీకరించడమే ప్లాట్ పాయిట్ వన్ అవుతుంది. బిగినింగ్ విభాగానికి ఇదే ముగింపుగా వుంటుంది.
―సికిందర్
.