రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, అక్టోబర్ 2017, శుక్రవారం

535 :రివ్యూ !

రచన –దర్శకత్వం : కిషోర్ తిరుమల
తారాగణం :  రామ్, అనుపమ,  లావణ్యా త్రిపాఠీ, శ్రీవిష్ణు, ప్రియదర్శి తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
బ్యానర్ : స్రవంతి సినిమాటిక్స్, పిఆర్ సినిమాస్
నిర్మాత : కృష్ణ చైతన్య
విడుదల :  అక్టోబర్ 27, 2017

***
         ద్దరు బాల్యమిత్రులు. ఒకర్ని విడిచి ఒకరుండలేరు. ఇద్దరి మధ్య మిత్రత్వం కంటే ఇంకేదో ఎక్కువ. అభి ( రామ్) మ్యూజిక్ బ్యాండ్ నిర్వహిస్తూ వైజాగ్ లో వుంటాడు. వాసు (శ్రీ విష్ణు) ఏదో ప్రాజెక్టు పనిమీద ఢిల్లీ పోతాడు. అభి వైజాగ్ లో హౌస్ సర్జన్ మహా (అనుపమ) తో ప్రేమలో పడతాడు. ఆమెకూడా ప్రేమిస్తుంది. కానీ పైకి చెప్పుకోరు. ఆమెకి పాడాలని వుంటుంది. ఆమెకి పాట నేర్పి ప్రోగ్రాం ఇప్పిస్తాడు. ఇంతలో వాసు తిరిగి వచ్చి ఆమెని  ప్రేమిస్తున్నానంటాడు. అభి హర్ట్ అయి, ఫ్రెండ్ షిప్ కోసం ఓకే అంటాడు. వాసు మహాకి ప్రేమని వెల్లడిస్తాడు. అభి కూడా వెల్లడించి నిర్ణయం చెప్పమంటాడు. ఆమె వాసునే చేసుకుంటానంటుంది. వాసు ఆమెతో వుంటూ అభిని నిర్లక్ష్యం చేస్తాడు. అభి మళ్ళీ హర్ట్ అయి గొడవపడి దూరంగా వెళ్ళిపోతాడు.  ఎటూ పాలుపోక మహా యాక్సిడెంట్ చేసుకుని చనిపోతుంది. నాల్గేళ్ళ తర్వాత అభి తిరిగి వస్తాడు. ఇంత జరిగినా అభి తెలుసుకుని రానందుకు వాసు దూరంగా వుంటాడు. ఇద్దరి మధ్య మాగీ (లావణ్య) అనే కొత్తమ్మాయి వస్తుంది. ఈమెని ఎవరు పొందారు, స్నేహితులిద్దరూ తిరిగి ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.

ఎలావుంది కథ

          కథ కాదు గాథ. పాసివ్ పాత్రల బాధామయ గాథ. గాథలు తీసుకుని పోసుకోలు 
కబుర్లు చెప్పుకోవడమే సరిపోతోంది, అవెంత ఫ్లాపుతున్నా సరే. మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్, మాస్ అప్పీల్, మొత్తంగా బాక్సాఫీసు అప్పీల్, ట్రెండ్ గ్రిండ్  కుచ్ భీ జాంతానై. జిందగీ జాయే పర్  పురానా ‘చాదస్తం’  న జాయే! ఈ గాథకి కూడా కాలీన స్పృహ లేదు. ఇద్దరు అబ్బాయిల మధ్య స్నేహాన్ని జాగ్రత్తపడి తెర కేక్కించక పోతే నవ్వులపాలవుతారు. స్నేహంలో వున్న ఇద్దరు అబ్బాయిలు ఒకరంటే ఒకరు పడిచచ్చి పోవడం, ఒకరు లేకపోతే  ఇంకొకరు బతకలేమనుకోవడం, లవర్స్ కి మించిన లవ్ ప్రకటించుకోవడం బాపతు సినిమాలు ఒకప్పుడు వచ్చేవి. అప్పట్లో ఇంకో అర్ధం అందులో కనపడక పోయేది. కనీసం 2005 తర్వాత నుంచీ ఇలా వస్తున్న హిందీ సినిమాలకి ప్రేక్షకులు ఇక  గోలెట్టడం మొదలెట్టారు. ఇద్దరు హీరోల మధ్య ఆ అతి స్నేహం ‘గే’ సంబంధం లాగే కనబడుతూ ఛీ పొమ్మన్నారు. దీంతో ఇదంతా ఎందుకని కరణ్ జోహార్ డైరెక్టుగానే ‘దోస్తానా’ అనే ‘గే’ సినిమా ఒకటి తీసిపారేసి  అంకితమిచ్చేశాడు. 

          ఒకప్పుడు అబ్బాయిలు చేయి చేయి పట్టుకుని తిరిగేవాళ్ళు. ఇప్పుడలా తిరిగే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఓపెన్ గా  ‘గే’ కల్చర్ ఈజ్  ఏ గేమ్ ఛేంజర్ అయిపోయింది. ఈ వాస్తవాన్ని, ప్రతికూలతని తెలుసుకోలేదు ఈ గాథ. ఇందులో ఇద్దరు హీరోలు వాళ్ళ  ‘అతి స్నేహం’  కొద్దీ హీరోయిన్ని బలిగొన్నారు. ఆమెతో ప్రేమకన్నా తమ ప్రేమానుబంధాలే ముఖ్యమైపోయి, ఆమె జీవితాన్నెలా ముగించారో కూడా తెలుసుకోరు! ఒకర్ని విడిచి ఒకరుండలేని మగ ఫ్రెండ్స్ కి ఆడ గాలెందుకనేది ప్రశ్న!

ఎవరెలా చేశారు
       గడ్డం పెంచి రామ్ నేటివ్ డీ కాప్రియోలా వుంటాడు. పాత్రకి హుషారు తక్కువ, హూందాతనం ఎక్కువ. గాథ ప్రకారం వుండాల్సిన పాసివ్ పాత్ర. ఫ్రెండ్ షిప్ మీద కొటేషన్స్ లో స్పెషలిస్టు. ఫ్లాష్  బ్యాక్ ప్రేమ - స్నేహాల గాథలో వొత్తుగా గడ్డంతో వుంటూ, ఇవి రెండూ విషాదమవగానే ఫ్రెష్ గా షేవ్ చేసుకుని రివర్స్ లో కన్పిస్తాడు (ఇది గమనించారో లేదో మేకర్లు). తెచ్చిపెట్టుకున్న హూందాతనం వల్ల ఎంటర్ టైన్ చేయడం కష్టమై పోయింది. కొన్ని డైలాగులు మాత్రమే విసిరి అభిమానుల్ని అలరిస్తాడు. అదేమిటోగానీ, పాప్ సింగర్ గానూ పాటల్లో స్పీడు కన్పించదు. అభిమానులాశించే స్టెప్పు లేయడు. ఈ పాటలు కూడా పూర్తిగా వుండవు. కనీసం హీరోయిన్ కి పాట నేర్పే ముఖ్యమైన మలుపుకి సంబంధించిన పాట ఈవెంట్ కూడా అర్ధోక్తిలో ఆగిపోతుంది. గాథ నిడివి ఎక్కువైపోవడం వల్ల,  పాటల్ని ట్రిమ్మింగ్ చేసినట్టుంది. కమర్షియల్ హీరో పాటలకి రేషన్ పెడితే ఫ్యాన్స్ పరేషాన్ ఐపోతారు.

          నటన విషయానికొస్తే రామ్  బాగా నటిస్తాడు, సందేహం లేదు. కాకపోతే నటిస్తున్న పాత్ర కన్విన్సింగ్ గా వుండాలి. గాథ లోంచి అంత కన్విన్సింగ్ గానూ భావోద్వేగాలు పుట్టాలి. ఇంటర్వెల్ కి ముందు పది నిముషాలు, శుభం కి ముందు మరో పది నిముషాలూ  తప్ప మిగిలినవన్నీ కాలయాపన కోసమన్నట్టు పేర్చిన అర్ధంలేని సీన్లే వుంటే ఏం గాథ నడిపిస్తాడు, నడిపించకపోతే ఏం నటిస్తాడు, ఏం ఆకట్టుకుంటాడు. 

          రెండో హీరో శ్రీవిష్ణు అయితే మరీ సీరియస్ గా వుంటాడు. ఇంత జీవితాన్ని చదివేసినట్టు పాత్రలుంటే ఇంకేం వుంటుంది చెప్పడానికి. పాత్రలంటే జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నంలో సర్కస్ ఫీట్లు చేసే జోకర్లు కావా? ‘దంగల్’ లో, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ లో సమస్యలతోవుంటూనే పాత్రలు ఎంత ఫన్నీగా వుంటాయి. ఇప్పుడొస్తున్న హిందీ సినిమాలనుంచి ఏమీ నేర్చుకోనవసరం లేదా? తెలుగు ప్రేక్షకులు గంభీర ముద్రతో అలాగే ఆసనమేసుకుని సినిమాలు చూసే ప్రత్యేక జీన్సు తో పుట్టారా? 


          ఫస్టాఫ్ హీరోయిన్ అనుపమ ఒక్కతే బాగా మనసుల్లో నాటుకుంటుంది. కారణం,  ఈమె నటించడానికో పాత్ర వుంది, ఈమెకో గాథ వుంది, చివరికో సమస్య వుంది, సంఘర్షణా వుంది. ఈమెని సంఘర్షణలో పడేసి తప్పుకుంటారు హీరోలు. ఆశోపహతురాలైన ఈమె డైరీ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటుంది - మీ మగ ఫ్రెండ్ షిప్పు తగిలెయ్యా అన్నట్టు. 


          సెకండాఫ్ హీరోయిన్ లావణ్య కి సరైన పాత్ర లేదు. హీరో లిద్దరి నిర్వాకంవల్ల ఫస్ట్ హీరోయిన్ కేం జరిగిందో తెలిసి కూడా వాళ్ళ వెంటే వుండే బ్రెయిన్ లెస్ పాప. మనమెన్నో సార్లు చెప్పుకున్నట్టు కథనంలో లాజిక్ లేకపోయినా ఫర్వాలేదు, మానవ సంబంధాల్లో లాజిక్ ని చూపించకపోతే వీక్షకుల తలకెక్కవు కథలు. వీక్షకులందరికీ నిత్యం అనుభవమయ్యేది మానవ సంబంధాలే. 


          దేవీశ్రీ ప్రసాద్ పాటలు, సమీర్ రెడ్డి కెమెరా హైలైట్. దర్శకత్వం మాత్రం పాత స్కూలుకి చెందింది. ఇప్పటి ప్రేక్షకులకి భారమే. నడక చాలా స్లో. 


చివరికేమిటి 
     గాథ కాబట్టి, పాత్రలే తప్ప ప్రధాన పాత్ర వుండదు కాబట్టి,  స్ట్రక్చర్ ని ఆశించకూడదు. దాదాపు ప్రతీ రెండో తెలుగు సినిమా ఇంకా చాదస్తంగానే చిన్నప్పట్నుంచీ కథనెత్తుకుని అచ్చిబుచ్చి కబుర్లతో స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాయి. ఇప్పటి ట్రెండ్ కి ఈ చిన్నప్పటి కథలు ఎవరికి ఆసక్తికరం. తీరుబడిగా కూర్చుని సినిమాలు చూసే రోజులా? నేరుగా హీరోలనే చూపించేసి, వాళ్ళెంత ‘గాఢమైన’ స్నేహితులో రెండు ముక్కల్లో చెప్పేస్తే అయిపోతుంది. ఇక్కడ చూపించిన చిన్నప్పటి సీన్లు మరీ సిల్లీగా వున్నాయి. ఇదంతా స్క్రీన్ టైంని వృధా చేయడమే. ఆ మాట కొస్తే హీరోలు పెద్దయ్యాక కూడా అరగంట వరకూ పాయింటే వుండదు గాథ నడిచేందుకు. హీరోయిన్ వచ్చాక వుంటుందనుకుంటే, ఆమెతో కూడా ఒకదానితో ఒకటి సంబంధంలేని అతుకుల బొంత సీన్లు. కేవలం ఇంటర్వెల్ దగ్గర కాస్త గాథ పెట్టుకుని ముగించేసే తేలిక పనితో ఈ సీన్ల పేర్పుడు కార్యక్రమం పెట్టుకున్నట్టుంది. తెలుగు సినిమా తీయడం ఇంత ఈజీ అయిపోయిందా – చిన్న పిల్లాడు కూడా తీసేయగలడు కదూ?

          ఇక ఇంటర్వెల్ ముందు పది నిమిషాల్లో నాల్గు మలుపు లొస్తాయి. మలుపువచ్చినప్పుడల్లా ఇదే ఇంటర్వెల్ అనుకుంటాం. గంటన్నర గడుస్తున్నా ఇంటర్వెల్లే రాదు. డిటో సెకండాఫ్ ముగింపు వరకూ. మళ్ళీ ముగింపులో, సడెన్ గావచ్చే  ముగింపుకి పనికొచ్చే నాల్గు సీన్లు  తప్ప,  మిగతావి సహనపరీక్ష పెట్టే  అతుకుల బొంత సీన్లే. అసలేం ‘మ్యాటర్’ చూస్తున్నామో అర్ధం గానట్టు వుంటాయి. 


          కొన్ని సిట్టింగ్స్ లో,  ప్రేమిస్తోందో లేదో తెలీని హీరోయిన్ కి హీరో తన ప్రేమ ఎలా వెల్లడించాలన్న దాని మీద హోరాహోరీ పోరాటాలు జరుగుతున్నాయి. నిజంగానే అది చాలా కష్టమైన పని పాత్రల్ని సరైన తీరులో దృష్టిలో పెట్టుకుంటే. కానీ ఈ గాథలో ఒకరు కాదు ఇద్దరు హీరోలు వచ్చేసి,  హీరోయిన్ కి తమ ప్రేమల్ని చెప్పేస్తారు కాఫీ ఇప్పించినంత ఈజీగా –ఆమె మనసేమిటో తెలుసుకోకుండానే!


          హీరోయిన్ని ప్రేమించానన్న సెకండ్ హీరోని,  ఫస్ట్ హీరో ఆమె దగ్గరికి తీసికెళ్ళి చెప్పించేస్తాడు. ఆమె ఇంకా తేరుకోక ముందే, తనుకూడా ప్రేమిస్తున్నట్టు చెప్పేస్తాడు! ఫ్రెండ్స్ గా మేమింత పారదర్శకంగా వున్నాం, నువ్వే మాలో ఒకర్ని ఎంచుకో అనేస్తాడు. ఈ మాటలు ఆమె మీద ఎలా పనిచేసి ఏం జరుగుతుందో నన్న ఆలోచన లేకుండా. ఏమంటే, అన్ని ట్రయాంగిల్స్  లో ప్రేమించిన ఒక పాత్ర బాధ దిగమింగుకుని తప్పుకుంటుంది, ఇక్కడ రెండు పాత్రలూ ఓపెన్ గా చెప్పేయడం ప్రత్యేకత అని చెప్పుకున్నారు. ఇదేదో కొత్తగానే అన్పిస్తుంది.  హీరోయిన్ కూడా ‘కాదలి’ హీరోయిన్ లా ఎవరికి  ఎస్ చెప్పాలో తేల్చుకోవడానికి సెకండాఫ్ అంతా నమిలేసి, తినేసి పారేసినట్టుగాక, వెంటనే సెకండ్ హీరోని ఓకే చేసేస్తుంది. అప్పుడు ఫస్ట్ హీరో ఏం చేయాలి? మర్యాదగా వాళ్ళ మధ్యనుంచి తప్పుకోవాలి. తప్పుకోకుండా, ఆమెని కలవడానికి జిగ్రీ దోస్తు వెళ్ళినా, ఏం చేసినా దోస్తానా మర్చిపోతున్నావా – నాకంటే ఆమె ఎక్కువయ్యిందా,  నువ్వు నాతోనే వుండాలి -   అని తగాదాలు పెట్టుకుంటే ఏమనుకోవాలి
. రేపు పెళ్ళాం పక్కలో పడుకోకుండా తన పక్కన పడుకోవాలా, లేక వాళ్ళిద్దరి మధ్య దూరి తను పడుకుంటాడా? ఇతడి తగాదాలు చూస్తే, నిజంగా ఫ్రెండ్ షిప్ అనిపిస్తుందా, జెలసీ అన్పిస్తుందా?  ఇలా పాయింటు రెండుగా చీలిపోవడం ట్రయాంగిల్లో ప్రత్యేకతా?

          ఉద్దేశించిన ప్రత్యేకమైన ట్రయాంగిల్ నే ఎలా ముగించవచ్చో అది కూడా చూపించకుండా,  హీరోయిన్ పాత్రని చంపేసి ఈజీ సొల్యూషన్ వెతుక్కోడడం ప్రయోగమా? సెకండాఫ్ లో రెండో హీరోయిన్ తో మళ్ళీ ఇంకో ప్రేమగాథ మొదట్నించీ ఎత్తుకోవడమా? ఒక సినిమాలో ఫస్టాఫ్ లో ఒక బిగినింగ్, సెకండాఫ్ లో మళ్ళీ ఇంకో బిగినింగా? 


          ఒకటే సమస్య- నువ్వు లేక నేను బతకలేననే హీరోల ‘గే’  టైపు స్నేహానికి -హీరోయిన్ ని తెచ్చి కలపడం. ఈ రెండు  వేర్వేరు ప్రేమలు ఒక వొరలో గాథగా నైనా ఇమడవు. వీటిలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ రాణించడు.



-సికిందర్ 
www.cinemabazaar.in