రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 14, 2017

514 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ - 17




       
     మొన్న మంగళవారం ఒక  30 నిమిషాల షార్ట్ ఫిలిం ప్రేమకథ స్క్రిప్టు టేబుల్ పైకొచ్చింది. అందులో హీరోయిన్ కి తెలిసిన విషయాలు  హీరోకి తెలీకపోవడం, ప్రేక్షకులకి కూడా తెలీకపోవడంగా వుంది.  హీరోకీ, ప్రేక్షకులకీ ఇంకో పాత్ర చెప్పడం ద్వారా పూర్తి పాఠం చివర్లో తెలుస్తుంది. ఈ పూర్తి పాఠం  హీరోకీ, ప్రేక్షకులకీ చివర్లో అర్ధమవడానికి మళ్ళీ మొదటి నుంచీ కథనంలో ఎప్పుడెప్పుడు  ఫలానా ఫలానా విషయాలు ఎలా ఎందుకు జరిగాయో కార్యకారణ సంబంధాలు చెప్పుకొచ్చే తతంగంవుంది. ఇలా పాత్రతో బాటు ప్రేక్షకులకి కూడా విషయాలు దాచి చివర్లో సస్పెన్స్ లాగా  విప్పితే అది ‘ఎండ్ సస్పెన్స్’  కథనమవుతుంది. పూర్తిగా వ్రతం చెడుతుంది.  ఈ టెక్నిక్ దృశ్యమాధ్యమం కోసం కాదు.  అచ్చులో కథగా చదువుకోవడం కోసం,  తెర  మీదికి అచ్చోసి వదిలే  కథకి కాదు.  ‘ఆ ఒక్కడు’, ‘జాదూగాడు’, ‘భద్రం’, ‘బెంగాల్ టైగర్’ లాంటి సినిమాలెన్నో ఇందుకే జనాలకి నచ్చలేదు. ‘కిక్ -2’ లోలాగా కథలో చిన్న చిన్న ఎపిసోడ్లకి ఎండ్ సస్పెన్స్ వుంటే అది వర్కౌట్ అవుతుంది. ప్రధాన కథకి కాదు. ఎందుకని?

         
అంతవరకూ పాత్రతో బాటు ప్రేక్షకులని సస్పెన్సులో  పెడితే  మొట్ట మొదట జరిగేది కథేమిటో అర్ధంగాక పోవడం చివరిదాకా.  దాంతో కథలో పాలుపంచుకోలేం. ఒక పాత్ర కథంతా తన గుప్పెట్లో దాచుకుని ప్రవర్తిస్తే, అది చివర్లో చెప్పుకు రావడం ప్రారంభిస్తే, పెద్ద సహనపరీక్ష అయిపోతుంది ప్రేక్షకులకి (ఎండ్ సస్పెన్స్ తో కూడా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే చేతి కొస్తుందన్న మాట).  చల్లకొచ్చి ముంత దాచకూడదు, దృశ్య మాధ్యమాని కొచ్చి కథ దాచకూడదు. చెప్పాలనుకుంటున్న కథ ఓపెన్ గా చెప్పేస్తూ, పాత్రలకి తెలియకుండా సస్పన్స్ పోషించవచ్చు. అప్పుడది  ప్రేక్షకులకి ఆసక్తి కల్గించే సీన్ -  టు - సీన్ సస్పెన్స్ కథనమవుతుంది. దృశ్యమాధ్యమానికి సీన్  - టు -  సీన్ సస్పెన్సే కావాలే తప్ప, ఎండ్ సస్పెన్స్ కాదు.

          ఇలా పై ప్రేమకథ విషయంలో కూడా హీరోయిన్ సంగతులన్నీ ప్రేక్షకులకి తెలిసిపోతూ వుండి, హీరోకి తెలియకుండా వుంటే  సీన్ - టు - సీన్ సస్పెన్స్ తో ప్రేక్షకులు కథలో పాలు పంచుకునే అవకాశముంటుంది. చివర్లో కార్యకారణసంబంధాల (కాజ్ అండ్ ఎఫెక్ట్)  చిట్టా విప్పి తలబొప్పి కట్టించే అవస్థ తప్పుతుంది.


       మంచి ప్రేమకథల  ముగింపులు హృదయాల్ని తాకేట్టు వుంటాయి. ఆ సమయంలో మెదడుకి పని పెడుతూ కూర్చుంటే బావుండదు.  మెదడుకి పని పెట్టే  సంగతులన్నీ ఆ లోగానే ముగిసిపోవాలి. హృదయాలకి తాకాల్సిన ముగింపు ఘట్టాల్లో మెదడుకి పనిపెట్టే పాత సంగతుల సస్పెన్సు తవ్వకాలు మొదలెడితే రసభంగ మవుతుంది. ఒక కథలో ఉప కథలుంటే ఉపకథల్ని ముందు ముగించేసి చివర్లో కథని ముగిస్తారు. అంతేగానీ కథ ముగించాక  ఉపకథలు ముగిస్తూ కూర్చోరు. అలాగే ప్రేమకథల్లో మెదడు ప్రశ్నావళి ఏదైనా వుంటే ముందు దాన్ని అవగొట్టి, హృదయ సంబంధ గులేబకావళుల కోసం ముచ్చటగా ముగింపుని కేటాయించుకోవాలి. 


           ‘బ్లడ్ సింపుల్’  దృశ్యాల్లో   ఈ ఎండ్ సస్పెన్స్, సీన్ - టు - సీన్ సస్పెన్స్ ల తేడాల్ని చక్కగా అర్ధం జేసుకోవచ్చు. దృశ్యాల్లో  లో కథని ఎక్కడా మన నుంచి దాచలేదు. పాత్రల  మధ్యే దాచారు. మార్టీ ని విస్సర్ సగం చంపాడని మనకి తెలుసు. ఈ సగం ఎబ్బీ చంపిందనుకుని పూర్తిగా చంపేశాడు రే. దీంతో ఫైనల్ గా తను హంతకుడయ్యాడు. ఇది మనకీ తెలుసు,  అతడికీ తెలుసు. మనకి తెలిసి అతడికి తెలీనిదేమిటంటే,  సగం చంపింది ఎబ్బీ కాదనీ, విస్సర్ అనీ. ఇక్కడే ఆట రక్తి కట్టింది. ఇక బంతి అంతా రే కోర్టులోనే వుంది. ఇతనెప్పుడు ఈ నిజం తెలుసుకుంటాడనేది, అప్పుడేం  చేస్తాడనేది సీన్ -  టు - సీన్ సస్పెన్స్ గా వుంది. 

          దీన్నే ఎండ్ సస్పెన్స్ కథనంతో చూపిస్తే - మార్టీని విస్సర్ షూట్ చేసినట్టు మనకి చూపించకుండా, రే అనుమానించినట్టు ఎబ్బీ మీద మనకూ అనుమానం కల్గించి, కథ నడిపిస్తే, కథాక్రమంలో ఎప్పుడో రేతో బాటు మనం కూడా, మార్టీ ని షూట్ చేసింది ఎబ్బీ కాదని, విస్సర్ అనీ తెలుసుకుంటాం. అప్పుడేం జరుగుతుంది? రే విస్సర్ ని పట్టేసుకుంటాడు ఆధారాలతో. అప్పుడు విధిలేక విస్సర్ తన నేరం చెప్పేయడం మొదలెడతాడు. అది ఈ కింది విధంగా వుంటుంది :

          “ ఔను చేశానబ్బా నేనే చేశాను, మిమ్మల్ని కనిపెట్టమని మార్టీ నాకు చెప్పాడు (విజువల్స్!), మీరిద్దరూ కలిసి వున్న ఫోటో తీశాను (విజువల్స్!!), ఇక మిమ్మల్ని చంపెయ్యమని మార్టీ నాకు కాంట్రాక్టు ఇచ్చాడు(విజువల్స్!!!), నేను మిమ్మల్నిచంపకుండా మార్టీనే షూట్ చేశాను (విజువల్స్!!!!), తర్వాత తెలిసింది మార్టీ నాకు ఫోటోఇవ్వలేదని (విజువల్స్ !!!!) , పైగా నా లైటర్ మిస్సయిందని తెలిసింది(విజువల్స్ !!!!!), లైటర్ కోసం, ఫోటో కోసం వప్రయత్నించాను (విజువల్స్!!!!!!), లైటర్ దొరకలేదు, ఫోటో కోసం బార్ కెళ్ళి  సేఫ్ తెరవడానికి ప్రయత్నించాను (విజువల్స్ !!!!!!!), అప్పుడు ఎబ్బీ వచ్చేస్తే దాక్కున్నాను (విజువల్స్ !!!!!!!!),  మార్టీ చనిపోయాడని ఆమెకి అర్ధమై పోయింది (విజువల్స్ !!!!!!!!!) ఎబ్బీ తర్వాత నువ్వొచ్చి సేఫ్ తెరచి ఫోటో చూశావ్ (విజువల్స్ !!!!!!!!!!), విజువల్స్ విజువల్స్ విజువల్స్ మోర్ విజువల్స్, రొంబ మోర్ విజువల్స్  !!!!!!!!!!!!!!!! ఇదీ జరిగింది...”

          ఇలా చివరి వరకూ కథని తన చేతిలో వుంచుకుని, ఇప్పుడు ఎడాపెడా విజువల్స్ వేసుకుంటూ పాఠం చెప్పుకొస్తూంటాడు- బోర్డు మీటింగులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా. ఇదేమైనా ఆసక్తి కల్గిస్తుందా?   అతను చెప్పేదంతా, ఆ విజువల్సూ, వాటికి ఒకదాంతో మరోకదాని కుండే సంబంధాన్నీ  అర్ధంజేసుకుంటూ ఫాలో అవడమే కష్టమైపోతుంది. ఇందులో థ్రిల్ వుంటుంద
నుకుంటే ఎక్కడ వుంటుంది? ఈ చెప్పేదంతా అయిపోయిన కథకి వివరణ, పునశ్చరణ, ఘనీభవించిన సస్పెన్స్. చలనంలో వున్న సస్పెన్స్ కాదు. ఇదీ తేడా. 

          ఒక సస్పెన్స్ తో కూడిన పరిస్థితికి రెండు పార్శ్వాలుంటాయి. ఎవరు? ఎందుకు?  - అన్న ప్రశ్నలతో. వీటిలో ఒకదాన్ని లేదా రెండూ ఓపెన్ చేసేసి కథ నడిపితే సీన్ - టు - సీన్ సస్పెన్స్ ఏర్పడుతుంది. రెండూ మూసి పెట్టి నడిపిస్తే ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఏర్పడిన ఒక పరిస్థితికి కారకులెవరో దాచిపెట్టి, ఆ పరిస్థితి ఎందుకేర్పడిందో కూడా దాచి పెట్టి,  చివర్లోనే  ఈ రెండూ చెబితే అంతసేపూ కథ  నడపడానికి పాయింటు ఏదీ వుండదు.  

          పరిస్థితికి కారకులెవరనే ప్రశ్నకి జవాబుగా పాత్రని చూపించేస్తే, ఎందుకీ పరిస్థితిని ఆ పాత్ర సృష్టించిందన్న రెండో ప్రశ్నని పట్టుకుని దాని జవాబుకోసం కథనంచేస్తే, సీన్ - టు - సీన్ సస్పెన్స్ ఏర్పడుతుంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? రెండు ప్రశ్నలకీ జవాబులిచ్చేసి కథనం ప్రారంభిస్తే, ఇక ఆ పాత్ర ఎలా  పట్టుబడుతుందన్న సీన్ - టు - సీన్ సస్పెన్స్ తో కథనం సాగుతుంది. మార్టీ ని షూట్ చేసింది విస్సర్ అని మనకి చూపించేసి, ఎందుకలా చేశాడో కూడా అతడి సీక్రెట్ ఎజెండా కూడా మనకి చెప్పేశారు. ఇక ఎలా దొరుకుతాడన్న ప్రశ్నతో సీన్ - టు - సీన్ కథనం సాగడానికి బాట పడింది. కథఎప్పుడూ ఓపెన్ గా ఉంటూ, సస్పెన్స్ లైవ్ గా వుండాలి.
***

31. సేఫ్ లో డబ్బంతా రే దోచుకెళ్లాడని మార్టీ అన్నాడని, రేని మారిస్ దూషించడం 
      ఇలా రాశారు :  రే చేతి వేలు ఫ్రేములోకి వస్తుంది. కారు వెనుక సీటుని వొత్తి చూస్తూంటాడు. వేలికి రక్తం అంటుకుంటుంది,  సీటులో ఇంకిన రక్తం. 
       రే క్లోజ్ షాట్. సీటు వైపే అలా చూసి, ఇంటి వైపు నడుస్తాడు. తీసి వున్న స్వింగ్ డోర్లోంచి లోపలికొస్తాడు. వస్తూంటే డోర్ చటుక్కున మూసుకుంటుంది. ముందుకి నడుస్తూంతే మారీస్ కారు రావడం కిటికీ లోంచి కన్పిస్తుంది. చటుక్కున టేబుల్ మీదున్న వస్త్రాన్ని లాగుతాడు. 

            రే మీద ట్రాకింగ్ షాట్. ఇంట్లోంచి బయటికొస్తూంటే స్వింగ్ డోర్ చటుక్కున మళ్ళీ మూసుకుంటుంది. వేగంగా కారు కేసి నడుస్తాడు.

          ట్రాకింగ్ షాట్. రే పాయింటాఫ్ వ్యూ. మారీస్ వచ్చేస్తూంటాడు. కారులోకి వంగి సీటు మీద వస్త్రాన్ని కప్పేస్తూంటాడు రే. మారీస్ వచ్చేసి, వూరొదిలేస్తున్నావనుకుంటాను? – అంటాడు.
ఏమైనా ప్రాబ్లమా? - అంటాడు రే.

          మారీస్ ఆరోపణలు చేస్తాడు. తన ఆన్సరింగ్ మెషిన్లో మార్టీ మెసేజి వుందనీ, తను టూర్ వెళ్ళినప్పుడు మార్టీ బార్ లో జొరబడి సేఫ్ లో డబ్బంతా కొట్టేసినట్టున్నాడని, వాణ్ణి పట్టుకుని ఆ డబ్బు లాక్కురమ్మన్నాడనీ అంటాడు మారీస్.

         
రే తేరుకునే లోపు డబ్బు రిటర్న్ చేయమని చెప్పేసి వెళ్ళిపోతాడు మారీస్. ఫ్రేములోంచి తప్పుకుంటాడు రే. ఇంటి వైపు వెళ్తాడు. కెమెరా స్లోగా కారు బ్యాక్ విండో కేసి ట్రాక్ అవుతుంది. సీటు మీద కప్పిన వస్త్రం ఉబికి వస్తున్న రక్తంతో ఎర్రబారుతూంటుంది.




               ఇదీ సీను. సీను ఉద్దేశమేమిటి? హత్య చేసిన రేకి ఇక నిజాలు తెలుసుకునే ట్రాక్ ఏర్పాటు చేయడం. ఆ నిజలెలా తెలియాలి? విస్సర్ చేసిన  పొరపాట్లతో కూడిన ట్రాక్ తోనా, లేక సమాధి లోంచి ఇంకా వెంటాడే మార్టీ ప్రతీకారపు ట్రాక్ తోనా? మొదటిదైతే డైరెక్టుగా వుంటుంది. డైరెక్టు కథనాలు రుచించవు. ఇండైరెక్టుగా కథనాన్ని నడిపితేనే ఫ్లాట్ ఫీలింగ్ వుండదు. అందుకని మార్టీ ప్రతీకారపు ట్రాక్ ని ప్రారంభించారు.

            సమాధిలోంచి మార్టీ ప్రతీకారం తీర్చుకుంటాడా, అదెలా? చాలా ఇంటరెస్టింగ్ క్వశ్చన్. ఇది ముందుముందు చూద్దాం. మార్టీ ప్రతీకారం తీర్చుకునే ట్రాక్ లోంచే రే నిజాలు తెలుసుకోవడం రిలేటెడ్ గా వుంటుంది, కథలో మార్టీని ‘సజీవంగా’ వుంచి థ్రిల్ పెంచినట్టూ వుంటుంది. పాత్ర ఒక నేరం చేశాక ఆ నేరం వెంటాడే ట్రాకే వుండాలి తప్ప మరొకటి కాదు. సోల్ పోతుంది. నిజాలు తెలుసుకోవడానికి  విస్సర్ పొరపాట్లతో కూడిన ట్రాక్ లోకి  రే ని పంపిస్తే కథంతా చల్లారిపోయి కూర్చుంటుంది. ఇంకేముంది,  విస్సర్ దొరికిపోవడమే కథ అని పెదవి విరుస్తారు ప్రేక్షకులు. విస్సర్ దొరకడమే కథకి అవసరం. దానికి  డైరెక్టు కథనం చేస్తే ప్రేక్షకులకి తెలిసిపోతుంది. దొడ్డి దారిన కథ నడిపిస్తే డిఫరెంట్ గా ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇందుకే- మార్టీ ప్రతీకార ట్రాక్ అనే డిఫరెంట్ కథా పథకం.

       ఇలా ఈ సీను సీటులో రక్తంతో ప్రారంభమై, మారీస్ వచ్చి చేసే సీరియస్ ఆరోపణతో ముగిసింది. రెండూ మార్టీ కి  సంబంధించిన విషయాలే. రక్తం, డబ్బు. నిన్ను వొదిలి పెట్టనని రక్తం అంటోంది, నీ కథ  ముగించడానికి పదా - అని డబ్బు అంటోంది.  రెండూ వూహించని పరిణామాలే.  మార్టీ కథ పూడ్చిపెట్టాక ఖతం, ఇక ప్రాబ్లం లేదనుకుంటే సీట్లోంచి రక్తం ఉబికి రావడం!  ఎబ్బీతో కట్ చేసుకుని వూరొదిలి  వెళ్లి పోదామని తయారవుతూంటే, అనూహ్యంగా మార్టీ ఫోన్ మెసేజ్ బయట పడి- ఎక్కడికి పోతావ్,  ఇక్కడే వుంటావ్ – అంటోంది.

            రే డబ్బు కాజేశాడన్న ఈ ఆరోపణేమిటి?  ఇది అబద్ధపు ఆరోపణ. కసికొద్దీ చేసి వుంటాడు మార్టీ. ఫస్టాఫ్ లో తను ఎబ్బీ మీది కెళ్ళి ఎటాక్ చేసినప్పుడు అక్కడ,  ఎబ్బీతో వున్న  రే ని చూసిన మంట చల్లారక, ఇలా తీర్చుకుని వుంటాడు. అయితే ఈ ఫోన్ మెసేజ్ ఇప్పుడు బయటపడి మార్టీ ప్రతీకారానికి లీడ్ చేయడం జస్ట్ రే ఫేట్!

            రే ఫేట్ ఇంకెలా వుందంటే, ఈ సీనులో డోర్ కూడా పాత్ర పోషించి కథ చెప్పింది.
అతను వస్త్రం కోసం ఇంట్లో కొచ్చినప్పుడు, వెనుక డోర్ చటుక్కున  మూసుకుంటుంది. అప్పుడే కారులో మారీస్ వస్తాడు. అంటే రే బుక్కై పోవడమన్న మాట. అలాగే వస్త్రంతో రే బయటి కెళ్ళినప్పుడు మళ్ళీ డోర్ చటుక్కున మూసుకుంటుంది. ఈసారి దీనర్ధం, ఇక ఈ ఇంటితో -  జీవితంతో నీకు ఋణం తీరిపోబోతోందని.  ఈ అర్ధాలు కన్వే చేయడానికే డోర్ మూవ్ మెంట్స్ ని స్క్రిప్టులో పొందుపర్చారు...

(సశేషం)
-సికిందర్