రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, ఆగస్టు 2017, ఆదివారం

496 : రివ్యూ!

రచన – దర్శకత్వం : బోయపాటి శ్రీను
తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శరత్ కుమార్, సుమన్, జయప్రకాశ్, ఆకాష్ ఖురానా, తదితరులు
మాటలు : రత్నం, సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : రుషి పంజాబీ
బ్యానర్ :  ద్వారకా క్రియేషన్స్
నిర్మాత :  మిర్యాల రవీందర్ రెడ్డి
విడుదల : ఆగస్టు 11, 2017

***
          మొదటి సినిమా ‘అల్లుడు శీను’ కి ఫిలిం ఫేర్ ఉత్తమ నూతన నటుడి అవార్డు తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, తర్వాత ‘స్పీడున్నోడు’ నటించి దూసుకెళ్ళ లేకపోయాడు. ఇప్పుడు ఎలాగైనా దూసుకెళ్ళడానికి  యాక్షన్ స్పెషలిస్టు బోయపాటి శ్రీనుతో ‘ఆపరేషన్ దూసుకెళ్ళుడు’ కి సమకట్టాడు. తన యాక్షన్  ఫిరంగిలో బెల్లంకొండని మందు గుండులా దట్టించి బోయపాటి ఫైర్ చేస్తే, ఏ రేంజిలో దూసుకెళ్ళి బెల్లంకొండ టార్గెట్ ని ఢీకొట్టాడో ఓసారి పరిశీలిద్దాం...

కథ 
       చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ( శరత్ కుమార్ ) పుత్రరత్నం గగన్ ( బెల్లంకొండ). ఇతనూ తండ్రీ అన్నా కలిసి ఒక జట్టు. ఫ్రెండ్స్ లా వుంటారు. కలిసి మందు కొడతారు. కలిసి బయట  బజ్జీలు తింటారు. గగన్ కాలేజీ స్టూడెంట్ కూడా. కాలేజీలో ఓ మినిస్టర్ (సుమన్)  కొడుకు వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయికి మద్దతుగా గగన్ ఆ కొడుకు కీళ్ళు విరిచేస్తాడు. ఇది చూసిన స్వీటీ అలియాస్ జానకి ( రాకుల్) అనే మరో స్టూడెంట్ గగన్ ని ప్రేమించేస్తుంది. చొరవ తీసుకుని గగన్ ఇంట్లో వాళ్లకి మంచి అలవాట్లు నేర్పి దగ్గరవుతుంది. గగన్ అన్న ప్రేమించినమ్మాయితో పెళ్లి కూడా జరిగేలా  చూస్తుంది. దీంతో గగన్ కూడా ఆమెని ప్రేమించడం మొదలెడతాడు.

          స్వీటీ హైవేస్ అధారిటీ చైర్మన్ ( జయప్రకాష్ ) కూతురు కూడా. ఈ హైవే కాంట్రాక్టు పొందడానికి అశ్వత్ వర్మ ( జగపతిబాబు) ప్రయత్నిస్తే, లిక్కర్ కింగ్ ఆ కాంట్రాక్టు తను కొట్టేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ కుమ్ములాటల పర్యవసానంగా స్వీటీ తండ్రి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెకి వర్మ కొడుకుతో పెళ్లి జరిపించేస్తాడు. ఈ పెళ్లి మండపంలో లిక్కర్ కింగ్ పెళ్లి కొడుకుని చంపేస్తాడు. ఇలా అన్యాయమైపోయిన స్వీటీని గగన్ ఆదుకోవాల్సి వస్తుంది...ఇదీ కథ!

ఎలావుంది కథ 
      ఫ్యామిలీ డ్రామాలు సృష్టించి అందులోంచి భావోద్వేగాలతో కూడిన యాక్షన్ ని రగిలించడం మార్కు బోయపాటి కథలాగే వుంది. అయితే ఈ తరహా కథల్ని బాలకృష్ణతో  ‘సింహా’,  ‘లెజెండ్’ లుగా తీసినప్పుడు, బాలయ్య గ్లామర్ తో కుటుంబాలు కూడా కదిలివచ్చి పెద్ద హిట్స్  చేశారు. బెల్లంకొండకి కుటుంబ ప్రేక్షకుల్లో గ్లామర్ లేకపోవడంతో కేవలం బి, సి సెంటర్ల మాస్ కథ స్థాయికి చేరింది.  శంఖంలో పోస్తే గానీ తీర్ధం కాదన్నట్టు ఈ కథకి బోయపాటి రేంజి స్టార్ తోనే కళ వస్తుంది  తప్ప-  జ్యూనియర్ హీరోలతో కాదు. వైధవ్యం పొందిన హీరోయిన్ని హీరో చేపట్టడమనే పాయింటు బోయపాటి  ఫ్యామిలీ డ్రామాకి కొత్తదే అయినా, ఇది కూడా కుటుంబ ప్రేక్షకుల్ని నోచుకునే అవకాశం లేకుండా  పోయింది హీరో రేంజి వల్ల.

ఎవరెలా చేశారు 
      ‘ఇది తప్ప ఏదీ రాదా?’ అని బెల్లంకొండ ఎక్స్ ప్రెష న్స్ నుద్దేశించి రకుల్ డైలాగు. బోయపాటి కావాలనే ఈ డైలాగు పెట్టినట్టుంది. బెల్లంకొండ ఫిలిం ఫేర్ నిర్ణయించిన ఉత్తమ నూతన నటుడు. కానీ ఆ అవార్డుకి న్యాయం చేసే విషయం పక్కన పెట్టాడు. దేనికైనా బ్లాంక్ ఫేసే పెట్టడంతో ఇది కూడా కొంపదీసి భావప్రకటనేమో,  దీనిద్వారా ఏం  చెపుతున్నాడో నని మనం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి. కాలేజీలో అమ్మాయిలు సరదాగా తనతో మాట్లాడుతూంటే కూడా మాటలు కలపకుండా, చంద్రబాబు నాయుడు జగన్ ని చూసినట్టు చూపులు. ఒక చోట ఏకాంతంలో  రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ సంభాషణ చేస్తూంటే, పక్కనే కూర్చుని కేసీఆర్ రేవంత్ ని చూసినట్టు చూపులు. డైలాగు పలికినా కూడా కష్టమే. అందుకే డైలాగులు తగ్గించి ‘చూపులు’ వరకే పరిమితం చేశారు నటనని. బెల్లంకొండ భారీ ఫైట్లు చేసుకుపోవడం, పాటల్లో స్పీడుగా డాన్సులు చేసుకుపోవడం  తప్ప పాత్రని నటించగల నటుడిగా నిరూపించుకోలేదు. ఎక్కడా నవ్వడు, కామెడీ చెయ్యడు . ఇలా బోయపాటితో బెల్లం కొండ రేంజి పెరగలేదు సరికదా, బోయపాటి వన్నె తగ్గిపోయింది. 

          హీరో సమవుజ్జీ కాలేక రకుల్ ప్రీత్ సింగ్ నటన కూడా అడవి కాచిన వెన్నెలయింది. ద్వితీయార్ధంలో పాత్ర పెరిగి ఆమె ఎంత నటించుకుంటే ఏం లాభం నటుడి నుంచి దీటుగా స్పందన లేకపోతే. కిక్ - 2 లో బీహార్ ఎపిసోడ్ లో ఇలాటిదే అన్యాయం జరిగిన అమ్మాయిగా రవితేజ ఆలంబనగా నటనని పండించుకుంది. 

          సెకండ్ హీరోయిన్ గా రఫ్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. కమెడియన్లు లేరు. విలన్లే వున్నారు. అయితే జగపతిబాబుతో బాటు, తరుణ్ అరోరా రొటీన్ గానే కనిపిస్తారు. ‘లెజెండ్’  తో బోయపాటి చేతిలో ఇటాలియన్ మాఫియాసో రూపురేఖల్లో విలన్ గా కొత్త అధ్యాయం తెరచిన జగపతిబాబు కీసారి అలాటి ప్రత్యేకతలేం లేవు.

          బోయపాటిలాగే దేవిశ్రీ కూడా బెల్లంకొండ కోసం కష్టపడ్డారు. కానీ పాటలతో కూడా ఉన్నత తరగతి ప్రేక్షకులకి సినిమా రీచ్ అయ్యే అవకాశంలేదు కన్పించడం లేదు. కెమెరా వర్క్ బోయపాటి స్థాయికి తగ్గట్టే వుంది. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఒక అన్యాయం లోంచి పుట్టుకొస్తూ భావోద్వేగాల్ని రగిలిస్తాయి. ప్రస్తుతం ఇదే జరిగినా, చివర హంసల దీవి యాక్షన్ ఎపిసోడ్ టాప్ గా నిలుస్తుంది. రత్నం రాసిన డైలాగుల్లో ‘రిచ్ నెస్ అంటే డబ్బుండడం కాదు, బుద్ధుండడం’ బాగా పేలింది. 

చివరికేమిటి 
       ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలు తీసే బోయపాటి వాటి స్క్రీన్ ప్లేల్లో ఎప్పటికప్పుడు తాజాదనం కోసం కృషి చేస్తే బావుంటుంది. ఇంకా పాత  సినిమాల ఫీల్ తో  ఓపెనింగ్ సీన్లు పెట్టాల్సిన అవసరం లేదు. మాస్ కూడా పాత కథలకి  కొత్త కథనాల్నే  కోరుకుంటారు. హీరో గురించి చెప్పడానికి కాలేజీ ప్రిసిపాల్ తో వేసిన ఇంటర్ కట్ సీన్స్ చాలా పూర్ గా గావున్నాయి. బోయపాటి తన సృజనాత్మకతని సానబట్టుకోవాల్సి వుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎప్పుడేది వేసి ప్రేక్షకుల్ని రెచ్చగొట్ట వచ్చో బాగా తెలిసిన తనకి వాటికి  తగ్గ కథానాయకుణ్ణి ఎంపిక చేసుకుంటేనే సార్ధకమవుతుంది. ‘సరైనోడు’ లాంటి యాక్షన్ మూవీ ఎవరితో తీసినా చెల్లిపోతుంది, కానీ భారీ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాల్ని కాదు. ఇలాటివి తీయాలంటే  ముందా హీరోకి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్నన వుండాలి.

          బెల్లంకొండ శ్రీనివాస్ నటనలో ఇలాగే కొనసాగితే కింది స్థాయిలోనే  వుండిపోతాడు. ఇంతింత భారీ బడ్జెట్స్ తో తీసి,  కేవలం డాన్సులు ఫైట్లు మాత్రమే ప్రదర్శించినంత మాత్రాన వొరిగేదేమీ లేదు. బడ్జెట్స్ తో ఇగోకి పోకుండా, ముందు నటన నేర్చుని  సాధారణ బడ్జెట్స్ కి ఒప్పుకుంటే అన్నీ చక్కబడతాయి. లేని నటుణ్ణి భారీ హంగులు  కవర్ చేయలేవు. 

           మొత్తానికి ఫిరంగిలో బోయపాటి పేల్చిన మందుగుండు మాస్ వరకే వెళ్లగలిగి అక్కడే సెటిలయింది.

-సికిందర్
http://www.cinemabazaar.in