రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, ఆగస్టు 2017, శనివారం

495 : రివ్యూ!

రచన-  ర్శత్వం : హను రాఘపూడి
తారాగణం :  నితిన్, మేఘా ఆకాష్, అర్జున్, వికిషన్, నాజర్, శ్రీరామ్, సురేష్, అజయ్, పృథ్వీ, బ్రహ్మాజీ, ధుసూధన్, రాజీవ్కాల, పూర్ణిమ దితరులు
సంగీతం :  ణిశర్మ, ఛాయాగ్రణం : యువరాజ్
నిర్మాతలుః రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంక
విడుదల : ఆగస్టు 11, 2017

***
          1970 లలో జేమ్స్ బాండ్ స్ఫూర్తితో తెలుగులో ఒక ఊపు వూపిన స్పై  సినిమాలు ఆ తర్వాత ఐపు లేకుండా  పోయాయి. ఆ ట్రెండ్ లో ఆంధ్రా జేమ్స్ బాండ్ గా హీరో కృష్ణ పాపులారిటీ సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అప్పుడప్పుడే ప్రారంభమైన వ్యాపార యుగంలో జేమ్స్ బాండ్, కౌబాయ్ సహా వీలైనన్ని జానర్స్ లో  వెరైటీగా సినిమాలు తీస్తూపోయి వ్యాపార యుగాన్ని హిట్ చేశారు. శతాబ్దం మారేసరికల్లా  వ్యాపార యుగం కాస్తా ఫ్యాక్షన్ యాక్షన్లూ,   ప్రేమలూ దెయ్యాలూ అనే రెండో  మూడో  జానర్లకే కుదించుకు పోయింది. వీటితోనే అదే పనిగా ప్రేక్షకుల్ని బాదుతూ వ్యాపార యుగాన్ని ఫ్లాప్ చేశారు. ఇది సృజనాత్మక నియంతృత్వమని కాక  సృజనాత్మక అలసత్వం. దీనికి పరాకాష్ట  గత శుక్రవారం ‘నక్షత్రం’. వా రం తిరిగేసరికల్లా ఈ శుక్రవారం కనుమరుగైన  జానర్  ముందుకొచ్చింది. అదే ‘లై’ అనే సూపర్ స్పై  థ్రిల్లర్!  మాస్ యాక్షన్లూ, ప్రేమలూ దెయ్యాలూ కాసేపు పక్కన పెట్టి, ఒక ఒక స్పై సినిమా తీయాలన్న ఆలోచన రావడమే గొప్ప!

         
‘అందాల రాక్షసి’ అనే ప్రేమ సినిమాతో పరిచయమైన దర్శకుడు హను రాఘవపూడి  ఆ తర్వాత ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’  అనే జానర్ల కలగూర గంప తీసి ఇంకా  సినిమాకళ మీద పట్టు సాధించని దశలో,  ప్రస్తుత స్పై థ్రిల్లర్ ని జానర్  మీద పట్టున్న దర్శకుడిలా తీశాడు. 

          రోమాంటిక్ కామెడీలతో తిరిగి వెలుగులో కొచ్చిన హీరో నితిన్ కూడా ఈ స్పై థ్రిల్లర్ కి పూనుకుని టెంప్లెట్ సినిమాల నుంచి దూకి అవతల పడ్డాడు. ఇలాటి సినిమా తీయడానికి ముందుకొచ్చిన పాపులర్ నిర్మాతలు కూడా  సరైన నిర్ణయమే  తీసుకున్నారు.


          ఐతే ఇంత చేసీ ఇందులో పాత  మూస లేకపోలేదు- ఈ మూస ఏ తరగతి ప్రేక్షకులకైతే ఉద్దేశించారో వాళ్లకి కాసేపే ఊరట. మిగతా వ్యవహారమంతా మళ్ళీ వాళ్లకి మూస తప్పిన గోసే. ఇదేమిటో చూద్దాం...

కథ 
        చైత్ర (మేఘా ఆకాష్)  పుట్టింది. పుట్టగానే డబ్బు ని  ముట్టుకుంది. పిసినారిగా ఎదిగింది. పెళ్లి చేసుకుంటే హనీమూన్ కి ఫారిన్ తిరగొచ్చని ఎవరో అంటే పేరెంట్స్  ని బలవంత పెట్టి పెళ్ళికి తయారయ్యింది. హనీమూన్ టూరుకి ఏజెంట్ కి డబ్బు కట్టింది. ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఏజెంట్ డబ్బివ్వనన్నాడు.

          సత్యం ఆవారాగా తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకోరా అని తల్లి వేధిస్తోంది. వచ్చిన సంబంధాలు ఆవారాతనం చూసి కుదరడం లేదు. అమెరికా  వెళ్లి అక్కడ అమ్మాయిల్ని చూసుకుని పెళ్లి చేసుకుంటానంటాడు. 

          చైత్రకి ఏజెంట్ డబ్బు తిరిగివ్వకపోవడంతో ఆ డబ్బులకి ఫారిన్ తిరిగి రావడానికి  బయల్దేరుతుంది. అదే ఫ్లయిట్ సత్యం కూడా ఎక్కుతాడు. ఇద్దరూ అబద్ధాలతో బతికే వాళ్ళే.  ఆ అబద్ధాలతో కలిసి లాస్ వెగాస్ లో వుంటారు. 

          పద్మనాభం (అర్జున్) అనే ఒక ఘరానా క్రిమినల్ అమెరికాలో దాక్కున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రయత్నిస్తోంది. ఈ వేటలో ఓ సంఘటన జరిగి అందులో సత్యం ఇరుక్కుంటాడు. 

          సత్యం ఎందుకు ఇరుక్కున్నాడు, అతడికీ పద్మనాభానికీ ఏమైనా సంబంధముందా, పద్మనాభాన్ని పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు...ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి సమాధానం మిగతా సినిమా. 

ఎలాఫుంది కథ 
       స్పై జానర్ తో రాజీ పడ్డట్టుంది ప్రారంభమంతా.  హీరోయిన్ పుట్టుక, పిసినారితనం, పెళ్లి ప్రయత్నం, హీరో ఆవారాతనం, పెళ్లి ప్రయత్నాలూ... ఇలా సృష్టి ప్రారంభంనుంచీ ఫలానా ఫలానా అని చూపిస్తూ చేసే రొటీన్ ఫార్ములా మూస చిత్రణలు ఈ  స్పై జానర్ లో కుదురుకునేవి కావు. ఏదో రొటీన్ గా హీరో హీరోయిన్ల ప్రేమకథ అన్నట్టు,  ఒక తరగతి ప్రేక్షకుల్ని బుజ్జగించడానికే అన్నట్టు వుంటాయి. సగం కథ నుంచి హీరో అసలెవరో తెలిశాకే  స్పై జానర్ ప్రారంభమవుతుంది. స్పై జానర్ మొదలయ్యాక, హీరో హీరోయిన్ల గురించి సృష్ట్యాది నుంచీ చూపించిందంతా పరమ చాదస్తం  అన్పిస్తుంది. ఇది దేశానికి సంబంధించి ఒక క్రిమినల్ ని పట్టుకునే గూఢచారుల కథ. ఇందులో హీరో హీరోయిన్ల పుట్టుపూర్వోత్తరాలకి, కుటుంబాల-  ప్రేమల కథలకి  స్థానం లేదు. ఇవి  స్పై కథకే మాత్రం ఉపయోగపడవు. అందుకే ఆ ప్రేమ తూతూ మంత్రంగా మారిపోయి స్పై కథకి అడ్డు పడుతూ వచ్చింది. స్పై జానర్ అందరూ చూడరని భావించడమే తప్పు. దాంతో జానరేతర  మసాలాలు దట్టించడం ఇంకా తప్పు. ప్రేక్షకులకి అలవాటు తప్పిన స్పై జానర్ కి పూనుకున్నాక, దానికి తిరిగి ప్రేక్షకుల్ని సంసిద్ధం చేయాలే గానీ, అవ్వాకావాలీ బువ్వా కావాలీ  అన్నట్టు జానర్ మర్యాద తప్పితే అసలుకే మోసం వస్తుంది. గత సంవత్సర కాలంగా జానర్ మర్యాద తప్పిన  సినిమాల్ని తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. ప్రేక్షకులు మారుతున్నారు, ప్రొడక్షన్లు కూడా మారాలి. 

ఎవరెలా చేశారు 
       వెరైటీ కోసమో, కాస్త తేడాగా ప్రయత్నించి చూద్దామని మేకోవర్ అనుకునో గడ్డం మీసాలు పెంచి తిరుగుతూంటాడు నితిన్. ఇది పాత్రోచితమేనా? ఈ గెటప్ లో తెలిసిపోయేలా గూఢచారులు  షికార్లు కొడుతూంటారా? మారు వేషం వేసినప్పుడు ఇంకేవైనా పెంచుకోవచ్చు. గడ్డం వేసుకు తిరిగితే స్పై గా క్షణంలో సఫా అవుతాడు. ఆవారా లవర్ బాయ్ గా చూపించడానికి బావుందనుకున్న ఈ గెటప్పే,  తర్వాత పాత్ర షేడ్ కీ అచ్చోసి వదిలేశారు. ఇప్పుడైనా అర్ధమవుతోందా - ఒక తరగతి ప్రేక్షకులని బుజ్జగించబోతే ఏం జరుగుతుందో? 

           నితిన్ స్పై రోల్ ని పటిష్టంగా పోషించాడు. ఐతే గూఢరులకి కొన్ని అలవాట్లు వుంటాయి. ఆ సహజత్వంకోసం మాత్రం ప్రయత్నం చేయలేదు. మామూలు యాక్షన్ హీరోవేరు, స్పై వేరు- ఈ తేడా కన్పించదు నితిన్ కి సంబంధించి. పైగా పూర్తిగా సీరియస్  స్పై అయ్యాడు. దీంతో వినోదం కొరవడింది. చాలాకాలం తర్వాత తిరిగి స్పై మూవీని ప్రేక్షకుల ముందుకి తెస్తున్నప్పుడు,  పాత్రతో  సీరియస్ యాక్షన్ చేయించకుండా,  కలర్ఫుల్ గా యాక్షన్ తో చూపిస్తే  ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది.  జేమ్స్ బాండ్ గా ఆరేడు సినిమాల్లో నటించిన రోజర్ మూర్  ఎంత హాస్యం పండిస్తూ కలర్ఫుల్ గా సాహసాలు చేసేవాడు? 

          హీరోయిన్ మేఘా ఆకాష్ ( ఆకాశంలో మేఘాలు) తారా చంద్రుల్ని కూడా  మెరిపించాలంటే చాలా మబ్బులు తొలగాలి. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాకి ఒక ఎసెట్. ఈ మొత్తం సినిమాలో మొత్తమంతా పాత్రలోకి దూరిపోయిన నటుడు ఈయనొక్కడే. క్లాసీ విలనీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి,  పాత్రలాగే అన్పిస్తూ తనని మర్చిపోయేలా చేశాడు. ఈ సంవత్సరం తెలుగు సినిమాల్లో వైవిధ్యం కనబరచిన విలన్ తను.

          ఎన్ఐఎ చీఫ్ గా రవికిషన్ కి రెండో స్థానం. ఇతర సహాయనటులు తర్వాతి స్థానాలాక్రమిస్తారు.టెక్నికల్ గా అంతర్జాతీయ స్థాయిలో వుంది. కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్ కొత్త లోకాల్లోకి లాక్కెళతాయి.  యాక్షన్ సీన్స్ అత్యంత థ్రిల్లింగ్ గా వున్నాయి. మరొక ఎసెట్ మణిశర్మ పాటలు, నేపధ్య సంగీతం. ఇక నితిన్ మీద చివరి సోలో ఫోక్ పాట – దానికి సమకూర్చిన కోరియోగ్రఫీ చాలా క్రేజీగా వున్నాయి. ఇలాగే  అమితాబ్ బచ్చన్,  హేమమాలిని ని టీజ్ చేస్తూ,  ‘దేశ్ ప్రేమీ’ లో లుంగీ కట్టుకుని మారువేషంలో ‘తానే దిన్ తందానా’  సూపర్ క్రేజీ  మాస్ పాటా డాన్సూ  వేసుకుంటాడు. నితిన్ ఆ రేంజి కెళ్ళిపోయాడు. ఇంత టపోరీ సాంగ్ డాన్సూ ఈ మధ్య కాలంలో చూళ్ళేదు. 

చివరికేమిటి 
      స్పై తో రాజీ పడ్డా ఈ మాత్రమైనా ప్రయత్నం చేసినందుకు దర్శకుడికి మార్కులే. ఈ ప్రయత్నాన్ని అంతర్జాతీయ టేకింగ్ తో చేసినందుకు, నితిన్ తో రాజీపడ్డా ఇతర పాత్రల్ని అదే అంతర్జాతీయ స్థాయిలో ప్రెజెంట్ చేసినందుకూ మంచి మార్కులే. ప్లాట్ డివైస్ గా ఆసక్తి రేపుతూ ప్లే చేసిన విలన్ తాలూకు కోటు కథ క్లాస్ క్రియేషన్. విలన్ చేసిన నేరాలు చూపించకుండా, పట్టుబడకుండా ఇంకో నేరం చేసినట్టూ చూపించకుండా, కేవలం విలన్ ని పట్టుకునే దాగుడు మూతలాటకే  పరిమితం చేయడంతో, కొంత అసంతృప్తి వుంది. క్లయిమాక్స్ చప్పున తేలిపోవడానికీ  కథకి కేంద్రకంగా ఒక మహా కుట్ర లేకపోవడమే కారణం.  ఇవి సరిదిద్దుకుని వుంటే ఈ స్పై థ్రిల్లర్ ఇంకింత థ్రిల్లింగ్ గా వుండేది.

-సికిందర్
http://www.cinemabazaar.in