స్క్రీన్
ప్లే- దర్శకత్వం : నవీన్ మేడారం
తారాగణం : అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి, శ్రీముఖి, ప్రియాంక, పోసాని, తనికెళ్ళ, ప్రియదర్శి,
రవిప్రకాష్ తదితరులు
కథ : హర్షవర్ధన్ కులకర్ణి, మాటలు : మిర్చి కిరణ్, సంగీతం : సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం : సురేష్ భార్గవ
బ్యానర్ : అభిషేక్ ప్రిక్చార్స్
నిర్మాత : అభిషేక్ నామా
విడుదల : మే 5, 2017
***
కథ : హర్షవర్ధన్ కులకర్ణి, మాటలు : మిర్చి కిరణ్, సంగీతం : సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం : సురేష్ భార్గవ
బ్యానర్ : అభిషేక్ ప్రిక్చార్స్
నిర్మాత : అభిషేక్ నామా
విడుదల : మే 5, 2017
***
క్లీన్ ఇమేజి వున్న నటుడు,
దర్శకుడు అవసరాల శ్రీనివాస్ అడల్ట్ కామెడీలో నటించడమేంటని తీవ్ర విమర్శలపాలయ్యాడు.
షకీలా బాపతు సినిమాలో నటించి పొరపాటు చేశాడని
అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. తనేదో సంజాయిషీ ఇవ్వబోయినా, నష్ట నివారణా చర్యలు చేపట్టినా పనిచెయ్యలేదు. అడల్ట్
కామెడీ అంటే దెయ్యం కామెడీ కంటే దిగువ స్థాయి సినిమా. కొందరే ప్రేక్షకులుంటారు.
అవసరాల ఇలా తన పరిధిని కుదించుకుంటూ బూతు
కామెడీలో నటించడం ప్రశ్నార్ధకంగానే మారింది. విడుదలకి ముందే అవసరాల, అవసరాలతో బాటు
సినిమా డ్యామేజీ అయిపోయింది. కానీ అసభ్యత అనేది చూపించే సెక్స్ సీన్లలో వుంటుందా
లేకపోతే, ఎలా చెప్పాల్సిన విషయం అలా చెప్పక పోవడంలో వుంటుందా? ఇదొకసారి చూద్దాం...
కథ
మాధవ్ అలియాస్ మ్యాడీ (అవసరాల) కి సెక్స్ పిచ్చి. ఇది చిన్నప్పట్నుంచీ
వుంటుంది. పత్రికల్లో బొమ్మలు చూసినా తట్టుకోలేడు. వీడియో పార్లర్లో బ్లూ ఫిలిమ్స్
కూడా ఎంజాయ్ చేస్తాడు. ఇతడికి వరప్రసాద్ (ప్రియదర్శి), ఉత్తేజ్ (రవిప్రకాష్) అనే
ఇద్దరు స్నేహితులుంటారు. మ్యాడీ ఇంజనీరింగ్ చదువుతూ హైదరాబాద్ లో, అటు వైజాగ్ లో
సెక్స్ దృష్టితోనే అమ్మాయిల్ని వల్లో వేసుకుని ఎంజాయ్ చేస్తాడు. సెక్స్ పూర్తిగా
ఒక భౌతిక అవసరమనీ, దాని గురించి ఇంకెక్కువ
సిద్ధాంత రాద్ధాంతాలు చెయ్యవద్దనీ వాదిస్తాడు.
వైజాగ్ లో పారూ (తేజస్వి) అనే అమ్మాయితోనూ, ఇంకో చంద్రిక (ప్రియాంక) అనే పెళ్ళయిన ఆమెతోనూ కోరికలు తీర్చుకుంటాడు. చంద్రిక మొగుడికి దొరికిపోవడంతో పారిపోయి హైదరాబాద్ వచ్చేస్తాడు. దీనికి ముందు పారూతోనూ హాస్టల్ వార్డెన్ కి దొరికిపోతాడు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ మళ్ళీ వన్ నైట్ స్టాండ్స్ కి అలవాటుపడితే, ఫ్రెండ్స్ మందలించి పెళ్లి చేసుకోమంటారు. కోరికలతో ఇలా పరువు పోగోట్టుకునేకన్నా పెళ్ళే బెటర్ అనుకుంటాడు. కానీ పెళ్లి చూపుల్లో ప్రతీ అమ్మాయికీ తన ఎఫైర్స్ చెప్పుకుని ఛీకొట్టించుకుంటాడు. అలాటివి చెప్పుకోకూడదని ఫ్రెండ్స్ మందలిస్తే, రాధ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయికి తన గుట్టు దాచుకుని ఎంగేజ్ మెంట్ చేసుకుంటాడు. ఇక్కడ్నించే ఇతడి జీవితం, ఆమె జీవితమూ మలుపు తిరుగుతాయి- ఏమిటా మలుపు? ఆమెకి కూడా గత ముందా? ఇద్దరూ ఒకటయ్యారా? విడిపోయారా? ఏం జరిగింది?... అనేవి మిగతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలావుంది కథ
ఇది 2015 లో విడుదలైన ‘హంటర్’ అనే హిందీకి రీమేక్. ‘హంటర్’ లో
గుల్షన్ దేవయ్య, రాధికా ఆప్టే లు నటించారు. దర్శకుడు హర్షవర్ధన్ కులకర్ణి. దీన్ని
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ సహా ఆరుగురు నిర్మాతలు కలిసి నిర్మించారు. ఓ మూడు
కోట్లు లాభం వచ్చింది. హిందీలో ఇది రియలిస్టిక్ జానర్ సినిమా. కథలో జీవం వుంటుంది.
ముగింపుకి అర్ధం వుండదు. ఇలాటి కథలు విముక్తి గురించి చెప్పాలి- అవే సంకెళ్ళలో బంధించడం కాదు.
అయితే కోరికలతో హీరో పాత్ర పడే తాపత్రయంలో ఫీల్ ఏదైతే వుంటుందో, అదే ఈ ఒరిజినల్ కి ప్రాణంలా వుంటుంది. గుల్షన్
దేవయ్య మొహంలో వుండే సున్నిత భావ ప్రకటనా
సామర్ద్యం వల్లే పాత్ర పడే తాపత్రయంలో ఉత్పన్నమయ్యే ఫీల్ పాత్రని నమ్మి దాని వెంట
వెళ్ళేలా చేస్తుంది. ఇతడి స్థానంలో ఈ పాత్రలో మరొకర్ని వూహించడం కష్టం. 2011 లో ‘షైతాన్’ అనే హిట్టయిన
డార్క్ మూవీతో ఉత్తమ నూతన నటుడి అవార్డు తీసుకున్న దేవయ్య, ‘హంటర్’ నీ క్లాస్ మూవీ
స్థాయికి తీసికెళ్ళాడు.
ఇక ఈ తెలుగు రీమేక్ కథలో అవసరాల నటించి పొరపాటు చేశాడనీ, దిగజారిపోయాడనీ చేసిన నానా ప్రచారమంతా ఇప్పుడు దుష్ప్రచారంగా తేలిపోవాలి. ఈ ప్రచారంతో ‘హంటర్’ ని ఎలా అర్ధంజేసుకున్నారో కూడా తెలిసిపోతోంది. మీడియా వ్యక్తులకే ఏ సినిమా ఏమిటో తెలియకపోవడం కన్నా అశ్లీలం మరొకటి లేదు. ఈ రీమేక్ తో గోలపెట్టినంత రోత ఏమీ జరగలేదు. ఈ కథలో నటించి అవసరాల అసభ్యతని ప్రదర్శించలేదు. పాత్ర మనసులో అలాంటి ఆలోచనలుంటాయే తప్ప తెర మీద అవి పూర్తిగా ప్రదర్శితం కావు. పైపైన చూపించి వదిలేస్తారు. సెన్స్ వుంటుంది తప్ప సెక్స్ వుండదు. అసభ్య మాటలు, ఎక్స్ పోజింగులు వుండవు. ఇది షకీలా సినిమా కాదు. రియలిస్టిక్ కథ. రియలిస్టిక్ కథ సెక్సుతో సొమ్ము చేసుకోవాలనుకోదు. నిజాల్ని నిర్మొహమాటంగా చూపించాలని ప్రయత్నిస్తుంది. అలా అనుకుంటే దాసరి తీసిన రియలిస్టిక్ ‘నీడ’ కూడా సెక్సు సినిమా అయిపోవాలి. వినోదపన్ను మినహాయింపు లభించ కూడదు. ఇలాటి సినిమాలకి మోరల్ పోలీసింగు ఇప్పుడు కుదరదు. సినిమాలు చూసి చెడిపోతున్నారని ధ్వజమెత్తడం ఇక అయిపోయింది- స్మార్ట్ ఫోన్స్ లో సెక్సు వూరూరా షికార్లు చేస్తున్నాక!
కాకపోతే ‘బాబు బాగా బిజీ’ టైటిల్ కి తగ్గట్టు లేదు ఈ రీమేక్. ఈ రీమేక్ కథ అంత బిజీగా ఏమీ లేదు.
ఎవరెలా చేశారు
కమర్షియల్
నటుడికి రియలిస్టిక్ సినిమా కష్టమే నేమో. ఒరిజినల్ లో ఐదు పైసలంత పెర్ఫార్మెన్స్
కూడా ఇవ్వలేదు అవసరాల. హావభావాల్లో డెప్త్ లేకపోతే ఇటు బూతుకి కాకుండా, అటు నీతికీ
కాకుండా పోతుంది పాత్ర. అవసరాల ముందున్నది ఒకే ఒక్కటి- రియలిస్టిక్ తన స్కూలు కానప్పుడు, ‘కుమారి -21 ఎఫ్’ లాగా కమర్షియల్ కి
వెళ్ళిపోవడమే. అందులో యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ది సెక్సువల్ ఓరియెంటేషన్
ఎక్కువున్న యాక్టివ్ పాత్ర- ఉర్రూతలూగించే క్రేజీ కమర్షియల్ పాత్ర. దాని కెళ్ళి పోవాల్సింది
అవసరాల. తన నటన ఒరిజినల్లో గుల్షన్
దేవయ్యలా రియలిస్టిక్ స్కూలుకి చెందిన నటనైతేనే పాత్రకి సరిపోతుంది. అది సాధ్యం
కానప్పుడు దీన్ని కమర్షియల్ సినిమా చేసి ఆ బాపతు తన నటనతో మెప్పించుకోవచ్చు.
అమ్మాయిల వైపు తను చూసే చూపుల్లో గానీ, వశపర్చుకున్నాక వ్యక్తం చేసే హావభావాల్లోగానీ
– ఏ ఫీలూ లేనప్పుడు పాత్రని నమ్మించడం కష్టం. గుల్షన్ కళ్ళల్లో వ్యక్తమయ్యే పాత్ర మనఃస్థితే
ఆ ఒరిజినల్ కి ఆయువుపట్టు. అవసరాల దీన్ని పట్టుకోలేదు. యాంత్రికంగా నటించేసి
సరిపెట్టేశాడు. అమ్మాయిలతో ఇటు రియలిస్టిక్ ఫీల్ తో లేక, అటు కమర్షియల్ గా క్రేజీ
గాణూ లేక లోలోన కుమిలిపోతున్నట్టు ఏదోలా కన్పిస్తాడు.
కాస్తో కూస్తో హీరోయిన్లే నటించారు. మిస్తీ చక్రవర్తి, తేజస్వి, శ్రీముఖి, ప్రియాంకాలు వాళ్ళ సంక్షిప్త పాత్రల్ని సునాయాసంగా నటించుకు పోయారు. 'పెళ్లి చూపులు' ఫేమ్ ప్రియదర్శి అక్కడక్కడా నవ్వించే డైలాగులు చెప్తాడు. రవిప్రకాష్ ది అర్ధాంతరంగా ముగిసిపోయే అర్ధంలేని పాత్ర. ఇందులో తన ధోరణిలో నటించుకుపోయాడు. అలాగే ఒక సీన్లో పోలీసు పాత్రలో పోసానీ.
కథ చూసి రియలిస్టిక్ అనుకోవాలి- మేకింగ్ మాత్రం కమర్షియల్ సినిమా అన్నట్టు వుంటుంది. కెమెరా, సంగీతం వగైరా రియలిస్టిక్ ధోరణుల్ని ప్రదర్శించవు. కొత్త దర్శకుడు నవీన్ మేడారంకి ఎందుకో ఈ రీమేక్ వడ్డించిన విస్తరి కాలేదు.
చివరికేమిటి
రియలిస్టిక్ కాబట్టి హీరో
ఆశయం, సంఘర్షణ, విజయం అనే స్ట్రక్చర్ లేదు. సూటి కథగా ఇది రెండు
గంటలా 20 నిమిషాలు నిలబడదు కాబట్టి మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో చెప్పారు. సంఘర్షణ
లేదు కాబట్టి క్లయిమాక్స్ లేక హీరో
హీరోయిన్లు రాజీ పడే ముగింపు సీనుని ఫ్లాష్ ఫార్వార్డ్, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్
పద్దతిలో చెబుతూ హడావిడి చేశారు. ఈ మాత్రం తెలివి తేటలు మంచిదే. తర్వాత ముక్తాయింపుగా
ఒక డైలాగుతో- శుభం వేశారు. ఈ మొత్తం
కథనంతో ఇబ్బంది ఎక్కడా వుండదు- సీన్లలో వేగం లేకపోవడం ఇబ్బంది, ముగింపులో తేల్చిన విషయం
ఇబ్బంది, అవసరాల సరసాలు ఇబ్బంది.
విలన్లేకుండా, స్ట్రక్చర్ లేకుండా ఇది హిందీ దర్శకుడు చేసుకున్న రియలిస్టిక్ కథ. అతనూ కాన్సెప్ట్ కి అన్యాయం చేశాడు. ఆ అన్యాయాన్నే అనివార్యంగా రీమేక్ లో కొనసాగించారు. చివరికి హీరో హీరోయిన్లకి చేయబోయే అన్యాయానికి తెలివిగల ప్రేక్షకులు హాహాకారాలు చేయకుండా, ముందుగా ఒక శాంపిల్ అన్యాయం రుచి చూపిస్తారు. ఇందులో హీరో ఫ్రెండ్ సైన్యంలో చేరతాడు. వైజాగ్ వచ్చినప్పుడతను ఒక గ్యాంగ్ రేప్ కి గురైన అమ్మాయిని కుటుంబం బహిష్కరిస్తే, తనే పెళ్లి చేసుకుంటాడు. తర్వాత కాశ్మీర్ వెళ్లి పోరాడుతూ వీరమరణం చెందుతాడు.
అంటే ఒక గ్యాంగ్ రేప్ కి గురయిన అమ్మాయి పెళ్లి చేసుకుని పచ్చగా వుండడం మంచిది కాదనా ఈ మరణం?
ఈ శాంపిల్ తో ముగింపులో హీరోహీరోయిన్లకి చేసే పెద్ద రేంజి అన్యాయాన్ని చూపిస్తారు- హీరో తన గుట్టు దాచి ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు కాబట్టి ఆ గిల్టీ తో ఇక చెప్పేస్తాడు. అప్పుడు హీరోయిన్ నిర్ణయం తీసుకోవాలి : అంటే గెటవుట్ అనాలి, లేదంటే ఇక ముందు ఆ వెధవ పన్లు చెయ్యకు అనాలి. రెండూ చెయ్యదు. తన గుట్టూ విప్పి దొందూ దొందే డోంట్ వర్రీ- అన్నట్టు మాట్లాడుతుంది.
అంటే ఇక్కడా అమ్మాయి గౌరవంగా వుండ కూడదనా కవిభావం? రియలిస్టిక్ కథని అభ్యుదయంగా కాకుండా మూస ఫార్ములాతో ముగించారు. ఏమైనా అసభ్యంగా వుంటే అది ఈ తేల్చిన విషయంలోనే కరుడుగట్టి వుంది.