రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, మే 2017, శుక్రవారం

రివ్యూ!


రచన దర్శకత్వం : చంద్రమోహన్
తారాగణం : శర్వానంద్, లావణ్యా త్రిపాఠి,  అక్ష, రవి కిషన్, కోట శ్రీనివాసరావు, ఆశీష్ విద్యార్ధి, జయ ప్రకాష్రెడ్డి. తనికెళ్ల భరణి,  బ్రహ్మాజీ, షకలక శంకర్, అలీ, సప్తగిరి  తదితరులు.
సంగీతం: రధన్, ఛాయాగ్రహణం: కార్తీక్ఘట్టమనేని
బ్యానర్:  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
సమర్పణ: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్
నిర్మాత: భోగవల్లి బాపినీడు
విడుదల: మే 5, 2017
***
 
హీరో శర్వానంద్ హిట్స్ కోసం కొత్త పాత్రల కంటే  పాత మూసలో నటించాలన్న కోరికే ఎక్కువ  తీర్చుకుంటున్నాడు. మాస్ కోసం పాత మూస అనుకుంటూ ఇప్పుడు పోలీస్ పాత్ర కూడా నటించేశాడు. చూసి చూసి వున్న ఈ పాత పోలీసునే తను ఏ విధంగా కొత్తగా చేసి చూపించాడన్నది ప్రశ్న. మూస పోలీసుకి తను తొడిగిన కొత్త వేషమేమిటి? అసలు తను వేసింది పోలీసు పాత్రేనా లేక ప్రేమికుడి పాత్రా? ప్రేమికుడి పాత్ర కూడా పాత మూస ఫార్ములాయే అయినప్పుడు అందులో కొత్త దనం కోసం తనేం ప్రయత్నం చేశాడు? ఒక  కొత్త దర్శకుడికి అవకాశమిచ్చి కొత్తగా తనేం సాధించాడు?  కొత్త దర్శకుడిలో తనేం కొత్త చూశాడు? ఇవన్నీ వెంటాడే ప్రశ్నలు. వీటికి  జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం... 

కథ 
        చిన్నప్పట్నుంచీ రాధాకృష్ణ అలియాస్ రాధ (శర్వానంద్) భగవత్గీత అంటే ఇష్టం. కృష్ణుడికి అభిమాని. ఒక ప్రమాదం నుంచి అపద్బాంధవుడిలా  ఒక పోలీసు కాపాడ్డంతో అతడిలో కృష్ణుణ్ణి చూసి తనూ పోలీసు అవాలని నిర్ణయించుకుంటాడు. పెద్దయ్యాక ఎస్సై గా చేరతాడు. వరంగల్ లో పోస్టింగ్ వస్తుంది. అక్కడికెళ్ళి రాధ ( లావణ్యా త్రిపాఠి) తో ప్రేమలో పడతాడు. ఆ వూళ్ళో నేరాలే జరక్క  ఖాళీగా వుండాల్సి వస్తుంది. దీంతో ధూల్ పేటకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాడు. 

          ఇలావుండగా, ఓ అధికార పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ ఏర్పడుతుంది. సీఎంగా వున్న నాయకుడు (కోట శ్రీనివాస రావు) తన వారసుడిగా సుజాత (రవికిషన్) ని ఎంపిక చేస్తాడు. దీంతో మరో నాయకుడు (ఆశీష్ విద్యార్థి) కుట్ర చేస్తాడు. ఈ కుట్రని తిప్పి కొట్టేందుకు సుజాత  బాంబు దాడి  జరిపిస్తాడు. ఆ దాడిలో కొందరు పోలీసులు చనిపోతారు. ఆ పోలీసులు ఎస్సై రాధ సిబ్బందే. దీంతో రాధ సుజాత మీద పగబడతాడు, అతణ్ణి ఎలాగైనా సర్వనాశనం చేయాలనీ పూనుకుంటాడు.

          ఇదీ కథ. ఇలా ఎస్సై రాధ సుజాత మీద పగ దీర్చుకున్న విధం, రాధతో ప్రేమని నిజం చేసుకున్న తీరూ తెలుసుకోవాలంటే ప్రదర్శన శాలలో  సువిశాలమైన వెండి తెరని ఆశ్రయించాల్సిందే.

ఎలావుంది కథ  
     కొత్త దర్శకుడు చంద్రమోహన్ కి కొత్త దనం మీద నమ్మకంలేదు. పాత టెంప్లెట్ నే నమ్ముకున్నాడు. అందులో మళ్ళీ పూరీ జగన్నాథ్ బ్యాంకాక్ బీచి పేజీల్లా వుంటే చాలనుకున్నాడు. పిసరంత కథ,  సైడులో బోలెడంత లవ్ ట్రాకు. ఇది తారుమారై లవ్ ట్రాకే అసలు కథగా, పిసరంత అసలు కథ ఉపకథలా కన్పించే ప్రత్యేకత ఇక్కడ చూడవచ్చు. సీఎం పదవి, దానికోసం కుట్రలూ ఇంకెన్ని సార్లు చూపిస్తారో, ఇందులో జుర్రుకుంటున్న ఆనందమేమితో అర్ధంగాదు. ఒక ‘అంకుశం’ లా  తీస్తే ఎన్నిసార్లు జుర్రుకున్నా పోనీలే అనుకోవచ్చు. రాజకీయం  వర్సెస్ పోలీసు కథలకి ‘అంకుశం’ లోని  భావోద్వేగం పట్టుకోలేనప్పుడు- ఎందరు శర్వానందులు ఎస్సై వేషం కట్టినా గిట్టుబాటయ్యే దేమీ వుండదు. భావోద్వేగాల ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, ఇదొక కామెడీగా, ఫన్నీ పోలీసు స్టోరీగా ప్రచారం చేశారు. కానీ బాంబు దాడిలో హీరో తోటి పోలీసులు చనిపోయాక కామెడీ ఫన్నూ వగైరా ఇక్కడితో పరిసమాప్త మవుతాయి. భావోద్వేగాలే  రాజ్యమేలతాయి. ఈ భావోద్వేగాల జోలికి పోలేనప్పుడు బాంబు దాడితో విషాదం నింపనవసరం లేదు.

ఎవరెలా చేశారు 
        టెంప్లెట్ కథ పాత్రని కూడా దెబ్బ తీస్తుంది. టెంప్లెట్ కథ దేనికదిగా విడిపోయి వుంటుంది. ఫస్టాఫ్ లో సమయాన్ని భర్తీ చేసేందుకు వాడే ప్రేమ ట్రాకు ఆతర్వాత కరివేపాకు అయిపోతుంది. విలన్ తో హీరో కథ ప్రారంభమయ్యే సెకండాఫ్ కి సరైన ఎమోషన్ లేకుండా పోతుంది. శర్వానంద్ పాత్రకి ‘అంకుశం’లో రాజశేఖర్ పాత్రకి లాగా ప్రేమకథ అసలు కథకి కనెక్ట్ అయి భావోద్వేగాలు రగిలినట్టుగాక- అదొక టెంప్లెట్ ప్రేమగానే వుండి పోతుంది. ఇదే తన పాత్ర చిత్రణని దెబ్బ తీసింది. ఎమోషన్ కి ఇంకో ఇంటరెస్టు తీపిగా కన్పిస్తే ఎమోషన్ ఎగిరిపోతుంది. బాంబు దాడిలో సిబ్బందిపోయిన ఎమోషన్ ముందు, హీరోయిన్ తో మిగిలున్న ప్రేమ తియ్యగా కన్పిస్తూంటే, సహజంగానే ఎమోషన్ అప్రధానమైపోయింది. దీంతో శర్వానంద్ పాత్ర సిల్లీగా కన్పిస్తుంది. సెకండాఫ్ లో ఇంకో హీరోయిన్ తో కూడా ట్రాకు నడిపి నారీ నారీ నడుమ మురారీ టైపు పాట కూడా వేసుకోవడంతో మొత్తం అసలు కథే గల్లంతై పోయింది. కథ గల్లంతయినా, గందరగోళమైనా  శర్వానంద్ పోషించిన లాంటి హీరో పాత్రే కారణం. సినిమా ప్రారంభమైన 25 నిమిషాలకి,  వరంగల్ పోస్టింగుతో హీరోయిన్ ని చూసి- ఎస్సై పాత్రని తుంగలో తొక్కి లవ్ ట్రాక్ ప్రారంభించిన టెంప్లెట్ క్యారక్టర్ తనది. 

          ‘రన్ రాజా రన్’ కంటే ముందు శర్వానంద్ కి ఒకటీ అరా తప్ప హిట్స్ లేవు, గుర్తింపూ లేదు.  ‘రన్ రాజా రన్’  తోనే మేకోవర్ తో తనకి గుర్తింపు వచ్చింది, అందులో చేసిన న్యూ ఏజి ఫన్ కి మంచి  పేరొచ్చింది. మళ్ళీ అలాంటి న్యూ ఏజీ క్యారక్టర్స్ చేయలేక, మూస పాత్రలే చేస్తూ నటనతో ఆకట్టుకోవచ్చను కుంటున్నాడు. టెంప్లెట్ పాత్రల్లో నటించడాని కేముంటుంది? ఇది తెలుసుకోలేకపోతున్నాడు తను. 

          ఇక హీరోయిన్ లావణ్యా త్రిపాఠీకి తెలుగులో అడుగు పెట్టింది మొదలు అవే సాంప్రదాయ సుత్తి పాత్రలు. ప్రస్తుతమైతే  కుందేళ్ళూ పావురాలూ హంసలూ చుట్టూ  పెట్టుకుని ఆడుకునే పాతకాలం  హీరోయిన్లా చప్పగా ఎంట్రీ ఇస్తుంది. ఈమె పాత్రకి నిజంగా హీరో మీద ప్రేమ వుందాని సందేహం. ఒక్కసారి కూడా తను ఫోన్ చెయ్యదు, అతనే చేస్తూంటాడు, అతనే కలుస్తూంటాడు. 

          విలన్ గా రవికిషన్ ది ఓవరాక్షన్. అలీ, సప్తగిరి, షకలక శంకర్ లది ఓ మాదిరి కామెడీ.
          పాటలూ ఛాయాగ్రహణం పేలవంగా వున్నాయి.
కార్తీక్ఘట్టమనేని ఛాయాగ్రహణం ఇంత సాదాగా వుండడం ఆశ్చర్యం కల్గించే విషయం. ఇంటర్వెల్ తర్వాత శర్వానంద్ పాడే సోలో హారిబుల్ గా వుంది. నిజంగా మాస్ నే దృష్టిలో పెట్టుకుని తీసివుంటే, ఆ వర్గాలకి ఇది కరెక్టే. మాస్ జనం రేషన్  బియ్యం దాటి పైకి రాకూడని ప్రజాస్వామ్యం కదా?

చివరికేమిటి
       కొత్త దర్శకుడి సినిమా అనగానే కొత్త ఉత్సాహంతో సినిమాకి వెళ్ళనవసరం లేదు. అదే పాత విషయముంటుంది. అదే టెంప్లెట్ ని నమ్ముకుని వుంటాడు. ఐతే టెంప్లెట్ కి కూడా ఒక విధానముంటుందని తెలియకపోతే ఇదిగో- ఇలాగే ప్రేమకథో, విలన్ తో కథో అర్ధం గాని గజిబిజీ అవుతుంది. దర్శకుడు పాతలోనే విజయముందని నమ్ముతూ ఎక్కడా దేన్నీ వదిలి పెట్టలేదు. హీరో చిన్నప్పట్నించీ కథ ఎత్తుకుంటాడు. ఇంటర్వెల్ దాకా హీరో ఎస్సై అయిన విధం, ట్రైనింగు, పోస్టింగు, ట్రాన్స్ ఫర్ అంటూ అక్కడక్కడే కథని తిప్పుతూంటాడు. ఇందులో ప్రేమ ట్రాకు కూడా కలిపి కాలక్షేపం చేస్తాడు. బాంబు దాడీ, మరణాల తర్వాత హీరోని కోన వెంకట్ సింగిల్ విండో స్కీములో విలన్ ఇంట్లో దింపి బకరా కామెడీ మొదలెడతాడు. ఆ బకరా డబ్బులు దోచుకుంటాడు, సప్తగిరిని దింపి బకరా  కొడుకు ఇతనే నంటూ  మరో పాత  డ్రామాకి తెర తీస్తాడు. ఇదంతా అప్పుడప్పుడు మాత్రమే, ఏకధాటిగా కాదు. ఏకధాటిగా నడిపించేది ఎమోషన్, సరైన కామెడీ లేని ప్రేమ ట్రాకునే.

          ఫస్టాఫ్ లో హీరోయిన్ తో  అదే రొటీన్ ప్రేమ ట్రాకు నడపు, సెకండాఫ్ లో విలన్ తో అదే రొటీన్ బకరా కామెడీ చేసి ముగించు- మాస్ మసాలా సినిమా తయార్!  ప్రేక్షకులు ఇదే కోరుకుంటున్నారు, ఎప్పటికీ కోరుకుంటారు, వాళ్ళు అల్ప సంతోషులు. క్యాష్ చేసుకోవడానికి ఇదే అవకాశం!

-సికిందర్