రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, మే 2017, ఆదివారం

రివ్యూ!

దర్శకత్వం :  జేమ్స్  ఎర్ స్కిన్
తారాగణం : సచిన్ టెండూల్కర్, అంజలీ టెండూల్కర్, సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్, అజిత్ టెండూల్కర్, మయూర్ మోరే,  అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, హర్షా భోగ్లే తదితరులు.
రచన : జేమ్స్  ఎర్ స్కిన్ - శివకుమార్అనంత్,  సంగీతం: ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : క్రిస్ ఓపెన్ షా, ఎడిటింగ్ : దీపా భాటియా, అవధేశ్ మోహ్లా,
బ్యానర్ : 200 నాట్అవుట్ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్, నిర్మాత : రవి బగ్ చంద్కా  
విడుదల : మే 26, 2017
***
          మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయంగా క్రికెట్ ప్రపంచానికి సంభవించిన ఒక అరుదైన క్రీడాకారుడే. ఒక తరానికి తరం అతణ్ణి అభిమానిస్తూనే ఎదిగింది. మానసికంగా భౌతికంగా అతణ్ణి క్షుణ్ణంగా చదివేసింది. ఇక తెలుసుకోవాల్సిందేమీ లేదు. రిటైర్మెంట్ తో ముగిసిపోయిన  అతడి క్రికెట్ అధ్యాయానికి  అక్రందిస్తూనే వీడ్కోలు చెప్పి విశ్రమించింది. మళ్ళీ తట్టిలేపి,  మీ ఆరాధ్య దైవాన్ని వెండి తెరమీద చూడమంటే చూడ్డాని కేముంటుంది?  ఏమీ వుండదు. తెలిసిపోయే టెంప్లెట్ సినిమా ఎలా వుంటుందో అలా వుంటుంది. పైగా సచిన్ పాత్రలో  బాలీవుడ్ స్టార్ కూడా నటించని బయోగ్రఫీ ఏం బావుంటుంది. సచినే కన్పిస్తూ తనే  ఆటోబయోగ్రఫీ చెప్పుకుంటూంటే ఎంత నీరసంగా వుంటుంది. మొత్తమంతా కలిపి ఒక డాక్యుమెంటరీ డ్రామా (డాక్యూ డ్రామా) లా వుంటే ఏం ఆసక్తి కల్గిస్తుంది...


            ఇంకో పదేళ్ళ తర్వాత ఈ స్పోర్ట్స్ డాక్యూ డ్రామా తీయబోతే ఈ సందేహాలు ఎదురు కావొచ్చు. అప్పటికి మళ్ళీ  ఎదిగి వస్తున్న ఇంకో కొత్త తరానికి సచిన్ తో పెద్దగా అనుబంధం వుండకపోవచ్చు. తరాల అంతరం ఏర్పడొచ్చు. తమ కళ్ళ ముందు ఎదిగి వచ్చిన  ఇంకో క్రీడాకారుడెవరో ‘గాడ్’ అవుతాడు, రోల్ మోడల్ అవుతాడు. గ్లోబలైజేషన్ తెచ్చి పెట్టిన పరిణామాల్లో యువతకి లైవ్ రోల్ మోడల్స్ కావాలి, కిందటి తరం రోల్ మోడల్స్ కాదు. నిన్న మొన్న రిటైరైన  సచిన్ ని ‘గాడ్’ గా చూస్తున్న నేటి తరం, పదేళ్ళ తర్వాత  సచిన్ పట్ల ఇదే భావోద్వేగాలతో వుంటుందని చెప్పలేం. భావోద్వేగాలున్నప్పుడే చరిత్ర చెప్పాలి. సచిన్ చరిత్ర పదేళ్ళ తర్వాత తీరిగ్గా చెప్తే వర్తమాన తరానికీ, భావితరాలకీ ఉపయోగం లేదు. ఈ చరిత్రని మళ్ళీ సినిమా స్టార్ తో చూపిస్తే  కూడా దానికి చారిత్రిక విలువలేదు. సచిన్ తోనే డాక్యూ డ్రామాగా తీస్తే క్రికెట్ కి అదెప్పటికీ పనికొచ్చే కదిలే బొమ్మల రిఫరెన్స్ బుక్ లా వుంటుంది. స్వయంగా సచినే  చెప్తున్న విషయాలతో నమ్మశక్యంగా వుంటుంది. సినిమా స్టార్ తో తీసే ఏ మసాలా స్పోర్ట్స్ మూవీ లేనంత పవర్ఫుల్ గానూ వుంటుంది.  సచిన్ కే పెద్ద స్టార్ డమ్  వున్నప్పుడు ఇంకా వేరే స్టార్ ఎందుకు? 

          1983 వరల్డ్ కప్ ఇండియా గెలవడం చూశాక  పదేళ్ళ సచిన్ కి క్రికెట్ మీద పెరిగిన ఆపేక్ష- 2011 లో స్వయంగా వరల్డ్ కప్ గెలిచే దాకా ఎలా ఒక దీక్షగా మారి చరిత్ర సృష్టించిందో తెలుపుతుందీ  డాక్యూ డ్రామా. అప్పటి బొంబాయిలో సామాన్య మధ్య తరగతి కుటుంబం. తండ్రి రమేష్ టెండూల్కర్ ప్రముఖ మరాఠీ రచయిత. మొదటి భార్యకి ముగ్గురు పిల్లలు. ఆమె చనిపోతే చేసుకున్న రెండో భార్యకి పుట్టిన ఏకైక సంతానం సచిన్. సచిన్ లోని ఆటగాణ్ణి మొదట కనిపెట్టింది అన్న అజిత్తే. పదకొండేళ్ళ వయస్సులో తీసికెళ్ళి ప్రసిద్ధ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కి అప్పజెప్పాడు. ఆయన చేతిలో  రాటుదేలిన సచిన్ 1988 లో బొంబాయిలోనే హారిస్ షీల్డ్ గెలవడంతో పేపర్ల కెక్కాడు. 1989 లో కేవలం  పదహారేళ్ళ వయస్సులో పాకిస్తాన్ తో అంతర్జాతీయ క్రికెట్ లో  తలపడ్డాడు. వీణ్ణెందుకు తీసుకొచ్చారు, వీడేం చేస్తాడు అనుకున్న పాక్ జట్టుకి తడాఖా చూపించి వచ్చాడు. సియాల్ కోట్ ఫైనల్ టెస్ట్ లో వఖార్ యూనిస్ బౌలింగ్ కి ముక్కు పగిలి రక్తం కారుతున్నా  వైద్య సహాయం నిరాకరిస్తూ బ్యాటింగ్ చేశాడు. 

          దీని తర్వాత న్యూజీలాండ్ తో కొనసాగిన అతడి అంతర్జాతీయ క్రికెటింగ్ ప్రపంచ కప్ సాధించేదాకా ఎన్ని ఓడిడుకుల మధ్య గడిచిందో చూపించుకొస్తారు. వృత్తిపరంగా క్రికెటింగ్ ని చూపిస్తూనే, మరో వైపు కుటుంబ జీవితాన్నీ చూపిస్తారు. అంజలితో  ప్రేమ, పెళ్లి, పిల్లలు, సరదాలూ వగైరా.  సచిన్ కంటే అంజలి ఆరేళ్ళు పెద్దది. సచిన్ పదిహేడేళ్ళ వయసులో వున్నప్పుడు చూసి ప్రేమించడం మొదలెట్టింది. నాల్గేళ్ళ తర్వాత తనే అతడి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంది.
***
       కొన్ని వివాదాస్పద అంశాల్ని దాటవేశారు. టీం విజయాలకంటే తన వ్యక్తిగత రికార్డుల్నే హైలైట్ చేసుకునే తత్త్వం, బాల్ టాంపరింగ్ ఉదంతం, యాడ్ ఫిలిమ్స్ సంపాదనపై తను నటుడిగానే తప్ప క్రీడాకారుడిగా యాడ్  ఫిలిమ్స్ చేయలేదని కోర్టు కెక్కడం, పర్మిట్స్ లేకుండా ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేయడం వంటి అనేక వివాదాల్ని పక్కన పెట్టి ఆత్మకథ చెప్పారు. సచిన్ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. మొదటి సారి అయినప్పుడు సీనియర్ అజరుద్దీన్ తో విభేదాలు, ఎడమొహం పెడమొహం– ఒక మాటలో చెప్పి వదిలేశారు- రెండు పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయని. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో అజరుద్దీన్ ప్రస్తావన లేకుండా క్రోంజీ ని చూపిస్తూ క్లుప్తంగా ముగించారు. కెప్టెన్ గా సచిన్ రెండు సార్లూ వైఫల్యం చెందాడని మాత్రం సూటిగానే చెప్పారు. 

          వ్యక్తిగతంగా సచిన్ పురుషాధిక్య భావజాలాన్ని మాత్రం కప్పిపుచ్చ లేకపోయారు. ఇందుకు నిదర్శనంగా భార్యే వుంది గనుక కప్పి పుచ్చడం సాధ్యం కాదు. సచిన్ భార్య అంజలి డాక్టర్. పెళ్ళయ్యాక కుటుంబం కోసం వైద్య వృత్తి మానేస్తానని అంజలి చెప్పినట్టు సచిన్ అంటాడు. తర్వాతి షాట్ లో – మనిద్దర్లో ఎవరో ఒకరు కెరీర్ ని వదులుకోవాలని సచిన్ చెప్పినట్టు అంజలి అంటుంది. తనని ఉద్దేశించి అని వుండడు  సచిన్.  తర్వాతి షాట్ లో సచిన్- నా కలల్ని పూర్తిగా అర్ధం జేసుకునే భార్యే నాకవసరమని అంటాడు. ఆమె వైద్య వృత్తి మానేసి  అతడికి సహకరించే భార్యగా వుండిపోయింది. తన కలలు, తన జీవిత లక్ష్యాలూ తప్ప ఇంట్లో ఇంకెవరి మనోభావాలూ ముఖ్యం కాదన్నట్టున్న  సచిన్  వ్యక్తిత్వం ఇలా బయటపడుతుంది. పాపం అంజలి! 

          గాడ్ లోకూడా వంద లోపాలూ వుంటాయి. అయినా గాడ్ గిరీ కేం అడ్డు కావు. భక్తులు తమ గాడ్ లో  లోపాలెన్నడానికి ఇష్టపడరు.  గాడ్ వెనకాల గాడ్ వల్ల బాధలు పడ్డ వాళ్లున్నా సరే, వాళ్ళని చూడ్డానికి భక్తులు ఇష్టపడరు. ఎవరైనా చూపించబోతే చెండాడుతారు. ఒక రిపోర్టర్ సచిన్ లోని  నెగెటివ్ కోణాన్ని ప్రచురణకిస్తే, పబ్లిక్ మూడ్ ని గౌరవించాలయ్యా అని  ఆ ఎడిటర్ దాన్ని బుట్ట దాఖలు చేసిన లాంటి మీడియా సంగతులు ఇందుకే వింటూంటాం. 

         ‘పబ్లిక్ మూడ్’ తో ‘గాడ్’ అయిన సచిన్ ని ఒక్కోసారి మనం కూడా అభిమానించకుండా వుండలేం. బ్రిటన్లో న్యూ యార్క్ షైర్ టూరుకి సచిన్ కుటుంబ సమేతంగా వెళ్లి ఎంజాయ్ చేసిన దృశ్యాల్ని మరువలేం. అతడి వల్లే  కదా వీళ్ళందరూ ఇంత ఆనందంగా వుంటున్నారు... అతను ఈ కుటుంబానికి ఆనంద ప్రదాత. మనిషి బయట ఎన్ని విజయాలు సాధించనీ, ఇంట్లో ఆనందాలివ్వకపోతే బయటి విజయాలు విజయాలే కావు. సచిన్ నిజంగా ఆ కుటుంబ సభ్యులందరి పాలిట దేవుడే- కాసేపు భార్య విషయం  పక్కన బెడితే. ప్రతీ సినిమాలో ఏదో వొక క్యారక్టరైజేషన్ లోపం లేని హీరో వుండడు కదా?

          చిన్నప్పుడు కూతురితో ఆడుకునే దృశ్యాలు మరో హైలైట్. పెద్దయ్యాక కొడుకుతో కారు దిగే స్టయిలిష్ షాట్ మరొక హైలైట్. సచిన్ ఫిజిక్ కి, డ్రెస్ సెన్స్ కి ఏ స్టారూసాటి రాడు. గోవా పార్టీ ఇంకో అందమైన సన్నివేశం. ఇవన్నీ సచిన్ కి బదులు సినిమా స్టార్ తో తీసి వుంటే  ఏ మాత్రం న్యాయం చేసి వుండేవి కాదు- ఇలా డాక్యూ డ్రామా చేసి ఫస్ట్ హేండ్ స్టోరీ చేసి, సాక్షాత్తూ సచిన్ నే  చూపించడం వల్ల ప్రత్యక్షంగా సచినే  అనుభవమవుతాడు మనకి.

          మ్యాచ్ గెలిచినప్పుడల్లా రిపీటయ్యే సచిన్ షాట్స్ ఎప్పుడూ ఒకేలా వుంటాయి- అతను కేరింతలు కొడుతున్న ప్రేక్షక సందోహం వైపు  చూసి బ్యాట్ వూపడు- తల పైకెత్తి ఆకాశంలోకే చూస్తాడు. కనిపించని శక్తి కేసే అలా  చూస్తాడు. 1999 ప్రపంచ కప్ లో వుండగా తండ్రి మరణ వార్తకి తిరిగి వచ్చి, అంత్యక్రియలు ముగించి తిరిగి వెళ్లినప్పట్నించీ రిటైరయ్యే దాకా అతడి ఆకాశంలోకి చూసే చూపే మారిపోయింది- తండ్రి ఆశీస్సులకోసం తలపైకెత్తి చూస్తాడు. ఇదేమీ బాలీవుడ్ రచయిత కావాలని సృష్టించిన మెలోడ్రామా దృశ్యాలు కావు, వాటి ప్రకారం సచిన్ నటించలేదు- మ్యాచుల్లో వివిధసార్లు కెమెరాలకి చిక్కిన అతడి నిజజీవిత భావావేశాలే.  

          అపజయాలతో అతను  అంతర్ముఖీనుడవుతాడు. అప్పుడు ఒకే పాట లూప్ లో పెట్టి  రోజంతా వింటాడు. అది బప్పీ లహరీ పాడిన ‘యాద్  ఆరహా హై’ విరహ గీతం. విచిత్రమేమిటంటే, సచిన్ తండ్రి తాను అభిమానించే సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ పేరు లోంచి సచిన్ తీసి సచిన్ కి పెట్టాడు. సచిన్ బప్పీ లహరీ వైపు వెళ్ళిపోయాడు. ఈ  పాట సాహిత్యపరంగా మంచిదే-  బప్పీ గళ మహాత్మ్యం. అయితే దీని బీటే  వీక్, టపోరీ పాటలా వుంటుంది (
కిషోర్ కుమార్ పాటల మధ్య ఎన్నాళ్ళ నించో స్మార్ట్ ఫోన్లో  ఈ పాట ఇరుక్కుని వుంటే చిరాకొచ్చి మొన్నే  డిలీట్ చేసేశాడు ఈ వ్యాసకర్త!).
***
      ఈ డాక్యూ డ్రామాని  పాత ఫోటోలు, ఫ్యామిలీ వీడియోలూ, ఉద్వేగభరిత క్రికెట్ మ్యాచుల ఫుటేజీల ఆధారంగా ఆసక్తికరంగా రూపొందించారు. ఆద్యంతం అవసరమైన చోటల్లా సచిన్ స్వగతంలో సాగుతుంది. సచిన్ తెర పైకొచ్చి తన కథ తనే చెబుతూంటే ఇంటర్ కట్స్ లో దాని తాలూకు పై ఫార్మాట్స్ లోగల దృశ్యాలు తెరపైకి వస్తూంటాయి. ఈ కథనం కూడా నాన్ లీనియర్ గా వుంటుంది. చెబుతున్నదంతా ఫ్లాష్ బ్యాక్సే  అయినా, ఆ ఫ్లాష్ బ్యాక్స్  ఒక క్రమంలో సాగవు. అపక్రమ పద్ధతిలో కాలం ముందుకూ వెనక్కీ కదుల్తూంటుంది. మధ్యమధ్యలో సునీల్ గవాస్కర్, వివియన్ రిచర్డ్స్, విరాట్ కోహ్లీ, అజిత్ టెండూల్కర్, అంజలీ టెండూల్కర్ ల వ్యాఖ్యానాలు  కూడా వస్తూంటాయి. కామెంటేటర్ హర్షా భోగ్లే, ఇంకో జర్నలిస్టు వ్యాఖ్యానాలు కూడా వుంటాయి. వ్యాఖ్యాతలుగా ఇందరు క్రీడాకారుల మధ్య క్రీడా కారుడుకాని అమితాబ్ బచ్చన్ వుండడమే సింక్ కాదు. 

          గత సంవత్సరం ఇమ్రాన్ హాష్మీ నటించిన  ‘అజర్’ విడుదలయింది. కానీ ఇది అజరుద్దీన్ కథ కాదని ముందే చెప్పేశారు. ఇది కాల్పనిక చరిత్ర అనీ  అజరుద్దీన్ తో సంబంధం లేదనీ చెబుతూ ఒక స్పోర్ట్స్ థ్రిల్లర్ లా తీశారు. గత సంవత్సరమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో  ‘ఎం ఎస్ ధోనీ : ది అన్ టోల్డ్ స్టోరీ’ తీశారు. ఈ రెండూ నటుల చేత నటింప జేసిన క్రికెట్  సినిమాలు. కానీ సచిన్ డాక్యు డ్రామా విషయానికొస్తే – సచిన్ పిచ్ లో లైవ్  యాక్షన్ లో  వున్నప్పుడు, ఇంట్లో- బయటా కుటుంబంతో గడిపినప్పుడూ క్యాచ్ చేసిన రియల్ లైఫ్ దృశ్యాలే. ఆ ఫీలింగ్స్ , ఎమోషన్స్, యాక్షన్ ప్రతీదీ నిజ జీవితంలో పట్టుకున్నవే. ఇందులో సచిన్ ని సచిన్ లా వున్నదున్నట్టు చూపిస్తే,  పై రెండు సినిమాల్లో ఫిక్షన్ చేసి నటుల చేత నటింపజేశారు. సచిన్ ఫస్ట్ హేండ్ ఇన్ఫర్మేషన్ అయితే, పై రెండూ సెకండ్ హేండ్ ఇంఫర్మేషన్స్ . ఇదీ తేడా. 

          ఉన్న పాత బొమ్మల్నే పేర్చి డాక్యుమెంటరీ చూపిస్తే న్యూస్ రీలులా ఏం ఆసక్తి కల్గిస్తుందనే వాళ్లకి దీని ఎడిటర్స్ వాళ్ళ పనితనంతోనే సమాధానం చెప్తారు. ఒక డాక్యుమెంటరీ చూస్తున్నట్టు ఎడిటింగ్ వుండక పోవడమనేది సామాన్య విషయం  కాదు. కథనం లో ఒక లయని మెయింటెయిన్ చేశారు. ఒక క్లిప్పింగ్ కీ ఇంకో క్లిప్పింగ్ కీ మధ్య జంప్స్ లేకుండా స్మూత్ ట్రాన్సి షన్స్  సృష్టించారు. చిన్నప్పుడు మొదలైతే రిటైర్మెంట్ వరకూ స్టోరీ బోర్డు వొక అమర్ చిత్ర కథలా సాగిపోతుంది.
***
     దీన్ని బ్రిటిష్ దర్శకుడే వచ్చి  ఎందుకు రూపొందించినట్టు? ఎందుకంటే దేశీయ దర్శకులైతే  సచిన్ తో మొహమాటాలకు పోతారని, నిష్పాక్షికంగా చూపించరని నిర్మాత నమ్మడం వల్ల.  బ్రిటిష్ స్పోర్ట్స్ సినిమాల దర్శకుడు జేమ్స్  ఎర్ స్కిన్ దీన్ని చేపట్టి నాల్గేళ్ళల్లో పూర్తి చేశాడు. ఇందులో కొన్ని దృశ్యాల్లో కన్పించడానికి అంజలిని ఒప్పించడా నికే రెండేళ్ళు పట్టింది. సచిన్ కథకి ఒక స్ట్రక్చర్ కోసం వేల కొద్దీ భద్రపరచిన ఫోటోలూ, వీడియోలూ, స్పోర్ట్స్ కవరేజీలూ చూశాడు. సచిన్ సన్నిహితులెందరితోనో మాట్లాడి సచిన్ ని సంపూర్ణంగా దర్శించాడు. అతడి దృష్టిలో స్పోర్ట్స్ సినిమా అంటే కేవలం క్రీడాకారుడి సంఘర్షణ, విజయాలూ ఇదే కాదు; క్రీడలు కల్చర్ తో ఎక్కడ ఎలా స్పర్శిస్తున్నాయో హైలైట్  చేసేదే స్పోర్ట్స్ సినిమా. అలాగే సచిన్ కథ చెప్పాలంటే ఒక డ్రైవింగ్ పాయింటు వుండాలి. ఆ డ్రైవింగ్ పాయింటు వరల్డ్ కప్పేనని భావించి సచిన్ కి చెప్తే, తన స్వప్నం వరల్డ్ కప్ సాధించడమే నని  సచిన్ కూడా  చెప్పాడు. ఈ గోల్ ఆధారంగా కథనం చేశాడు దర్శకుడు. జీవిత చరిత్రలు తీయాలంటే మూల కేంద్రం ఒకటి వుండాలి- అది ఆ వ్యక్తి  జీవిత ధ్యేయం కాక మరొకటై వుండే అవకాశం లేదు.  

       దర్శకుడు జేమ్స్  ఎర్ స్కిన్ డాక్యూ డ్రామాని కళాఖండంగా మార్చేశాడు. సచిన్ గురించి కేవలం ఒక సమగ్ర సమచాహర భాండాగారంగా కాక, ఎమోషనల్ ప్రయాణంగా తీర్చిదిద్దాడు. చిట్ట చివర్లో 2013 లో వాంఖడే  స్టేడియంలో లక్షలాది అభిమానుల మధ్య అతడి రిటైర్మెంట్ స్పీచ్ తో ముగింపు దర్శకుడి మాస్టర్ స్ట్రోక్ సన్నివేశం. బరువెక్కిన హృదయాలతో థియేటర్ల  లోంచి రాక తప్పదు ప్రేక్షకులు. ఫైనల్ షాట్ గా భారత రత్న స్వీకరణ.

          రిచర్డ్ అటెన్ బరో తీసిన ‘గాంధీ’ ఎలాటి భక్తి పారవశ్యానికి లోనుజేస్తుందో  అలాటిదే భావోద్వేగం ‘సచిన్’ కల్గిస్తుంది. ‘గాంధీ’ ని తీయడానికి బ్రిటన్ నుంచి అటెన్ బరో వస్తే, బ్రిటన్ నుంచే ‘సచిన్’ ని తీయడానికి ఎర్ స్కిన్ వచ్చాడు. మరో ‘గాంధీ’ ని తీయలేనట్టే, ‘సచిన్’ ని అజరామరం చేసి పెట్టాడు ఎర్ స్కిన్. లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురించి ఇంతకంటే లెజండరీ మూవీ వుండబోదు. ఏఆర్ రెహ్మాన్ స్వరాలు కూడా చుట్టూ దడి కట్టేశాయి.

-సికిందర్ 
http://www.cinemabazaar.in