రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, October 12, 2016

రివ్యూ!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ప్రకాష్ రాజ్

తారాగణం : ప్రకాష్‌రాజ్‌, ప్రియమణి, సత్యదేవ్‌, పృథ్విరాజ్‌, అచ్యుత్‌కుమార్‌, రంగాయన రఘు, రఘుబాబు తదితరులు
కథ : జాయ్ మాథ్యూ, మాటలు : గోపిశెట్టి రమణ- ప్రకాష్ రాజ్, సంగీతం
: ఇళయరాజా
ఛాయాగ్రహణం : ముఖేష్
బ్యానర్ : ప్రకాష్రాజ్ ప్రొడక్షన్
, ఫస్ట్కాపీ పిక్చర్స్
నిర్మాతలు
:  రామ్జీ నరసింహన్, ప్రకాష్రాజ్
విడుదల : 7 అక్టోబర్, 2016
***
     ధోని, ఉలవచారు బిర్యానీ  వంటి సమాంతర సినిమాలకు దర్శకత్వం వహించి తన అభిరుచిని చాటుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చాటుతూ ముందు కొచ్చారు. ‘మన ఊరి రామాయణం’ దర్శకుడుగా ఆయన మూడో రీమేక్. ఇతర భాషల్లో తనకి  నచ్చిన ఉత్తమ సినిమాల్ని రీమేక్ చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్, ఈసారి  కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకి సవాలు విసురుతూ కమర్షియలేతర సినిమా తీశారు. ఒక సినిమాని పాటలు, ప్రేమలు, డాన్సులు, ఫైట్లు, కామెడీలూ లేకుండా చూడలేనంత మొద్దుబారిపోయి వున్నామా మనం నిజంగా- లేకపోతే పలాయనవాదంతో అలా నటిస్తున్నామా? నిజంగా ఇవేవీ లేని ఒక పవర్ఫుల్ కమర్షియలేతర సినిమాని చూడలేమా తెలుగులో? సినిమా అక్షరాస్యతా రేఖకి  అంత దిగువకి జారిపోయి క్షణికానందం కోసం ఉత్త కాలక్షేప సినిమాలు చూస్తూ జీవితాలు చాలించుకోవడానికేనా ఈ  జన్మ? చూసే సినిమాలు అధమంగా  వుండాలనుకున్నప్పుడు, కొనే సెల్ ఫోన్లు కూడా అధమంగానే  వుండాలిగా? అనవసరంగా ఈ హిపోక్రసీ  ‘మన ఊరి రామాయణం’ లాంటి సినిమాల్ని చంపేస్తోంది. కానీ ఈ సినిమా ముందు కమర్షియల్ సినిమాలు కూడా బలాదూర్  అనేందుకు కట్టి పడేసే  అంశాలు ఎలా వుండాలో అలా వుండి – ఏ సినిమా అయినా ఇలా కదా వుండాల్సింది అన్న ఎవేర్నెస్ తో బయటి కొస్తారు ప్రేక్షకులు.

కథ 
      దుబాయ్ లో బాగా డబ్బు సంపాదించుకుని సొంతూరు వస్తాడు భుజంగయ్య (ప్రకాష్ రాజ్).  ఊళ్ళో భార్య, అత్తా, ఇద్దరు కూతుళ్ళూ వుంటారు. బయట డబ్బు మదంతో, ఇంట్లో అడ్డమైన పెత్తనంతో ఎవర్నీ నోరెత్త నివ్వకుండా ఇష్టారాజ్యంగా బతికేస్తూంటాడు. చేసే పనేం లేదు. సాయంత్రం కాగానే తన ఇగోని సంతృప్తి పర్చుకుంటూ నేస్తాలకి మందు పోసి పొగడ్తలు విని తరించడమే. ఇంటి కాంపౌండు నానుకుని రోడ్డు మీదికి ఓ షాపు తన సొంతానిది. దాన్ని అద్దెకివ్వకుండా సాయంకాలాలు పానశాలగా మార్చడమే. దుబాయ్ కి వెళ్ళక ముందు ప్రతీ శ్రీరామ నవమికి రావణుడి వేషం వేసేవాడట. ఇప్పుడు నవమి వచ్చింది. ఆ ఉత్సవాలు డబ్బు ఖర్చుపెట్టి భారీగా నిర్వహిస్తూంటాడు. ఆ ఉత్సవాల్లో భాగంగా తను  రావణాసురుడి వేషం వెయ్య బోతున్నాడు.  ఆ రాక్షసత్వం ఇప్పుడు ఇంట్లో కూడా ప్రదర్శిస్తూ పెద్ద కూతుర్ని డిగ్రీ చదువుకో నివ్వడు. ఎందుకంటే కాలేజీ పేరుతో  ఆమె బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోందని అనుమానం, కాబట్టి కాలేజీ మాన్పించేసి పెళ్లి చేసేస్తానంటాడు. ఒక రోజు ఇంట్లో మాటామాటా పెరిగి ఉక్రోషంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. వూళ్ళో తనకి నమ్మిన బంటు ఒకడు వుంటాడు- శివ (సత్యదేవ్) అనే ఆటో డ్రైవర్. వీడికి దుబాయ్ వెళ్లేందుకు వీసా ఇప్పిస్తానని వెంట తిప్పుకుంటూంటాడు. ఆ రాత్రి షాపులో మందు భాయీలతో మందేసుకుని శివ ఆటో ఎక్కి ఎక్కడికో బయల్దేర తాడు భుజంగయ్య. బయల్దేరుతోంటే రోడ్డుపక్క అమ్మాయి కన్పిస్తుంది. ఆమెనేసుకోవాలన్పించి శివని  పంపిస్తాడు. సుశీల (ప్రియమణి) అనే ఆ వేశ్యని మాట్లాడి శివ పట్టుకొస్తాడు. వాళ్ళు కులకడానికి షాపులోకి తోసి తాళం వేసుకుని, ఫుడ్డు తీసుకుని గంటలో వస్తానని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వాడు ఇక రాడు.  

        ఈ రాకపోవడమే భుజంగయ్య కొంపలు ముంచుతుంది. రాత్రంతా వేశ్యతో షాపులో ఇరుక్కుని, ఏ సమయంలో ఏం జరుగుతుందో, తెల్లారితే ఇదెక్కడ బయటపడి ఇంటా బయటా పరువుపోతుందో, తనేమై పోతాడో - అని క్షణం క్షణం ప్రాణాలరజేతిలో బెట్టుకుని నానా చావూ చస్తాడు. 

       భుజంగయ్య ఈ రొంపి లోంచి ఎలా బయట పడ్డాడు, చిట్ట చివరికి తాళం ఎవరు తీశారు, అప్పుడు ఎవరికి తను దొరికిపోయాడు, దొరికిపోతే ఏం జరిగిందనేది అడుగడుగునా సస్పెన్స్ తో కట్టి పడేసే కథ.

ఎలావుంది కథ 
     2012 లో జాయ్ మాథ్యూస్ అనే కొత్త దర్శకుడు తీసిన ‘షటర్’  అనే మలయాళ  సినిమాకి రీమేక్ ఇది. మలయాళ ఒరిజినల్ కేవలం సస్పెన్స్ థ్రిల్లరే అయితే, తెలుగులో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనే బంగారు పళ్ళేనికి  మరింత డెప్త్ తీసుకొస్తూ రామాయణంతో పౌరాణిక గోడ చేర్పు ఇచ్చారు. బాపూ రమణలు ఆ పైన వుంటే అక్కడ్నించీ  ప్రకాష్ రాజ్ కి అభినందన సందేశం పంపుతారు- రామాయణాన్ని ఇలా కూడా తీస్తావటయ్యా భలేవాడివి- అని. 1979 లో దాసరి నారాయణ రావు అక్కినేని నాగేశ్వర రావుతో ‘రాముడే రావణుడైతే’ తీశారు. కానీ రావణుడే రాముడైతే? ఇదే ఈ కథ. రావణుడు రాముడిగా మారే కథ. ఒక నోరు తిరగని పేరుతో పోలెండ్ దర్శకుడున్నాడు- స్ట్రిస్టాఫ్ కీష్ లాస్కీ అని. ఇంగ్లీషులో స్పెల్లింగ్ ఇలా వుంటుందిKrzysztof Kieslowski  అనిఈయన 1989లో ‘టెన్ కమాండ్ మెంట్స్’ ని ఆధారంగా తీసుకుని ‘డెకలాగ్’ అనే పది నీతికథల టెలిఫిలిమ్స్ తీశాడు. అవన్నీ ఒకే అపార్ట్ మెంట్ లో జరుగుతాయి. అలా వేశ్యతో ఒక షాపులో ఇరుక్కున్న  రావణుడి నీతి కథే ఇది. మనిషిలో రాముడు రావణుడు ఇద్దరూ వుంటారు. ఇంకో తన బలమెంతో తెలియని హనుమంతుడూ వుంటాడు. అలాగే సీతలా  కన్పించే అమ్మాయి సీత కాకపోవచ్చు- శూర్పణక అయివుండవచ్చు. ఇవన్నీ కలిపి ఒక సస్పెన్స్ రామాయణం ఈ కథ. మలయాళ ఒరిజినల్ దర్శకుడు తన కథని ‘పొయెటికల్ వయొలెన్స్ ఆన్ సెల్యూలాయిడ్’ అన్నాడు. ఇది తెలుగుకీ వర్తిస్తుంది.
ఎవరెలా చేశారు
 
     ప్రకాష్ రాజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంత రావణుడైనా వాడు కుక్కిన పేనయ్యే రోజొకటి వస్తుంది. వేశ్యతో ఇరుక్కున్న ఈ పరిస్థితిని అద్వితీయంగా పోషించాడు. చాలా క్లిష్ట పాత్ర ఇది. పాత్రలోకి మనల్ని లీనం చేసి వదలకుండా తనతో తీసుకుపోతాడు. క్షణం క్షణం మారిపోయే పరిస్థితులకి అంతకంతకూ పెరిగిపోయే భావోద్వేగాల తీవ్రతని కంటిన్యుటీ చెడకుండా పకడ్బందీగా నటించాడు. షాపు వెనకాలే ఇంట్లో భార్యా పిల్లలున్నారు, షాపులో వేశ్యతో తను వున్నాడు. తాగిన మత్తులో వేశ్యని కోరుకున్నాడు, తీరా ఆమెకిదగ్గర కాలేకపోతున్నాడు. అలాటి తత్త్వం కాదు తనది. ఇంట్లోభార్యని నోరెత్తకుండా చేసే తను ఇప్పుడు వేశ్య ఏరా పోరా అంటున్నా కిక్కురుమనడంలేదు. తాళం వేసుకుపోయిన శివ ఎంతకీ రాకపోయేసరికి భయం- పరువు ప్రతిష్టలగురించి భయం పట్టుకుంది. పైగా పక్క షాపు వాడికి తన షాపు అద్దె కివ్వననేసరికి వాడు కోపం పెంచుకున్నాడు. ఇప్పుడు షాపులో ఏ మాత్రం అలికిడి అయినా వాడొచ్చే  ప్రమాదముంది. కానీ ఈ దిక్కుమాలిన వేశ్య సెల్ ఫోన్ కి మాటిమాటికీ కస్టమర్స్ నుంచి కాల్స్ రావడం, ఆమె పెంకెగా అరిచి మాట్లాడడం ప్రాణాల్ని తోడేస్తోంది...ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడి క్షోభ అంతా ఇంతా కాదు. ఇదంతా ప్రకాష్ రాజ్ నటనతో అడుగడుగునా ఊపిరి బిగబట్టి చూడాల్సిన ఉత్కంఠని రేపుతాయి. అంత తేలిగ్గా మర్చిపోలేం ఈ పాత్రలోప్రకాష్ రాజ్ ని.

         ప్రియమణి కూడా వేశ్య చేష్టల్ని చాలా నేర్పుగా నటించింది. ఎంత సేపూ తన గొడవే గానీ అవతలి వాడి ఏడ్పు ఏమాత్రం పట్టని పాత్ర చిత్రణతో తను సృష్టించే సమస్యలు ఇన్నీ అన్నీ కావు- పరువు గురించి వీడికి భయముంటే తనకేంటన్నవేశ్య సహజ నిర్లక్ష్యంతో హడలెత్తించేస్తుంది. దాదాపు ముప్పావు కథ ఈ జగమొండి తనంతోనే సాగేక, అప్పుడు తెల్లారి వెంటిలేటర్ లోంచి అవతల ఇంట్లో అతడి భార్యా పిల్లల్ని చూసినప్పుడు, మెత్తబడి మొట్టి కాయలేయడం మొదలెడుతుంది అతడి పాడు బుద్ధికి. తను కూడా మానవత్వం నేర్చుకుని హూందాతనం ప్రదర్శిస్తుంది. ప్రియమణి కూడా గుర్తుండిపోతుంది ఈ పాత్రతో.

         ఇక సత్యదేవ్ గురించి. తెలుగు వాడైన ఇతను పూరీ జగన్నాథ్ తీసిన ‘జ్యోతిలక్ష్మి’ తో పరిచయమయ్యాడు. ఆ సినిమాలో సినిమాలో వేశ్యతోనే, ఈ సినిమాలోనూ వేశ్యతోనే. భుజంగయ్య తనకి రాముడు లాంటి వాడు. తను హనుమంతుడు. కానీ వాళ్ళిద్దర్నీ  షాపులోకి తోసి తాళం వేసుకుని ఫుడ్డు కోసంవెళ్ళిన వాడు ఎక్కడెక్కడో ఇరుక్కుంటాడు- ఏమేమో చేస్తాడు- ఎక్కడెక్కడో తిరుగుతాడు. తెల్లరిపోయాక నడిబజార్లో తాళం తీసే అవకాశం లేక గురువు గారి కోసం తల్లడిల్లిపోతాడు- ఈ ఆటో డ్రైవర్ క్యారక్టర్లో సత్యదేవ్ కూడా అత్యంత సహజంగా నటించాడు. 

            పృథ్వీ ది చాలా సర్ప్రైజ్ అప్పీయరెన్స్. రొటీనై పోయిన తన ఓవరాక్షన్ పేరడీల, డైలాగుల జడివానలోంచి ఓ తొలకరితో కొత్తదనానికి నాట్లు వేశాడు. ఒక స్ట్రగుల్ చేసే సినిమా దర్శకుడిగా మామూలు చొక్కా ప్యాంటు వేసుకుని,  సామాన్యుడిలా ఆటోల్లో తిరుగుతూ, తగ్గి మాట్లాడుతూ, పోగొట్టుకున్న స్క్రిప్టు వెతుక్కునే పాత్రలో పృథ్వీ జస్ట్ ది బెస్ట్. 

        ఇక ఇలాటి కథ వున్న సినిమాతో ఇళయరాజా గురించి చెప్పేదేముంది- ఆయనకి మరో మౌనరాగమో మరోటో దొరికినట్టే. తన సంగీత సారమంతా కథలోకి దింపేశారు. అలాగే కెమెరా మాన్ ముఖేష్ ఒక ఆర్ట్ వర్క్ లా చిత్రీకరణ చేశాడు. అంత ప్రధాన పాత్రలో నటిస్తూ కూడా ప్రకాష్ రాజ్ కనబర్చిన దర్శకత్వపు మెళకువలు- షాట్స్ తీయడంలో నేర్పు విజువల్ మీడియా మీద తనకున్న పట్టు ఏమిటో తెలియజేస్తాయి. ఏ నటీనటులూ కూడా ఆయన దర్శకత్వంలో అసహజంగా కన్పించరు. 

స్క్రీన్ ప్లే సంగతులు
    చాలా గర్వించాల్సిన విషయమేమిటంటే, తెలుగు సినిమాల్లో శాస్త్రీయ స్క్రీన్ ప్లేల  కోసం కళ్ళుకాయలు  చేసుకునే  సినిమా అక్షరాస్యులకి ఈ స్క్రీన్ ప్లే ఓ స్వీట్ కార్న్. పాప్ కార్న్ కాదు. పాప్ కార్న్ స్క్రీన్ ప్లే- సినిమాల పని అయిపోయింది- నూటికి తొంభై శాతం ఇంకా అట్టర్ ఫ్లాపులే- లేదా వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాపులే. స్వీట్ కార్న్ అమెరికా నుంచి దిగుమతి అయ్యింది. శాస్త్రీయ స్క్రీన్ ప్లే కూడా అమెరికా తయారీయే. ఇది మనది కాదని పాప్ కార్న్ స్క్రీన్ ప్లేలతో పిల్లలాట ఆడుకునే వాళ్ళకి ‘మన ఊరి రామాయణం’ గట్టి ఝలక్ ఇస్తుంది. 

        1. త్రీయాక్ట్ స్ట్రక్చర్, 2. గోల్ ఎలిమెంట్స్, 3. క్యారక్టర్ ఆర్క్, 4. టైం అండ్ టెన్షన్, 5.ప్లాట్ డివైస్, 6. కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే, ఇగో జర్నీ, 7. ఇగో మెచ్యూర్డ్ ఇగోగా మారే ముగింపు...మొత్తంగా 8). ఒక సైకో థెరఫీ!

        త్రీయాక్ట్ స్ట్రక్చర్ : రెండు గంటల నిడివి గల ఈ స్క్రీన్ ప్లేలో బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు ప్రామాణిక టైమింగ్ తోవున్నాయి. మొదటి అరగంటలో బిగినింగ్ విభాగం ముగుస్తుంది. ఈ బిగినింగ్ లో పాత్రల పరిచయం, కథ ఏ బాపతో తెలిపే నేపధ్య వాతావరణ కల్పన, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య - ప్లాట్ పాయింట్ వన్ తో ఆ సాధించాల్సిన సమస్య ఏర్పాటు.

        భుజంగయ్య పాత్ర ద్వారానే ఈ బిగినింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ పోతాయి. టైటిల్స్ పడిన తర్వాత ప్రారంభమే అతను  బైక్ మీద వస్తూ (తర్వాత ఈ బైక్ కన్పించక పోవడం కథా సౌలభ్యం కోసం పాల్పడిన అనౌచిత్యమే. అతను ఈ బైక్ మీదే తిరిగితే అన్ని కష్టాల్లో పడేవాడు కాదు) ఓ షాపు దగ్గర ఇంకో షాపు వాడితో డిస్కషన్ పెట్టుకుని షాపు అద్దెకివ్వననండంతో, అతడికో ఖాళీ షాపు వుందని మనకర్ధమవుతుంది. ఇదే షాపు తాగుడుకి వాడుకోడం, ఇదే షాపు కీలక కేంద్రంగా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర వేశ్యతో ఇరుక్కోవడం...ఇలా షాపుతో ఈ కథ మొదలెట్టడంలో  మనకి అర్ధమవుతుంది. ఏ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏది కీలక పాత్ర వహిస్తుందో, దాంతోనే మనకి తెలీకుండా కథ మొదలెట్టడం తెలివైన కథాపథకం. 

         వూళ్ళో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వాతావరణమంతా ఎస్టాబ్లిష్ అవుతూ వుంటుంది. దీనికి ఉదారంగా విరాళాలిస్తున్న భుజంగయ్య దుబాయ్ లో భారీగా సంపాదించుకు వచ్చాడని మాటల్లో మనకి తెలుస్తుంది. దీనికి తగ్గట్టు  వొంటి మీద బంగారు గొలుసులు, వేళ్ళకి ఉంగరాలు, చేతులకి కంకణాలు, జేబులో పాకెట్ లో పుల్ మనీతో, సిల్కు దుస్తుల్లో  కళకళ లాడుతూ వుంటాడు. ఇంతేకాదు, ఈ సందర్భంగా భుజంగయ్యకి కళాపోషణ కూడా వుందని అర్ధమవుతుంది- ఉత్సవాల్లో రావణ పాత్ర పోషించాలన్న అతడి అభిలాషతో. ఈ అభిలాష ఇంట్లో అతడిలోని రావణుణ్ణి ప్రత్యక్షం చేసి చూపిస్తుంది. భుజంగయ్య ఇంట్లో మర్యాదలేని రాక్షసుడుయితే, బయట గౌరవనీయుడైన రావణుడు. ఇంట్లో భార్య, అత్తా, పెద్ద కూతురు, చిన్న కూతురూ  పరిచయమవుతారు. వీళ్ళని రాచి రంపాన పెడుతూంటాడు ఆడవాళ్ళన్న దయ- వీళ్ళే తనకి దిక్కూ అన్న ఆలోచన కూడా లేకుండా.   

        ఈ ప్రారంభ దృశ్యాల్లోనే ఇంకొకటి ఎస్టాబ్లిష్ అవుతూంటుంది. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన. పెద్ద కూతురి సెల్ కి  మెసేజ్ వస్తే సంస్కారం లేకుండా తీసి చూస్తాడు. ఎవడో బాయ్ ఫ్రెండ్ వున్నాడని కేకలేయడం మొదలెడతాడు. కూతుర్ని కాలేజీ  మాన్పించేస్తాడు. పెళ్లి చేసేయాలని సిద్ధమై పోతాడు భార్యా అత్తా కూడా వ్యతిరేకించినా. 

        బయట భుజంగయ్య నమ్మిన బంటుగా ఆటో డ్రయివర్ శివ పరిచయమవుతాడు కథకి. దుబాయ్ వెళ్ళడానికి  భుజంగయ్య వీసా ఇప్పిస్తాడని  నమ్మి భుజంగయ్య పనులన్నీ చేసి పెడుతూంటాడు. అలాగే ఊళ్లోకి దిగిన సినిమా దర్శకుడు గరుడ(పృథ్వీ) కూడా పరిచయమవుతాడు కథకి. 

        ఇలా సెటప్ సిద్ధమయ్యాక, కూతురి గురించి మళ్ళీ నానా రభస చేసి వొళ్ళు మండి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు భుజంగయ్య. ఈ వెళ్ళడం సింబాలిక్ గా రాముడు అరణ్య వాసానికి వెళ్ళినట్టే. ఇక రామాయణం ప్రారంభమైనట్టే. కాకపోతే ఇక్కడ రావణుడు వెళ్తున్నాడు. వెళ్లి షాపులో నేస్తాలతో మందు కొట్టి అర్ధరాత్రి బయటి కొచ్చి శివ ఆటో ఎక్కుతాడు. ఈ ఆటోలో పోతున్నప్పుడు రోడ్డు పక్క నిలబడి కన్పిస్తుంది సుశీల. ఒక కొత్త పాత్రతో ప్లాట్ పాయింట్ వన్ ని స్పష్టంగా కొట్టొచ్చినట్టూ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక షాపులో ఆమెతో బందీ అయిపోవడంతో బిగినింగ్ విభాగం ముగుస్తుంది.

     ఇలా వరసగా బిగినింగ్ విభాగంలో పైన చెప్పుకున్న నాల్గు ఎలిమెంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి.  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర భుజంగయ్యకున్న  గోల్ ఇక ఆ షాపులోంచి-వేశ్యతో ఆ పరిస్థితి నుంచి  బయట పడడమే. ఈ షాపులో ఇరుక్కోవడం ద్వారా అతడి గోల్ ఎలిమెంట్స్  1. కోరిక- అనేది అతను షాపులోంచి బయట పడాలనుకోవడంలో వుంది, 2. పణం - అనేది తన పరువు రిస్కులో పడేసుకుంటూ వేశ్యలో జతకూడడం ద్వారా పెట్టాడు.  3. పరిణామాల హెచ్చరిక అనేది- పరువు పోవడంతోబాటు కూతురి పెళ్లికే ఎసరు వచ్చేలా వుంది, 4. ఎమోషన్ - ఈ మూడూ తలచుకుంటే యాదృచ్చికంగా బలంగా ఎమోషన్ తన్నుకొస్తోంది.  

        ఇలా ప్లాట్ పాయింట్ వన్ సశాస్త్రీయంగా ఎస్టాబ్లిష్ అయ్యాక, దీని నేపధ్యంలో ఇప్పుడు మిడిల్ విభాగంలోకి వెళ్తోంది కథ. మిడిల్  అంటే కథలో యాభై శాతం వుండాల్సిన కదన రంగం. జేమ్స్ బానెట్ ని మనం ఇక్కడ దర్శించుకుంటే- ఆయన ప్రకారం స్క్రీన్ ప్లేలో మిడిల్ అంటే మన సబ్ కాన్షస్ మైండ్, బిగినింగ్ అంటే మన కాన్షస్ మైండ్. కథ మిడిల్లోకి వెళ్ళడమంటే కాన్షస్ మైండ్ సబ్ కాన్షస్ తో తలపడ్డమే. మన కాన్షస్ మైండ్ కి సారధి మన ఇగో. సినిమా హీరో అంటే మన ఇగోకి సింబలే. అంటే కాన్షస్ మైండ్ ని మజాగా ఏలుకుంటున్న ఇగో ఇక తనకి తెలీని, దిగితే  ఏం జరుగుతుందో వూహించలేని, సబ్ కాన్షస్ మైండ్ లోకి (మిడిల్ లోకి) దూకేస్తుందన్న మాట.

        ఇలా భుజంగయ్య వేశ్య అనే గాలానికి చిక్కి, సబ్ కాన్షస్ మైండ్ కి సింబల్ గా వున్న  షాపులోకి దూకేశాడు. సబ్ కాన్షస్ లోకి ఇగో దూకేక ఏమవుతుంది? అక్కడ తన అస్తిత్వం  కోసం పోరాడుతుంది. మనసు చీకటి కోణాల్లో దాగి వుండే భయాలనే నెగెటివ్ శక్తులతో పోరాడుతుంది. అజ్ఞానమనే అడ్డుగోడల్ని కూల్చేస్తుంది. నగ్నసత్యాల్ని తెలుసుకుంటుంది. పరమ సత్యాన్ని గ్రహిస్తుంది. మోక్షం పొంది అలా కాదు, నేనిలా అర్ధవంతంగా జీవించాలనుకుని, మెచ్యూర్డ్ ఇగోగా మారి ఒడ్డున పడుతుంది. అడ్డగోలు ఇగో కాస్తా పునీతమై మెచ్యూర్డ్ ఇగోగా అవతరిస్తుందన్న మాట. ఇది మానసికంగా మనం నిత్యం అనుభవించే ఆవస్థే. వెండితెర మీద సినిమాలో బొమ్మల కదలిక అంటే మన మానసిక ప్రపంచంలో మనం ఆడుకునే ఆటే (కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే). సినిమా కథనే కాదు. ఏ కథ లక్ష్యమైనా  ఇదే- పాత్రని ఇగో నుంచి మెచ్యూర్డ్ ఇగోగా మార్చడం. 

        భుజంగయ్య పాత్ర కూడా బందీ అయిపోయిన ఆ గదిలో ఈ పాట్లన్నీ పడుతుంది. ఆ షాపు గదిలో ఒక్కో సంఘటన అతడిలోని ఒక్కో రావణ (ఇగో) గర్వాన్ని పటాపంచలు చేస్తూపోతుంది. మనిషి ఏదైనా కోల్పోతాడు గానీ పరువు కోల్పోవడానికి సిద్ధ పడడు. కానీ తనకి గొప్ప పరువు ప్రతిష్ట లున్నాయని విర్రవీగి ప్రవర్తిస్తే, ఆ పరువు ప్రతిష్టలేప్రమడంలో పడే  పరిస్థితి వస్తుంది. అప్పుడు బుద్ధి తెచ్చుకుని ప్రవర్తన మార్చుకుంటాడే తప్ప, ప్రాణాల కంటే ఎక్కువైన పరువు ప్రతిష్టల్ని వదులుకోడు. మనం అర్ధం జేసుకుంటే రావణుడనే వాడు మన ఇగో కి సింబల్, రాముడు మెచ్యూర్డ్ ఇగోకి ప్రతీక. ఇగో మెచ్యూర్డ్ ఇగోగా ఎందుకు మారాలి, అసలు ఇగోనే చంపేస్తే పోదా అనవచ్చు. పదార్ధానికి వినాశం లేదని తెలుసుగా? పదార్ధం ఇంకో రూపం ధరిస్తుంది తప్ప నశించడం దాని ధర్మమే కాదు. కాబట్టి-  ఏయ్ నీ ఇగో తగ్గించుకో, ఇగో నీకు మంచిది కాదు- అనడం అవివేకమే. కోతి  మనిషిగా రూపాంతరం చెందినట్టు, ఇగో మెచ్యూర్డ్ ఇగోగా రూపాంతరం చెందాల్సిందే తప్ప నశించడానికి లేదు. 

        భుజంగయ్య ఈ సంఘర్షణలో జీవితంగురించి, కుటుంబ విలువల గురించి, మనిషి విలువ గురించీ నేర్చుకుని  తనలోని రావణుణ్ణి భూస్థాపితం, చేసి రాముడిలా ఇంటికి తిరిగి వస్తాడు. అతడి వనవాసం పూర్తయ్యింది. 

         కరీనా కపూర్- రాహుల్ బోస్ లతో 2003 లో సుధీర్ మిశ్రా తీసిన ‘చమేలీ’ లో కూడా వర్షపు రాత్రంతా ఒక బస్టాపులో వేశ్యతో చిక్కుబడిపోయిన హీరో తెల్లారే సరికి మారిన మనిషిగా ఇంటికి తిరిగొస్తాడు. గొప్ప కథలు చూస్తున్న మనకూ ఇలాటి సైకో థెరఫీలే చేస్తాయి.  


        ఈ కథంతా, ఈ పరివర్తనంతా  ఏడ్పులతో, డైలాగులతో చెప్పలేదు. ఒక్క నీతి వాక్యం మౌఖికంగా చెప్పలేదు. ఏ వాయిసోవర్ తోనూ ముగింపు మెసేజి లివ్వలేదు. ఇదే క్వాలిటీ సినిమా అంటే. ఇవన్నీసంఘటనల ద్వారానే, ఆ సంఘటనలకి పాత్రల ప్రతిస్పందనల ద్వారానే  తెలియజేస్తూ పోయారు. ఈ కథ చెప్పడానికి వాడిన ప్రధాన రసం ఏ చింతపండు పులుసో కాదు. సస్పెన్స్ థ్రిల్లర్ కుండే  అద్భుత రసం. ఒక సంఘటనకి మించి ఇంకో సంఘటనగా టెన్షన్ పెంచుతూ టైం  అండ్ టెన్షన్ గ్రాఫ్ మీద కూడా దృష్టి పెట్టారు. ఆ ప్రకారం క్యారక్టర్ ఆర్క్ కూడా పడుతూ లేస్తూ పోతూంటుంది. ఈ మధ్య ‘డోంట్ బ్రీత్’ అనే హర్రర్ సస్పెన్స్ వచ్చింది. దానికంటే ఓ పదిశాతం తక్కువ సస్పెన్స్ -టెన్షన్ – థ్రిల్ ఎలిమెంట్స్ తో ఇది వుండొచ్చు. షాపు బయటి పాత్రలతో ఒకరకమైన సస్పెన్స్, లోపలి పాత్రలతో ఇంకో సస్పెన్స్ తో- రెండంచుల కత్తిలా కథ. 

        ఇంటర్వెల్ మలుపుని  కూడా నరాలు బిగబట్టుకుని చూడాల్సి వస్తుంది. మిడిల్. ఎండ్ రెండు విభాగాలూ కలిపి గంటన్నర సేపు వూపిరిసల్పని సస్పెనుతో కదలకుండా కూర్చో బెట్టేస్తుంది. మన దగ్గర ఇంకా ఎలా ఉంటుందంటే- ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో  సస్పన్స్ అంటే – అది యాక్షన్ సినిమాల వ్యవహారం- మనం దెబ్బతింటాం అనుకుని, అవే సరుకు లేని డ్రామాలు తీస్తూ పోతారు. ప్రసుత రామాయణంలో ఎవరూ హత్య చేయలేదు, ఇంకే నేరమూ చేయలేదు- అచ్చమైన  కుటుంబ కథే ఇది. కుటుంబ కథలో తటస్థించిన ఒకానొక దురదృష్టకర ఘట్టం. దీన్ని సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్తే ఏం కొంపలు మునిగాయి.  ‘మన ఊరి రామాయణం- మనలోని రామాయణం’ అంటూ పాట ద్వారా వెల్లడయ్యే మానసిక లోకపు కల్లోలం. దీనికి పరిష్కారంతో సైకో థరఫీ. ఇంతకనే శాస్త్రీయ స్క్రిప్టు ఏముంటుంది?

        ఇందులో సినిమా దర్శకుడు పోగొట్టుకునే స్క్రిప్టు కూడా ప్లాట్ డివైస్ గా కథ నడుపుతుంది. చివరి దృశ్యంలో నటులు పృథ్వీ- ప్రియమణిలతో ఈ స్క్రిప్టు ఒక అందమైన ముగింపు నిస్తుంది. హార్రర్ కామెడీలూ, ఇంకేవో యాక్షన్ సినిమాలూ పక్కన పెడదాం కాస్సేపు- నిత్య జీవితంలో మన కెదురయ్యే ఘట్టాలు మన చేతల వల్ల  ఎంత సస్పెన్స్ లో పడి ప్రాణాలు తోడేస్తాయో - కల్తీలేని ఈ అచ్చ కుటుంబ కథలో చూసి జీవిత కాలం నెమరేసుకోవచ్చు. షరతు ఏమిటంటే, ఈ సినిమా కెళ్తే పాప్ కార్న్ కాకుండా స్వీట్ కార్న్ తినాలి.


-సికిందర్